నమ్మువారిని రక్షించుటకు యెహోవా “వెఱ్ఱితనమును” ఉపయోగించుట
“దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.”—1 కొరింథీయులు 1:21.
1. ఏ భావముతో యెహోవా “వెఱ్ఱితనము” నుపయోగిస్తాడు, లోకము తన జ్ఞానముతో దేవుని ఎరుగలేదని మనకెలా తెలియును?
ఏమిటి? యెహోవా వెఱ్ఱితనము నుపయోగించునా? ఎంతమాత్రం కాదు! అయితే ఆయన లోకమునకు వెఱ్ఱితనముగా కన్పించే దానిని ఉపయోగించగలడు, ఉపయోగిస్తాడు. ఆయనను ఎరిగి, ఆయనను ప్రేమించు ప్రజలను రక్షించుటకుగాను ఆయన ఆలాగు చేస్తున్నాడు. లోకము దాని జ్ఞానముద్వారా, దేవుని ఎరుగలేదు. “నీతిస్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదని” తన ప్రార్థనయందు చెప్పినప్పుడు యేసుక్రీస్తు దీనిని స్పష్టము చేశాడు.—యోహాను 17:25.
2. యెహోవా మార్గాలు, లోకమార్గాలు ఒకదానికొకటి సమాంతరముగా పోవుచున్నట్లు ఎలా కన్పించవచ్చును, అయితే వాస్తవలేమై యున్నవి?
2 యెహోవా మార్గములు లోకముయొక్క మార్గములకు భిన్నమై యున్నవని యేసు మాటలు సూచిస్తున్నవి. పైకిమాత్రం దేవుని సంకల్పము, ఈ లోకముయొక్క సంకల్పము ఒకదానికొకటి సమాంతరముగా పోవుచున్నట్లు కన్పించవచ్చును. ఈ లోక ధ్యేయములపై దేవుని ఆశీర్వాదమున్నట్లు కన్పించ వచ్చును. ఉదాహరణకు, భూమిపైగల మానవజాతికి శాంతి, సంతోషసౌభాగ్యాలను తీసికొనివచ్చు నీతియుక్తమైన ప్రభుత్వమును దేవుడు స్థాపించునని బైబిలు చెప్పుచున్నది. (యెషయా 9:6, 7; మత్తయి 6:10) అదేప్రకారము, లోకము కూడా నూతనలోక విధానం అనబడిన దానిద్వారా ప్రజలకు శాంతి, సంతోషసౌభాగ్యాలను, మంచి ప్రభుత్వాన్ని తీసుకు వచ్చుటే దాని సంకల్పమని చాటుచున్నది. అయితే దేవుని సంకల్పాలు, లోకముయొక్క సంకల్పాలు ఒకటి కాదు. సర్వోన్నత విశ్వసార్వభౌమాధిపతిగా తనను మహిమ పరచుకొనుటే యెహోవా సంకల్పము. భూమిపైనున్న ప్రభుత్వాలన్నింటిని నామరూపాలు లేకుండా చేయు పరలోక ప్రభుత్వము ద్వారా ఆయన దీనిని నెరవేర్చును. (దానియేలు 2:44; ప్రకటన 4:11; 12:10) కావున, దేవుడు ఈ లోకంతో ఏమాత్రం ఏకీభవించడు. (యోహాను 18:36; 1 యోహాను 2:15-17) అందుకే బైబిలు రెండు రకాల జ్ఞానములను గూర్చి మాట్లాడుచున్నది—“దేవుని జ్ఞానము,” “ఈ లోకజ్ఞానము.”—1 కొరింథీయులు 1:20, 21.
లోకజ్ఞానం యొక్క మూల లోపం
3. లోకజ్ఞానం బహుగొప్పగా కన్పిస్తున్నను, మానవుని వాగ్దాన నూతనలోక విధానం ఎందుకు ఎన్నటికి సంతృప్తికరంగా ఉండదు?
