యెహోవాను యథార్థతతో సేవించుము
“యథార్థవంతులయెడల నీవు [యెహోవా] యథార్థవంతుడవుగా నుందువు.”—2 సమూయేలు 22:26.
1. ఆయనయెడల యథార్థతగలవారి పట్ల యెహోవా ఎలా వ్యవహరించును?
యెహోవా తన ప్రజలకు చేసేదానంతటికి వారాయనకు తిరిగి చెల్లించడం సాధ్యము కాదు. (కీర్తన 116:12) ఆయన ఆత్మీయ, భౌతిక వరములు, కరుణా వాత్సల్యం ఎంత అద్భుతము! దేవుడుకూడా యథార్థవంతులయెడల యథార్థతతో ప్రవర్తించునని పురాతన ఇశ్రాయేలు రాజైన దావీదుకు తెలుసును. “యెహోవా తన్ను [రాజైన] సౌలు చేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండి తప్పించిన దినమున” ఆయన కూర్చిన గీతములో దావీదు ఆవిధంగా అన్నాడు.—2 సమూయేలు 22:1.
2. రెండవ సమూయేలు 22 అధ్యాయములో వ్రాయబడిన దావీదు కీర్తనలోని కొన్ని అంశములేమి?
2 దావీదు తన ప్రార్థనకు సమాధానముగా యెహోవా “రక్షించువాడని” ఆయనను స్తుతిస్తూ, ఈ కీర్తనను (కీర్తన 18కి సమాంతరమైనది) ప్రారంభించెను. (2 సమూయేలు 22:2-7) బలవంతులైన శత్రువులనుండి యథార్థపరుడైన తన సేవకుని విడిపించుటకు దేవుడు తన పరలోక ఆలయమునుండి చర్యగైకొనెను. (8-19 వచనములు) యథార్థమైన మార్గమును విడువక అనుసరించి యెహోవా మార్గములను గైకొనినందున, దావీదు అట్టి ప్రతిఫలముపొందెను. (20-27 వచనములు) తదుపరి దేవుని శక్తివలన జరిగించబడిన కార్యములను ఆయన పొగడెను. (28-43 వచనములు) చివరగా, తప్పులు బట్టే తన ప్రజలనుండి, ఇతర జనాంగములలోని శత్రువులనుండి విడిపించిన దానిని ప్రస్తావిస్తూ, “ఆయన నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేయువాడని, తన అభిషక్తుని యెడల కనికరము చూపువాడని” యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించెను. (44-51 వచనములు) యథార్థమైన మార్గమును విడువక అనుసరించి, ఆయన బలముపై ఆధారపడినట్లయిన యెహోవా మనలనుకూడా విడిపించగలడు.
యథార్థవంతునిగా ఉండుట అనగా అర్థమేంటి
3. లేఖనసంబంధమైన దృక్పథమునుబట్టి, యథార్థవంతునిగా ఉండుట అంటే అర్థమేమిటి?
3 విడుదలనుగూర్చిన దావీదు కీర్తన “యథార్థవంతులయెడల నీవు [యెహోవా] యథార్థవంతుడుగా” ఉండుననే ఓదార్పుకరమైన అభయాన్ని మనకిస్తుంది. (2 సమూయేలు 22:26) హెబ్రీ క్రియా విశేషణము చా-సిధ్ “యథార్థవంతుడు,” లేక “కృపగలవాడు” అని సూచిస్తుంది. (కీర్తన 18:25 NW, అధఃసూచి) చెసెద్ అనే నామవాచకము, ఒకదానియెడల దానికి సంబంధించిన ఉద్దేశము నెరవేరెంతవరకు, ప్రేమతో అంటిపెట్టికొనియుండే దయ అనే తలంపును కలిగియున్నది. తన సేవకులును వ్యక్తపరచునట్లే యెహోవాకూడ తన సేవకులపట్ల అటువంటి దయనే వ్యక్తపరచును. ఇట్టి నీతియుక్తమైన పరిశుద్ధ యథార్థత “ప్రేమపూర్వకమైన దయ” మరియు “యథార్థమైన ప్రేమ” అని తర్జుమా చేయబడినది. (ఆదికాండము 20:13 NW; 21:23 NW) గ్రీకు లేఖనములలో “యథార్థత,” పరిశుద్ధత, భక్తిపూర్వక గౌరవభావము అనే తలంపును ఇస్తూ, హొసియోటెస్ అనే నామవాచకము నుండి హొసియోస్ అనే క్రియావిశేషణములో వ్యక్తపరచబడినది. అట్టి యథార్థతలో నమ్మకత్వము, భక్తి మరియు అంకిత భావముతో దేవునియెడలగల విధులన్నిటిని జాగ్రత్తగా నిర్వహించుట యిమిడియున్నవి. యెహోవాయెడల యథార్థపరునిగా ఉండటమంటే, ఒక శక్తివంతమైన జిగురువలె యెహోవాతో భక్తిపూర్వకంగా అంటిపెట్టుకొని ఉండుటని భావము.
