జ్ఞాపకార్థ సమయములో ‘మనమేమై యున్నామో విమర్శించుకొనుట’
“మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పుపొందక పోదుము. . .శిక్షావిధి కలుగకుండునట్లు చూచుకొందుము.”—1 కొరింథీయులు 11:31, 32.
1. నిజమైన క్రైస్తవులు దేనిని తొలగించుగొన గోరుదురు, మరియు ఎందుకు?
క్రైస్తవుడు కోరుకొనని అరుదైన సంగతేమనగా యెహోవాచేత ఖండించబడిన తీర్పుపొందటము. “సర్వలోకమునకు తీర్చుతీర్చు వానిని” అసంతోషపరచుట “లోకముతో పాటు శిక్షావిధి కలుగుటకు” నడిపి రక్షణను పోగొట్టునట్లు చేయగలదు. యేసుతోపాటు పరలోక జీవితమును నిరీక్షించినను లేక భూపరదైసులో నిరంతర జీవితమును నిరీక్షించినను ఇది వాస్తవమైయున్నది.—ఆదికాండము 18:25; 1 కొరింథీయులు 11:32.
2, 3. ఏవిషయమునందు మనము ఖండింపబడిన తీర్పు పొందవచ్చును, మరియు దీనిని గూర్చి పౌలు ఏమి చెప్పెను?
2 మొదటి కొరింథీయులు 11వ అధ్యాయములో, మనము తీర్పులోకివచ్చు ఒక ప్రాంతమునుగూర్చి పౌలు చూపియున్నాడు. తన మాటలను ఆయన అభిషక్త క్రైస్తవులకు ఉద్దేశించినను, ఆయన ఉపదేశము ప్రత్యేకంగా ఈ సమయములో అందరికి ప్రాముఖ్యము. మనము ఏమైయున్నామో విమర్శించుకొనుటయనునది దేవుని అంగీకారమును పొంది ఆయన తీర్పులోనికి రాకుండునట్లు మనకు సహాయపడగలదు. ప్రభువురాత్రి భోజన సాంవత్సరిక ఆచరణను చర్చించుచు పౌలు ఇట్లు వ్రాసెను:
3 “ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి—యిది మీ కొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని—యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునపుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునపుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.”—1 కొరింథీయులు 11:23-26.a
4. 1991 మార్చి 30 సాయంకాలమున ఏమి జరుగును?
4 1991 మార్చి 30, సూర్యాస్తమయము తరువాత యెహోవాసాక్షులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థమును ఆచరించుదురు. సాధారణముగా సమకూడు గుంపు ఒక సంఘమైమాత్రమే యుందురు; తద్వారా ఇంకా యెహోవాసాక్షులు కానివారు కూడ కూడుటకు స్థలముండును. ఆ కూటము ఏ విధముగా ఉండును? అందు ఒక బైబిలు ప్రసంగముండును. అటు తరువాత ప్రార్థనచేసి రొట్టెను అందింతురు. మరొక ప్రార్థనచేసి పాత్రను అందింతురు. ఆచారబద్ధమైన పద్ధతివలె కాక లేక ఖచ్చితమైన ఒక విధానమనే కాక ఉపయోగించబడు రొట్టెల సంఖ్య, మరియు పాత్రలు మరియు అందించబడు పద్ధతి ప్రాంతీయ పరిస్థితికి తగినట్లు ఏర్పాటుచేసికొనవచ్చును. ముఖ్యమైన విషయమేమనగా హాజరైయున్నవారిలో ఎక్కువమంది వాటిలో పాలుపొందక పోయినను పంచబడునవి హాజరైయున్న వారందరికి అందించబడులాగున చూడవలెను. అయితే పంచునవి ఏమైయుండవచ్చును, వాటి భావమేమి? అంతేగాక, మనకైమనము ఏమైయున్నామో విమర్శించుకొనుటకు ముందుగానే మనము దేనిని పరిశీలించవలెను?
