కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 12/1 పేజీలు 26-30
  • ఏక హృదయముతో నడుచుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏక హృదయముతో నడుచుకొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరియైన భయము
  • యెహోవాయొక్క కృపాతిశయము
  • “శుభకరమైన ఆనవాలు”
  • యెహోవా ఆశ్చర్యకార్యములు చేయువాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా —మంచితనానికి సర్వోత్కృష్టమైన మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • మంచితనాన్ని ఎల్లప్పుడూ చూపిస్తుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘నీ పేరుకు భయపడేలా ఏక హృదయం దయచేయి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 12/1 పేజీలు 26-30

ఏక హృదయముతో నడుచుకొనుట

“యెహోవా . . . నాకు బోధింపుము. . . . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్తన 86:11.

1. యథార్థవంతులైన తన భక్తులకు యెహోవా ఎట్లు ప్రతిఫలమిచ్చును?

‘యెహోవా, నీవే అద్వితీయ దేవుడవు.’ (కీర్తన 86:8, 10) ప్రశంసతో ఉప్పొంగుతున్న హృదయంతో దావీదు దేవున్ని స్తుతించాడు. దావీదు ఇశ్రాయేలీయులందరిపై రాజు కాక ముందే యెహోవా ఆయన్ని సౌలు, ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించాడు. కాబట్టి, ఆయనిలా పాడగల్గాడు: “యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, యథార్థవంతుల యెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు.” (2 సమూయేలు 22:2, 26) అనేక పరీక్షలందును యెహోవా తన యథార్థ సేవకుని కాపాడాడు. యథార్థవంతుడైన తన దేవునియందు దావీదు నమ్మకాన్ని, దృఢవిశ్వాసాన్ని ఉంచగల్గాడు, అయితే ఆయనకు నిర్విరామంగా నడిపింపు అవసరమై యుండెను. కాబట్టి దావీదు దేవునికిలా విన్నపం చేశాడు: ఓ “యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము.”—కీర్తన 86:11.

2. మనమాయనచే బోధింపబడుటకు యెహోవా ఎలా ఏర్పాటుచేశాడు?

2 దావీదు లోక తలంపులను లేదా తత్వాలను పూర్తిగా విసర్జించుటకు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత దేవుని ప్రవక్త వ్యక్తపరచినట్లు, ఆయన “యెహోవాచేత ఉపదేశింపబడుటకు” ఇష్టపడ్డాడు. (యెషయా 54:13) బహుశ దావీదు తన కాలంలో లభ్యమైన తొమ్మిది బైబిలు పుస్తకాలను మాత్రమే ధ్యానించియుండవచ్చు. అయినను, యెహోవా నుండి వచ్చిన ఆ ఉపదేశము ఆయనకు అమూల్యమై యుండెను! ఉపదేశింపబడుటకు మనమీనాడు 66 బైబిలు పుస్తకాలను, అలాగే “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” అందజేయు విస్తారమైన రాజ్య సాహిత్యాలను కల్గివున్నాం. (మత్తయి 24:45) దావీదు వలెనే, “దేవుడు తన్ను ప్రేమించు వారికొరకు . . . సిద్ధపరచిన . . . దేవుని మర్మములను” పరిశోధించుటలో ఆయన ఆత్మ మనకు సహాయపడునట్లు యెహోవాను వేడుకొందము.—1 కొరింథీయులు 2:9, 10.

3. బైబిలు ఉపదేశము ఏయే విధాలుగా మనకు ప్రయోజనమివ్వగలదు?

3 మన జీవితాలలో ఉత్పన్నం కాగల ప్రతి ప్రశ్నకు, సమస్యకు బైబిలునందు జవాబు కలదు. “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:4) యెహోవా నుండి వచ్చే ఉపదేశాన్ని గ్రహించుట కష్టాల్ని సహించడానికి మనలను బలపరచి, వ్యాకులతగల సమయాలలో ఓదార్పునిచ్చి, మన హృదయాలలో రాజ్య నిరీక్షణను తేజోవంతముగా ఉంచుతుంది. దేవుని వాక్యమును చదివి, “దివారాత్రము” దానిని ధ్యానించుటలో ఆనందాన్ని అనుభవిద్దాం. ఎందుకంటే బైబిలు ఆధారిత జ్ఞానం “దాని నవలంబించు వారికి అది జీవవృక్షమగును,” మరియు “దాని పట్టుకొను వారందరు ధన్యులు.”—కీర్తన 1:1-3; సామెతలు 3:13-18; యోహాను 17:3 కూడ చూడము.

4. మన ప్రవర్తన విషయమై, యేసు మనకెలాంటి మాదిరినుంచాడు?

4 “దావీదు కుమారుడని” కూడ పిలువబడిన దేవుని కుమారుడగు యేసు, అన్ని సమయాలలో ఉపదేశం కొరకు యెహోవావైపు చూశాడు. (మత్తయి 9:27)a ఆయనిట్లన్నాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.” “నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” (యోహాను 5:19; 8:28) “తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు” యేసు మనకొక మాదిరినుంచాడు. (1 పేతురు 2:21) దానిని ఊహించండి! బహుశ యేసు పఠించినట్లే మనమూ పఠిస్తే, మనమే పరిస్థితిలో ఉన్నను ఇలా ప్రవర్తించుడని మనలను యెహోవా కోరినట్లే మనం ప్రవర్తించగల్గుదుము. యెహోవా మార్గము అన్ని సమయాలలో సరియైనదే.

5. “సత్యమనగా” ఏమిటి?

5 తదుపరి దావీదు ఇలా అంటున్నాడు: ‘నీ సత్యము ననుసరించి నడుచుకొందును.” (కీర్తన 86:11) వెయ్యి సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడైన యేసును సంబోధిస్తూ, “సత్యమనగా ఏమిటి?” అని పిలాతు అడిగాడు. దానికి యేసు, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని” పిలాతుకు జవాబిస్తూ, ఆయనింకా యిలా అన్నాడు: “నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:33-38) ఆ విధంగా యేసు, సత్యము మెస్సీయ రాజ్యముపై దృష్టి సారిస్తున్నదని తెలియజేశాడు. నిజానికి, బైబిలు మూలాంశమంతయు ఆ రాజ్యము ద్వారా యెహోవా నామమును పరిశుద్ధపరచుటయే.—యెహెజ్కేలు 38:23; మత్తయి 6:9, 10; ప్రకటన 11:15.

6. సత్యమందు నడచుటలో, మనమే విషయంపై అప్రమత్తంగా ఉండాలి?

6 సత్యమందు నడుచుకొనుట అనగా దానిభావమేమి? సత్యమందు నడుచుకొనుట అనగా రాజ్య నిరీక్షణను మన జీవితాలలో ముఖ్యమైనదిగా చేసికొనుటని దాని భావము. రాజ్యాసక్తులను మొదట ఉంచుటలో మనం సందిగ్ధంలో ఉండక, యేసు మాదిరి ననుసరించి మనకు లభించే అవకాశాలనుబట్టి రాజ్య సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో ఆసక్తి కలిగియుండాలి. (మత్తయి 6:33; యోహాను 18:37) మితిమీరిన వినోదంలో మునిగిపోవునట్లు లేదా ఎక్కువ సమయం తీసుకునే వృత్తిని లేదా “సిరి . . . దాసులగుట” వంటి పెడత్రోవలతో మనలను మనమే ప్రీతిపరచుకొంటూ, పేరుకు మాత్రమే సేవచేస్తూ కేవలం కొద్ది సమయం మాత్రమే కేటాయించి సత్యములో నడువలేము. (మత్తయి 6:24) ఇక ఎన్నటికి ‘జీవమునకు నడుపు ఇరుకు మార్గమునకు’ తిరిగి రాకుండా, ఆ ప్రక్కదారులలో ఒకదానియందు పడిపోవు ప్రమాదము కలదు. మనమా జీవమార్గము నుండి తప్పిపోకుందము! (మత్తయి 7:13, 14) తన వాక్యముద్వారా, సంస్థద్వారా మన మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవా ఆ మార్గమును ప్రకాశవంతం చేస్తూ, “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయిననూ తిరిగినను—ఇదే త్రోవలో దీనిలో నడువుడని” చెబుతున్నాడు.—యెషయా 30:21.

