నమీబియాలో వివేకమును కలిగించుట
“నాకు తెలియదు” అని చెప్పే మాటను ఎన్ని భాషలలో మీరు విన్నారు? “హీ నొకుతువా,” అని తన సంప్రదాయ దుస్తులు ధరించి కొమ్ము ఆకారంలో తలపై పాగాపెట్టుకొన్న హెరేరొ స్త్రీ చెప్పింది. “ని యుదిటె కొ,” అని క్వాన్‌యమ బాలిక చిరునవ్వుతో సమాధానమిచ్చింది. “కాండు, వీటి కొ,” అని ఒక డోంగ గ్రామవాసి భుజాలు ఊపుకుంటూ ఉత్తరమిచ్చాడు. “కాపి న కుజువా,” అని క్వాంగలి మేకలకాపరి అన్నాడు.
వీళ్లందరు “నాకు తెలియదు” అని అంటున్నారు. సువిశాలంగా 8,24,000 చ. కిలోమీటర్లు కలిగి 13,70,000 మంది నివాసులతో ఉన్న నమీబియాలో, యెహోవాసాక్షులు వారిని చేరుటకు భాషాపరంగా ఎటువంటి పెద్ద సమస్యలనెదుర్కొంటున్నారో వివరించడానికి అది సరిపోతుంది!
ఇంతేకాదు! హెరేరొ మరియు నమ ప్రజలేకాకుండా, నమీబియాలోని ఓవంబో, కివంగో, ట్స్వానా, కిప్రీవియన్, హీంబా, బుషమన్, డమర ప్రజలకు కూడా వారివారి స్వంత భాషలు ఉన్నాయి. అయితే సాక్షులవద్ద మాత్రము కేవలం ఇంగ్లీషు మరియు ఆఫ్రికాన్స్ భాషలలోనే సాహిత్యములున్నాయి. అందుచేత ఎక్కువమంది ప్రజలు సత్యమును అర్థంచేసుకోవాలంటే తర్జుమా పని చాలా ప్రాముఖ్యం. ఈపని అనేక సంవత్సరాల క్రితము అప్పుడు దక్షిణ-పశ్చిమాఫ్రికాయని పిలువబడిన దాని ముఖ్యపట్టణమగు వింధోక్‌లో కొద్ది మోతాదులో ప్రారంభమైనది.
“వింధోక్‌లో సాక్ష్యమిచ్చే పనికి చర్చ్ మరియు పోలీస్ వలన తీవ్ర వ్యతిరేకత ఉండేదని” డిక్ వల్డ్రన్ జ్ఞాపకం చేసికొనుచున్నాడు. ఈయన తన భార్యయైన కారిలీతోపాటు 1953లో వాచ్‌టవర్ గిలియడ్ బైబిలు స్కూలు పట్టభద్రుడుగా వచ్చాడు. “మేము నల్లవారు నివసించే ప్రాంతాలకు వెళ్లటానికి అనుమతించబడలేదు. ఎప్పుడైనా మేము నల్లవారితో మాట్లాడుతున్నట్లు కనబడితే మమ్ములను బాధించేవారు. చివరకు మా జోలికి ఎవరూ రానటువంటి ప్రాంతాన్ని—అనగా గమెన్స్ నదియొక్క నీళ్లులేక ఎండిన నేల ప్రాంతాన్ని చూశాము. ఇది పట్టణానికి వెలుపల ఉంటుంది. అక్కడ తుమ్మపొదల చాటున కూర్చొని బైబిలు పఠనాలను నిర్వహించేవారము” అంటున్నాడు.
ఆ నది ఆరిన నేల ప్రాంతాలలోనే మొట్టమొదట వాచ్‌టవర్ ప్రచురణలు స్థానిక భాషలలోకి తర్జుమా చేయబడ్డాయి. వాటిలో క్వాన్‌యామలోని కొన్ని కరపత్రాలు, నమా భాషలోని “ఈ రాజ్యసువార్త” ఉన్నాయి. ఆసక్తిగల ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని తర్జుమా చేయటానికి సహాయం చేస్తున్నప్పుడు నవ్వు పుట్టించే ఒక అనుభవాన్ని సహోదరుడైన వల్డ్రన్ జ్ఞాపకం చేసికొంటున్నాడు. “ఆదాము పరిపూర్ణమైన మనుష్యుడు” అనే దానికి నమా భాషలో సరైన పదము దొరకటం కష్టమయ్యింది. వెంటనే ఆసక్తిగల ఆ వ్యక్తి: “ఏం పర్వాలేదు, ఆదాము బాగా పండిన దొండపండులా ఉంటాడని రాయండి, నమా ప్రజలు ఆయన పరిపూర్ణుడని అర్థంచేసికొంటారు” అన్నాడు. ఈ విధంగా నమీబియా స్వదేశపు ప్రజలనేకులకు లేఖన గ్రహింపును కలుగజేసేందుకు ప్రారంభం జరిగింది.—దానియేలు 11:33 ను పోల్చుము.
ఒక ముఖ్య గమ్యాన్ని చేరుకొనుట
నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకమును 1970 దశాబ్దపు తొలిభాగములో డోంగ, క్వాన్యామ భాషలలోకి తర్జుమా చేయటంతో ఒక ముఖ్య లక్ష్యం సాధించబడింది. వింధోక్‌కు 700 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్న ఓవంబోలేండ్‌లోని ఎక్కువమంది ప్రజలు ఈ రెండు భాషలను ముఖ్యంగా వాడుతుంటారు. ఓవంబోలేండ్‌లోని ఒక ప్రాంతమైన ఒండగ్వెలో పయినీరు హోమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతములోని ఆసక్తిగలవారికి సహాయపడేందుకు, వారు ది వాచ్‌టవర్ పై ఆధారపడిన బైబిలు చర్చలనుండి ప్రయోజనం పొందేందుకు వీలుగా ఓవంబోలేండ్‌లో సేవచేస్తున్న ప్రత్యేక పయినీర్లకు ఇంగ్లీషు పఠన శీర్షికల సారాంశమును డొంగా, క్వాన్యామ భాషలలోకి తర్జుమాచేసే పని అప్పగించబడింది.
గ్యారేజిలో ఒక మూలను వేరుపాటుచేసి ఏర్పరచిన తర్జుమా “ఆఫీసు”లోనే తర్జుమాచేయబడిన వాచ్‌టవర్ సమాచార కాపీలను డూప్లికేట్ మిషన్లద్వారా ఉత్పత్తిచేసేవారు. అంతకంతకు అవసరత అధికమౌతున్న ఈ పనికి ఆ తొలిదశలో, 38 నుండి 44 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో పనిచేయడం అంత సులభమేమి కాదు. అయినా, ఇక్కడే క్రొత్త బ్రొషూర్లూ మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకము తర్జుమాచేయబడినవి.
ఓవంబోలేండ్ మరియు నమీబియాలోని ఇతరప్రాంతాలలో సంఘములు ఏర్పడే కొలది విశాలమైన, ఇంకా శ్రేష్టమైన స్థల అవసరత పెరిగింది. అంతేగాక దేశములోని ఇతర ప్రాంతాలకును అవధానమివ్వడానికి సరియైన కేంద్రస్థానం బాగుంటుదనిపించింది. ఈలోగా రాజ్య ప్రకటన పనియెడల దురభిమానము కూడా తగ్గిపోయింది. అందుచేత వింధోక్‌లో ఒక యెహోవాసాక్షి కానుకగా ఇచ్చిన పెద్ద స్థలంలో భవన నిర్మాణానికి అనుమతిపొందటం జరిగింది. అనతికాలంలోనే 40 మంది స్వచ్ఛంద పనివారలకు అక్కడ నివాసమేర్పాటు చేయబడింది. డిశంబరు 1990లో తర్జుమా ఆఫీసులు పూర్తిచేయబడినవి.
ప్రస్తుతం ఈ ఆధునిక భవనములోని సౌఖర్యవంతమైన ఆఫీసులలో, రూములలో అనేకులకు గ్రహింపునందించే పని వేగం పుంజుకొంటుంది. హిరేరొ, క్వాంగలి భాషలలోకి క్రొత్తసాహిత్యములు తర్జుమాచేయబడటం ఎడతెగక కొనసాగుతుంది. డోంగ, క్వాన్యామ రెండుభాషల శీర్షికలు ఒకే పత్రికలో కలిగిన, ద్విభాషా నెలసరి సంచికగా ది వాచ్‌టవర్ రంగులలో ముద్రించబడుతుంది. దానిలో పఠనశీర్షికలన్నీ ఉంటాయి, ఇతర శీర్షికలు కూడ ఉంటాయి. నిజంగా ఇది అనేక సంవత్సరముల క్రితం నదియొక్క ఆరిన నేలప్రాంతములలో అంకురించిన ప్రారంభం కంటె ఎంతో భిన్నమైనది.
“నాకు తెలియదు” అనే మాట ఇప్పుడు అరుదుగా వినబడుతుంది. దానికి బదులుగా నమీబియాలో ఉన్న 600 మంది యెహోవాసాక్షులు వారి పరలోకపు తండ్రికి ఎంతో కృతజ్ఞులైయున్నారు. వారిప్పుడు: “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును, అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును,” అని చెప్పగలరు.—కీర్తన 119:130.
[25వ పేజీలోని చిత్రాలు]
హిరేరొ ప్రజలమధ్య సువార్తను ప్రకటించుట
నమీబియా ప్రజల ప్రయోజనార్ధమై క్రైస్తవ ప్రచురణలను తర్జుమాచేయుట
నమీబియాలో తర్జుమా ఆఫీసులు