మనస్సునందు రూపాంతరం పొంది హృదయంలో వెలిగించబడుడి
“కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.”—ఎఫెసీయులు 4:17.
1. మన మనస్సు హృదయం మనకు ఏం చేస్తాయి?
మనస్సు, హృదయం మానవులకున్న అద్భుతమైన రెండు విభాగాలు. అవి ఎన్నోరకాల పనులు చేసినా, మనిషికీ మనిషికీ అవి అసమానంగా వుంటాయి. మన మనస్సూ హృదయం పనిచేసే విధానాన్ని బట్టి, మన వ్యక్తిత్వం, మాట, ప్రవర్తన, భావోద్రేకాలు, విలువలు ఎంతో తీవ్రంగా ప్రభావితం చెందుతాయి.
2, 3, (ఎ) “హృదయం,” “మనస్సు” అనే పదాలను బైబిలు ఎలా ఉపయోగిస్తోంది? (బి) మన మనస్సు హృదయాలపై మనం ఎందుకు శ్రద్ధ చూపించాలి?
2 బైబిలులో, “హృదయం” అనేది సామాన్యంగా పురికొల్పుకు, భావోద్రేకాలకు, అంతరంగ భావాలకు సూచనగా ఉంది. అలాగే “మనస్సు,” మేధస్సుకూ ఆలోచనకు పీఠంగా ఉంది. అయినా దేనికదే అన్నట్లుగా పనిచేయవు. ఉదాహరణకు, మోషే ఇశ్రాయేలీయులను ఇలా ఉద్భోదించాడు: “యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.” (ద్వితీయోపదేశకాండము 4:39) యేసును చంపడానికి ఎత్తులు వేస్తున్న శాస్త్రులతో ఆయన ఇలా అన్నాడు: “మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు.”—మత్తయి 9:7; మార్కు 2:6, 7.
3 మనస్సూ హృదయం రెండూ దగ్గిర బంధాన్ని కల్గివున్నాయని ఇది సూచిస్తోంది. అవి పరస్పర సంబంధాన్ని కల్గివుంటాయి. కొన్నిసార్లు కలిసికట్టుగా పనిచేయడానికి పరస్పరం సహకరించుకుంటాయి. అయినా అధికారంకొరకు తరచు పోటీలుపడుతుంటాయి. (మత్తయి 22:37; రోమీయులు 7:23 పోల్చండి.) అందుకని, యెహోవా దయను మనం పొందాలనుకుంటే, మన మనస్సు, హృదయముల స్థితిని తెలుసుకోవడమే కాకుండా, అవి రెండూ ఒకే తాటిపై సామరస్యంతో పనిచేసేలా మనం వాటికి తర్ఫీదునివ్వాలి. మనం మనస్సునందు రూపాంతరం పొంది, హృదయంలో వెలిగించబడాలి.—కీర్తన 119:34; సామెతలు 3:1.
‘అన్యజనులు నడుచుకొనునట్లు’
4. సాతాను ప్రజల మనస్సు హృదయాల్ని ఎలా ప్రభావితం చేసింది, దాని ఫలితమేమిటి?
4 సాతాను పచ్చి మోసగాడు, కుతంత్రాలకోరు. మనుష్యులను తన ఆధీనంలో ఉంచుకోవాలంటే, వారి మనస్సులనూ హృదయాలనూ ప్రభావింతంచేయాలని అతనికి తెలుసు. మానవ చరిత్ర ప్రారంభం నుండే దీని సాధించడానికి అతను ఒక ఎత్తు కాకపోతే మరొక ఎత్తు వేస్తున్నాడు. తత్ఫలితంగా, “లోకమంతయు దుష్టునియందున్నది.” (1 యోహాను 5:19) బైబిలు వీరిని “మూర్ఖమైన వక్రజనము” అని అనేంతగా సాతాను మనుష్యులను ప్రభావితంచేశాడు. (ఫిలిప్పీయులు 2:15) ఆ మూర్ఖమైన వక్ర జనాంగాల మానసిక, హృదయ పరిస్థితిని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా వివరించాడు, మరి ఈనాడు ఆయన మాటలు మనందరికీ ఒక హెచ్చరికగావున్నాయి. ఉదాహరణకు, ఎఫెసీయులు 4:17-19 చదివి, రోమీయులు 1:21-24 లోని పౌలు మాటలతో పోల్చండి.
