కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/1 పేజీలు 7-12
  • యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అత్యంత ప్రాముఖ్యమైన సౌభాగ్యం
  • ఈనాటి ఆత్మీయ ఐశ్వర్యం
  • దశమ భాగాలు మరియు అర్పణలు
  • “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి”
  • యెహోవాను దోచుకొనుట
  • ‘నిజమైన ప్రభువుచేత’ తీర్పుతీర్చబడుట
  • “పదియవ భాగమంతయు . . . మందిరపు నిధిలోనికి తీసికొనిరండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘పట్టజాలనంత విస్తారమైన దీవెనలు’
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • మలాకీ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవా దినమును ఎవరు తప్పించుకొంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/1 పేజీలు 7-12

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.”—సామెతలు 10:22.

1-3. అనేకులు వస్తువుల విషయాలలో శ్రద్ధ కలిగియున్నను, సంపదను గూర్చిన ఏ వాస్తవాన్ని ప్రతివారు గుర్తించాలి?

డబ్బును గూర్చి లేదా తమకది లేకపోవుటను గూర్చి కొంతమంది మాట్లాడకుండా ఉండరు. విచారకరమైన విషయమేమంటే, ఇటీవలి సంవత్సరాలలో వారలా చర్చించడానికి అనేక సంఘటనలు జరిగాయి. సుసంపన్న పాశ్చాత్య దేశాల్లో సహితం 1992లో వ్యాపార మాంద్యం కనబడింది. అధికారులతోసహా సాధారణ ప్రజానీకం కూడ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తాము మరలా సుభిక్షమైన కాలాన్ని చూడగలమా అని అనేకులు ఆశ్చర్యపడ్డారు.

2 వస్తు ఐశ్వర్యాన్ని కలిగివుండడాన్ని గూర్చి మనం చింతించడం తప్పా? లేదు, ఎందుకంటే వస్తు సంపద కల్గివుండుట కొంతమేరకు సహజమే. అయితే అదే సమయంలో, ఐశ్వర్యాన్ని గూర్చి మనం గుర్తించాల్సిన మూల సత్యమొకటున్నది. సమస్త వస్తు సంపత్తి సృష్టికర్త నుండి కలిగినదే. ఆయనే, “భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా.”—యెషయా 42:5.

3 ఎవరు ధనవంతులుగా ఉండాలి, ఎవరు దరిద్రులుగా ఉండాలని యెహోవా ముందే నిర్ణయించక పోయినను “భూమిని అందులో పుట్టిన సమస్తములో” మనము కలిగియున్న భాగమును మనం ఏవిధంగా ఉపయోగించినను దానికొరకు మనందరము జవాబుదారులమై యున్నాము. ఇతరులపై అధికారము చేయుటకు మన ఐశ్వర్యమును మనం ఉపయోగించినట్లయిన, యెహోవా అందుకు మనలను జవాబుదారులను చేయును. యెహోవాకు కాకుండ ఎవరైనా ధనానికి దాసులైనట్లయితే, అలా “ధనము నమ్ముకొనువాడు పాడైపోవును.” (సామెతలు 11:28; మత్తయి 6:24; 1 తిమోతి 6:9) వస్తు సంపత్తికి తోడుగా యెహోవాకు లోబడే హృదయము లేకపోతే చివరకది నిరర్థకమగును.—ప్రసంగి 2:3-11, 18, 19; లూకా 16:9.

అత్యంత ప్రాముఖ్యమైన సౌభాగ్యం

4. వస్తు సమృద్ధికంటె ఆత్మీయ సౌభాగ్యము ఎందుకు శ్రేష్ఠము?

