ప్రభువు రాత్రిభోజనము ఎందుక మీ యెడల భావమును కలిగియున్నది
యేసుక్రీస్తు తన మానవ జీవితపు చివరి రాత్రి ఈ ప్రభువు రాత్రిభోజనమును ప్రారంభించాడు. ఆ రోజు గురువారం, మార్చి 31. యేసు ఏప్రిల్ 1న శుక్రవారం మధ్యాహ్నం చనిపోయాడు. యూదుల కేలండరు ఒకరోజు సాయంకాలమునుండి మరుసటి రోజు సాయంకాలము వరకు ఒక దినమున లెక్కిస్తున్నందున ఈ భోజనము, ఆయన మరణించడం, రెండూ సా.శ. 33వ సంవత్సరం నీసాను 14వ దినాన్నే జరిగాయి.
ఈ భోజనమును యేసు ఎందుకు ప్రారంభించాడు? ఆయన ఉపయోగించిన రొట్టె, ద్రాక్షారసముల సూచన ఏమిటి? దానిలో ఎవరు పాలుపుచ్చుకోవాలి? ఈ భోజనాన్ని ఎంత తరచుగా ఆచరించాలి? అది మీకు ఒక భావాన్ని ఎలా కలిగియుండగలదు?
ఎందుకు ప్రారంభించబడింది?
ఈ భోజనాన్నిగూర్చి తన అపొస్తలులతో యేసు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడ”ని చెప్పెను. మరొక అనువాదం ప్రకారం “నా జ్ఞాపకార్థం దీనిని చేయుడని” ఆయన చెప్పెను. (1 కొరింథీయులు 11:24; ది న్యూ ఇంగ్లీషు బైబిలు) నిజానికి ప్రభువు రాత్రిభోజనం తరచు క్రీస్తు మరణ జ్ఞాపకార్థంగా సూచింపబడటం జరిగింది.
యేసు, యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపరచే యథార్థపరునిగా మరణించాడు. తద్వారా ఆయన యథార్థపరులైన మానవులు కేవలం స్వార్థభావాలతోనే దేవుని సేవిస్తున్నారనే సాతానును అబద్ధ ఆరోపకుడని నిరూపించెను. (యోబు 2:1-5) ఆయన మరణము దేవుని హృదయాన్ని సంతోషపరచింది.—సామెతలు 27:11.
పరిపూర్ణ మానవునిగా మరణించుట ద్వారా, ‘తన ప్రాణమును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా’ యేసు అర్పించాడు. (మత్తయి 20:28) మొదటి మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపంచేయడంతో, పరిపూర్ణ మానవ జీవితమును దాని ఉత్తరాపేక్షలను అతడు పోగొట్టాడు. అయినా “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) అవును “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము . . . క్రీస్తుయేసునందు నిత్యజీవము.”—రోమీయులు 6:23.
“ప్రభువువలన పొందితిని”
క్రీస్తు మరణమును జ్ఞాపకార్థంగా ఆచరించే ఆచరణను వివరించే పౌలు మాటలు ఇలా ఉన్నవి: “నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి—యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని—యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.”—1 కొరింథీయులు 11:23-26.
సా.శ. 33వ సంవత్సరం నీసాను 14వ తారీఖున పౌలు, యేసు మరితర 11మంది అపొస్తలులతోకూడా లేనందున ఆయన ఈ సమాచారాన్ని ప్రేరేపిత ప్రత్యక్షతమూలంగానే “ప్రభువువలన పొంది” ఉంటాడు. క్రీస్తును వ్రేలాడదీయుటకు రోమీయులను ప్రేరేపించిన యూదామత శత్రువులకు యూదా “తనను అప్పగించిన రాత్రి” యేసు ఈ జ్ఞాపకార్థంను ప్రారంభించాడు. సూచనార్థకమైన రొట్టె ద్రాక్షారసములో పాలుపొందుటకు ఎవరు అర్హులైయున్నారో వారే ఆయన జ్ఞాపకార్థంగా అందు పాలుపుచ్చుకుంటారు.
ఎంత తరచుగా దానిని ఆచరించాలి?
