యెహోవా ఆశ్చర్యకార్యములు చేయువాడు
“నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు; నీవే అద్వితీయ దేవుడవు.”—కీర్తన 86:9.
1, 2. (ఎ) మానవుడు క్రొత్తగా కనిపెట్టినవి ప్రపంచాన్ని ఎట్లు ప్రభావితం చేశాయి? (బి) మరి శ్రేష్టమైన సంగతుల నిరీక్షణను మనమెక్కడ కనుగొనగలము?
ఆధునిక మానవుడు తాను క్రొత్తగా కనిపెట్టిన—విద్యుత్ పరికరాలు, సమాచార వ్యవస్థ, వీడియో, ఆటోమోబైల్, జెట్ విమానయానం, కంప్యూటర్ సహాయక సాంకేతిక వ్యవస్థవంటివి తన ఘనకార్యాలేనని గొప్పలు చెప్పుకోవచ్చును. ఇవి లోకాన్ని దగ్గర చేసినవి. అయితే ఎటువంటి సన్నిహితత్వం ఉంది! శాంతి సౌభాగ్యాలు, ఎవరికీ ఏ లోటులేకుండా వుండే బదులు, మానవజాతి మారణహోమం సృష్టించే యుద్ధాలు, నేరము, ఉగ్రవాదము, కాలుష్యము, రోగాలు, దారిద్ర్యములచే పట్టిపీడింపబడుచున్నది. తక్కువచేయబడిన సంఖ్యలోనైనను, ప్రపంచవ్యాప్తముగా విస్తరించియున్న అణు ఆయుధాలు మానవజాతిని సర్వనాశనం చేయగలవు. ప్రాణాలతో చెలగాటమాడే, యుద్ధాయుధాల ఉత్పత్తిదారులు ఇంకనూ ప్రపంచంలో గొప్ప వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ధనికులు మరింత ధనికులగుచుండగా, బీదవారు మరింత బీదవారగుచున్నారు. దీనికెవరైనా పరిష్కారం చూపగలరా?
2 అవును! విడుదల చేస్తానని హామి యిచ్చేవారు ఒకరున్నారు, ఆయనే “అధికారము నొందిన వారిమీద మరి ఎక్కువ అధికారము నొందిన” యెహోవా దేవుడు. (ప్రసంగి 5:8) దురవస్థ సమయాల కొరకు ఓదార్పు మరియు జ్ఞానయుక్తమైన సలహానిచ్చు కీర్తనల రచనను ఆయన ప్రేరేపించాడు. వాటిలో “దావీదు కీర్తన (ప్రార్థన, NW) అను పైవిలాసముగల 86వ కీర్తన ఒకటి. అది నీవును స్వంతము చేసికొనగల ప్రార్థనే.
బాధింపబడినను యథార్థముగా ఉండెను
3. ఈ కాలములందు, మన కొరకు దావీదు ఎటువంటి ప్రోత్సాహకరమైన మాదిరి చూపిస్తున్నాడు?
3 బాధలో ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తన వ్రాశాడు. సాతాను విధానమందలి “అపాయకరమగు కాలము”లైన ఈ “అంత్యదినములలో” జీవించు మనము, నేడును అటువంటి పరీక్షలనే ఎదుర్కొంటున్నాము. (2 తిమోతి 3:1; మత్తయి 24:9-13 కూడ చూడుము.) దావీదుపై చూపిన సమస్యల కారణముగా ఆయన మనవలెనే చింతలను, దురవస్థను అనుభవించాడు. అయితే సృష్టికర్తయెడల తనకున్న యథార్థమైన నమ్మకాన్ని బలహీనపరచుటకు ఆ పరీక్షలను ఆయన ఎన్నడు అనుమతించలేదు. ఆయనిలా ప్రార్థించాడు: ఓ “యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము.”—కీర్తన 86:1, 2.
4. మన దృఢనమ్మకాన్ని మనమెట్లు చూపాలి?
4 “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడగు” యెహోవా ఈ భూమివైపు తన చెవియొగ్గి మన దీన ప్రార్థనల నాలకించునని, దావీదు వలెనే మనమూ నమ్మకాన్ని కలిగియుండగలము. (2 కొరింథీయులు 1:3, 4) మన దేవునియందలి గట్టి నమ్మకముతో మనము దావీదు సలహాను పాటించవచ్చును: “నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”—కీర్తన 55:22.
యెహోవాతో సన్నిహితత్వము
5. (ఎ) జాగ్రత్తగా చేయబడిన కొన్ని అనువాదాలు యూదామత శాస్త్రులు చేసిన తప్పిదాల్ని ఎలా సరిదిద్దాయి? (బి) ఏ విధంగా 85, 86 కీర్తనలు యెహోవాను ఘనపరుస్తున్నాయి? (అథస్సూచి చూడుము.)
5 ఆ 86వ కీర్తనలో, దావీదు “యెహోవా” అను మాటను 11 సార్లు ఉపయోగిస్తున్నాడు. దావీదు ప్రార్థన ఎంత మనఃపూర్వకముగా ఉండెను. యెహోవాతో ఆయన సన్నిహితత్వం ఎంతగా ఉండెను! ఆ తర్వాతి కాలాలలో దేవుని నామమును అంత సన్నిహితముగా ఉపయోగించుట యూదామత శాస్త్రులకు, విశేషంగా సొఫరీమ్‌కు రుచింపనిదిగా తయారయ్యింది. వారు ఆ నామమును దుర్వినియోగపరచుటను గూర్చి ఒక మూఢ భయాన్ని పెంచుకున్నారు. మానవున్ని దేవుడు తన స్వరూపములో సృజించాడనే వాస్తవాన్ని అలక్ష్యంచేస్తూ, మానవుడు కనబరిచే లక్షణాలను దేవునికి అన్వయించడానికి వారు నిరాకరించారు. కాబట్టి, హెబ్రీ గ్రంథమందు ఈ కీర్తనలోనే 11 సార్లు కన్పించు దైవిక నామము యొక్క 7 స్థానాలలో, YHWH (యెహోవా) అనే పేరుకు బదులు ‘అదొనాయ్’ (ప్రభువు) అనే ప్రత్యామ్నాయ బిరుదును వారు ఉపయోగించారు. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్ర్కిప్చర్స్, మరియు జాగ్రత్తగా తర్జుమా చేసిన అనేక ఇతర అనువాదాలు, దేవుని వాక్యమందు యుక్త రీతిలో దైవిక నామాన్ని పునరుద్ధించినందుకు మనమెంతో కృతజ్ఞులమై యుండగలము. దాని ఫలితముగా, యెహోవాతో మనకుగల సంబంధము నొక్కితెల్పబడవలసిన రీతిలోనే తెల్పబడింది.a
6. మనకు యెహోవా నామము ప్రశస్తమని ఏయే విధాలుగా మనం చూపగలము?
6 దావీదు ప్రార్థన ఇంకనూ ఇలా కొనసాగింది: ప్రభువా, (ఓ యెహోవా NW) దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము. ప్రభువా (ఓ యెహోవా NW) నా ప్రాణము నీవైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.” (కీర్తన 86:3, 4) దావీదు “దినమెల్ల” యెహోవాను ప్రార్థించుట గమనించండి. ప్రాణరక్షణకై అరణ్యములోనికి పారిపోయినప్పుడు చేసినట్లే, ఆయన నిజానికి రాత్రియందును తరచు ప్రార్థించేవాడు. (కీర్తన 63:6, 7) అదే ప్రకారము నేడును, అత్యాచారము లేదా ఇతర నేర దాడిచే భయపెట్టబడినప్పుడు కొందరు సాక్షులు బిగ్గరగా యెహోవాకు ప్రార్థించారు. ఆయా సమయాల్లో ఆనందదాయకమైన ఫలితాన్ని చూసి వారు ఆశ్చర్యపడ్డారు.b భూమిపై నుండగా “దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు” ఎలా వుండెనో, ఆలాగే మనకు కూడా యెహోవా నామము ప్రశస్తమైయున్నది. యేసు తన శిష్యులతో యెహోవా నామమును పరిశుద్ధపరచుటకు ప్రార్థించుడని బోధించుటయే గాకుండ, ఆ నామమంటే ఏమిటోకూడ వారికి తెలియజేశాడు.—మత్తయి 1:1; 6:9; యోహాను 17:6, 25, 26.
7. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని సంతోషింపజేసిన ఏ ఉదహరణలు మనకున్నాయి, మరి మనమెట్లు ప్రతిస్పందించాలి?
7 దావీదు తన ప్రాణాన్ని, తనను పూర్తిగా యెహోవాకు అప్పగించుకున్నాడు. మనం కూడ అట్లే చేయవలెనని ప్రోత్సహిస్తూ, కీర్తన 37:5లో ఆయనిట్లంటున్నాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును.” ఆ విధముగా మన ప్రాణాన్ని సంతోషింపజేయుమని యెహోవాకు మనంచేసే విన్నపానికి సమాధానం రాకపోదు. కష్టాలు, హింసలు, రోగాలు వచ్చినను, యథార్థపరులైన అనేకమంది యెహోవా సేవకులు ఆయన సేవలో ఎడతెగని ఆనందాన్ని కనుగొంటున్నారు. ఆఫ్రికాలోని అంగోలా, లైబీరియా, మొజంబిక్, జైరీ వంటి యుద్ధమయమైన దేశాల్లోని మన సహోదరులు, తమ జీవితాల్లో యెహోవా సేవకు ప్రథమస్థానమిస్తున్నారు.c ఆయన సమృద్ధిగావున్న ఆత్మీయ కోత విషయమై వారు నిజంగా ఆనందించునట్లు చేశాడు. వారు సహించినట్లుగానే మనమూ సహించాలి. (రోమీయులు 5:3-5) సహించే మనకు ఇలా అభయమివ్వబడింది: “ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. . . . జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) యెహోవా యందలి పూర్తి నమ్మకముతో, ధీమాతో మనము కూడ అది “సమాప్తమగునని” ఆశతో ఎదురుచూద్దాము.
యెహోవా మంచితనం
8. యెహోవాతో మనమెటువంటి సన్నిహితత్వాన్ని కలిగియుండవచ్చును, ఆయన తన మంచితనాన్ని ఎలా ప్రదర్శించాడు?
8 దావీదు నిండు హృదయంతో ఇంకను ఇలా విజ్ఞప్తిచేశాడు: “ప్రభువా, (ఓ యెహోవా NW) నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు; నీకు మొఱ్ఱపెట్టు వారందరి యెడల కృపాతిశయము గలవాడవు. [ఓ] యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము; నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు. గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టెదను.” (కీర్తన 86:5-7) ఓ “యెహోవా”—ఈ సంబోధనకున్న సన్నిహితత్వాన్నిబట్టి మనం పదేపదే పులకించిపోతాము! అది ప్రార్థన ద్వారా నిత్యమూ పెంపొందించుకోవలసిన సన్నిహితత్వమైయుంది. దావీదు మరొక సందర్భంలో ఇలా ప్రార్థించాడు: “నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. [ఓ] యెహోవా నీ కృపనుబట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.” (కీర్తన 25:7) యేసును విమోచన క్రయధనంగా దయచేయుటలోను, పశ్చాత్తాపము చూపిన పాపులను కరుణించుటలోను, యథార్థత, మెప్పుదలగల తన సాక్షులపై కృపాతిశయాన్ని కురిపించుటలోను—మంచితనానికి యెహోవా తనకు తానే సాటి.—కీర్తన 100:3-5; మలాకీ 3:10.
9. పశ్చాత్తాపము చూపే పాపులు ఏ అభయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి?
9 గతంలో చేసిన తప్పిదాలను గూర్చి మనం వ్యాకులపడవలెనా? మనమిప్పుడు మన మార్గాన్ని సరళం చేసుకుంటున్నట్లయితే, పశ్చాత్తాపము నొందిన వారికి యెహోవా నుండి “విశ్రాంతి కాలములు” వచ్చునని అపొస్తలుడైన పేతురు యిచ్చే అభయాన్ని గుర్తుతెచ్చుకొన్నప్పుడు మనము బలపరచబడుదుము. (అపొ. కార్యములు 3:19) “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని ప్రేమతో చెప్పిన మన విమోచకుని ద్వారా ప్రార్థనయందు మనము యెహోవాతో సన్నిహితముగా ఉందాము. నేడు యథార్థ సేవకులుగా అమూల్యమైన యేసు నామమున యెహోవాకు ప్రార్థన చేస్తుండగా నిశ్చయంగా వారు విశ్రాంతి ననుభవిస్తారు.—మత్తయి 11:28, 29; యోహాను 15:16.
