పొరుగువారి యెడల ప్రేమ సాధ్యమే
సమరయుని గూర్చి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము పొరుగువారి యెడల నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపింది. (లూకా 10:25-37) యేసు యిలాకూడ బోధించాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”—మత్తయి 22:37-39.
అనేకమందివలెనే మీ జాతికి చెందని మీ పొరుగువారిని ప్రేమించుట మీకు కష్టంగా ఉందా? పక్షపాతాన్ని, అన్యాయాన్ని మీరు చూసినందున లేదా వ్యక్తిగతంగా వాటిని అనుభవించినందున బహుశ మీకలా అన్పించవచ్చు. మీరుగాని, మీ ప్రియులుగాని మరో వర్గంవారి కౄరమైన దుశ్చర్యలకు గురైయుండవచ్చు.
పొరుగువారిని ప్రేమించవలెననుట దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటని యేసు సూచించినందున, అట్టి భావాలను అధిగమించుట సాధ్యం కావాలి. అలాచేయడానికి దేవుడు, క్రీస్తు ప్రజలనెలా దృష్టిస్తున్నారో అలా దృష్టించడం కీలకం. ఈ విషయంలో యేసు మరియు తొలి క్రైస్తవుల మాదిరిని మనం పరిశీలిద్దాం.
యేసు చూపిన శ్రేష్ఠమైన మాదిరి
యూదయ, గలిలయ మధ్య ప్రాంతమందు నివసించే సమరయులంటే తొలి శతాబ్దపు యూదులకు గిట్టేదికాదు. ఒక సందర్భంలో ఆ యూదా వ్యతిరేకులు ఉక్రోషంగా యేసునిలా అడిగారు: “నీవు సమరయుడవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా?” (యోహాను 8:48) సమరయుల యెడల విరోధ భావము ఎంత గట్టిగా ఉండెనంటే కొందరు యూదులు సమరయులను బహిరంగముగా సమాజమందిరాల్లో శపించేవారు, సమరయులకు నిత్యజీవము ప్రసాదించబడకూడదని ప్రతిదినం ప్రార్థించేవారు.
ఇంతబలంగా పాతుకుపోయిన ద్వేషాన్నిగూర్చి ఎరిగి యేసు, బందిపోటు దొంగల బారినపడిన యూదునియెడల శ్రద్ధచూపుట ద్వారా తాను నిజమైన పొరుగువాడని నిరూపించుకొనిన సమరయుని గూర్చిన ఉపమానం చెప్పాడు. మోషే ధర్మశాస్త్రం ఎరిగిన యూదుడొకడు, “నా పొరుగువాడెవడని” అడిగినప్పుడు యేసు ఎలా సమాధానమిచ్చి యుంటాడు? (లూకా 10:29) ‘నీ పొరుగువారిలో నీ తోటి యూదులు మాత్రమే కాదు ఇతరులును, సమరయులును చేరియున్నారని’ యేసు సూటిగా జవాబు చెప్పి యుండగల్గేవాడు. అయితే దానిని అంగీకరించుట యూదులకు కష్టమైయుండేది. కాబట్టి ఆయన యూదుని యెడల జాలిచూపిన సమరయుని గూర్చిన ఉపమానం చెప్పాడు. ఆ విధంగా యేసు, తన బోధవింటున్న యూదులు పొరుగువారి యెడల నిజమైన ప్రేమ యూదులుకాని వారికికూడ విస్తరిస్తుందనే నిర్ణయానికి రావడానికి సహాయపడ్డాడు.
యేసుకు సమరయులంటే ఎలాంటి విరోధ భావాలు లేకుండెను. ఒక సందర్భంలో ఆయన సమరయగుండా ప్రయాణిస్తూ విశ్రాంతి తీసుకోవడానికి ఒక బావి దగ్గర ఆగాడు, ఆ సమయంలో ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి దగ్గరలోని ఒక పట్టణానికి వెళ్లారు. నీళ్లు తోడుకోవడానికి ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, “నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.” యూదులు సమరయులతో సాంగత్యము చేయరు గనుక ఆ స్త్రీ, “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను.” అప్పుడు యేసు తానే మెస్సీయనని బహిరంగముగా ప్రకటిస్తూ ఆమెకు సాక్ష్యమిచ్చాడు. ఆమె వెంటనే ప్రతిస్పందించి పట్టణములోనికి పరుగెత్తి ఆయన బోధవినుటకు రమ్మని ఇతరులను పిలుచుకొనివచ్చింది. దాని ఫలితమేమి? “ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.” తన కాలమందలి యూదుల స్వభావం తనకంటకుండా యేసు జాగ్రత్తపడినందున ఎంతచక్కని ఫలితం లభించింది!—యోహాను 4:4-42.