“ఇది నా శరీరము”
5, 6. (ఎ) రొట్టెను తీసుకొని యేసు ఏమి చేసెను? (బి) ఎటువంటి రొట్టెను ఆయన ఉపయోగించెను?
5 జ్ఞాపకార్థమునుగూర్చి పౌలు “ప్రభువు వలన పొందిన” దానిని మనము చదివియున్నాము. ముగ్గురు సువార్తవ్రాతగాళ్ల వృత్తాంతములు కూడ ఉన్నవి. వీరిలో ఒకరు యేసు ఈ ఆచరణను ప్రారంభించినప్పుడు అక్కడే యున్నాడు. (1 కొరింథీయులు 11:23; మత్తయి 26:26-29; మార్కు 14:22-25; లూకా 22:19, 20) యేసు మొదట రొట్టెను తీసికొని, ప్రార్థనచేసి, దానిని విరిచి వారికిచ్చినట్లు ఈ వృత్తాంతములు చెప్పుచున్నవి. ఆ రొట్టె ఏమైయుండెను? దానికి సరియైన రీతిగా నేడు ఏమి ఉపయోగించబడుచున్నది? దాని భావము లేక సూచన ఏమి?
6 యూదా పస్కా భోజనములోని పదార్దములే వారికి అందుబాటులో ఉన్నవి. వాటిలో ఒకటి మోషే పిలిచినట్టి “బాధను స్మరణకు తెచ్చు పొంగని రొట్టె.” (ద్వితీయోపదేశకాండము 16:3; నిర్గమకాండము 12:8) ఈ రొట్టె గోధుమ పిండితో ఏ విధమైన పులుపు, ఉప్పు, లేక రుచులు కలుపబడకుండ చేయబడినది. పులియనటువంటిదై (హెబ్రీ, మాట్స్.ట్సా’) అది చదునుగా ఉండి సులభముగా ఇరుగునట్టిది; తినుటకు అనువైన పరిమాణములో దానిని త్రుంచవలసియుండెను.—మార్కు 6:41; 8:6; అపొస్తలుల కార్యములు 27:35.
7. రొట్టెకొరకు జ్ఞాపకార్థ సమయమందు యెహోవాసాక్షులు దేనిని వాడుదురు?
7 ప్రభువు రాత్రి భోజనమందు యేసు పులియని రొట్టెను ఉపయోగించినట్లే ఈనాడు యెహోవాసాక్షులు చేయుదురు. క్రమముగా వాడు యూదా మట్జోత్ (ఒక విధమైన రొట్టె) మాల్ట్, ఉల్లిపాయలు, గ్రుడ్లు మొదలగునవి కలుపబడకుండ చేయబడినట్లయిన దానిని వాడవచ్చును. (అటువంటివి కలుపబడిన మేజోత్ “బాధను స్మరణకు తెచ్చు” వాటికి తగినదైయుండదు.) లేక సంఘ పెద్దలు ఎవరైన ఒకరిచేత గోధుమ పిండి, మరియు నీళ్లతో రొట్టె తయారుచేయబడునట్లు ఏర్పాటుచేయవచ్చును. గోధుమ పిండి దొరకనట్లయిన బార్లి, బియ్యము, జొన్న లేక మొదలగు ఇతర ధాన్యము నుండి పులియని రొట్టెను చేయవచ్చును. పిండిని పలుచగా చేసి కొంచెము నూనెగల పెన్నముపై కాల్చవచ్చును.
8. చిహ్నమునకు పులియని రొట్టె ఎందుకు తగినది? మరియు దానిలో పాలుపుచ్చుకొనుట దేనిని సూచించును? (హెబ్రీయులు 10:5-7; 1 పేతురు 4:1)
8 అటువంటి రొట్టెలో పాపము లేక కలుషితమునకు సూచనగా బైబిలు ఉపయోగించు పులుపు (ఈస్ట్) లేనందున అది తగినదైయుండును. సంఘములోని అవినీతిపరుడైన ఒక మనుష్యుని గూర్చి పౌలు ఇట్లు హెచ్చరించెను: ‘పులిసినపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.’ (1 కొరింథీయులు 5:6-8; మత్తయి 13:33; 16:6, 12 ను పోల్చుము.) పులియని రొట్టె “పవిత్రుడును, నిర్దొషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును” అయిన యేసు మానవశరీరమునకు సరియైన చిహ్నమైయున్నది. (హెబ్రీయులు 7:26) అపొస్తలులతో “మీరు తీసికొని తినుడి [రొట్టె], ఇది నాశరీరమని” చెప్పినప్పుడు యేసు తన పరిపూర్ణ శరీరముతో యున్నాడు. (మత్తయి 26:26, ఎ న్యూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది బైబిల్, బై జేమ్సు మోఫత్) రొట్టెలో పాల్గొనుటయంటే ఒక వ్యక్తి తనయెడల యేసు బలియొక్క ప్రయోజనాన్ని నమ్మి, దానిని అంగీకరిస్తున్నాడని అర్థము. అయినను, ఇంకా ఎక్కువ ఇమిడియున్నది.
అర్థవంతమైన ద్రాక్షారసము
9. ఏ ఇతర చిహ్నమును ఉపయోగించవలెనని యేసు చెప్పెను?
9 యేసు ఇంకొక చిహ్నమును ఉపయోగించెను. ఎట్లనగా “ఆయన గిన్నె, పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నారక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకొరకు చిందింప బడుచున్న నారక్తము’” అని పలికెను. (మత్తయి 26:27, 28, మోఫత్). ఆయన అందరికి అందించిన ఆ సమాధాన పాత్రలో ఏమున్నది? మనలను విమర్శించుకొనుటకు పోరాడుకొలది మనకు దానియొక్క భావమేమి?
10. యూదా పస్కానందు ద్రాక్షారసము ఎట్లు చోటుచేసుకొనినది?
10 పస్కా విందును గూర్చి మొదట మోషే సూచించినప్పుడు అందు పానీయమును గూర్చి ఆయన చెప్పలేదు. చాలాకాలము తరువాత సా.శ.పూ. రెండవ శతాబ్ధములో ద్రాక్షారసము పస్కాలో చేర్చబడినదని అనేకమంది విద్వాంసులు నమ్ముచున్నారు.b ఎట్లయినను మొదటి శతాబ్ధమునకు ఈ భోజనములో సామాన్యమైన ద్రాక్షారసమును యేసు అభ్యంతపరచలేదు. జ్ఞాపకార్థమును ప్రారంభించునప్పుడు యేసు పస్కా ద్రాక్షారసమును ఉపయోగించెను.
11. ప్రభువు రాత్రిభోజనమందు ఎటువంటి ద్రాక్షారసమును ఉపయోగించుట తగినదైయుండును?
11 యూదా పస్కా ద్రాక్షా కోతకాలమైన చాలా తరువాత వస్తున్నందున, యేసు పులియని ద్రాక్షల రసమును (జ్యూస్) గాక సులభముగా తన రక్తమును సూచించు ఎఱ్ఱని ద్రాక్షారసమును (వైన్) ఉపయోగించిన వాడైయుండును. (ప్రకటన 14:20 ని పోల్చుము) యేసు రక్తమును అధికము చేయవలసిన అవసరతేమి లేదు గనుక దానిని బలపరచుటకు బ్రాంది చేర్చిన (పోర్టు, షెర్రి, లేక మసుకలేట్) లేక ఇతర సుగంధ ద్రవ్యములు (వెర్మోత్, డుబోన్నెట్, లేక అపిర్టిఫ్స్) చేర్చబడిన వాటికంటె సామాన్యమైన ద్రాక్షారసము సరియైనదైయుండును. అయినను పులియబెట్టునప్పుడు రుచికొరకు కొంత పంచదార కలుపబడిందా, మత్తును కలుగజేయునది, లేక కొంచెము గంథకము చేరిందా అని ద్రాక్షారసము చేయబడిన విధానమును గూర్చి మనము కలతచెందనవసరములేదు.c చాలా సంఘములు బయట అమ్ము ఎఱ్ఱని ద్రాక్షారసమును, (చియాంతి, బర్గండి, బీజులాయిస్ లేక క్లారెట్ మొదలగు) లేక తేలికగా ఇంటిలో తయారుచేసిన ఎఱ్ఱని ద్రాక్షారసమును ఉపయోగింతురు. ద్రాక్షారసము లేక రొట్టె కేవలము చిహ్నములు, లేక సూచనార్థకములైయున్నవి. కావున ఉపయోగించబడని వాటిని ఇంటికి తీసుకెళ్లి తదుపరి సాధారణ భోజనముగా లేక పానీయముగా వాడవచ్చును.
