కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/1 పేజీలు 21-25
  • యెహోవాను సేవించుట వలన నాకు కలిగిన ఆనందము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను సేవించుట వలన నాకు కలిగిన ఆనందము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమెరికాలో పెరుగుట
  • రేడియో ఉద్యోగాన్నుండి జైల్లోకి
  • పూర్తికాల పరిచర్య
  • పిల్లలు కలగడం నిషేధం క్రింద ప్రకటించడం
  • మా పిల్లల్ని అమెరికాలో పెంచుట
  • పెరూలో సేవచేయుట
  • ఈక్వెడార్‌ పిలుపు
  • మిక్కిలి వరప్రసాదమైన జీవితం
  • రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం—సురక్షితమైన, ఆనందభరితమైన జీవితం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • “నీ కృప జీవముకంటె ఉత్తమము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మీరు విదేశీక్షేత్రంలో సేవ చేయగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/1 పేజీలు 21-25

యెహోవాను సేవించుట వలన నాకు కలిగిన ఆనందము

జార్జి బ్రూమ్‌లే చెప్పినది

చక్రవర్తియగు హేలి సెలెసీ యొక్క యువ పోలీసు కెడెట్లకు రేడియో తరగతి తీసుకోవడాన్ని నేను ముగించానో లేదో, వారిలో ఒకరు వచ్చి నేను యెహోవాసాక్షుల మిషనరీ సేవకుడనని తనకు తెలుసని నాతో రహస్యంగా చెప్పి ఆ తర్వాత, “నాతో మీరు బైబిలు పఠిస్తారా?” అని ఆసక్తిగా నన్నడిగాడు.

ఇతియోపియాలో ఆ కాలమందు మన సేవ నిషేధమందున్నది గనుక, నా గురించి అధికారులకు తెలిస్తే, ఇతర సాక్షులవలెనే నేను కూడా దేశ బహిష్కరణకు గురయ్యేవాడినే. ఆ విద్యార్థి నిజమైన ఆసక్తితో అడుగుచున్నాడా లేక నన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం పంపిన ప్రతినిధా అని నేను ఆలోచించాను. పెంచి పోషించాల్సిన ముగ్గురు పిల్లలున్న కుటుంబ యజమానిగా, ఉద్యోగం పోగొట్టుకొని దేశాన్ని, నేను ప్రేమించిన స్నేహితుల్ని విడిచివెళ్లాలనే తలంపే నన్ను భయబ్రాంతున్ని చేసింది.

‘అయితే పోషించాల్సిన కుటుంబముతో ఒక అమెరికా దేశస్థుడు ఎక్కడోవున్న తన యింటిని, బంధువులను విడిచివచ్చి ఈశాన్య ఆఫ్రికాలో నివసించడానికి ఎలా యిష్టపడ్డాడు?’ అని మీరడుగవచ్చు. విషయాన్ని నన్ను వివరించనివ్వండి.

అమెరికాలో పెరుగుట

నేను ఇంకా ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న 1920వ దశాబ్దంలో, మా నాన్నగారు వాచ్‌టవర్‌ పత్రికకు చందాకట్టి, ఆలాగే స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌ ఒక సెట్‌ సంపాదించారు. మా నాన్నగారికి చదవడమంటే మహాయిష్టం అందుకే ఆయన ఆ పుస్తకాల్ని బాగా చదివారు. ఆయనది ఇతరులను ఆటపట్టించే సరదా గుణం, ఆదివారాలు యింటికి ఆహ్వానించిన వారితో ఆయన వ్యవహరించే విధానంలో అది కనబడేది. ఆయన దగ్గర పైన, ప్రక్కన బంగారు రంగులో “పరిశుద్ధ బైబిలు” అని వ్రాసివున్న అందమైన లెథర్‌ బైండ్‌ పుస్తకం వుండేది. “ఈవాళ ఆదివారం కదా. దీనిలోనుండి మనం కొన్ని వచనాలు చదువుదామా” అని ఆయన సంభాషణ ప్రారంభించేవారు.