4 వస్తు సౌభాగ్యానికి తోడుగా, బైబిలు ఆత్మీయ సౌభాగ్యాన్ని గూర్చి మాట్లాడుతుంది. ఇది స్పష్టముగా శ్రేష్ఠమైన సౌభాగ్యమే. (మత్తయి 6:19-21) ఆత్మీయ సౌభాగ్యము యెహోవాతో సంతృప్తికరమైన సంబంధాన్ని మన స్వంతం చేస్తుంది, మరియు అది చిరకాలముంటుంది. (ప్రసంగి 7:12) అంతేకాకుండ, ఆత్మీయముగా సంపన్నులైన దేవుని సేవకులు యుక్తరీతిగా ఉన్న వస్తుసంపదను పోగొట్టుకొనరు. నూతన లోకంలో, ఆత్మీయ ఐశ్వర్యము, వస్తు సౌభాగ్యముతో ముడిపెట్టబడును. విశ్వాసులైన వారు వస్తు భద్రత ననుభవిస్తారు, అది నేడున్నట్లు విపరీతమైన పోటీ ద్వారా లేదా ఆరోగ్యం, సంతోషం పాడుచేసుకొని సంపాదించేది కాదు. (కీర్తన 72:16; సామెతలు 10:28; యెషయా 25:6-8) ప్రతి విధముగా వారు ‘యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదని’ తెలుసుకొందురు.—సామెతలు 10:22.

5. వస్తుదాయక విషయాలను గూర్చి యేసు ఏ వాగ్దానం చేశాడు?

5 నేడును ఆత్మీయ సంగతులకు విలువ నిచ్చువారు వస్తు సంబంధమైన విషయాల్లో కొంతమేరకు నెమ్మదిని అనుభవిస్తున్నారు. నిజమే, వారును ఖర్చుల నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం పనిచేస్తారు. లేదా వ్యాపార మాంద్య మేర్పడినప్పుడు వారిలో కొందరు తమ ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు. అయితే అలాంటి విషయాల ద్వారా వారు అమితంగా కలవరపడరు. బదులుగా వారు, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి . . . ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని యేసు చేసిన వాగ్దానమును విశ్వసిస్తారు.—మత్తయి 6:31-33.

ఈనాటి ఆత్మీయ ఐశ్వర్యం

6, 7. (ఎ) దేవుని ప్రజల ఆత్మీయ సంపదలోని కొన్ని విషయాలను వివరించండి. (బి) ఈనాడు ఏ ప్రవచనము నెరవేరుతున్నది, ఇది ఏ ప్రశ్నలు లేవదీయును?

6 కాబట్టి, యెహోవా ప్రజలు తమ జీవితములలో రాజ్యమును మొదట ఉంచుటకు ఎంచుకున్నారు, గనుక వారెంతగా ఆశీర్వదించబడ్డారు! శిష్యులను తయారుచేసే పనిలో వారెంతో విజయం సాధిస్తున్నారు. (యెషయా 60:22) యెహోవాచే ఉపదేశింపబడుచున్నారు, వారు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా నిర్విరామముగా మంచి ఆత్మీయ సంగతుల ననుభవిస్తున్నారు. (మత్తయి 24:45-47; యెషయా 54:13) అంతేకాదు, యెహోవా ఆత్మ వారిపై ఉండి, వారిని ఆనందదాయకమైన అంతర్జాతీయ సహోదరత్వము లోనికి తెస్తుంది.—కీర్తన 133:1; మార్కు 10:29, 30.

7 ఇది నిజముగా డబ్బు చెల్లించి కొనలేనంతటి ఆత్మీయ సౌభాగ్యమై యున్నది. ఇది యెహోవా వాగ్దానముల కచ్చితమైన నెరవేర్పైయున్నది: “నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:10) ఈ ప్రవచనం నెరవేరడాన్ని ఈనాడు మనం చూశాము. అయితే, సమస్త సంపదకు మూలమైన యెహోవా ఎందుకు తన సేవకులను పదియవ వంతు లేదా దశమ భాగము తెమ్మన్నాడు? ఆ దశమభాగం నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు? ఈ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు, సా.శ.పూ. ఐదవ శతాబ్దములో యెహోవా మలాకీ ద్వారా ఈ మాటలు ఎందుకు పలికాడో పరిశీలించండి.