5. ఎఫెసీయులకు పౌలు ఎందుకు బలమైన సలహాను ఇచ్చాడు?
5 ఎఫెసీ పట్టణ నైతిక పతనాన్ని, అన్యమత విగ్రహారాధనకు ప్రసిద్ధి చెందిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పౌలు ఎఫెసీయులుకు వ్రాసిన అతి బలమైన మాటలను మనం అభినందించగలం. గ్రీకులలో గొప్ప జ్ఞానులు తత్వవేత్తలు ఉన్నప్పటికినీ, వారి విద్య అనేకమంది ప్రజలు దుష్టక్రియలు చేయడానికి మరింత శక్తినిచ్చినట్లు, మరి వారి నాగరికతే వారు తమ దుష్క్రియలలో మరింత ప్రవీణ్యులగునట్లు తయారుచేసిందని అనిపిస్తోంది. అలాంటి వాతావరణంలో నివసించే తన తోటి క్రైస్తవుల యెడల పౌలు చాలా శ్రద్ధను చూపించాడు. అనేకులు అన్యజనులనీ, మరి వారు “యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొన్నారని” ఆయనకు ముందే తెలుసు. కాని ఇప్పుడు వారు సత్యాన్ని అంగీకరించారు. వారి మనస్సులు రూపాంతరమొంది, హృదయం వెలిగింది. అన్నింటికంటే ఎక్కువగా “పిలువబడిన పిలుపుకు తగినట్లు” నడుచుకొనండని వారిని పౌలు కోరాడు.—ఎఫెసీయులు 2:2; 4:3.
6. పౌలు మాటలలో మనమెందుకు ఆసక్తిని కల్గివుండాలి?
6 ఈనాటి పరిస్థితికూడా అలాగే ఉంది. అంతేకాకుండా, వక్ర తలంపులు, దివాళాతీసిన విలువలు, అబద్ధ ఆరాధనలాంటి అలవాట్లున్న లోకంలో మనం జీవిస్తున్నాం. మనలో చాలా మందిమి ఒకప్పుడు ఈ లోక విధానాన్ని అనుసరించి నడుచుకున్నాం. మనలో కొందరం ప్రతి రోజు లౌకిక దృక్పథం గల ప్రజలతో వ్యవహరించాల్సివస్తుంది. ఇంకొందరు లౌకికాత్మగల ప్రాంతాలలో నివసిస్తున్నారు. అందుకని పౌలు మాటలనూ ఆయన సలహానూ మనం అర్థంచేసుకోక తప్పదు.
వ్యర్థ, అంధకారమైన మనస్సులు
7. “తమ మనస్సుకు కలిగిన వ్యర్థత” అన్న మాటలో పౌలు ఏ భావాన్ని చూపించాడు?
7 “అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని” క్రైస్తవులకు పౌలు యిచ్చిన గట్టి హెచ్చరికను మరింత దృఢపరుస్తూ, “తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు” అన్న విషయాన్ని మొదట ప్రస్తావించాడు. (ఎఫెసీయులు 4:17, 18) దాని అర్థమేమిటి? ది యాంకర్ బైబిల్ ప్రకారం “వ్యర్థత” అని అనువదించబడిన పదం, “శూన్యత, పనికిరానిది, వ్యర్ధమైంది, తెలివితక్కువది, ఉద్దేశరహితమైంది, నిష్పలమైనవన్న అర్థాలనిస్తోంది.” కాబట్టి, గ్రీకు రోమన్ల పేరు ప్రతిష్టలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ, వాటిని వెంబడించడం వట్టి శూన్యం, అవివేకం, ఉద్దేశరహితం అని పౌలు చూపించాడు. పేరు ప్రతిష్టల మీద మక్కువగలవారు నిష్ఫలతనూ నిరాశనూ ఆహ్వానించవలసివస్తుంది. ఈనాటి లోకానికి సహితం యీ సూత్రం పనికొస్తుంది.
8. ఏ యే విధాలుగా లోక ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవి?
8 జీవిత ప్రారంభానికి, దాని సంకల్పానికి, మానవజాతి గమ్యానికి సంబంధించిన గంభీరమైన ప్రశ్నలకు సమాధాన మివ్వటానికి గాను ప్రజలకు ఈ లోక మేధావులూ జ్ఞానులున్నారు. అయితే ఎలాంటి పరిజ్ఞానాన్ని, నడిపింపును వారందిస్తున్నారు? నాస్థికత్వం, భౌతికవాదం, పరిణామసిద్ధాంతం, పురాతన మూఢాచారాలకంటే ఏమాత్రం జ్ఞానయుక్తం కాని ఆచార వ్యవహారాలూ, పరస్పర విరుద్ధతగల ఆలోచనలు, సిద్ధాంతాలను తప్ప ఏమి అందించడం లేదు. అనేక లౌకిక గమ్యాలు కొంతమేరకు సంతృప్తిని, సార్థకతను యిస్తున్నట్లు అనిపిస్తుంది. విజ్ఞానం, కళలు, సంగీతం, క్రీడలు, రాజకీయం మొదలైన వాటిలో తమ విజయాలను గూర్చి తాము సంపాదించినవాటిని గూర్చి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. మరు నిమిషంలో మరుగైపోయే వారి చిరు ఘనతకు మురిసిపోతుంటారు. అయితే వార్షిక సంఘటనలూ చరిత్రపుటలు, మరువబడిన నాయకుల కథలతో పూర్తిగా నిండివున్నాయి. ఇదంతా వట్టి శూన్యమైన, పనికిరాని, వ్యర్థమైన, అవివేకమైన, ఉద్దేశరహితమైన నిష్పలమైనదేతప్ప మరొకటికాదు.
9. ఎటువంటి వ్యర్థమైన లక్ష్యాలవైపు అనేకులు మరలుతున్నారు?
9 అలాంటి వ్యర్థ ప్రయాసలను గుర్తించి కూడా, అనేకులు విపరీతంగా డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో కొనగల వస్తువులను సంపాదించడం—వాటినే తమ జీవితధ్యేయంగా పెట్టుకొని ఐశ్వర్యం కొరకు ప్రాకులాడుతున్నారు. ఆస్తి అంతస్థులు, సుఖభోగాలవల్లనే ఆనందాన్ని పొందగలరని వారి దృఢవిశ్వాసం. దానికోసం వారు తమ మనస్సును అర్పించడమే కాకుండా, మరి దేనినైనా—ఆరోగ్యం, కుటుంబం, తుదకు వారి మనస్సాక్షిని సహితం త్యజించడానికి వెనుకాడరు. దాని ఫలితమేమిటి? తృప్తినొందకుండా వారు “నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” (1 తిమోతి 6:10) అన్యజనులు నడుచుకొనే ఆ వ్యర్థమైన ఆలోచనా సరళిలో నడవవద్దని పౌలు క్రైస్తవులను ఉద్భోదించడంలో ఆశ్చర్యంలేదు.
10. ఈ లోక ప్రజలు ఎలా “అంధకార మనస్సు” గలవారైవున్నారు?
10 ఈ లోకాన్ని చూసి ఈర్ష్యపడడానికి గానీ, లేక దాన్ని అనుకరించడానికి గానీ ఏమీ లేదని చూపించడానికి పౌలు, “వారైతే అంధకార మనస్సుగల” వారని అన్నాడు. (ఎఫెసీయులు 4:18) నిజమే, యీ లోకానికి దాదాపు ప్రతి పరిధిలోనూ దాని సంబంధిత మేధావులు, జ్ఞానులున్నారు. అయినప్పటికీ, వారు మానసిక అంధకారంలో ఉన్నారని పౌలు అన్నాడు. ఎందుకు? ఆయన వారి మానసిక కుశలత, సామర్థ్యతలను గూర్చి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచ లేదు. “మనస్సు” అన్న పదం మానవుని జ్ఞాన కేంద్రానికి, అవగాహనా పీఠానికి, అంతర్గత పురుషునికి కూడా వర్తించగలదు. వారు చేసే ప్రయత్నాలకు నడిపించే వెలుగుగానీ మార్గదర్శకం గానీ లేవు గనుక, వారు అంధకారంలో ఉన్నారు. అది వారి మంచి చెడులను వివేచింపలేని గందరగోళ పరిస్థితిని గమనిస్తే కనిపిస్తుంది. ఏదైనా చెల్లుతుందనే ఈనాటి విచక్షణారహిత మనోభావం జ్ఞానవంతమైందని అనుకుంటున్నారు గానీ, పౌలు చెప్పిన ప్రకారం నిజానికది మానసిక అంధకారం. ఆత్మీయ భావంలో వారు పూర్తి అంధకారంలో తడుముకుంటున్నారు.—యోబు 12:25; 17:12; యెషయా 5:20; 59:6-10; 60:2; వీటితో ఎఫెసీయులు 1:17, 18 పోల్చండి.
11. ఈ లోక మానసిక అంధకారానికి కారణమేమిటి?
11 మనుష్యులు అనేక విషయాలలో తెలివితేటలనూ సూక్ష్మబుద్ధిని కల్గివుండి కూడా ఎందుకు ఆత్మీయ అంధకారంలో ఉంటారు? 2 కొరింథీయులు 4:4 లో పౌలు ఈ ప్రశ్నకి సమాధానమిచ్చాడు: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” మహిమాన్విత సువార్తను గైకొనినవారు మనస్సున రూపాంతరం పొంది, హృదయంలో వెలిగించబడ్డారన్నది ఎంతటి అమూల్యాశీర్వాదమో కదా!
అజ్ఞాన, కాఠిన్య హృదయాలు
12. వారు ఏ విధంగా “దేవుని నుండి కలుగు జీవములోనుండి” వేర్పర్చబడ్డారు?
12 మనం మనస్సున రూపాంతరం పొంది హృదయంలో వెలిగించడానికి గల ఆవశ్యకతను చూపుతూ, లోక విధానం “దేవునివలన కలుగు జీవములోనుండి వేరు పర్చబడినదనే” విషయంవైపు పౌలు మన అవధానాన్ని త్రిప్పుతున్నాడు. (ఎఫెసీయులు 4:18) అంటే, ప్రజలు దేవున్ని నమ్మటం లేదని లేక వారికి అసలు దేవుడే లేడని కాదు. ఒక పత్రికా రచయిత ఆ విషయాన్ని ఇలా అన్నాడు: “అసలు దేవుడు లేడు అనడానికి బదులు, ఉన్నా-లేని దేవుడు అనే కొత్త పదాన్ని మనం కనుగొందాం. ఉన్నా-లేని దేవుడంటే, వారు దేవున్ని నమ్ముతారు కానీ, ఆయన్ని తరచూ మూత వేసి పెట్టెలో పెడుతుంటారు, మరి ఆదివారాలు మాత్రం ఆయన్ని బయటకు రానిస్తారు గానీ, మిగతావారాల్లో ఎన్నడూ తమ రాజకీయ దృష్టియందుగానీ లేక వారి వ్యక్తిగత జీవితాల్లో గానీ ఏమాత్రం జోక్యం చేసుకోనివ్వరు. కొద్దో గొప్పో వారు దేవుడ్ని నమ్ముతారు గానీ, ఈ ఆధునిక వ్యవస్థను గూర్చి పెద్దగా ఏమీ చెప్పలేడని వారు భావిస్తారు.” పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో ఆయన ఇలా అన్నాడు: “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు.” (రోమీయులు 1:21) తమ జీవితంలో దేవున్ని గూర్చి కొద్దిపాటి ఆలోచనకూడా లేని ప్రజలను మనం ప్రతి రోజూ చూస్తుంటాం. నిశ్చయంగా ఆయనంటే వారికి ఏ గౌరవ కృతజ్ఞతలూ లేవు.
13. “దేవునినుండి కలుగు జీవము” ఏది?
13 “దేవునివలన కలుగు జీవము” అన్న భావన చాలా ప్రాముఖ్యమైంది. అదింకా, విలువలయెడల మనుష్యుల భావాన్ని, మానసిక ఆత్మీయాంధకారం ఎలా నాశనం చేస్తుందో అన్న విషయాన్ని దృష్టీకరించింది. “జీవము” అని అనువదించిన ఈ పదం, జీవం లేక జీవిత విధానం అని భావం ఇచ్చే బైయోస్ కాదు (“బయాలజి,” “బయోగ్రఫీ” లాంటి పదాలు దీనినుండే వచ్చాయి). అది జోయి (“జూ,” “జూయాలజీ” వంటి పదాలు వచ్చిన పదం) నుండి వచ్చింది. వైన్స్ ఎక్సోసిటొరీ డిక్ష్నరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ వోర్డ్స్ ప్రకారం, దాని భావం “సూత్రప్రాయమైన జీవితం, సంపూర్ణ భావంలో జీవం, దేవుడుకల్గియున్నట్టి జీవం. . . . ఆదాము పాపం వలన ఈ జీవితం నుండి మానవుడు వైదొలగిపోయాడు.” కాబట్టి, మానసిక ఆత్మీయాంధకారం యీ లోక ప్రజలను దుర్నీతికి నడిపించడమే కాకుండా, దేవుడిచ్చే నిత్యజీవ నిరీక్షణనుండి కూడా దూరంచేసింది. (గలతీయులు 6:8) ఎందుకలా? పౌలు దీనికిగల కారణాన్ని మనకు చెబుతున్నాడు.
14. ఈ లోకం దేవునినుండి కలుగు జీవంనుండి వేర్పడడానికి గల కారణాలలో ఒకటేమిటి?
14 మొట్టమొదటి కారణం, అది “తమలోనున్న అజ్ఞానముచేత” అని అన్నాడు. (ఎఫెసీయులు 4:18) “తమలోనున్న” అన్న ఈ నుడికారం, అవకాశం దొరకనందున కాదు గానీ, దేవుని జ్ఞానాన్ని బుద్ధిపూర్వకంగా తిరస్కరించడం వలన కలిగిందని నొక్కి తెలుపుతోంది. ఈ నుడికారాన్ని ఇతర అనువాదాలు ఇలా అంటున్నాయి: “దేవున్ని ఎరుగుటకు వారి స్వతఃసిద్ధ తిరస్కారం” (ది యాంకర్ బైబిల్); “వారు తమ హృదయ ద్వారాలను మూసి వేసుకున్నారు గనుక వారికి జ్ఞానం లేదు” (జెరూసలెమ్ బైబిల్). వారు దేవుని జ్ఞానాన్ని త్రోసివేస్తారు లేక బుద్ధిపూర్వకంగా దాన్ని తిరస్కరిస్తారు గనుక, తన కుమారునిలో విశ్వాసముంచినవారికి యెహోవా అందించబోయే జీవాన్ని వారు అసలు అందుకోలేరు. ఆయన కుమారుడు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3; 1 తిమోతి 6:19.
15. దేవునినుండి కలుగు జీవము నుండి వైదొలగడానికి ఈ లోకానికి ఏది దోహదపడుతోంది?
