యెహోవా బహుగా క్షమించును
“భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవావైపు తిరిగినయెడల, . . . ఆయన బహుగా క్షమించును.”—యెషయా 55:7.
1. యెహోవా క్షమాపణ లభించినవారు ఇప్పుడు దేనితో ఆశీర్వదించబడిరి?
పశ్చాత్తాపముచూపు తప్పిదస్ధులను యెహోవా క్షమించును, మరియు వారు ఆత్మీయ పరదైసులో మనశ్శాంతిననుభవించునట్లు ఆయనిప్పుడు చేస్తున్నాడు. ఎందుకనగా వారు ఈ కట్టడలకు కట్టుబడియుంటున్నారు: “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను; వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును, వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును.”—యెషయా 55:6, 7.
2. (ఎ) యెషయా 55:6, 7లో చెప్పబడినట్లు, ‘యెహోవాను వెదకుట, ఆయనవైపు తిరుగుట’ అను దాని భావమేమి? (బి) బబులోను చెరలో నుండిన యూదులు ఎందుకు యెహోవావైపు తిరుగవలసియున్నది, వారిలో కొందరికేమి సంభవించెను?
2 “యెహోవాను వెదకి,” అంగీకారయుక్తంగా ఆయనకు ప్రార్థన చేయుటకు, దుష్టుడైన వ్యక్తి తన చెడుమార్గమును, ఇతరులకు హానిచేయు ఎటువంటి తలంపునైనా విసర్జించాలి. “యెహోవావైపు తిరుగు” అవసరత ఉందంటే ఒకప్పుడు తాను సన్నిహిత సంబంధమును కలిగియున్న దేవున్ని ఆ తప్పిదస్థుడు విడిచిపెట్టాడని అది సూచిస్తుంది. యూదయ నివాసుల విషయంలో జరిగినదదే. దేవునియెడల చూపిన అవిశ్వాస్యత చివరకు వారు బబులోను చెరకు వెళ్లునట్లు చేసింది. బబులోను చెరకు వెళ్లుటకు, ప్రవచింపబడినట్లు వారి స్వదేశము 70 సంవత్సరాలు పాడుబడియుండుటకు కారణమైన వారి దుష్క్రియల విషయంలో పశ్చాత్తాపపడినవారై ఆ చెరపట్టబడిన యూదులు యెహోవావైపు తిరుగవలసి ఉండిరి. దైవభక్తిగల యూదుల శేషము ప్రభుత్వ శాసనముచే బబులోనునుండి విడిపింపబడి సా.శ.పూ. 537లో తిరిగి ఆ దేశమును స్వతంత్రిచుకొన్నారు. (ఎజ్రా 1:1-8; దానియేలు 9:1-4) ఆ పునరుద్ధరణ ప్రభావములు ఎంత గొప్పగా ఉండెనంటే యూదా దేశము ఏదెనువంటి పరదైసుతో పోల్చబడెను.—యెహెజ్కేలు 36:33-36.
3. ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము ఎట్లు చెరనుండి యూదాకు తిరిగి వచ్చిన దైవభక్తిగల వారిని పోలిన అనుభవమును కలిగియుండిరి?
3 బబులోను చెర తరువాత యూదాకు తిరిగివచ్చిన దైవభక్తిగల యూదుల అనుభవానికి పోలిన అనుభవాన్నే ఆత్మీయ ఇశ్రాయేలీయులు కలిగియుండిరి. (గలతీయులు 6:16) మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము తమ విధానమందును, తలంపులందును కొంత మార్పుచేసుకున్నారు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు మహాబబులోను చెరలో దేవుని అనుగ్రహము పూర్తిగాలేని స్థితినుండి వారికి 1919లో విడుదల లభించెను. మనుష్యుల భయము, యెహోవా సేవలో కార్యహీనతవంటి పాపముల విషయమై వారు పశ్చాత్తాపము చూపినందున, మహాబబులోను నుండి ఆయన వారిని విడిపించి వారిని తిరిగి సరియైన ఆత్మీయ స్థితికి తీసుకువచ్చి, రాజ్య వర్తమానమును ప్రకటించుటకు మరలా ఉపయోగింప నారంభించెను. అప్పటినుండి దేవుని ప్రజలమధ్య ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత వచ్చులాగున, ఆత్మీయ పరదైసు విలసిల్లెను. (యెషయా 55:8-13) ప్రాచీనకాల మాదిరి, ఆధునిక-దిన సాదృశ్యములను బట్టి ఆశీర్వాదములు దైవిక క్షమాపణ తదుపరి వచ్చునని, నిజముగా పశ్చాత్తాపము చూపిన వారిని యెహోవా బహుగా క్షమించునని తేటతెల్లమగుచున్నది.
