అదృష్ట తాయెత్తులు నిన్ను కాపాడగలవా?
బ్రెజిల్ దేశస్థుడు జేబులో ఒక స్ఫటికమును పెట్టుకుని ఉంటాడు. అమెరికన్ క్రీడాకారుని వద్ద లక్కీ పెన్ని ఉంటుంది. ఐరిష్ కుటుంబీకుని యింటిలో సెయింట్ బ్రిజిడ్ పేరుతో సిలువ వ్రేలాడుతుంటుంది. లక్షలాదిమంది మంచి అదృష్టాన్ని కలిగించే తాయెత్తులను లేదా మంత్రించబడిన అదృష్ట వస్తువులను (ఆమ్యులెట్స్)a ధరిస్తుంటారు. ఇలాంటి అదృష్ట తాయెత్తులను ధరించుకొనివుంటే కీడు రాకుండా దూరమౌతుందని, మంచి అదృష్టం కలిసొస్తుందని వారు నమ్ముతారు.
ఉదాహరణకు, బ్రెజిల్‌లో జరిగేదాన్ని చూడండి. వేజా అనే పత్రిక ప్రకారం, చాలామంది బ్రెజిల్ దేశస్థులు “వాటి స్వంతదార్లకు అదృష్టాన్ని లేక భౌతిక, మానసిక శక్తిని చేకూర్చిపెడతాయని తలంచబడే రాతిముక్కలను, ఒక మోస్తరు ప్రశస్తమైన రాళ్లను” తమవెంట పట్టుకెళ్తుంటారు. మాంత్రిక శక్తులను అగౌరపరుస్తామేమోననే భయంతో ఆ దేశంలోని ఇతరులు మతసంబంధమైన చిహ్నాలను లేక వ్రాసిన వాక్యాలను ఇంట్లో గోడలపై పెడ్తారు. కొందరైతే బైబిలును ఒక పరిశుద్ధ తాయెత్తుగా వాడతారు. దాన్ని బల్లపై కనిపించేలాగా పెట్టడం, లేక కీర్తన 91వ అధ్యాయానికి అలాగే శాశ్వతంగా తెరచిపెట్టి ఉంచడమో చేస్తుంటారు.
ఆఫ్రికా దక్షిణ ప్రాంతాలలోనైతే మ్యుటి, లేక నాటు మందును అదేవిధంగా ఉపయోగించడం ఉంది. దీనిని కేవలం రోగ స్వస్థతకేగాక దురదృష్టం నుండే కాపాడేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. తరచు రోగము, మరణము, ఆర్థిక తిరోగమనము, ప్రేమ విఫలమవడం మొదలగునవి శత్రువులు వారికి వ్యతిరేకంగా చేసిన మంత్రశక్తివలననో (చేతబడి) లేక చనిపోయిన తమ పితరులను శాంతిపరచకపోయినందునో కలుగుతాయని అనుకుంటారు. మ్యుటి సాధారణంగా గ్రామ ప్రాంతాలలో నాటుమందు ఇచ్చే వ్యక్తి దగ్గర లభిస్తుంది. అతడు దానిని మొక్కలు, చెట్లు, జంతువుల భాగాల పసరుతో తయారుచేస్తాడు. అయితే ఇందులో ఆసక్తికరమైన సంగతేమంటే మ్యుటి గ్రామీణ ప్రాంతాలకే పరిమితము కాదు. ఈ అలవాటు దక్షిణాఫ్రికా పట్టణాలలో కూడా ముమ్మరంగా విస్తరించింది. ఈ మ్యుటి పై ఆధారపడే వారిలో వ్యాపారస్తులు, విశ్వవిద్యాలయ పట్టభద్రులు కూడా ఉన్నారు.
అదృష్టాన్ని అన్వేషించడం ఐరోపాదేశాలలో కూడా సామాన్యమై పోయింది. స్టడీస్ ఇన్ ఫోక్‌లైఫ్ ప్రజెంటెడ్ టు ఇమిర్ ఈస్టిన్ ఎవెన్జ్ అనే పుస్తకము మనకు ఇలా తెల్పుతుంది: “ఐర్లాండులో ఒక ఫాదిరి పురోహిత ఆధిపత్యం క్రింద ఉండే ప్రాంతాలలో లేదా పట్టణాలలో ఇండ్లద్వారాలపైనా, ఇంటి ముందు వరండా లేక తత్సంబంధ ఇతర కట్టడంపైన గుర్రపు నాడాలు కొట్టబడని ఇండ్లు బహు అరుదు.” ఆ దేశంలో ఇంకా సర్వసామాన్యంగా కనిపించేవి ఏమంటే మంచి అదృష్టాన్ని తెచ్చేందుకు ద్వారాలపై, పడకల మీద వ్రేలాడుతుండే తుంగతో అల్లబడిన సిలువలు. పరిశీలకులు చెప్పేదేమంటే అనేక మంది ఐరిష్ దేశస్థులు అలాంటి మూఢ నమ్మకాలను పెద్దగా పట్టించుకోనివారివలె పైకి ఉంటారు. కానీ వాటిలో పూర్తిగా నమ్మనివారు కొద్దిమందే.
భద్రతకొరకైన అన్వేషణ
అలాంటి మూఢనమ్మకాల వెనుకనున్న అసలు ఉద్దేశ్యమేమిటి? ప్రజలకు అవసరమైన భద్రతను అవి ఇస్తాయనేదే. అయితే నిజానికి తమ ఇండ్లలో, రాత్రులందు వీధుల్లో నడిచేటప్పుడు ఎంతమంది అలాంటి భద్రతున్నట్లు భావిస్తున్నారు? దానికితోడు జీవనం కొరకు, పిల్లలను పోషించుకొనేందుకు పోరాటం కొనసాగుతునే ఉంది. అవును, బైబిలు “కష్ట కాలములు” అని పిలుస్తున్న సమయంలో మనము జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) అందుచేత ప్రజలు భద్రతను గట్టిగా ఆశించడం సహజమే.
ప్రత్యేకంగా ఇది వివిధ రకాల అభిచారము, మాంత్రిక అలవాట్లు ప్రజాదరణ పొందిన సంస్కృతుల్లో ఉండవచ్చు. చనిపోయినవారి ఆత్మలు, లేక శత్రువుల మాంత్రిక సంబంధమైన చేతబడికి (బాణామతి) గురౌతామేమోననే భయం ఈ తాయెత్తుల లేక ఇతర మంత్రసంబంధ వస్తువుల నుండి భద్రతను కోరేలా చేస్తుంది. ఏమైనా, ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా వ్రాస్తున్నది: “ఎక్కువమంది ప్రజలు వారిని అభద్రతకు గురిచేసేవాటినిగూర్చి భయంతో ఉన్నారు. మూఢనమ్మకాలు భద్రతను అందించడంద్వారా అలాంటి భయాలను జయించేలా సహాయపడతాయి. వారు తమకు కావలసినవాటిని పొందుతారు, కష్టాన్ని తప్పించుకొంటారనే అభయాన్ని అవి ప్రజలకిస్తుంటాయి.”
మంత్రిత వస్తువుల అనిశ్చయ శక్తి
అందుచేత, “తాయెత్తులను,” “రక్షరేకులను” “మంత్రిత వస్తువులను” వివిధ రూపాల్లో, లేక పద్ధతుల్లో ప్రపంచమంతటా ప్రజలు వాడుతున్నారు. అయితే మనుష్యులు తయారుచేసిన తాయెత్తులు ఏదైనా నిజమైన భద్రతనిస్తాయని నమ్ముట కారణసహితంగా ఉందా? సర్వసామాన్యంగా ప్రజాదరణ పొందిన తాయెత్తులు వ్యాపారరీత్యా పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఒక కర్మాగారంలో తయారుచేయబడిన ఒక వస్తువు మాంత్రిక సంబంధమైన శక్తులను కలిగివుందని నమ్మటం సహేతుకతను, ఇంగిత జ్ఞానాన్ని కోల్పోడమే కాదా? చివరకు నాటు వైద్యుని ద్వారా తయారుచేయబడిన పసరుమందు కూడా కేవలం సామాన్యమైన దుంపలు, చిన్నచిన్న మొక్కలు మొదలగువాటి మిశ్రమమే. అలాంటి మిశ్రమంలో మాంత్రిక శక్తి ఎందుకు ఉంటుంది? అంతేగాక, అలాంటి వస్తువులను ఉపయోగించువారు వాటిని ఉపయోగించని ఇతరులకంటే ఎక్కువకాలం బ్రతుకుతున్నట్లు, లేదా ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు నిజమైన సాక్ష్యాధారముందా? అలాంటి మాంత్రిక తాయెత్తులను చేసేవారే రోగానికి, మరణానికి గురికావడం లేదా?
నిజమైన భద్రత లేక వారి జీవితాలపైన అదుపు ఉందనే భావననిచ్చేందుకు బదులు, ఇలాంటి తాయెత్తులను లేక ఇతర మాంత్రిక వస్తువులను మూఢనమ్మకంతో ఉపయోగించడం ప్రజలు సమస్యలను జ్ఞానయుక్తంగా ఎదుర్కోవడాన్ని నిరుత్సాహపరస్తూ, సమస్తాన్ని బాగుచేసుకొనేందుకు అదృష్టంపైనే ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ తాయెత్తుల శక్తిపై నమ్మకముంచడం దాన్ని ఉపయోగించే వ్యక్తికి బూటకపు భద్రతా భావాన్నిస్తుంది. మద్యం సేవించిన వ్యక్తి తన నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏ మాత్రం చెక్కుచెదరవని చెప్పవచ్చును. అయితే తాను డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నిస్తే చాలావరకు తనకు లేదా ఇతరులకు హానితెచ్చే అవకాశం ఉంది. అలాగే తాయెత్తు శక్తిపై నమ్మకముంచే వ్యక్తి తనకుతాను హాని తెచ్చుకోవచ్చును. కాపాడబడతామనే భ్రమలో శ్రమించేటప్పుడు, బుద్ధిహీన ప్రవర్తనతో ప్రమాదాలను మీదకు తెచ్చుకోవచ్చు, లేదా అజ్ఞానమైన నిర్ణయాలు తీసుకోవచ్చును.
తాయెత్తుల శక్తిపై నమ్మకముంచడం వెనుక వాటిని ఉపయోగించే లక్షలాదిమందికి తెలియక గుప్తంగావున్న యితర గొప్ప చిక్కులు కలవు. ఈ ప్రమాదాలు ఏమిటి, ఏ హాని కలుగకుండా తప్పించుకునే సరైన మార్గమేమైన ఉందా? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[అధస్సూచీలు]
a వెబ్‌స్టర్స్ నైన్త్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ “ఆమ్యులెట్”ను, తరచు “దాన్ని ధరించేవారికి సహాయపడే లేదా కీడునుండి కాపాడే మంత్రసంబంధమైన రూపము లేక గుర్తుతో చేయబడిన ఛామ్‌గా (తాయెత్తు లేక ఆభరణముగా) నిర్వచిస్తుంది.”