సరియైన భయము

7. మనమెట్లు మన హృదయాల్ని “ఏకం” చేయవచ్చును?

7 దావీదు ప్రార్థన 11వ వచనంలో ఇంకను ఇలా కొనసాగింది: “నా నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” దేవుని చిత్తాన్ని చేయుటలో మనం ద్విమనస్కులమై యుండక, దావీదు వలెనే సంపూర్ణంగా ఉండాలని కోరుకోవాలి. ఇది మోషే యిచ్చిన సలహానుసారంగా ఉంది: “కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలు కొరకు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు.” (ద్వితీయోపదేశకాండము 10:12, 13) నిజానికి మన మేలు కొరకే, యెహోవా సేవలో మనం మన హృదయాన్ని, మన ఆత్మను కుమ్మరిస్తున్నాము. ఆ విధంగా మనం ఆయన అపూర్వమైన నామము యెడల సరియైన భయము చూపెదము. యెహోవా నామమునకు అక్షరార్థముగా “సంభవింపజేయువాడు” అని అర్థము. విశేషంగా ఇది ఆయన దివ్యసంకల్పాల సంపూర్ణ నెరవేర్పుకు అన్వయించును. ఇది సమస్త విశ్వంమీద ఆయన సర్వోన్నత అధికారానికి కూడ ప్రాతినిధ్యం వహిస్తుంది. దేవుని ఘనత విషయమైన భయంతో సేవచేస్తే, మృతతుల్యుడగు మానవుని భయమునుబట్టి మనం త్రోవతప్పము. మనము ద్విమనస్కులమై యుండము. బదులుగా, మన జీవితాల్ని తన చేతిలో కలిగియున్న సర్వోన్నత న్యాయాధిపతి, సార్వభౌమాధిపతియైన యెహోవాను అయిష్టపరచు దేనినైనను చేయుటకు మనము భయపడుదుము.—యెషయా 12:2; 33:22.

8, 9. (ఎ) “లోకసంబంధులు కాకుండుట” అనగా ఏమిటి? (బి) మనమొక “వేడుకగా” ఉన్నందున మనమే చర్యలు గైకొనాలి?

8 అవమానం, హింసను ఎదుర్కొన్ననూ, మన చుట్టూవున్న దుష్టలోకంలో భాగస్థులమై యుండకుండుటకు నిర్భయమైన యేసు మాదిరిని మనం అనుసరింతుము. (యోహాను 15:17-21) అంటే యేసు శిష్యులు సన్యాసులవలె జీవించాలని లేదా మఠములకే పరిమితమై యుండాలని దీని భావం కాదు. యేసు తన తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్టచేయుము; నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.” (యోహాను 17:15-18) యేసు వలెనే మనము రాజ్య సత్యాన్ని ప్రకటించుటకు పంపబడ్డాము. యేసు సమీపించదగినవానిగా ఉండెను. ఆయన బోధించిన తీరునుబట్టి ప్రజలు ఉపశమనం పొందారు. (మత్తయి 7:28, 29; 11:28, 29; యోహాను 7:46 పోల్చుము.) మనమూ ఆలాగే ఉండాలి.

9 మన స్నేహశీలత, అందంగా తలదవ్వుకొనుట, మన అలంకరణ దయతోకూడిన మంచి సంభాషణ సహృదయులైన వ్యక్తులు మనల్ని, మన వర్తమానాన్ని అంగీకరించేటట్లు చేయాలి. లౌకిక క్రియల్లో ముంచివేయగల సహవాసాలను, నమ్రతలేని దుస్తులను, నిర్లక్ష్య వైఖరిని మరియు మనచుట్టూ మనం చూస్తున్న నియమ రహిత జీవిత విధానాన్ని, విచ్చలివిడితనాన్ని మనం విసర్జించాలి. “లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా” ఉన్న మనం మాదిరికరమైన క్రైస్తవులుగా జీవించుటకు, సేవచేయుటకు దినంలోని 24 గంటలూ కర్తవ్యనిర్వహణలో ఉండాలి. (1 కొరింథీయులు 4:9; ఎఫెసీయులు 5:1-4; ఫిలిప్పీయులు 4:8, 9; కొలస్సయులు 4:5, 6) అందునిమిత్తం మన హృదయం ఏకదృష్టిని కలిగియుండాలి.

10. పవిత్రసేవలో తమ హృదయాల్ని ఏకంచేసుకొనే వారిని యెహోవా ఎలా గుర్తుంచుకుంటాడు?

10 యెహోవా నామమందలి భయంతో మన హృదయాలకు ఏకదృష్టిని కలిగిస్తూ, ఆయన దివ్య సంకల్పాలను ధ్యానిస్తూ, పవిత్ర సేవచే జీవితాల్ని నింపుకునే మనలను యెహోవా గుర్తుంచుకుంటాడు. “తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) మన కాలాన్ని ప్రవచనార్థకముగా సూచిస్తూ, మలాకీ 3:16 ఇట్లనుచున్నది: “అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” యెహోవా యెడల అట్టి హితమైన భయముతో మన హృదయాలు ఏకమగును గాక!

యెహోవాయొక్క కృపాతిశయము

11. యథార్థవంతుల యెడల యెహోవా కృపాతిశయము ఎట్ల వ్యక్తపరచబడును?

11 దావీదు ప్రార్థన ఎంత మనఃపూర్వకముగా ఉండెను! ఆయనింకనూ యిలా ప్రార్థించాడు: “నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, [ఓ యెహోవా NW] నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు [షియోల్‌ NW] అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు.” (కీర్తన 86:12, 13) ఈ కీర్తనలో దావీదు రెండవ సారి యెహోవా కృపను—ఆయన యథార్థప్రేమను—బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. ఆయన ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, అసాధ్యంగా కన్పించే పరిస్థితుల నుండి అది రక్షింపగలదు. సౌలు ఆయనను అరణ్యములో తరుముచుండగా, తనకు చావు తప్పదని దావీదు తలంచియుండవచ్చు. అది షియెల్‌ అగాధానికి—అంటే సమాధి లోనికి ముఖాముఖిగా వెళ్తునట్లుండెను. అయితే యెహోవా ఆయనను తప్పించాడు! అదే ప్రకారం, యెహోవా తరచు తన ఆధునిక సేవకులకు అద్భుతరీతిలో విడుదల దయ చేయడమే కాకుండ, మరణం వరకు నమ్మకంగా సహించిన యథార్థపరులను బలపరచాడు. యథార్థపరులందరు, అవసరమైతే పునరుత్థానము ద్వారా, తమ బహుమానాన్ని పొందురు.—పోల్చుము యోబు 1:6-12; 2:1-6, 9, 10; 27:5; 42:10; సామెతలు 27:11; మత్తయి 24:9, 13; ప్రకటన 2:10.b

12. మతనాయకులెట్లు అహంకారులును, కౄరులునై యున్నారు, వారు ఏ ఫలితం అనుభవిస్తారు?

12 హింకుల విషయంలో దావీదు ఇలా ప్రార్థించాడు: “దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు; బలాత్కారురు గుంపుకూడి నా ప్రాణము తీయజూచుచున్నారు, వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారు.” (కీర్తన 86:14) నేడు ఈ హింసకులలో క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు ఇమిడియున్నారు. వారు దేవుని ఆరాధిస్తున్నామని ఊహిస్తున్నారు అయితే వారు దేవుని పరిశుద్ధ నామముండాల్సిన చోట “ప్రభువనే” బిరుదుపెట్టి నిజానికి బైబిలులో ఎక్కడా ప్రస్తావించబడని మర్మంతోకూడిన త్రిత్వముగా ఆయనను చూపిస్తున్నారు. ఎంత అహంకారం! దీనికితోడు, వారు యెహోవాసాక్షులను నిషేధించి, వారిని జైళ్లలో వేసేలాగున రాజకీయ శక్తులను ఒప్పించుటకు ప్రయత్నిస్తున్నారు. ఈ రీతిలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంకను యిలా కొనసాగిస్తున్నారు. దైవనామ దూషకులైన ఈ ప్రత్యేక దుస్తులు ధరించే మతనాయకులు వేశ్యను పోలిన మహాబబులోను యొక్క తెగలన్నింటితో కలిపి తగిన ఫలితమే అనుభవిస్తారు.—ప్రకటన 17:1, 2, 15-18; 19:1-3.

13. తన మంచితనాన్ని తెలియజేయుటలో యెహోవా ఏ లక్షణాలను చూపించును?

13 దానికి భిన్నంగా దావీదు ప్రార్థన ఇలా కొనసాగింది: “ప్రభువా, [ఓ యెహోవా NW] నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు, దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు.” (కీర్తన 86:15) నిజంగా మన దేవుని లక్షణాలు సర్వోత్కృష్టమైనవి. ఈ మాటలు మనల్ని యెహోవా మహిమను చూస్తానని మోషే అడిగిన సీనాయి పర్వతానికి తీసుకెళ్తాయి. దానికి యెహోవా ఇలా సమాధానమిచ్చాడు: “నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను.” అయితే ఆయన మోషేనిలా హెచ్చరించాడు: “నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు.” ఆ పిమ్మట యెహోవా మేషములో దిగి, ఇలా ప్రకటించాడు: “యెహోవా కనికరము, దయ దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.” (నిర్గమకాండము 33:18-20; 34:5, 6) దావీదు తన కీర్తనలో ఈ మాటలను ఎత్తివ్రాశాడు. కేవలం శారీరకంగా కనబడటం కంటే యెహోవాయొక్క అటువంటి లక్షణాలు మనకు ఎంతో ఎక్కువ భావాన్నిస్తాయి. మన స్వంత అనుభవాన్నిబట్టి యీ సద్గుణాలలో ఉదహరింపబడిన యెహోవా మంచితనాన్ని మనం అభినందించమా?

“శుభకరమైన ఆనవాలు”

14, 15. తన సేవకులకు ఒక “శుభకరమైన ఆనవాలు” యెహోవా ఎట్లు చూపించును?

14 దావీదు మరలా యెహోవా ఆశీర్వాదాన్ని వేడుకొంటూ ఇలా అంటున్నాడు: “నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.” (కీర్తన 86:16, 17) ‘యెహోవా సేవకురాలి కుమారునిగా’ తాను కూడ యెహోవాకు చెందినవాడేనని దావీదు గుర్తిస్తున్నాడు. ఈనాడు యెహోవాకు, ఆయన సేవలో శ్రమపడుటకు జీవితాల్ని సమర్పించుకున్న మనందరి విషయంలోను అంతే. యెహోవా ఆత్మద్వారా మనకు ఆయన రక్షించే బలము అవసరము. కాబట్టి, మాకు “శుభకరమైన ఆనవాలు కనుపరచుమని” మన దేవున్ని మనమడుగుదాం. యెహోవా మంచితనమందు మనమిప్పుడూ చర్చించిన శ్రేష్టమైన లక్షణాలు ఇమిడివున్నాయి. దీన్ని బట్టి, యెహోవా మనకు ఏ సూచన లేదా గుర్తు ఇవ్వాలని మనమపేక్షిస్తాము?

15 యెహోవా “శ్రేష్టమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతివరమును” దయచేయువాడును, యేసు మనకు అభయమిస్తున్నట్లుగా “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మ” నిచ్చుటలో ఔదార్పుడైయున్నాడు. (యాకోబు 1:17; లూకా 11:13) పరిశుద్ధాత్మ—యెహోవా నుండి లభించే ఎంత అమూల్యమైన బహుమానమో! పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా, హింస కలిగిన సమయములో సహితం ఆనందకరమైన హృదయాన్ని దయచేస్తాడు. ఆ విధంగా, అపొస్తలులు తమ జీవిత పరీక్షలందును, పరిపాలకునిగా దేవునికి విధేయులగు వారికి ఆయన పరిశుద్ధాత్మ నిచ్చునని ఆనందముతో చెప్పగల్గిరి. (అపొ. కార్యములు 5:27-32) పరిశుద్ధాత్మ వలన ఎడతెగక కలిగిన ఆనందాన్ని ఆయన వారికి “శుభకరమైన ఆనవాలు . . . కనుపరచెను.”—రోమీయులు 14:17, 18.

16, 17. (ఎ) పౌలు బర్నబాలకు యెహోవా తన మంచితనాన్ని గూర్చిన ఏ ఆనవాలును యిచ్చాడు? (బి) హింసింపబడిన థెస్సలొనీకయులకు ఏ ఆనవాలు యివ్వబడింది?

16 చిన్న ఆసియాగుండా చేసిన తమ మిషనరీ ప్రయాణకాలంలో, పౌలు బర్నబాలు ఎన్నో కష్టాలను, తీవ్రమైన హింసనూ ఎదుర్కొన్నారు. వారు పిసిదయ అంతియొకయలో ప్రకటించినప్పుడు, యూదులు వారి వర్తమానమును తృణీకరించారు. కాబట్టి, వారు అన్యజనులపై తమ దృష్టి సారించారు. దాని ఫలితమేమి? “అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.” అయితే యూదులు పుట్టించిన కలవరము కారణముగా ఆ మిషనరీలు ఆ దేశం నుండి వెళ్లగొట్టబడ్డారు. అందుకువారు, ఆ క్రొత శిష్యులు నిరాశ చెందారా? ఎంత మాత్రం నిరాశచెందలేదు! బదులుగా, ఆ “శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.” (అపొ. కార్యములు 13:48, 52) యెహోవా వారికి తన మంచితనాన్ని గూర్చిన అట్టి ఆనవాలును యిచ్చాడు.

17 ఆ తర్వాత, థెస్సలొనీకలోనున్న క్రొత్త సంఘం హింస నెదుర్కొంది. ఇది శ్రమలయందు వారు చూపిన సహనాన్ని మెచ్చుకొంటు పౌలు వారికి ఓదార్పునిచ్చే లేఖ వ్రాయడానికి నడిపించింది. వారు “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు . . . వాక్యము నంగీకరించిరి.” (1 థెస్సలొనీకయలు 1:6) కనికరము, దయ దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుని నుండి స్పష్టమైన ఆనవాలుగా వారు ఎడతెగక “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందము”ననుభవించారు.

18. తూర్పు ఐరోపాలో మన సహోదరులు యెహోవా మంచితనం యెడల ఎలా ప్రశంస చూపారు?

