“పదియవ భాగమంతయు . . . మందిరపు నిధిలోనికి తీసికొనిరండి”
“దీనిచేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పెదను.”—మలాకీ 3:10.
1. (ఎ) సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో, యెహోవా తన ప్రజలకు ఏ ఆహ్వానమిచ్చాడు? (బి) సా.శ. మొదటి శతాబ్దంలో, తీర్పు కొరకు యెహోవా ఆలయానికి రావడంతో దాని ఫలితమేమై యుండెను?
సా.శ.పూ. ఐదవ శతాబ్దములో, ఇశ్రాయేలీయులు యెహోవా యెడల అపనమ్మకముగా ఉండిరి. వారు తమ దశమభాగాలను చెల్లించక, అర్పణకు పనికిరాని జంతువులను తెచ్చిరి. అయినప్పటికిని, వారు పదియవ భాగమంతయు మందిరపు నిధిలోనికి తీసికొనివచ్చినట్లయితే, పట్టజాలనంత విస్తారంగా తన దీవెనలు కుమ్మరిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (మలాకీ 3:8-10) దాదాపు 500 సంవత్సరాల తర్వాత, తన నిబంధన దూతగా యేసు ప్రాతినిధ్యం వహించగా యెహోవా తీర్పుతీర్చుటకు యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. (మలాకీ 3:1) ఇశ్రాయేలీయులు ఒక జనాంగముగా ఆయన దృష్టిలో తప్పిపోయారు, అయితే యెహోవా వైపు తిరిగిన ఆయావ్యక్తులు కొందరు బహుగా ఆశీర్వదింపబడ్డారు. (మలాకీ 3:7) వారు యెహోవా ఆత్మీయ కుమారులుగా, ఒక నూతన సృష్టిగా, “దేవుని ఇశ్రాయేలుగా” తయారగుటకు అభిషేకించబడ్డారు.—గలతీయులు 6:16; రోమీయులు 3:25, 26.
2. మలాకీ 3:1-10 రెండవసారి ఎప్పుడు నెరవేరనై యుండెను, దీనికి సంబంధించి మనమేమి చేయుటకు ఆహ్వానింపబడ్డాము?
2 దీని తర్వాత దాదాపు 1,900 సంవత్సరాలకు, అనగా 1914లో దేవుని పరలోక రాజ్యానికి రాజుగా యేసు సింహాసనాసీనుడయ్యాడు, కాగా మలాకీ 3:1-10లోని దైవప్రేరేపిత మాటలు రెండవసారి నెరవేరు సమయం ఆసన్నమయ్యింది. ఈ ఉత్కంఠభరితమగు సంఘటన సంబంధంగా, క్రైస్తవులు ఈనాడు పదియవ భాగమంతయు మందిరపు నిధిలోనికి తీసికొనివచ్చుటకు ఆహ్వానింపబడుతున్నారు. మనమలా చేసినట్లయిన, మనం కూడ పట్టజాలనంత విస్తారంగా దీవెనలు అనుభవిస్తాము.
3. యెహోవాకు మార్గము సిద్ధపరచిన దూత (ఎ) మొదటి శతాబ్దములో ఎవరు? (బి) మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఎవరు?
3 ఆయన ఆలయానికి రావడాన్ని గూర్చి, యెహోవా యిలా చెప్పాడు: “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.” (మలాకీ 3:1) దీని మొదటి శతాబ్దపు నెరవేర్పుగా, బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ఇశ్రాయేలీయులకు పాపములను గూర్చిన పశ్చాత్తాపమును ప్రకటించాడు. (మార్కు 1:2, 3) ఆలయానికి యెహోవా రెండవసారి రావడానికి సంబంధించి ఏమైనా సిద్ధపరచు పని ఉండెనా? అవును. మొదటి ప్రపంచయుద్ధానికి ముందున్న దశాబ్దములలో, ప్రపంచములో బైబిలు విద్యార్థులు బయలుదేరి, త్రిత్వము, నరకాగ్నివంటి దేవుని అవమానపరచు అబద్ధ సిద్ధాంతాలను బహిర్గతం చేస్తూ, స్వచ్ఛమైన బైబిలు సత్యాలను బోధింప నారంభించారు. ఆలాగే 1914లో ముగియనున్న అన్యరాజుల కాలములను గూర్చి కూడ వారు హెచ్చరించారు. అనేకమంది సత్యంయొక్క ఈ వెలుగు ప్రకాశకులకు ప్రతిస్పందించారు.—కీర్తన 43:3; మత్తయి 5:14, 16.