దేవుడు పక్షపాతికాడు
యేసు ముఖ్యంగా యూదులకు అనగా “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల”కే ప్రకటించవలెనని దేవుని సంకల్పమై యుండెను. (మత్తయి 15:24) కాబట్టి, ఆయన తొలి అనుచరులు యూదామతానికి చెందినవారై యుండిరి. అయితే సా.శ. 33 పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన కేవలం మూడు సంవత్సరాల తర్వాత విశ్వాసులైన యూదులు శిష్యులుగాచేసే పనిని జనాంగములకు అనగా అన్యజనులకు విస్తరింపజేయడాన్ని తాను ఇచ్ఛయించినట్లు యెహోవా స్పష్టం చేశాడు.
యూదుల మనస్సుకు తననువలె ఒక సమరయుని ప్రేమించడం చాలాకష్టంగా ఉంటుంది. ఆలాగే తమతో సమరయులకంటే మరితక్కువ సాంగత్యంచేసే సున్నతిపొందని అన్యజనుల యెడల పొరుగువారి యెడల ప్రేమ చూపడం యూదులకు అంతకంటే కష్టంగా ఉంటుంది. అన్యులయెడల యూదులు కలిగివుండే దృక్పథంపై వ్యాఖ్యానిస్తూ ది ఇంటర్నేషనల్ స్టాండార్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా యిలా అంటున్నది: “క్రొ[త్త] ని[బంధన] కాలాల్లో విపరీతమైన అయిష్టతను, తిరస్కారాన్ని, ద్వేషాన్ని మనం కనుగొంటాము. అన్యులతో ఎలాంటి స్నేహ సంబంధమైననూ అపవిత్రమని, ధర్మశాస్త్ర విరోధమని పరిగణించేవారు. వారు దేవునికి, ఆయన ప్రజలకు శత్రువులు, వారు యూదామత ప్రవిష్టులైతే తప్ప వారికి దేవుని జ్ఞానం ఉండకూడదు. వారలా మారిననూ, ప్రాచీన కాలాల్లోవలె వారిని పూర్తి ఆరాధనకు అనుమతించే వారు కాదు. యూదులు వారికి సలహా ఇవ్వడం నిషిద్ధం, వారు ఒకవేళ దైవిక సంగతులను గూర్చి అడిగితే వారు శపింపబడేవారు.”
అనేకులు ఈ దృక్పథాలు కలిగివున్ననూ, యెహోవా అపొస్తలుడైన పేతురుకు ఒక దర్శనం కలుగజేసి దానిలో ‘దేవుడు పవిత్రము చేసినవాటిని అపవిత్రమని పిలువవద్దని’ ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని అన్యుడైన కొర్నేలీ ఇంటికి నడిపించాడు. అక్కడ పేతురు కొర్నేలీకి, ఆయన కుటుంబానికి, ఇతర అన్యులకు క్రీస్తును గూర్చిన సాక్ష్యమిచ్చాడు. “దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని పేతురు చెప్పాడు. పేతురింకను ప్రకటిస్తుండగా, బాప్తిస్మం పొంది అన్యులలోనుండి మొదటిగా క్రీస్తు అనుచరులైన ఆ క్రొత్త విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్మ వచ్చింది.—అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం.
“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు యిచ్చిన ఆజ్ఞ సమస్త దేశములందలి యూదులకు మాత్రమే పరిమితం కాదుగాని అందులో అన్యులును చేరియున్నారని గ్రహిస్తూ, ఈ పరిణామాన్ని యూదా మతంనుండి వచ్చిన అనుచరులు అంగీకరించారు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 11:18) వారిలో ఒకవేళ ఏదైనా అన్యజన విరోధ స్వభావముంటే దాన్ని జయించినవారై, వారు సమస్త జనులను శిష్యులనుగా చేయుటకు ప్రకటించు పనిని ఆసక్తిగా వ్యవస్థీకరించారు. ముప్పై సంవత్సరాలైనా కాకమునుపే సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” ప్రకటింపబడెనని చెప్పబడింది.—కొలొస్సయులు 1:23.
ఈ ప్రకటించు పనిని ముందుకు తీసుకెళ్లిన అపొస్తలుడైన పౌలు, స్వయంగా యూదామతాన్నుండి వచ్చిన క్రైస్తవుడై యుండెను. క్రీస్తు అనుచరుడు కాకమునుపు, ఆయన పరిసయ్యుల మతశాఖలో అత్యంత ఆసక్తితో పనిచేసిన సభ్యుడైయుండెను. వారు అన్యులను మాత్రమే కాక తమ స్వజాతి ప్రజల్లోని సామాన్యులను సహితం తక్కువచూపు చూసేవారు. (లూకా 18:11, 12) అయితే ఆ దృక్పథాలు ఇతరుల యెడల పొరుగువారి యెడల ప్రేమను చూపుటకు తనను అడ్డగించేందుకు పౌలు అనుమతించలేదు. బదులుగా, ఆయన మధ్యదరా ప్రాంతాలన్నింటిలో శిష్యులనుచేయు పనికే తన జీవితాన్ని అంకితంచేసి ‘అన్యజనులకు అపొస్తలునిగా’ తయారయ్యాడు.”—రోమీయులు 11:13.