“మీరు ఈ రొట్టెను తిని, దీనిలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” అను పౌలు మాటల భావమేమిటి? నమ్మకస్థులైన అభిషక్త క్రైస్తవులు ఆ తదుపరి పరలోకమునకు పునరుత్థానమగుటకు మరణించువరకు ఈ జ్ఞాపకార్థ చిహ్నాలలో ‘తరచు’ పాలు పొందుతుంటారు. తద్వారా దేవునియెదుట మరియు లోకం యెదుట యేసును బలిగా అర్పించిన యెహోవా ఏర్పాటునందు వారు తమ విశ్వాసమును తరచు ప్రచురపరస్తారు. ఎంతకాలం? పౌలు “ఆయన వచ్చు పర్యంతము” అని చెబుతున్నాడు. అనగా తన ‘ప్రత్యక్షతకాలంలో’ పునరుత్థానము ద్వారా అభిషక్త అనుచరులను పరలోకమునకు తీసుకెళ్లుటకు యేసు వచ్చేంతవరకు ఈ ఆచరణలను కొనసాగుతాయని పౌలు భావము. (1 థెస్సలొనీకయులు 4:14-17, NW) క్రీస్తు తన నమ్మకస్థులైన 11 మంది అపొస్తలులతో, “నేనుండు స్థలమున మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును” అని చెప్పిన మాటలకు ఇది అనుగుణ్యముగా ఉన్నది.—యోహాను 14:3.
క్రీస్తు మరణమును రోజూ లేక వారవారం జ్ఞాపకం చేసుకోవాలా? ఐగుప్తు దాసత్వమునుండి ఇశ్రాయేలీయులు విడుదల పొందినదాన్ని జ్ఞాపకంచేసే పస్కా దినముననే యేసు, ప్రభువు రాత్రి భోజనమును ప్రారంభించి, మరణించాడు. నిజానికి, “క్రీస్తు మన పస్కా” అని కూడా పిలువబడ్డాడు. ఎందుకనగా క్రైస్తవులకొరకు అర్పించబడిన గొఱ్ఱెగా ఆయన బలియయ్యాడు. (1 కొరింథీయులు 5:7) పస్కా సంవత్సరమునకొక్కసారే నీసాను 14వ దినమున జరిగేది, (నిర్గమకాండము 12:6, 14; లేవీయకాండము 23:5) పస్కా ఎంత తరచుగా జ్ఞాపకం చేసికోబడిందో అంతే తరచుగా యేసు మరణం కూడా సాంవత్సరికంగానేగాని జ్ఞాపకం చేసుకోబడాలని అది సూచిస్తుంది. గాని రోజూ లేక వారంవారంకాదు.
శతాబ్దములవరకు క్రైస్తవులమని చెప్పుకొనిన ఎంతోమంది యేసు మరణమును సంవత్సరాని కొక్కసారే జ్ఞాపకం చేసుకున్నారు. నీసాను 14న దానిని చేశారు గనుకనే వారు క్వార్టోడిసమన్స్ అని పిలువబడ్డారు. అంటే “పధ్నాలుగవ రోజుకు సంబంధించిన వారని” అర్థం. చరిత్రకారుడైన జె. యల్. వాన్ మోషైమ్ వారిని గూర్చి ఇలా వ్రాశారు: “ఆసియా మైనరులోని క్రైస్తవులు, ఈ పరిశుద్ధ ఆచరణను అనగా ప్రభువురాత్రి భోజన ఆచరణతో ప్రారంభమైన యేసు మరణాన్ని, యూదులు పస్కాల్ గొర్రెపిల్లను భుజించే సమయాన్నే, అనగా మొదటి నెల [నీసాను] పధ్నాలుగవ రోజు సాయంకాలాన్నే ఆచరించే అలవాటు కల్గియుండిరి. క్రీస్తు మాదిరిని అనుసరించడాన్ని వారు ధర్మవిధిని ఆచరించడంగా భావించారు.
చిహ్నముల సూచన
యేసు “రొట్టెను ఎత్తికొని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దానిని విరిచెను” అని పౌలు చెప్పెను. పులుపు (లేక, ఈస్ట్) లేకుండా పిండి, నీరు కలిపి పెలపెల విరిగేలా కాల్చబడిన ఆ రొట్టె తినేందుకు అనుకూలంగా విరువబడింది. బైబిలు సూచనలో పులుపు, పాపానికి లేక క్షయతకు గుర్తు. జారుడైన వ్యక్తిని సంఘమునుండి వెలివేయండని కొరింథు క్రైస్తవులను పౌలు కోరినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “పులిసిన పిండి కొంచమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.” (1 కొరింథీయులు 5:6-8) కొంచెము పులిపిండి ముద్దంతటిని లేక రొట్టెలన్నిటిని ఎలా పాడుచేస్తుందో, సంఘమునుండి ఒక పాపసంబంధికుడైన వ్యక్తియొక్క ప్రభావాన్ని తీసివేయకుంటె సంఘము దేవుని దృష్టిలో అపవిత్రమౌతుంది. ఇశ్రాయేలీయులు పస్కా తరువాత పులియని రొట్టెల పండుగలో పులిసినదేనినైనా ఇండ్లలో లేకుండా చేసినట్లే, వారును తమ మధ్యనుండి “పులుపును” తీసివేయవలసి ఉండిరి.
