పాపమును నీవెట్లు దృష్టిస్తావు?
“తన ప్రార్థనలో మా పాపములు క్షమించుమని ఆమె ప్రతిసారీ ఎందుకు అడుగుతుంది? అలా అడుగుతుంటే నేనొక నేరస్థురాలినేమో అని నాకన్పిస్తుంది” అని యెహోవాసాక్షితో బైబిలు పఠనం చేస్తున్న ఒక గృహిణి ఫిర్యాదు చేసింది. ఈ స్త్రీ వలెనే నేడు, అనేకులకు తాము నేరం చేస్తే తప్ప తమ పాపముల విషయం వారికి తెలియదు.
యూదా-క్రైస్తవ మతాలలో బోధింపబడినట్లుగా వారసత్వ పాపమును గూర్చిన నమ్మకము లేని తూర్పు దేశాల సంప్రదాయ ప్రజల విషయంలో ప్రత్యేకంగా ఇది వాస్తవము. (ఆదికాండము 3:1-5, 16-19; రోమీయులు 5:12) ఉదాహరణకు, షింటో మతస్థులు పాపాన్ని, యాజకుని చేతికర్ర చివర కట్టబడివుండే కాగితం లేదా గుడ్డముక్కతో తుడిస్తే సులభంగా తుడిచి పెట్టుకొనిపోగల మలినంగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో చేసిన పాపానికి పశ్చాత్తాపము అవసరం లేదు. ఎందుకు? “చెడు క్రియలేకాదు, అదుపు చేయలేని ప్రకృతి వైపరీత్యాలు కూడా ట్సూమీ [పాపము] అని పిలువబడతాయని” కొడాన్‌షే ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ జపాన్ వివరిస్తుంది. ట్సూమీ అనే ప్రకృతి వైపరీత్యాలు మనుష్యుల మూలంగా కలుగలేదు, గాని అవి శుద్ధీకరణ ఆచారాల ద్వారా ఉనికిలో లేకుండా చేయబడిన పాపాలుగా పరిగణించబడ్డాయి.
అది ఎటువంటి పాపమైనను, ఉద్దేశపూర్వకముగా చేయబడిన ఏ దుష్టకార్యమైనను (చట్టము ద్వారా శిక్షింపబడగల నేరాలు మినహా) శుద్ధీకరణ ఆచారము ద్వారా తుడిచివేయబడ గలదనే తలంపుకు నడిపింది. “జపాన్‌లో రాజకీయ శుద్ధీకరణ ఆచారం,” అనే శీర్షిక క్రింద ది న్యూయార్క్ టైమ్స్ అటువంటి మానసిక దృక్పధాన్ని సూచించి, కుంభకోణాలలో ఇరుక్కున్న రాజకీయ నాయకులు ఓటర్లు తమను తిరిగి ఎన్నుకున్నప్పుడు వారు తమనుతాము “శుద్ధీకరించు” కున్నామని పరిగణిస్తారని వివరించినది. ఆ విధంగా, సరియైన దిద్దుబాటు జరుగనందున, అటువంటి కుంభకోణాలకు మరలా పాల్పడే అవకాశం వుంది.
సంసార, లేదా పునర్జన్మము మరియు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించే బౌద్ధులు విభిన్న తలంపులను కలిగియున్నారు. “కర్మన్ సిద్ధాంతం ప్రకారం, దుష్ప్రవర్తన చెడు ఫలితాన్నిచ్చి, పదేపదే దుష్క్రియలుచేసే స్వభావాన్ని కలిగిస్తే, సత్ప్రవర్తన సంతోషాన్ని, ధన్యతనిచ్చి, అటువంటి సత్క్రియలు చేయు స్వభావాన్ని కలిగిస్తుంది” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తున్నది. మరొక మాటలో చెప్పాలంటే పాప ప్రవర్తన చెడు ఫలాలను ఫలింపజేస్తుంది. ఈ జీవితంలో పాపంచేస్తే చాలా సంవత్సరాల తర్వాతి బావి జీవితాలలో దాని ఫలితం కన్పిస్తుందని కొన్ని కర్మలలో చెప్పబడినట్లు, కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతముతో ముడిపెట్టబడింది.
ఈ బోధ దాని విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కర్మసిద్ధాంతాన్ని దృఢంగా నమ్మిన ఒక బౌద్ధ స్త్రీ ఇలా చెప్పింది: “నాకు తెలియక జన్మతావచ్చినదాని నిమిత్తం నేను బాధననుభవించుటలో అర్థంలేదని తలంచాను. అది నా కర్మని నేను అంగీకరించాల్సి వచ్చింది. ఏవో సూత్రాల్ని వల్లించడం, సాధ్యమైనంత మంచి జీవితాన్ని జీవించడానికి బహుగా ప్రయత్నించడం నా సమస్యల్ని తీర్చలేదు. వ్యధతో, అసంతృప్తితో నిండి, అన్నివేళలా ఫిర్యాదుచేసే దానిగా నేను తయారయ్యాను.” దుష్ప్రవర్తనా ఫలితాలను గూర్చిన బౌద్ధ సిద్ధాంతం తనకు విలువలేదనే భావాన్ని ఆమెలో నింపింది.
మరొక తూర్పుదేశ మతమగు కన్‌ఫ్యూషనిజమ్, మానవుని దుష్ప్రవర్తనతో వ్యవహరించే మరొక భిన్నమైన బోధచేసింది. ముగ్గురు గొప్ప కన్‌ఫ్యూషియన్ తాత్వికులలో ఒకడైన ష్యూయన్‌డ్జూ చెప్పిన ప్రకారం, మానవ నైజమే చెడ్డది, అది స్వార్థముతో ప్రవర్తించును. పాప స్వభావాలను కలిగియున్న మనుష్యుల మధ్య సామాజిక క్రమాన్ని కాపాడుటకు, సరైన, గౌరవప్రదమైన, మరియు క్రమపద్ధతి అను అర్థంగల లీ ప్రాముఖ్యతను ఆయన నొక్కితెల్పాడు. మరొక కన్‌ఫ్యూషియన్ తాత్వికుడైన మెంగ్‌ట్జు, మానవ నైజాన్ని గూర్చి భిన్నమైన దృక్పధాన్ని వ్యక్తపరచినను, సామాజిక రుగ్మతల ఉనికిని అతడు గుర్తించాడు, మరియు మంచివానిగా ఉండాలనే మానవ స్వభావాన్ని నమ్మి, పరిష్కారానికి స్వయం కృషి మీద ఆధారపడ్డాడు. ఏమైనను, కన్‌ఫ్యూషియన్ తాత్వికులు లోకమందున్న పాపానికి వ్యతిరేకంగా పోరాడుటకు విద్య, శిక్షణల ప్రాముఖ్యతను బోధించలేదు. లీ యొక్క అవసరతను వారి బోధలు అంగీకరించినను, పాపము మరియు చెడును గూర్చిన వారి అవగాహన అస్పష్టమై యుండెను.—కీర్తన 14:3; 51:5 పోల్చుము.
పాశ్చాత్యమందు కనుమరుగౌతున్న పాపమును గూర్చిన అవగాహన
పాశ్చాత్యమందు, పాపమును గూర్చిన దృక్పధాలు ఆచారబద్ధంగా స్పష్టంగా ఉన్నాయి. మరియు పాపము ఉన్నదని, దాన్ని విడనాడాలని అనేకమంది ఒప్పుకున్నారు. అయితే, పాపము యెడల పాశ్చాత్యుల దృక్పధం మారుతున్నది. అది మనం విసర్జించాల్సిన “దోషభావంగల” అంతరాత్మ ప్రబోధం, అని పిలుస్తూ అనేకమంది పాపాన్ని గుర్తించుట లేదు. దాదాపు 40 సంవత్సరాలకంటే ముందు, పోప్ పయస్ XII ఇలా విలపించాడు: “పాపాన్ని గుర్తించకపోవడమే ఈ శతాబ్దంచేసిన పాపం.” కాథోలిక్ వారపత్రికయగు లీ పాలెరెన్ ప్రచురించిన సర్వే ప్రకారం, అత్యధిక ప్రజలు తాము రోమన్ కాథోలిక్కులమని చెప్పుకునే ఫ్రాన్స్ జనాబాలో 90 శాతం మంది, ఆశ్చర్యంగొల్పే రీతిలో పాపాన్ని ఎంతమాత్రం నమ్మడం లేదు.
నిజానికి, ఇటు ప్రాచ్యమందు అటు పాశ్చాత్యమందు అనేకమంది ప్రజలు పాపమున్నదనే విషయాన్నే లక్ష్యపెట్టకుండా తమకేమీ పట్టనట్లు జీవిస్తున్నట్లు కన్పిస్తున్నది. అయితే, పాపము అసలు ఉనికిలోనే లేదని దాని భావమా? మనము సురక్షితముగా దానిని అలక్ష్యము చేయగలమా? పాపము ఎప్పుడైనా లేకుండా పోతుందా?