తన పరిచర్య కాలంలో, పౌలు రాళ్లతో కొట్టబడి, గాయపర్చబడి చెరసాలలో వేయబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 14:19; 16:22, 23) అటువంటి బాధాతప్త అనుభవాలు ఆయన్ని దుఃఖపరచి, ఫలాని జనముల మధ్య, అన్యుల మధ్య తన సమయాన్ని వృధాచేసుకుంటున్నాడనే తీర్మానానికొచ్చునట్లు చేశాయా? ఎంతమాత్రము లేదు. తన కాలమందలి అనేక అన్యజన సమూహాల్లో అక్కడక్కడ యథార్థపరులు ఉన్నారని ఆయనకు తెలుసు.
దేవుని మార్గాల్ని నేర్చుకోవడానికి ఇష్టపడే అన్యులున్నట్లు పౌలు కనుగొన్నప్పుడు ఆయన వారిని ప్రేమించాడు. ఉదాహరణకు, ఆయన థెస్సలొనీకయులకు యిలా వ్రాశాడు: “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:7, 8) అన్యులైన థెస్సలొనీకయులను పౌలు నిజంగా ప్రేమించాడని, వారితో తనకున్న మంచి సంబంధ ఆనందాన్ని పాడుచేయుటకు దేనిని అనుమతించలేదని హృదయపూర్వకంగా ఆయన పలికిన ఆ మాటలు చూపుతున్నవి.
క్రియాపూర్వకంగా పొరుగువారి యెడల ప్రేమ
మొదటి శతాబ్దములో వలెనే నేడు, క్రైస్తవ సంఘముతో సహవాసము చేయువారు సమస్త మతాలకు చెందిన ప్రజలయెడల పొరుగువారి యెడల ప్రేమను పెంపొందించుకుంటారు. ఇతరుల విషయమై దైవిక దృష్టిని అభివృద్ధి చేసుకొనుట ద్వారా, వారితో రాజ్య సువార్తను పంచుకోవడం ద్వారా నిజ క్రైస్తవులు తమతో క్రితమెన్నడూ సహవసించని ప్రజల యెడల తమకున్న అవగాహనను విశాలపర్చుకున్నారు. వారియెడల వారు సహోదర ప్రేమను సహితం కలిగివున్నారు. (యోహాను 13:34, 35) ఈ అనుభవాన్ని మీరును పొందవచ్చును.
‘ప్రతిజనము, ప్రతివంశము, ప్రతిప్రజ, ప్రతిభాషల’ ప్రజలకు ప్రాతినిధ్యంగా యెహోవాసాక్షులు 229 దేశాల్లో కనబడిననూ వారిలో అట్టి ప్రేమవున్నది. (ప్రకటన 7:9) మత ఘర్షణల్లో, పోరాటాల్లో పాల్గొనుటను తిరస్కరించుటలో, తోటిమానవులతో స్నేహ సంబంధాలను పాడుచేయు దురభిమానాలను తృణీకరించుటలో వారు అంతర్జాతీయ సహోదరత్వమందు యెహోవా ఆరాధనలో ఐక్యముగా ఉన్నారు.
సాక్షులతో సహవసించండి, అప్పుడు మీరు వివిధ మతాలనుండి వచ్చిన ప్రజలు ఎలా దేవుని చిత్తం చేస్తున్నారో చూడగలరు. దేవుని రాజ్య సువార్తను వారు ప్రకటించుటను బట్టి పొరుగువారి యెడల ప్రేమ క్రియారూపకంగా ఉండటాన్ని మీరు చూస్తారు. ఔను, తమ పొరుగువారిని ప్రేమించడాన్ని నిజంగా నేర్చుకున్నారని తమ జీవితాలద్వారా చూపించే దయగల, యథార్థపరులైన ప్రజలను వారి సంఘాల్లో మీరు కలుసుకుంటారు.
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
Arrival of the Good Samaritan at the Inn/The Doré Bible Illustrations/Dover Publications, Inc.
[6వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షుల సంఘాల్లో, సమస్త జాతులనుండి వచ్చిన సంతోషకరమైన ప్రజలను మీరు కనుగొంటారు