3 దేవుని జ్ఞానముచే నడిపించబడని వారికి, లోకజ్ఞానము బహు గొప్పదిగా కన్పించవచ్చును. మనస్సు నాకట్టుకొనే బహు గొప్పవనబడు లోక తత్వములున్నవి. ఉన్నతవిద్య నభ్యసింపజేయు వేలాది సంస్థలు. అనేకమంది మానవజాతిలోని మహామేధావులని తలంచిన వారిని గూర్చి బోధిస్తున్నవి. పెద్ద పెద్ద గ్రంథాలయాలు శతాబ్దాల మానవుని సేకరిత అనుభవజ్ఞానముగల గ్రంథాలతో నిండివున్నాయి. అయినప్పటికిని, లోక పాలకులు ప్రతిపాదించు నూతనలోక విధానం కేవలం అసంపూర్ణమైన, పాప-భూయిష్టమైన, మృతతుల్యమగు మానవులు చేయు పరిపాలనే కాగలదు. కాబట్టి, ఆ విధానం అసంపూర్ణమైనదై, గతంలో చేసిన తప్పిదాలనే పునరావృతం చేస్తు, మావనజాతి అవసరాల నన్నింటిని ఎన్నటికిని తీర్చజాలదు.—రోమీయులు 3:10-12; 5:12.
4. ప్రతిపాదించిన నూతనలోక విధానం దేనికి లోనైయున్నది, దాని ఫలితమేమి?
4 మానవుడు ప్రతిపాదించిన నూతనలోక విధానం మానవ బలహీనతకే గాకుండ, దుష్ట ఆత్మీయ ప్రాణులైన, అపవాదియగు సాతాను అతని దయ్యముల ప్రభావానికిని లోనైయున్నది. ప్రజలు “క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును” నమ్మకుండునట్లు సాతాను వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేశాడు. (2 కొరింథీయులు 4:3, 4; ఎఫెసీయులు 6:12) తత్ఫలితముగా, లోకము ఒకదానివెంట మరో బాధననుభవిస్తున్నది. దేవుని సహాయం లేకుండా, దైవచిత్తాన్ని లెక్కచేయకుండా పరిపాలించుకొనుటకు లోకం చేస్తున్న దారుణ ప్రయత్నం ఫలితంగా అదెంతో క్షోభను, హానిననుభవిస్తున్నది. (యిర్మీయా 10:23; యాకోబు 3: 15, 16) ఆ విధముగా, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, “లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగలేదు.”—1 కొరింథీయులు 1:21.
5. ఈ లోకజ్ఞానం యొక్క అసలు లోపమేమిటి?
5 కాబట్టి, ఒక నూతనలోక విధానం కొరకైన దాని పథకాలతోసహా, ఈ లోకజ్ఞానమునకున్న అసలు లోపమేమిటి? అదేమంటే, ఎన్నడు అలక్ష్యం చేయకూడని దానిని, అనగా యెహోవా దేవుని సర్వోన్నత సార్వభౌమాధిపత్యాన్ని లోకం అలక్ష్యం చేస్తున్నది. అది మూర్ఖంగా దైవిక సార్వభౌమాధిపత్యాన్ని నిరాకరిస్తున్నది. లోకము దాని ప్రణాళికలన్నింటిలో ఉద్దేశపూర్వకముగా యెహోవాను విడనాడుచు, తన స్వంత శక్తిపై, పథకాలపై ఆధారపడుతున్నది. (దానియేలు 4:31-34; యోహాను 18:37 పోల్చుము.) “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలమని” బైబిలు స్పష్టము చేస్తున్నది. (సామెతలు 9:10; కీర్తన 111:10) అయినను, ఈ కనీస జ్ఞానాన్నైనా లోకం సంపాదించలేదు. కాబట్టి, దైవిక మద్దతు లేకుండా, ఈ లోకమెట్లు జయప్రదం కాగలదు?—కీర్తన 127:1.
రాజ్యప్రకటన—వెర్రిదా లేక ఆచరణయోగ్యమైనదా?
6, 7. (ఎ) దేవుని జ్ఞానముచే నడిపింపబడువారు దేనిని ప్రకటిస్తున్నారు, అయితే లోకము వారినెట్లు దృష్టిస్తున్నది? (బి) ఎవరి జ్ఞానము ప్రకారం క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు ప్రకటిస్తున్నారు, దాని ఫలితమేమి?
