పాఠకుల ప్రశ్నలు
ఒక క్రైస్తవుడు అనారోగ్యంగా ఉండి లేక ప్రయాణిస్తూ ఉండి జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరుకాకపోతే, అతడు ఒక నెల తరువాత దానిని ఆచరించవలెనా?
ప్రాచీన ఇశ్రాయేలులో పస్కా ప్రతి సంవత్సరం, నీసాను (లేక అబీబు) అను పేరుగల మొదటి నెల 14వ దినమున జరిగేది. కాని సంఖ్యాకాండము 9:10, 11లో ఒక ప్రత్యేక ఏర్పాటును మనము కనుగొనగలము: “నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము,—‘మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు రెండవనెల (యియ్యారు, లేక జివ్ అని పేరు) పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.”
ఒక ఇశ్రాయేలీయుడు లేక అతని కుటుంబము వారి అనుకూలతను బట్టి (నీసాను 14 లేక జివ్ 14న) పస్కా తేదిని ఎన్నుకొనుటకు ఇది రెండు ఎంపికలను నియమించడం లేదని గమనించండి. రెండవ నెలలోని పస్కా భోజన సౌకర్యం పరిమితమైనదే. ఒక ఇశ్రాయేలీయుడు నీసాను 14న ఆచార బద్ధంగా అశుభ్రంగా ఉంటే లేక పండుగ క్రమంగా జరిగింపబడే స్థలంనుండి చాలా దూరంలో ఉంటే మాత్రమే ఇది ఒక మినహాయింపు.
ఇది ఆచరింపబడినట్లు నమోదు చేయబడిన ఒకేఒక సంఘటన నమ్మకస్తుడైన హిజ్కియా రాజు పులియని రొట్టెల పండుగ యొక్క ఆచరణను పునరుద్దరించినప్పటిదే. అప్పుడు మొదటి నెలకై సిద్ధపడుటకు సమయం లేకపోయింది (యాజకులు సిద్ధం కాలేదు ప్రజలు కూడుకొనలేదు), అందుకని అది రెండవ నెల 14వ దినమున జరుపబడింది.—2 దినవృత్తాంతములు 29:17; 30:1-5.
అటువంటి మినహాయింపు పరిస్థితులలో తప్ప, యూదులు పస్కా పండుగను దేవుడు నియమించిన తేదీననే జరుపుకొన్నారు. (నిర్గమకాండము 12:17-20, 41, 42; లేవీయకాండము 23:5) యేసు, ఆయన శిష్యులు ఈ తేదిని యాదృచ్ఛికమైన దానిగా పరిగణింపక, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారమే జరుపుకున్నారు. లూకా ఇలా నివేదిస్తున్నాడు: “పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా, యేసు పేతురును యోహానును చూచి—మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.”—లూకా 22:7, 8.
ఆ సందర్భంలో యేసు క్రైస్తవులకు ప్రభువురాత్రి భోజనం అని పిలువబడిన సాంవత్సరిక వేడుకను ఏర్పరచాడు. క్రైస్తవులు దీనికి హాజరవడంలోని విలువను గూర్చి ఎక్కువగా నొక్కిచెప్పనక్కర లేదు. యెహోవాసాక్షులకు ఇది సంవత్సరంలోని అతి ప్రాముఖ్యమైన సంఘటన, అదెందుకంత ప్రాముఖ్యమో యేసు మాటలే చూపుతున్నవి; ఆయన ఇలా చెప్పాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” (లూకా 22:19) కాబట్టి, యెహోవాసాక్షులలో ప్రతి ఒక్కరు ఈ తేదిన ఏ ఇతర పనులు పెట్టుకోకుండా ఉండుటకు నెలల ముందే సిద్ధపడాలి. ప్రభువురాత్రి భోజనం ప్రాంతీయంగా ఏప్రిల్ 6, 1993, మంగళవారం, సూర్యాస్తమయం తరువాత జరుపబడుతుంది.
కొన్ని సందర్భాలలో అనుకోని పరిస్థితులు, అనారోగ్యం లేక ప్రయాణ చిక్కుల వంటివి, అతడు లేక ఆమె అనుకున్న విధంగా హాజరగుటకు ఒక క్రైస్తవున్ని ఆటంకపరచ వచ్చును. అటువంటి పరిస్థితులలో ఏమి చేయాలి?
అది జరుపబడుతున్నప్పుడు పులియని రొట్టెలు మరియు ఎర్రని ద్రాక్షారసము అందింపబడుతుంది, మరియు దేవుని పరిశుద్ధాత్మచేత అభిషేకించబడి పరలోక జీవితమునకై ఎన్నుకొనబడిన వారు పాలు పంచుకుంటారు. (మత్తయి 26:26-29; లూకా 22:28-30) ప్రతి సంవత్సరం తీసుకునే వారు ఈ సంవత్సరం అనారోగ్యంవల్ల ఇంట్లోనో లేక ఆసుపత్రిలోనో ఉంటే, ప్రాంతీయ సంఘ పెద్దలలో ఒకరు (రొట్టె ద్రాక్షారసాన్ని) అనారోగ్యుల వద్దకు తీసుకెళ్లి, సరైన బైబిలు లేఖనాలను చర్చించి, చిహ్నాలను అందించుటకు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఒక అభిషక్త క్రైస్తవుడు తన సంఘం నుండి దూరంగా ఉంటే, ఆ తేదిలో తాను ఎక్కడ ఉంటాడో ఆ ప్రాంతంలోని సంఘానికి వెళ్లుటకు ఏర్పాటు చేసుకోవాలి.
ఈ విషయాల దృష్ట్యా, సంఖ్యాకాండము 9:10, 11 మరియు 2 దినవృత్తాంతములు 30:1-3, 15 నందు చెప్పబడిన ఉదాహరణ ప్రకారం ఒక అభిషక్త క్రైస్తవుడు 30 దినాల (లూనార్ నెల) తరువాత ప్రభువురాత్రి భోజన వేడుకను జరుపుకొనుట అసాధారణమైన పరిస్థితులలోనే జరుగును.
భూపరదైసుపై నిత్యజీవిత ఉత్తరాపేక్షగల వారైన, యేసు యొక్క “వేరే గొర్రెల” తరగతికి చెందినవారు రొట్టె ద్రాక్షారసంలో పాలుపంచుకొనుడనే ఆజ్ఞ క్రిందలేరు. (యోహాను 10:16) సాంవత్సరిక వేడుకకు హాజరగుట ప్రాముఖ్యము, కాని వారు చిహ్నాలలో పాలుపంచుకొనరు. కాబట్టి వారిలో ఒకరు అనారోగ్యంగా లేక ప్రయాణిస్తు ఉండి ఆ సాయంత్రానికి ఏ సంఘంతోను కూడుకొన లేకపోయిన ఎడల, అతడు లేక ఆమె సందర్భానికి తగిన లేఖనాలను (యేసు ఏర్పరచిన వేడుకను గూర్చి ఉన్న వృత్తాంతంతో సహా) వ్యక్తిగతంగా చదువుకొని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనపై యెహోవా ఆశీర్వాదాల కొరకు ప్రార్థించాలి. కాని ఈ పరిస్థితిలో ఒక నెల తరువాత కూటము లేక ప్రత్యేక బైబిలు చర్చవంటి అదనపు ఏర్పాట్లు అవసరం లేదు.