కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 7/15 పేజీలు 4-7
  • పాపము ఇక లేనప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాపము ఇక లేనప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవుడు—పాపరహితునిగా సృష్టించబడ్డాడు
  • పాపము యొక్క ఆవిర్భావం
  • మనస్సాక్షి ‘నిందిస్తుంది’ లేక ‘మన్నిస్తుంది’
  • పాపమునుండి విడుదల—ఏ విధంగా?
  • క్రీస్తు విమోచన క్రయధనం మన కొరకు చెయ్యగలిగేది
  • క్రీస్తు విమోచన క్రయధనం—దైవిక రక్షణ మార్గము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పాపరహిత లోకము—ఎలా సాధ్యము?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవా “ఎంతోమంది కోసం విమోచన క్రయధనం” ఏర్పాటు చేశాడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యేసు రక్షించును —కానీ ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 7/15 పేజీలు 4-7

పాపము ఇక లేనప్పుడు

“మనం పాపములోనే జన్మించామా?” ఆ ప్రశ్న, అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న ఓ విద్యార్థి బైబిల్ని అధ్యయనం చేయడం ఆరంభించిన వెంటనే ఆయన్ని కలవరపెట్టింది. ఆయన హిందూమతానికి చెందినవాడైనందున, వారసత్వంగా సంక్రమించే పాపాన్ని గూర్చిన ఆలోచన ఆయనకు బొత్తిగా తెలియదు. కానీ పాపము గనుక వారసత్వంగా సంక్రమించేదైతే, దాని వాస్తవికతను ఒప్పుకోకపోవడంగానీ లేక ఉపేక్షించడంగానీ వ్యర్థమేనని ఆయన తర్కించాడు. ఈ ప్రశ్నకు జవాబును ఎవరైనా ఎలా కనుగొనగలరు?

పాపము గనుక వారసత్వంగా సంక్రమించేదైతే, దానికొక ఆరంభమంటూ తప్పక ఉండివుండాలి. మొదటి మానవుడు తన సంతానానికి ఈ దుష్ట లక్షణాల్ని సంక్రమింపచేసేలా దుష్టునిగా సృష్టించబడ్డాడా? లేక ఈ లోపం తర్వాత వృద్ధిచెందిందా? కచ్చితంగా పాపము ఎప్పుడు ఆరంభమైంది? మరో వైపున, పాపము బాహ్యమైనదైతే, దుష్టత్వ స్వభావమైతే లేక సిద్ధాంతమైతే దాని నుండి ఎప్పటికైనా విడుదలను పొందుతామనే నిరీక్షణను మనం కల్గివుండగలమా?

హిందూ విశ్వాసం ప్రకారంగా, బాధా దుష్టత్వాలు సృష్టికి అనుషంగికాలై ఉన్నాయి. “బాధ [లేక దుష్టత్వం], దీర్ఘకాలిక కీళ్లరోగం వంటిది. అది ఒక చోటనుండి మరోచోటుకు కదులుతుందేగానీ దాన్ని పూర్తిగా నివారించలేం” అని ఓ హిందూ విద్వాంసుడు తెలియజేశాడు. నిశ్చయంగా దుష్టత్వం, లిఖించబడిన చరిత్రయందంతటా మానవ లోకంలో ఓ భాగంగావుంది. ఇది మానవజాతి చరిత్ర రికార్డులకు మునుపే ఉన్నట్లైతే, దాని ఆవిర్భావాన్ని గూర్చిన విశ్వసనీయమైన జవాబులు మానవునికన్నా ఉన్నతమైన మూలాన్నుండే రావాల్సివుంది. జవాబులు దేవున్నుండే రావాలి.—కీర్తన 36:9.

మానవుడు—పాపరహితునిగా సృష్టించబడ్డాడు

మానవ సృష్టిని గూర్చి వేదాల్లో ఇవ్వబడిన వివరణలు అలంకారికమైనవని హిందూ తత్వవేత్తయైన నిఖిలానంద ఒప్పుకుంటున్నాడు. అదే విధంగా, తూర్పుదేశాలకు చెందిన మతాల్లో అనేకం, సృష్టిని గూర్చిన పుక్కిట పురాణ వివరణలను మాత్రమే ఇస్తున్నాయి. కానీ, మొదటి మానవ సృష్టిని గూర్చిన బైబిలు వృత్తాంతాన్ని విశ్వసించేందుకు తార్కికమైన, శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయి.a దాని మొట్టమొదటి అధ్యాయం ఇలా చెబుతోంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.”—ఆదికాండము 1:27.