4. ప్రభువు దినమందు ఏ సమస్య పరిష్కరింపబడవలసి యుండెను?
4 బైబిలు పిలిచిన “ప్రభువు దినము” 1914వ సంవత్సరములో ఆరంభమయింది. (ప్రకటన 1:10) “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” గుర్తింపబడి, “[యజమానుని NW] యావదాస్తిపై” నియమించబడుటతో సహా, ఆ దినమందు మహత్వపూర్ణ సంఘటనలు జరుగనైయుండెను. (మత్తయి 24:45-47) ఆ 1914లో వేలాది చర్చీలు తమదే క్రైస్తవత్వమని చెప్పుకొన్నవి. వీటిలో ఏ గుంపును యజమానుడైన యేసుక్రీస్తు తన నమ్మకమైన, బుద్ధిమంతుడైన దాసునిగా గుర్తిస్తాడు? యెహోవా ఆలయానికి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించబడనై యుండెను.
ఆత్మీయాలయానికి వచ్చుట
5, 6. (ఎ) తీర్పు తీర్చుటకు యెహోవా ఏ ఆలయానికి వచ్చాడు? (బి) యెహోవా నుండి క్రైస్తవమత సామ్రాజ్యం ఏ తీర్పు పొందింది?
5 అయితే ఆయన ఏ ఆలయానికి వచ్చాడు? యెరూషలేములోవున్న అక్షరార్థ ఆలయమునకు రాలేదనుట స్పష్టం. అట్టి ఆలయాలలో చివరిది సా.శ. 70వ సంవత్సరంలో నాశనము చేయబడింది. అయితే, యెరూషలేములోనున్న ఆలయానికి సాదృశ్యముగా యెహోవా మరో గొప్ప ఆలయాన్ని కలిగియున్నాడు. ఈ గొప్ప ఆలయాన్ని గూర్చి మాట్లాడి, దాని పరిశుద్ధ స్థలము పరలోకమని, ప్రాంగణము భూమియని చెప్తూ, పౌలు అదెంత దివ్యమైనదిగా ఉండెనో చూపించాడు. (హెబ్రీయులు 9:11, 12, 24; 10:19, 20) తీర్పుతీర్చే పనికి యెహోవా ఈ గొప్ప ఆత్మీయాలయానికి వచ్చాడు.—ప్రకటన 11:1; 15:8 పోల్చుము.
6 ఇదెప్పుడు జరిగింది? అందుబాటులోనున్న వాస్తవాల రుజువు ప్రకారం, అది 1918లో జరిగింది.a దాని ఫలితమేమి? క్రైస్తవమత సామ్రాజ్యం విషయంలో యెహోవా రక్తంతో నిండిన హస్తాలుగల సంస్థను, ఈ లోకంతో వ్యభిచరిస్తూ, సంపన్నులతో చేతులుకలిపి బీదవారిని అణగద్రొక్కుచూ, స్వచ్ఛారాధనకు బదులు అన్య సిద్ధాంతాలను బోధిస్తున్న అవినీతికరమైన మత విధానాన్ని చూశాడు. (యాకోబు 1:27; 4:4) యెహోవా మలాకీ ద్వారా యిలా హెచ్చరించాడు: “తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేని వారిని బాధపెట్టు . . . వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదును.” (మలాకీ 3:5) క్రైస్తవమత సామ్రాజ్యం దీనినంతటిని, దీనికంటే నీచమైన దానిని జరిగించింది. పందొమ్మిది వందల పందొమ్మిది నాటికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న మిగతా మహాబబులోనుతో కలిపి దానిని యెహోవా నాశనమునకు తీర్మానించాడని స్పష్టమయ్యింది. అప్పటినుండి యథార్థ హృదయులందరికి ఈ ఆహ్వానమివ్వబడింది: “నా ప్రజలారా . . . దానిని విడిచిరండి.”—ప్రకటన 18:1, 4.