4. యెహోవా సేవకులు కొంతమంది ఎటువంటి భయము కలిగియున్నారు?
4 కాబట్టి ప్రస్తుత-దిన యెహోవా సేవకులు ఆయన క్షమాపణయందు నమ్మిక యుంచగలరు. అయినను, కొంతమంది గతములో తాము చేసిన తప్పిదముల విషయమై నిరాశచెంది, కృంగదీయునంతగా తమలో ఆ దోష భావములను కలిగియున్నారు. ఆత్మీయ పరదైసునందు నివసించు అర్హత తమకులేదని వారు భావిస్తారు. కొందరైతే, పాపక్షమాపణలేని తప్పిదాన్ని తాము చేశామని, యెహోవా క్షమాపణ తమకెన్నటికిని లభించదని భయపడుతుంటారు. అలా జరుగునా?
కొన్ని పాపములకు పాపక్షమాపణ లేదు
5. కొన్ని పాపములకు క్షమాపణ లేదని ఎందుకు చెప్పవచ్చును?
5 కొన్ని పాపములు క్షమించరానివే. యేసుక్రీస్తు ఇలా చెప్పెను: “మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.” (మత్తయి 12:31) కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మకు లేకు చురుకైన శక్తికి వ్యతిరేకముగాచేయు దూషణకు పాపక్షమాపణ లేదు. అటువంటి పాపము గూర్చి సూచనప్రాయముగా తెల్పుచూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒకసారి వెలిగింపబడి, . . . తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము.”—హెబ్రీయులు 6:4-6.
6. ఒక పాపము క్షమించబడునా, లేదాయని ఏది తీర్మానించును?
6 ఒకవ్యక్తి క్షమించరాని పాపము చేశాడా అనేది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఏమైనా, పౌలు ఈ విషయముపై కొంత అవగాహననిస్తూ ఇలా వ్రాశాడు: “మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, . . . ఉండును. (హెబ్రీయులు 10:26, 27) కావాలనిచేయు వ్యక్తి ఉద్దేశపూర్వకముగా, లేదా “మొండిగా, తరచు పెడత్రోవపట్టిన స్వార్థబుద్ధితో” ప్రవర్తించువాడై యుండును. (వెబ్‌స్టర్స్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ) సత్యము నేర్చుకొనిన తర్వాత బుద్ధిపూర్వకముగా, మొండిగా ఎడతెగక తప్పిదము నభ్యసించే ఏ వ్యక్తి క్షమించబడడు. కావున, ఎంత పాపము చేశాడనేది కాదుగాని, బుద్ధిపూర్వకముగా ఎంతమేరకు చేశాడను హృదయస్థితినిబట్టి, ఆ పాపము క్షమించబడేదా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. మరోవైపున, దోషియైయున్న క్రైస్తవుడు తానుచేసిన తప్పిదాన్ని గూర్చి మిక్కిలి కలతచెందుతున్నట్లయితే అప్పుడు సంగతేమి? అతనికున్న కలతనుబట్టి, వాస్తవానికి అతడు క్షమించరాని పాపం చేయలేదని బహుశ సూచించవచ్చును.
వారి పాపములు క్షమించరానివి
7. యేసును వ్యతిరేకించిన కొంతమంది మతనాయకులు క్షమించరాని పాపము చేసిరని మనమెందుకు చెప్పగలము?
7 యేసును వ్యతిరేకించిన కొంతమంది యూదామత మతనాయకులు ఉద్దేశపూర్వకముగా ప్రవర్తించినందున, వారి పాపము క్షమించరానిది. యేసు మేలు చేస్తూ, అద్భుతక్రియలు చేయుటనుబట్టి, ఆయన మూలముగా పరిశుద్ధాత్మ పనిచేయడాన్ని చూసికూడా, ఆ మతనాయకులు బయెల్జెబూలు, లేక అపవాదియగు సాతాను శక్తితో వాటిని ఆయన చేసెనని ఆరోపించారు. నిరాకరింపరాని దేవుని ఆత్మ క్రియను సంపూర్తిగా చూసికూడా వారు పాపం చేశారు. ఆ విధముగా, వారు క్షమించరాని పాపము చేసిరి. అందుకే యేసు ఇట్లనెను: “పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.”—మత్తయి 12:22-32.