జ్ఞాపకార్థపు పులియని రొట్టెను గూర్చి యేసు ఇలా చెప్పెను: “యిది మీ కొరకైన నా శరీరము.” (1 కొరింథీయులు 11:24) ఈ రొట్టె యేసు పరిపూర్ణ భౌతిక శరీరాన్ని సూచిస్తుంది. దీనినిగూర్చి పౌలు ఇలా వ్రాసెను: “కాబట్టి ఆయన (యేసు) ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు—బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులును నీ కిష్టమైనవికావు. అప్పుడు నేను—“ఈ గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని” . . . యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ ‘చిత్తమును’ బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.” (హెబ్రీయులు 10:5-10) యేసు మానవ శరీరం పాపరహితమైనదై, మానవజాతికి విమోచన క్రయధనంగా ఉపయోగించబడినది.—హెబ్రీయులు 7:26.
ఏదీ కలుపబడని స్వచ్ఛమైన ఎర్రని ద్రాక్షారసమును గూర్చి ప్రార్థించిన తరువాత యేసు: “యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన” అని చెప్పెను. (1 కొరింథీయులు 11:25) మరొక అనువాదము “యీ పాత్ర నా రక్తముచే స్థిరపరచబడిన క్రొత్తనిబంధన” అని చెబుతుంది. (మొఫత్) దేవునికి మరియు ఇశ్రాయేలు జనాంగమునకు మధ్యనున్న ధర్మశాస్త్ర నిబంధనను, అర్పించబడిన కోడెల మరియు మేకల రక్తము ఎట్లు స్థిరపరచిందో, అలాగే మరణమందు ధారపోయబడిన యేసు రక్తము క్రొత్త నిబంధనను స్థిరపరచింది. ఆ నిబంధననుగూర్చి ప్రస్తావించుటే ఆ జ్ఞాపకార్థ చిహ్నాలలో పాల్గొనేందుకు చట్టబద్ధంగా ఎవరు యోగ్యులో గుర్తించడానికి సహాయపడుతుంది.
ఎవరు పాలుపొందాలి?
క్రొత్త నిబంధనలోనున్న, యేసు అభిషక్త అనుచరులే జ్ఞాపకార్థ చిహ్నాలలో పాల్గొన్న యోగ్యులు. ఈ నిబంధన దేవునికి ఆత్మీయ ఇశ్రాయేలీయులకు మధ్య ఏర్పడినది. (యిర్మీయా 31:31-34; గలతీయులు 6:16) అయినా, ఈ క్రొత్త నిబంధన చివరకు విధేయులైన మానవజాతియంతటికి ఆశీర్వాదములు తెస్తుంది. ఈ ఆశీర్వాదములను నీవునూ పొందవచ్చును.
జ్ఞాపకార్థ చిహ్నాలలో పాల్గొనువారు రాజ్యమునుగూర్చి యేసు చేసిన వ్యక్తిగత నిబంధనలోనూ ఉండవలెను. ఈ భోజనమును ప్రారంభించేటప్పుడు, నమ్మకస్థులైన తన అపొస్తలులతో యేసు ఇలా చెప్పెను: “నా తండ్రి నాతో నిబంధన చేసినట్లుగా, రాజ్యము కొరకు నేను మీతో నిబంధనచేయుచున్నాను.” (లూకా 22:29, NW) దేవుడు రాజైన దావీదుతో చేసిన రాజ్య నిబంధన భవిష్యత్తులో పరలోక రాజ్యమందు నిరంతరము పాలించబోయేవానిని సూచిస్తుంది. ఆయన యేసు. యేసుతోపాటు ఆయన పరిపాలనలో వంతు కలిగియుండే 1,44,000 మంది ఆత్మీయ ఇశ్రాయేలీయులు పరలోక సీయోను పర్వతముపై గొర్రెపిల్లయైన యేసుతోపాటు నిలబడియున్నట్లు వర్ణించబడ్డారు. పునరుత్థానమైన తరువాత వారు క్రీస్తుతోపాటు సహరాజులుగా, యాజకులుగా పరిపాలిస్తారు. (2 సమూయేలు 7:11-16; ప్రకటన 7:4; 14:1-4; 20:6) కేవలం క్రొత్త నిబంధనలో భాగమైయున్నవారు, యేసుతో వ్యక్తిగత నిబంధనలో ఉన్నవారు మాత్రమే ప్రభువురాత్రి భోజన చిహ్నములలో న్యాయసమ్మతంగా పాల్గొంటారు.