దశమ భాగాలు మరియు అర్పణలు

8. ధర్మశాస్త్రము ప్రకారం, ఇశ్రాయేలీయుల ఆర్థిక సౌభాగ్యం దేనిపై ఆధారపడియుండును?

8 మలాకీ కాలంలో దేవుని ప్రజలు వర్థిల్లలేదు. ఎందుకు? పాక్షికంగా అది అర్పణలు, దశమ భాగాలకు సంబంధించినదై యుండెను. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. యెహోవా ఆ ధర్మశాస్త్రము నిచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులు దాన్ని పాటిస్తే, ఆయన వారిని ఆత్మీయముగాను, వస్తు రూపకముగాను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నిజానికి, ఇశ్రాయేలీయుల సౌభాగ్యము వారి విశ్వాస్యతపై ఆధారపడియుండెను.—ద్వితీయోపదేశకాండము 28:1-19.

9. ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలములో, ఇశ్రాయేలీయులు దశమభాగము మరియు అర్పణలు చెల్లించాలని యెహోవా ఎందుకు కోరాడు?

9 ధర్మశాస్త్రము క్రిందనున్న ఇశ్రాయేలీయులు ఆలయానికి అర్పణలు తీసుకొచ్చి, దశమ భాగాలు చెల్లించవలసిన బాధ్యత కలిగియుండిరి. కొన్ని అర్పణలు యెహోవా బలిపీఠం మీద పూర్తిగా దహింపబడవలసి యుండగా, మరికొన్నింటిని, వాటి ప్రత్యేక భాగాలను యెహోవాకు అర్పించిన తరువాత మిగిలిన దానిని యాజకులు, బలి అర్పించువారు పంచుకొనే వారు. (లేవీయకాండము 1:3-9; 7:1-15) దశమ భాగాల విషయాన్ని గూర్చి మోషే ఇశ్రాయేలీయులకు యిలా చెప్పాడు: “భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.” (లేవీయకాండము 27:30) ఆ దశమ భాగము మొదట గుడారములోను ఆ తర్వాత దేవాలయములోను లేవీయుల పనివారికి యివ్వబడేది. మరలా దాన్ని యాజకులు-కాని లేవీయులు తమకు లభించిన దానిలో దశమ భాగాన్ని అహరోను క్రమంలోని యాజకులకు యిచ్చెడివారు. (సంఖ్యాకాండము 18:21-29) ఇశ్రాయేలీయులు యిలా దశమ భాగాలు ఇవ్వాలని యెహోవా ఎందుకు కోరాడు? మొదటిది, యెహోవా మంచితనం యెడల స్పష్టముగా మెప్పును చూపగల్గేవారు. రెండవది, లేవీయులకు చేయూతనివ్వగల్గేవారు, కాగా వారు ధర్మశాస్త్రాన్ని బోధించుటతో సహా, తమకున్న బాధత్యలపై దృష్టి నిల్పగల్గేవారు. (2 దినవృత్తాంతములు 17:7-9) ఈ విధంగా, స్వచ్ఛారాధనకు మద్దతునిచ్చేవారు, మరియు ప్రతివారు ప్రయోజనం పొందేవారు.

10. ఇశ్రాయేలీయులు దశమభాగాలను, అర్పణలను చెల్లించుటలో విఫలమైనప్పుడు ఏమి సంభవించింది?