“దేవుని స్వరూపమందు” సృజించబడడం అంటే అర్థమేమిటి? సరళంగా దాని భావమిదే: జంతువులనుండి తనను వేరుపర్చే న్యాయమూ, జ్ఞానమూ, ప్రేమావంటి దైవిక లక్షణాల్ని కల్గివుంటూ దేవుని పోలికచొప్పున మానవుడు చేయబడ్డాడు. (కొలొస్సయులు 3:9, 10 పోల్చండి.) ఈ లక్షణాలు అతనిని నైతిక స్వేచ్ఛాచిత్తంగల వానిగా చేస్తూ మంచినిగానీ లేక చెడునుగానీ ఎంపికచేసుకునే సామర్థ్యాన్ని అతనికి ఇచ్చాయి. మొదటి మానవుడు సృష్టించబడినప్పుడు అతనిలో ఏ పాపమూ లేదు, అతని జీవితంలో ఏ విధమైన దుష్టత్వంగానీ లేక బాధగానీ లేదు.

ఆదామను మనుష్యునిపై యెహోవా దేవుడు ఈ ఆజ్ఞను ఉంచాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెద[వు].” (ఆదికాండము 2:16, 17) విధేయత చూపించేందుకు ఎంపికచేసుకోవడం ద్వారా, ఆదాము అతని భార్యయైన హవ్వ తమ సృష్టికర్తకు స్తుతినీ ఘనతనూ తెచ్చి, పాపములేకుండా నిలిచివుండగలిగే వారు. మరో వైపున, అవిధేయతాపూర్వకమైన చర్య, దేవుని పరిపూర్ణ కట్టడల్ని చేరుకోవడంలో వాళ్ల వైఫల్యాన్ని సూచిస్తుంది. అది వాళ్లను అపరిపూర్ణులుగా అంటే పాపభరితులుగా చేస్తుంది.

ఆదాము హవ్వలు దివ్యత్వంతో సృష్టించబడలేదు. అయితే, వాళ్లు తగినన్ని దైవిక లక్షణాల్నీ అలాగే నైతిక నిర్ణయాల్ని తీసుకొనే సామర్థ్యాన్నీ కల్గివున్నారు. దేవుని సృష్టిగా, వాళ్లు పాపరహితులుగా లేక పరిపూర్ణులుగా ఉన్నారు. (ఆదికాండము 1:31; ద్వితీయోపదేశకాండము 32:4) వాళ్లు సృష్టించబడడంతో, అంతకు మునుపు యుగాల తరబడి దేవునికీ విశ్వానికీ మధ్యనున్న పొందికకు భంగం వాటిల్లలేదు. మరైతే పాపమెలా ఆరంభమైంది?

పాపము యొక్క ఆవిర్భావం

పాపము ఆత్మలోకంలోనే మొదట సంభవించింది. భూమినీ మానవున్నీ సృష్టించడానికి మునుపు, దేవుడు తెలివైన ఆత్మ ప్రాణుల్ని అంటే దేవదూతల్ని సృష్టించాడు. (యోబు 1:6; 2:1; 38:4-7; కొలొస్సయులు 1:15-17) ఈ దేవదూతల్లో ఒకడు తన స్వంత అందాన్నీ, తెలివినీ ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాడు. (యెహెజ్కేలు 28:13-15 పోల్చండి.) పిల్లల్ని కనమని ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చిన ఉపదేశాన్నిబట్టి, యావత్‌భూమీ త్వరలోనే నీతిమంతులైన ప్రజలతో నింపబడుతుందనీ, మరి వాళ్లందరూ దేవున్ని ఆరాధిస్తారనీ ఆ దేవదూత గ్రహించగలిగాడు. (ఆదికాండము 1:27, 28) వాళ్ల ఆరాధనను తాను పొందాలని ఈ ఆత్మ ప్రాణి కోరుకున్నాడు. (మత్తయి 4:9, 10) ఈ కోరికనే తలపోసుకుంటూ ఉండడం, చెడునడవడిని చేపట్టడానికి అతన్ని నడిపించింది.—యాకోబు 1:14, 15.

