నిజమైన భద్రత సాధ్యమేనా?
వ్యాస రచయిత రాల్ఫ్ వాల్డో ఎమెర్‌సన్ ఒకసారి ఇలా అన్నాడు: “లోతుగా ఆలోచించలేని మనుష్యులు అదృష్టాన్ని నమ్ముతారు . . . నైతికంగా మానసికంగా బలమైనవారు కారణాన్ని, ఫలితాన్ని నమ్ముతారు.” ఔను, మాంత్రిక సంబంధ వస్తువుల శక్తిమీద, తాయెత్తులమీద నమ్మకముంచువాడు తన జీవితాన్ని అదృశ్య శక్తుల ఆధిపత్యానికి అప్పగిస్తున్నాడు. అతను, అసమంజసమైన, మూఢనమ్మకంతోకూడిన భయాలతో తర్కాన్ని, కారణాన్ని గాలికి విడిచిపెడుతున్నాడు.
ఏమైనప్పటికీ, బైబిలు ఒకనిని అలాంటి భయాలనుండి స్వతంత్రుని చేయగలదు. మంత్రసంబంధమైన అట్టి వస్తువులు, తాయెత్తులు నిస్సత్తువైనవని, శక్తిలేనివని అది చూపుతుంది. ఎలా? ది న్యూ ఎన్ సైక్లోపీడియా బ్రిటానిక ప్రకారం, “మంత్రసంబంధంగా ధరించే ఈ వస్తువులు పకృతి శక్తులనుండి తమ శక్తిని పొందునట్లు తలంచబడింది.” బహుశా ఈ శక్తులు ‘చనిపోయినవారి ఆత్మలు’ లేదా ‘అదృష్ట శక్తి’ కావచ్చును. అయితే బైబిలు మాత్రము చనిపోయినవారు “ఏమియు ఎరుగరని” స్పష్టంగా చూపుతుంది. (ప్రసంగి 9:5) అందుచేత బ్రతికివున్నవారికి సహాయపడేందుకు లేక కీడుచేసేందుకు అలా చనిపోయినవారి ఆత్మలు లేవు; లేక నీ నిమిత్తం సహాయపడగల అదృష్టం లాంటి అదృశ్య శక్తేమీ లేదు.
బైబిలు కాలాల్లో, ఆయనను విసర్జించి, తన పరిశుద్ధ పర్వతమును మరచి “అదృష్టమునకు బల్లను సిద్ధపరచువారిని, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారిని” దేవుడు ఖండించాడు. అలా అదృష్టమును చాటినవారు భద్రతను పొందేందుకు బదులుగా నాశనానికి గురైరి. “నేను ఖడ్గమును మీకు ... నియమించుదును” అని యెహోవా చెప్పెను.—యెషయా 65:11, 12.
అలాగే మాంత్రిక కళలను అభ్యసించడంద్వారా పురాతన బబులోను రక్షణకై మర్మమైన శక్తులందు విశ్వాసముంచినది. కానీ విపత్తు ననుభవించింది. “నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము” అని ప్రవక్తయైన యెషయా సవాలు చేసెను. ‘ఒకవేళ వాటినుండి నీవు సహాయము పొందుదువేమో . . . లేదు, నీ తంత్రములెన్నివున్నను నీవు శక్తీలేనిదానివే.’ (యెషయా 47:12, 13 ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) తగిన కాలంలో ఆ జనాంగము బొత్తిగా ఉనికిలో లేకుండా నశించిపోయింది. మంత్రములపైనున్న నమ్మకము వ్యర్థమని తేలిపోయింది. అలాగే, ఏవిధమైన మాంత్రిక సంబంధమైన వస్తువేగాని, తాయెత్తేగాని నీకు సహాయముచేయలేదు, నిన్ను కాపాడలేదు.
ఒక విధమైన విగ్రహారాధన
అయినా కొందరు స్ఫటికమును, కుందేలు పాదాన్ని, లేక ఒక మత సంబంధమైన పతకమును వెంటవుంచుకోవడంలో దోషమేంటని అనుకోవచ్చును. ఇవి కేవలం ఏ హాని లేని కొద్దిపాటి వెలగల చిన్న ఆభరణముల వంటివే కావా? బైబిలు ప్రకారము కాదు. మంత్రసంబంధమైన ఏ వస్తువైన హానికరమే అని అది చెబుతుంది.