8. ఇస్కరియోతు యూదా చేసిన పాపము ఎందుకు క్షమించరానిది?
8 ఇస్కరియోతు యూదా చేసిన పాపముకూడా క్షమించరానిది. వేషధారణ, మోసంతో చివరకతడు ఇష్టంతో, బుద్ధిపూర్వకంగా యేసును అప్పగించెను. ఉదాహరణకు, యేసును మరియ మిక్కిలి విలువగల తైలముతో అభిషేకించుటను యూదా చూచినప్పుడు, అతనిట్లడిగెను: “యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు?” అపొస్తలుడైన యోహాను ఇంకా ఇట్లనెను: “వాడీలాగు [యూదా] చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.” ఆ తర్వాత, కొద్దిదినములకే, యూదా 30 వెండి నాణెములకు యేసును అప్పగించెను. (యోహాను 12:1-6; మత్తయి 26:6-16) నిజమే, యూదా మనస్సులో నొచ్చుకొని ఆ తర్వాత ఆత్మహత్య చేసికొనెను. (మత్తయి 27:1-5) అయితే అతడు చేసిన పాపము ఉద్దేశపూర్వకమైనదై, మొండిగా స్వార్థంతోకూడినది మరియు అతని విశ్వాసఘాతక చర్య పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన పాపమును సూచిస్తున్నందున అతడు క్షమించబడలేదు. కావున యేసు యూదాను “నాశన పుత్రుడని” పిలుచుట ఎంత సరియైనది!—యోహాను 17:12; మార్కు 3:29; 14:21.
వారి పాపములు క్షమించబడెను
9. బత్షెబ సంబంధముగా దావీదు చేసిన పాపములను దేవుడెందుకు క్షమించెను?
9 దేవుడు క్షమించిన అపరాధములు ఉద్దేశపూర్వకముగా చేసిన పాపములకు పూర్తిగా భిన్నమైన రీతిలో ఉన్నవి. ఉదాహరణకు ఇశ్రాయేలు రాజైన దావీదు విషయమే తీసుకోండి. ఆయన ఊరియా భార్యయైన బత్షెబతో వ్యభిచరించి, ఆ తర్వాత యుద్ధమందు ఊరియా హతుడగునట్లు యోవాబుతో కుట్రపన్నెను. (2 సమూయేలు 11:1-27) దావీదుయెడల దేవుడెందుకు కనికరము చూపెను? ప్రాముఖ్యముగా రాజ్యనిబంధన కారణంగా, దావీదుకున్న స్వంత కనికర మనస్సు మరియు ఆయన నిజమైన పశ్చాత్తాపము చూపినందున క్షమించబడెను.—1 సమూయేలు 24:4-7; 2 సమూయేలు 7:12; 12:13.
10. పేతురు గంభీరమైన పాపము జరిగించినను, దేవుడాయనను ఎందుకు క్షమించాడు?
10 అపొస్తలుడైన పేతురు విషయం కూడా పరిశీలించండి. యేసును ఆయన పదేపదే నిరాకరించుచు గంభీరమైన పాపము చేశాడు. దేవుడెందుకు పేతురును క్షమించాడు? ఇస్కరియోతు యూదావలెగాక పేతురు దేవుని మరియు క్రీస్తు సేవలో నమ్మకస్థునిగా ఉండెను. ఈ అపొస్తలుడు శరీర బలహీనత కారణముగా పాపము చేశాడు, మరియు ఆయన నిజమైన పశ్చాత్తాపము చూపినవాడై “సంతాపపడి యేడ్చెను.”—మత్తయి 26:69-75.
11. “పశ్చాత్తాపమును” నీవెట్లు నిర్వచిస్తావు, ఒక వ్యక్తి నిజముగా పశ్చాతాప పడినట్లయిన అతడేమి చేయవలెను?