ఓ సర్పంద్వారా హవ్వతో మాట్లాడుతూ, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినడాన్ని నిషేధించడం ద్వారా దేవుడు ఆమె కల్గివుండాల్సిన జ్ఞానాన్ని కల్గివుండకుండా చేస్తున్నాడని తిరుగుబాటుదారుడైన ఆ దేవదూత చెప్పాడు. (ఆదికాండము 3:1-5) అలా చెప్పడం, ఓ విద్వేషపూరితమైన అబద్ధమే అంటే ఓ పాపభరితమైన కార్యమే. ఈ అబద్ధాన్ని చెప్పడం ద్వారా ఆ దేవదూత తనను తాను పాపిగా చేసుకున్నాడు. తత్ఫలితంగా, అతడు అపవాదియనీ అంటే కొండెములు చెప్పేవాడనీ అలాగే సాతాననీ అంటే దేవునిని ఎదిరించేవాడనీ పిలువబడ్డాడు.—ప్రకటన 12:9.

ఒప్పింపచేసే సాతాను వాదన హవ్వపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. శోధకుని మాటలపై ఆమె తన నమ్మకాన్ని ఉంచుతూ, మోసగించబడడానికీ, నిషేధిత వృక్ష ఫలాల్లో కొన్నిటిని భుజించడానికీ తనను తాను నిరోధించుకోలేక పోయింది. ఆమె భర్తయైన ఆదాము, ఆ ఫలాల్ని భుజించడంలో ఆమెతో చేరాడు, తద్వారా వారిరువురూ పాపులయ్యారు. (ఆదికాండము 3:6; 1 తిమోతి 2:14) స్పష్టంగా, దేవునికి అవిధేయత చూపించడానికి ఎంపికచేసుకోవడం ద్వారా, మన ఆది తల్లిదండ్రులు పరిపూర్ణతను కోల్పోయి తమ్మును తాము పాపులుగా చేసుకున్నారు.

మరి ఆదాము హవ్వల సంతానం విషయమేమిటి? బైబిలు ఇలా వివరిస్తోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) వంశానుగత సూత్రం అప్పటికే పనిచేయడం ప్రారంభించింది. ఆదాము తనకు లేనివాటిని తన సంతానానికి అందించలేకపోయాడు. (యోబు 14:4) వారి పిల్లలు గర్భంలో పడినప్పటికే, ఆది దంపతులు పరిపూర్ణతను కోల్పోయి పాపులుగా ఉన్నారు. తత్ఫలితంగా, మనమందరమూ—ఏ మినహాయింపూ లేకుండా—వారసత్వంగా సంక్రమించే పాపాన్ని కల్గివున్నాం. (కీర్తన 51:5; రోమీయులు 3:23) ఫలితంగా, పాపము దుష్టత్వాన్నీ బాధల్నీ తప్ప మరిదేన్నీ ఉత్పన్నం చేయలేకపోయింది. అంతేగాక, దాని మూలంగానే మనమందరమూ వృద్ధాప్యానికి ఎదిగి మరణిస్తున్నాం, ఎందుకంటే “పాపమువలన వచ్చు జీతము మరణము.”—రోమీయులు 6:23.

మనస్సాక్షి ‘నిందిస్తుంది’ లేక ‘మన్నిస్తుంది’

మొదటి మానవ జత ప్రవర్తనపై పాపము చూపిన ప్రభావాన్ని కూడా పరిశీలించండి. వాళ్లు తమ శరీర భాగాల్ని కప్పుకొని, దేవున్నుండి తమను తాము మరుగుపర్చుకోవడానికి ప్రయత్నించారు. (ఆదికాండము 3:7, 8) ఆ విధంగా, పాపము వాళ్లు అపరాధులుగా భావించేందుకూ, చింతించేందుకూ, సిగ్గుపడేందుకూ కారణమయ్యింది. ఈ భావోద్రేక లక్షణాలు నేడు మానవజాతికి ఎంతో సుపరిచితం.