18 ఇటీవలి కాలాలలో, నమ్మకమైన మన సహోదరులను ద్వేషించిన వారిని—ఇంతకుముందు హింసించిన వారిని సిగ్గుపరస్తూ తూర్పు ఐరోపాలో యెహోవా తన మంచితనాన్ని మన సహోదరుల యెడల వ్యక్తపరిచాడు. దశబ్దాలుగా కొనసాగిన అణచివేతనుండి ఇటీవలనే విడిపింపబడినను, ఈ ప్రియ సహోదరులు ఇంకను సహించవలసి యున్నారు. ఎందుకంటే అనేకమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందము” వారి నోదారుస్తున్నది. సాక్ష్యపు పనిని విస్తరింపజేయుటలో క్రొత్తగా వారికి లభించిన స్వాతంత్య్రాన్ని ఉపయోగించుట కంటె గొప్ప ఆనందము వారికేమి ఉంటుంది? అనేకమంది ప్రజలు వారు చెప్పే దానిని వింటున్నారని సమావేశముల, బాప్తిస్మముల నివేదికలు బయలుపరుస్తున్నవి.—అపొ. కార్యములు 9:31 పోల్చుము.

19. కీర్తన 86:11లోని మాటలను మనమెట్లు మన స్వంతం చేసుకోవచ్చును?

19 ముందు శీర్షికలో, ఈ శీర్షికలో చర్చించినదంతయు యెహోవాకు దావీదు మనఃపూర్వకముగా చేసిన ప్రార్థనను ప్రతిధ్వనిస్తున్నది: “యెహోవా . . . నాకు బోధింపుము. . . . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” (కీర్తన 86:11) రాజ్యాసక్తులను బలపరచుటలో, మన అద్వితీయ దేవుడును, సార్వభౌమాధిపతియగు యెహోవా తరిగిపోని మంచితనాన్ని అభినందించుటలో మనం పూర్ణహృదయంతో పనిచేస్తుండగా 1993వ వార్షిక వచనమందలి ఆ మాటలను మన స్వంతం చేసుకుందాము.

[అధస్సూచీలు]

a ప్రవచింపబడిన “సంతానము”గా యేసు, దావీదు రాజ్యానికి వారసుడైనందున, అక్షరార్థముగాను, ఆత్మీయ భావమందును ఆయన “దావీదు కుమారుడే.”—ఆదికాండము 3:15; కీర్తన 89:29, 34-37.

b ఆధునిక దిన ఉదహరణలకు, ఇయర్‌ బుక్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌, సంచికలు 1974, పుటలు 113-212; 1985, పుటలు 194-7; 1986, పుటలు 237-8; 1988, పుటలు 182-5; 1990, పుటలు 171-2; 1992, పుటలు 174-81 చూడుము.

మీరెట్లు జవాబిత్తురు?

◻ “యెహోవా . . . నాకు బోధింపుము” అని ప్రార్థించుట ద్వారా మనమేమి సూచిస్తాము?

◻ యెహోవా నామమునకు భయపడునట్లు మన హృదయాల్ని ఏకంచేయుట అంటే ఏమిటి?

◻ తన యథార్థవంతులందరి యెడల యెహోవా ఎట్లు తన కృపాతిశయము చూపును?

◻ యెహోవా ఎట్లు మనకొక “శుభకరమైన ఆనవాలు”నిస్తాడు?

[28వ పేజీలోని బాక్సు]

వార్షిక వచనం 1993: “యెహోవా . . . నాకు బోధింపుము. . . . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్తన 86:11.

[27వ పేజీలోని చిత్రం]

సత్యమందు నడుచుకొనువారికి యెహోవా ఒక శైలము, ఒక కోటగా ఉన్నాడు.

[30వ పేజీలోని చిత్రం]

జూన్‌లో రష్యా నందున్న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన యెహోవాసాక్షుల “వెలుగు ప్రకాశకుల” అంతర్జాతీయ సమావేశానికి 46,214 మంది హాజరుకాగా అందు 3,256 మంది బాప్తిస్మము పుచ్చుకొన్నారు. “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో” యెహోవా మంచితనాన్ని వారెంత అద్భుతంగా అనుభవిస్తున్నారు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి