“వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి”
“నీతియు యథార్థమైన భక్తియుగలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”—ఎఫెసీయులు 4:24.
1. దేవుని ఆరాధికులకు వేటితో ఆశీర్వదించబడ్డారు? ఎందుకు?
యెహోవా దేవుడు “జ్యోతిర్మయుడగు తండ్రి,” మరి “ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.” (యాకోబు 1:17; 1 యోహాను 1:5) “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని,” ఆయన కుమారుడు తన్ను గూర్చి చెప్పుకున్నాడు. (యోహాను 8:12) కాబట్టి, యెహోవా యథార్థ సేవకులైన తన కుమారుని అనుచరులు మానసిక, నైతిక, ఆత్మీయ వెలుగుతో ఆశీర్వదించబడ్డారు. మరి వారు “లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.”—ఫిలిప్పీయులు 2:16.
2. దేవుని ప్రజలకు, లోక ప్రజలకు మధ్యవున్న ఏ తేడా ముందుగానే ప్రవచించపబడింది?
2 చాలా కాలం క్రితం యెషయా ప్రవక్త యీ తేడాలను ప్రవచించడానికి ప్రేరేపితుడై ఇలా అన్నాడు: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.” వాస్తవానికి, దేవుని నుండి వైదొలగిన మానవజాతి, “అంధకార సంబంధులగు లోక నాధుల” ప్రభావంక్రింద ఉన్నదని చెప్పబడింది.—యెషయా 60:2; ఎఫెసీయులు 6:12.
3. పౌలు సమయోచిత సలహాలో మనమెందుకు ఎక్కువ శ్రద్ధకల్గివున్నాము?
3 తన తోటి క్రైస్తవులు ఈ అంధకారంనుండి బయటపడాలని అపొస్తలుడైన పౌలు ఎంతో శ్రద్ధను చూపించాడు. “అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని,” అయితే “వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి” అని ఆయన వారికి ఉద్బోధించాడు. (ఎఫెసీయులు 4:17; 5:10) వారు దీనిలో ఎలా విజయం పొందగలరనే విషయాన్నికూడా ఆయన వివరించాడు. ఈనాడు, యీ రాజ్యాలను కమ్మే అంధకారం, వ్యాకులత నానాటికీ దట్టంగా తయారౌతోంది. లోకం నానాటికీ నైతిక ఆత్మీయ వినాశనకర ఊబిలోనికి దిగజారిపోతోంది. యెహోవా ఆరాధికులు తీవ్రమైన పోరాటాన్ని పోరాడవలసివుంది. అందువలన, పౌలు చెప్పిన విషయాలపై మనము చాలా ఆసక్తిని కలిగివున్నాము.
క్రీస్తును గూర్చి నేర్చుకోండి
4. “మీరీలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు” అని పౌలు అన్నప్పుడు ఆయన మనస్సులో ఏమి ఉండెను?
4 లోకపు వ్యర్థమైన గమ్యాలను గూర్చి, అపవిత్రతను గూర్చి వివరించిన తర్వాత, అపొస్తలుడైన పౌలు మరలా తన అవధానాన్ని ఎఫెసీలోని తన తోటి సహోదరుల వైపు త్రిప్పాడు. (ఎఫెసీయులు 4:20, 21 దయచేసి చదవండి.) పౌలు ఆ పట్టణంలో ప్రకటిస్తూ బోధిస్తూ మూడు సంవత్సరాలు గడిపాడు గనుక, ఆ సంఘంలోని అనేకులతో పౌలుకు వ్యక్తిగత పరిచయం ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:31-35) కాబట్టి, “మీరీలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు” అని ఆయన అన్నప్పుడు, ఆయన 17 నుండి 19 వచనాలల్లో వివరించిన రకరకాల సిగ్గుమాలిన చెడు ప్రవర్తనను క్షమించేది, ఏదో స్వేచ్ఛానుసార బలహీనమైన సత్యమును ఎఫెసీ క్రైస్తవులు నేర్చుకోలేదని ఆయన భావం. యేసుక్రీస్తు మాదిరి ఉంచినట్లుగా, వారు నిజమైన క్రైస్తవ జీవితవిధానాన్ని సరిగ్గా నిర్దిష్టంగా నేర్చుకున్నారు. ఈ కారణంగా, వారిక ఏమాత్రం అంధకారంలో నడుచుకోనకుండా, వెలుగు సంబంధులై నడుచుకొంటున్నారు.
5. మనలో సత్యమును కల్గివుండడానికి, పైపైకి సత్యంలో వుండడానికి తేడా ఏమిటి?
5 సరైన రీతిలో “క్రీస్తును నేర్చుకొనడం” ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తును గూర్చి నేర్చుకోవడంలో తప్పుడు పద్ధతులున్నాయా! తప్పకుండా ఉన్నాయి. దీనికంటే ముందు, ఎఫెసీయులు 4:14 లో పౌలు సహోదరులను ఇలా హెచ్చరించాడు: “అందువలన మనమిక మీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు గాలికి కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండకుడి.” అంటే, అక్కడ క్రీస్తును గూర్చి నేర్చుకున్న వారు కొందరున్నారు. అయితే వారు లోక నడవడినే ఇంకా అనుసరిస్తూ ఇతరులు కూడా అలాగే చేయటానికి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సత్యాన్ని మనలో ఉంచుకునే బదులు, కొందరు అనుటున్నట్లుగా మనం సత్యంలో ఉండడం ప్రమాదకరమని సూచిస్తోందా? పౌలు దినాలలో ఏదో పైపై జ్ఞానం పొందినవారు సుళువుగా, త్వరగా ఇతరులవలన పక్కదారికి మళ్లించబడ్డారు, ఇప్పుడూ అది వాస్తవమే. దీన్ని నివారించాడానికి “యేసును గూర్చి విని, . . . ఆయన యందు ఉపదేశింపబడినవారై” ఉండాలని పౌలు ఎఫెసీయులకు చెప్పాడు.—ఎఫెసీయులు 4:21.
6. మనమెలా క్రీస్తును నేర్చుకొని, విని, ఉపదేశింపబడినవారమౌతాము?
6 “నేర్చుకొని,” “విని,” “ఉపదేశింపబడి” అని పౌలు ఉపయోగించిన మాటలన్నీ పాఠశాల్లో మాదిరే నేర్చుకోవడం, బోధింపబడడం అన్న భావాన్నిస్తాయి. నిజమే యీ రోజు యేసు మనకు నేర్పించడు, ఉపదేశించడు, మనం ఆయన చెప్పేది నేరుగా వినలేము. అయితే, ఆయన తన “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా లోకవ్యాప్త బైబిలు విద్యాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. (మత్తయి 24:45-47; 28:19, 20) దాసుని తరగతి తగినవేళ మనకు అందించే ఆత్మీయాహారాన్ని మనం క్రమంగా తీసుకొని, వ్యక్తిగతంగా కానీ లేక సంఘంలోగానీ వాటిని బాగా పఠించి, ధ్యానించి, నేర్చుకున్న వాటిని మనం ఆచరణలోపెడితే “క్రీస్తును నేర్చుకోగలం.” మనమాయన గూర్చి “విన్నాము, ఆయన వలన ఉపదేశింపబడియున్నాము” అని మనం యథార్థంగా చెప్పగలిగేలా మనకున్న అన్ని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి.
7. “యేసు . . . యందలి సత్యము ఉన్నది” అన్న పౌలు మాటల్లో ఎలాంటి ప్రాముఖ్యత ఉంది?
7 పౌలు, ఎఫెసీయులు 4:21, లో నేర్చుకొనే పద్ధతిని నొక్కితెలుపుతూ, “యేసు . . . యందలి సత్యము ఉన్నది” అని జోడించాడు. పౌలు తన రచనలలో యేసు అనే పదాన్ని చాలా అరుదుగా ఉపయోగించాడన్న వాస్తవాన్ని గమనించాలని కొందరు బైబిలు వ్యాఖ్యానికులు అంటున్నారు. వాస్తవానికి, ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో ఈ ఒక్కసారే ఆయన దానిని సంబోధించాడు. దీనికేదైనా ప్రత్యేకత ఉందా? పౌలు బహుశా, యేసు మానవునిగా చూపిన మాదిరివైపు అవధానాన్నిస్తున్నాడేమో. యేసు ఒకసారి తననుగూర్చి, “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని చెప్పుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకోండి. (యోహాను 14:6; కొలొస్సయులు 2:3) సత్యాన్ని మాట్లాడడం, నేర్పించడమే కాకుండా, దానికి అనుగుణంగా జీవించి దానిలో మూర్తీభవించాడు గనుకనే యేసు, “నేనే . . . సత్యము” అని అనగల్గాడు. అవును, నిజమైన క్రైస్తవత్వం ఒక ఆలోచన కాదు, అది ఒక జీవితవిధానం. “క్రీస్తును నేర్చుకోవడంలో” సత్యమునుబట్టి జీవించడంలో ఆయనను అనుకరించడానికి నేర్చుకోవడమనేది ఇమిడివుంది. మీరూ మీ జీవితాలను యేసు మాదిరిగానే రూపొందించుకొంటున్నారా? మీరు ప్రతిదినము, ఆయన నడవడిని అనుసరిస్తున్నారా? అలా చేసినప్పుడే మనం వెలుగు సంబంధులముగా నడువగలము.
“ప్రాచీన స్వభావమును వదులుకో”
8. ఎఫెసీయులు 4:22, 24 లో పౌలు ఏ ఉపమానాన్ని ఉపయోగించాడు, మరి అదెందుకు సమంజసం?
8 “క్రీస్తును నేర్చుకోవడానికి,” వెలుగు సంబంధులుగా నడుచుకోవడానికి మనం మూడు విభిన్న అంశాలను అనుసరించాలని పౌలు ఎఫెసీయులు 4:22-24 లో చెప్పడం కొనసాగించాడు. వీటిలో మొదటిది: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొనుడి.” (ఎఫెసీయులు 4:22) “వదులుకో” (“తీసివేయి,” కింగ్డమ్ ఇంటర్లీనియర్), “ధరించుకో” (24 వ వచనము) అన్న పదాలు, దుస్తులను వేసుకోవడం, తీసివేయడం అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇది పౌలు తరచుగా వాడిన ఓ అలంకార రూపమే, మరి అది శక్తివంతమైంది కూడా. (రోమీయులు 13:12, 14; ఎఫెసీయులు 6:11, 17; కొలొస్సయులు 3:8-12; 1 థెస్సలొనీకయులు 5:8) భోజనం చేసే సమయాల్లోలాగా, మన దుస్తులు మాసిపోయినా లేక మరకలైనా వెంటనే మనం వాటిని మార్చుకుంటాము. అలాగే మన ఆత్మీయ మలినంయెడల కూడా మనం అలాంటి శ్రద్ధనే చూపవలసిన అవసరముంది కదా?
9. ఒకడు తన ప్రాచీన స్వభావాన్ని ఎలా వదులుకోగలడు?
9 మరి, ఒకరు తమ ప్రాచీన స్వభావాన్ని ఎలా వదులుకుంటారు? మూల భాషలో “వదులుకో” అన్న క్రియాపదం, నిర్ణీతముకాని కాలాన్ని సూచిస్తుంది. అది ఒకే ఒక్కసారి లేదా శాశ్వతంగా తీసుకున్న చర్యను సూచిస్తోంది. “ప్రాచీన స్వభావమును” (“ప్రాచీన పురుషుడు” కింగ్డమ్ ఇంటరలీనియర్) దాని “మునుపటి ప్రవర్తనతో” సహా కచ్చితమైన తీర్మానంతో కూడిన చర్యతో సమగ్రంగా, పూర్తిగా వదులుకోవాలి. అది వాదవివాదాలు చేయగల్గింది లేక సంకోచించవలసింది కాదు. ఎందుకని?
10. ఒకడు ప్రాచీన స్వభావాన్ని ఎందుకు దైర్యంగా కచ్చితంగా త్యజించాలి?
10 “మోసకరమైన” అన్న మాట, “ప్రాచీన పురుషుడు” నైతిక పతనంలో యింకా దిగజారిపోతున్నాడని, మరింత పాడైపోతున్నాడని చూపిస్తోంది. నిజానికి ఆత్మీయ వెలుగును తిరస్కరించడం మూలంగా పూర్తి మానవజాతి లోతైన ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఇది “దురాశ” ఫలితమని పౌలు అన్నాడు. శరీరాశలు పైకి హానికారకంకానట్లు కనిపించినను అవి మోసకరమైనవి, తుదకు నాశనకరమైనవి. (హెబ్రీయులు 3:13) దాన్ని ముందుగా పరీక్షించకపోతే చివరికది అపవిత్రతకూ మరణానికి నడుపుతాయి. (రోమీయులు 6:21; 8:13) అందుకనే పాతవి, మాసిపోయిన దుస్తులను తీసివేసినట్లే ప్రాచీన స్వభావాన్ని తప్పనిసరిగా, పూర్తిగా వదులుకోవాలి.
ఒక నూతన “మనస్సుయొక్క శక్తి”
11. ఆత్మీయ నవీనత ఎక్కడ ప్రారంభమౌతుంది?
11 బురదలోంచి లేచిన వ్యక్తి తన మురికి బట్టలను తీసివేయడమేగాకుండా, మంచివి శుభ్రమైన వాటిని ధరించుకోకముందు శుభ్రంగా స్నానం చేయాలి. ఆత్మీయ వెలుగుకు రెండో అంశంగా సరిగ్గా దీన్నే స్థూలపరిచాడు: “మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై” ఉండాలి. (ఎఫెసీయులు 4:23) ఆయన 17, 18 వచనాలలో అంతకుముందు సూచించినట్లుగా, అన్యజనులు “తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి అంధకారమనస్సుగలవారై” నడుచుకొంటున్నారు. గనుక సహేతుకంగా, జ్ఞానానికి వివేచనకు కేంద్రమైన మనస్సునుండే నూతన పరచబడడం ప్రారంభమవ్వాలి. ఇదెలా సాధ్యపడుతుంది? మన మనస్సును ప్రేరేపించే శక్తిని నూతన పరచడంద్వారా అది సాధ్యపడుతుందని పౌలు వివరించాడు. ఏమిటా శక్తి?
12. చిత్తవృత్తి యొక్క శక్తి ఏమిటి?
12 మన చిత్తవృత్తిని నూతనపరచేదని పౌలు చెప్పింది పరిశుద్ధాత్మకు సంబంధించిందా? కాదు. “మీ చిత్తవృత్తి” యందు నూతన పరచబడటం అనే వాక్యం “మీ మనస్సుయొక్క శక్తి” అనే అక్షరార్థ భావాన్నిస్తోంది. బైబిలులో ఎక్కడాకూడా దేవుని పరిశుద్ధాత్మ మనిషికి చెందిందనో లేక మానవునిలో ఒక భాగమని చెప్పబడలేదు. “శక్తి” అంటే “శ్వాస” అనే భావముంది, అయితే “ఒక మనిషి ప్రత్యేకమైన ప్రవర్తన, స్థితి, భావోద్రేకాలను చూపేలా, లేక ఒక చర్యను లేక పద్ధతిని అవలంభించేలా చేసే శక్తికి” కూడా బైబిలు దాన్ని ఉపయోగించింది. (ఇసైట్ ఆన్ ది స్కిప్చర్స్ వాల్యూం 2, పేజీ 1026) కాబట్టి “మనస్సుయొక్క శక్తి” అంటే మన మనస్సునూ మన సొంత మనో ప్రవృత్తినీ ఉద్దేశాలనూ సజీవంచేసే లేక ప్రేరేపించే ఒక శక్తి అని అర్థం.
13. మన మానసిక ఉద్దేశాలు ఎందుకు నూతనమవ్వాలి?
13 మన అపరిపూర్ణ మనస్సులోని సహజ ప్రవృత్తి, ఉద్దేశాలూ భౌతిక, శారీరక, వస్తుసంబంధిత విషయాలపై ఉంటుంది. (ప్రసంగి 7:20; 1 కొరింథీయులు 2:14; కొలొస్సయులు 1:21; 2:18) ఒక వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని దాని చెడు ఆచరణలతో విడిచిపెట్టినా, అతని పాపభూయిష్ట మనో ప్రవృత్తి మారకపోతే, రేపోమాపో విడిచిపెట్టిన దానివైపు మారలా మరలే అవకాశముంది. పొగత్రాగటం, మద్యాన్ని సేవించడం మరి ఇతర చెడు అలవాట్లను పోగొట్టుకొనడానికి ప్రయత్నిస్తున్న అనేకుల అనుభవం కూడా ఇదేకదా? వారు తమ చిత్తవృత్తిలో మార్పులు చేసుకునే ప్రయత్నాలు చేయకపోయివుంటే, వాటివైపు మరల వెళ్లడం అనివార్యమే అవుతుంది. ఎలాంటి యథార్థమైన రూపాంతరానికైనా మనస్సును ఆధీనంలో ఉంచుకోవలిసిన అవసరముంది.—రోమీయులు 12:2.