4. యెహోవా యథార్థత ఎట్లు చూపబడింది?
4 యెహోవా తానుగాచూపే యథార్థత అనేక విధాలలో కనబడుతుంది. ఉదాహరణకు, న్యాయము నీతియెడల ఆయన కలిగియున్న యథార్థతనుబట్టియు, తన ప్రజలయెడలగల యథార్థమైన ప్రేమనుబట్టియు దుష్టులపైన న్యాయపరమైన చర్యను తీసుకుంటున్నాడు. (ప్రకటన 15:3, 4; 16:5) అబ్రాహాముతో తానుచేసిన నిబంధనయెడల చూపిన యథార్థతనుబట్టి ఇశ్రాయేలీయులపట్ల ఆయన దీర్ఘశాంతముతో వ్యవహరించెను. (2 రాజులు 13:23) దేవునియెడల యథార్థత కలిగియున్నవారు, వారి యథార్థ విధానముయొక్క అంతములో ఆయన సహాయమును తలంచుకొని వారిని ఆయన జ్ఞాపకముంచుకొంటాడను నిశ్చయతతో ఉండవచ్చును. (కీర్తన 37:27, 28; 97:10) దేవునియెడల “యథార్థత కనపరచినవారిలో ప్రధముడైన వానిగా” యేసు, తన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడదని ఎరిగినవాడై బలముపొందెను.—కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 2:25, 27.
5. యెహోవా యథార్థవంతుడైయున్నందున, ఆయన తనసేవకులను ఏమి కోరుచున్నాడు, మరియు ఏ ప్రశ్న పరిశీలించబడును?
5 యెహోవా దేవుడు యథార్థవంతుడు గనుక, ఆయన తన సేవకుల యథార్థతను కోరుతున్నాడు. (ఎఫెసీయులు 4:24) ఉదాహరణకు, సంఘములో పెద్దలుగా నియమించబడునట్లు అర్హులగులాగున పురుషులు యథార్థవంతులైయుండాలి. (తీతు 1:8) యెహోవాను యథార్థముగా సేవించుటకు ఆయన ప్రజలను ఏ విషయములు కదిలించవలెను?
నేర్చుకున్న విషయములపట్ల మెప్పు
6. మనము నేర్చుకున్న లేఖనవిషయాలను గూర్చి మనమెలా భావించాలి, మరియు అటువంటి జ్ఞానమునుగూర్చి మనము దేనిని జ్ఞాపకమందుంచుకోవాలి?
6 మనము నేర్చుకున్న లేఖనానుసారమైన సంగతుల యెడలగల కృతజ్ఞత యెహోవాను మనము యథార్థముగా సేవించునట్లు నడిపించవలెను. అపొస్తలుడైన పౌలు తిమోతిని ఇట్లు గట్టిగా పురికొల్పెను: “క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలకడగా ఉండుము.” (2 తిమోతి 3:14, 15) అటువంటి జ్ఞానము దేవునినుండి “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా వచ్చిందని జ్ఞాపకముంచుకొనుము.—మత్తయి 24:45-47.