10 దశమ భాగాలు, అర్పణలు ఆ తర్వాత లేవీయులచే ఉపయోగింపబడిననూ, అవి నిజానికి యెహోవాకు అర్పించినవై యున్నాయి, కాబట్టి మంచి నాణ్యతగలవి, ఆయనకు తగినవై యుండాలి. (లేవీయకాండము 22:21-25) ఇశ్రాయేలీయులు తమ దశమ భాగాలు తెచ్చుటలో విఫలమైనప్పుడు లేదా క్షుద్రమైన అర్పణలు తెచ్చినప్పుడు ఏమి సంభవించింది? ధర్మశాస్త్రమందు ఏ శిక్షలు వివరింపబడలేదు, అయితే దానికి తగిన పరిణామాలు సంభవించేవి. యెహోవా తన ఆశీర్వాదమును ఆపుజేసినప్పుడు, లేవీయులకు వస్తుదాయక మద్దతు లభించనందున వారు తమను పోషించుకోవడానికి దేవాలయ విధులు నిర్వర్తించుట మానుకొనిరి. ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరు బాధనొందారు.

“మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి”

11, 12. (ఎ) ధర్మశాస్త్రం పాటించడంలో ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసినప్పుడు దాని ఫలితమేమై యుండెను? (బి) ఇశ్రాయేలీయులను బబులోను నుండి తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా వారికే ఆజ్ఞ యిచ్చాడు?

11 ఇశ్రాయేలీయుల చరిత్రయంతటిలో, కొంతమంది దశమభాగాలను చెల్లించుటతో సహా, ధర్మశాస్త్రమును పాటించుటలో మాదిరికరముగా ఉండిరి. (2 దినవృత్తాంతములు 31:2-16) మొత్తానికి అందరిని కలిపిచూస్తే, ఆ జనాంగము నిర్లక్ష్యముగా ఉండెను. చివరకు సా.శ.పూ. 607లో ఓడింపబడి బబులోనుకు చెరగా కొనిపోబడుటకు యెహోవా అనుమతించు పర్యంతము, ఆయనతో చేసుకున్న నిబంధనను వారు పదేపదే ఉల్లంఘించారు.—2 దినవృత్తాంతములు 36:15-21.

12 అది కఠినమైన శిక్షగా ఉండెను, అయితే 70 సంవత్సరముల తర్వాత యెహోవా తన ప్రజలను వారి స్వదేశమందు పునరుద్ధరించాడు. వారు తిరిగివచ్చిన తర్వాత యెషయాలో చెప్పబడిన పరదైసుకు సంబంధించిన అనేక ప్రవచనాలు వాటి తొలి నెరవేర్పును కలిగియుండెను. (యెషయా 35:1, 2; 52:1-9; 65:17-19) యెహోవా తన ప్రజలను ఒక భూపరదైసును కట్టడానికి కాదుగాని, దేవాలయాన్ని పునర్నిర్మించి సత్యారాధనను పునరుద్ధరించుటకే వెనుకకు తీసుకువచ్చాడు. (ఎజ్రా 1:2, 3) ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై వుంటే, వారికి వస్తుదాయక ప్రయోజనాలు కలిగివుండేవి, ఆలాగే యెహోవా ఆశీర్వాదము వారిని ఆత్మీయముగా, వస్తుదాయకముగా సంపన్నులను చేసివుండేది. ఆ ప్రకారమే, సా.శ.పూ. 537లో తమ స్వదేశానికి తిరిగి వచ్చినవెంటనే, యూదులు యెరూషలేములో ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవాలయపు పనిని ఆరంభించారు. కాని, తీవ్రమైన వ్యతిరేకత ఎదురవడంతో వారా పనిని ఆపుజేశారు. (ఎజ్రా 4:1-4, 23) తత్ఫలితంగా, ఇశ్రాయేలీయులు యెహోవా ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయారు.

13, 14. (ఎ) ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని నిర్మించడంలో విఫలమైనప్పుడు ఏమి సంభవించింది? (బి) చివరకు దేవాలయము ఎలా నిర్మించబడింది, అయితే ఆ తర్వాత ఇశ్రాయేలీయులు తప్పిపోవడం ఎలా నివేదించబడింది?