అవసరతలో ఉన్న ఒకరిపట్ల దయ చూపించకపోయినందున బాధనుకల్గించే భావాల్ని అనుభవించకుండా ఉన్న వారెవరు, ఎన్నడూ అనరాని మాటల్ని అన్నందున పశ్చాత్తాపపడకుండా ఉన్న వారెవరు? (యాకోబు 4:17) అలాంటి కలతపర్చే భావాల్ని మనమెందుకు కల్గివుంటాం? ‘ధర్మశాస్త్రసారము మన హృదయాల్లో రాయబడిందని’ అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. మన మనస్సాక్షి మొద్దుబారిపోతే తప్ప, ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఉల్లంఘించినా అది అంతర్గతమైన కల్లోలాన్ని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి మనల్ని ‘నిందించేది’ లేక ‘మన్నించేది’ మనస్సాక్షే. (రోమీయులు 2:15; 1 తిమోతి 4:2; తీతు 1:15) మనం దాన్ని గ్రహించినా లేక గ్రహించకపోయినా, మనం తప్పు చేశామనే అంటే పాపము చేశామనే అంతర్గత భావనను కల్గివున్నాం!

పౌలుకు తన పాపభరితమైన ధోరణులను గురించి బాగా తెలుసు. “మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది” అని ఆయన ఒప్పుకున్నాడు. “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” కాబట్టి పౌలు ఇలా అడిగాడు: “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?”—రోమీయులు 7:21-24.

పాపమునుండి విడుదల—ఏ విధంగా?

“హిందూ మత సాంప్రదాయంలో మోక్షమంటే పునరావృతమయ్యే జనన మరణాల నుండి విడుదలపొందడమే”నని ఓ విద్వాంసుడు చెబుతున్నాడు. ఓ పరిష్కారంగా, బౌద్ధమతం నిర్వాణాన్ని అంటే బాహ్య వాస్తవికతను ఉపేక్షించే ఒక స్థితిని అదే విధంగా సూచిస్తోంది. వారసత్వంగా సంక్రమించే పాపము అనే సిద్ధాంతాన్ని గ్రహించకుండా, హిందూమతం భవబంధనాల నుండి (ఉనికి నుండి) తప్పించుకోవడాన్ని మాత్రమే వాగ్దానం చేస్తోంది.

మరో వైపున, బైబిలు తెలియజేస్తున్న విమోచనా విధానం పాపభరితమైన స్థితిని వాస్తవికంగా తొలగించడానికి దారితీస్తుంది. అపొస్తలుడైన పౌలు తాను పాపమునుండి ఎలా విడుదలను పొందగలను అని అడిగిన తర్వాత, ఆయనే ఇలా జవాబిస్తున్నాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:25) అవును, విడుదల దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది.

మత్తయి సువార్త ప్రకారంగా, ‘మనుష్యకుమారుడైన’ యేసుక్రీస్తు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” వచ్చాడు. (మత్తయి 20:28) 1 తిమోతి 2:6వ వచనంలో నమోదుచేయబడినట్లుగా, యేసు “అందరికొరకు [“తత్సమానమైన,” NW] విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను” అని పౌలు రాశాడు. “విమోచన క్రయధనము” అనే మాట చెరలోవున్న వారి విడుదలకోసం మూల్యం చెల్లించడాన్ని సూచిస్తోంది. అది తత్సమానమైన విమోచన క్రయధనము అనే వాస్తవం, న్యాయం యొక్క చట్టపు త్రాసును సరితూగేలా చేయడంలో ఆ మూల్యానికున్న అమోఘమైన సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. కానీ ఒక మనుష్యుని మరణం, ‘అందరికొరకు తత్సమానమైన విమోచన క్రయధనముగా’ ఎలా పరిగణించబడగలదు?

యావత్‌ మానవజాతినీ ఆదాము పాపానికీ మరణానికీ అమ్మివేశాడు, అందులో మనం కూడా ఉన్నాము. తాను చెల్లించిన మూల్యం లేక జుల్మానా, తన పరిపూర్ణ మానవ జీవితమే. దీన్ని భర్తీచేయడానికి, మరో పరిపూర్ణ మానవ జీవితాన్ని అంటే ఓ తత్సమానమైన విమోచన క్రయధనాన్ని చెల్లించాలి. (నిర్గమకాండము 21:23; ద్వితీయోపదేశకాండము 19:21; రోమీయులు 5:18, 19) ఏ అపరిపూర్ణ మానవుడూ ఈ విమోచన క్రయధనాన్ని చెల్లించలేడు గనుక దేవుడు తన అనంతమైన జ్ఞానం చొప్పున ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఓ మార్గాన్ని తెరిచాడు. (కీర్తన 49:6, 7) ఆయన తన అద్వితీయ కుమారుని పరిపూర్ణ జీవాన్ని పరలోకం నుండి భూమిపైనున్న ఒక కన్య గర్భంలోనికి మార్చి, ఆయన్ని ఓ పరిపూర్ణ మానవునిగా జన్మించనిచ్చాడు.—లూకా 1:30-38; యోహాను 3:16-18.