7. దేవుని నుండి నమ్మకమైన దాసుని ద్వారా వచ్చే ఆత్మీయాహారమును పెద్దలు ఎట్లు భావించాలి?
7 దేవునినుండి నమ్మకమైన దాసుని ద్వారా అనుగ్రహించబడుచున్న ఆత్మీయ పోషకాహారమును నియమించబడిన పెద్దలు ముఖ్యముగా గుణగ్రహించవలెను. సంవత్సరాల క్రితము, కొంతమంది పెద్దలు అటువంటి గుణగ్రహింపు లేనివారైయుండిరి. దీనిని గమనించిన ఒక వ్యక్తి ప్రకారం ఈ పురుషులు, “వాచ్‌టవర్ శీర్షికల విషయములో విమర్శనాత్మకంగా ఉండిరి. దేవుడు సత్యాన్ని అందించే మార్గంగా . . . దానిని అంగీకరించకుండా, ఎల్లప్పుడు వారి ఆలోచన ప్రకారం ఇతరులపై ప్రభావం చూప ప్రయత్నించారు.” ఏమైనను, యథార్థపరులైన పెద్దలు మాత్రము నమ్మకమైన దాసుని ద్వారా దేవుని నుండి వస్తున్న ఆత్మీయాహారమును తిరస్కరించునట్లు ఇతరులపై ప్రభావముచూప ఎన్నడునూ ప్రయత్నించలేదు.
8. నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునిద్వారా అందించబడిన ఒక లేఖనాంశమును మనము పూర్తిగా గుణగ్రహించనప్పటి సంగతేమిటి?
8 యెహోవాకు సమర్పించుకొన్న సాక్షులముగా, మనందరము ఆయన సంస్థకు, ఆయనకు యథార్థవంతులుగా ఉండవలసియున్నాము. దేవుని ఆశ్చర్యకరమైన వెలుగునుండి తొలగిపోయి ప్రస్తుతం ఆత్మీయ మరణాన్ని, చివరకు నాశనాన్ని తెచ్చే మతభ్రష్ట విధానమును చేపట్టు తలంపుకూడ మనమెన్నటికీ రానివ్వకూడదు. (యిర్మీయా 17:13) అయితే, నమ్మకమైన దాసుని ద్వారా అందించబడిన ఒక లేఖనాంశము అంగీకరించడానికి లేక పూర్తిగా గుణగ్రహించుటకు కష్టంగా ఉన్నట్లయిన, అప్పుడేం చేయాలి? అప్పుడు వినయముతో, సత్యమును మనము ఎక్కడ నేర్చుకున్నామో గుర్తించినవారమై, చివరకు ఆ విషయముపై వివరాలు ప్రచురణరూపంలో దానిని స్పష్టపరచేంతవరకు, ఈ విధమైన శోధనతో వ్యవహరించుటకు కావలసిన జ్ఞానముకొరకు ప్రార్థన చేద్దాము.—యాకోబు 1:5-8.
క్రైస్తవ సహోదరత్వమును గుణగ్రహించుము
9. క్రైస్తవులు సహవాస భావమును కలిగియుండాలని 1 యోహాను 1:3-6 ఎట్లు చూపుతుంది?
9 క్రైస్తవ సహోదరత్వము మధ్య నెలకొనివున్న సహవాస భావము యెడలగల హృదయపూర్వకమైన ప్రశంస యెహోవాను మనము యథార్థముగా సేవించుటకు మరొక ప్రోత్సాహకము. ఇటువంటి భావమే నిజముగా లేనట్లయిన, దేవునితో మరియు క్రీస్తుతోగల మన సంబంధము ఆత్మీయంగా బాగుండదు. అభిషక్తులైన క్రైస్తవులతో యోహాను ఇట్లు చెప్పెను: “మాతోకూడ మీకును సహవాసము [“భాగము” డయాగ్లట్] కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది . . . ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.” (1 యోహాను 1:3-6) ఈ సూత్రము పరలోక నిరీక్షణగలవారికైననూ లేక భూనిరీక్షణ గలవారికైనను క్రైస్తవులందరికి అన్వయిస్తుంది.
10. యువొదియ, సుంటుకేల మధ్యనున్న వ్యక్తిగత సమస్యను తీర్చుకొనుట కష్టముగా ఉన్ననూ, ఈ స్త్రీలను పౌలెట్లు దృష్టించాడు?
10 సహవాస భావమును కాపాడుకొనుటకు కృషిచేయటం అవసరము. ఉదాహరణకు, యువొదియ, సుంటుకే అను క్రైస్తవ స్త్రీలు వారిమధ్యనున్న సమస్యను తీర్చుకొనుట కష్టతరమైనది. అందుచేత పౌలు వారికి “ప్రభువునందు ఏక మనస్సు గలవారైయుండుడని” ఉద్బోధించెను. వారినిగూర్చి ఇంకా ఆయన: “అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయముచేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి” అని అన్నాడు. (ఫిలిప్పీయులు 4:2, 3) దైవికసంబంధులైన ఆ స్త్రీలు పౌలుతోను, యితరులతోను “సువార్త పనిలో” ప్రయాసపడి పనిచేశారు. ‘వారి పేర్లు జీవ గ్రంథమందును వ్రాయబడియున్నవను’ నిశ్చయత ఆయనకుండెను.
11. యథార్థపరుడైన ఒక క్రైస్తవుడు ఆత్మీయ సమస్యనెదుర్కొన్నట్లయిన, దేనిని మనస్సు నందుంచుకొనుట సరియైనది?
11 క్రైస్తవులు, యెహోవా సంస్థలో తాము ఏమేమి చేసే ఆధిక్యతను పొందియున్నారో, లేక వారు ఆయనను ఎలా యథార్థముగా సేవించియున్నారో తెలిపే బోర్డును తగిలించుకొని ఉండరు. వారికేదైన ఆత్మీయ సమస్య ఉన్నట్లయిన, వారు సంవత్సరాల తరబడి చేసిన యథార్థసేవను తృణీకరించుట ఎంత ప్రేమలేనిదై యుంటుంది! “నిజమైన సహకారీ” అని పిలువబడినవాడు బహుశా సహాయము చేయనిష్టపడే యథార్థమైన సహోదరుడైయుంటాడు. నీవు ఒక పెద్దవైనట్లయిన, కరుణగల మార్గంలో సహాయంనందించుటకు సిద్ధంగా ఉండే “నిజమైన సహకారి”వేనా నీవు? దేవుడు గమనించునట్లే, మన తోటి విశ్వాసులు చేసే మంచిని పరిశీలించి, వారి భారములను భరించుటలో ప్రేమతో సహాయము చేద్దాము.—గలతీయులు 6:2; హెబ్రీయులు 6:10.
వెళ్లుటకు వేరే చోటులేదు
12. యేసు మాటలు ‘అనేకమంది శిష్యులను విడిచివచ్చిన’ వాటికి తిరిగి వెళ్లునట్లు చేసినప్పుడు, పేతురు ఏ చర్యనుగైకొన్నాడు?
12 నిత్యజీవము కొరకు వెళ్లగల చోటు మరొకటి వేరే లేదని జ్ఞాపకముంచుకొన్నట్లయిన, ఆయన సంస్థతోపాటు యెహోవాను యథార్థముగా సేవించుటకు పురికొల్పబడుదుము. యేసు మాటలు అనేకమంది శిష్యులను వారు విడిచివచ్చిన వాటికొరకు తిరిగివెళ్లునట్లు చేసినప్పుడు, ఆయన తన అపొస్తలులను: “మీరు కూడ వెళ్లి పోవలెనని యున్నారా?” అని అడిగెను, అందుకు పేతురు: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.”—యోహాను 6:66-69.
13, 14. (ఎ) మొదటి శతాబ్దపు యూదా మతము దైవిక అనుగ్రహమును ఎందుకు కోల్పోయినది? (బి) దీర్ఘకాలమునుండి ఉన్న ఒక యెహోవాసాక్షి దేవుని దృశ్య సంస్థనుగూర్చి ఏమి చెప్పాడు?
13 సామాన్య శకము మొదటి శతాబ్దములోని యూదా మతములో “నిత్యజీవపు మాటలు” లేవు. దాని ముఖ్యమైన పాపము మెస్సియాగా యేసును తిరస్కరించడమే. దాని ఏ రూపములో కూడా యూదామతము పూర్తిగా హెబ్రీ లేఖనములపై ఆధారపడలేదు. సద్దూకయ్యులు దేవదూతల ఉనికిని నిరాకరించి పునరుత్థానమును నమ్మలేదు. ఈ విషయాలలో పరిసయ్యులు వారితో యేకీభవించకపోయినను, లేఖనానుసారముకాని వారి పారంపర్యాచారములతో, వారు పాపకరంగా దేవుని వాక్యమును నిరర్ధకము చేసిరి. (మత్తయి 15:1-11; అపొస్తలుల కార్యములు 23:6-9) ఈ పారంపర్యాచారములే యూదులను దాసత్వముక్రిందకు నడిపి, అనేకులు యేసుక్రీస్తును నమ్మేందుకు కష్టమయ్యేలా చేసినవి. (కొలొస్సయులు 2:8) సౌలుకు (పౌలు), తన ‘పితరుల పారంపర్యాచారమందున్న ఆసక్తి’ తనను అజ్ఞానములో క్రీస్తు అనుచరులను క్రూరంగా హింసించే వ్యక్తిగా చేసినవి.—గలతీయులు 1:13, 14, 23.
14 యూదా మతము దేవుని అనుగ్రహము కోల్పోయినను, ‘సత్క్రియలయందు ఆసక్తిగల’—తన కుమారుని అనుచరులతో ఏర్పడిన సంస్థను యెహోవా ఆశీర్వదించెను. (తీతు 2:14) ఆ సంస్థ ఇప్పటికిని ఉనికిలో ఉన్నది. దానినిగూర్చి దీర్ఘకాలము యెహోవాసాక్షిగా ఉన్న ఒకవ్యక్తి ఇట్లన్నాడు: “నాకు ఏదైన అత్యంత ప్రాముఖ్యమైనది ఉంటే, అది యెహోవా దృశ్య సంస్థకు సన్నిహితంగా ఉండుటయే. మానవ తర్కముపై ఆధారపడుట ఎంత అవివేకమైనదో నా తొలి అనుభవము నాకు బోధించింది. ఆ విషయములో ఒక సారి నా మనస్సు ఒక తీర్మానమునకు వచ్చిన తరువాత, నమ్మకమైన సంస్థతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. వేరెక్కడ నేను యెహోవా అనుగ్రహమును, ఆశీర్వాదమును పొందగలను?” నిత్యజీవము మరియు దైవిక అనుగ్రహముకొరకు వెళ్లగల మరొకచోటు వేరే ఎక్కడనూ లేదు.
15. యెహోవా దృశ్య సంస్థతోను, అందులో బాధ్యతవహించేవారితోను ఎందుకు సహకరించవలెను?
15 మన హృదయములు యెహోవాసంస్థతో సహకరించుటకు మనలను పురికొల్పవలెను. ఎందుకనగా అది మాత్రమే ఆయన ఆత్మద్వారా నడిపించబడుతూ, ఆయన నామమును, ఆయన సంకల్పములను తెలియజేయుచున్నదని మనకు తెలుసు. అవును, అందులో బాధ్యతలను చేపట్టేవారు అసంపూర్ణులే. (రోమా 5:12) అయినా, అహరోను మిర్యాములు మోషేలో తప్పుపట్టుకొని, దేవుడిచ్చిన బాధ్యత అప్పగించబడింది మోషేకేగాని తమకుకాదని మరచిపోయినప్పుడు, “యెహోవా కోపము వారిమీద రగులు” కొనెను. (సంఖ్యాకాండము 12:7-9) ఈనాడు, యథార్థవంతులైన క్రైస్తవులు “నాయకత్వము తీసుకొనువారితో” సహకరిస్తారు, ఎందుకనగా యెహోవా కోరేది అదే. (హెబ్రీయులు 13:7, 17) మన యథార్థతను రుజువు చేయువాటిలో క్రైస్తవ కూటములకు క్రమముగా హాజరగుట, ‘ఒకరి యందొకరు ప్రేమచూపుటకును, సత్కార్యములు చేయుటకును పురికొల్పే’ వ్యాఖ్యానములు చేయుట ఇమిడియున్నవి.—హెబ్రీయులు 10:24, 25.
క్షేమాభివృద్ధి కలుగజేయువారై యుండుడి
16. ఇతరులకు ఏమి చేయవలెననే కోరికకూడ మనం యెహోవాను యథార్థముగా సేవించుటకు మనలను పురికొల్పవలెను?
16 ఇతరులు క్షేమాభివృద్ధి పొందాలనే కోరిక కూడా యెహోవాను యథార్థముగా సేవించుటకు మనలను పురికొల్పవలెను. పౌలు ఇలా వ్రాసెను: “జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.” (1 కొరింథీయులు 8:1) ఒక విధమైన జ్ఞానము దాని కలిగియున్నవారిని ఉప్పొంగజేసింది గనుక, ప్రేమ కూడ ఆ లక్షణాన్ని చూపేవారికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుందని పౌలు భావమైయుంటుంది. విస్ మరియు ఇంగ్లీష్ అనే పొఫెసర్లు వ్రాసిన ఒక పుస్తకము ఇలా చెబుతుంది: “ప్రేమించే శక్తిగల వ్యక్తి సాధారణంగా తిరిగి ప్రేమించబడతాడు. సద్భావమును, శ్రద్ధను జీవిత ప్రతిరంగములో కనపరచేవ్యక్తి . . . ఆ భావాలను చూపే వ్యక్తిపైనా, దాన్నిపొందే వ్యక్తిపైనా నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని కలిగియుంటాడు. తద్వారా అది యిద్దరికీ సంతోషాన్నిస్తుంది.” ప్రేమను చూపుట ద్వారా ఇతరులకును, మనకును క్షేమాభివృద్ధి కలుగజేసుకొందాము. ఇది యేసు మాటలలోను అంతర్హితంగా ఉన్నది: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
17. ప్రేమ ఎట్లు క్షేమాభివృద్ధి కలుగజేయును, దేనిని చేయకుండ అది మనలను అడ్డగించును?
17 మొదటి కొరింథీయులు 8:1లో పౌలు సూత్రబద్ధమైన ప్రేమను సూచించే అగాపే గ్రీకు పదమును ఉపయోగించాడు. అది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, ఎందుకనగా అది దీర్ఘశాంతముగలది, దయగలది, అన్నిటికి తాళుకొని అన్నిటిని సహిస్తుంది. శాశ్వతకాల ముంటుంది. ఈ ప్రేమ గర్వము, అసూయ మొదలగు హానికరమైన భావోద్రేకములను లేకుండా చేస్తుంది. (1 కొరింథీయులు 13:4-8) అటువంటి ప్రేమ మనవలె అసంపూర్ణులైన మన సహోదరులను గూర్చి ఫిర్యాదు చేయకుండా మనలను కాపాడుతుంది. మొదటి శతాబ్దపు నిజక్రైస్తవుల మధ్య “రహస్యముగా చొరబడిన” “భక్తిహీనులైన” వారివలె కాకుండా మనలను నిలుపుతుంది. ఈ మనుష్యులు “ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించు” చున్నారు. వారు కొంత మహిమను కలిగియున్న అభిషక్తులైన క్రైస్తవ అధ్యక్షులను స్పష్టంగా నిందించిరి. (యూదా 3, 4, 8) యెహోవాయెడల యథార్థతగలవారమై, ఎన్నటికి అలాంటిదాన్ని చేయుటకు శోధింపబడకుండ ఉందాము.
అపవాదిని ఎదిరించుము!
18. యెహోవా ప్రజలకు ఏమి చేయాలని సాతాను కోరుతున్నాడు, అయితే అతడెందుకు అలా చేయలేడు?
18 దేవుని ప్రజలుగా మన ఐక్యతను పాడుచేయుటకు సాతాను కోరుతున్నాడను జ్ఞానము యెహోవాకు మనం యథార్థముగా సేవచేయవలెనను మన తీర్మానమును వృద్ధిచేయవలెను. సాతాను దేవుని ప్రజలందరిని అసలు లేకుండాచేయాలని కోరుకుంటాడు కూడ. అపవాదియొక్క భూసంబంధమైన సేవకులు సత్యారాధికులను కొన్నిసార్లు చంపుతారు. అయితే, దేవుడు తన ప్రజలందరిని నిర్మూలించునట్లు సాతానును అనుమతించడు. “మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని” నశింపజేయుటకే యేసు చనిపోయాడు. (హెబ్రీయులు 2:14) ముఖ్యముగా క్రీస్తు 1914లో రాజైన తరువాత, పరలోకమునుండి అతడు పడద్రోయబడినప్పటి నుండి వాని సామ్రాజ్యపు అధికార చెలాయింపు పరిమితము చేయబడినది. యెహోవాయొక్క నిర్ణయ సమయములో సాతానును అతని సంస్థను యేసు నాశనముచేయును.
19. (ఎ) ఏ సాతాను ప్రయత్నములనుగూర్చి సంవత్సరముల క్రితము ఈ పత్రిక హెచ్చరిక నిచ్చినది? (బి) సాతాను ఉరులను తప్పించుకొనుటకు, తోటివిశ్వాసులతో వ్యవహరించునప్పుడు, మనమే జాగ్రత్తను తీసికొనవలెను?
19 ఒకసారి ఈ పత్రిక యిలా హెచ్చరించింది: “అపవాదియైన సాతాను, దేవుని ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించి, వారిమధ్య వారు కలహించుకొని, పోట్లాడుకొనునట్లు చేయగలిగి లేక సహోదరుల మధ్య ప్రేమను నశింపజేసే స్వార్ధపర స్వభావమును వృద్ధిచేసి ప్రదర్శింపజేస్తే, ఆవిధంగా అతడు వారిని మ్రింగివేయుటలో విజయము సాధించినట్లే.” (ది వాచ్‌టవర్, మే 1, 1921, పేజి 134) అపవాదు వేయునట్లు లేక ఒకరితోనొకరు పోట్లాడుకొనునట్లు పురికొల్పుటద్వారా, అపవాది మన ఐక్యతను నాశనముచేయనివ్వొద్దు. (లేవీయకాండము 19:16) యెహోవాను యథార్థముగా సేవించువారికి మనము వ్యక్తిగతముగా హానిచేయుట లేక వారి జీవితాన్ని ఎక్కువ కష్టతరం చేసే స్థితికి సాతాను మనలను లోపరచుకొనకుండునట్లు ఉందాము. (2 కొరింథీయులు 2:10, 11 పోల్చుము.) దానికి బదులుగా, పేతురు మాటలను అన్వయించుకొందాము: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. . . .విశ్వాసమందు స్థిరులైయుండుడి.” (1 పేతురు 5:8, 9) సాతానుకు విరోధంగా స్థిరమైన స్థానమును చేపట్టుటనుబట్టి, యెహోవా ప్రజలుగా దీవించబడియున్న మన ఐక్యతను కాపాడుకొనగలము.—కీర్తన 133:1-3.
ప్రార్థనా పూర్వకంగా దేవునిపై ఆధారపడుము
20, 21. ప్రార్థనా పూర్వకంగా యెహోవాపై ఆధారపడుట ఆయనను యథార్థముగా సేవించుటకు ఎట్లు సంబంధము కలిగియున్నది?
20 ప్రార్థనపూర్వకంగా దేవునిపై ఆధారపడుట యెహోవాను యథార్థముగా సేవించుటలో కొనసాగుటకు మనకు సహాయపడును. మన ప్రార్థనలకు ఆయన సమాధానమిస్తున్నట్లు మనము చూసినప్పుడు, ఆయనకు మరెక్కువగా సమీపస్థుల మగుదుము. అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా యెహోవా దేవునిపై ఆధారపడు అవసరతను నొక్కి చెప్పాడు: “కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థనచేయవలెనని కోరుచున్నాను.” (1 తిమోతి 2:8) ఉదాహరణకు, పెద్దలు దేవునిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడుట ఎంత ప్రాముఖ్యము! సంఘ విషయములు చర్చించుటకు కూడినప్పుడు యెహోవాయెడల అటువంటి యథార్థతను ప్రదర్శిస్తే, అది అంతంలేని చర్చలు మరియు కోపోద్రేకములు చెలరేగుటవంటి వాటికి దారితీయకుండా నిరోధించుటకు సహాయపడును.
21 ప్రార్థనాపూర్వకంగా యెహోవా దేవునిపై ఆధారపడినట్లయిన, ఆయన సేవలో మనకున్న ఆధిక్యతలయెడల శ్రద్ధవహించుటకు సహాయపడును. అనేక దశాబ్దాలు యెహోవాను యథార్థముగా సేవించిన ఒకాయన ఇలా చెప్పగలిగెను: “దేవుని ప్రపంచవ్యాప్త సంస్థలో అప్పగించబడిన పనిని అంగీకరించుటలో మనం ప్రదర్శించే యిష్టత, ఆ పనిలో నిలబడుట, స్థిరులమైయుండుట మన మనఃపూర్వక ప్రయత్నములను చేయుట ఆనందదాయకమైన దేవుని అంగీకారమును తెచ్చును. అప్పగించబడిన పని హీనమైనదిగా కనిపించినను, తరచు దానిని నమ్మకంగా నిర్వర్తించనిదే, ప్రాముఖ్యమైన పెద్ద పనులు జరగవన్న స్థితికి అది మారును. కాబట్టి మనము దీనులమై మన పేరును గాక, ప్రత్యక్షంగా యెహోవా నామమును మహిమపరచుటలో ఆసక్తి కలిగియుంటే మనమెల్లప్పుడు ‘స్థిరులమును, కదలనివారమునైయుండి యెహోవా పనిని సమృద్ధిగా కలిగియుందుమను నిశ్చయతతో ఉండగలము.’”—1 కొరింథీయులు 15:58 NW.
22. యెహోవాయొక్క అనేక ఆశీర్వాదములు మన యథార్థతపై ఎట్లు ప్రభావము చూపవలెను?
22 యెహోవా సేవలో మనము ఏమి చేసినప్పటికిని, నిజముగా ఆయన మనకు చేసే దానికి తిరిగి చెల్లించలేము. దేవుని స్నేహితులైన వారి మధ్యయుండి, దేవుని సంస్థలో ఎంత సురక్షితముగా ఉన్నాము! (యాకోబు 2:23) సాతాను స్వయంగా పెకలించివేయలేనంత లోతుగా సహోదర ప్రేమలో మనం పాతుకుపోయి, దానిలో ఉద్భవించే ఐక్యతద్వారా యెహోవా మనలను ఆశీర్వదించాడు. కాబట్టి యథార్థవంతుడైన మన పరలోకపు తండ్రిని హత్తుకొని, ఆయన ప్రజలుగా కలిసి పనిచేద్దాము. ఇప్పుడు మరియు సకలయుగములందు యెహోవాను యథార్థముగా సేవించుదము.
మీరెట్లు సమాధానమిస్తారు?
◻ యథార్థవంతునిగా ఉండుట అనగా అర్థమేమిటి?
◻ యెహోవాను యథార్థముగా సేవించునట్లు మనలను కదలించవలసిన కొన్ని వాస్తవాలేమిటి?
◻ అపవాదిని మనమెందుకు ఎదిరించవలెను?
◻ యెహోవాయొక్క యథార్థమైన సేవకులముగా ఉండునట్లు ప్రార్థన మనకెట్లు సహాయపడగలదు?
[23వ పేజీలోని చిత్రం]
యెహోవా యథార్థ సేవకులు తమ ఐక్యతను భంగపరచుటకు సింహమువంటి తమ శత్రువైన అపవాదిని అనుమతించరు