6 మరోవైపున, దేవుని నెరిగినవారు దేవుని జ్ఞానమును ప్రదర్శస్తూ, దానిచే నడిపింపబడగోరుతారు. యేసు ప్రవచించినట్లుగా, వారు “ఈ రాజ్యసువార్తను . . . లోకమందంతటను” ప్రకటిస్తున్నారు. (మత్తయి 24:14; 28:19,20) మన భూమి కక్షలతో, కలుషితముతో, దారిద్ర్యముతో, మానవ బాధలతో నిండియుండగా, ఇప్పుడు అటువంటి ప్రకటన ఆచరణయోగ్యమేనా? లోకరీత్యా జ్ఞానులైన వారికి దేవుని రాజ్యమును గూర్చి అలా ప్రకటించుట కేవలము వెర్రితనముగా, ఆచరణ యోగ్యము కానట్లు కన్పిస్తున్నది. దేవుని రాజ్య ప్రచారకులు ప్రభుత్వాలకు పీడవంటి వారని, ఆదర్శ రాజకీయ ప్రభుత్వ పురోగతికి ఆటంకవాదులని వారు దృష్టిస్తారు. ఈ విషయంలో వారికి క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు వంత పలుకుచున్నారు. దేవుని నూతన లోకం, దాని రాజ్యప్రభుత్వం క్రీస్తు చేసిన ప్రధాన బోధయైనను, ఈ లోకజ్ఞానం చొప్పున బోధించు ఈ మతనాయకులు దాన్నిగూర్చి నేర్చుకోవాల్సిన అవసరతను ప్రజలకు చెప్పరు.—మత్తయి 4:17; మార్కు 1:14, 15.
7 క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకుల ఈ విఫలతను చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్ మన దృష్టికి తెస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “పరలోక రాజ్యమని తాను పిలిచిన దానికి యేసు ఇచ్చిన అమితమైన ప్రాధాన్యతతో పోలిస్తే, అనేక క్రైస్తవ చర్చీల పద్ధతిలోను, బోధలోను దాని ప్రాధన్యతా లోపము కొట్టొచ్చినట్లు కనబడుతుంది.” అయినను, ఈ తరం ప్రజలు జీవాన్ని సంపాదించాలంటే, వారు నిశ్చయంగా దేవుని స్థాపిత రాజ్యాన్ని గూర్చి మొదట వినాలి, అలా వినాలంటే ఆ సువార్తను గూర్చి ఎవరో ఒకరు ప్రకటించాలి.—రోమీయులు 10:14, 15.
8. నేడు దేవుని సువార్తను ప్రకటించుట ఎందుకు అత్యంత ఆచరణయోగ్యమైన పని, అయితే ఎటువంటి ప్రవర్తనా విధానానికి శాశ్వత ప్రయోజనం వుండదు?
8 కాబట్టి, రాజ్య సువార్త ప్రకటన ఈనాడు అత్యంత ఆచరణయోగ్యమైనదే. ఎందుకనగా ఆ రాజ్య వర్తమానము ‘అపాయకరమైన కాలములున్న’ ఈ అంత్యదినములలో మానవ హృదయాలను ఆనందముతో నింపు నిజమైన నిరీక్షణను సమకూరుస్తుంది. (2 తిమోతి 3:1-5; రోమీయులు 12:12; తీతు 2:13) ఈ లోకములో జీవితము అనిశ్చయముగాను, తక్కువగాను ఉండగా, దేవుని నూతన లోకములో జీవితము ఆనందముతో, సమృద్ధితో, ఈ భూమ్మీదే సమాధానము కలిగి నిత్యం వుంటుంది. (కీర్తన 37:3, 4, 11) యేసు చెప్పినట్లుగా, “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?” ఒక వ్యక్తి దేవుని నూతన లోకములో జీవించు హక్కును పోగొట్టుకొనినట్లయిన, గతించిపోవు ఈ లోకం వలన ఏం ప్రయోజనం? అటువంటి వ్యక్తి ప్రస్తుతమనుభవించు వస్తుసంపద వ్యర్థము. నిరర్థకము మరియు సమసిపోవునదే.—మత్తయి 16:26; ప్రసంగి 1:14; మార్కు 10:29, 30.
