మంచి-చెడుల మధ్య సుదీర్ఘపోరాటం
గత సినిమాల్లో “మంచివాడు” ఎల్లప్పుడూ దుష్టశక్తుల్ని ఓడించేవాడు. అయితే వాస్తవం మాత్రం అంత సులభం కాదు. తరచూ లోకంలో చెడే పైచేయిగా వున్నట్లు కనిపిస్తుంది.
ప్రతి రాత్రి వచ్చే వార్తలు భయంకరమైన దుర్వార్తలతో నిండిపోతున్నవి. అమెరికాలోని మిల్వాకీ ప్రాంతంలో ఒకడు 11 మందిని హత్యచేసి, ముక్కలుముక్కలైన వారి శరీరాలను తన ఫ్రిజ్‌లో దాచాడు. అటు దక్షిణ వైపున ఒక అపరిచితుడు టెక్సాస్‌లోని కేఫిటేరియాలోనికి దూసుకువెళ్లి, పది నిముషాలపాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపి తనతో పాటు 23 మందిని హతమార్చాడు. కొరియాలో నిరాశా పూరితుడైన ఓ విరోధి యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి నిప్పుపెట్టి 14 మంది ఆరాధికులను చంపేసాడు.
చెడుకు ప్రతీకగా నిలిచిన యీ కొన్ని సంఘటనలేగాక ప్రపంచం మీద ప్రభావం చూపే భయంకరమైన చెడొకటున్నది, అదే—జాతి నిర్మూలనం. ఈ శతాబ్దంలోనే జాతి, రాజకీయ విద్వేషాలమూలంగా పది లక్షలమంది ఆర్మేనియనులు అరవై లక్షల యూదులు పదిలక్షలకంటె ఎక్కువ కంబోడియనులు ఊచకోతకు గురయ్యారు. పూర్వపు యుగోస్లోవియలో జాతి వివక్షతను రూపుమాపుట అనేది అనేకుల మరణానికి దారి తీసింది. మరి లోకమంతట ఎన్ని లక్షలమంది అమాయకులు చిత్రవధకు గురయ్యారో ఎవరికి తెలియదు.
ఇటువంటి విచారకర సంఘటనలనుబట్టి, ప్రజలెందుకు అలా ప్రవర్తిస్తున్నారని మనం తప్పక ప్రశ్నించవలసివస్తుంది. మతి తప్పిన మనుష్యుల ప్రవర్తనా ఫలితమే యీ ఘోర కలి అని ఊరకనే కొట్టిపారేయలేం. మన తరంలో జరుగుతున్న యీ దురాగత పరిమాణాన్ని బట్టి అలాంటి వర్ణన సరిపోదు.
చెడుక్రియ అంటే నైతికంగా చెడ్డదని నిర్వచనం. అది మంచి చేయుటకును చెడును చేయుటకును మధ్య ఎంపిక చేసుకోగల ఓవ్యక్తిచేసే దారుణమే. ఏదోవిధంగా అతని నైతిక విచక్షణ వక్రమార్గం పట్టి చెడే పైచేయౌతుంది. అయితే ఎందుకు మరియు ఎలా ఇది జరుగుతుంది?
చెడునుగూర్చి మతపరంగా ఇచ్చే వివరణలు తరచూ అసంతృప్తికరంగా ఉన్నాయి. “దేవుడు చెడునే అనుమతించకపోతే మంచివెన్నో పోతాయి” అని కాథోలిక్ తత్వవేత్త థామస్ ఏక్వినాస్ అన్నాడు. ప్రొటెస్టెంట్ తత్వవేత్తలనేకులు అటువంటి అభిప్రాయాలనే కల్గియున్నారు. ఉదాహరణకు ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికాలో తెలుపబడినట్లు, గాట్‌ప్రెడ్ లీప్నిట్స్ చెడును, “మంచితో పోల్చితే లోకంలో అది కొట్టొచ్చినట్లు కనిపించేదిగా వుంటుందని” అన్నాడు. వేరేవిధంగా చెప్పాలంటే మనం మంచిని అభినందించడానికి మనకు చెడు అవసరమేనని అతడు నమ్మాడు. అటువంటి హేతువాదం ఇతరులు బాగున్నారని, నిజంగా జీవిస్తున్నారని భావించుటకే ఒక క్యాన్సర్ రోగికి జబ్బున్నదని చెప్పినట్లున్నది.
చెడు తలంపులు మరెక్కడనుండో రావాల్సి ఉన్నాయి. ఇందుకు దేవున్ని పరోక్షంగా నిందించాలా? బైబిలిలా సమాధానమిస్తుంది: “దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు.” దేవుడు కాకపోతే, ఇక మరెవరు దీనికి బాధ్యుడు? ఈ క్రింది వచనాలు సమాధానమిస్తున్నవి: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:13-15) అలా చెడు కోరికను తిరస్కరించకుండ దాన్ని దాచుకుంటే చెడుక్రియ పుడుతుంది. మరైతే అదంతటితో ఆగదు.
అనువంశిక అసంపూర్ణత అనే అసలు మానవ లోపాన్నిబట్టి యీ చెడుకోరికలు కల్గుతున్నాయని లేఖనాలు వివరిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) పారంపర్య పాపాన్నిబట్టి మన ఆలోచనా సరళిలో దయకు బదులు స్వార్థం, కనికరానికి బదులు క్రూరత్వం చోటుచేసుకోవచ్చును.
నిజమే, ఒకానొక ప్రవర్తన తప్పేనని సహజంగా చాలామందికి తెలుసు. వారి మనస్సాక్షి—లేదా పౌలు పిలిచినట్లు ‘వారి హృదయములందు వ్రాయబడిన ధర్మశాస్త్రము’—ఓ చెడు క్రియచేయకుండ వారిని నివారిస్తుంది. (రోమీయులు 2:15) అయిననూ, ఒక క్రూరవాతావరణం అట్టి ఆలోచనలను అణగద్రొక్కగలవు, మరి మనస్సాక్షిని మాటిమాటికి కాదంటే అది మృతతుల్యం కాగలదు.a—1 తిమోతి 4:2 పోల్చండి.
ఈనాటి సర్వవ్యాప్త చెడుకు కేవలము మానవ అసంపూర్ణతే సమాధానమీయగలదా? చరిత్రకారుడైన బర్ట్‌న్ రస్సల్ ఇలా అన్నాడు: “మనలో ప్రతి ఒక్కరిలోనూ చెడు ఉన్నదనుట వాస్తవమే గానీ పెద్దపెద్ద దురాగతాలను సహితం కలిపినా ఆస్క్‌విట్జ్ అనే నాజీ కారాగారానికి సాటిరావు. ఇక్కడ జరిగిన చెడు అనేది అటు పరిమాణంలోను ఇటు గుణగణాల్లోను విభేదంగా ఉన్నట్లు కనబడుతోంది.” చెడుకుగల యీ భిన్న మూలాన్ని ప్రత్యేకంగా ఎత్తిచూపించినవాడు యేసుక్రీస్తు తప్ప మరెవ్వరో కాదు.
తనను చంపజూసిన వారు పూర్తిగా వారి మనోగతాన్నిబట్టే అలా పథకం వేయలేదని యేసు తన మరణానికి కొంచెం ముందుగనే వివరించాడు. ఓ అదృశ్య శక్తివారిని నడిపించెను. యేసు వారితో ఇట్లన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వానియందు సత్యమేలేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు.” (యోహాను 8:44) ఈ లోకాధికారియని యేసు పిలిచిన యీ అపవాది చెడును పురికొల్పడానికి ప్రథమ పాత్రవహించుట స్పష్టమే.—యోహాను 16:11; 1 యోహాను 5:19.
మానవ అసంపూర్ణత, సాతాను ప్రభావం యీ రెండును వేల సంవత్సరాలుగా అధిక బాధలను వేదనను తెచ్చినవి. మరి వాటి పట్టు సడలిపోతున్నదనే సూచనేమి కానరావడంలేదు. మరి చెడు ఎల్లప్పుడూ నిలుస్తుందా? లేక మంచి శక్తులు చివరకు చెడును జయిస్తాయా?
[అధస్సూచీలు]
a దూరదర్శినిలో చూపించే హింసాత్మక దృశ్యాలకు, బాల్యనేరాలకు అవినాభావ సంబంధమున్నట్లు ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు. సంఘ విద్రోహ చర్యలకు అధిక నేరాలు జరిగే ప్రాంతాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు కూడ కారణమైయున్నవి. నాజీ జర్మనీలో నిరంతర జాతివివక్షతా ప్రబోధం యూదుల మీద స్లోవేనీయుల మీద దురాగతాలు చేయడం తప్పుకాదని సమర్థించుకోవడానికి—చివరకు అట్టి క్రియలను పొగడటానికి నడిపించాయి.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: U.S. Army photo
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Army photo