11 పైన పేర్కొనిన ఉదాహరణలను ఒకవ్యక్తి గంభీరమైన పాపములు చేసినను, అతడు యెహోవా దేవుని క్షమాపణను సంపాదించగలడని చూపిస్తున్నవి. అయితే క్షమించబడుటకు ఎటువంటి మనోభావం అవసరం? అపరాధం చేసిన క్రైస్తవుడు దేవునిచే క్షమించబడాలంటే నిజమైన పశ్చాత్తాపము ఆవశ్యకము. పశ్చాత్తాపపడుట అనగా “గత తప్పిదముల విషయమై పరితపించి పాపమునుండి వైదొలగుట” లేదా “తాను చేసిన లేక చేయుటకు తప్పిపోయిన విషయములో అనుతాపము చెందుట లేదా దుఃఖపడుట” అని భావము. (వెబెస్టర్స్ థర్ట్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ) నిజముగా పశ్చాత్తపపడిన వ్యక్తి తాను చేసిన పాపము యెహోవా నామము, ఆయన సంస్థపై తీసుకువచ్చిన ఏ విధమైన నింద, దుఃఖము, సమస్యల విషయమైనా నొచ్చుకొంటున్నట్లు చూపించును. ఆలాగే పశ్చాత్తాపపడి దోషి తత్సంబంధమైన ఫలాలు ఫలించుచు, పశ్చాత్తాపమునకు తగిన క్రియలను చేయువాడై యుండును. (మత్తయి 3:8; అపొస్తలులు కార్యములు 26:20) ఉదాహరణకు, ఆయన ఎవరినైనా మోసగించినట్లయితే, జరిగిన నష్టాన్ని పూడ్చుటకు అతడు సహేతుకమైన చర్యలు గైకొనను. (లూకా 19:8) ఆ విధముగా పశ్చాత్తాపపడు క్రైస్తవుడు, యెహోవా బహుగా క్షమించునని నమ్మిక కలిగియుండుటకు విలువైన లేఖన కారణములను కలిగియున్నాడు. అవేమిటి?
దేవుని క్షమాపణయందు నమ్మికయుంచుటకు కారణములు
12. దేని ఆధారముగా పశ్చాత్తాపమునొందు వ్యక్తి క్షమాపణ కొరకు ప్రార్థించగలడని కీర్తన 25:11 సూచిస్తున్నది?
12 పశ్చాత్తాపపడిన తప్పిదస్థుడు యెహోవా నామమునుబట్టి క్షమాపణ కొరకు మనోనమ్మకముతో ప్రార్థించవచ్చును. దావీదు ఇలా యాచించెను: “యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.” (కీర్తన 25:11) దేవుని నామముపై తప్పిదస్థుడు తీసుకువచ్చిన ఎటువంటి నింద విషయములోనైనా, పశ్చాత్తాపముతో కూడిన అటువంటి ప్రార్థన, భవిష్యత్తులో ఘోరమైన పాపము చేయకుండా ఆపుజేయునదిగా కూడ పనిచేయవలెను.
13. దైవ క్షమాపణయందు ప్రార్థన ఏ పాత్ర వహించగలదు?
13 తప్పుచేసినను, పశ్చాత్తాపము చూపు తన సేవకుల హృదయపూర్వక ప్రార్థనలకు యెహోవా దేవుడు జవాబిచ్చును. ఉదాహరణకు, బత్షెబ సంబంధముగా తాను చేసిన ఘోర పాపములను గ్రహించినవాడై, హృదయపూర్వకముగా ప్రార్థించిన దావీదు ప్రార్థనలను యెహోవా అలక్ష్యము చేయలేదు. నిజానికి, కీర్తన 51లోని దావీదు మాటలు అనేక విన్నపములుగల భావాలను వ్యక్తముచేసినవి. ఆయనిట్లు యాచించాడు: “దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.”—కీర్తన 51:1, 2, 17.
14. యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచు వారిని దేవుడు క్షమించునని లేఖనములెట్లు అభయమిస్తున్నవి?
14 యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచు వారిని దేవుడు క్షమించును. పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని కృపా మహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.” (ఎఫెసీయులు 1:7) అదే భావముతో అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీరు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.”—1 యోహాను 2:1, 2.
15. సదా దేవుని కృపననుభవించవలెనంటే, పశ్చాత్తాపపడిన పాపి ఏమి చేయవలెను?