7. యేసు ఎవరిని తన నమ్మకమైన బుద్ధిమంతుడగు దాసుడని గుర్తించాడు?
7 మరి నమ్మకమును బుద్ధిమంతుడైన ఈ దాసుడు ఎవరు? మొదటి శతాబ్దములో, బాప్తిస్మమిచ్చు యోహాను, నిబంధన దూతయగు యేసు చేసిన సాక్ష్యపు పనికి ప్రతిస్పందించిన ఒక చిన్న గుంపుతో అది ఆరంభమయినది. మన శతాబ్దములో 1914కు ముందున్న సంవత్సరాలలో బైబిలు విద్యార్థుల సిద్ధపాటు సేవకు ప్రతిస్పందించిన వారు కొద్దివేలమందియే. వీరు మొదటి ప్రపంచ యుద్ధకాలములో ఎన్నో కష్టాలు అనుభవించారు, అయినను వారు తమ హృదయము యెహోవా వైపు ఉన్నట్లు ప్రదర్శించారు.
శుభ్రము చేయు పని
8, 9. నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు 1918లో ఏ విధములుగా శుభ్రము చేయబడవలసి యుండెను, ఈ విషయమై యెహోవా ఏ వాగ్దానం చేశాడు?
8 అయితే ఈ గుంపు కూడ శుభ్రము చేయబడవలసి యుండెను. వారితోకూడ సహవసించిన కొందరు విశ్వాసమునకు విరోధులు కాగా వారిని వదిలించుకోవలసి యుండెను. (ఫిలిప్పీయులు 3:18) మరి కొందరు యెహోవాను సేవించుటలో యిమిడియున్న బాధ్యతలు చేపట్టుటకు అయిష్టపడి నెమ్మదిగా కొట్టుకొనిపోయిరి. (హెబ్రీయులు 2:1) అంతేకాకుండ, తొలగించవలసి యుండిన బబులోను సంబంధమైన అభ్యాసములు ఇంకను నిలిచియుండెను. సంస్థాపరంగా కూడ నమ్మకమైన బుద్ధిమంతుడగు దాసుడు శుభ్రపరచబడవలసి యుండెను. ఈ లోకం విషయంలో సరియైన తటస్థతను నేర్చుకొని దానిని అనువర్తింపజేయవలసి యుండెను. ఆలాగే లోకం మరింత అవినీతిమయమగుచుండగా, సంఘములలో వారు నైతిక మరియు ఆత్మీయ అపరిశుభ్రత విషయంలో తీవ్రముగా పోరాడవలసి యుండిరి.—యూదా 3, 4 పోల్చండి.
9 అవును, శుభ్రంచేయబడుట అవసరమై యుండెను, అయితే సింహాసనాసీనుడైన యేసును గూర్చి యెహోవా ప్రేమపూర్వకంగా యిలా వాగ్దానం చేశాడు: “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.” (మలాకీ 3:3) తన నిబంధన దూతద్వారా యెహోవా 1918 ఆరంభకాలములో, తన వాగ్దానాన్ని నెరవేర్చి తన ప్రజలను పరిశుభ్రంచేశాడు.
10. దేవుని ప్రజలు ఎలాంటి అర్పణ తెచ్చారు, మరియు యెహోవా వారికి ఎలాంటి ఆహ్వానమిచ్చాడు?
10 వెండిని శుద్ధిచేసి నిర్మలముచేయు వానిగా యెహోవా పనిచేయుట మూలంగా క్రీస్తు అభిషక్త సహోదరులు, ఆలాగే యెహోవా సేవలో వారితో చేరిన గొప్పసమూహపు వారు ప్రయోజనం పొందారు. (ప్రకటన 7:9, 14, 15) నీతి ననుసరించి అర్పణల నర్పించుటలో వారు ఒక సంస్థగా వచ్చారు, ఇంకను వస్తున్నారు. మరియు వారి అర్పణ “మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యెహోవాకు ఇంపుగా” ఉన్నది. (మలాకీ 3:4) ప్రవచనార్థకముగా యిలా యెహోవా ఆహ్వానించిన వారు వీరే: “నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీనిచేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—మలాకీ 3:10.