12. ద్రాక్షారసము ప్రాతినిధ్యము వహించు ఎటువంటి భావమును కలిగియున్నదని యేసు వివరించెను?
12 యేసు పస్కారాత్రి తన రక్తమునుగూర్చి మాట్లాడుట నిశ్చయముగా పూర్వము ఐగుప్తునందలి గొర్రెపిల్ల రక్తమును మనస్సులోకి తెచ్చియుంటుంది. అయితే యేసు ఇక్కడ ఇంకొక విభిన్నమైన పోలికను ఎట్లు చూపించెనో గమనించుము. అదేమనగా: “ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నారక్తము వలననైన క్రొత్తనిబంధన.” (లూకా 22:20) మొదట దేవుడు శరీరసంబంధమైన ఇశ్రాయేలు జనాంగముతో ఒక నిబంధనచేయగా అది, జంతుబలుల రక్తముతో ప్రారంభమాయెను. ఆ బలుల రక్తమునకు మరియు యేసు రక్తమునకు సారూప్యమున్నది. ఈ రెండు తన ప్రజలైన జనాంగముతో దేవుడు నిబంధనను చేయుటయందు చేరియున్నవి. (నిర్గమకాండము 24:3-8; హెబ్రీయులు 9:17-20) ధర్మశాస్త్ర నిబంధనయందు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు రాజులైన యాజక జనాంగముగా తయారగు ఉత్తరాపేక్షను కలిగియుండుట అందు ఒక రూపమైయున్నది. (నిర్గమకాండము 19:5, 6) ఏమైనను, యెహోవా నిబంధనయందు కట్టుబడియుండుటలో ఇశ్రాయేలీయులు తప్పిపోయిన తరువాత, “పాత నిబంధన” స్థానములో “క్రొత్తనిబంధనను” చేయుదునని యెహోవా సెలవిచ్చెను. (హెబ్రీయులు 9:1, 15; యిర్మీయా 31:31-34) ఈ సమయమందు నమ్మకస్థులైన అపొస్తలుల మధ్య యేసు అందించిన ద్రాక్షారసపు గిన్నె ఈ నూతన నిబంధనకు ప్రాతినిధ్యముగా ఉన్నది.
13, 14. (ఎ) క్రొత్త నిబంధనలో యుండుట అనగా భావమేమి? (బి) చిహ్నములలో పాలుపుచ్చుకొను వ్యక్తివలన ఏమి సూచించబడుచున్నది?
13 ఈ క్రొత్తనిబంధనలోకి తీసుకొనబడిన క్రైస్తవులు రాజులైన-యాజక ఆత్మీయ జనాంగముగా తయారగుదురు. (గలతీయులు 6:16) అపొస్తలుడైన పేతురు ఇట్లు వ్రాసెను: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలైయున్నారు.” (1 పేతురు 2:9) వారు పొందిన రక్షణ యేసుతో సహపరిపాలకులుగా ఉండు జీవితము అనునది స్పష్టమైనది. ప్రకటన 20:6 దీనిని స్థిరపరచుచున్నది: “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయుందురు. . .వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
14 చిహ్నార్థకమైన రొట్టెను మరియు ద్రాక్షారసమును పాలుపుచ్చుకొనమని సూచించిన తరువాత ‘వారు ఆయన బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసముల మీద కూర్చొండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చెదరని’ చెప్పెను. (లూకా 22:28-30) తత్ఫలితముగా జ్ఞాపకార్థ చిహ్నములలో పాల్గొనుటయనగా యేసు బలియందు కేవలము విశ్వసించుట కంటే ఎక్కువ అని భావము. ప్రతి క్రైస్తవుడు ఎక్కడ నిత్యజీవము పొందవలెనన్నను విమోచనను అంగీకరించి దానియందు విశ్వాసమును ఉంచవలెను. (మత్తయి 20:28; యోహాను 6:51) అయితే చిహ్నములలో పాలుపుచ్చుకొనుట మాత్రము యేసుతోపాటు తన రాజ్యమందుండుటకు ఒకడు క్రొత్త నిబంధనలో ఉన్నాడని సూచించును.
