మంచి, చెడునెన్నటికైనా జయించగలదా?
దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం, నిర్దోషియైన యేసు ప్రాణాన్ని గూర్చి విచారణ జరిగింది. ఆయన సత్యము పలికినందుకుగాను దుష్టులు ఆయనను మట్టుపెట్టాలని కుట్రపన్నారు. ఆయన మీద రాజద్రోహపు అబద్ధ నేరారోపణనువేసారు. మరి ఆయనను హతమార్చాలని జనులు బొబ్బలుపెట్టారు. ఒక పేద వడ్రంగివాని ప్రాణంకన్నా తన స్వంత రాజకీయ ప్రతిష్టకు ఎక్కువ విలువనిచ్చే ఒక రోమా దేశపు అధిపతి, యేసుకు దారుణ మరణశిక్షను విధించాడు. బయటికి మాత్రం చెడు విజయం సాధించినట్లు కనిపించింది.
అయినా, తన మరణానికి ముందురోజు రాత్రి, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “నేను లోకమును జయించియున్నాను.” (యోహాను 16:33) అంటే, ఆయన భావమేమిటి? ఒక భావంలో, లోకంలోని కీడు ఆయనను కృంగదీయలేక పోవడమేకాకుండా ప్రతీకారవాంఛతో ఆయన ప్రవర్తించేలా చేయలేక పోయింది. లోకం, యేసును చెడు అనే అచ్చుపాత్రలోకి అదమ లేదు. (రోమీయులు 12:2, పోల్చండి ఫిలిప్స్.) “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని,” చనిపోయే సమయంలో సహితం తన్ను చంపేవారిగూర్చి యేసు ప్రార్థించాడు.—లూకా 23:34.
తన అంతిమ శ్వాసవరకు కూడా, కీడును జయించవచ్చునని యేసు ప్రదర్శించాడు. కీడుకు వ్యతిరేకంగా తమ పోరాటమును తామే పోరాడమని యేసు తన శిష్యులను ప్రేరేపించాడు. వారు ఆ పోరాటాన్ని ఎలా సాగించగలరు? యేసు చేసినట్లు, “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు” మరియు “మేలు చేత కీడును జయించుము” అన్న లేఖనాధార సలహాను పాటించడం వలన వారలా చేయగలరు. (రోమీయులు 12:17, 21) కానీ ఇలాంటి విధానం నిజంగా పనిచేస్తుందా?
డకావులో కీడును ఎదిరించుట
డకావులో బంధీగావున్న జర్మన్ దేశ స్త్రీయైన ఎల్జ, పద్నాలుగేండ్ల రష్యన్ బాలికకు ఒక అమూల్య బహుమానాన్ని అంటే, విశ్వాసం నిరీక్షణలను బహుమానంగా అందించింది.
డకావు అనేది ఒక పేరుమోసిన కాన్‌సెంట్రేషన్ క్యాంపు (కారాగారము), ఇందులో వేలాదిమంది చనిపోయారు. ఈ రష్యా బాలికతోసహా మరికొన్ని వందలమంది దారుణ వైద్యప్రయోగాలకు గురయ్యారు. డకావు చెడుతనానికే ఉనికిపట్టులా కనిపించింది. అయినా, అలాంటి బీటలువారిన నేలలో సహితం మంచి చిగురించి, ప్రవృద్ధి చెందిందికూడా.
ఎస్.ఎస్ గార్డులు తన తల్లిని దారుణంగా అత్యాచారం చేసిన దృశ్యాన్ని బలవంతంగా చూడవలసివచ్చిన ఆ యౌవన బాలిక గురించి ఎల్జ విపరీతంగా బాధపడింది. ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఎల్జ్ ఆ అమ్మాయితో మంచి చెడులగురించి, లేఖనాధార పునరుత్థాన నిరీక్షణను గురించి మాట్లాడే అవకాశాలకొరకు వెతికింది. తన యౌవన స్నేహితురాలికి ద్వేషించడం బదులు ప్రేమించడం నేర్పింది. ఎల్జ సహాయంతో ఈ రష్యా బాలిక భయంకర పరిస్థితులు గల డకావులో బ్రతికి బయటికి రాగలిగింది.
క్రీస్తు చూపిన స్వార్థరహిత మాదిరిననుసరించాలని ఎల్జ తాను చేయగల్గింది చేసింది. ఒక యెహోవాసాక్షిగా కీడుకు ప్రతికీడు చేయకూడదని ఆమె నేర్చుకుంది, మరియు ఇతరులు కూడా అలాగేచేయడానికి సహాయం చేసేందుకు తన విశ్వాసము ఆమెను నడిపింది. డకావులో ఆమె బాధలను అనుభవించినా, ఒక చెడ్డ ప్రభుత్వంపై ఆమె నైతిక విజయమొందింది. మరి ఇలాంటి విజయం పొందింది ఆమె ఒక్కతేకాదు.
ఎ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అనే తన పుస్తకంలో పాల్ జాన్‌సన్ “పూర్తిగా చెడ్డదని వారు నిందించిన నాజీ రాష్ట్రంతో సహకరించడానికి (యెహోవాసాక్షులు) వ్యతిరేకించారు. . . . తొంభైఏడు శాతం మంది ఏదోరకంగా హింసననుభవించారు.” అని తెలిపాడు. అది నిరాశాజనక పోరాటమా? వేల్యూస్ అండ్ వైలెన్స్ ఇన్ ఆస్క్‌విట్జ్స్ అనే పుస్తకంలో పోలిష్ సంఘ పరిశీలకురాలు, అన్నా పావెల్‌షిన్స్‌కా సాక్షులను గూర్చి ఇలా అన్నది: “ఈ చిన్న ఖైదీల గుంపు దృఢసిద్ధాంత సంబంధిత శక్తిగా విజృభించి, నాజీ సిద్ధాంత విరుద్ధంగా తన పోరాటాన్ని జయించింది.”
అయినా మనలో అనేకులందు జరుగుతున్న ప్రాధమిక పోరాటం బయటి చెడుప్రభావాలతో సాగే పోరాటం కాదుగానీ మన స్వంత ఉద్దేశాలతో సాగే పోరాటమే. అది మనలో చెలరేగే అంతర్గత పోరాటము.
మనలోని చెడును జయించుట
అపొస్తలుడైన పౌలు ఈ పొరాటాన్ని ఇలా వివరించాడు: “నేను చేయగోరిన మంచినికాదు నేను చేసేది; నేను చేయగోరని కీడే నేనెల్లప్పుడు చేస్తున్నాను.” (రోమీయులు 7:19, విలియమ్ బార్‌క్లే యొక్క ది న్యూ టెస్టమెంట్) పౌలు ఎరిగియున్నట్లు, మంచిచేయడమనేది ఎల్లప్పుడు సహజంగా రాదు.
అకాన్యో అనే స్పానిష్ యువకుడు, తన చెడు తలంపులతో రెండేండ్లు పోరాటాన్ని సాగించాడుa. “నాతో నేను చాలా కఠినంగా ప్రవర్తించవలసివచ్చింది” అని వివరిస్తున్నాడు. “చిన్ననాటినుండి అవినీతికర జీవనానికి సుముఖంగా ఉండేవాన్ని. ఒక యౌవనునిగా నేను ఇష్టపూర్వకంగా సలింగసంయోగంలో పాల్గొన్నాను; దాపరికం లేకుండా చెప్పాలంటే అలాంటి జీవితవిధానాన్ని నేను ఆనందించాను.” తుదకు మారాలనే కోరికను అతనిలో రేపిందేమిటి?
“దేవుని ప్రీతిపరచాలని నేను కోరుకున్నాను, మరి నా ప్రస్తుత జీవన శైలిని ఆయన అనుమతించడని నేను బైబిలు ద్వారా నేర్చుకున్నాను” అని అకాన్యో అన్నాడు. “కాబట్టి దేవుని నడిపింపుకు బద్ధుడనై, పూర్తిగా వేరే తరహా మనిషిగా మారాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రతిరోజు నా మనస్సులోకి జొచ్చుకువచ్చే అసహ్యమైన ప్రతికూల తలంపులతో నేను పోరాడవలసివచ్చేది. ఈ పోరాటాన్ని జయించాలని దృఢనిశ్చయం చేసుకుని, దేవుని సహాయార్థం నేను ఎడతెగక ప్రార్థించాను. నేను నాతో ఇంకా కఠినంగా వ్యవహరిస్తూవున్నా, రెండు సంవత్సరాల తర్వాత, చివరికి ఆ మిక్కిలి చెడు ప్రవర్తన అంతమైంది. అయితే ఈ పోరాటం మాత్రం ప్రయోజనకరమైనదే. నాకిప్పుడు ఆత్మగౌరవం, చక్కటి కుటుంబం, అన్నిటికంటే మిన్నగా దేవునితో ఒక మంచి సంబంధంవుంది. మీరు నిజమైన కృషి సల్పినట్లైతే—చెడు తలంపులు ఫలించకముందే వాటిని ఆరికట్టవచ్చునని నా వ్యక్తిగత అనుభవం.”