అర్పణలు, దశమభాగాలు
11. మోషే ధర్మశాస్త్ర ప్రకారమైన అర్పణలు యిక ఎందుకు అవసరము లేదు?
11 మలాకీ దినములలో దేవుని ప్రజలు అక్షరార్థముగా అర్పణలను, ధాన్యము, ఫలాలు, పశుపక్ష్యాదులలో దశమభాగాలు తెచ్చేవారు. యేసు కాలములో సహితము విశ్వాసులైన ఇశ్రాయేలీయులు దేవాలయములో అక్షరార్థమైన అర్పణలు చెల్లించారు. అయితే, యేసు మరణము వాటినన్నింటిని మార్చివేసింది. ప్రత్యేక అర్పణలు, దశమభాగాలను అర్పించవలెనను ఆజ్ఞతోసహా ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. (ఎఫెసీయులు 2:15) ధర్మశాస్త్రము క్రిందనున్న ప్రవచనార్థక అర్పణలను యేసు నెరవేర్చాడు. (ఎఫెసీయులు 5:2; హెబ్రీయులు 10:1, 2, 10) కాబట్టి, క్రైస్తవులు ఏ విధంగా తమ అర్పణలు, దశమభాగాలు తేగలరు?
12. ఎటువంటి ఆత్మీయ అర్పణలు, బలులు క్రైస్తవులు అర్పిస్తారు?
12 వారి అర్పణలు ప్రముఖంగా ఆత్మీయమైనవి. (ఫిలిప్పీయులు 2:17; 2 తిమోతి 4:6 పోల్చుము.) ఉదాహరణకు, ప్రకటించు పని ఒక అర్పణయని మాట్లాడుచూ పౌలు యిలా అన్నాడు: “ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలము అర్పించుదము.” ఆయన మరొక విధమైన ఆత్మీయ అర్పణనుగూర్చి సూచిస్తూ యిలా పురికొల్పాడు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టియాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:15, 16) తలిదండ్రులు తమ పిల్లలను పయినీరు సేవలో ప్రవేశించుడని ప్రోత్సహించునప్పుడు, తనకు విజయాన్నిచ్చిన దేవునికి “దహన బలిగా” తన కుమార్తెను అర్పించిన యెఫ్తావలెనే, వారు తమ పిల్లలను యెహోవాకు అర్పిస్తున్నారని చెప్పవచ్చును.—న్యాయాధిపతులు 11:30, 31, 39.
13. క్రైస్తవులెందుకు తమ రాబడిలో అక్షరార్థముగా దశమభాగము ఇవ్వనవసరము లేదు?
13 మరి, దశమభాగాల విషయమేమి? తమ రాబడిలో పదియవభాగము ప్రక్కకుతీసి, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలో కొన్నింటిలో చేసినట్లు వాటిని యెహోవా సంస్థకు యివ్వవలెనా? లేదు, అలాచేయనక్కర లేదు. క్రైస్తవులకు అటువంటి నియమమున్నదని ఏ లేఖనము చెప్పుటలేదు. యూదయలో అవసరంలోనున్న వారికొరకు పౌలు చందాలు వసూలు చేసేటప్పుడు, ఆయన ఇంత శాతం యివ్వాలని ప్రస్తావించలేదు. బదులుగా ఆయనిట్లన్నాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:7) ప్రత్యేక పరిచర్యయందున్న వారినిగూర్చి మాట్లాడుచు, కొంతమంది స్వచ్ఛందముగా చందాలనిచ్చి సరియైన రీతిలో మద్దతునిచ్చినందున, తాను సేవచేయడానికి, తనను పోషించుకోవడానికి సిద్ధపడ్డానని పౌలు చూపించాడు. (అపొ. కార్యములు 18:3, 4; 1 కొరింథీయులు 9:13-15) దీనికొరకు ఎలాంటి దశమభాగాలు నియమించబడలేదు.
14. (ఎ) దశమ భాగమంటే యెహోవాకు మనమిచ్చే సమస్తమును ఎందుకు సూచించదు? (బి) దశమ భాగము దేనిని సూచిస్తున్నది?
14 స్పష్టముగా క్రైస్తవులకు పదియవభాగము మరిదేనినో సూచిస్తుంది లేక, ప్రాతినిధ్యం వహిస్తుంది. పది అనేది బైబిలునందు తరచు భూసంబంధమైన సంపూర్ణతకు సూచనయై యున్నది గనుక, ఆ పదియవ భాగము మన సమస్తమును యెహోవాకు యివ్వడాన్ని సూచిస్తున్నదా? లేదు. మనము యెహోవాకు సమర్పించుకొని దానిని నీటి బాప్తిస్మము ద్వారా ప్రత్యక్షపరచినప్పుడు, మనము ఆయనకు సమస్తమును ఇచ్చినట్లవుతుంది. మనం సమర్పించుకున్న ఆ కాలంనుండి, మనదగ్గర యెహోవాకు చెందనిది ఏమియు లేదు. అయితే, ఆయావ్యక్తులు తమకున్న వనరులను అర్పించుటకు ఆయన అనుమతిస్తున్నాడు. కాబట్టి పదియవ భాగము మనకు కలిగిన దానిలో మనము యెహోవాకు అర్పించేది లేదా యెహోవా సేవలో ఉపయోగించేది ఆయన యెడల మనకున్న ప్రేమకొక చిహ్నము మరియు మనమాయనకు చెందిన వారనే దానికి గుర్తింపునై యున్నది. ఆధునిక దిన దశమభాగము కేవలము పదియవ భాగమైయుండ నవసరము లేదు. కొందరి విషయంలో అది తక్కువగా ఉంటుంది. మరికొందరి విషయంలో అది ఎక్కువగా ఉంటుంది. ప్రతివ్యక్తి తన హృదయ స్పందననుబట్టి, అతని పరిస్థితులు అనుమతించుటనుబట్టి తీసుకొనివస్తాడు.
15, 16. మన ఆత్మీయ దశమ భాగమందు ఏమి యిమిడియున్నది?
15 ఈ ఆత్మీయ దశమభాగమందు ఏమి యిమిడియున్నది? ఒకసంగతేమంటే, యెహోవాకు మనము మన సమయాన్ని, శక్తిని యిస్తాము. కూటములకు, సభలు సమావేశాలకు, ప్రాంతీయ సేవలో యిలా మనం గడిపే సమయం యావత్తు మన దశమభాగంలో వంతుగా యెహోవాకు అర్పించునదే. ఆలాగే రోగులను సందర్శించుటలో, ఇతరులకు సహాయపడుటలో మనం వెచ్చించే సమయం ధారపోసే శక్తి కూడ మన దశమభాగంలో ఒక వంతే. రాజ్యమందిరాల నిర్మాణపు పనిలో సహాయపడుట, ఆ మందిరాన్ని కాపాడుట, శుభ్రం చేయుటలో భాగం వహించుటకూడా అందు భాగమే.
16 మన దశమభాగంలో డబ్బును చందాగా వేయుటకూడ యిమిడియున్నది. ఇటీవల సంవత్సరాలలో యెహోవా సంస్థ అసాధారణ రీతిలో అభివృద్ధిచెందుటతో, ఆర్థిక బాధ్యతలును పెరిగిపోయినవి. ఇప్పటికే నిర్మించబడియున్న వాటిని బాగుచేయడంతో పాటు క్రొత్త రాజ్యమందిరాలు కావాలి, క్రొత్త బ్రాంచి కార్యాలయాలతోపాటు, క్రొత్త సమావేశ మందిరాలు కావాలి. ప్రత్యేక సేవకొరకు స్వచ్ఛందముగా ముందుకు వచ్చిన—తరచు వారెంతో త్యాగంచేసి వస్తారు—వారికయ్యే ఖర్చులు భరించడం కూడ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. కేవలం మిషనరీలకు, ప్రయాణకాపరులకు, ప్రత్యేక పయినీర్లకు 1991లో దాదాపు 4 కోట్ల డాలర్లకు పైగా ఖర్చుచేయడం జరిగింది, ఇదంతా స్వచ్ఛంద విరాళముల ద్వారానే సమకూర్చబడింది.
17. మన ఆత్మీయ దశమ భాగముగా మనమేమి ఇవ్వవలెను?
17 కాబట్టి మన ఆత్మీయ దశమభాగంగా మనమేమి ఇవ్వవలెను? యెహోవా ఇంత శాతమని చెప్పుటలేదు. అయినప్పటికిని, సమర్పణా భావం, యెహోవా యెడల, సహోదరుల యెడల నిజమైన ప్రేమ, ఆలాగే రక్షింపబడాల్సిన వారున్నారనే విషయాన్ని గ్రహించిన అత్యవసర భావం సంపూర్ణంగా మన ఆత్మీయ దశమభాగాల్ని తీసుకురావడానికి మనలను ప్రోత్సహించాలి. మనకు సాధ్యమైనంత ఎక్కువగా యెహోవాను సేవించాలనే ప్రోద్భలం మనకున్నది. మనలను లేదా మనకున్న వనరులను ఉపయోగించే విషయంలో లోభత్వాన్ని కనబరిస్తే లేదా సణుగుచు ఇస్తే, ఇది దేవున్నే దోచుకొనుటతో సమానము కాగలదు.—లూకా 21:1-4 పోల్చండి.
పట్టజాలనంత విస్తారమైన దీవెనలు
18, 19. తమ పదియవ భాగమంతయు తెచ్చినందుకు యెహోవా ప్రజలెట్లు ఆశీర్వదించబడుచున్నారు?
18 ప్రకటించే పని అవసరతల నిమిత్తం 1991 నుండి యెహోవా ప్రజలు తమ సమయాన్ని, శక్తిని, ఆర్థిక వనరులను ఇవ్వడంలో ఎంతో ఔదార్యంగా ప్రతిస్పందించారు. వారు నిజంగా తమ పదియవ భాగమంతా మందిరపు ధననిధిలోనికి తెచ్చారు. దాని ఫలితంగా, యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించాడు. వారి సంఖ్యాపరమైన అభివృద్ధియందు దీనిని బహు నాటకీయముగా చూడవచ్చును. యెహోవా 1918లో తన ఆత్మీయాలయానికి వచ్చినప్పుడు ఆయనను సేవిస్తున్న అభిషక్తులు కొన్నివేల సంఖ్య నుండి, నేడు వేరే గొర్రెలైన తమ సహవాసులతో కలిసి 211 దేశాల్లో మొత్తం 40 లక్షలకుపైగా పెరిగిపోయారు. (యెషయా 60:22) ఎడతెగక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో కూడ వారు ఆశీర్వదించబడ్డారు. ప్రవచన వాక్యం వారికి మరింత నిశ్చయపరచ బడింది. యెహోవా సంకల్పాల నెరవేర్పులో వారి నమ్మకం దృఢపడింది. (2 పేతురు 1:19) వారు నిజంగా “యెహోవాచే ఉపదేశము” నొందిన ప్రజలై యున్నారు.—యెషయా 54:13.
19 యెహోవా మలాకీ ద్వారా, ఒక భవిష్యత్ ఆశీర్వాదమును గూర్చి ప్రవచించాడు: “అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” (మలాకీ 3:16) క్రైస్తవులమని చెప్పుకునే సంస్థలన్నింటిలో, కేవలం యెహోవాసాక్షులు మాత్రమే ఆయన నామమును తలపోస్తూ, జనాంగముల మధ్య దానిని మహిమపరుస్తున్నారు. (కీర్తన 34:3) వారి విశ్వాస్యతను యెహోవా జ్ఞాపకం చేసుకొనుననే అభయమున్నందుకు వారెంతగా సంతోషిస్తున్నారు!
20, 21. (ఎ) ఎలాంటి దీవెనకరమగు సంబంధాన్ని క్రైస్తవులు అనుభవిస్తున్నారు? (బి) క్రైస్తవత్వానికి సంబంధించి అంతకంతకు ఏది స్పష్టమగుచున్నది?
20 అభిషక్తులు యెహోవాకు ప్రత్యేకమైన సంపాద్యముగా ఉన్నారు, మరియు వారితో సహవసించుటకు మందగా వస్తున్న గొప్ప సమూహపు వారు వారితోకూడ స్వచ్ఛారాధన యొక్క ఆశీర్వాదములను అనుభవిస్తున్నారు. (జెకర్యా 8:23) మలాకీ ద్వారా యెహోవా యిలా వాగ్దానం చేస్తున్నాడు: “నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:17) వారి యెడల యెహోవా అటువంటి ఆప్యాయతా శ్రద్ధను కలిగియుండుట ఎంత దీవెనకరము!
21 వాస్తవానికి, నిజమైన క్రైస్తవుల మధ్య అబద్ధ క్రైస్తవుల మధ్య భేదము అంతకంతకు తేటగా కనబడుతున్నది. యెహోవా ప్రజలు ఆయన కట్టడల ననుసరించుటకు కృషిచేయు చుండగా, క్రైస్తవమత సామ్రాజ్యం లోక అనైతికతా మాలిన్యంలో అంతకంతకు కూరుకుపోతున్నది. నిజంగా, యెహోవా మాటలు సత్యమని నిరూపించబడినవి: “అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.”—మలాకీ 3:18.
22. మనము ఎడతెగక పదియవ భాగమంతయు తీసుకువస్తున్నట్లయితే ఏ ఆశీర్వాదములను అనుభవించగలమనే నమ్మికను మనము కలిగియుండగలము?
22 అబద్ధ క్రైస్తవుల మీదికి తీర్పుదినము త్వరలోనే వచ్చును: “ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 4:1) తన ఆత్మీయ జనాంగమును సా.శ. 70లో కాపాడినట్లే ఆ సమయంలో తమనూ ఆయన కాపాడునని యెహోవా ప్రజలకు తెలుసు. (మలాకీ 4:2) అట్టి అభయాన్ని కలిగియుండుటకు వారెంతగా సంతోషిస్తున్నారు! కాబట్టి, ఆ సమయం వరకు మనలో ప్రతివారును మందిరపు నిధిలోనికి పదియవ భాగమంతయు తీసుకువస్తూ యెహోవా కొరకైన మన మెప్పును, ప్రేమను చూపుదము గాక. ఆ పిదప మనం, ఆయన ఎడతెగక పట్టజాలనంత విస్తారంగా దీవించుననే దృఢనమ్మకాన్ని కలిగియుండగలము.
[అధస్సూచీలు]
a మరింత సమాచారం కొరకు, వాచ్‌టవర్ జూన్ 15, 1987 సంచిక పుటలు 14-20 చూడండి.
మీరు వివరించగలరా?
◻ ఆధునిక కాలాల్లో, తన నిబంధన దూతతో యెహోవా ఎప్పుడు ఆలయానికి వచ్చాడు?
◻ నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరు, మరియు 1918 తర్వాత వారికి ఎటువంటి శుభ్రత అవసరమై యుండెను?
◻ నిజమైన క్రైస్తవులు యెహోవాకు ఎలాంటి ఆత్మీయ అర్పణలు తెస్తారు?
◻ మందిరపు నిధిలోనికి తీసుకు రావలెనని క్రైస్తవులు ఆహ్వానింపబడిన పదియవ భాగము ఏమిటి?
◻ ఆత్మీయ దశమభాగాలను అర్పించుట ద్వారా దేవుని ప్రజలు ఎలాంటి ఆశీర్వాదములు అనుభవిస్తున్నారు?
[15వ పేజీలోని చిత్రం]
మన ఆత్మీయ దశమ భాగాలలో రాజ్యమందిరాలను నిర్మించుటకు మన శక్తిని, వనరులను అర్పించుట యిమిడియున్నది
[16వ పేజీలోని చిత్రం]
తన ప్రజలపై యెహోవా ఆశీర్వాదమున్నందున, రాజ్యమందిరాలు, సమావేశ మందిరాలతో సహా ఎంతో నిర్మాణపు పని అవసరం