సిలువ—క్రైస్తవత్వపు గురుతా?
శతాబ్దములనుండి వేలాదిమంది సిలువను క్రైస్తవత్వపు గురుతుగా అంగీకరించారు. అయితే అది నిజమా? యథార్థంగా అలా నమ్మిన అనేకులు సిలువ కేవలం క్రైస్తవమత సామ్రాజ్యానికి సంబంధించిన గురుతేకాదని తెలుసుకొనుటకు ఆశ్చర్యపోయారు. ఎందుకనగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవేతర మతాలలోను అది విస్తారంగా ఉపయోగించబడినది.
ఉదాహరణకు 1500 శతకపు తొలి భాగంలో ఎర్నాన్ కార్టెస్ మరియు అతని “క్రైస్తవ” సైన్యము, ఎజెటెక్ సామ్రాజ్యం మీదికి యుద్ధానికి సిద్ధపడి వెళ్తూ, “నిజ విశ్వాసముతో పరిశుద్ధ సిలువ గురుతును అనుకరిద్దాము. ఈ గురుతు ద్వారానే మనము జయిస్తాము” అని చాటించే బ్యానర్లను పట్టుకొని వెళ్లారు. కాని అన్యులైన వారి శత్రువులు కూడా దాదాపు తమలాంటి సిలువనే పూజిస్తున్నారని తెలుసుకొని వారు కచ్చితంగా ఆశ్చర్యపోయి వుంటారు. ది గ్రేట్ రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కార్టెస్ మరియు అతని అనుచరులు, ఎజ్‌టెక్ ప్రజల నరబలులు క్రైస్తవత్వమునకు పోలిన సాతాను సంబంధమగు . . . వాయు, వరుణ దేవుళ్లయొక్క సిలువలాంటి గురుతులను చూసి భయపడి వెనుకంజవేశారు.”
లా నేసియన్ అనే వార్తా పత్రిక సంపాదకీయములో హోసా ఆల్బర్ట్ ఫర్‌కే సూచించే దేమనగా 18వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో మధ్య మరియు దక్షిణ అమెరికాలలో దొరికిన సిలువ గురుతులవంటివాటి పుట్టు పూర్వోత్తరాలను వాటి అర్థాన్ని గూర్చి “మానవ శరీర శాస్త్రజ్ఞులు పురావస్తు శాస్త్రజ్ఞుల మధ్య తీవ్రమైన, ఉత్తేజభరితమైన చర్చలు మొదలయ్యాయి. వారిలో కొందరు సిలువ కేవలం “క్రైస్తవ” గురుతు మాత్రమేనని నిరూపించ ప్రయత్నించి, అమెరికాలలో చరిత్రాత్మకమైన కొలంబస్ సముద్ర యానమునకు ముందే సువార్త ప్రకటించబడిందనే సిద్ధాంతాన్ని రూపించారు. నిరూపించబడని ఈ అభిప్రాయము నిరాధారమైనదని ఎంచి త్రోసిపుచ్చవలసివచ్చెను.
కాలముగడిచే కొలది, ఈ రంగములో కనుగొనబడిన విషయాలు ఈ చర్చలన్నిటికి తెరవేసినవి. ఫర్క్ గమనించినట్లు: “స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా 1893లో ప్రచురించబడిన రచనలో ఉత్తర అమెరికాకు తొలి ఐరోపా వారు రాకముందే . . . ఈ గురుతు పూజింపబడుతుందని నిరూపించబడింది. . . . ఇది జీవమునకు మూలమైన శక్తుల ఆరాధనా గుర్తుగా అన్ని జాతులలోను ఉన్నదనే సిద్ధాంతాన్ని స్థిరపరచినది.”
మారణాయుధంగావున్న సిలువపై కాదుగాని, సాధారణమైన మ్రానుపైనే లేక స్టౌరాస్ పైనే యేసు వ్రేలాడదీయబడి చంపబడెనని బైబిలు చూపుతుంది. మత్తయి 27:40లో కన్పించే ఈ గ్రీకు పదము భవన నిర్మాణ పునాదులలో ఉపయోగించబడేటువంటి నిలువు స్తంభము లేక దూలము అనే మూల భావాన్ని కలిగివుంది. అందుచేత, సిలువ ఎప్పుడునూ నిజమైన క్రైస్తవత్వమునకు సూచనగా లేదు. యేసుక్రీస్తు తన అనుచరులతో “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు” అని చెప్పినప్పుడు నిజమైన క్రైస్తవత్వముయొక్క గుర్తును లేక సూచనను ఆయన తెలియజేసెను.—యోహాను 13:35.