తాయెత్తులు ఉపయోగించడం ఒక విధమైన విగ్రహారాధన. బైబిలులో ఇది స్పష్టంగా ఖండించబడింది. (నిర్గమకాండము 20:4, 5) నిజమే, ఒక వ్యక్తి ప్రత్యక్షంగా ఒక రక్షరేకును లేక తాయెత్తును ఆరాధిస్తున్నానని భావించకపోవచ్చును. అయితే ఒకవేళ ఒక వ్యక్తి కేవలం దానిని దగ్గరపెట్టుకొనియుంటేనే దానియెడల గౌరవాన్ని, అదృశ్యమైన మాంత్రిక శక్తులయెడల ఆరాధనా స్వభావాన్ని కలిగియున్నట్లు అది చూపదా? తరచు ఆరాధనపూర్వకమైన అవధానము (కళ్లకు అద్దుకొని, ముద్దుపెట్టుకొనుట వంటిది) తాయెత్తులయెడల చూపబడుతుందనుట సత్యము కాదా? అయినా, 1 యోహాను 5:21లో బైబిలు క్రైస్తవులకు ఇలా ఉపదేశిస్తుంది: “విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి.” ఇది రక్షరేకులకు లేదా తాయెత్తులు మొదలగు వస్తువులకు అన్వర్తించదా?
మానవాతీత అదృశ్య శక్తుల ఉరి
మాంత్రిక సంబంధమైన వస్తువులనుపయోగించి అనేకులు మానవాతీత అదృశ్య శక్తుల ఉరిలో పడ్డారు. నిజమే, కొందరు ఒక స్ఫటికాన్ని లేదా మాంత్రిక సంబంధమైన వస్తువును నమ్మకంగా కాక కేవలం ఆచార పద్ధతిగానే వెంటవుంచుకొనవచ్చును. ఒక వేశ్యయెడల చూపే తాత్కాలి ఆసక్తి బహుశా ఎయిడ్స్ వ్యాధి సోకడానికి ఎలా నడిపించగలదో అలాగే, మానవాతీత అదృశ్య శక్తులయెడల తాత్కాలిక ఆసక్తి చూపడం నాశనకర ఫలితాలకు నడుపగలదు. సరైన కారణాన్నిబట్టే ఇశ్రాయేలీయులు మంత్రము, శకునము చూచుట, సోదెచెప్పుట మొదలగువాటిని అభ్యసించడాన్ని యెహోవా నిషేధించాడు. “వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు” అని బైబిలు హెచ్చరిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 18:10-14.
ఇంతటి కచ్చితమైన నిషేధము ఎందుకు? ఎందుకనగా అలాంటి అభ్యాసముల వెనుకనున్న అదృశ్య శక్తులు చనిపోయినవారి ఆత్మలు లేక అదృష్ట శక్తికాదుగాని అపవాదియైన సాతాను, అతని దయ్యములు.a ఈ రక్షరేకుల ఉపయోగము నేరుగా దయ్యముల ఆరాధనతో సంబంధము కలిగివున్నది. వైన్స్ ఎక్స్‌పొజెటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ ఇలా చెబుతుంది: “మంత్ర విద్యలో తేలికపాటివైనా, లేక బలమైనవైనా మందులు వాడటం, వివిధరకాల రక్షరేకులు లేక తాయెత్తుల మూలంగా మంత్రోచ్ఛారణచేస్తూ, అదృశ్య శక్తులకు విన్నవించుకోవడం సాధారణంగా జరుగుతుంది.”
కాబట్టి, అలాంటి మంత్ర సంబంధమైన తాయెత్తును కలిగివున్న వ్యక్తి అభిచారము సంబంధములో మునిగివున్నాడు. “ఈ యుగసంబంధమైన దేవతయగు” అపవాదియైన సాతాను దుష్ట ప్రభావము, ఆధిపత్యము క్రిందకు తన్నుతాను లోపరచుకొనే ప్రమాదమును అతడు కొనితెచ్చుకొంటున్నాడు. (2 కొరింథీయులు 4:4) అందుకే మంచి కారణముతోనే బైబిలు సమస్తవిధములైన అభిచారాన్ని విసర్జించమని మనలను ఆజ్ఞాపిస్తుంది.—గలతీయులు 5:19-21.
