బలహీనమౌతున్న వివాహబంధం
తన రెండునెలల పసిబిడ్డను ఒక యువతి లాలిస్తూ, అంతలోనే తనకేదో పిచ్చెత్తినట్లు ఆ బిడ్డను నేలపై పడవేసింది. కొన్ని గంటల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. “నేనే కావాలని వాన్ని క్రింద పడేసాను, ఎందుకంటె నా భర్త కుటుంబాన్ని అసలు పట్టించుకోడు” అని ఆ తల్లి చెప్పింది. తన భర్తతో ఆ విషయం మాట్లాడుటకు బదులు, ఆమె తన కోపాన్ని ఏమీ తెలియని పసిబిడ్డపై చూపింది.
కొద్దిమంది తల్లులు మాత్రమే అటువంటి దారుణానికి ఒడిగడతారు, అయితే చాలామంది ఆమె భావాలతో ఏకీభవిస్తారు. తమ వివాహాన్ని విజయవంతం చేసుకోవడం వివాహిత జంటలకు అంతకంతకూ కష్టంగా తయారౌతుంది. “నేడు అమెరికాలో ఉన్నట్లుగా వివాహం విజయవంతమయ్యే అవకాశాలు దిగజారినప్పుడు, వివాహం యెడల బలమైన, అమితమైన అంకితభావం కలిగివుండడం . . . ఎంత విపత్కరంగా ఉందంటే పూర్తిగా జ్ఞానవిశిష్ఠభావాలుగల ఏ వ్యక్తీ అలాచేయడు” అని జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ది ఫ్యామిలి చెబుతుంది.
ఈ కల్లోలిత కాలాల్లో, లైంగిక దుర్నీతి, సామరస్య లోపం, అప్పులు, అత్తింటిపోరు, స్వార్థం ఇవన్నీ గృహ కలహాలకు కారణమై తరచు విడాకులకు దారితీస్తున్నవి. ఈ పరిస్థితి జపానులో ఎంత గంభీరంగా ఉందంటే, విడాకుల విషయంలో కఠిన వైఖరిగల కాథోలిక్ చర్చి సహితం విడాకులు తీసుకున్నవారు, మరియు తిరిగి వివాహం చేసుకున్న సభ్యులపట్లగల దుర్భావమును తగ్గించుటకు ఒక ప్రత్యేక కమిటీ నెలకొల్పాల్సి వచ్చింది. అంతకంతకూ ఎక్కువమంది చర్చిసభ్యులు విడాకుల సంబంధిత సమస్యల ప్రభావానికి గురౌతున్నారు.
అయితే, విడాకుల సంఖ్య పెద్దసమస్యయొక్క కొద్ది భాగాన్నే వెల్లడిస్తున్నది. విడాకులను సులభం చేస్తున్న సామాజిక స్వభావాలు కాదుగాని, వైవాహిక జీవిత నాణ్యత క్షీణించడమే విడాకులు తీసుకోవడాన్ని పెంచుతున్నదని అమెరికాలో జరుపబడిన ఒక పరిశోధన చూపిస్తున్నది. తగినంతగా కృషిచేయక పోవడం, అంకితభావం లేకపోవడం వివాహ జీవిత తేజస్సును కృంగజేస్తున్నది. అనేకులు పైకి వివాహిత జంటలుగా కనబడిననూ, వారు తమ వివాహ ధర్మాన్ని నెరవేర్చరు, ఒకరితోఒకరు దాదాపు మాట్లాడుకోరు. ‘భర్త సమాధిలోనే నన్నూ సమాధిచేయడాన్ని నేను నిరాకరిస్తాను’ అని తనకు ప్రత్యేకంగా ఒక సమాధి స్థలాన్ని కొనుక్కున్న ఒక తూర్పుదేశీయురాలివలె కొందరు భావిస్తారు. భర్తకిప్పుడు విడాకులియ్యలేని ఆమె చనిపోయినప్పుడు అలా విడాకులివ్వాలని చూస్తున్నది. విశాదకరమైన విషయమేమంటే, అటువంటి ప్రజలు విడాకులు పొందలేకపోయిననూ, వారి వైవాహిక జీవనం వారికి సంతోష మూలంగా లేదు.
ఈసావో విషయంలో అదే జరిగింది. ఏదో భ్రమలోపడి అతడు తన భార్యను వివాహం చేసుకున్నాడు, కావున అతడు తన అహంభావ జీవిత విధానాన్ని మార్చుకోవాలని ఎంతమాత్రం తలంచలేదు. లారీ డ్రైవరుగా అతనికి మంచి ఆదాయమున్ననూ, తినడం త్రాగడంలోనే తన ఆదాయాన్నంతా ఖర్చుచేస్తూ, కుటుంబాన్ని పట్టించుకొనేవాడు కాడు. ఫలితంగా తనకెప్పుడూ భార్యతో తగువులాటలు ఉండేవి. “పరిస్థితులు నాకు కలిసిరానప్పుడల్లా, ఇంటికివెళ్లి ఆ కోపాన్నంతా కుటుంబం మీద చూపేవాన్ని” అని అతనన్నాడు. ఆరని అగ్నిపర్వతంవలె ప్రతిరోజు విడాకుల ప్రస్తావన వచ్చేది.
అనేకమంది స్త్రీపురుషులు బాధాతప్త వైవాహిక జీవితాల్ని గడుపుతున్నారు. విడాకులు తీసుకున్ననూ, లేకపోయిననూ వారు సంతోషంగా జీవించడం లేదు. వారి వివాహాన్ని విజయవంతం చేసుకోవడానికి ఏదైనా మార్గముందా? తమ వివాహ బంధాన్ని పటిష్ఠపరచుకోవడానికి వారేం చేయగలరు?