దేవుని ఆత్మే, అభిషక్తులైనవారి ఆత్మతో వారు ఆయన పిల్లలని క్రీస్తుతోపాటు సహవారసులని సాక్ష్యమిచ్చును. “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల క్రీస్తుతోడి వారసులము.” (రోమీయులు 8:16, 17) దేవుని పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తియే అభిషక్తులైనవారిలో పరలోక జీవితమునకు సంబంధించిన అసాధారణ కోరికను కల్గిస్తుంది. పరలోక జీవితాన్నిగూర్చి లేఖనాలు చెప్పేవన్నీ తమకే చెప్పబడుతున్నట్లు దృష్టించి, మానవజీవితం, కుటుంబ సభ్యులతోపాటు భూసంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టడానికి వారు సిద్ధంగా ఉంటారు. పరదైసు భూమిపై జీవితం అద్భుతకరమైనదైనప్పటికీ వారికి ఆ నిరీక్షణ ఉండదు. (లూకా 23:43) అబద్ధమత దృక్పథములపై ఆధారపడనట్టి కచ్చితమైన మరియు నిశ్చలమైన పరలోక నిరీక్షణ వారిని జ్ఞాపకార్థ చిహ్నాలలో పాల్గొనేలా చేస్తుంది.
ఒకవ్యక్తి తనకు అటువంటి పిలుపు లేకుండానే తనకై తాను పరలోక రాజుగా, యాజకునిగా చాటుకంటే యెహోవా దానియందు అసంతోషపడును. (రోమీయులు 9:16; ప్రకటన 22:5) అహంకారముతో యాజకత్వమును కోరినందుకు దేవుడు కోరహుకు మరణ దండన విధించెను. (నిర్గమకాండము 28:1; సంఖ్యాకాండము 16:4-11, 31-35) అయితే, బలమైన భావోద్రేకములు లేక గతమందలి మత అభిప్రాయములు ఒకవ్యక్తి తప్పుగా జ్ఞాపకార్థ చిహ్నములలో పాలుపొందేలా చేస్తే పరిస్థితేమిటి? అలాంటప్పుడు అతను లేక ఆమె అలా పాలుపొందడం మానుకొని దేవుని క్షమాపణకొరకు ప్రార్థించవలెను.—కీర్తన 19:13.
నీపై ఎలాంటి ప్రభావమును కలిగివుంది
యేసు విమోచన క్రయధన బలివలన ప్రయోజనము పొంది, భూమిపై నిత్యజీవము పొందాలంటే ఒకవ్యక్తి జ్ఞాపకార్థ చిహ్నాలలో భాగం వహించనవసరం లేదు. ఉదాహరణకు, దేవునియందు భయభక్తులుగల అబ్రాహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, బోయజు, రూతు, దావీదు ఎప్పటికైనా ఈ చిహ్నాలలో పాలుపుచ్చుకుంటారని బైబిలు ఏ విధంగాను సూచించుట లేదు. అయితే వారితోపాటు ఈ భూమిపై నిరంతర జీవితమును ఆశించు ఇతరులు దేవునియందు, క్రీస్తునందు, యెహోవాయొక్క యేసు విమోచన క్రయధన బలి ఏర్పాటునందు విశ్వాసమును కనపర్చాల్సిందే. (యోహాను 3:36; 14:1) క్రీస్తు మరణమును గూర్చిన ఆ సాంవత్సరిక ఆచరణ ఆ గొప్ప బలిని జ్ఞాపకం చేసేదైయుంది.
అపొస్తలుడైన యోహాను: “మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు” అని చెప్పినప్పుడు యేసు బలియొక్క ఆ ప్రాముఖ్యత చూపబడింది. (1 యోహాను 2:1, 2) యేసు వారి “పాపములకు శాంతికరమై (ప్రాయశ్చీత్తమై) యున్నాడు” అని అభిషక్త క్రైస్తవులు చెప్పగలరు. అయినను, ఆయన సర్వలోకపు పాపములకు ప్రాయశ్చిత్తమైయుండి, ఇప్పుడు బహు సమీపముగానున్న పరదైసు భూమిపై విధేయులైన మానవులందరికి, నిత్యజీవమును ప్రసాదిస్తాడు.
క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరగుట ద్వారా ఆలోచనాత్మకమైన బైబిలు ప్రసంగమునుండి మీరు ప్రయోజనము పొందుతారు. యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు మనకొరకు ఎంత చేసియున్నారో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు, క్రీస్తు, మరియు యేసు విమోచన క్రయధన బలియెడల ప్రగాఢమైన గౌరవమున్న వారితో కూడుకొనుట ఆత్మీయంగా దీవెనకరము కాగలదు. ఆ విధంగా హాజరవటం, నిత్యజీవానికి నడిపే దేవుని మితిలేని కృపను పొందాలనే మీ కోరికను బలపరచవచ్చును. ఏప్రిల్ 6, 1993 సూర్యాస్తమయము తరువాత యేసుక్రీస్తు మరణమును జ్ఞాపకం చేసికోవడానికి యెహోవాసాక్షులతో కలవమని మేము మిమ్ముల హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకనగా ప్రభువు రాత్రి భోజనము మీకు గొప్ప భావమును కలిగియుండగలదు.”