మూఢనమ్మకపు బంధాలనుండి స్వతంత్రులగుట
ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటుంది: “ప్రజలు ఒకరి కొకరు భయపడుతున్నంతవరకు, భవిష్యత్తునుగూర్చి అనిశ్చయతతో ఉంటున్నంతవరకు మూఢ నమ్మకాలు జీవితంలో భాగమై ఉంటూనే ఉంటాయి.” అయితే యెహోవాసాక్షులు హానికరమైన ఈ మూఢనమ్మకాల నుండి స్వతంత్రులయ్యేందుకు అనేకులకు సహాయపడుతున్నారు. ఒక దక్షిణాఫ్రికా స్త్రీ ఇలా జ్ఞాపకం చేసుకొంటోంది: “దుష్టాత్మలవలన నేను చాలా బాధననుభవించాను. వాటి నుండి రక్షించుకునేందుకు నేను ఇంటి నిండా మ్యుటి పెట్టుకొనివున్నాను.” మాంత్రిక సంబంధమైన వీటితో పొత్తు కలిగివుంటే కలిగే అపాయాలను గ్రహించుటకు యెహోవాసాక్షులు ఆమెకు సహాయపడ్డారు. ఆమె ప్రతిస్పందన ఏమిటి? “దయ్యములకు సంబంధంగా నా దగ్గరున్న సమస్తాన్ని నేను పారవేశాను,” అని ఆమె చెబుతుంది. “నా ఆరోగ్యము మెరుగయ్యింది. యెహోవాను సేవించడానికి నాజీవితమును సమర్పించుకొని బాప్తిస్మము తీసుకున్నాను.” ప్రస్తుతము ఆమె మూఢనమ్మకాల నుండి, అభిచారం నుండి స్వతంత్రురాలైంది.
చెట్టు మందులిచ్చే నైజీరియా దేశస్థున్ని విచారించండి. ఈయన నయంచేయగల తన చికిత్సలో అభిచారాన్ని కూడా చేర్చేవాడు. యెహోవాసాక్షులు ఆయన ఇంటిని దర్శించినప్పుడు వారిని ఆయన బెదరింపులతో, శపిస్తూ తన అలవాటు చొప్పున బలవంతంగా వెళ్లగొట్టేవాడు. ఒకసారి ఒక ప్రత్యేక మందును కలిపి, మంత్రాలను చదువుతూ, సాక్షి ముఖం మీద దాన్ని విసిరిచల్లి, “ఏడు రోజుల్లో నీవు చస్తావని” అరిచాడు. ఏడురోజుల తర్వాత సాక్షి మరలా తిరిగి వచ్చేసరికి, దయ్యమనుకొని ఆయన్ను చూడడానికి నాటువైద్యుడు ఇంట్లోనుండి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఆయన మంత్రము నిష్ప్రయోజనమని తేలిపోయింది. క్రమేణి ఆయన బైబిలు పఠనానికి అంగీకరించి, చివరకు తానే సాక్షి అయ్యాడు.
నీవుకూడా భయము, మూఢనమ్మకాల బంధాలనుండి విముక్తి పొందవచ్చును. అయితే నిజానికి ఇది అంత సులభము కాకపోవచ్చు. బహుశా మీరు తాయెత్తులు, రక్షరేకులు మొదలైనవి సర్వసామాన్యముగా ఉపయోగించే సంస్కృతిలో పెరిగివుండవచ్చును. పురాతన ఎఫెసులోని క్రైస్తవులు కూడా అదే సవాలునెదుర్కొన్నారు. ఎంతో గొప్పగా అభిచార ప్రభావము నిండిపోయిన సంస్కృతిలో వారు నివసించారు. కాని దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకొన్నప్పుడు వారేమి చేశారు? బైబిలు ఇలా చెబుతుంది: “మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరి యెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.”—అపొస్తలుల కార్యములు 19:19.
దేవుని కాపుదలను పొందుట
అభిచార సంబంధమైన సమస్త బంధాలను నీవు త్రెంచివేసుకొంటే, ఏ రక్షణ లేకుండా పోవా? అందుకు భిన్నంగా “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.” (కీర్తన 46:1) దేవుని రక్షణ ఆయన ఈ దుష్ట విధానమును నాశనముచేయునపుడు మరి ప్రత్యేకంగా వెల్లడగును. “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు.”—2 పేతురు 2:9; కీర్తన 37:40ను పోల్చండి.
ఈ లోగా ‘కాలము, అనూహ్య సంగతులు మనలను పడద్రోయవచ్చును.’ (ప్రసంగి 9:11 NW) దేవుడు తన సేవకులకు “కష్టాలు లేని” జీవితాన్ని ఇస్తాననిగాని, లేక వ్యక్తిగతంగా ఏ హాని సంభవించకుండా వారిని కాపాడుతాననిగాని వాగ్దానం చేయడంలేదు. బదులుగా మన ఆత్మీయతను, ఆయనతోగల మన సంబంధాన్ని కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 91:1-9) ఎలా? ఒకటేమనగా, ఆయన మనలను సాతానుయొక్క మలినకర ప్రభావమునుండి కాపాడి, మనకు ప్రయోజనము చేకూర్చే ఆజ్ఞలను, సూత్రాలను ఇస్తున్నాడు. (యెషయా 48:17) యెహోవా మార్గాలను గూర్చిన జ్ఞానము పొందుటనుబట్టి, వ్యర్థమైన లేక హానికరమైన పనులు చేయకుండా ‘బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయును.’—సామెతలు 2:11.
దేవుడు మనలను కాపాడే మరో మార్గమేదనగా పరీక్షా సమయాల్లో ‘అధిక శక్తిని’ ఇచ్చుటద్వారా. (2 కొరింథీయులు 4:7) అవును, ఒక క్రైస్తవుని లోబరుచుకునే స్థితిలో పరిస్థితులు ఉన్నట్లయిన మన హృదయమును, తలంపులను కాపాడుటకు “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును” ఆయనిచ్చును. (ఫిలిప్పీయులు 4:7) తద్వారా క్రైస్తవుడు “అపవాది తంత్రములను ఎదిరించుటకు” శక్తిమంతుడగును.—ఎఫెసీయులు 6:11-13.
అలాంటి కాపుదలను మీరెలా సంపాదించుకొనగలరు? యెహోవానుగూర్చి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటతో దానిని ప్రారంభించండి. (యోహాను 17:3) ఈ విషయములో యెహోవాసాక్షులు నీ కెంతగానో సహాయము చేయగలరు. యెహోవాతో నీవు సన్నిహిత సంబంధమును పెంపొందించుకొనుటకు ప్రయత్నించేకొలది అలాంటి దయగల కాపుదల నీపైనున్నట్లు భావించుకొనగలవు. కీర్తన 91:14లో దేవుడు చెప్పేదాన్ని మనము ఇలా చదువుదుము: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.”
నీవు ఆయనయెడల నమ్మకంగావుంటే నిశ్చయంగా దేవుడు నీకు రానైయున్న నూతన లోకంలో నిత్యజీవమిచ్చి నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఆ కాలములో జీవించువారిని గూర్చి యెహోవా ఈ అభయమిస్తున్నాడు: ‘ఎవరి భయములేకుండ ప్రతివాడును ఉండును. సైన్యముల కథిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.’ (మీకా 4:4) రోగము మరణము ఉండవు. (ప్రకటన 21:4) యెహోవాతో నీవు సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటే—ఇప్పుడు కూడా నీవు కొంతవరకు భద్రతననుభవించ వచ్చును. కీర్తన రచయితవలె నీవునూ ఇలా చెప్పగల్గుదువు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.”—కీర్తన 121:2.
[అధస్సూచీలు]
a ఎక్కువ సమాచారము కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్‌సొసైటి ప్రచురించిన స్పిరిట్స్ ఆఫ్ ది డెడ్—కెన్ దె హెల్ప్ యు ఆర్ హాం యు? డు దే రియల్లీ ఎక్జిస్ట్? అనే బ్రోషర్‌ను చూడండి.
[6వ పేజీలోని చిత్రం]
ఎఫెసులోని క్రైస్తవులు మాంత్రిక సంబంధమైన ప్రతిదానిని తమవద్ద నుండి తీసివేసిరి
[7వ పేజీలోని చిత్రం]
దేవుని రాజ్యము క్రింద, భయమెన్నటికి ఉండదు