అలా, వచ్చిన వ్యక్తి దాదాపు అందుకు అంగీకరించి, తెరిస్తే ఏముంది అందులో అన్నీ తెల్లకాగితాలే వుండేవి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయే వాడనుకోండి. అప్పుడు మా నాన్నగారు ‘ఈ సువార్తికులకు బైబిలు గురించి ఏమి తెలియదని’ చెప్పి, మరో బైబిలందుకొని ఆదికాండము 2:7 చదివేవాడు. అక్కడ మొదటి మానవుని సృష్టిగురించి వివరింపబడింది, అక్కడ బైబిల్లో యిలా వుంది: “నరుడు జీవాత్మ ఆయెను.”—ఆదికాండము 2:7, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

నరుడు ఒక ఆత్మను కలిగిలేడు గాని అతడే ఆత్మయనియు, పాపానికి జీతం మరణమనియు, మనిషి చనిపోయినప్పుడు అతడు నిజంగా మరణించాడని, దేని విషయంలోను స్మృతిలేని వాడయ్యాడని నాన్నగారు వివరించేవారు. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4; రోమీయులు 6:23) నేను బాగా చదువగల్గడానికి ముందే, ఆదికాండము 2:7 కంఠస్థము చేశాను. అవి బైబిలు సత్యాల్ని తెలుసుకొని వాటిని ఇతరులతో పంచుకొనుట వలన కలిగే నిజమైన ఆనందపు తొలి జ్ఞాపక స్మృతులు.

ఆ కాలంలో వాచ్‌టవర్‌ మా యింటికే వస్తుండేది గనుక, మా కుటుంబమంతా ఆత్మీయంగా పోషింపబడడం ఆరంభించింది. మా అమ్మమ్మ మాతోనే ఉండేది, ఆమె మా కుటుంబంలో సువార్త ప్రకటించు మొదటి ప్రచారకురాలయ్యింది. మేమున్న కార్‌బోన్‌డేల్‌, ఇల్లినాయిస్‌లో సంఘం లేదు, అయితే అనియత కూటాలు జరిగింపబడేవి. అమ్మ మా ఐదుగురు పిల్లలను పట్టణానికి ఆవలివైపున వృద్ధస్త్రీలు జరిపించుకునే వాచ్‌టవర్‌ పఠనానికి తీసుకెళ్లేది. మేము కూడా ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించడం ఆరంభించాము.

రేడియో ఉద్యోగాన్నుండి జైల్లోకి

నాకు కేవలం 17 సంవత్సరాల వయస్సులో అనగా 1937లో వివాహమయ్యింది. రేడియోలు బాగుచేయడం, ఆ నైపుణ్యాన్ని ఇతరులకు నేర్పించడం ద్వారా నేను కొంతడబ్బు సంపాదించేవాడిని. మాకు ఇద్దరు పిల్లలు పెగ్గి, హాంక్‌ పుట్టిన తర్వాత, మా వైవాహిక జీవితం ముగిసింది. నా తప్పిదం కారణంగానే విడాకులు తీసుకోవడం జరిగింది; నేను క్రైస్తవ జీవితాన్ని జీవించలేదు. మొదట కలిగిన ఆ యిద్దరు పిల్లల్ని పెంచే అవకాశం దొరకలేదనేది జీవితాంతం ఒక బాధగానే మిగిలిపోయింది.

రెండవ ప్రపంచ యుద్ధం నేనెన్నో సంగతులు తలంచేటట్లు చేసింది. నేనొక క్రిందిస్థాయి సైనికాధికారిగా తయారై, సైనికులుగా చేర్చుకోబడిన వారికి రేడియో బోధించే అవకాశాన్ని సైనిక దళాలు నాకు అందించాయి, అయితే యుద్ధాన్ని గూర్చి యెహోవా బోధయెడల నాకున్న శ్రద్ధ నేను అనుదినం ప్రార్థించేందుకు నన్ను ప్రోత్సహించింది. ది వాచ్‌టవర్‌ కొరకు నేను చేసిన చందా ముగిసింది, అయితే నా చందా ముగియుచున్నదనే నోటీసు అందుకున్న లూసెల్‌ హావర్త్‌ నన్ను సందర్శించింది. లూసెల్‌ నాన్నగారి పేరు పెరీ హావర్త్‌, ఆమెకున్న పెద్ద కుటుంబంలో చాలామంది 1930 నుండి సాక్షులుగా ఉన్నారు. నేను లూసెల్‌ ప్రేమించుకొని, ఆ తర్వాత 1943 డిశంబర్‌లో వివాహం చేసుకున్నాము.

