మన మహోన్నత సృష్టికర్తయందు ఆనందించుట
“ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానినిబట్టి సంతోషించుదురు గాక, సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.”—కీర్తన 149:2.
1. “ఎట్టకేలకు స్వాతంత్ర్యము వచ్చింది” అని బిగ్గరగా చెప్పినను, మానవజాతి నిజమైన పరిస్థితి ఏమిటి?
ఈనాటి లోకం “వేదనలతో” పీడింపబడుతున్నది. ఆ 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధముతో ఆరంభమైన విపత్కర కాలమగు “యుగసమాప్తిని” గూర్చి తాను చెప్పిన ప్రవచనమందు యేసు ఆ మాట నుపయోగించాడు. (మత్తయి 24:3-8) భవిష్యత్తు అంధకారమయం తప్ప యింకేమీ లేదని అనేకమంది రాజకీయ నాయకులు గ్రహించారు. తూర్పు ఐరోపాలో “ఎట్టకేలకు స్వాతంత్ర్యము వచ్చింది” అనే నినాదము చేసినను, ఆ ప్రాంతపు మాజీ అధ్యక్షుడు పరిస్థితిని యిలా సంగ్రహముగా చెప్పాడు: “జనాబా పెరుగుదల, హరితగృహ ప్రభావం, ఓజోనులో రంధ్రాలు, ఎయిడ్స్, అణు ఆయుధ ఉగ్రవాద బెదిరింపు, ఉత్తరభాగ సంపన్న దేశాలకు, దక్షిణభాగ బీద దేశాలకు మధ్య నాటకీయంగా పెరుగుతున్న అంతరం, కరవు ప్రమాదం, భూమిపైనున్న జీవకోటి, ఖనిజ వనరులు క్షీణించిపోవడం, దూరదర్శిని వాణిజ్యపరమైన విస్తృత ప్రసార ప్రభావం, పెరుగుతున్న ప్రాంతీయ యుద్ధాల భయం—ఇవి వీటితోపాటు యింకా వేలాది ఇతర కారకములు మానవ జాతి అంతటికి ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.” ఈ తుది వినాశన ప్రమాదాన్ని ఏ మానవ శక్తియు తీసివేయజాలదు.—యిర్మీయా 10:23.
2. మానవజాతి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని ఎవరు కలిగియున్నారు, ఆయనిప్పటికే ఏ చర్య గైకొన్నాడు?
2 అయితే మనం ఆనందించగలం, ఎందుకంటె మన మహోన్నత సృష్టికర్త ఒక శాశ్వత పరిష్కారాన్ని కలిగియున్నాడు. యేసు చెప్పిన ప్రవచనమందు “యుగసమాప్తి” ఆయన అదృశ్య “ప్రత్యక్షతకు” ముడిపెట్టబడింది. (మత్తయి 24:3, 37-39) “క్రొత్త ఆకాశములను” సృష్టించుటకు, యెహోవా తన సింహాసనముపై యేసును మెస్సీయ రాజుగా కూర్చుండబెట్టాడు, కాగా ఈ చరిత్రాత్మక సంఘటన పరలోకంలో 1914వ సంవత్సరమందు జరిగిందని ప్రవచన రుజువు చూపిస్తున్నది.a (2 పేతురు 3:13) సర్వాధిపతియగు యెహోవాతో సహపాలకునిగా యేసు ఇప్పుడు జనములకు తీర్పుతీర్చి భూమిమీద మూర్ఖులైన మేకల వంటి వారినుండి దీనులైన గొర్రెలవంటి ప్రజలను వేరుచేయు ఆజ్ఞ పొందాడు. ఆ భక్తిహీన “మేకలు” “నిత్యశిక్షకు,” “గొఱ్ఱెలు” ఆ రాజ్యపు భూపరిధిలో నిత్యజీవము పొందుటకు నిర్దేశింపబడుదురు.—మత్తయి 25:31-34, 46.
3. ఉల్లసించుటకు నిజమైన క్రైస్తవులకు ఏ కారణము కలదు?