10. కీర్తన గ్రంథము యెహోవా కృపాతిశయమునకు ఎటువంటి ప్రాముఖ్యతనిస్తున్నది?
10 యెహోవా “కృపాతిశయమును” కీర్తనల గ్రంథము 100 సార్లకు పైగా పేర్కొన్నది. నిశ్చయంగా అటువంటి కృపాతిశయము సమృద్ధిగా ఉంది! మొదటి నాలుగు వచనాలలో, “ఆయన కృప నిరంతరము నిలుచునని” నాలుగుసార్లు చెప్పుచు, 118వ కీర్తన యెహోవాకు కృతజ్ఞత తెల్పవలెనని దేవుని సేవకులకు విజ్ఞప్తి చేస్తున్నది. “ఆయన కృప” అను యీ ప్రియమైన లక్షణాన్ని 136వ కీర్తన 26 సార్లు నొక్కితెల్పుచున్నది. మనమెటువంటి రీతిలో తప్పిదము చేసినను—యాకోబు 3:2 చెప్పునట్లు, “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము”—గనుక యెహోవా తన కనికరాన్ని, కృపను చూపుననే నమ్మకంతో మనమాయన క్షమాపణ కొరకు వేడుకొనుటకు సిద్ధంగా ఉందాము. ఆయన కృపాతిశయము, మన యెడల ఆయనకున్న యథార్థప్రేమకు తార్కాణమై యుంది. మనం యథార్థంగా దేవుని చిత్తం చేయుటలో కొనసాగినట్లయిన, ప్రతి విధమైన పరీక్షను ఎదుర్కొనుటకు మనలను బలపరచుటలో ఆయన తన యథార్థ ప్రేమను చూపిస్తాడు.—1 కొరింథీయులు 10:13.
11. పెద్దలు గైకొను చర్య దోష భావాలను తీసివేయుటకు ఎలా సహాయపడగలదు?
11 ఇతరుల మూలంగా మనము అభ్యంతరపడిన సందర్భాలు ఉండవచ్చును. చిన్నతనంలోనే భావోద్రేకానికి లేదా శారీరక దుశ్చర్యకు గురియైన వారిలో తాము దోషులమని లేదా తాము ఎందుకూ పనికిరామనే భావనలు కొందరికి ఉండవచ్చు. అట్టి బాధితుడు, యెహోవా తనకు జవాబిచ్చుననే నమ్మకంతో, ఆయనకు ప్రార్థించవచ్చును. (కీర్తన 55:16, 17) అది బాధితుని తప్పు కాదనే వాస్తవాన్ని అంగీకరించుటకు అట్టివానికి సహాయం చేయుటలో ఒక దయగల పెద్ద శ్రద్ధ తీసికోవచ్చును. ఆ తర్వాత, అతడు (లేక ఆమె) ఆ ‘బరువు భరించుటకు’ తుదకు స్వయంగా శక్తిగలవాడయ్యేంత వరకు ఆ పెద్ద అప్పుడప్పుడు స్నేహపూర్వకముగా చేసే ఫోన్‌కాల్స్ అతనికి సహాయం చేయగలవు.—గలతీయులు 6:2, 5.
12. దురవస్థలు ఎలా ఎక్కువయ్యాయి, అయితే మనం వాటినెట్లు విజయవంతముగా ఎదుర్కొన వచ్చును?
12 యెహోవా ప్రజలీనాడు ఎదుర్కోవలసిన ఇతర దురవస్థలు అనేకం కలవు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన 1914తో మొదలైన అనేక విపత్తులు మానవజాతిని పీడింప నారంభించాయి. యేసు ప్రవచించినట్లుగా, అవి “వేదనలకు ప్రారంభము.” మనము “యుగసమాప్తి” వైపు వెళ్లుచుండగా కృంగదీయు పరిస్థితులు అంతకంతకు ఎక్కువయ్యాయి. (మత్తయి 24:3, 8) అపవాదికున్న ‘కొంచెం సమయం’ తరిగిపోవుచు అంతం సమీపమగుచున్నది. (ప్రకటన 12:12) ఎరకొరకు వెదకే “గర్జించు సింహాన్ని” పోలి, ఆ గొప్ప విరోధి మనలను దేవుని మందనుండి వేరుచేసి నాశనం చేయాలని చేతికందిన ప్రతి కుయుక్తిని ఉపయోగిస్తున్నాడు. (1 పేతురు 5:8) అయితే అతడు విజయం సాధించలేడు! ఎందుకంటే, దావీదువలెనే మనం మన అద్వితీయ దేవుడగు యెహోవా మీద మన సంపూర్ణ నమ్మకాన్ని పదిలపరచుకున్నాము.
13. తలిదండ్రులు, వారి పిల్లలు యెహోవా మంచితనాన్ని ఎట్లు పొందగలరు?
13 దావీదు నిస్సందేహముగా తన కుమారుడైన సొలొమోను హృదయంలో యెహోవా మంచితనంపై ఆధారపడు అవసరాన్ని నాటాడు. కాబట్టి, సొలొమోను తన స్వంత కుమారునికి ఇలా ఉపదేశించగల్గాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానినిగదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు గలిగి చెడుతనము విడిచిపెట్టుము.” (సామెతలు 3:5-7) అదే ప్రకారం తలిదండ్రులు తమ పిల్లలకు యెహోవాయందు నమ్మకంతో ఎలా ప్రార్థించాలి, హృదయంలేని యీ లోక ముట్టడులను—అంటే పాఠశాలలో సన్నిహితుల వత్తిడి, లైంగిక దుర్నీతిలో పాల్గొనుటకు కలిగే వత్తిడివంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. ప్రతిదినం మీ పిల్లలతోపాటు బైబిలు సూత్రాలను పాటించుట వలన, వారు యెహోవా కొరకు నిజమైన ప్రేమను ‘కలిగియుండునట్లు, ప్రార్థనాపూర్వకంగా ఆయనపై ఆధారపడునట్లు అది వారి హృదయాలపై ముద్రవేస్తుంది.—ద్వితీయోపదేశకాండము 6:4-9; 11:18, 19.
యెహోవా సాటిలేని కార్యములు
14, 15. సాటిలేని యెహోవా కార్యాలు కొన్ని ఏవి?
14 లోతైన ధృడనమ్మకముతో దావీదు ఇట్లన్నాడు: “ప్రభువా, (ఓ యెహోవా NW) దేవతలలో నీవంటి వాడు లేదు, నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.” (కీర్తన 86:9) ఏ మానవుడును ఊహించలేనంత మిన్నగా యెహోవా కార్యములు గొప్పవి. మహాత్మ్యము గలవి, మరెంతో ఘనమైనవి, సృష్టింపబడిన విశ్వాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రం ద్వారా చూస్తే—దాని విశాలత, దాని పొందిక, దాని శోభ—దావీదు గ్రహించిన దానికంటెను అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నట్లు రుజువైంది. అయినను, ఆయనిలా చెప్పుటకు పురికొల్పబడ్డాడు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.”—కీర్తన 19:1.
15 రాత్రి, పగలు ఏర్పడునట్లు, విత్తుకాలము కోతకాలము వచ్చునట్లు, భవిష్యత్తులో మానవుడు ఉల్లసించుటకు ఆనందమునిచ్చు అనేక ఏర్పాట్లతో భూమిని సిద్ధపరచి, స్థిరపరచిన విధం కూడ యెహోవా కార్యములు అద్భుతములని చూపిస్తున్నవి. మన చుట్టూ వున్న యెహోవా కార్యములను మనమనుభవించులాగున, మనమెంత ఆశ్చర్యకరంగా సృష్టించబడ్డాం, సిద్ధం చేయబడ్డాం!—ఆదికాండము 2:7-9; 8:22; కీర్తన 139:14.
16. యెహోవా తన మంచితనాన్ని అత్యంత గొప్పగా ఎలా వ్యక్తపరిచాడు, ఇది మరింకే సాటిలేని కార్యాలకు దారితీసింది?
16 మానవజాతిని నేటి వరకు పీడించిన ఆ దురవస్థలు, మన మొదటి తలిదండ్రులు దేవునికి అవిధేయులైన తర్వాత ఆరంభమయ్యాయి. అయితే తన ప్రేమను బట్టి, దేవుని రాజ్యము ప్రకటించుటకు ఆలాగే మానవజాతి కొరకు మరణించుటకు తన కుమారుని పంపుటలో యెహోవా ఒక ఆశ్చర్యకార్యాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత అద్భుతాలలోకెల్ల అత్యంత అద్భుతమైన కార్యంగా యెహోవా, ఎన్నిక చేయబడి తన సహరాజుగా తయారయ్యేందుకు క్రీస్తును పునరుత్థానునిగా చేశాడు. (మత్తయి 20:28; అపొ. కార్యములు 2:32, 34) పునరుత్థానులగు కోటానుకోట్ల మానవులతో కూడిన “క్రొత్తభూమి” సమాజమును, ఔదార్యంగల “క్రొత్త ఆకాశముగా” క్రీస్తుతోపాటు పరిపాలించుటకు దేవుడు యథార్థ మానవుల నుండి ఒక “నూతన సృష్టిని” కూడ ఎంపిక చేసుకున్నాడు. (2 కొరింథీయులు 5:17; ప్రకటన 21:1, 5-7; 1 కొరింథీయులు 15: 22-26) ఆ విధంగా, యెహోవా కార్యములు మహిమాయుత ముగింపుకు వస్తాయి! నిజంగా మనమిట్లు కొనియాడగలం: “యెహోవా, . . . నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది!”—కీర్తన 31:17-19.
17. యెహోవా కార్యముల విషయంలో కీర్తన 86:10 ఇప్పుడు ఎట్లు నెరవేరుచున్నది?
17 యెహోవా ప్రస్తుత-దిన పనులందు దావీదు కీర్తన 86:10లో వర్ణించినది ఇమిడియున్నది: “నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. [ఓ యెహోవా NW] నీ నామమును ఘనపరచుదురు.” మానవజాతి నుండి రాజ్య వారసులైన “చిన్న మంద” సభ్యులను అనగా నూతనసృష్టిలో మిగిలిన వారిని పిలిచిన తర్వాత, యెహోవా “అన్యజనులందరి” నుండి యేసు చిందించిన రక్తమందు విశ్వాసముంచు లక్షలాదిమంది “వేరేగొఱ్ఱెల” “యొక గొప్పసమూహమును” సమకూర్చుట కారంభించాడు. ఆయన వీరిని ఒక శక్తివంతమైన సంస్థగా, నేడు ఈ భూమిపై ప్రపంచవ్యాప్తంగా సమాధానాన్ని ప్రేమించే సమాజంగా నిర్మించాడు. దీనిని గమనించిన, పరలోక సైన్యాలు “యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక” అని ప్రకటించుచు యెహోవా యెదుట సాష్టాంగపడిరి. ఈ లోకాంతము నుండి తప్పింపబడి పరదైసు భూమిపై నిరంతరము జీవించు నిరీక్షణతో గొప్పసమూహము కూడా యెహోవా నామమును మహిమపరుస్తూ ఆయనను “రాత్రింబగళ్లు” సేవిస్తున్నారు.—లూకా 12:32; ప్రకటన 7:9-17; యోహాను 10:16.
యెహోవా గొప్పతనము
18. తాను మాత్రమే ‘అద్వితీయ దేవుడని’ యెహోవా ఎలా చూపాడు?
18 అటు తరువాత దావీదు యెహోవా దైవత్వంపై దృష్టి సారిస్తూ ఇలా అన్నాడు: “నీవు మహాత్మ్యము గలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు; నీవే అద్వితీయ దేవుడువు.” (కీర్తన 86:8) ప్రాచీన కాలంనుండి, యెహోవా తాను నిజంగా ‘అద్వితీయ దేవుడని’ ప్రదర్శిస్తూనే వచ్చాడు. ఐగుప్తు కౄరపరిపాలకుడైన ఫరో అవమానకరంగా మోషేనిట్లు సవాలుచేశాడు: “నేను అతని మాటవిని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను.” అయితే అతడు యెహోవా ఎంత గొప్పవాడో త్వరలోనే నేర్చుకోవలసి వచ్చింది! విపత్కర తెగుళ్లను పంపి, ఐగుప్తీయుల జ్యేష్ఠ కుమారులను సంహరించి, ఎర్ర సముద్రములో ఫరోను అతని బలమైన సైన్యాలను హతమార్చి సర్వశక్తిగల దేవుడు ఐగుప్తు దేవతల, మంత్రవిద్యనభ్యసించు యాజకుల గర్వమణిచాడు. నిజమే, దేవుళ్లలో యెహోవా వంటివారు ఎవరునూ లేరు!—నిర్గమకాండము 5:2; 15:11, 12.
19, 20. (ఎ) ప్రకటన 15:3, 4లోని కీర్తన ఎప్పుడు మహాగొప్పగా వ్యక్తపరచబడును? (బి) ఇప్పుడుకూడ మనము యెహోవా పనియందు ఎట్లు భాగము వహించవచ్చును?
19 అద్వితీయ దేవునిగా, ఆధునిక ఐగుప్తుయైన సాతాను లోకము నుండి విధేయులైన తన ఆరాధికులను విడుదల చేయు ఏర్పాటులో యెహోవా ఆశ్చర్యకార్యాలు చేయనారంభించాడు. చరిత్ర యందంతటిలో బహు విస్తారమైన ప్రచారం ద్వారా తన దైవిక తీర్పులను ప్రపంచమంతా ఒక సాక్ష్యంగా ప్రకటింపజేస్తూ, ఆయన మత్తయి 24:14 నందలి యేసు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. త్వరలోనే, “అంతం” రావాలి. అప్పుడు భూమినుండి సమస్త దుష్టత్వాన్ని తుడిచివేయుట ద్వారా అపూర్వ స్థాయిలో యెహోవా తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడు. (కీర్తన 145:20) అప్పుడు, మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు తారాస్థాయికి చేరుతుంది. “ప్రభువా, (యెహోవా NW) దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, (యెహోవా NW) నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?”—ప్రకటన 15:3, 4.
20 దేవుని ఈ దివ్య సంకల్పాలను గూర్చి ఇతరులతో మాట్లాడుటయందు మన మట్టుకు మనము ఆసక్తిగా ఉందాము. (అపొ. కార్యములు 2:11 పోల్చుము.) మన తర్వాతి శీర్షిక వివరించునట్లు, యెహోవా మనకాలములోను, భవిష్యత్తులోను గొప్ప ఆశ్చర్యకార్యములు చేయుటలో కొనసాగును.
[అధస్సూచీలు]
a ఆండ్రూ ఎ. బోనర్ ఇలా చెప్పినట్లు 1874 నాటి ఒక బైబిలు వ్యాఖ్యాన గ్రంథము వ్రాసింది: “ముందున్న కీర్తన [85] ముగింపునందు దేవుని ప్రత్యేకమైన గురుతు, ఆయన మహిమాన్వత నామం ఎంతగానో బయల్పరచబడింది. ఇది దీని తర్వాత వ్రాయబడిన మరొక కీర్తన, ‘దావీదు ప్రార్థన,’ యెహోవా వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుంది. యెహోవా నామమే ఈ కీర్తన [86] యొక్క కీలకాంశము.”
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కా. వారు ప్రచురించిన అవేక్! జూన్ 22, 1984 సంచిక పేజీ 28 చూడుము.
c వివరాలకు, ది వాచ్‌టవర్ జనవరి 1, 1993 సంచికలో ప్రచురింపబడు “యెహోవాసాక్షుల 1992 సేవా సంవత్సరపు ప్రపంచవ్యాప్త నివేదిక” చూడండి.
మీరు గుర్తు తెచ్చుకొందురా?
◻ కీర్తన 86లోని ప్రార్థనను మన స్వంత ప్రార్థనగా ఎందుకు చేసుకోవాలి?
◻ యెహోవాతో మనమెట్లు సన్నిహితత్వాన్ని పొందగలము?
◻ యెహోవా మనయెడల తన మంచితనాన్ని ఎట్లు వ్యక్తపరచాడు?
◻ యెహోవా సాటిలేని కొన్ని కార్యాలు ఏవి?
◻ గొప్పతనంలో యెహోవా ఎట్లు ‘అద్వితీయ దేవుడు’?
[23వ పేజీలోని చిత్రాలు]
రానైయున్న “క్రొత్త భూమిలో” యెహోవా చేయు ఆశ్చర్యకార్యములు ఆయన మహిమను, మంచితనాన్ని రుజువుచేయును