పొరుగువారిని మీరెందుకు ప్రేమించాలి?
దేవుని యెడల, పొరుగువారి యెడల మనకున్న ప్రేమపై నిత్యజీవం ఆధారపడి ఉంటుంది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణలో ఆ అంశం ప్రస్తావించబడింది.
మోషే ధర్మశాస్త్రం తెలిసిన యూదుడొకడు యేసుక్రీస్తును, “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని” అడిగాడు. అందుకు యేసు, “ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావని” అడుగగా, అతడు ధర్మశాస్త్రాన్ని ఉల్లేఖిస్తూ, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని” జవాబుచెప్పాడు. అందుకు యేసు, “నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.”—లూకా 10:25-28.
ఆ పిమ్మట, అతడు “నా పొరుగువాడెవడని” యేసును అడిగాడు. దానికి సూటిగా సమాధానమిచ్చే బదులు, యేసు ఉపమానరీతిగా దోచుకొనబడి, కొట్టబడి, కొన ఊపిరితో విడిచిపెట్టబడిన ఒక యూదుని గూర్చిన కథ చెప్పాడు. ఆ దారినే యిద్దరు యూదులు—మొదటివాడు యాజకుడు, రెండవవాడు లేవీయుడు వెళ్లారు. వారిరువురు తమతోటివాడైన యూదుని పరిస్థితి చూశారుగాని అతనికేమాత్రం సహాయం చేయలేదు. ఆ తర్వాత సమరయుడొకడు ఆ దారినేవచ్చాడు. అతడు గాయపడిన యూదునిపై జాలిపడి, అతని గాయములకు కట్లుకట్టి, ఒక పూటకూళ్లవాని యింటికి చేర్చి అతని ఖర్చుల నిమిత్తము కొంత సొమ్మునిచ్చాడు.
“దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని” యేసు తనతో మాట్లాడుతున్న వ్యక్తిని అడిగాడు. స్పష్టముగా, జాలిచూపిన సమరయుడే. ఆ విధంగా యేసు పొరుగువారిని ప్రేమించుట మత అడ్డంకులకు అతీతమని చూపించాడు.—లూకా 10:29-37.
పొరుగువారి యెడల ప్రేమలేకపోవడం
నేడు వివిధ మత గుంపులమధ్య విరోధభావం అంతకంతకు పెరుగుచున్నది. ఉదాహరణకు, ఇటీవల జర్మనీలో నియో-నాజీవాదులు ఒకవ్యక్తిని క్రిందపడేసి త్రొక్కి, బూట్లతో తన్నుచూ దాదాపు అతని ఎముకలన్నీ విరగ్గొట్టి, ఆ పిమ్మట అతనిపై మద్యాన్ని కుమ్మరించి నిప్పంటించారు. ఆ వ్యక్తి యూదుడని తలంచే అతనిపై దాడిచేసి హత్యగావించారు. వేరొక సంఘటనలో హామ్బర్గ్నందలి టర్కీ జాతీయుల ఇంటిని తగులబెట్టి ముగ్గురిని సజీవ దహనం చేశారు, వారిలో పది సంవత్సరాల బాలిక కూడ ఉంది.
అదేవిధంగా, సూదూర తూర్పుప్రాంతమగు బాల్కాన్స్లో మత యుద్ధాల కారణంగా వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్లలో వివిధ జాతుల ప్రజలమధ్య చేలరేగిన ఘర్షణల్లో అనేకులు చనిపోయారు. ఆఫ్రికాలో, ఆయా తెగలమధ్య, వర్ణాలమధ్య జరిగిన గొడవల్లో మరెంతో మంది మరణించారు.
అట్టి హింసచే అనేకమంది ప్రజలు భయకంపితులయ్యారు, వారెన్నడూ తమ పొరుగువారికి హాని కల్గించే ఏ పనీ చేయరు. వాస్తవానికి, జర్మనీలో నిర్వహింపబడిన పెద్దపెద్ద ప్రదర్శనలు అక్కడి జాతి హింసను ఖండించాయి. అయినను, ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇట్లంటున్నది: “ప్రపంచమందలి దాదాపు అన్ని సంస్కృతుల సభ్యులు తమ జీవన విధానానికి దగ్గర సంబంధమున్న పొరుగువారికంటే కూడ తమది ఉన్నతమైనదని పరిగణిస్తారు.” అట్టి దృక్పథాలు పొరుగువారియెడల ప్రేమను నిరోధిస్తాయి. దేవునియెడల, పొరుగువాని యెడలగల ప్రేమపై జీవం ఆధారపడివుందని యేసు చెప్పాడు గనుక ప్రత్యేకంగా దీని విషయంలో ఏమైనా చేయవచ్చునా?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: Jules Pelcog/Die Heilige Schrift
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
The Good Samaritan/The Doré Bible Illustrations/Dover Publications, Inc.