15 పౌలు చెప్పిన ప్రకారం, సామాన్య లోకం దేవుడిచ్చు జీవాన్ని పొందకపోవడానికి మరోకారణం, “తమ హృదయ కాఠిన్యము.” (ఎఫెసీయులు 4:18) “కాఠిన్యము” అంటే ఇక్కడ మొద్దుబారిన చర్మంతో కప్పినట్లు కరుడుగట్టడమని భావం. మందమైన చర్మం ఎలా పెరుగుతుందో మనందరికీ తెలుసు. మొదట చర్మం మృదువుగా సున్నితంగా ఉండవచ్చు, కాని అది ఒక విధమైన ఒత్తిడికి లేక సంఘర్షణకు తరచూ గురైతే, అది మందమై కరుడుగట్టి, మొద్దుబారిన చర్మంగా తయారౌతుంది. దానికిక స్పర్శజ్ఞానముండదు. అదేవిధంగా, దేవుడు లేడనే భావనకు రావడానికి ప్రజలు కరుడుగట్టిన లేక మొద్దుబారిన హృదయంతో జన్మించరు. అయితే లౌకికాత్మగల యీ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం గనుక, మన హృదయాన్ని మనం కాపాడుకోకపోతే అది కరుడుగట్టడానికి లేక మొద్దుబారడానికి ఎంతో సమయం పట్టదు. అందుకనే పౌలు ఇలా హెచ్చరించాడు: “పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు . . . జాగ్రత్తగా చూచుకొనుడి.” (హెబ్రీయులు 3:7-13; కీర్తన 95:8-10) కాబట్టి అతి త్వరగా మనం మన మనస్సులో రూపాంతరం పొంది హృదయంలో వెలిగించబడాలి!
“సిగ్గులేనివారై”
16. లోక మానసిక అంధకారం మరియు దేవుని నుండి కలుగు జీవం నుండి అది వేర్పడడంవల్ల వచ్చే ఫలితమేమిటి?
16 ఇలా వేరైపోయి, అంధకారంలో ఉన్నందువల్ల కల్గే ఫలితాలను పౌలు ఇంకా సంగ్రహిస్తూ ఇలా అన్నాడు: “వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.” (ఎఫెసీయులు 4:19) “సిగ్గులేనివారైయుండి” అన్న మాటకు అక్షరార్థంగా “వేదనను అనుభవించకపోవడం,” నైతిక బాధను అభవించకపోవడం అని భావం. అలా ఒక మొద్దుబారిన హృదయం తయారౌతుంది. ఒకసారి మనస్సాక్షి బాధపడకపోతే, దేవునికి లెక్క ఒప్పజెప్పాలన్న భావనే లేకపోతే, దానికిక హద్దూపద్దూ ఉండదు. అందుకనే పౌలు, “తమ్మును తామే” కాముకత్వమునకూ అపవిత్రతకు “అప్పగించుకొనిరి” అని అన్నాడు. అది ఉద్దేశపూర్వకంగా చేసే బుద్ధిపూర్వక చర్య. బైబిలులో ఉపయోగించినట్లుగా “అశ్లీల స్వభావం,” సిగ్గులేని దురుసు ప్రవర్తన, చట్టాన్ని అధికారాన్ని దిక్కరించే స్వభావాన్ని సూచిస్తుంది. అదేవిధంగా, “నానావిధమైన అపవిత్రత” అంటే లైంగిక దుర్నీతేకాక ఎఫెసులోని అర్తెమి గుడిలో జరిగే గర్భోత్పత్తికి సంబంధించిన ఆచార వ్యవహరాల వంటి, లైంగిక దుర్నీతేకాక మతం పేరట జరిగే అవినీతి క్రియలూ ఇమిడి ఉంటాయి.—అపొస్తలుల కార్యములు 19:27, 35.
17. “దురాశతో” సిగ్గు లేకుండా పాపం చేసే వారిని గూర్చి పౌలు ఏమని చెప్పాడు?
17 కాముకత్వంలో, ప్రతి విధమైన అపవిత్రతలో అదుపు లేకుండా పాల్గొనడమనేది అంతగా చెడ్డదేమీ కాదన్నట్లు ప్రజలు భావించినా, అలాంటివారు “అత్యాసతో” వ్యవహరిస్తున్నారని పౌలు జోడించి అంటున్నాడు. ఇంకా కొంత నైతిక భావం గలవారు పాపం చేసినప్పుడు, వారు పశ్చాత్తాపపడి మరలా దాన్ని చేయకుండా ఉండడానికి తమ శాయశక్తులా కృషిచేస్తారు. “సిగ్గులేని” వారు “అత్యాశతో” పాపం చేస్తారు (“మరెక్కువ కోరుతారు,” ది యాంకర్ బైబిల్). ఒక రేడియో వ్యాఖ్యాత ఇలా అన్నాడు: “ఈ రోజు బండెక్కితే రేపు కొండెక్కాలనిపిస్తుంది.” వారు దుర్మార్గపు అంచుల్లోకి అతి వేగంగా వెళ్లాలని పరుగిడుతారు—అయినా వారికది మామూలే. “అన్యజనుల ఇష్టము” అనే మాటను ఎంత చక్కగా వివరించాడు!—1 పేతురు 4:3, 4.
18. సంగ్రహిస్తూ పౌలు లోక మానసిక ఆత్మీయ స్థితిని ఎలా వివరించాడు?
18 ఎఫెసీయులు 4:17-19 లోని కేవలం మూడు వచనాలలోనే ఈ లోకపు అసలైన నైతిక, ఆత్మీయ స్థితిని బయల్పరిచాడు. ఈ లోక జ్ఞానులు ప్రబోధించిన ఆలోచనలూ సిద్ధాంతాలు, ధనార్జన, వ్యసనాలను పూర్తిగా వ్యర్థమని ఆయన చూపిస్తున్నాడు. ఈ లోకం మానసిక ఆత్మీయాంధకారంలో ఉన్నందువలన నైతిక ఊబిలో చిక్కుకుని, క్షణక్షణానికి యింకా క్రిందికి దిగజారుతోంది. చివరికి స్వయం ప్రేరిత అజ్ఞాన కాఠిన్యమును బట్టి దేవుని నుండి కలిగే జీవాన్ని పొందలేకపోతుంది. కనుక అన్యజనుల త్రోవలో మనం కూడా నడవకుండా ఉండడానికి మనకు నిజంగా మంచికారణాలే ఉన్నాయి!
19. ఏ అవశ్యమైన ప్రశ్నలను ఇంకా పరిశీలించాలి?
19 లోకం దేవునినుండి వేర్పడడానికి కారణం మనస్సు, హృదయంలోని అంధకారమే గనుక, మన మనస్సు హృదయంలోని అంధకారాన్ని మనమెలా తీసివేసుకొనగలం? అవును, వెలుగు కుమారులుగా మనం నడవడానికీ, దేవుని కృప మనపైన ఎల్లప్పుడూ ఉండటానికి మనం ఏం చేయగలం? ఇవి తదుపరి శీర్షికలో పరిశీలించబడతాయి. (w93 3/1)
మీరు వివరించగలరా?
▫ ఎఫెసీయులు 4:17-19 లో పౌలు ఎందుకంత బలమైన సలహాను ఇచ్చాడు?
▫ లోక పద్ధతులు ఎందుకు వ్యర్థమైనవి, అంధకార సంబంధమైనవి?
▫ “దేవునినుండి కలుగు జీవము నుండి వేరుపరచబడుట” అన్న మాటకు అర్థం ఏమిటి?
▫ కాఠిన్య హృదయం, అంధకార మనస్సుల పరిణామాలేమిటి?
[చిత్రాలు]
ఎఫెసీ పట్టణం నైతిక పతనం, విగ్రహరాధనలకు ప్రఖ్యాతి చెందింది
1. ఎఫెసీలోని రోమా యోధుడు
2. అర్తెమి గుడి శిధిలాలు
3. ఎఫెస్సిలోని రంగస్థలం
4. ఎఫెసిలో అర్తెమి అను సంతాన దేవత
[బాక్సు]
ఎలాంటి జ్ఞానాన్ని ఈ లోక జ్ఞానులు అందించగలరు?
నీరో
[క్రెడిట్ లైను]
Musei Capitolini, Roma