జ్ఞాపకార్థ సమయములో విమర్శించుకొనవలసిన అవసరము
15. దేవుని సేవకులకు యేసు ఎట్లు ఒక క్రొత్త నిరీక్షణను పరిచయము చేసెను?
15 గత శీర్షిక వివరించినట్లు, యేసు కాలమునకు ముందు యథార్థవంతులైన దేవుని సేవకులు పరలోకమునకు వెళ్లు నిరీక్షణను కలిగి లేకుండిరి. మానవజాతియొక్క మొట్టమొదటి గృహమగు భూమిపైనే నిత్యజీవమును పొందుటకు వారు ఎదురుచూచిరి. ఆత్మగా లేపబడినవారిలో యేసుక్రీస్తు మొదటివాడైయుండి, మానవజాతినుండి పరలోకమునకు తీసుకొనబడు మానవులలో మొదటివాడాయెను. (ఎఫెసీయులు 1:20-22; 1 పేతురు 3:18, 22) “యేసు తన రక్తమువలన ప్రతిష్టించిన నూతనమైనదియు, జీవముగలదియునైన మార్గమున పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది” అనుచు పౌలు దీనిని స్థిరపరచెను. (హెబ్రీయులు 10:19, 20) యేసు ఆ మార్గము తెరచిన తరువాత ఎవరు వెళ్లుదురు?
16. రొట్టె మరియు ద్రాక్షారసములో పాలుపుచ్చుకొనువారికి భవిష్యత్తేమి కలిగియున్నది?
16 ప్రభువురాత్రి భోజనమును యేసు ప్రవేశపెట్టిన రాత్రియందు యథార్థవంతులైన తన అపొస్తలులతో తాను వారికొరకు పరలోకములో స్థలము సిద్ధపరచుచున్నట్లు ఆయన చెప్పెను. (యోహాను 14:2, 3) అయినను, తనతో రొట్టె మరియు గిన్నెలో పాలువహించువారు తన రాజ్యములో యుండి తీర్పుతీర్చుటకై సింహాసనములపై కూర్చొందురని యేసు చెప్పిన దానిని కూడ గుర్తుతెచ్చుకొనుము. వారు కేవలము అపొస్తలులేనా? లేదు, తరువాత అపొస్తలుడగు యోహాను ఇతర క్రైస్తవులు జయించినవారై “యేసుతో కూడ సింహాసనమందు ఆసీనులై” ఆయనతోకూడ ‘ఒక రాజ్యముగాను యాజకులుగాను భూమిని ఏలుదుర”ని తెలుసుకొనెను. (ప్రకటన 3:21; 5:10) “భూమినుండి కొనబడిన” మొత్తము క్రైస్తవుల సంఖ్య 1,44,000 మంది యనియు యోహాను తెలుసుకొనెను. (ప్రకటన 14:1-3) యుగముల నుండి దేవుని ఆరాధించిన వారితో పోల్చినప్పుడు చాలావరకు వీరు చిన్న గుంపైన “చిన్నమందయై” యున్నారు గనుక జ్ఞాపకార్థసమయమున ప్రత్యేక విమర్శ అవసరమైయున్నది.—లూకా 12:32.