చెడు తలంపులను వ్యతిరేకించిన ప్రతిసారి, కీడుకు ప్రతికీడు చేయడానికి వ్యతిరేకించిన ప్రతిసారి మంచి, చెడును జయిస్తుంది. అయినా, ప్రాముఖ్యమైన అలాంటి విజయాలు, చెడుతనానికి ఆధారమైన రెంటిని సంపూర్ణంగా నిర్మూలించలేవు. ఎంత ప్రయత్నించినా, మనకు సంక్రమించిన బలహీనతలను మనం పూర్ణంగా అధిగమించలేము, మానవజాతిపై సాతాను ఇంకా తన చెడు ప్రభావం చూపుతూనేవున్నాడు. కాబట్టి ఈ పరిస్థితి ఎన్నడైనా మారుతుందా?
సాతానును పూర్తిగా నాశనం చేయుట
మరణం వరకు యేసు కనపర్చిన విశ్వాసం సాతానుకు ఒక గొప్ప ఓటమి. యేసు యథార్థతను భంగపరచడానికి సాతాను చేసిన ప్రయత్నం విఫలమైంది, ఆ ఓటమి సాతాను అంతానికి నాంది పలికింది. బైబిలు వివరించిన ప్రకారం, “అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు” యేసు మరణాన్ని చవిచూసాడు. (హెబ్రీయులు 2:14) పునరుత్థానం తర్వాత తన శిష్యులతో యేసు ఇలా అన్నాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్తయి 28:18) మరియు ఈ అధికారము సాతాను క్రియలను శూన్యపరచడానికి వినియోగించబడుతుంది.
యేసు సాతానును పరలోకంనుండి పడద్రోసే దినాన్ని ప్రకటన పుస్తకం వర్ణిస్తోంది. ఈ పరమ దుష్టుడు, అతని దయ్యాలు భూప్రాంగణానికి మాత్రమే పరిమితమవ్వవలసివుంది. తత్ఫలితంగా, చెడుతనం పెచ్చు పెరుగుతుందని బైబిలు హెచ్చరిస్తోంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:7-9, 12.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో—ఈ చారిత్రక సంఘటన అప్పటికే నెరవేరిందని బైబిలు ప్రవచనం చూపింది.b మన కాలంలో మనం చూసిన చెడుతనం యొక్క గణనీయ పెరుగుదలను అది వివరిస్తోంది. ఇక ముందు ఎవ్వరిని ప్రభావితం చేయ వీలులేకుండా సాతాను పూర్తిగా బంధించబడుతుంది.—ప్రకటన 20:1-3, చూడండి.—ప్రకటన 20:1-3ను పోల్చండి.
మానవజాతికి వీటంతటి భావమేమైయుండును?
“వారు కీడు చేయరు”
దేవుని రాజ్యానికి రాజుగా, ఆత్మీయ పునర్విద్యా కార్యక్రమాలను స్థాపించడానికి ఆయన తన ‘అధికారాన్ని భూమిపై’ వినియోగిస్తాడు. “లోకవాసులు నీతిని నేర్చుకొందురు.” (యెషయా 26:9) ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనబడతాయి. బైబిలు మనకీ అభయమిస్తోంది: ‘వారు హాని చేయరు [“వారు కీడు చేయరు” గ్రీన్స్ ఇంటర్లీనియర్ హీబ్రూ / గ్రీక్ ఇంగ్లీష్ బైబిల్] నాశనము చేయరు, సముద్రము జలములతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును’.—యెషయా 11:9.
ఇప్పుడుకూడా మనం అనేక చెడు వాంఛలను అధిగమించవచ్చు. దయ్యాల ప్రభావం పూర్తిగాలేనప్పుడు “కీడునుండి తొలగి మేలు చేయడం” నిశ్చయంగా అత్యంత సులభమౌతుంది.—1 పేతురు 3:11.
యేసు తన స్వంత మాదిరితో కనపర్చినట్టు, దేవుడు మంచివాడు కనుక మంచి చెడును జయిస్తుందని, ఆయన సహాయంతో మంచి చేయ ఆకాంక్షించేవారు చెడును జయించగలరని విశ్వసించడానికి ప్రతివిధమైన కారణాలు మనకున్నవి. (కీర్తన 119:68) చెడును ఇక ఎన్నటికీ లేకుండా తుడిచివేసేందుకు ఇప్పుడు చెడును ఎదిరించగోరేవారు, చెడును శాశ్వతంగా నిర్మూలించేందుకు అంకితమైన ప్రభుత్వమగు, దేవుని రాజ్యముచే పరిపాలించబడే శుభ్రపరచబడిన భూమిలో జీవించటానికి నిరీక్షించవచ్చును, దాని ఫలితాలను కీర్తనల రచయిత ఇలా వివరించాడు: “కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి. భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.”—కీర్తన 85:10, 11.
[అధస్సూచీలు]
a అది అతని అసలు పేరుకాదు.
b మరికొన్ని వివరాలకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ముద్రించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని 20-22 పేజీలు చూడండి.