15 తాను క్షమింపబడగలడనే నమ్మకానికి యెహోవా కనికరము పశ్చాత్తాపపడిన తప్పిదస్థునికి ఒక ఆధారము నిచ్చుచున్నది. నెహెమ్యా ఇట్లు చెప్పాడు: “నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడవునై” యున్నావు. (నెహెమ్యా 9:17; నిర్గమకాండము 34:6, 7 పోల్చుము.) అవును దైవిక కనికరము ననుభవించాలంటే, ఆ పాపి దేవుని నియమానికి హత్తుకొనియుండుటకు కృషిచేయాలి. దావీదు చెప్పినట్లుగా, “నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.”—కీర్తన 119:77, 156.
16. దేవుడు మన పాప పరిస్థితిని లెక్కలోనికి తీసుకొనునను వాస్తవమందు ఏ ఓదార్పు కలదు?
16 మన పాప పరిస్థితిని యెహోవా అర్థము చేసికొనుననేగాకుండా, పశ్చాత్తాపము చూపిన తప్పిదస్థునికి ఓదార్పునిచ్చి, దేవుడాయనను క్షమించునను నమ్మకముతో ప్రార్థించుటకు హేతువు నిచ్చును. (కీర్తన 51:5; రోమీయులు 5:12) “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు; మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమికంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనయందు భయభక్తులు గల వారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంతదూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు, యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడని” ప్రకటించినప్పుడు కీర్తన రచయితయగు దావీదు ఓదార్పుకరమైన అభయమిచ్చాడు. (కీర్తన 103:10-14) అవును, మన పరలోకపు తండ్రి మానవ తలిదండ్రులకంటె మరెంతో కృపాకనికరములు గలవాడు.
17. గతమందు ఒకవ్యక్తి దేవునికి చేసిన నమ్మకమైన సేవ క్షమాపణపై ఎటువంటి ప్రభావము చూపును?
17 గతమందు తానుచేసిన నమ్మకమైన సేవను యెహోవా మరచిపోడను నమ్మకముతో పశ్చాత్తాపపడిన పాపి క్షమాపణ కొరకు ప్రార్థించవచ్చును. నెహెమ్యా తానుచేసిన పాపము కొరకు క్షమాపణనుగ్రహించమని విన్నవించుటలేదు, అయితే ఆయనిట్లనెను: “నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.” (నెహెమ్యా 13:31) “మీరు . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అను మాటలయందు పశ్చాత్తపపడిన క్రైస్తవుడు ఓదార్పునొందగలడు.—హెబ్రీయులు 6:10.
పెద్దల ద్వారా సహాయము
18. ఒక క్రైస్తవుని పాపము అతనిని ఆత్మీయ రోగిని చేసినట్లయిన, ఏమి చేయవచ్చును?
18 ఆత్మీయ పరదైసునందు నిలిచియుండుటకు తాను అనర్హుడని ఒక క్రైస్తవుడు భావించినట్లయిన లేదా ఆయనచేసిన పాపము ఆయనను ఆత్మీయ రోగిగా చేసినందున ఆయన ప్రార్థించలేకపోయినట్లయిన అప్పుడేమి? శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిన స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.” అవును, పశ్చాత్తాపము చూపిన తోటి విశ్వాసిని తిరిగి ఆత్మీయ ఆరోగ్యమునకు పునరుద్ధరించు ఆశతో సంఘపెద్దలు ఆయనతోపాటు, ఆయన కొరకు దీవెనకరముగా ప్రార్థించగలరు.—యాకోబు 5:14-16.
19. ఒక వ్యక్తి బహిష్కరింపబడినట్లయిన, క్షమించబడి తిరిగి సంఘములో చేర్చుకొనబడుటకు అతడేమి చేయవలెను?