9. (ఎ) యేసు అనుచరుడగుటకు ఆహ్వానింపబడిన వ్యక్తి పనిని వాయిదా వేయుట కొరకు అడిగినప్పుడు, యేసు అతనికేమని సలహానిచ్చాడు? (బి) యేసు యిచ్చిన జవాబు మనపై ఏ ప్రభావం కలిగియుండాలి?
9 తనను వెంబడించుమని యేసు ఆహ్వానించిన ఒక మనుష్యుడు ఇలా అన్నాడు: “నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము.” అతనేమి చేయవలెనని యేసు అతనికి సలహానిచ్చాడు? తన తలిదండ్రులు మరణించు వరకు కేవలము వేచియుండి, అత్యంత అవశ్యకమైన ఈ పనిని అతడు వాయిదావేస్తాడని ఎరిగినవాడై, “మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని” యేసు అతనికి జవాబిచ్చాడు. (లూకా 9:59, 60) క్రీస్తుకు లోబడుటద్వారా జ్ఞానముచూపు వారు రాజ్య వర్తమానాన్ని తప్పక ప్రకటిస్తారు. ఈ లోకము, దాని పాలకులు నాశనమౌతారని దైవిక జ్ఞానము వారికి తెలియజేస్తుంది. (1 కొరింథీయులు 2:6; 1 యోహాను 2:17) మానవజాతికున్న ఏకైక నిజమైన నిరీక్షణ దేవుడు ఈ లోక వ్యవహారాలలో కలుగజేసుకొనుటపై, ఆయన పరిపాలనపై ఆధారపడియుందని దేవుని సార్వభౌమాధిపత్యమును బలపరచు వారికి తెలుసు. (జెకర్యా 9:10) కాబట్టి ఈ లోకజ్ఞానం గలవారు దేవుని రాజ్యమును నమ్మక, ఆ పరలోక ప్రభుత్వమును నిరాకరిస్తుండగా, దైవిక జ్ఞానముచే నడిపించబడువారు తమ తోటి మానవులకు ప్రయోజనకరమైనది చేస్తు, యెహోవా వాగ్దానము చేసిన నూతన లోకములోని నిత్యజీవమునకు వారిని సిద్ధం చేస్తారు.—యోహాను 3:16; 2 పేతురు 3:13.
“నశించుచున్న వారికి వెఱ్ఱితనము”
10. (ఎ) తార్సు వాడైన సౌలు మార్చబడినప్పుడు, ఆయన ఏ పని చేపట్టాడు, దానిని ఆయనెట్లు దృష్టించాడు? (బి) ప్రాచీన గ్రీస్తు దేశస్థులు దేనికి ప్రసిద్ధిగాంచారు అయితే వారి జ్ఞానమును దేవుడెట్లు దృష్టించాడు?
10 యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడైన పౌలుగా మారిన తార్సు వాడైన సౌలు, ఈ ప్రాణ రక్షణ పనిని చేపట్టాడు. యేసుక్రీస్తు సౌలును మార్చి, అతనికొక వెర్రి కార్యము అప్పగించెనని తలంచుట సమంజసమేనా? పౌలు అలా తలంచలేదు. (ఫిలిప్పీయులు 2:16) ఆ కాలములో గ్రీసు దేశస్థులను ప్రపంచంలోకెల్ల మహా మేధావులుగా పరిగణించేవారు. వారు తమ మహా తత్వవేత్తలను గూర్చి, మేధావులను గూర్చి గొప్పగా చెప్పుకున్నారు. పౌలు గ్రీకు భాష మాట్లాడినను, ఆయన గ్రీసు దేశస్థుల తత్వమును, బోధను అనుసరించలేదు. ఎందుకు? ఎందుకనగా అటువంటి ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనముగా నున్నది.a పౌలు దైవిక జ్ఞానాన్ని వెదికాడు, కాగా ఇంటింటికి వెళ్లి సువార్త ప్రకటించుటకది ఆయనను పురికొల్పంది. చరిత్రయంతటిలో మహాగొప్ప ప్రచారకుడైన యేసుక్రీస్తు దానికి మాదిరిగావుండి, అలాంటి పనినే చేయుమని ఆయనకు ఉపదేశించాడు.—లూకా 4:43; అపొ. కార్యములు 20:20, 21; 26:15-20; 1 కొరింథీయులు 9:16.