3 యుగములకు రాజైన యెహోవా తన కుమారుని రాజ్యముద్వారా తన దివ్య సంకల్పాలన్నింటిని తుదిఘట్టానికి తీసుకు వస్తుండగా, భూమిపైగల ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము విధేయులైన గొర్రెలయొక్క గొప్పసమూహముతో కలిసి, ఆయనయందు ఆనందించు ప్రతి కారణమును కలిగియున్నారు. వారిట్లు చెప్పగలరు: “ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు, . . . కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించునట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.” (యెషయా 61:10, 11) యెహోవాకు స్తుతి గీతాలు పాడుటకు జనములనుండి ప్రస్తుతం సమకూర్చబడుచున్న లక్షలాదిమందిలో ఈ “ఉజ్జీవం” రుజువగుచున్నది.
‘త్వరపెట్టుట’
4, 5. (ఎ) దేవుని ప్రజల సమకూర్పు ఎట్లు ప్రవచింపబడింది? (బి) ఈ 1992 సేవా సంవత్సర కాలములో ఎటువంటి అసాధారణమైన అభివృద్ధి కన్పించింది?
4 సాతాను విధానాంతము సమీపిస్తుండగా ఈ సమకూర్చు పని వేగం పుంజుకుంటున్నది. మన మహోన్నత సృష్టికర్త యిలా అంటున్నాడు: “నీ జనులందరు నీతిమంతులై యుందురు . . . , వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి, . . . వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును. ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:21, 22) ఈ విధంగా త్వరపెట్టబడుట ఈ పత్రికలో 12 నుండి 15 పేజీలలో ప్రచురింపబడిన యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త 1992వ సేవా సంవత్సరపు నివేదికలో అద్భుతంగా ప్రతిబింబించినది.
5 రాజ్యప్రచారకుల 44,72,787 క్రొత్త శిఖరాగ్రసంఖ్య ఈ నివేదికలో ఒక విశేషమై యున్నది, ఇది గత సంవత్సరముకంటె 1,93,967—4.5 శాతం ఎక్కువ అభివృద్ధి. ఈ 1992లో 3,01,002 మంది అధిక సంఖ్యలో బాప్తిస్మం పొందారనుట ప్రజలు గొప్ప సంఖ్యలో బైబిలు సత్యాన్ని అంగీకరిస్తున్నారను వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నది. “అంధకారమయమైన” ఈ కాలంలో మిడుతల దండును పోలిన “బలమైన యొక గొప్ప సమూహము” “భూదిగంతముల వరకు” రాజ్య సాక్ష్యాన్ని విస్తరింపజేస్తున్నందుకు మనమెంతగా ఆనందించగలం! (యోవేలు 2:2, 25; అపొ. కార్యములు 1:8) మంచుతో నిండియున్న అలస్కా నుండి—మంచుతో కప్పబడిన ఈ ప్రాంతాల్ని వాచ్‌టవర్ సొసైటి విమానం ద్వారా 50 సార్లకుపైగా సందర్శించడం జరిగింది—ఎడారి ప్రాంతాలగు మాలి, బుర్కీనా ఫాసో, ఆలాగే మైక్రొనేసియా దీవుల వరకు, యెహోవా సేవకులు “భూదిగంతముల వరకు . . . నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, అన్యజనులకు వెలుగుగా” ప్రకాశిస్తున్నారు.—యెషయా 49:6.
6, 7. ఇటీవలి సంవత్సరములలో పరిస్థితిలో ఎటువంటి అనుకోని మార్పు జరిగింది, దానికి యెహోవా సేవకులెట్లు ప్రతిస్పందించారు?
6 తన ప్రజల్ని కాపాడి, సంరక్షించుటలో యెహోవా ఒక దుర్గముగా, బలమైన కోటగా ఉండెను. ప్రపంచమందలి అనేక ప్రాంతాలలో యెహోవాసాక్షులు దశాబ్దాలపాటు కౄరమైన అణచివేతను, హింసను భరించాల్సి ఉండిరి. (కీర్తన 37:39, 40; 61:3, 4) అయితే ఇటీవలనే, ఒక అద్భుతం జరిగిందన్నట్లు, మన మహోన్నత సృష్టికర్త భూమిపై క్రీస్తును రాజుగా నియమించాడనే విషయాన్ని దేవుని ప్రజలిప్పుడు స్వేచ్ఛగా ప్రకటింపగల్గునట్లు దాదాపు 21 దేశాలలో నిషేధాలను, అడ్డంకులను ఎత్తివేశారు.—కీర్తన 2:6-12.
7 క్రొత్తగా లభించిన స్వాతంత్ర్యాన్ని యెహోవా ప్రజలు సద్వినియోగపరస్తున్నారా? ఆ పట్టికనుండి తూర్పు ఐరోపానందలి బల్గేరియా, రుమేనియా, మాజీ సోవియట్ యూనియన్ ఆలాగే ఆఫ్రికాలోని అంగోలా, బెనిన్, మొజాంబిక్‌లలో కలిగిన అభివృద్ధిని గమనించండి. జైరిలో సహితం, విస్తరణ అమోఘంగా వుంది. స్వేచ్ఛ లభించిన మన సహోదరులు హృదయానందముతో ఈ పిలుపుకు ప్రత్యుత్తరమిస్తున్నారు: “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి . . . , ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును.” (కీర్తన 136:1, 4) రాజ్య పక్షముగా గొర్రెలవంటి ఇతర ప్రజలను సమకూర్చే ఆసక్తిపూర్వక సేవద్వారా ఈ కృతజ్ఞతా స్తుతులు వ్యక్తపర్చబడుతున్నవి.
8. ఐరోపాలోను, ఆఫ్రికాలోను యెహోవాను క్రొత్తగా స్తుతింపవచ్చిన వారు “మేఘమువలె” ఎట్లు ఎగసి వస్తున్నారు?
8 ఐరోపానందు గత వేసవిలో, మాజీ కమ్యూనిస్టు దేశాలలో జరిగిన యెహోవా ప్రజల సమావేశాలకు తండోపతండాలుగా ప్రజలు హాజరయ్యారు. అనుబంధ పట్టిక చూపునట్లు, బాప్తిస్మం పొందిన వారి సంఖ్యలు మరింత ఆశ్చర్యం గొల్పేవిగా ఉన్నవి. అదే ప్రకారం, ఆఫ్రికానందలి టొగొలో 1991 డిశంబరు 10న, నిషేధం ఎత్తివేయబడింది. ఆ తర్వాతి నెలలోనే అక్కడొక జాతీయ సమావేశం జరిగింది. ప్రాంతీయ సేవలోనున్న 6,443 నెలసరి సగటు ప్రచారకులతో పోలిస్తే, 556 మంది బాప్తిస్మము పొందుటతోపాటు వీటికి అధిక సంఖ్యలో హాజరైన 25,467 మందితో కలిపి అది ప్రచారకులలో 8.6 శాతము అభివృద్ధి. యెషయా 60:8 చిత్రీకరించినట్లుగా, యెహోవాను క్రొత్తగా స్తుతింప వచ్చువారు “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు,” అనగా యెహోవా ప్రజల సంఘములకు ఎగసివస్తున్నారు.
9. ఇటీవల స్వేచ్ఛ లభించిన దేశాల్లోని క్రైస్తవులు ‘తిని తృప్తిపొందునట్లు’ ఏ యేర్పాట్లు చేయబడ్డాయి?
9 తూర్పు ఐరోపా, ఆఫ్రికాలలో ఆత్మీయాహారము కొరకైన ఆకలి తీవ్రత తగ్గించబడింది. జర్మనీ, ఇటలీ, దక్షిణాఫ్రికాలలోని వాచ్‌టవర్ సొసైటి కర్మాగారాలు ఆత్మీయముగా అలమటిస్తున్న దేశాలకు అనేక భాషలలో లారీల వెంబడి లారీల సాహిత్యాల్ని పంపించాయి. ఇంతకుముందైతే, అనేకమంది సాక్షులు పత్రికల ఫొటోకాపీలు తీసుకుని ఒకరికొకరు అందజేసుకుంటూ వుండేవారు, ఇప్పుడైతే వారు సమృద్ధిగా ఆత్మీయాహారమును పొందుచున్నారు. వారు ఈ ప్రవచన నెరవేర్పునందు భాగము వహించుటకు ఎంతగానో ఆనందిస్తున్నారు: “మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతింతురు.”—యోవేలు 2:25.
భవిష్యత్ విస్తరణ కొరకు శ్రద్ధచూపుట
10. జ్ఞాపకార్థ దినానికి హెచ్చు సంఖ్యలో ప్రజలు హాజరైన దృష్ట్యా, ఆసక్తిగల వారందరికి ఎలాంటి ఆహ్వానమివ్వబడింది?
10 యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ప్రపంచ వ్యాప్తముగా హాజరైన వారి సంఖ్య నిజంగా ఆశ్చర్యకరముగా వున్నది. దానికి హాజరైన వారి సంఖ్య 1,14,31,171 కాగా అది పోయిన సంవత్సరం మీద 7,81,013, లేదా 7.3 శాతం అభివృద్ధి. క్రొత్తగా దానికి హాజరైన వారలారా సుస్వాగతం! క్రొత్తగా ఆసక్తి చూపిన అట్టి వారందరు యెహోవాసాక్షులలో ఒకరిద్వారా గృహ బైబిలు పఠన ప్రయోజనాన్ని అనుభవించుట ఎంత అద్భుతంగా ఉంటుంది! (యెషయా 48:17 చూడుము.) ఇలాంటి పఠనములు ప్రతినెల 42,78,127 నిర్వహింపబడుతున్నాయని సేవా సంవత్సర నివేదిక చూపుచున్నది, యిది చక్కని 8.4 శాతం అభివృద్ధి. అయితే, యింకా అనేకమంది ఈ సేవను తమకొరకు వినియోగించుకోవచ్చును. ఆసక్తిగల వారి గృహమందే ఉచిత బైబిలు పఠనాన్ని నిర్వహించుటకు వారిని క్రమంగా సందర్శించి, ఆ విధంగా వీరు నిత్యజీవపు మార్గాన స్థిరంగా కాళ్లూని నిలుచునట్లు సహాయపడుటకు యెహోవాసాక్షులు ఎంతగానో సంతోషిస్తారు. (యోహాను 3:16, 36) అటువంటి పఠనాన్ని ఎందుకు ఆర్థించకూడదు? ఆలాగే రాజ్యమందిరానికి మీరు సాదరంగా ఆహ్వానింపబడుచున్నారని కూడా మరచిపోవద్దు.—కీర్తన 122:1; రోమీయులు 15:7.
11, 12. (ఎ) కొన్ని దేశాల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది? (బి) సంపన్న, బీదదేశాల మధ్య “అందరికి సమానము,” అనుట ఏ విధంగా నెరవేరుచున్నది?
11 చక్కని రాజ్యమందిరాలు కలిగియున్న సంఘాలు ఎంతగానో ఆశీర్వదించబడ్డాయి. రహస్యంగా చిన్న గుంపులుగా కూడుకుంటూ నిషేధముల క్రింద అనేక సంవత్సరాలు సహించిన యథార్థ సాక్షులున్న దేశాలలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటువంటి అనేక ప్రాంతాలలో, వారిప్పుడు స్వేచ్ఛగావున్నను వారు కేవలము కొన్ని రాజ్యమందిరాలనే కలిగియున్నారు. ఉదాహరణకు, ఒక ఆఫ్రికా దేశములో 93 సంఘములకు కేవలము మూడు రాజ్యమందిరాలే ఉన్నవి. కాబట్టి కూటములు సాధారణంగా పెద్దపెద్ద ఖాళీ ప్రదేశాలలో నిర్వహింపబడుతున్నాయి. ఈ కూటములకు 150 మందివున్న ఒక సంఘానికి దాదాపు 450 మంది క్రమంగా హాజరుకావచ్చును.
12 తూర్పు ఐరోపాలో స్థలం కొనడం లేదా మందిర నిర్మాణం చాలాకష్టం, అయితే కొంతమేరకు అభివృద్ధి సాధించబడుతుంది. పోలెండులో నవంబరు 28, 1992న చక్కని ఒక క్రొత్త బ్రాంచికార్యాలయ వసతి ప్రతిష్ఠింపబడే ఏర్పాటు చేయబడింది. మందిరాలు ఇతర వసతుల నిర్మాణ సహాయార్థమై యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి ఎంతో ఉదారంగా ఇవ్వబడిన చందాలు ఉపయోగింపబడుచున్నవి. ఆ విధంగా, అననుకూల దేశాలలోని సంఘాల ఆత్మీయ అవసరత తీర్చుటలో సహాయపడుటకు తమ “సమృద్ధినుండి” సహోదరులు ఉదారముగా చేయూతనిచ్చుటవల్ల “అందరికి సమానము” అనుట నెరవేరుచున్నది.—2 కొరింథీయులు 8:14, 15.
నూరుకోట్ల గంటలు!
13. ప్రకటించుటకు, బోధించుటకు 1992లో ఎన్ని గంటలు వెచ్చింపబడినవి, ఈ సంఖ్యలో ఎవరి కృషి ప్రతిబింబిస్తున్నది?
13 ఆ నూరుకోట్ల గంటలతో నీవేమి చేయుదువు? నిత్య జీవము పొందు వారందరు యెహోవాకు ఫలదాయకమైన, సంతృప్తికరమైన సేవచేయుటలో అన్ని గంటలు, ఇంకా ఎక్కువ గంటలు సహితం వెచ్చించగలరు. అయితే ఆ గంటలన్నింటిని ఒక సంవత్సరంలో కుదించడాన్ని ఊహించండి! అదే యెహోవా ప్రజలు 1992లో నెరవేర్చారు. రాజ్య ప్రచారకులందరి వ్యక్తిగత రిపోర్టులను ఒకటిగా కలిపితే, మన మహోన్నత సృష్టికర్తను స్తుతించుటకు, “బహిరంగముగాను, ఇంటింటను . . . బోధించుటకు” శ్రేష్ఠమైన విధంగా వెచ్చింపగల గంటలు ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలో 102,49,10,434 గంటలు వెచ్చింపబడడాన్ని మనం కనుగొంటాము. (అపొ. కార్యములు 20:20) ప్రతినెల సగటున 42,89,737 మంది సాక్షులు రిపోర్టు చేస్తున్నారు. వారు సమాజంలో వివిధ స్థాయిలనుండి వచ్చిన వారు. కొంతమంది రాజ్య పనికి దోహదపడగల పరిమిత సమయాన్ని మాత్రమే కలిగియున్నారు. వీరిలో తమ కుటుంబాన్ని పోషించాల్సిన కుటుంబ యజమానులు; వృద్ధులు; అనేకమందికి ఆరోగ్య సమస్యలున్నాయి; ఆలాగే పాఠశాలకు వెళ్లే పిల్లలును ఉన్నారు. అయినప్పటికిని, ప్రతివారు తయారుచేసిన రిపోర్టు యెహోవా యెడల వారు చూపిన ప్రేమకు విలువైన ప్రతిరూపమై యున్నది.—లూకా 21:2-4 పోల్చుము.
14. యౌవనులెట్లు ‘తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొన్నారు’?
14 యెహోవా సేవలో యువతరం అభివృద్ధి చెందుతుంది, సంతోషదాయకమైన విషయమేమంటే వీరిలో చాలామంది, “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని ప్రసంగి 12:1లోగల సొలొమోను మాటలను అన్వయిస్తున్నారు. భక్తిపరులైన తమ తలిదండ్రులచే ఆత్మీయ విషయాల్లో తర్ఫీదు పొందుచు, పాఠశాల పనిలో వారు కృషిచేస్తున్నారు. ఇటీవలి సమావేశములలో బాప్తిస్మము పొందుటకు ఎక్కువ సంఖ్యలో యౌవనులు లేచి నిలువబడడం చూడముచ్చటగా ఉండెను. అనేకమంది ఏదొక నైపుణ్యతను లేదా పనిని నేర్చుకొనుట ద్వారా పాఠశాల చదువు అయిపోయిన తర్వాత పయినీర్ సేవకొరకు అభ్యాసపూర్వకంగా సిద్ధపడుతున్నారని తెలిసికొనుట సంతోషాన్ని కల్గిస్తుంది. ఆ విధంగా వారు, ఆయా సమయాల్లో గుడారములు కుట్టిన పౌలువలెనే తమ కాళ్లపై తామే నిలువబడగలరు.—అపొ. కార్యములు 18:1-4.
15, 16. రాజ్యాభివృద్ధికి పయినీర్లు, ఇతర పూర్తికాల సేవకులు ఎట్లు దోహదపడిరి, వారిలో కొందరెట్టి ఆశీర్వాదము ననుభవించారు?
15 రాజ్య పని అభివృద్ధి చెందుటకు పయినీర్లు, ఇతర పూర్తికాల సేవకులు ఎంత బృహత్తరంగా దోహదపడుచున్నారు! గడచిన సంవత్సరంలో పయినీర్ల సంఖ్య శిఖరాగ్ర స్థాయిలో 9,31,521 మందికి చేరుకున్నది. వీరు ప్రతిదినం ఇంటింట ప్రకటిస్తూ, ప్రజల గృహాలలో బైబిలు పఠనములు నిర్వహిస్తుండగా, వారు లేఖనములను మరింత సమర్థవంతముగా వ్యక్తపరచగల వారిగా తయారగుచున్నారు. అంతేకాదు, దేవుని పనిలో మరింత సామర్థ్యాన్ని, ఆనందాన్ని పెంపొందించుకొనుటకు సహాయంచేసే, రెండువారాల పయినీర్ సేవా పాఠశాలకు హాజరగుటకు అనేకమంది అర్హులయ్యారు.
16 ఈ నమ్మకమైన పయినీర్లలో ప్రతివారు యెషయా 50:4లోని ఈ మాటల్ని స్వీకరించగలరు: “అలసినవానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు.” తమ చుట్టూవున్న అవినీతి లోకమును బట్టి అలసినను, మన నమ్మకమైన పయినీర్ల ద్వారా వాక్యం విని ఊరట పొందుచున్న జనులీనాడు అనేకమంది ఉన్నారు.—సామెతలు 15:23; యెహెజ్కేలు 9:4 పోల్చుము.
బారీ నిర్మాణ కార్యక్రమము
17. ఆత్మీయ నిర్మాణమునకు తోడుగా, ఇటీవల సంవత్సరాలలో ఎటువంటి భౌతిక నిర్మాణం కూడా జరిగింది?
17 ప్రపంచ వ్యాప్తముగా యెహోవాసాక్షులకు కలుగుచున్న ఆత్మీయ క్షేమాభివృద్ధినిబట్టి వస్తుదాయక పురోగతి కూడా అవసరమయ్యింది. ముద్రణా వసతులను, కార్యాలయములను, బేతేలు గృహములను విస్తరించుట, రాజ్య మందిరాలను, సమావేశ మందిరాలను నిర్మించుట అవసరమయ్యింది. కావున యెహోవాసాక్షులు భౌతికముగా కూడ నిర్మించువారిగా తయారు కావలెను. ఇటువంటి నిర్మాణమే సొలొమోను కాలములో జరిగింది. “ప్రేరణ ద్వారా తనకప్పగింపబడిన . . . భవన నిర్మాణ నమూనా” ప్రకారం యెహోవా ఆరాధన కొరకు సొలొమోను, దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన తండ్రియైన రాజగు దావీదుకు యెహోవా ఈ నమూనా నిచ్చాడు. (1 దినవృత్తాంతములు 28:11, 12 NW) ఆ విధంగా, సొలొమోను జ్ఞానముతో నిండిన తన అమూల్యమైన మాటలచే తనను వినేవారిని బలపరచడమే గాకుండా, లోకమెన్నడూ సాధించలేనంత అపూర్వమైన నిర్మాణపు పనిని కూడ ఆయన నిర్దేశించాడు.—1 రాజులు 6:1; 9:15, 17-19.
18, 19. (ఎ) చురుకుగా పురోగమిస్తున్న ఏ నిర్మాణ పథకాలను యెహోవా సంస్థ చేపట్టింది? (బి) వస్తుదాయక మరియు ఆత్మీయ నిర్మాణమందు యెహోవా ఆత్మ ఎలా ప్రదర్శింపబడుతుంది?
18 ఈనాడు, యెహోవాసాక్షులు దైవ ప్రేరేపిత నిర్మాణ నమూనాలను బట్టి భవనాలను నిర్మించరు గాని, వారు దేవుని ఆత్మను నిశ్చయంగా కలిగియున్నారు. ఇశ్రాయేలీయుల కాలములలో వలెనే, లోకంలో ప్రజలు ఆశ్చర్యపడు రీతిలో నిర్మించుటకు అది వారిని పురికొల్పుచున్నది. (జెకర్యా 4:6) సమయము సంకుచితమై యున్నది. ఇక ఆలస్యం లేకుండ రాజ్యమందిరాలు, ఇతర భవనాలు అవసరం. కొన్ని దేశాలలో త్వరితగతిన రాజ్యమందిరాలు నిర్మించడం పరిపాటయ్యింది. ఉదాహరణకు, గడచిన 10 సంవత్సరాలలో, ప్రతిదీ రెండు రోజులలోపే నిర్మించిన 306 మందిరాల నిర్మాణాన్ని గూర్చి కెనడా నివేదిస్తున్నది. ప్రపంచ వ్యాప్తముగా యెహోవా పని అమిత వేగంతో విస్తరిస్తున్నందున, మొత్తం 43 క్రొత్త బ్రాంచి కార్యాలయ భవనాలు లేదా బ్రాంచి కార్యాలయాల విస్తరణ ప్రస్తుతం నిర్మాణమందున్నవి లేదా పథకాలందున్నవి. అంతేకాదు, బ్రూక్లిన్‌లో దాదాపు వెయ్యిమంది బేతేలు స్వచ్ఛంద సేవకులకు వసతినివ్వగల 30 అంతస్తుల నివాస భవన నిర్మాణం పూర్తికావస్తున్నది. ఆలాగే న్యూయార్క్ రాష్ట్రంలో, ప్యాటర్సన్ నందు వాచ్‌టవర్ సొసైటీ క్రితమెన్నడూ చేపట్టనంత బారీ పథకమగు బైబిలు విద్యా కేంద్ర నిర్మాణం అనుకున్న దానికంటే ముందే పూర్తియగునట్లు పని చురుకుగా సాగుచున్నది.
19 ఈ పథకాలు సమర్థవంతముగా ముందుకు సాగుతున్నవి కాగా ఆ పని నాణ్యతకు, ప్రపంచమందలి ప్రఖ్యాత నిర్మాణ కంపెనీలు సహితం ఆశ్చర్యపోతున్నవి. ఎందుకు? ఎందుకనగా యెహోవాకు సమర్పించుకున్న సాక్షులు అద్భుతమైన సహకారాన్ని, చందాలను అందించారు. వస్తుదాయక మద్దతునిచ్చుటే కాకుండా హృదయ పూర్వకంగా తమ సమయాన్ని, శక్తిని ధారపోయుటకు ఆయన ఆత్మ వారిని పురికొల్పుచున్నది. నిర్మాణ ప్రాంతాలు నిష్ణాతులైన, అంకిత భావంతో పనిచేసే వారితో నిండిపోయినవి. అక్కడ కార్మికుల సమ్మెలు లేవు, అక్కడ పని ఎగ్గొట్టి తిరిగేవారు లేరు. మోషే కాలములో గుడారం కట్టినవారిని, సొలొమోను కాలములో దేవాలయాన్ని నిర్మించిన వారిని పురికొల్పినట్లుగానే ఇప్పుడును యెహోవా ఆత్మ అట్టి పురికొల్పునిస్తున్నది. ఆత్మీయతే ఆ పనివారికి ఉండాల్సిన విశేష లక్షణము.—నిర్గమకాండము 35:30-35; 36:1-3; 39:42, 43; 1 రాజులు 6:11-14 పోల్చుము.
20. (ఎ) సువార్త యింకా ఎంతమేరకు ప్రకటింపబడవలసి యున్నది? (బి) యెహోవా ప్రజలకు ఎటువంటి ఆశీర్వాదకర ఉత్తరాపేక్షలు వేచియున్నవి?
20 దేవాలయం పూర్తయిన తర్వాత కూడ సొలొమోను నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగించాడు. (2 దినవృత్తాంతములు 8:1-6) అవసరానికి తగినట్లు మందిరాలను, ఇతర వసతులను నిర్మిస్తూ ఆధునిక దిన సాక్షులు ఎంతమేరకు విస్తరిస్తారో మనకు తెలియదు. అయితే మనకు తెల్సిందేమంటే, యెహోవా ఆజ్ఞమేరకు ఈ రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు, ఆ తర్వాత అంతము అనగా “మహాశ్రమలు” వచ్చును. (మత్తయి 24:14, 21) దురాశపరులైన మనుష్యులు ఇక ఎంతమాత్రము పాడుచేయని భూమిపై, యెహోవా ఏర్పాటుచేసిన “క్రొత్త ఆకాశము . . . క్రొత్త భూమి” మానవజాతికి చెప్పలేనన్ని ఆశీర్వాదములను తెచ్చును. కాబట్టి మనం మన మహోన్నత సృష్టికర్తకు సమస్త స్తుతులు చెల్లిస్తూ ‘దేవుడు సృజిస్తున్న దానియందు ఎల్లప్పుడు హర్షించి, ఆనందింతుము గాక’!—యెషయా 65:17-19, 21, 25.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, వారు ప్రచురించిన “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్” పుటలు 105-16, 186-9 చూడుము.
మీరు వివరించగలరా?
◻ మన మహోన్నత సృష్టికర్త యందు ఆనందించుటకు మనమే కారణములను కలిగియున్నాము?
◻ ఈ 1992వ సేవా సంవత్సరములో ఎటువంటి అభివృద్ధి నివేదించబడింది?
◻ ఇంతకు ముందు సాక్ష్యపు పనికి నిషేధమున్న దేశాలలో, ఎటువంటి గొప్ప ఆశీర్వాదములు నివేదించబడినవి?
◻ యెహోవా సంస్థలో గొప్ప అభివృద్ధికి యౌవనులు, పయినీర్లు ఎలా దోహదపడ్డారు?
◻ భౌతిక, ఆత్మీయ నిర్మాణపు పనులలో యెహోవా ప్రజలెట్లు పనిరద్దీగా ఉన్నారు?
[17వ పేజీలోని బాక్సు]
గత సంవత్సరం ప్రకటించు, బోధించు పనిలో నూరు కోట్లకంటె ఎక్కువ గంటలు వెచ్చింపబడినవి
[12-15వ పేజీలోని చిత్రం]
1992 సేవా సంవత్సరపు యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త నివేదిక
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
[10వ పేజీలోని చిత్రం]
ప్రకటించు మరియు బోధించు పనిపై యెహోవా ఆశీర్వాదమున్నదని గత సంవత్సరం బాప్తిస్మం పొందిన లక్షలాదిమంది ప్రదర్శిస్తున్నారు
[16వ పేజీలోని చిత్రం]
అధిక సంఖ్యలో యౌవనులు ‘తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుచున్నారు’