19 న్యాయనిర్ణయ సభ పశ్చాత్తాపము చూపని పాపిని బహిష్కరించినను, అతడు క్షమించరాని పాపము చేశాడని దాని భావము కాదు. అయితే, క్షమింపబడి తిరిగి సంఘములో చేర్చుకొనబడుటకు, అతడు వినయముతో దేవుని నియమాలకు లోబడి, మారుమనస్సుకు తగిన క్రియలు చేయుచు, సంఘములో తనను తిరిగి చేర్చుకొమ్మని పెద్దలకు వ్రాతపూర్వకముగా తెలియజేయవలెను. వ్యభిచరించిన ఒకనిని ప్రాచీన కొరింథు సంఘమునుండి బహిష్కరించిన తర్వాత, పౌలు ఇలా వ్రాశాడు: “అట్టివానికి మీలో ఎక్కువమంది వలన కలిగిన యీ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వానియెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”—2 కొరింథీయులు 2:6-8; 1 కొరింథీయులు 5:1-13.
దేవుడే బలము ననుగ్రహిస్తాడు
20, 21. క్షమించరాని పాపము చేయుటను గూర్చి వ్యాకులత ననుభవిస్తున్న వ్యక్తికి ఏది సహాయం చేయును?
20 చేసిన క్షమించరాని పాపమును గూర్చిన వ్యాకులతకు ఒకవేళ అనారోగ్యము లేదా కృంగుదల వంటివి కారణమైనట్లయిన, తగినంతగా విశ్రాంతి తీసికొనుట, నిద్రపోవుట సహాయకరముగా ఉండును. అయితే, ప్రత్యేకముగా నీవు పేతురు మాటలను గుర్తుతెచ్చుకొనవలెను: “ఆయన [దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” సాతాను మిమ్మును నిరుత్సాహపరచుటకు ఎన్నటికిని అనుమతించకుము, ఏలయనగా పేతురు ఇంకను ఇట్లనుచున్నాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.—1 పేతురు 5:6-10.
21 మనస్సులో నొచ్చుకునుచున్నను, క్షమించరాని పాపము చేసిన దోషినని మీరు భయపడుచున్నట్లయిన, దేవుని మార్గములు జ్ఞానయుక్తమైనవి, న్యాయమైనవి, ప్రేమగలవను సంగతి మర్చిపోకండి. కావున, విశ్వాసముతో ఆయనకు ప్రార్థించుము. “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా ఆయన దయచేయుచున్న ఆత్మీయాహారమును ఎడతెగక స్వీకరించుము. (మత్తయి 24:45-47) తోటి విశ్వాసులతో సహవాసముచేయుచు, క్రైస్తవ పరిచర్యలో క్రమముగా భాగము వహించుము. ఇది మిమ్ములను బలపరచి, దేవుడు మీ పాపమును క్షమించలేదేమోనన్న ఎటువంటి భయమునుండైనను మిమ్మును విడిపించును.
22. తదుపరి మనం దేనిని పరిశీలిస్తాం?
22 ఆత్మీయ పరదైసు నివాసులు యెహోవా బహుగా క్షమించునను జ్ఞానమందు ఓదార్పుననుభవించగలరు. అయినను, నేడు వారి జీవితము పరీక్షలు లేకుండా ఏమిలేదు. తాము ప్రేమించిన వ్యక్తి మరణించిన లేదా సన్నిహిత స్నేహితుడు జబ్బు పడిన కారణముగా వారు బహుశ మనస్సు కృంగివారైయుండవచ్చు. వీటిలోను, మరి ఇతర పరిస్థితులలోను మనము చూడబోవునట్లు, యెహోవా సహాయము చేయుచు తన పరిశుద్ధాత్మ మూలముగా తన ప్రజలను నడిపించును.
మీ జవాబులేమై యున్నవి?
◻ ‘యెహోవా బహుగా క్షమించుననుటకు’ ఏ రుజువు కలదు?
◻ ఎటువంటి పాపమునకు క్షమాపణ లేదు?
◻ ఎటువంటి పరిస్థితులలో ఒకని పాపములు క్షమించబడును?
◻ పశ్చాత్తాపపడు పాపులు దేవుని క్షమాపణయందు ఎందుకు నమ్మికయుంచగలరు?
◻ పశ్చాత్తాపపడు తప్పిదస్థులకు ఏ సహాయము అందుబాటులో ఉంది?
[10వ పేజీలోని చిత్రం]
దావీదు, పేతురు క్షమించబడి ఇస్కరియోతు యూదా ఎందుకు క్షమించబడలేదో మీకు తెలుసా?
[12వ పేజీలోని చిత్రం]
సంఘ పెద్దల సహాయము ఒక క్రైస్తవుని ఆత్మీయతకు ఎంతగానో దోహదపడును