13 దేవాలయ నిర్మాణానికి రావల్సిందిగా ఇశ్రాయేలీయులను పురికొల్పుటకై యెహోవా సా.శ.పూ. 520వ సంవత్సరంలో హగ్గయి, జెకర్యా ప్రవక్తలను నియమించాడు. జనాంగము ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నదని, దీనికి యెహోవా ఆలయము యెడల వారికి ఆసక్తి లేకపోవడమే కారణమని హగ్గయి చూపించాడు. ఆయనిట్లన్నాడు: “సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—మీ ప్రవక్తనుగూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—హగ్గయి 1:5-8.

14 హగ్గయి, జెకర్యా యిచ్చిన ప్రోత్సాహం కారణంగా, ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తనను మార్చుకొనడంతో దేవాలయ నిర్మాణం పూర్తయింది. అయితే ఆ తర్వాత 60 సంవత్సరాలకు, నెహెమ్యా యెరూషలేమును సందర్శించినప్పుడు, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా ధర్మశాస్త్రము విషయమై నిర్లక్ష్యముగా ఉండుటను గమనించి ఆయన దానిని సవరించాడు. అయితే ఆయన మరలా రెండవసారి వచ్చినప్పుడు, పరిస్థితులు మరలా దిగజారిపోయి ఉండడాన్ని చూశాడు. ఆయన పరిస్థితినిలా నివేదిస్తున్నాడు: “లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరి.” (నెహెమ్యా 13:10) ఈ సమస్య పరిష్కరింపబడగా, “యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.”—నెహెమ్యా 13:12.

యెహోవాను దోచుకొనుట

15, 16. ఏ తప్పిదముల విషయమై యెహోవా మలాకీ ద్వారా ఇశ్రాయేలీయులను గద్దించాడు?

15 మలాకీ ప్రవచించుట బహుశ ఈ కాలములోనే జరిగియుండవచ్చు, ఈ ప్రవక్త ఇశ్రాయేలీయుల విశ్వాసరాహిత్యమును గూర్చి మనకు మరింత ఎక్కువగా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన మాటలను ఆయనిలా వ్రాశాడు: “నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యములకధిపతియగు యెహోవా మిమ్మునడుగుచున్నాడు.” ఏమిటా తప్పిదము? యెహోవా యిలా వివరిస్తున్నాడు: “గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషము కాదా?”—మలాకీ 1:6-8.

16 ఇశ్రాయేలీయులు అర్పణలు తెస్తున్ననూ, వాటి చౌకబారు నాణ్యత తీవ్రమైన అగౌరవమును తెచ్చెనని మలాకీ ఈ విధంగా స్పష్టపరుస్తున్నాడు. మలాకీ యింకనూ యిలా వ్రాశాడు: “మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” ప్రత్యేకంగా తాము చేయవలసినదేమిటో ఆశ్చర్యపడుచూ వారిట్లడిగారు: “మేము దేనివిషయములో తిరుగుదుము?” అందుకు యెహోవా, “మానవుడు దేవునియొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి” అని జవాబిచ్చాడు. సమస్త సంపదకు మూలాధారుడైన యెహోవాయొద్ద ఇశ్రాయేలీయులు ఎట్లు దొంగిలుదురు? యెహోవాయే దానికిలా సమాధానమిస్తున్నాడు: “పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.” (మలాకీ 3:7, 8) అవును, తమ దశమ భాగాలను, అర్పణలను తెచ్చుటలో విఫలులగుట ద్వారా, ఇశ్రాయేలీయులు యెహోవా యొద్ద దొంగిలించుచుండిరి!

17. ఇశ్రాయేలీయులలో దశమభాగాలు, అర్పణలు ఏ సంకల్పాన్ని నెరవేర్చాయి, దశమభాగాలను గూర్చి యెహోవా ఏమి వాగ్దానం చేశాడు?

