“మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?”
“ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?”—కీర్తన 113:5.
1, 2. (ఎ) యెహోవాసాక్షులు దేవునిని మరియు బైబిలును ఎలా దృష్టిస్తారు? (బి) ఏ ప్రశ్నలు పరిశీలించుటకు యోగ్యమైనవి?
యెహోవాను స్తుతించువారు నిజంగా ఆశీర్వదింపబడినవారు. ఇట్టి సంతోషభరిత ప్రజల మధ్య ఉండటం ఎంతటి ఆధిక్యత! ఆయన సాక్షులుగా దేవుని వాక్యమైన బైబిలులోని సలహాలను, శాసనములను, బోధలను, వాగ్దానములను, ప్రవచనాలను మనము అంగీకరిస్తాము. లేఖనములనుండి నేర్చుకొని, “యెహోవాచే ఉపదేశించబడుటకు” ఆనందిస్తాము.—యోహాను 6:45.
2 దేవునియెడల వారికున్న ప్రగాఢమైన భక్తిపూర్వక గౌరవాన్నిబట్టి యెహోవాసాక్షులు: “మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?” అని ప్రశ్నించగలరు. (కీర్తన 113:5) ఆ మాటలు కీర్తన రచయిత యొక్క విశ్వాసమును సూచించేవైయున్నవి. అయితే సాక్షులకు దేవునియందు అంతటి విశ్వాసమెందుకున్నది? యెహోవాను స్తుతించుటకు వారికున్న కారణాలేమిటి?
విశ్వాసము, స్తుతి యుక్తమైనవే
3. హల్లెలు కీర్తనలు అనగా ఏమి, వాటికి ఎందుకు ఆ పేరు పెట్టబడింది?
3 యెహోవాయందు విశ్వాసముంచుట తప్పనిసరి. ఎందుకనగా ఆయన అద్వితీయ దేవుడు. ఈ విషయము ఆరు హల్లెలు కీర్తనలలో భాగమైన కీర్తనలు 113, 114, 115లలో నొక్కి చెప్పబడినది. హిల్లెలు రబ్బీ పాఠశాల ప్రకారం రెండవ గిన్నెలోని ద్రాక్షారసము అందించబడి, పస్కా ఆచరణయొక్క సూచన వివరించబడిన పిమ్మట, యూదా పస్కా భోజన సమయములో 113 మరియు 114 కీర్తనలను పాడేవారు. నాల్గవ పాత్రను అందించిన తరువాత 115 నుండి 118 కీర్తనలను పాడేవారు. (మత్తయి 26:30 పోల్చుము.) వాటిని “హల్లెలు కీర్తనలు” అని పిలిచారు. ఎందుకనగా అవి పదేపదే హ(అ)ల్లెలూయా!—“యెహోవాను స్తుతించుడి!” అను మాటను వాడినవి.
4. “హ(అ)ల్లెలూయా,” అనే పదానికి అర్థమేమి, బైబిలులో అది ఎంత తరచుగా కనబడుతుంది?
4 “హల్లెలూయా!” అని కీర్తనలలో 24 సార్లు కనపడే హెబ్రీ అక్షరములు యధాతధంగా ఇతర భాషల్లో లిఖించబడ్డాయి. బైబిలులో మరోచోట, ఆ పదముయొక్క గ్రీకు రూపము, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నాశనమునుబట్టి కలిగిన ఉత్సాహంలో, యెహోవా దేవుడు రాజుగా ఏలనారంభించినందున కలిగిన ఆనంద సందర్భంలో వాడబడినది. (ప్రకటన 19:1-6) మూడు హల్లెలు కీర్తనలను మనము పరిశీలించుచుండగా, యెహోవా స్తుతినిమిత్తమై ఈ పాటలను మనమే పాడుతున్నట్లు ఊహించుకొనవచ్చును.
యెహోవాను స్తుతించుడి!
5. కీర్తన 113 ఏ ప్రశ్నకు సమాధానమిస్తుంది, కీర్తన 113:1, 2 నందలి ఆజ్ఞ ప్రత్యేకంగా ఎవరికి వర్తిస్తుంది?
5 యెహోవాను ఎందుకు స్తుతించవలెను? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే కీర్తనలు 113 ఈ విధమైన ఆజ్ఞతో మొదలవుతుంది: “యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.” (కీర్తన 113:1, 2) “హ(అ)ల్లెలూయా!” అవును, “యెహోవాను స్తుతించుడి!” ఈ “అంత్యకాలము”లో ఆ ఆజ్ఞ ప్రత్యేకముగా దేవుని ప్రజలకు అన్వయిస్తుంది. (దానియేలు 12:4) ఇప్పటినుండి సదాకాలము మరియెక్కువగా యెహోవా నామము భూమియందంతట ఉన్నతపరచబడును. ఆయన సాక్షులు ఇప్పుడు యెహోవా దేవుడని, క్రీస్తు రాజని, రాజ్యము పరలోకమందు స్థాపించబడియున్నదని ప్రకటిస్తారు. అపవాదియైన సాతాను, అతని సంస్థ ఇలా యెహోవాను స్తుతించుటను ఆపలేవు.
6. ‘సూర్యోదయము నుండి సూర్యాస్తమయము’ వరకు యెహోవా ఎట్లు స్తుతింపబడుచున్నాడు?
6 ఈ స్తుతికీర్తనను యెహోవా భూమియంతట నింపేంతవరకు అది ముందుకు సాగిపోతుంది. “సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.” (కీర్తన 113:3) అనగా కొందరు భూ ప్రాణులు అనుదినము చేసే ఆరాధనకంటె ఇది ఉన్నతమైనది. సూర్యుడు తూర్పున ఉదయించి, భూమినంతటిని చుట్టి పడమట అస్తమిస్తాడు. సూర్యుడున్న ప్రతిచోటా అబద్ధమతము మరియు సాతాను సంస్థయొక్క బంధకములనుండి విడిపించబడిన ప్రజలందరిచే యెహోవా నామము స్తుతించబడును. ఎన్నటికిని ముగియనట్టి ఈ పాట ప్రస్తుతము యెహోవా అభిషక్త సాక్షులవలన మరియు ఆయన రాజైన యేసుక్రీస్తుకు భూ సంబంధులైన పిల్లలు కాబోయే వారిచే పాడబడుతున్నది. యెహోవాకు స్తుతులను పాడేవారుగా వారు ఎంతటి ఆధిక్యతను కలిగియున్నారు!
యెహోవాను పోలినవాడులేడు
7. కీర్తన 113:4లో యెహోవా సర్వాధిపత్యము ఏ రెండు విధములుగా గుర్తింపబడియున్నది?
7 కీర్తన రచయిత మాటలు ఇంకా ఇట్లున్నవి: “యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది.” (కీర్తన 113:4) ఇది దేవుని సర్వాధిపత్యముయొక్క రెండు విధములకు మన అవధానమును మళ్లిస్తుంది: (1) మహోన్నతుడైన యెహోవాకు, “అన్యజనులందరియెదుట మహోన్నతుడైన” వానికి వారు చేద నుండి జారు బిందువు వలెను, త్రాసుపై నున్న ధూళివలెను ఉన్నారు; (యెషయా 40:15; దానియేలు 7:18) (2) భౌతిక ఆకాశముల కంటెను, ఆయన మహిమ ఎంతో ఉన్నతముగా ఉన్నది. ఎందుకనగా దేవదూతలును ఆయన సర్వాధిపత్య చిత్తమును చేస్తున్నారు.—కీర్తన 19:1, 2; 103:20, 21.
8. ఆకాశము మరియు భూమిపై జరుగుతున్న సంగతులను గమనించుటకు ఎందుకు మరియు ఎట్లు యెహోవా వంగి చూస్తున్నాడు?
8 దేవుని ఔన్నత్యమునుబట్టి ప్రేరేపితుడైన కీర్తన రచయిత ఇలా అన్నాడు: “మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు.” (కీర్తన 113:5, 6) దేవుడు ఎంత గొప్పగా ఉన్నతుడయ్యాడంటే ఆకాశము, భూమిమీద జరుగుతున్నవాటిని గమనించుటకు ఆయన వంగిచూడవలసి వస్తుంది. యెహోవా ఎవరికంటెను తక్కువవాడుగానో లేక ఇతరులకు లోబడియుండవలసిన వానిగానో లేకున్ననూ, అల్పులైన పాపులయెడల కరుణా వాత్సల్యములను చూపుటకు ఆయన దీనత్వమును ప్రదర్శించుచున్నాడు. అభిషక్తులైన క్రైస్తవులకొరకు మరియు లోకములోని మానవజాతికొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును ‘ప్రాయశ్చిత్త బలిగా’ అనుగ్రహించుట ఆయన దీనత్వమును వ్యక్తపరచుటయే.—1 యోహాను 2:1, 2.
యెహోవా వాత్సల్యము గలవాడు
9, 10. ‘ప్రధానులతో కూర్చుండబెట్టుటకై దరిద్రులను’ దేవుడెట్లు లేవనెత్తును?
9 దేవుని వాత్సల్యమును నొక్కితెలియజేస్తూ, కీర్తన రచయిత ఇంకా ఇట్లంటున్నాడు: “ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను, కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి!” (కీర్తన 113:7-9) అవసరములో నున్న యథార్థవంతులను ఆయన విడిపించి, వారి స్థితిగతులను మార్చి, వారి యుక్తమైన అవసరతలను, కోరికలను తీర్చునని యెహోవా ప్రజలకు విశ్వాసమున్నది. ‘మహా ఘనుడును మహోన్నతుడునుయైనవాడు వినయముగలవారి ప్రాణమును, నలిగినవారి ప్రాణమును (హృదయమును NW) ఉజ్జీవింపజేయును.’—యెషయా 57:15.
10 ‘ప్రధానులతో కూర్చుండబెట్టుటకై యెహోవా దరిద్రులను ఎట్లు లేవనెత్తును’? దేవుని చిత్తమైనప్పుడు, ఆయన తన సేవకులను ప్రధానులతో సమానమైన స్థానములలో ఉంచుతాడు. ఐగుప్తులో ధాన్యాగారపు అధికారియైన యోసేపు విషయంలో ఆయన అలాగే చేశాడు. (ఆదికాండము 41:37-49) ఇశ్రాయేలీయులలో ప్రధానులతో లేక యెహోవా ప్రజల మధ్య అధికారముగల వారితో కూర్చొనుట కాపాడుకొనవలసిన ఆధిక్యతైయుండెను. ఈనాటి క్రైస్తవుల పెద్దలవలె, ఆ మనుష్యులకు దేవుని సహాయము ఆశీర్వాదము ఉండేది.
11. కీర్తన 113:7-9 ఆధునిక కాలములలోని యెహోవా ప్రజలకు ప్రత్యేకంగా అన్వయిస్తాయని ఎందుకు చెప్పవచ్చును?
11 ‘సంతులేనిదానిని సంతోషముగల తల్లిగా’ చేసే విషయమేమిటి? గొడ్రాలిగావున్న హన్నాకు దేవుడు ఒక కుమారున్ని—సమూయేలును అనుగ్రహించాడు. ఆమె ఆయనను దేవుని సేవకు అర్పించినది. (1 సమూయేలు 1:20-28) మరి ప్రాముఖ్యముగా యేసు మరియు సా.శ. 33 పెంతెకొస్తునాడు తన శిష్యులపైన పరిశుద్ధాత్మను క్రుమ్మరించుటతో మొదలుకొని దేవుని సూచనార్థక స్త్రీయైన పరలోక సీయోను, ఆత్మీయ కుమారులను ఉత్పత్తిచేయడం ప్రారంభించినది. (యెషయా 54:1-10, 13; అపొస్తలుల కార్యములు 2:1-4) బబులోను చెరనుండి యూదులను తమ స్వదేశమునకు తిరిగి తెచ్చినట్లే, “దేవుని ఇశ్రాయేలు” కు సంబంధించిన అభిషక్త శేషమును 1919లో బబులోను చెరనుండి విడిపించి, కీర్తన 113:7-9లోని మాటలు అన్వయించునట్లు ఆయన వారిని ఆత్మీయముగా బహుగా ఆశీర్వదించాడు. (గలతీయులు 6:16) యెహోవా యొక్క నమ్మకమైన సాక్షులుగా, ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము మరియు భూనిరీక్షణగల వారి సహవాసులు, కీర్తన 113లోని “ప్రజలారా (NW), యెహోవాను స్తుతించుడి!” అను చివరి మాటలకు హృదయపూర్వకంగా ప్రత్యుత్తరమిస్తున్నారు.
యెహోవా అద్వితీయతకు నిదర్శనము
12. కీర్తన 114 యెహోవాయొక్క అసమానతను ఎలా చూపుతుంది?
12 కీర్తన 114, ఇశ్రాయేలీయుల విషయంలో జరిగిన అసామాన్య సంఘటనలను పేర్కొంటూ యెహోవా యొక్క అసమానతను చూపుతున్నది. కీర్తన రచయిత ఇలా ఆలపించాడు: “ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.” (కీర్తన 114:1, 2) దేవుడు ఇశ్రాయేలీయులనువారికి భిన్నంగా అన్యభాష మాట్లాడే ఐగుప్తీయుల దాసత్వములోనుండి విడిపించెను. యెహోవా ప్రజలైన యూదా మరియు ఇశ్రాయేలీయులను పోల్చి పద్యకావ్యములో వర్ణించడం, దేవుడు ఈనాడు తన సేవకులందరిని విడిపించగలడని చూపుతుంది.
13. కీర్తన 114:3-6 ఎట్లు యెహోవా సర్వాధిపత్యమును చూపుతూ, దానిని పురాతన ఇశ్రాయేలీయుల అనుభవములకు అన్వయిస్తున్నది?
13 సమస్త సృష్టిపైన యెహోవాకుగల సర్వాధిపత్యము ఈ మాటలలో రుజువౌతున్నది: “సముద్రము దానిని చూచి పారిపోయెను, యొర్దాను నది వెనుకకు మళ్లెను. కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?” (కీర్తన 114:3-6) దేవుడు తన ప్రజలకు దాని నడుమ గుండా మార్గమేర్పరచినప్పుడు ఎర్ర సముద్రము “పారిపోయెను.” తిరిగి మళ్లిన నీరు ఐగుప్తీయులపై పడగా యెహోవా గొప్ప హస్తము చేసిన కార్యాన్ని ఇశ్రాయేలీయులు చూశారు. (నిర్గమకాండము 14:21-31) దైవిక శక్తి ప్రదర్శింపబడిన అటువంటి మరో సందర్భములో, ఇశ్రాయేలీయులు కనానుకు దాటి వెళ్లునట్లు యోర్దాను “వెనుకకు మళ్లినది.” (యెహోషువ 3:14-16) ధర్మశాస్త్ర నిబంధన ప్రవేశపెట్టబడిన సమయంలో సీనాయి పర్వతము ధూమమయమై కంపించినపుడు ‘కొండలు పొట్టేళ్లవలె గంతులు’ వేశాయి. (నిర్గమకాండము 19:7-18) కావున గాయకుడు తన కీర్తనను ముగించునప్పుడు నిర్జీవమైన సముద్రము, నది, కొండలు, గుట్టలు యెహోవాయొక్క బలప్రదర్శనకు బహుశా భీతినొంది మూర్చిల్లినవేమోనని సూచిస్తూ ఆ సంగతులను ప్రశ్నల రూపములో వ్రాశాడు.
14. మెరీబా మరియు కాదేషులలో యెహోవా శక్తివలన ఏమి జరిగింది, ఆయన ఆధునిక దిన సేవకులపై ఇదెట్లు ప్రభావము చూపవలెను?
14 యెహోవా శక్తిని ఉద్దేశిస్తూ, గాయకుడు ఇంకా ఇలా పాడాడు: “భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటిమడుగుగాను, చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు.” (కీర్తన 114:7, 8) ఆవిధముగా సూచనార్థకరీతిలో కీర్తన రచయిత ప్రభువును, సర్వ భూమికిని విశ్వపాలకుడైన యెహోవాయెదుట మానవజాతి భక్తిపూర్వకమైన వణకుతో నిలబడవలెనని సూచిస్తున్నాడు. నేడు ఆయన ఆత్మీయ ఇశ్రాయేలీయులకు వారి భూసంబంధ అనుచరులకు దేవుడైయున్నలాగే, ఇశ్రాయేలుకు లేక ‘యాకోబుకు దేవుడై’ యుండెను. అరణ్యమందలి మెరీబా మరియు కాదేషులలో ఇశ్రాయేలుకు అద్భుతరీతిగా నీటిని అందించి, “బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయ” శక్తిగలవాడని నిరూపించుకొనెను. (నిర్గమకాండము 17:1-7; సంఖ్యాకాండము 20:1-11) యెహోవాయొక్క మహాత్యమైన శక్తి, ఆయన వాత్సల్యకరమైన శ్రద్ధను గూర్చిన జ్ఞాపికలు, నేడు ఆయన సాక్షులు ఆయనయందు నిర్వివాదాంశముగా విశ్వాసముంచుటకు సరైన హేతువులనిస్తున్నవి.
విగ్రహ దేవుళ్లవంటివాడు కాడు
15. కీర్తన 115ను ఎట్లు పాడియుండ వచ్చును?
15 కీర్తన 115 మనలను యెహోవాయందు నమ్మికయుంచి ఆయనను స్తుతించుడని గట్టిగా పురికొల్పుతున్నది. సహాయము, ఆశీర్వాదము ఆయననుండే లభించునని సూచిస్తూ, విగ్రహములు నిరుపయోగమైనవని అది రుజువుచేస్తుంది. “యెహోవాకు భయపడి ఆయనయందు నమ్మికయుంచుడి” అని బహుశా ఒకరు పాడగా, “ఆయనవారికి సహాయము వారికి కేడెము” అని సమాజము ప్రత్యుత్తరమిచ్చియుంటుంది.—కీర్తన 115:11.
16. జనాంగముల విగ్రహములకును మరియు యెహోవాకును మధ్య ఏ తారతమ్యమున్నది?
16 కృపాసత్యములు, యథార్థమైన ప్రేమగల దేవుడైన యెహోవా నామమునకే మహిమ చెందాలిగాని మనకు కాదు. (కీర్తన 115:1) శత్రువులు అవహేళనచేస్తూ “వారి దేవుడేడి?” అని అడగవచ్చు. అయితే, యెహోవా ప్రజలు “మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు,” అని ప్రత్త్యుత్తరమివ్వగలరు. (2, 3 వచనములు) అన్యజనాంగముల విగ్రహములు ఏమియు చేయజాలవు. ఎందుకనగా వెండి, బంగారములతో అవి మనుష్యులవలన చేయబడిన బొమ్మలు. వాటికి నోరు, కండ్లు, చెవులు ఉన్నను అవి మాట్లాడవు, చూడవు, వినవు. వాటికి ముక్కులున్నను వాసన చూడవు, పాదములున్నను నడువలేవు, గొంతున్నను స్వరమును వినిపించలేవు. శక్తిహీనమైన విగ్రహములను చేయువారును, వాటియందు నమ్మికయుంచువారును వాటివలెనే నిర్జీవులైయుందురు.—4-8 వచనములు.
17. మృతులు యెహోవాను స్తుతించలేరు గనుక, మనము ఏమి చేయవలెను, ఏ ఉత్తరాపేక్షతో?
17 ఇశ్రాయేలునకు, అహరోను యాజక కుటుంబమునకు, దేవునికి భయపడువారందరికొక సహాయకుడు, రక్షణకేడెమని యెహోవాయందు నమ్మికయుంచునట్లు తదుపరి ఉద్బోధించబడినది. (కీర్తన 115:9-11) యెహోవాకు భయపడువారమై, ఆయనను అసంతోషపెట్టకూడదనే యుక్తమైన భయముతో దేవునియెడల విస్తారమైన భక్తిప్రదమైన గౌరవమును కలిగియున్నాము. “భూమ్యాకాశములను సృజించిన యెహోవా” యథార్థవర్తనులైన తన ఆరాధికులను దీవిస్తాడనియు మనము విశ్వాసము కలిగియున్నాము. (12-15 వచనములు) ఆకాశములు ఆయన సింహాసన స్థలము, భూమిని మాత్రము యథార్థత, విధేయత గల మానవజాతికి నిత్యగృహమగునట్లు దేవుడు చేసియున్నాడు. మౌనులై, స్మారకములేనివారు యెహోవాను స్తుతించలేరు గనుక, జీవించియున్న మనమే దానిని పూర్ణ భక్తి యథార్థతలతో చేయవలసియున్నాము. (ప్రసంగి 9:5) యెహోవాను స్తుతించువారు మాత్రమే నిత్యజీవమును అనుభవిస్తూ, నిత్యము యెహోవాను సన్నుతించి యుగయుగములు ఆయననుగూర్చి మాట్లాడుదురు. కావున యథార్థతతో “ప్రజలారా యెహోవాను స్తుతించుడి!” అను ఉద్బోధను లక్ష్యపెట్టువారితో యేకము కండి.—కీర్తన 115:16-18.
యెహోవా అద్భుత లక్షణములు
18, 19. యెహోవా లక్షణములు ఏయే విధములుగా ఆయనను అబద్ధ దేవుళ్ల నుండి ప్రత్యేకపరచుచున్నవి?
18 నిర్జీవమైన విగ్రహములవలె గాక యెహోవా సజీవుడైన దేవుడై, అద్భుత లక్షణములను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రేమకు ప్రతిరూపమై, “కనికరము, దయ, దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గలవాడు.” (నిర్గమకాండము 34:6; 1 యోహాను 4:8) పిల్లలు బలిగా అర్పించబడే క్రూరమైన కనానీయుల దేవుడగు మొలెకునకు ఆయన ఎంత భిన్నంగా ఉన్నాడు! ఈ దేవుని ప్రతిమ మానవ రూపంలో ఎద్దు తలను కలిగియున్నట్లు మానవరూపములో సూచించబడింది. ఈ విగ్రహము ఎర్రగా మారేంతగా వేడిచేయబడి, దానినుండి బారుగా చాపబడియున్న బాహువులపైనుండి పిల్లలు త్రోయబడగా, కొలిమివలె మండుచుండే దాని కడుపులో వారు పడతారు. కాని యెహోవా మాత్రము ఎంతో ప్రేమ కనికరముగలవాడు, నరులను బలితీసుకునే తలంపు ఆయన “హృదయమందైనను” కలుగలేదు.—యిర్మీయా 7:31.
19 యెహోవా ప్రధాన లక్షణములలో పరిపూర్ణమైన న్యాయము, అనంతమైన జ్ఞానము, సర్వోన్నతమైన శక్తి ఇమిడియున్నవి. (ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 12:13; యెషయా 40:26) మరి పురాణాలలోని దేవుళ్ల సంగతేమి? న్యాయమును అనుసరించే బదులు బబులోను దేవుళ్లు, దేవతలు పగతీర్చుకొనువారైయుండిరి. ఐగుప్తు దేవుళ్లు శ్రేష్టమైన వివేకవంతులుగా కాక, మానవ బలహీనతలుగలవారిగా వర్ణించబడ్డారు. ఇందులో ఆశ్చర్యమేమీలేదు, ఎందుకనగా అబద్ధ దేవుళ్లు, దేవతలు జ్ఞానముగలవారమని చెప్పుకొనే “వివేక శూన్యమైన” మనుష్యులవలన రూపించబడియున్నారు. (రోమీయులు 1:21-23) గ్రీకుల దైవాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కుట్రపన్నువారుగా పేర్కొనబడ్డారు. ఉదాహరణకు, పురాణాలనుబట్టి జియస్ తన తాతయ్య యురేనస్‌ను సింహాసనమునుండి తొలగించి అధికారము చేపట్టిన తన తండ్రి క్రోనస్‌ను సింహాసన భ్రష్టున్నిచేసి తన అధికారాన్ని దుర్వినియోగపరచాడు. అయితే పరిపూర్ణ ప్రేమ, న్యాయము, జ్ఞానము, శక్తిని ప్రదర్శించే జీవముగల సత్యదేవుడైన యెహోవాను సేవించి స్తుతించుట ఎంతటి ఆశీర్వాదకరము!
యెహోవా నిత్యస్తుతికి పాత్రుడు
20. యెహోవా నామమును స్తుతించుటకు రాజైన దావీదు ఏ కారణములనిస్తున్నాడు?
20 హల్లెలు కీర్తనలు చూపురీతిగా యెహోవా నిత్య స్తుతికి పాత్రుడైయున్నాడు. దావీదు మరియు తోటి ఇశ్రాయేలీయులు ఆలయ నిర్మాణమునకు కానుకలు సమర్పించినప్పుడు, సమాజము యెదుట ఆయన: “మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తము నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము,” అని పలికెను.—1 దినవృత్తాంతములు 29:10-13.
21. పరలోకమందలి సమూహముల ద్వారాను యెహోవా స్తుతింపబడుచున్నాడనుటకు ప్రకటన 19:1-6 ఏ ఆధారమునిస్తుంది?
21 యెహోవా పరలోకమందు నిత్యము కొనియాడబడి స్తుతించబడును. అపొస్తలుడైన యోహాను “పరలోకములో ఒక గొప్ప సమూహము” ఇలా చెప్పుట విన్నాడు: “ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను.” వారు మరలా “ప్రభువును స్తుతించుడి” అనగా, “యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును” అలాగే అనిరి. సింహాసనము నుండి స్వరము ఇలా వచ్చెను: “ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి” ఇంకను యోహాను: “అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము—సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి,’” అనుటను విన్నాడు.—ప్రకటన 19:1-6.
22. ఆయన వాగ్దానం చేసిన నూతన లోకములో యెహోవా ఎలా స్తుతింపబడతాడు?
22 పరలోక సమూహములు యెహోవాను స్తుతించుట ఎంత యుక్తమైనది! సమీపముగానున్న ఆయన నూతన లోకములో, ఈ విధానాంతమందు తప్పించబడువారితో కూడా పునరుత్థానులగు యథార్థవంతులు యెహోవాను స్తుతించుటలో యేకమగుదురు. ఉన్నతమైన కొండలు దేవునికి స్తుతిగీతములు పాడును. పచ్చని గుట్టలు ఫలభరితమైన వృక్షాలు ఆయనను స్తుతిస్తాయి. జీవిస్తూ, శ్వాసించే ప్రతిప్రాణి, సర్వసమూహముగా స్వరములు కలిపి యెహోవా నామమును స్తుతించును. (కీర్తన 148) ఆ సంతోషభరిత గుంపులో నీ స్వరము కూడా వినిపించునా? నీ జీవిత సంకల్పము కూడా అదేయై ఉండాలి. ఎందుకనగా, మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?
మీరెట్లు సమాధానమిస్తారు?
◻ యెహోవా దేవుని ఎందుకు స్తుతించాలి?
◻ ఏయే విధములుగా యెహోవా దేవుడు పోల్చజాలనివాడు?
◻ యెహోవా వాత్సల్యము గలవాడనుటకు ఏ నిదర్శనమున్నది?
◻ నిర్జీవమైన విగ్రహములనుండి, అబద్ధ దైవాలనుండి యెహోవా ఎట్లు ప్రత్యేకముగా ఉన్నాడు?
◻ యెహోవా పరలోకమందును, భూమిమీదను నిత్యస్తుతిని పొందునని మనమెందుకు చెప్పగలము?
[9వ పేజీలోని చిత్రం]
పస్కాభోజన సమయములో హల్లెలు కీర్తనలను పాడేవారు