మానవజాతిని విమోచించే పనిని నెరవేర్చేందుకు, యేసు తాను భూమిపై ఉన్న కాలమంతటిలోనూ తన యథార్థతను కాపాడుకోవాల్సి వచ్చింది. ఆయన అలానే కాపాడుకున్నాడు. తర్వాత ఆయన బలిగా మరణించాడు. ఈ విధంగా యేసు ఓ పరిపూర్ణ మానవ జీవము విలువ అంటే తన స్వంత జీవము విలువ మానవజాతిని విమోచించడం కోసం విమోచన క్రయధనంగా చెల్లించేందుకు కచ్చితంగా లభ్యమయ్యేలా చేశాడు.—2 కొరింథీయులు 5:14; 1 పేతురు 1:18, 19.

క్రీస్తు విమోచన క్రయధనం మన కొరకు చెయ్యగలిగేది

యేసు విమోచన క్రయధన బలి ఇప్పుడు కూడా మనకు ప్రయోజనకరం కాగలదు. దానియందు విశ్వాసాన్ని ఉంచడం ద్వారా, మనం దేవునిచే పరిశుభ్రపర్చబడిన వారిగా దృష్టించబడగలం, అలాగే యెహోవా దేవుని ప్రేమపూర్వకమైన వాత్సల్యంతో కూడిన సంరక్షణ క్రిందకు రాగలం. (అపొస్తలుల కార్యములు 10:43; రోమీయులు 3:21-24) బహుశా మనం చేసిన పాపాల్నిబట్టి అపరాధ భావంతో కృంగిపోవడానికి బదులు, విమోచన క్రయధనం ఆధారంగా దేవునినుండి మనం నిర్భయంగా క్షమాపణను పొందగలం.—యెషయా 1:18; ఎఫెసీయులు 1:7; 1 యోహాను 2:1, 2.

రాబోవు కాలంలో, విమోచన క్రయధనం పాపము మూలంగా ఏర్పడిన రోగగ్రస్థమైన మానవజాతి పరిస్థితి పూర్తిగా స్వస్థపర్చబడడం సాధ్యమయ్యేలా చేస్తుంది. దేవుని సింహాసనం దగ్గర నుండి వస్తున్న “జీవజలముల నది”ని గురించి బైబిల్లోని చివరి పుస్తకం వర్ణిస్తోంది. ఆ నదికి ఇరువైపులా “జనములను స్వస్థపరచుటకై” ఆకులను కల్గివున్న విస్తారమైన ఫల వృక్షాలు ఉన్నాయి. (ప్రకటన 22:1, 2) యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా పాప మరణాలనుండి మానవజాతిని శాశ్వతంగా విడుదల చేసేందుకై సృష్టికర్త చేసిన అద్భుతమైన ఏర్పాటును గూర్చి బైబిలు ఇక్కడ సూచనార్థకంగా మాట్లాడుతోంది.

ప్రకటన గ్రంథంలోని ప్రవచనాత్మక దర్శనాలు త్వరలోనే నెరవేరతాయి. (ప్రకటన 22:6, 7) తర్వాత “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి”నవారై యథార్థహృదయులందరూ పరిపూర్ణులౌతారు. (రోమీయులు 8:20, 21) యెహోవా దేవుని గురించీ, విమోచన క్రయధనంగా మారిన ఆయన నమ్మకమైన కుమారుని గురించీ మరింత నేర్చుకునేందుకు మనల్ని ఇది ప్రేరేపించవద్దా?—యోహాను 17:3.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామము ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూడండి.

[6వ పేజీలోని చిత్రం]

ఆదాము మానవజాతిపైకి పాప మరణాల్ని తీసుకువచ్చాడు

[7వ పేజీలోని చిత్రం]

యేసు విమోచన క్రయధనబలి పాప మరణాలనుండి విడుదలను తెస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి