ప్రభువు మాటలకు పేపియెస్ విలువనిచ్చాడు
“ఏదోకటి చెప్పేవారి మాటలు కాదుగాని, సత్యం బోధించేవారి మాటలే నాకు ఆనందాన్నిచ్చాయి” అని మన సామాన్య శకము రెండవ శతాబ్దమందు క్రైస్తవుడనని చెప్పుకొనిన పేపియెస్ వ్రాశాడు.
యేసుక్రీస్తు అపొస్తలుల మరణము తర్వాతి కాలమందు పేపియెస్ జీవించాడు. వాస్తవానికి, ఆయన అపొస్తలుడైన యోహాను దగ్గర నేర్చుకున్నాడని చెప్పబడిన పోలికార్ప్‌తో సహవసించాడు. చెప్పుకోదగిన ఈ విషయాలు, ఆలాగే పేపియెస్ జ్ఞానార్జన విధానం ఆయన నిజంగా జ్ఞానవంతుడనే విషయాన్ని బలపరుస్తున్నది.
జాగ్రత్తగా అవలంభించిన పద్ధతి
ప్రభువు మాటలను గూర్చి ఆయన వ్రాసిన ఐదు పుస్తకాలు పేపియెస్‌కు సత్యం యెడల తృష్ణ ఉండెనని తేటగా రుజువుచేస్తున్నాయి. నిస్సందేహంగా తొలి సంవత్సరాల్లో పేపియెస్ సత్యాన్ని గూర్చి తాను విన్న అనేక సంగతుల్ని తన జ్ఞాపకమందే ఉంచుకున్నాడు. ఆ తర్వాత, ఆసియానందలి హియరపొలిస్‌కు చెందిన ఫ్రిజియన్ పట్టణమందలి తన నివాసం నుండి విషయాల్ని నిశ్చయపర్చుకొనుటకు వృద్ధులైన వారిలో ఎవరైనా యేసు అపొస్తలులను చూశారా లేదా వారు చెప్పింది విన్నారాయని పేపియెస్ వాకబుచేశాడు. ఆసక్తితో వారిని ప్రశ్నించి, వారు చెప్పింది జాగ్రత్తగా వ్రాసుకున్నాడు.
పేపియెస్ యిలా వివరిస్తున్నాడు: “మీకు వారు చెప్పిన సత్యాన్ని నిశ్చయంగా అందించుటకు, ఆ వృద్ధులనుండి, నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని శ్రద్ధగా నేర్చుకున్న ఏ విషయాల్నైనా . . . వ్రాయడానికి నేను వెనుదీయను. అనేకులవలె కాకుండ నాకు ఏదోకటి చెప్పేవారి మాటలు కాదుగాని, సత్యం బోధించేవారి మాటలే ఆనందాన్నిచ్చాయి; ఆలాగే ఇతరుల ఆజ్ఞలు వివరించే వారి మాటలు కాదుగాని విశ్వాసం విషయంలో ప్రభువిచ్చిన ఆజ్ఞల్ని, సత్యాన్నుండే పుట్టుకొచ్చిన ఆజ్ఞల్ని వివరించిన వారి మాటలే నాకు ఆనందాన్నిచ్చాయి. ఆ పెద్దలను అనుసరించిన వారెవరైనా నాకు తారసపడితే, ఆ పెద్దలు అనగా ఆంద్రెయ, పేతురు, ఫిలిప్పు, తోమా, యాకోబు, యోహాను, మత్తయి చెప్పిన లేదా ప్రభువుయొక్క మరో శిష్యుడు ఎవరైనా చెప్పిన వృత్తాంతాలు చెప్పమని అడిగేవాణ్ని.”
ఆయన చేసిన కార్యము
నిస్సందేహంగా పేపియెస్‌కు విస్తారమైన ఆత్మీయ జ్ఞానము అందుబాటులో ఉండెను. ప్రతి అపొస్తలుని వ్యక్తిగత జీవితం వారి పరిచర్యకు సంబంధించిన వివరాల్ని ఆయనెంత శ్రద్ధగా వినియుండెనో మనం కేవలం ఊహించగలము. దాదాపు సా.శ. 135 నాటికి పేపియెస్ తాను చెప్పదల్చుకున్న విషయాల్ని తానే స్వయంగా ఒక పుస్తకంలో వ్రాశాడు. విచారకరమైన విషయమేమంటే ఆ పుస్తకం కనబడకుండా పోయింది. సా.శ. రెండవ శతాబ్దమందు క్రైస్తవుడనని చెప్పుకొనిన ఐరేనియస్, నాల్గవ శతాబ్దపు చరిత్రకారుడైన ఇసూబియస్ ఆ పుస్తకాన్నుండి ఉల్లేఖించి వ్రాశారు. వాస్తవానికి, అది సా.శ. 9వ శతాబ్దం వరకు చదువబడింది ఆలాగే 14వ శతాబ్దంవరకు ఉనికిలో ఉండియుండవచ్చు.
రాబోయే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనయందు పేపియెస్ విశ్వాసముంచాడు. (ప్రకటన 20:2-7) ఐరేనియస్ చెప్పిన ప్రకారము, ఆయన “ఆ కాలాల్నిగూర్చి ప్రభువు ఎలా బోధించాడో తాము వినిన విషయాల్ని ప్రభువు శిష్యుడైన యోహానును చూచిన పెద్దలు వివరించినట్లే సమస్త సృష్టి నూతనపర్చబడి, స్వేచ్ఛ ఇవ్వబడి, ఆకాశపు మంచు, సారవంతమైన భూమినిబట్టి సమస్త విధములైన ఆహారం సమృద్ధిగావుండే” కాలాన్ని గూర్చి వ్రాశాడు. పేపియెస్ యింకను యిలా వ్రాశాడు: “విశ్వాసులకు ఈ సంగతులు మిగుల విలువైనవి. విశ్వాస ఘాతకుడైన యూదా అవిశ్వాసంతో యిలా అడిగాడు, ‘అట్టి సంగతిని ప్రభువు ఎలా నెరవేరుస్తాడు?’ దానికి ‘ఆ కాలమందు జీవించువారు చూస్తారని’ ప్రభువు సమాధానమిచ్చాడు.”
ఆత్మజ్ఞానవాదం (నాస్టిసిజమ్) ప్రబలంగావున్న కాలంలో పేపియెస్ ఆ విషయాల్ని వ్రాశాడు. ఆత్మజ్ఞానవాదులు తత్వాన్ని, సందేహాన్ని, అన్యమత మర్మాల్ని మతభ్రష్ట క్రైస్తవత్వంతో కలగాపులగం చేశారు. వాస్తవానికి, పేపియెస్ ప్రభువు వాక్కుల్ని లేదా మాటల్ని వెల్లడించడం ఆత్మజ్ఞానవాద విస్తరణపై దాడిచేయుట వంటిదిగా ఉండెను. ఆయన తర్వాత, ఐరేనియస్ ఆత్మజ్ఞానవాదుల అబద్ధమైన, డంబంగాచెప్పే ఆత్మీయతను ఎడతెగక ఎదిరించాడు. “ఏదోకటి చెప్పేవారి మాటలు కాదుగాని” అని పేపియెస్ పరిహాసంగా వ్రాయడానికి బహుశ ఆత్మజ్ఞానవాద సాహిత్య విస్తార పరిమాణమే కారణం కావచ్చును. అబద్ధాన్ని సత్యంతో ఎదుర్కోవాలనే ఆయన ఉద్దేశం స్పష్టంగా ఉండెను.—1 తిమోతి 6:4; ఫిలిప్పీయులు 4:5.
సువార్తలపై వ్యాఖ్యానించుట
ఇంకను ఉనికిలోనున్న పేపియెస్ వ్రాతల కొన్నిభాగాల్లో, మత్తయి, మార్కు వ్రాసిన వృత్తాంతాల ప్రస్తావనను మనం కనుగొంటాము. ఉదాహరణకు, మార్కు వృత్తాంతాన్ని గూర్చి పేపియెస్ యిలా అంటున్నాడు: “పేతురు యొక్క అనువాదకునిగా మార్కు తనకు జ్ఞాపకమున్నదంతా కచ్చితంగా వ్రాశాడు.” ఈ సువార్త ప్రామాణికతను ధృవీకరిస్తూ, పేపియెస్ యింకను యిలా అన్నాడు: “కాబట్టి మార్కు అలా తనకు జ్ఞాపకమున్న వాటిని వాస్తున్నప్పుడు ఏ తప్పుచేయలేదు; ఎందుకంటె తాను విన్న వాటిలో ఏదియు తొలగించకుండుటకు లేదా అందులో ఏ అబద్ధాలు చేర్చకుండుటకు ఆయనెంతో శ్రద్ధ తీసుకున్నాడు.”
మత్తయి తన సువార్తను హెబ్రీ భాషలో వ్రాశాడని పేపియెస్ బాహ్య ఆధారాన్ని అందిస్తున్నాడు. పేపియెస్ యిలా అంటున్నాడు: “ఆయన ఆ మాటల్ని హెబ్రీ భాషలో వ్రాశాడు, వాటిని ప్రతిఒక్కరు తమకు సాధ్యమైనంత స్పష్టంగా అనువదించారు.” లూకా, యోహాను సువార్తల వృత్తాంతములను గూర్చి, ఆలాగే క్రైస్తవ గ్రీకు లేఖనాల ఇతర వ్రాతలను గూర్చి పేపియెస్ బహుశ వ్రాసియుండవచ్చు. అట్లయిన, దైవ ప్రేరేపణను, వాస్తవికతను స్థిరపర్చుటకు పాటుపడిన తొలిసాక్షుల్లో ఆయన ఒకడై ఉండవచ్చు. అయితే దురదృష్టమేమంటే, పేపియెస్ రచనల్లో కొద్దిభాగాలు మాత్రమే లభ్యమందున్నాయి.
తన ఆత్మీయ అవసరతను గుర్తించాడు
హియరపొలిస్ సంఘ అధ్యక్షునిగా, పేపియెస్ నిరంతర పరిశోధకునిగా ఉండెను. కష్టించి పనిచేసే పరిశోధకునిగా ఉండుటకు తోడుగా, ఆయన లేఖనములయెడల మిక్కిలి ప్రశంసను ప్రదర్శించాడు. తన కాలమందలి చపలచిత్త కథనాలకంటె యేసుక్రీస్తు చెప్పిన లేదా అపొస్తలులు చెప్పిన సిద్ధాంతాలు వివరించుటకు అత్యంత విలువైనవిగా ఆయన సరిగా తీర్మానించాడు.—యూదా 17.
పేపియెస్ సా.శ. 161 లేదా 165లో హతసాక్షయ్యాడని చెప్పబడింది. యేసుక్రీస్తు బోధలు నిజానికి పేపియెస్ జీవితంపై, ప్రవర్తనపై ఎంత బలంగా ప్రభావం చూపాయో నిశ్చయంగా చెప్పడం కష్టం. అయినను, ఆయన లేఖనాల్ని నేర్చుకుని వాటిని చర్చించాలనే గాఢమైన కోరికను కలిగియుండెను. నేడును నిజ క్రైస్తవులును అదేవిధంగా ఉన్నారు, ఎందుకంటె వారు తమ ఆత్మీయ అవసరతను గుర్తిస్తున్నారు. (మత్తయి 5:3) పేపియెస్ వలెనే వారు ప్రభువు మాటలను విలువైనవిగా పరిగణిస్తున్నారు.