నేను 1944లో బాప్తిస్మం తీసుకొని పూర్తికాల పరిచర్యలో పయినీర్‌గా నా భార్యతో కలిశాను. సైనికోద్యోగిగా చేరవలెనని నాకు త్వరలోనే పిలుపు అందింది, కాని చేరడానికి నేను నిరాకరించాను. దాని ఫలితంగా నాకు ఓక్లహామా, ఎల్‌ రినో ఫెడరల్‌ నేర పునరావాస కేంద్రంలో మూడు సంవత్సరాల శిక్ష వేశారు. యెహోవా కొరకు అలా బాధనొందడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఉదయం నేను మేల్కొని నేను ఎక్కడున్నాను, ఎందుకున్నానో గ్రహించినప్పుడు, నేనెంతో సంతృప్తి చెంది యెహోవాకు కృతజ్ఞత తెల్పేవాడిని. యుద్ధం ముగిసిన తర్వాత 25 సంవత్సరాలకు పైగా వయస్సున్న వారందరిని వ్యక్తిగత పూచీపై విడుదల చేయనారంభించారు. నేను 1946 ఫిబ్రవరిలో విడుదలయ్యాను.

పూర్తికాల పరిచర్య

నేను తిరిగి లూసెల్‌ను కలుసుకునేటప్పటికి, ఆమె ఓక్లహామాలోని చిన్నపట్టణమగు వాగ్‌నెర్‌లో పయినీర్‌ సేవచేస్తున్నది. మాకు కారు లేనందున, పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సేవచేస్తూ ఎక్కడికైనా కాలినడకనే వెళ్లేవాళ్లం. ఆ తర్వాత మేము ఓక్లహామాలోనే వివొకెకు మారాము. త్వరలోనే నేను దగ్గర్లోవున్న రేడియో కేంద్రంలో ఉద్యోగం సంపాదించి ప్రసార విభాగంలో పనిచేయనారంభించాను. రోజులో ఆరుగంటలు పనిచేసి అదే సమయంలో పయినీరుగా సమయం గడపడం సులభమైన పని కాదు, అయితే యెహోవాను సేవించే ఆధిక్యత మాకున్నందుకు మేమానందించాము. లాస్‌ఏంజిల్స్‌లో 1947, సమావేశ సమయానికి మేమొక పాతకారు కొనగల్గాము. అప్పుడు మేము మిషనరీ సేవకొరకు వాచ్‌టవర్‌ బైబిల్‌ గిలియడ్‌ పాఠశాలకు దరఖాస్తు చేయడాన్ని గూర్చి తలంచాము.

ఇదొక పెద్ద నిర్ణయం కాగలదని మేము గ్రహించాము, అయితే అమెరికా విడిచి వెళ్లేందుకు మేము చేసే తీర్మానంలో తొందరపడకూడదని మేము తలంచాము. నా పిల్లలను పోగొట్టుకొన్న చింత నన్నింకా విడిచిపెట్టలేదు, అందుకే వారి సంరక్షణ తీసుకోవడానికి మరలా ఒకసారి మేము ప్రయత్నించాము. కాని నా గత జీవిత విధానం, చెరసాల రికార్డు కారణంగా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అందువలన మేము మిషనరీలుగా తయారు కావడానికే నిర్ణయించుకున్నాము. మేము గిలియడ్‌ పాఠశాల 12వ తరగతికి ఆహ్వానింపబడ్డాము.

మేము 1949లో ఆ పాఠశాల నుండి పట్టభద్రులమయ్యాము, అయితే మేము మొదట టెన్నిసీలోని సంఘాలు సందర్శించడానికి నియమించబడ్డాము. అమెరికాలో అలా మూడు సంవత్సరాలు ప్రయాణ కాపరి పనిలో గడిపిన తర్వాత, ప్రకటించే పనికి తోడుగా ఇతియోపియాలో పాఠశాలయందు బోధించడానికి మేము ఇష్టపడుచున్నామో లేదో తెల్పవలసిందిగా వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుని కార్యాలయం నుండి మాకొక ఉత్తరం అందింది. మిషనరీలు బోధించాలనేది ఆ ప్రభుత్వం యొక్క నియమాలలో ఒకటి. దానికి మేమంగీకరించి, 1952 వేసవిలో ఇతియోపియాకు బయలుదేరాము.