17, 18. (ఎ) కొరింథులోని కొంతమంది క్రైస్తవులు ఏ అలవాటులో పడిపోయిరి? (బి) ఆహారము మరియు పానీయమును అమితముగా పుచ్చుకొనియుండుట ఎందుకు గంభీరమైన విషయమైయుండెను? (హెబ్రీయులు 10:28-31)
17 కొంతమంది అపొస్తలులు సజీవులుగా ఉండి, క్రైస్తవులు దేవునిచే “పరిశుద్ధులు అని పిలువబడుచున్న” సమయమున కొరింథీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు ఈ విషయమును ప్రస్తావనకు తీసుకొనివచ్చెను. ఈ చిహ్నములలో పాలుపొందనైయున్నవారిలో ఒక చెడు అలవాటు వృద్ధిచెందెనని పౌలు చెప్పెను. కొందరు ముందుగానే భోజనమును అమితముగా తిని త్రాగి, తమ్మునుతాము మందులుగా చేసికొని, నిద్రమత్తులుగా చేసికొనిరి. అందువలన కొందరు “శరీరమును వివేచింపక” అనగా రొట్టెచే సూచించబడిన యేసు భౌతిక శరీరమును వివేచింపరైరి. అది చాలా గంభీరమైనదై యుండెనా? అవును! దానిలో అయోగ్యముగా పాలుపుచ్చుకొనుట ద్వారా వాడు “ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును.” వారు మానసికముగా మరియు ఆత్మీయముగా మెలకువగలిగియున్నట్లయిన “తాము ఏమైయున్నారో తమ్మును తాము విమర్శించుకొని తీర్పుపొందక యుందురు.”—1 కొరింథీయులు 1:2; 11:20-22, 27-31.
18 ఆ క్రైస్తవులు దేనిని మరియు ఎట్లు విమర్శించుకొనవలసియున్నారు? ప్రథమముగా, పరలోక జీవితమునకు వారసులైన 1,44,000 మందిలో తాముయున్నామని హృదయములోను మనస్సులోను గుణగ్రహించవలసియున్నారు. దీనినెట్లు గ్రహించుకొందురు, దేవుడు అపొస్తలుల దినమునుండి ఎన్నుకొనుచున్న ఈ చిన్నగుంపులో భాగస్థులమైయున్నామని అనేకులు నమ్మవలెనా?
19. బయలుపరచు ఎటువంటి పరిస్థితి 1989 జ్ఞాపకార్థ సమయములో ఉన్నది?
19 నిజమునకు, ఈనాటి నిజక్రైస్తవులలో కేవలము చాలా కొద్దిమంది మాత్రమే తమను గురించి ఈ గ్రహింపును కలిగియున్నారు. 1989 ప్రభువురాత్రి భోజన ఆచరణలో 94,79,000 లకు పైగా భూమియందంతటి యెహోవాసాక్షుల సంఘములలో సమకూడిరి. దాదాపు 8,700 మంది ‘పరలోక రాజ్యము చేరునట్లు రక్షించబడిన’ నిరీక్షణను వ్యక్తముచేసిరి. (2 తిమోతి 4:18) ఎక్కువమంది—ఔను, సమకూడిన లక్షలకొలది ఇతర నమ్మకమైన మరియు దీవించబడిన క్రైస్తవులు తమ నిరీక్షణ భూమిపై నిరంతరము జీవించుటయని గ్రహించుకొనిరి.
20. 1,44,000 మందికి సంబంధించిన వారు తాము పిలువబడిన వారని ఎట్లు తెలియజేయబడియున్నారు? (1 యోహాను 2:27)
20 సా.శ. 33 పెంతెకొస్తున దేవుడు పరలోకజీవితమునకు 1,44,000 మందిని ఎన్నుకొనుట ప్రారంభించెను. ఇది యేసు కాలమునకు ముందటి దేవుని సేవకులు కలిగియుండని క్రొత్త నిరీక్షణయైయున్నందున ఎన్నుకొనబడినవారు ఈ నిరీక్షణను ఎట్లు తెలుసుకొందురు, లేక నిశ్చయత కలిగియుండగలరు? దేవుని పరిశుద్ధాత్మచేత ఇవ్వబడిన సాక్ష్యము ద్వారా వారు దీనిని గ్రహించుదురు. దాని భావము వారు నిజంగా ఆత్మను (వ్యక్తి కాదు) చూస్తారని, లేక ఆత్మ తమతో సంభాషించు మానసిక దృశ్యమును లేక ఆత్మసామ్రాజ్యమునుండి స్వరములను వింటారని కాదు. పౌలు ఇట్లు వివరించుచున్నాడు: “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. . .మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము.”—రోమీయులు 8:16, 17.
21. (ఎ) అభిషక్తులైన వారు తాము పరలోక నిరీక్షణను కలిగియున్నట్లు ఎట్లు తెలుసుకొందురు? (1 కొరింథీయులు 10:15-17) (బి) అభిషక్తులు ఎటువంటి వ్యక్తులైయున్నారు? మరియు వారు మితమైన పద్ధతిలో తమ నిరీక్షణకు ఎట్లు సాక్ష్యమిచ్చుదురు?
21 ఈ సాక్ష్యము మరియు గుర్తింపు వారి ఆలోచనను, నిరీక్షణను పునర్నిర్మిస్తుంది. వారు ఇంకా యెహోవా భూసృష్టిలోని మంచివాటిని అనుభవించు మానవులేయైనను, వారి జీవితము మరియు ఆసక్తుల నడిపింపు ముఖ్యముగా క్రీస్తు తోడివారసులగుటపైన యుండును. ఈ దృక్పథమునకు వారు భావోద్రేకము వలన వచ్చియుండలేదు. వారు దృక్పథములందును, ప్రవర్తనయందును సమతుల్యము కలిగియుండు సామాన్య వ్యక్తులైయున్నారు. దేవుని ఆత్మచే పరిశుద్ధపరచబడినవారై వారి పిలుపును గూర్చి ఒప్పింపబడి దానిపై ఎడతెగని సందేహములు లేనివారైయున్నారు. నమ్మకస్థులుగా రుజువుపరచుకొన్నట్లయిన పరలోకమునకు వెళ్లుట తమ రక్షణైయున్నదని గుర్తించుకొందురు. (2 థెస్సలొనీకయులు 2:13; 2 తిమోతి 2:10-12) యేసు బలి తమకు ఏమైయున్నదో అర్థము చేసుకొని ఆత్మచే అభిషేకము పొందిన క్రైస్తవులమని గ్రహించుకొనినవారై జ్ఞాపకార్థ చిహ్నములలో వారు మితముగా పాలుపొందుదురు.
22. ప్రభువురాత్రి భోజనమునకు హాజరగు అనేకులు దేనిని గ్రహింతురు?
22 విధేయతతో మార్చి 30న హాజరగువారిలో ఎక్కువమంది ఆ నిరీక్షణను కలిగిలేరు. ఎందుకనగా దేవుడు వారిని ఆత్మతో అభిషేకించి పరలోకమునకు పిలువలేదు. మనము గమనించినట్లు 1,44,000 మందిని ఎన్నుకొనుటను దేవుడు అపొస్తలుల దినముననే ప్రారంభించెను. ఆ పిలుపు పూర్తియైన తరువాత, ఆయనను ఆరాధించ వచ్చువారందరు యేసు పరలోకమునకు మార్గము తెరవకముందు మరణించిన మోషే, దావీదు, బాప్తిస్మమిచ్చు యోహాను మరియు ఇతర నమ్మకస్థులైన వారు కలిగియున్న నిరీక్షణనే కలిగియుందురు. ఆవిధముగా యథార్థపరులు మరియు ఆసక్తిగల లక్షలకొలది క్రైస్తవులు జ్ఞాపకార్థ చిహ్నములందు పాలుపుచ్చుకొనరు. అటువంటి క్రైస్తవులు తమ విలువైన నిరీక్షణను గ్రహించుకొందురను భావములో తాము దేవునియెదుట ఏమైయున్నారో విమర్శించుకొందురు. తమ పాపములకు క్షమాపణపొంది భూమిపై నిత్యజీవమును పొందుటద్వారా వారు యేసు రక్తము మరియు శరీరమునుండి ప్రయోజనము పొందుదురు.—1 పేతురు 1:19; 2:24; ప్రకటన 7:9, 15.
23. జ్ఞాపకార్థము ఎందుకు ఒక ఆనందభరితమైన ఆచరణయై యుండును? (2 దినవృత్తాంతములు 30:21 ని పోల్చుము)
23 కాబట్టి మార్చి 30న సంతోషకర ఆచరణకొరకు ఎదురు చూద్దాము. వివేకమును ఉపయోగించుటకే కాక ఆనందించుటకును అది సమయమైయున్నది. సరిగా మరియు విధేయత పూర్వకముగా రొట్టె మరియు గిన్నెలో పాల్గొను పరలోక నిరీక్షణగల చిన్నసంఖ్యకు ఆనందము. (ప్రకటన 19:7) ఆ ఆచరణను నిత్యము జ్ఞాపకముంచుకొనుటకు నిరీక్షిస్తూ ఆ సాయంకాలము దానిని ఆచరించి నేర్చుకొను సంతోషభరిత లక్షలకొలది క్రైస్తవులకును ఆనందము.—యోహాను 3:29. (w90 2/15)
[అధస్సూచీలు]
a “ఆయన అప్పగింపబడిన రాత్రి ప్రభువైన యేసు ఒక రొట్టెను తీసికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇట్లనెను: “ఇది మీకొరకైన నా శరీరము; నా జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి.” అటువలెనె భోజనమైన పిమ్మట గిన్నె పట్టుకొని ఇట్లనెను: ఈ గిన్నె నా రక్తమువలననైన క్రొత్త నిబంధన మీరు త్రాగునపుడెల్ల నా జ్ఞాపకముగా దీనిని చేయుడి.”—ఏన్ ఎక్సెపేండెడ్ పేరా ఫ్రేజ్ ఆఫ్ ది ఎపిసల్స్ ఆఫ్ పాల్, బై యఫ్. యఫ్. బ్రూస్.
b ద్రాక్షారసము ఎందుకు చేర్చబడినదనుదానికి ఒక విద్వాంసుడు ఈ అభిప్రాయమును అందించెను: “[పస్కా] ఎంతమాత్రము సాంవత్సరికముగా పురుషులను మాత్రమే సమకూర్చు పవిత్ర సమయముగా లేదు. అది కుటుంబమునకు పండుగ సమయముగా తయారయినది గనుక, అందులో ద్రాక్షారసము సహజముగానే స్థానము పొందినది.”—ది హీబ్రూ పాసోవర్—ఫ్రం ది ఎర్లియెస్ట్ టైమ్స్ టు ఎ.డి. 70, బై జె.బి. సెగల్.
c పురాతన కాలమునుండి ఉప్పు, గ్రుడ్లతెల్లనిసొన, మరియు ఇతర పదార్థములు స్వచ్ఛపరచుటకు లేక ద్రాక్షారసపు రంగు లేక రుచిని తెచ్చుటకు కలుపబడినవి. రోమీయులు దుర్వాయువులను పొగొట్టుటకు ద్రాక్షారసమును చేయుటలో గంధకమును కూడ ఉపయోగించుచుందురు.
మీ సమాధానమేమి?
◻ జ్ఞాపకార్థ సమయములో పులియని రొట్టె ఎందుకు అందించబడును? మరియు అది దేనిని సూచించును?
◻ ప్రభువురాత్రి భోజనమందు అందించబడు గిన్నె ఏమిటి? అది దేనికి ప్రాతినిధ్యముగా యున్నది?
◻ జ్ఞాపకార్థ ఆచరణ సంబంధముగా విమర్శించుకొనుట ఎందుకు అవసరము?
◻ రాబోవు జ్ఞాపకార్థము కొరకు నీవెందుకు ఎదురుచూచు చున్నావు?