17 ఈ చరిత్రాధారము ఇశ్రాయేలీయులలోని దశమభాగముల, అర్పణల ప్రాముఖ్యతను చూపిస్తున్నది. అవి, వాటిని యిచ్చువాడు కలిగియున్న మెప్పును ప్రదర్శించేవి. ఆర్థికముగా సత్యారాధనకు దోహదపడుటలో అవి సహాయం చేశాయి. ఈ విధంగా, యెహోవా ఇశ్రాయేలీయులను యిలా ప్రోత్సహించాడు: “పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి.” వారలా చేసినట్లయితే కలిగే ఫలితాన్ని చూపిస్తూ, యెహోవా యిలా వాగ్దానం చేశాడు: “నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను.” (మలాకీ 3:10) యెహోవా ఆశీర్వాదము వారికి ఐశ్వర్యమిచ్చును.

‘నిజమైన ప్రభువుచేత’ తీర్పుతీర్చబడుట

18. (ఎ) ఎవరి రాకడను గూర్చి యెహోవా హెచ్చరించాడు? (బి) ఆలయానికి రావడం ఎప్పుడు సంభవించింది, దానిలో ఎవరు యిమిడియున్నారు, అది ఇశ్రాయేలీయులకు ఎలాంటి ఫలితాన్నిచ్చింది?

18 తన ప్రజలకు తీర్పుతీర్చుటకు తాను వచ్చెదనని కూడ యెహోవా మలాకీద్వారా హెచ్చరించాడు. “ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 3:1) వాగ్దానం ప్రకారం ఆలయానికి ఆయన రావడం ఎప్పుడు జరిగింది? మార్గం సిద్ధంచేయు దూతను గూర్చి మలాకీ ప్రవచనంలోని చెప్పబడిన మాటలను యేసు మత్తయి 11:10లో ప్రస్తావించి, వాటిని బాప్తిస్మమిచ్చు యోహానుకు అన్వయింపజేశాడు. (మలాకీ 4:5; మత్తయి 11:14) కావున సా.శ. 29లో తీర్పుతీర్చు ఆ కాలం వచ్చింది. “నిజమైన ప్రభువగు” (NW) యెహోవాతో కూడ ఆలయమునకు వచ్చు రెండవ దూత, అనగా ఆ నిబంధన దూత ఎవరు? ఆయనే యేసుక్రీస్తు, ఈయన రెండు సందర్భాల్లో యెరూషలేము దేవాలయానికివచ్చి మోసముతో క్రయవిక్రయములు చేయువారిని వెళ్లగొట్టి నాటకీయముగా దేవాలయాన్ని శుభ్రపరచాడు. (మార్కు 11:15-17; యోహాను 2:14-17) మొదటి శతాబ్దపు తీర్పును గూర్చి, యెహోవా ప్రవచనార్థకముగా యిలా అడుగుచున్నాడు: “ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు?” (మలాకీ 3:2) నిజానికి, ఇశ్రాయేలీయులు నిలువలేదు. పరిశీలించగా వారిలో కొరత కనబడింది, కావున సా.శ. 33లో వారు యెహోవా ఏర్పరచుకున్న జనాంగముగా ఉండకుండ కొట్టివేయబడ్డారు.—మత్తయి 23:37-39.

19. మొదటి శతాబ్దంలో ఏ విధంగా ఒక శేషము యెహోవా వైపు తిరిగింది, వారెటువంటి ఆశీర్వాదం పొందారు?

19 అయితే, మలాకీ యింకనూ యిలా వ్రాశాడు: “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు [యెహోవా NW] కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.” (మలాకీ 3:3) దీనికి కనుగుణ్యముగా, యెహోవాను సేవించుచున్నామని చెప్పుకొనిన అనేకులు నిరాకరింపబడగా, కొంతమంది నిర్మలులు చేయబడి యెహోవా యొద్దకువచ్చి ఆయనకు అంగీకృతమగు అర్పణలు అర్పించారు. ఎవరువారు? ఎవరనగా నిబంధన దూతగా యేసు యిచ్చిన పిలుపుకు ప్రతిస్పందించినవారే. యిలా ప్రతిస్పందించిన 120 మంది సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేమునందు ఒక మేడగదిలో సమావేశమయ్యారు. పరిశుద్ధాత్మచే బలపరచబడిన వారు నీతిననుసరించి నైవేద్యము నందింప నారంభించగా, త్వరితగతిన వారి సంఖ్య అధికమయ్యింది. (అపొ. కార్యములు 2:41; 4:4; 5:14) ఆ విధంగా, ఒక శేషము యెహోవా వైపు తిరిగింది.—మలాకీ 3:7.

20. యెరూషలేము, దానిలోని ఆలయము నాశనము చేయబడినప్పుడు, దేవుని క్రొత్త ఇశ్రాయేలుకు ఏమి సంభవించింది?

20 ఇశ్రాయేలీయుల వేరుకుదురుకు అంటుకట్టబడిన అన్యులును చేరియున్న ఈ ఇశ్రాయేలీయుల శేషము, ఒక క్రొత్త “దేవుని ఇశ్రాయేలుగా,” ఆత్మాభిషక్తులైన క్రైస్తవుల జనాంగముగా తయారైరి. (గలతీయులు 6:16; రోమీయులు 11:17) సా.శ. 70లో ఆ “దినము . . . కాలుచున్న కొలిమివలె” సహజ ఇశ్రాయేలుపై విరుచుకుపడగా, రోమా సైన్యాలు యెరూషలేమును దాని ఆలయమును నాశనం చేశాయి. (మలాకీ 4:1; లూకా 19:41-44) దేవుని ఆత్మీయ ఇశ్రాయేలుకు ఏమి సంభవించింది? “తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు” యెహోవా వారిని కనికరించాడు. (మలాకీ 3:17) అభిషక్త క్రైస్తవ సంఘం యేసు ప్రవచనార్థక హెచ్చరికను లక్ష్యపెట్టింది. (మత్తయి 24:15, 16) వారు రక్షింపబడ్డారు, మరియు యెహోవా ఆశీర్వాదము వారిని ఎడతెగక ఆత్మీయ సంపన్నులను చేసింది.

21. మలాకీ 3:1, 10ని గూర్చి ఏ ప్రశ్నలు నిలిచియున్నవి?

21 యెహోవాను అదెంతగా మహిమపరచింది! అయితే మలాకీ 3:1 ఈనాడు ఎలా నెరవేరుతున్నది? పదియవ భాగమంతయు మందిరపు నిధిలోనికి తీసికొనిరండి అని మలాకీ 3:10లో యివ్వబడిన ప్రోత్సాహమునకు ఒక క్రైస్తవుడు ఎలా ప్రతిస్పందించాలి? ఈ విషయం తర్వాతి శీర్షికలో చర్చించబడును.

మీరు వివరించగలరా?

◻ సమస్త సంపదకు అసలు మూలాధారుడు ఎవరు?

◻ వస్తు సంపదకంటె ఆత్మీయ సౌభాగ్యం ఎందుకు శ్రేష్ఠము?

◻ దశమభాగాలు, అర్పణలు ఇశ్రాయేలీయులలో ఏ సంకల్పాన్ని నెరవేర్చాయి?

◻ “నిజమైన ప్రభువగు” యెహోవా ఇశ్రాయేలీయులకు తీర్పుతీర్చుటకు ఆలయానికి ఎప్పుడు వచ్చాడు, దాని ఫలితమేమి?

◻ సా.శ. మొదటి శతాబ్దములో తన ఆలయానికి వచ్చిన తర్వాత ఎవరు యెహోవా వైపు తిరిగారు?

[10వ పేజీలోని చిత్రం]

యెహోవాకు ప్రాతినిధ్యము వహించిన నిబంధన దూతయగు యేసు, తీర్పుతీర్చడానికి సా.శ. మొదటి శతాబ్దములో ఆలయానికి వచ్చాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి