వివాహబంధాలను ఎలా పటిష్ఠపరచుకోవాలి
గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును చిక్కులబెట్టుటకు ప్రయత్నిస్తూ పరిసయ్యులు, “ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?” అని అడిగారు. దానికాయన మొదటి మానవ వివాహాన్ని సూచిస్తూ వారికి జవాబిచ్చి, ఆ విషయంలో ఒక కట్టడ ఏర్పాటుచేస్తూ యిలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.”
‘పరిత్యాగ పత్రికనివ్వడం’ ద్వారా, విడాకులిచ్చే అవకాశాన్ని మోషే కలిగించాడని ఆ పరిసయ్యులు వాదించారు. దానికి యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.”—మత్తయి 19:3-9.
ఆదియందు, వివాహమొక శాశ్వతకాల బంధంగా ఉండునట్లు చేయబడెను. మొదటి వివాహ జతను మరణము సహితము వేరుచేసి యుండేదికాదు, ఎందుకంటే వారు నిత్యజీవ ఉత్తరాపేక్షతో పరిపూర్ణ మానవులుగా సృజింపబడిరి. అయితే వారు పాపం చేశారు. వారి పాపము మానవ వివాహాన్ని చెడగొట్టింది. శత్రువగు మరణము వివాహిత దంపతులను విడదీయ నారంభించింది. “భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లిచేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని మనం బైబిలునందు చదువునట్లుగా, మరణంతో వివాహం ముగుస్తుందని దేవుడు దృష్టిస్తున్నాడు. (1 కొరింథీయులు 7:39) మరణాంతర జీవితంలోకూడ వివాహం కొనసాగుతుందనే నమ్మకాన్నిబట్టి భర్త మరణిస్తే అగ్నిప్రవేశంచేసి మరణించడానికి ఆ భార్యను ఒప్పించే లేక వత్తిడిచేసే సతీసహగమనం వంటి మతాలోచనలకిది పూర్తిగా భిన్నమైయుంది.
మోషే ధర్మశాస్త్ర ఏర్పాటు
మోషే ధర్మశాస్త్రమునిచ్చే సమయానికి, వివాహిత సంబంధాలు ఎంతగా పాడైపోయాయంటే, ఇశ్రాయేలీయుల హృదయకాఠిన్యమును బట్టి యెహోవా విడాకులకు ఒక యేర్పాటు చేశాడు. (ద్వితీయోపదేశకాండము 24:1) వారు తమవలె తమ పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞ స్పష్టపరచినట్లు ఇశ్రాయేలీయులు ప్రతిచిన్న కారణాన్నిబట్టి తమ భార్యలకు విడాకులిచ్చుటకు ఈ నియమాన్ని దుర్వినియోగపరచాలని దేవుని సంకల్పము కాదు. (లేవీయకాండము 19:18) పరిత్యాగ పత్రికనిచ్చుట సహితం అడ్డుకొనే ఒక ప్రక్రియగా పనిచేసింది, ఎందుకంటె ఆ పత్రికను వ్రాసే సమయంలో విడాకులివ్వాలనుకునే భర్త యోగ్యులైన అధికారులను సంప్రదించాలి, భార్యభర్తలు సమాధానపడుటకు వీరు కృషిచేసి ఉండేవారు. తన భార్యకు “ఏ హేతువుచేతనైనను” ఒకడు విడాకులిచ్చే ఎటువంటి హక్కునైనను స్థిరపరచుటకు దేవుడు ఈ నియమము నివ్వలేదు.—మత్తయి 19:3.
అయితే, చివరకు ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞలోని నిజమైన భావాన్ని పెడచెవినబెట్టి, తమ కిష్టమైన కారణాన్నిబట్టి విడాకులిచ్చుటకు ఈ నియమాన్ని దుర్వినియోగం చేశారు. సా.శ.పూ. ఐదవ శతాబ్దం వచ్చేసరికి తమ యౌవన భార్యలను మోసగిస్తూ, వారు అన్నిరకాల కారణాల్నిబట్టి వారికి విడాకులియ్య నారంభించారు. విడాకులను తాను ద్వేషిస్తున్నానని యెహోవా వారికి స్థిరంగా చెప్పాడు. (మలాకీ 2:14-16) ఈ చరిత్రనుబట్టే యేసు తన కాలమందలి ఇశ్రాయేలీయులు అభ్యసిస్తున్న విడాకులను ఖండించాడు.
విడాకులకున్న ఒకేఒక చట్టబద్ధమైన ఆధారము
అయితే, విడాకులకున్న ఒకేఒక చట్టబద్ధ ఆధారమైన వ్యభిచారాన్ని గూర్చి యేసు ప్రస్తావించాడు. (మత్తయి 5:31, 32; 19:8, 9) ఇక్కడ “వ్యభిచారము” అని అనువదింపబడిన పదంలో లేఖన సంబంధమైన వివాహానికి వెలుపటి అన్నిరకాల అనగా ఒకే లింగవ్యక్తులతో లేదా వ్యతిరేక లింగ వ్యక్తులతో లేదా జంతువులతో జరిపే అక్రమ లైంగిక సంపర్కము ఇమిడియున్నది.
అయినప్పటికిని, విశ్వాసఘాతుకంగా ప్రవర్తించిన జతనుండి విడాకులు తీసుకోవడాన్ని యేసు సిఫారసు చేయడం లేదు. కలుగు పర్యవసానాల్ని బాగా ఆలోచించిన తరువాత తాను విడాకులివ్వాలా వద్దా అనేది తప్పుచేయని వ్యక్తి నిర్ణయంపై ఆధారపడివుంటుంది. ఈ లేఖన ఆధారాన్నిబట్టి విడాకులివ్వాలని తలంచే భార్యలు మొదటి స్త్రీ పాపం చేసినప్పుడు ఆమెపై తీర్పు ప్రకటిస్తూ దేవుడు చెప్పిన విషయాన్ని కూడ ఆలోచించవచ్చును. మరణశిక్షతో పాటు దేవుడు హవ్వకు ప్రత్యేకంగా యిలా చెప్పాడు: “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.” (ఆదికాండము 3:16) సి. ఎఫ్. కీల్ మరియు ఎఫ్. డెలిటిష్ వ్రాసిన కామెంట్రి ఆన్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఈ “వాంఛ” “దాదాపు ఒక తెగులువంటి కోరిక” అని వర్ణించింది. నిజమే, ఈ వాంఛ ప్రతి భార్యకు అంత బలంగా వుండకపోవచ్చు, అయితే తప్పుచేయని ఓ భార్య విడాకులను గూర్చి ఆలోచిస్తూవుంటే, హవ్వనుండి తమకు వారసత్వంగా లభించిన భావోద్రేక అవసరతలను పరిగణలోనికి తీసుకోవడం జ్ఞానయుక్తం. అయితే, వివాహేతర లైంగిక దోషంగల వ్యక్తి మూలంగా తప్పుచేయని వ్యక్తికి ఎయిడ్స్‌తోసహా, సుఖరోగాలు సోకే అవకాశమున్నందున కొందరు యేసు వివరించినట్లుగా విడాకులు తీసుకోవడానికే నిర్ణయించుకున్నారు.
కుటుంబ కష్టాల ఆరంభం
మొదటి మానవ దంపతులు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపంతో ప్రజల హృదయకాఠిన్యం ఆరంభమైంది. (రోమీయులు 5:12) మొదటి మానవ జంట తమ పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు కుటుంబ కలహమనే విత్తనాలు విత్తబడ్డాయి. ఎలా? నిషిద్ధ వృక్షఫలం తినుమని సర్పం మొదటి స్త్రీయైన హవ్వను శోధించినప్పుడు, ఆమె ఏ సంకోచం లేకుండావెళ్లి ఆ ఫలం తీసుకుని భుజించింది. ఆ విశేష నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఆమె వెళ్లి సర్పము తనకు చెప్పిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. (ఆదికాండము 3:6) అవును, ఆమె తన భర్తను సంప్రదించకుండానే ఆ పనిచేసింది. నేడు అనేక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలకు, అనగా హృదయంవిప్పి పరస్పరం మాట్లాడకపోవడం యొక్క ప్రతిరూపం ఇక్కడుంది.
ఆ తర్వాత, వారు తమ పాప పరిణామాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆదాము హవ్వలిద్దరు, నేడనేకమంది దంపతులు కష్టం కలిగినప్పుడు చేయునట్లే ఇతరులను నిందించారు. మొదటి మానవుడగు ఆదాము, తానుచేసిన దానికి హవ్వను, యెహోవాను నిందిస్తూ ఇట్లన్నాడు: “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని.” దానికా స్త్రీ యిలాచెప్పింది: “సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిని.”—ఆదికాండము 3:12, 13.
ఆదాము హవ్వలపై యెహోవా విధించిన తీర్పు, పెరుగుతున్న కష్టాల్లోగల మరో వాస్తవాన్ని వెల్లడించింది. భర్తతో తనకుండే సంబంధాన్ని గూర్చి యెహోవా హవ్వతో యిలా చెప్పాడు: “అతడు నిన్ను ఏలును.” మన మొదటి శీర్షికలో ప్రస్తావించబడిన ఈసావొ వలెనే నేడు అనేకమంది భర్తలు తమ భార్యల భావాల్ని ఏ మాత్రం పట్టించుకోకుండ వారిపై అధికారం చెలాయిస్తుంటారు. అయిననూ, అనేకమంది భార్యలు తమ భర్తల శ్రద్ధ చూరగొనాలనే వాంఛ కలిగియున్నారు. ఆ వాంఛ తీరనప్పుడు, భార్యలు అటువంటి శ్రద్ధను గట్టిగా అడుగుచు స్వార్థంతో ప్రవర్తిస్తారు. అనేకమంది భర్తలు అధికారం చెలాయిస్తున్నందున, అనేకమంది భార్యలు తమ భర్తల శ్రద్ధ చూరగొనాలనే వాంఛ కలిగివున్నందున, స్వార్థం చోటుచేసుకొని, ప్రశాంతత లేకుండాపోతుంది. “హౌటు అనలైజ్ టుడేస్ డివోర్సెస్” అనే పేపరునందు షూన్‌స్కె సెరెజావె యిలా చెప్పాడు: “ఈ విషయంలో ఇమిడియున్న ప్రాథమిక సమస్యను అనగా ప్రజలెక్కువగా తమ స్వార్థాన్నే చూసుకుంటారనే విషయాన్ని మనం లక్ష్యపెట్టకపోతే, నేటి విడాకుల విషయం విశ్లేషణ ఒక్కసారిగా అసాధ్యమౌతుంది.”
అయితే, తమ అసంపూర్ణ స్థితియందును విధేయతచూపు వివాహిత దంపతులు తగురీతిలో వైవాహిక ఆనందము ననుభవించులాగున యెహోవా తన వాక్యమందు నడిపింపు దయచేశాడు. ఈసావొ దేవుని నడిపింపు ననుసరించాడు, కాగా ఇప్పుడాయన సంతోషభరితమైన కుటుంబ జీవనాన్ని అనుభవిస్తున్నాడు. వివాహ బంధాన్ని పటిష్ఠపరచుకొనుటకు బైబిలు సూత్రములు ప్రజలకెట్లు సహాయపడునో మనం చూద్దాం.
పరస్పరం మాట్లాడుకోండి
అనేక వివాహాల్లో, పరస్పర సంభాషణ లేకపోవడం, ఇతరులను నిందించాలనే స్వభావం, స్వార్థ దృక్పథం భార్యాభర్తలు పరస్పర భావోద్రేకాలను అర్థం చేసుకోవడాన్ని కష్టభరితం చేస్తున్నాయి. “సన్నిహితత్వానికి ముందు పరస్పరం భావాల్ని పంచుకోవడం అవసరం, సన్నిహితత్వానికి ప్రగాఢమైన నమ్మకం అవసరం. అయితే నేడు ఈ నమ్మకం కరువైపోయింది” అని పరిశోధకురాలైన కారెల్ ఎస్. ఎవరీ చెబుతోంది. అంతరంగ భావాలను పరస్పరం బహుగా పంచుకోవడం అటువంటి నమ్మకాన్ని వృద్ధిచేస్తుంది. దీనికి భార్యాభర్తల మధ్య హృదయపూర్వక సంభాషణ అవసరం.
సున్నిత భావాల్ని పంచుకోవడాన్ని ప్రోత్సహించుటకు సామెతల గ్రంథము ఉపమాన రీతిలో ఇట్లంటున్నది: “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” (సామెతలు 20:5) వివాహిత దంపతులు వివేకవంతులైయుండి తమ జత హృదయ లోతుల్లోని తలంపులను రాబట్టేవారిగా ఉండాలి. మీ జత మనస్తాపం చెందాడనే అనుకుందాం. అప్పుడు “నాకీ రోజు బాగా ఇబ్బంది కలిగింది” అని అనడానికి బదులు, “మీకీ రోజేమైనా ఇబ్బంది కలిగిందా? ఏమయ్యింది?” అని దయాపూర్వకంగా అడగండి. మీ జతతో మాట్లాడుటకు, విన ప్రయత్నించుటకు సమయం పట్టవచ్చు, అయితే అది సాధారణంగా ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా ఉండి, మీ జతను అలక్ష్యం చేసినందున ఆ తర్వాత తలెత్తే భావోద్రేక సమస్యలతో వ్యవహరించుటకంటె యిలా సమయం గడపడటం మీ సమయాన్ని ఆదాచేస్తుంది.
నమ్మకం సాధించడానికి, ఇద్దరూ యథార్థంగా ఉండాలి, జతలోని మరోవ్యక్తికి అర్థమయ్యేరీతిలో తన భావాలను వ్యక్తపర్చడానికి ప్రయత్నించాలి. “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక . . . ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని దేవుని వాక్యం ఉద్బోధిస్తున్నది. (ఎఫెసీయులు 4:25) సత్యం మాట్లాడ్డానికి వివేకం అవసరం. తన మాట పట్టించుకోవడం లేదని ఓ భార్య భావిస్తుందనుకోండి. అప్పుడామె అలా మాట్లాడుటకు ముందు ఈ సూక్తిని ఆలోచించాలి: “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.” (సామెతలు 17:27) “నేను చెప్పే మాట మీరెన్నడూ పట్టించుకోరు!” అని తన భర్తను నిందించుటకు బదులు, తనతో నిరాశా నిస్పృహలు వృద్ధికాకముందే శాంతంగా తన భావాలను వ్యక్తపర్చడం ఎంతోమేలు. “మీరు పనిరద్దీగా ఉన్నారని నాకు తెలుసు, అయితే మీతో మరికాస్త సమయం గడపడం నాకెంతో సంతోషాన్నిస్తుంది” వంటి మాటలు చెప్పుట ద్వారా బహుశ ఆమె తన భావాలను వ్యక్తపర్చవచ్చును.
నిజమే, “ఆంతరంగిక ఆలోచన లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును” (సామెతలు 15:22 NW) మీ జత మిమ్మును ప్రేమిస్తుందంటే, దానర్థం మీ మనస్సునామె చదువగలదని కాదు. మీ జతకు మీ భావాలేమైయున్నవో యుక్తిగా తెలియజేయాలి. వివాహిత క్రైస్తవ దంపతులుగా మీరు ‘సమాధానమను బంధమందు ఏకభావమును కాపాడుకొనుటయందు శ్రద్ధకలిగి’ యుండులాగున ప్రేమపూర్వకమైన సవరణలు చేసుకొనుటకు ఇది సహాయపడుతుంది.—ఎఫెసీయులు 4:2, 3.
ఉదాహరణకు కాజువో సంగతే తీసుకోండి, ఇతనికి జూదమంటే ఎంతో మోజు, కాని అతడు భార్య పెత్తనానికిలోబడి బ్రతికేవాడు. దీని కారణంగా అతడు వందలవేల డాలర్ల అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి చేసిన అప్పుల్తో అతడు పూర్తిగా మునిగిపోయాడు. ఆ సమయంలో అతడు బైబిలు పఠించడానికి ఆరంభించి చివరకు తన సమస్యల్ని గూర్చి తన భార్యతో చెప్పే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమెవేసే నిందలన్నీ భరించడానికి సిద్ధపడ్డాడు. అయితే, అంతకుముందునుంచే బైబిలు పఠిస్తున్న ఆయన భార్య ప్రశాంతంగా “వాటిని ఎలా తీర్చాలో ఆలోచించడానికి మనం ప్రయత్నిద్దాం” అని జవాబిచ్చేసరికి అతను ఆశ్చర్యపోయాడు.
తమ ఇల్లుకూడ అమ్మేసి ఆ మరుసటి దినంనుండే వారు అప్పులవాళ్ల దగ్గరకెళ్లి తమ అప్పు తీర్చడం మొదలుపెట్టారు. వారి అప్పులన్నీ తీరడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆయన భార్యయగు కిమీని మార్చినదేమి? ఆమె ఇట్లన్నది: “ఫిలిప్పీయులు 4వ అధ్యాయం, ఫిలిప్పీయులు 4:6, 7 వచనాల్లోని మాటలెంతో వాస్తవం. ‘దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.’” ఆమె ఇంకనూ యిలాచెప్పింది: “కష్టాలున్ననూ నేను ఆనందంగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపడిన నా స్నేహితురాలు నాతో బైబిలు పఠించడం ఆరంభించింది.” కాజువో అతని భార్య బాప్తిస్మంపొంది ప్రస్తుతం సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నారు.
పరస్పరం సత్యం మాట్లాడుకొంటూ నమ్మకంగా ఉండడానికి తోడుగా, పై అనుభవాలు కలిగివున్న భార్యాభర్తలు, వివాహిత దంపతులు తమ వైవాహిక సమస్యలను పరిష్కరించుటకు తమకు సహాయపడిన మరో విషయం కూడా చేశారు. వివాహయేర్పాటుకే కర్తయైన యెహోవా దేవునితో వారు సంభాషించారు. దంపతులు ఆయన సూత్రాలను అన్వయించి మిగతా విషయాల్ని ఆయనపై మోపుటకు తమవంతు కృషిచేస్తే, వారికెదురయ్యే వత్తిడులు, కష్టాల మధ్యనూ ఆయన సమస్త తలంపులకు మించిన దేవుని సమాధానంతో వారిని దీవిస్తాడు. ఇద్దరు కలిసి ప్రార్థించడం ప్రత్యేకంగా సహాయకరం. భర్త ఈ విషయంలో నాయకత్వం తీసుకొని, తను తన భార్య ఎదుర్కొంటున్న ఏ సమస్య విషయంలోనైనను ఆయన నడిపింపును, నిర్దేశకత్వాన్ని వెదకుటకు దేవుని యెదుట ‘తన హృదయాన్ని కుమ్మరించాలి.’ (కీర్తన 62:8) యెహోవా దేవుడు తప్పక అటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడు.
అవును, వివాహ బంధం పటిష్ఠపరచుకోవడం సాధ్యమే. ఈ కల్లోలిత సమాజంలో మన అసంపూర్ణతలన్నిటితో జీవిస్తూకూడ, వివాహిత దంపతులు వారి సంబంధమందు తగిన ఆనందాన్ని ఇప్పుడు కనుగొనవచ్చును. అదనంగా మీరు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ప్రచురించిన నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము అనేపుస్తకములో ఆచరణయోగ్యమైన దైవసలహాను కనుగొనగలరు. అంతేకాదు, బైబిలు సూత్రాలను అన్వయించ యథార్థంగా కృషిచేయు దంపతులు త్వరలో దేవుడుతెచ్చే నూతన లోకంలో ప్రేమబంధమందు కలిసి జీవించే నిరీక్షణ కలిగివున్నారు.