మేము ఇతియోపియాకు వచ్చిన తరువాత, ఉదయం ప్రాథమిక పాఠశాల విద్య బోధించి మధ్యాహ్నం ఉచిత బైబిలు తరగతులు నిర్వహించే వారము. అనేకమంది బైబిలు విద్యార్థులు రావడం ప్రారంభించారు, దానితో మేము తరచు బైబిలు బోధిస్తూ రోజులో మూడు నాలుగు గంటలు గడిపేవారము. వారిలో కొందరు విద్యార్థులు పోలీసువారు; మరికొందరు ఉపాధ్యాయులు లేదా మిషనరీ పాఠశాలల్లో మరియు ఇతియోపియా దేశపు ఆర్థొడాక్స్‌ పాఠశాలల్లో డీకన్స్‌గా వుండేవారు. కొన్నిసార్లు ప్రతి బైబిలు పఠన తరగతికి 20, అంతకంటే ఎక్కువమంది విద్యార్థులు వచ్చేవారు. అనేకమంది విద్యార్థులు అబద్ధమతాన్ని విడిచి, యెహోవాను సేవించడం మొదలుపెట్టారు. అది మాకెంతో సంతోషాన్నిచ్చింది. నేను ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు, యెహోవాకు కృతజ్ఞత చెల్లించాను.

పిల్లలు కలగడం నిషేధం క్రింద ప్రకటించడం

పందొమ్మిది వందల యాభై నాలుగులో మేము తలిదండ్రులము కాబోతున్నామని మాకు తెలిసింది, కాబట్టి మేము తిరిగి అమెరికాకు వెళ్లిపోవాలో లేక ఇతియోపియాలోనే వుండిపోవాలో నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అక్కడ వుండాలంటే నేను ఏదో ఉద్యోగం సంపాదించుకోవడం మీద ఆధారపడివుంటుంది. చక్రవర్తియగు హేలి సెలెసీకి చెందిన రేడియో కేంద్రాన్ని నడిపించే ప్రసార ఇంజనీరుగా నేను ఉద్యోగం సంపాదించాను. కాబట్టి మేము అక్కడే ఉండిపోయాము.

సెప్టెంబరు 8, 1954లో మా అమ్మాయి జూడిత్‌ పుట్టింది. నేను చక్రవర్తి కొరకు పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఉద్యోగ భద్రత కలదని నేను తలంచాను, కాని రెండు సంవత్సరాల తర్వాత నా ఉద్యోగం పోయింది. అయితే, ఒక నెలలోపునే పోలీసు డిపార్టుమెంటువారు—ఎక్కువ జీతానికి—నన్ను తాత్కాలికంగా నియమించుకున్నారు. నా పనేమిటంటే టూ-వే రేడియో రిపేరు చేయడాన్ని గూర్చి యువకులకు బోధించాలి. తర్వాత మూడు సంవత్సరాలలోపే, మా అబ్బాయిలు ఫిలిప్‌, లెస్లీ జన్మించారు.

అదే సమయంలో ప్రకటించే పనిలో భాగంవహించే మన స్వేచ్ఛయెడల దృక్పధం మారడం ఆరంభించింది. యెహోవాసాక్షుల మిషనరీలనందరిని వెళ్లగొట్టాల్సిందిగా ఇతియోపియా ఆర్థొడాక్స్‌ చర్చి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చింది. సొసైటి సలహాప్రకారం, నేను నా వీసాను మిషనరీ సేవనుండి ఉద్యోగానికి మార్చుకున్నాను. మన మిషనరీ సేవ నిషేధింపబడగా, మేము బహు అప్రమత్తంగా, వివేకముతో ఉండవలసి వచ్చింది. సంఘ కూటములన్నియు నిర్వహింపబడేవి, అయితే మేము చిన్న చిన్న పఠన గుంపులుగా కలుసుకునే వారము.

పోలీసువారు అనుమానంవున్న సాక్షుల వివిధ గృహాలను సోదాచేశారు. అయితే, తను యెహోవాను ఆరాధించేవాడని వారికి తెలియని పోలీసు అధికారి ఒకరు అన్ని సమయాల్లో పోలీసులు రెయిడ్‌ చేయాలని నిర్ణయించిన సమయాల్ని మాకు తెలియజేసేవాడు. దాని ఫలితంగా ఆ సంవత్సరాలలో ఏలాంటి సాహిత్యం కూడ వారి స్వాధీనం కాలేదు. పట్టణం వెలుపల ఆరుబయట కూర్చుని భోజనం చేయడానికి పిక్‌నిక్‌ బల్లలు ఏర్పాటు చేయబడిన రెస్టారెంట్లకు వెళ్లి ఆదివారాలు మేము వాచ్‌టవర్‌ పఠనం నిర్వహించేవారము.