11. ప్రకటించుటకు తనకివ్వబడిన ఆజ్ఞను గూర్చి, లోకజ్ఞానమును గూర్చి పౌలు ముక్తసరిగా ఏమిచెప్పాడు?
11 ప్రకటించుమని తనకివ్వబడిన ఆజ్ఞనుగూర్చి పౌలు ఇలా చెప్పుచున్నాడు: “క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన [క్రీస్తు] నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త, [యేసు విమోచన క్రయధన బలి] నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై—జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞానియేమయ్యెను? [తత్వవేత్త వంటివాడు] శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.”—1 కొరింథీయులు 1:17-21.
12. “సువార్త ప్రకటనయను వెఱ్ఱితనము” ద్వారా యెహోవా ఏమి నెరవేరుస్తున్నాడు, “పైనుండివచ్చు జ్ఞానమును” కోరుకొనువారు దానికెట్లు ప్రతిస్పందిస్తారు?
12 లోకము వెర్రివారని పిలిచే వారినే యెహోవా తన ప్రచారకులుగా ఉపయోగించుట ఆశ్చర్యకరంగా కన్పించవచ్చు. అవును, ఈ ప్రచారకుల వెర్రి పరిచర్యద్వారా దేవుడు నమ్మువారిని రక్షిస్తున్నాడు. ఈ “వెఱ్ఱితనాన్ని” ప్రచారం చేయువారు తమనుతాము మహిమపరచుకొనకుండ, ఆలాగే ఇతర మానవులు తాము ఎవరిద్వారా సువార్త వినిరో వారిని మహిమపరచకుండునట్లు యెహోవా ఏర్పాటుచేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే, “ఏ శరీరియు దేవునియెదుట అతిశయింపకుండుటకే.” (1 కొరింథీయులు 1:28-31; 3:6, 7) నిజమే, ప్రచారకుడు ఒక ప్రముఖమైన పాత్ర వహించును, కానీ ప్రకటించుమని తనకాజ్ఞాపించబడిన వర్తమానమును నమ్ముటనుబట్టే ఆ వ్యక్తి రక్షింపబడును. “పైనుండి వచ్చు జ్ఞానమును” కోరువారు, ప్రచారకుడు వెర్రివానిగా, దీనునిగా ఉన్నట్లు కన్పించినందున, హింసించబడుతు, ఇంటింటికి వెళ్లుచున్నాడని ఆయన చెప్పే వర్తమానమును తృణీకరించరు. బదులుగా, దీన మనస్సు గలవారు రాజ్యాన్ని ప్రకటించు ఆ వ్యక్తి యెహోవాచే ఆజ్ఞాపింపబడి, దేవుని పేరిట వచ్చాడని అతన్ని గౌరవింతురు. ఆ ప్రచారకుడు మాటద్వారా, సాహిత్యాల ద్వారా తీసుకువచ్చే వర్తమానమునకు వారెంతో ప్రాముఖ్యతనిస్తారు.—యాకోబు 3:17; 1 థెస్సలొనీకయులు 2:13.
13. (ఎ) వ్రేలాడదీయబడిన క్రీస్తు ప్రకటనను యూదులు, గ్రీసు దేశస్థులు ఎట్లు దృష్టించారు? (బి) ఎటువంటి ప్రజలనుండి అనేకమంది యేసు అనుచరులు పిలువబడలేదు, ఎందుకు?
13 దేవుని మార్గాలను గూర్చిన తన చర్చను కొనసాగించుచు, పౌలు ఇట్లన్నాడు: “యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటే జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనును, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు. . . . జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.”—1 కొరింథీయులు 1:22-29; పోల్చుము యెషయా 55:8, 9.
14. (ఎ) నమ్ముట కనసరమగు సూచనలను గూర్చి అడిగినట్లయిన, యెహోవాసాక్షులు దేనిని సూచిస్తారు? (బి) లోకజ్ఞానమును రవ్వంతైనను ప్రదర్శించి గ్రీసు దేశస్థులను ఆకట్టుకొనుటకు పౌలు ఎందుకు నిరాకరించాడు?