14. చిత్తవృత్తి యొక్క శక్తి ఎలా నూతన పర్చబడగలదు?
14 మరి ఒకని మనస్సును సరైన దారిలో నడిపించేట్లు ఆ శక్తిని ఎలా నూతన పర్చవచ్చు. “నూతనపర్చబడినవారై” అన్న క్రియాపదము, కొనసాగే చర్యను సూచిస్తూ, గ్రీకు మూల గ్రంథంలో వర్తమాన కాలంలో ఉంది. కాబట్టి, దేవుని సత్య వాక్యాన్ని పఠించి, చిత్తవృత్తి నూతన పర్చబడగలదు అన్నదాని భావమేమిటని ఎల్లప్పుడూ ధ్యానించడంవల్ల నూతనపరచవచ్చును. మన మెదడులోని ఎలక్ట్రికల్ లేక రసాయన సాంకేతిక సంకేతనాల ద్వారా సినాప్సిస్ అనే అనేక కనెక్షన్లను దాటి న్యూరాన్ నుండి న్యూరానుకు సమాచారం చేరవేయబడుతుందని వైజ్ఞానికులు అంటున్నారు. “సంకేతిక సమాచారం సినాప్సిస్ నరం మీదుగా ప్రయాణించినప్పుడు ఒక జ్ఞాపకం లాంటిది అక్కడ ఏర్పడి, దాని ముద్రను అక్కడది వదిలి వెళుతుంది” అని ది బ్రేన్ అనే పుస్తకంలోవుంది. మరోసారి అదే సిగ్నల్ మరలా దానిగుండా వెళ్లినప్పుడు, నరంలోని కణాలు వాటిని గుర్తించి చాలా త్వరగా ప్రతిస్పందిస్తాయి. మనం ఆరోగ్యదాయకమైన ఆత్మీయాహారాన్ని తీసుకోవడంలో కొనసాగినప్పుడు, నూతన ఆలోచనా సరళి పెంపొందుతుంది, తద్వారా మన చిత్తవృత్తి నూతనమౌతుంది.—ఫిలిప్పీయులు 4:8.
“నవీన స్వభావమును ధరించుకొనవలెను”
15. నవీన స్వభావం ఏ భావంలో నవీనమౌతుంది?
15 “నీతియు యథార్థమైన భక్తిగలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీనస్వభావమును ధరించుకొనుడి” అని పౌలు చివరిగా అన్నాడు. (ఎఫెసీయులు 4:24) అవును, ఒక క్రైస్తవుడు నవీన స్వభావమును ధరించుకొంటాడు. ఇక్కడ “నవీన” అంటే సమయమని కాదుగానీ, నాణ్యత అని అర్థం. అంటే, నవీన పరచడంలో అత్యాధునికం అన్న భావంకాదు. అది “దేవుని పోలికగా సృష్టింపబడిన,” పూర్తి, నవీన, శుభ్రమైన స్వభావం ధరించుకొనుటే. కొలొస్సయులు 3:10 లో పౌలు ఇలాంటి భాషనే ఉపయోగిస్తూ, అది “దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడినది” అని అన్నాడు. ఈ నవీన స్వభావం ఎలా వస్తుంది?
16. నవీన స్వభావం, “దేవుని పోలికగా సృష్టించబడినది” అని ఎందుకు చెప్పవచ్చును?
16 ఆదాము హవ్వలను యెహోవా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించాడు. జంతు సృష్టినుండి చాలా అతీతంగా నిలిచేలా మానవులకు ఆత్మీయ నైతిక లక్షణాలను అందించాడు. (ఆదికాండము 1:26, 27) వారి అవిధేయత మానవులను పాపం, అపరిపూర్ణతలలో పడవేసినా, ఆదాము సంతానముగా ఇప్పటికీ మనకు నైతిక ఆత్మీయ లక్షణాలను ప్రదర్శించగల శక్తి ఉంది. విమోచనా బలియందు విశ్వాసముంచేవారు ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా వదులుకొని, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును” ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు.—రోమీయులు 6:6; 8:19-21; గలతీయులు 5:1, 24.
17. నీతి యథార్థతలు నవీన స్వభావంలో ఎందుకు ప్రాముఖ్యమైన లక్షణాలు?
17 నవీన స్వభావంలో నిజమైన నీతి యథార్థత అనే రెండు లక్షణాలున్నాయని పౌలు ప్రత్యేకించి చూపాడు. నవీన స్వభావము, దానిని సృష్టించిన దేవుని పోలిక చొప్పున నూతన పర్చబడుతుందని ఇది నొక్కితెలుపుతోంది. కీర్తన 145:17 మనకిలా చెబుతోంది: “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నింటిలో కృపచూపువాడు.” అంతేకాకుండా ప్రకటన 16:5 యెహోవాను గూర్చి ఇలా అంటోంది: “వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రు” డు. మనం దేవుని స్వరూపంలో సృజించబడ్డాం గనుక, ఆయన మహిమను మనం ప్రతిబింబించాలంటే, మనకు నీతి యథార్థతలు చాలా అవసరమైన లక్షణాలు. “జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను” తన ప్రజలకు అనుగ్రహించిన దేవున్ని స్తుతించేట్లు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి, జెకర్యాలవలె మనముకూడా చేద్దాం—లూకా 1:74, 75.
“వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి”
18. లోక విధానాలు వాటి వాస్తవిక రూపంలో మనం చూసేట్లు పౌలు మనకెలా సహాయపడ్డాడు?
18 ఎఫెసీయులు 4:17-24 లోని పౌలు మాటలను పరిశీలించిన తర్వాత, మనం యీ విషయమై చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. పదిహేడు, పందొమ్మిది వచనాల్లో, లోక విధానాల నిజస్వరూపాన్ని గుర్తించేలా పౌలు మనకు సహాయపడ్డాడు. దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి ఆయన యెడల తమ హృదయాన్ని కఠినపర్చుకుని, ఇంకా లోకంతో సంబంధాన్ని కలిగివున్నవారు జీవానికి ఆధారభూతుని నుండి తమ్మును తాము వేరుపర్చుకొంటున్నారు. తత్ఫలితంగా, వాస్తవిక ఉద్దేశం లేక నడిపింపులేకపోతే, వారి ప్రయాసలన్నీ నిష్ఫలమై ఎందుకూ కొరగానివవుతాయి. వారు నైతిక ఆత్మీయ దుస్థితిలో అంతకంతకూ మునిగిపోతున్నారు. ఎంత దయనీయ స్థితి! మరి మనం వెలుగు సంబంధులవలె నడుచుకోవడానికి అది ఎంత బలమైన కారణమోగదా!
19. చివరిగా, మనం వెలుగు సంబంధులవలే నడుచుకోవడానికి పౌలు మనకెలాంటి ప్రోత్సాహాన్నిస్తున్నాడు?
19 కేవలం సత్యంతో సహవసించడమే కాకుండా, యేసు జీవించినట్లు దాన్ని మనం మనఃపూర్వకంగా నేర్చుకోవాలని 20, 21 వచనాలలో పౌలు వక్కాణించాడు. చివరిగా 22 నుండి 24 వచనాల్లో మన ప్రాచీన స్వభావాన్ని తీసివేసి, కచ్చితంగా, తీర్మానపూర్వకంగా నవీన స్వభావాన్ని ధరించుకొనుడని పౌలు మనలను ఉద్బోధిస్తున్నాడు. ఈ మధ్యలో మన మనస్సులోని ఉద్దేశాలను ఆరోగ్యదాయకమైన ఆత్మీయ దారిలో నడిపించాలి. అన్నిటికంటే ముందు, మనం వెలుగు సంబంధులవలె నడుచుకొంటూ సహాయంకొరకు యెహోవాను అర్థించాలి. “అంధకారములోనుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.”—2 కొరింథీయులు 4:6. (w93 3/1)
మీకు జ్ఞాపకమున్నాయా?
▫ ఈనాడు మనం ఎలా “క్రీస్తును నేర్చు” కొనగలము?
▫ ప్రాచీన స్వభావాన్ని కచ్చితంగా ఎందుకు వదులుకోవాలి?
▫ చిత్తవృత్తి అంటే ఏమిటి మరి అదెలా నూతన పర్చబడగలదు?
▫ ఏ లక్షణాలు నవీన స్వభావాన్ని సూచిస్తాయి?
[బాక్సు]
“నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని యేసు అన్నాడు
[బాక్సు]
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు . . . ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించుడి.”—కొలొస్సయులు 3:8, 9
[బాక్సు]
“నీతియు యథార్థమైన . . . దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి.”—ఎఫెసీయులు 4:24