“అడవి పువ్వులు”
నిరుద్యోగము. పెరుగుతున్న ధరలు. దారిద్ర్యము. ఆర్థిక మాంద్యం. ఈ మాటలు వార్తాలలో వినపడడం అంతకంతకు ఎక్కువై పోతుంది. అవి ఈనాడు కోట్లాదిమంది తమ కుటుంబాలకు కూడు, గుడ్డ, నీడనివ్వడానికి పడుతున్న పాట్లకు అద్దం పడుతున్నాయి.
దీని ప్రభావం విశ్వాసులపైన, అవిశ్వాసులపైన ఒకేరీతిగా ఉన్నది. కానీ విశ్వాసులు మాత్రం ఈ సమస్యలను ఎదుర్కోవడంలో ఒంటరివారు కాదు. మొదటి శతాబ్దంలో దీనస్థితిలోవున్న వారితో మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “ఆకాశ పక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్ఠులు కారా?”—మత్తయి 6:26.
యేసు ఇంకా ఇలా అన్నాడు: “అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతోకూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. . . . అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా?”—మత్తయి 6:28-30.
దీని భావం బ్రతుకుదెరువు కోసం క్రైస్తవుడు పనిచేయనవసరం లేదనా? ఎంతమాత్రమూ కాదు. తన ఖర్చులను భరించడానికి అవసరమైనంతమేరకు ఒక క్రైస్తవుడు పనిచేస్తాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “ఎవడైనను పనిచేయనొల్లనియెడల వాడు భోజనము చేయకూడదు.” (2 థెస్సలొనీకయులు 3:10) అయినప్పటికిని, క్రైస్తవుడు దేవుని ప్రేమగల శ్రద్ధను ఎరిగినవాడై, పరలోకపు తండ్రి తననుగూర్చి శ్రద్ధతీసుకొంటాడను విశ్వాసమును కలిగివుంటాడు. అందుచేత జీవిత చింతలనుబట్టి అతను సమతుల్యమును కోల్పోయినవాడై ఉండడు. కష్టసమయాల్లో కూడా అతను మొదటి విషయాలను అనగా—ఆత్మీయ విషయాలను—మొదటిగానే పెడతాడు. “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అను యేసు మాటలను అతను నమ్ముతాడు.—మత్తయి 6:33.