14 యేసు భూమిపై నున్నప్పుడు, పరలోకమునుండి తమకొక సూచన చూపుమని యూదులు అడిగారు. (మత్తయి 12:38, 39; 16:1) అయితే యేసు ఎటువంటి సూచన చూపుటకైనను నిరాకరించాడు. అదేప్రకారము, ఈనాడు యెహోవాసాక్షులు నమ్మడానికి అవసరమయ్యే ఏ సూచనను ప్రదర్శించరు. బదులుగా, వారు యెషయా 61:1, 2; మార్కు 13:10; ప్రకటన 22:17 వంటి బైబిలు వచనాలలో వ్రాయబడిన విధంగా సువార్త ప్రకటించుటకు తమకివ్వబడిన ఆజ్ఞను సూచిస్తారు. ప్రాచీనకాల గ్రీసుదేశస్థులు జ్ఞానము కొరకు, ఈ లోకవిధానమందలి ఉన్నతవిద్య కొరకు చూశారు. పౌలు ఈ లోకజ్ఞానాన్ని అభ్యసించినను, దానిని రవ్వంతైనను ప్రదర్శించి, గ్రీసుదేశస్థుల నాకర్షించ ప్రయత్నించలేదు. (అపొ. కార్యములు 22:3) ప్రామాణిక గ్రీకులో మాట్లాడుటకు, వ్రాయుటకు బదులు, ఆయన సామాన్య ప్రజల వ్యవహారిక గ్రీకులో మాట్లాడి వ్రాశాడు. పౌలు కొరింథీయులకు ఇలా చెప్పాడు: “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. . . . మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.”—1 కొరింథీయులను కొరింథీయులు 2:1-5.
15. సువార్తను అపహసించే వారికి పేతురు ఏమి గుర్తుచేశాడు, ప్రస్తుతకాల పరిస్థితి ఎట్లు నోవహు కాలమును పోలియున్నది?
15 ఈ అంత్యదినములలో, రానైయున్న దేవుని నూతనలోక సువార్తను, సమీపిస్తున్న లోకాంతమును అపహాస్యము చేయువారు, నోవహు కాలమునాటి లోకము “నీటివరదలో మునిగి నశించెనని” చెప్పిన అపొస్తలుడైన పేతురు ద్వారా గుర్తు చేయబడుచున్నారు. (2 పేతురు 3:3-7) ఆ విపత్కర పరిస్థితి నెదుర్కొనబోయిన నోవహు ఏమిచేశాడు? ఆయన కేవలము ఓడ నిర్మించువాడని మాత్రమే అనేకమంది తలంతురు. అయితే దేవుడు అప్పటి లోకముపై జలప్రళయము రప్పించినప్పుడు, ఆయన “నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెనని” పేతురు చెప్పుచున్నాడు. (2 పేతురు 2:5) వారి లోకజ్ఞానము చొప్పున, జలప్రళయమునకు ముందున్న ఆ భక్తిహీనులు నిస్సందేహముగా నోవహు ప్రకటనను హేళనచేసి, ఆయనను వెర్రివాడని, చాదస్తుడని, ఆచరణయోగ్యుడు కాడని పిలిచారు. యేసు, తన తరమును నోవహు కాలముతో పోల్చినందున, నేడును నిజ క్రైస్తవులు అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. అయితే అపహాసకుల మధ్యను రాజ్యసువార్తను ప్రకటించుట కేవలము నోటిమాటే కాదు. నోవహు ప్రకటించిన విధముగానే, ప్రకటించు వ్యక్తికి దానిని వినువారికి రక్షణ కలుగునని దాని భావము!—మత్తయి 24:37-39; 1 తిమోతి 4:16.
‘జ్ఞానులగుటకు వెర్రివారిగా తయారగుట’
16. హార్మెగిద్దోనులో ఈ లోకజ్ఞానమునకు ఏమి సంభవించును, మరియు దేవుని నూతన లోకములోనికి ఎవరు రక్షింపబడతారు?
16 త్వరలోనే, యెహోవా దేవుడు హర్మెగిద్దోనులో సమస్త “జ్ఞానుల జ్ఞానమును” నాశనము చేయును. మానవజాతికి తమ నూతనలోక విధానం మంచి పరిస్థితులనెట్లు తీసుకురాగలదో ప్రవచించిన “వివేకుల వివేకమును” ఆయన త్రోసిపుచ్చును. “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” సమస్త కుతర్కమును, తత్వమును, ఈ లోకజ్ఞానాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. (1 కొరింథీయులు 1:19; ప్రకటన 16:14-16) ఈ లోకము వెర్రితనమని పిలిచే దానికి—అవును యెహోవా మహిమాన్విత రాజ్యసువార్తకు లోబడువారు మాత్రమే ఆ యుద్ధమందు రక్షింపబడి దేవుని నూతన లోకములో జీవం పొందెదరు.
17. యెహోవాసాక్షులు ఎట్లు ‘వెర్రివారిగా’ తయారైరి, సువార్త ప్రకటించు దేవుని ప్రచారకులు ఏమిచేయుటకు తీర్మానించుకొన్నారు?
17 యెహోవా ఆత్మచే నడిపింపబడు ఆయన సాక్షులు. లోకము వెర్రితనమని పిలిచే దానిని ప్రకటించుటకు సిగ్గుపడరు. లోకరీత్యా జ్ఞానులైయుండుటకు బదులు, వారు ‘వెర్రివారిగా’ తయారైరి. ఎలా? వారు జ్ఞానులగునట్లు రాజ్య ప్రచారం చేయుటద్వారా వారలా వెర్రివారౌతారు. పౌలు ఇలా వ్రాశాడు: “మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్లు వెఱ్ఱివాడు కావలెను.” (1 కొరింథీయులు 3:18-20) ప్రాణములను రక్షించు తమ వర్తమానపు విలువ నెరిగిన సువార్త ప్రకటించు యెహోవా ప్రచారకులు, లోకము దాని జ్ఞానము హార్మెగిద్దోనులో అంతమగు పర్యంతము ఎడతెగక సువార్తను ప్రకటిస్తారు. త్వరలోనే, యెహోవా దేవుడు తన విశ్వ సార్వభౌమాధిపత్యమును మహిమపరచుకొని, ప్రస్తుతము “సువార్త ప్రకటనయను వెఱ్ఱితనమును” విశ్వసిస్తూ, ఆ మేరకు పనిచేయు వారందరికి నిత్యజీవము ననుగ్రహిస్తాడు.
[అధస్సూచీలు]
a ప్రాచీన గ్రీసుదేశ మేధావుల తత్వజ్ఞాన చర్చలు, పరిశోధనలు ఎన్నివున్ననూ, నిరీక్షణకు వారు నిజమైన ఏ ఆధారమును కనుగొనలేకపోయారని వారి వ్రాతలు చూపిస్తున్నవి. పండితులైన జె. ఆర్. ఎస్. స్టెరెట్ మరియు సామ్యెల్ ఏంజెస్ ఇలా సూచిస్తున్నారు: “జీవిత దుఃఖాల్ని గూర్చి, ప్రేమ లోపించుటను గూర్చి, మోసపూరితమైన నిరీక్షణను గూర్చి, నిర్దాక్షిణ్య మరణాన్ని గూర్చి జాలిపుట్టించే వ్యాఖ్యలు అధికంగావున్న సాహిత్యమేది లేదు.”—ఫంక్ అండ్ వాగ్నల్స్ న్యూ “స్టాండార్డ్” బైబిల్ డిక్షనరీ, 1936, పుట 313.
నీ జవాబులేమై యున్నవి?
◻ ఏ రెండు రకాల జ్ఞానాలు కలవు?
◻ లోకజ్ఞానం యొక్క అసలు లోపం ఏమిటి?
◻ సువార్త ప్రకటించుట ఎందుకు అత్యంత ఆచరణయోగ్యమైనది?
◻ సమస్త లోకజ్ఞానానికి త్వరలో ఏమి సంభవించనై యున్నది?
◻ లోకము వెర్రితనమని పిలుచు దానిని ప్రకటించుటకు యెహోవాసాక్షులు ఎందుకు సిగ్గుపడరు?