ఈ కాలంలోనే నేను పోలీసు కేడెట్లకు రేడియో తరగతి తీసుకుంటుండగా, మొదట్లో నేను ప్రస్తావించిన విద్యార్థి బైబిలు పఠనం కొరకు అడిగాడు. అతడు చిత్తశుద్ధితోనే అలా అడుగుచున్నాడని నేను అనుకుని పఠనం ప్రారంభించాము. కేవలం రెండు పఠనముల తర్వాత, అతనితో కూడ మరో విద్యార్థి, ఆ తర్వాత మూడో విద్యార్థి వచ్చారు. నాతో వారు పఠనం చేస్తున్నారని, ఎప్పుడు ఎవరితోను చెప్పవద్దని నేను వారిని హెచ్చరించాను, వారలాగే ఎవ్వరికీ చెప్పలేదు.

న్యూయార్క్‌ యాంకీ స్టేడియం, పొలొ గ్రౌండ్స్‌లో 1958లో దైవిక చిత్తమనే అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ మధ్య కాలంలోనే పెగ్గి, హాంక్‌, ఆలాగే మా పెద్ద కుటుంబంలోని అనేకమంది ఇతర సభ్యులు చురుకైన సాక్షులయ్యారు. దానికి హాజరు కాగల్గినందుకు నేనెంతగా సంతోషించానో! నా పెద్దపిల్లలిద్దర్ని, మిగతా కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకున్నందుకే కాదు, ఆ సమావేశపు చివరి రోజున 2 లక్షల 50 వేలకు పైగా హాజరైన జన సందోహాన్ని చూసి నేనెంతగా పులకరించి పోయానో!

ఆ మరుసటి సంవత్సరం సొసైటి అధ్యక్షుడగు, నేథన్‌ హెచ్‌. నార్‌ ఇతియోపియాలో మమ్మును సందర్శించుటకు వచ్చారు. నిషేధముల క్రింద మన సేవను కొనసాగించడానికి ఆయన మాకు అనేక చక్కని సలహాలిచ్చారు. అంతేకాదు మేము ఆత్మీయంగా ఎలావున్నామో కూడ ఆయన మాకుటుంబం యెడల శ్రద్ధచూపారు. పిల్లలకు ప్రార్థించుట నేర్పిస్తున్నామని నేను ఆయనకు వివరించాను. జూడిత్‌ ప్రార్థన చేయడాన్ని వినడానికి మీరిష్టపడతారా అని నేనాయనను అడిగాను. దానికాయన సరేనని, ఆ తర్వాత ఆయన ఆమెతో, “జూడిత్‌ ప్రార్థన చాలాబాగా చేశావమ్మా” అని అన్నారు. ఆ తర్వాత భోజనాల సమయంలో నేను సహోదరుడైన నార్‌ను ప్రార్థించవలసిందిగా అడిగాను. ఆయన ప్రార్థించడం అలా ముగించాడో లేదో, “చాలా బాగా ప్రార్థనచేశారు బ్రదర్‌ నార్‌!” అని జూడిత్‌ అంది.

మా పిల్లల్ని అమెరికాలో పెంచుట

పోలీసు డిపార్టుమెంటుతో నాకున్న కంట్రాక్టు 1959తో ముగిసింది. మేమక్కడే ఉండాలనుకున్నాము, కాని ప్రభుత్వం నాతో ఏ క్రొత్త కంట్రాక్టులను ఆమోదించలేదు. కాబట్టి మేమెక్కడికి వెళ్లగలం? సహోదరుల కొరకు ఎక్కువ అవసరమున్న ఇతర దేశాలకు వెళ్లడానికి నేను ప్రయత్నించాను, కాని అలా చేయలేకపోయాను. బాధగా ఉన్ననూ మేము అమెరికాకు తిరిగి వచ్చాము. తిరిగివచ్చాక మా కుటుంబమంతా ఆనందంతో తిరిగి కలుసుకున్నాము; మా పిల్లలు ఐదుగురు ఒకరికొకరు బాగా పరిచయమై వెంటనే ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచుకున్నారు. అప్పటినుండి వారు చాలా సన్నిహితంగా ఉన్నారు.

మేము కాన్సాస్‌, విచిటాలో స్థిరపడ్డాము, నాకక్కడే రేడియో ఇంజనీరుగా, డిస్క్‌ జాకీగా ఉద్యోగం దొరికింది. లూసెల్‌ ఇంటిపనులు చక్కదిద్దుకోవడం, పిల్లలు ఇంటికి దగ్గర్లోగల పాఠశాలకు హాజరవడం ఆరంభించారు. ప్రతి సోమవారం రాత్రి నేను కుటుంబ వాచ్‌టవర్‌ పఠనం నిర్వహిస్తూ, దాన్ని అన్ని సమయాల్లో ఉత్తేజకరంగా ఆసక్తిదాయకంగా ఉండేటట్లు చేయడానికి ప్రయత్నించేవాన్ని. పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా అని మేము ప్రతిరోజు అడిగి తెలుసుకునేవాళ్లము.

పిల్లలు ఒక్కొక్కరు దైవపరిపాలనా పాఠశాలలో భాగం వహిస్తుండగా, ఈ శిక్షణ వారికి తమ పాఠశాలలో సహాయపడేది. గృహములయొద్ద బైబిలు సాహిత్యాలను అందించడం వారు నేర్చుకున్నారు, ఆలాగే వారు మాతోపాటు గృహబైబిలు పఠనములకు వచ్చేవారు.

వారిలోనే ఒకరికున్నవి మరొకరికి ఉండవని వివరిస్తూ, పిల్లలకు జీవితాన్ని గూర్చిన ప్రాథమిక విషయాలు నేర్పించడానికి కూడ మేము ప్రయత్నించాము. ఉదాహరణకు, ఒకే విధమైన బహుమానము అందరికి అన్ని సమయాల్లో లభించేది కాదు. “నీ కివ్వకుండా, అన్నయ్యకు లేదా చెల్లికి ఒక బొమ్మ ఇవ్వాల్సివస్తే, దానిని గూర్చి నీవు ఫిర్యాదు చేయడం మంచిదేనా?” అని మేము వారితో తర్కించేవారము. వేరే సమయాల్లో ఇతర పిల్లలకూ ఏదోకటి ఇచ్చేవారమనుకోండి, అలా ఎవరినీ నిర్లక్ష్యం చేయడం జరిగేది కాదు. మిగతా ఇద్దరికంటె ఎవరినీ ఎక్కువ తక్కువ కాకుండ మేమన్ని సమయాల్లో అందరినీ ప్రేమించే వాళ్లము.

కొన్ని సమయాల్లో ఇతర పిల్లలు చేసేదాన్ని మా పిల్లలు చేయడానికి మేము అనుమతించేవారము కాదు. “ఫలాని వాళ్లు దాని చేయగల్గినప్పుడు, మేమెందుకు అలా చేయకూడదు?” వంటి మాటలు తరచు వినబడేవి. నేను వివరించేందుకు ప్రయత్నించేవాన్ని, అయితే కొన్ని సమయాల్లో కేవలం, “మీరు ఆ కుటుంబానికి కాదు బ్రూమ్‌లే కుటుంబానికి చెందిన వారు. మీకు భిన్నమైన నియమాలున్నవి” అని జవాబు చెప్పేవాన్ని.

పెరూలో సేవచేయుట

ఇతియోపియా నుండి తిరిగివచ్చినప్పటినుండి నేను, లూసెల్‌ మరలా మిషనరీ సేవలో భాగం వహించాలని కోరుకున్నాము. చివరకు 1972లో దక్షిణ అమెరికాలోని పెరూకు వెళ్లే అవకాశం మాకు లభించింది. వారి కౌమార దశలో పిల్లలను పెంచడానికి ఇంతకంటే మంచి ప్రదేశాన్ని మేము ఎంచుకోగల్గే వాళ్లంకాదు. సేవచేయడానికి పెరూకు వచ్చిన మిషనరీలతో, ప్రత్యేక పయినీర్లతో, ఇతరులతో వారనుభవించిన సహవాసం, వారు మొట్టమొదట రాజ్యాసక్తులను నిజంగా మొదటిగా వెదకేవారి ఆనందాన్ని చూడడానికి సహాయపడింది. ఆ సహవాసం తనపై అనుకూల ప్రభావం చూపిందని ఫిలిప్‌ అన్నాడు.

కొంతకాలం తర్వాత రాజ్య పరిచర్యలో మేమెంతగా సఫలమయ్యామో తెలుసుకొని కాన్సాస్‌లోని మా పాత స్నేహితులు కొందరు, పెరూలో మాతోపాటు సేవలో కలిశారు. మా గృహాన్ని ఒక మిషనరీ గృహంగా తీర్చిదిద్దాను. అందరూ ప్రాంతీయ పరిచర్యలో సమయం గడుపుటకు వీలుగా అందరికి ఆయాపనుల నియామకం చేశాము. ప్రతి ఉదయం మేము బల్లయొద్ద దినవచనం చర్చించేవాళ్లం. అది మాకందరికి సంతోషదాయకమైన సమయమై యుండేది. మరలా నేను ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు, నేనెక్కడ వున్నాను ఎందుకున్నానో గ్రహించి, మౌనంగా యెహోవాకు మిక్కిలి కృతజ్ఞత చెల్లించేవాన్ని.

యుక్త కాలమున జూడిత్‌కు వివాహం జరిగింది, ఆమె భర్తకు దేశపౌరునిగా వీసా దొరకనందున ఇద్దరు త్వరలోనే అమెరికాకు వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు ప్రత్యేక పయినీర్‌ సేవ తర్వాత ఫిలిప్‌ దరఖాస్తు చేసుకొనగా న్యూయార్క్‌, బ్రూక్లిన్‌లో బేతేలు సేవకు అంగీకరింపబడ్డాడు. లెస్లీ కూడ అమెరికాకు తిరిగి వెళ్లింది. వారు మిశ్రిత భావాలతో మమ్మల్ని విడిచివెళ్లారు మరియు వారిని మేము పెరూకు తీసుకెళ్లి శ్రేష్ఠమైన పనిచేశామని తరచు చెప్పేవారు.

పెరూలో ఆర్థిక స్థితి హీనంగా దిగజారడంతో, మేము కూడ అక్కడనుండి వెళ్లాల్సివస్తుందని గ్రహించాము. మేము 1978లో విచిటాకు తిరిగివచ్చేసరికి మేమక్కడ స్పానిష్‌ మాట్లాడు సాక్షుల గుంపును చూశాము. అక్కడే వుండి వారికి సహాయం చేయాల్సిందిగా వారు మమ్మల్ని అడగడంతో, మేము సంతోషంగా అంగీకరించాము. అక్కడ సంఘమొకటి స్థాపించబడగా, మేము క్రితం సేవచేసిన వారి మాదిరిగానే వీరు అనతికాలంలోనే మాకెంతో ప్రియమైన వారయ్యారు.

ఈక్వెడార్‌ పిలుపు

నాకు కొద్దిగా పక్షవాతం వచ్చినప్పటికిని, నేను లూసెల్‌ మరోదేశంలో కూడ సేవచేయాలని ఆశతో ఎదురుచూశాను. ఈక్వెడార్‌లో జరుగుతున్న అభివృద్ధిని గూర్చి, అక్కడున్న క్రైస్తవ పెద్దల అవసరతను గూర్చి 1984లో ప్రయాణకాపరి ఒకరు మాతోచెప్పారు. నా కుంటితనాన్నిబట్టి నేను ప్రాంతీయ పరిచర్య కొద్దిగా మాత్రమే చేయగలనని నేనాయనకు సూచించాను, అయితే 65 సంవత్సరాల వయస్సు, కొద్దిగా పక్షవాతమున్ననూ అక్కడ ఒక పెద్ద సహాయపడగలడని ఆయన నాకు అభయమిచ్చాడు.

ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఈక్వెడార్‌కు వెళ్లగలిగే విషయమై మాట్లాడుతూ ఆ రాత్రంతా మేము నిద్రపోలేక పోయాము. నా మాదిరిగానే లూసెల్‌కు కూడా అక్కడికి వెళ్లాలనే కోరిక బలంగావుండింది. దానితో మాకున్న ఓ చిన్న క్రిమి సంహారక మందుల వ్యాపారాన్ని గూర్చి ప్రకటించి రెండు వారాలలో దాన్ని అమ్మివేశాము. ఆ తర్వాత పదిరోజుల్లో మా ఇల్లు అమ్మివేశాము. ఆ విధంగా, మా వృద్ధాప్యంలో మేము మరలా మా అత్యానందకరమైన సేవకు, అనగా విదేశీ మిషనరీ సేవకు తిరిగివెళ్లాము.

మేము క్విటోలో స్థిరపడ్డాము, ప్రతిరోజు ఒక క్రొత్త అనుభవం లేదా సాహసకృత్యంతో ప్రాంతీయ పరిచర్య ఆనందంగా ఉండేది. అయితే 1987లో నాకు పెద్దప్రేవులో క్యాన్సరని వైద్య పరీక్షలో తేలింది; దానికొరకు నాకు వెంటనే శస్త్రచికిత్స చేయడం అవసరమయ్యింది. శస్త్రచికిత్స కొరకు మేము విచిటాకు వెళ్లాము, ఆ శస్త్రచికిత్స విజయవంతమయ్యింది. మేము క్విటోకు తిరిగివచ్చిన రెండు సంవత్సరాలకే మరలా ఆ క్యాన్సరు తిరగబెట్టింది, దానితో మేము శాశ్వతంగా అమెరికాకు తిరిగివెళ్లాల్సొచ్చింది. మేము ప్రస్తుతం నివసిస్తున్న ఉత్తర కరోలినాకొచ్చి స్థిరపడ్డాము.

మిక్కిలి వరప్రసాదమైన జీవితం

ఎక్కువకాలం బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు. నాకు 1989లో పెద్ద ప్రేగులో రంధ్రంచేసి కృత్రిమ పురీశద్వారం కల్పించే శస్త్రచికిత్స జరిగింది. అయినప్పటికిని, నేనొక పెద్దగా సేవచేస్తూ మా యింటికి వచ్చేవారితో అనేక బైబిలు పఠనములు నిర్వహించగలుగుచున్నాను. గడచిన సంవత్సరాలన్నింటిలో సత్యమనే విత్తనాలను నాటి, నీరుపోసి లేదా సాగుచేయడం ద్వారా మేము అక్షరార్థముగా వందలాది మందికి సహాయం చేశాము. అది ఎన్నిసార్లు పునరావృతమైనను, ఆ యానందం ఎన్నటికిని వాడిపోదు.

దానికితోడు, నా పిల్లలందరు యెహోవాను సేవించడాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది. పెగ్గి తనభర్తయగు పౌల్‌ మోస్కితో కలిసి గత 30 సంవత్సరాలుగా అమెరికాలో ప్రయాణకాపరి సేవలో ఉంది. ఫిలిప్‌, జూడిత్‌ న్యూయార్క్‌, బ్రూక్లిన్‌ బేతేలులో ప్రత్యేక సేవలో ఉన్నారు. హాంక్‌, లెస్లీ వారి వివాహపు జతలతో చురుకైన సాక్షులుగా ఉన్నారు, ఆలాగే మా నలుగురు సహోదరులు, సహోదరీలు వారి కుటుంబాలు, 80 కంటే ఎక్కువమంది రక్త సంబంధీకులతోపాటు వీరందరు యెహోవాను సేవిస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో లూసెల్‌ మాదిరికరమైన క్రైస్తవ భార్యగా ఉన్నది. ఇటీవల సంవత్సరాలలో నా క్షీణిస్తున్న శరీరం యెడల శ్రద్ధచూపడానికి, అలా చేయడానికి ఇతరులు అయిష్టపడే ఎన్నో సేవలు ఆమె నాకు యిష్టపూర్వకంగా చేసింది.

నిజంగా, నా జీవితం ఆనందమయం. ఏ మాటలు వర్ణించలేనంత సంతోషంగా గడిచింది. యెహోవాను సేవించడం ఎంతో ఆనందదాయకం మరియు ఈ భూమిమీద అనంత కాలం ఆయనను ఆరాధించాలనేదే నా హృదయపూర్వక కోరికైయున్నది. “నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీకృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను” అని చెప్పిన కీర్తన 59:16ను నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను.

[23వ పేజీలోని చిత్రం]

ఇతియోపియా చక్రవర్తియగు హేలి సెలెసీతో జార్జి బ్రూమ్‌లే

[25వ పేజీలోని చిత్రం]

జార్జి బ్రూమ్‌లే ఆయన భార్య, లూసెల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి