కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/1 పేజీలు 5-8
  • మెస్సీయ—నిజమైన నిరీక్షణేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మెస్సీయ—నిజమైన నిరీక్షణేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 20వ శతాబ్దపు మెస్సీయలు
  • నిజమైన నిరీక్షణేనా?
  • మానవజాతి రక్షకుడు
  • ఆ మెస్సీయ మరియు ప్రభుత్వము
  • మెస్సీయ— దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “మేము మెస్సీయను కనుగొంటిమి”!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • “మేము మెస్సీయను కనుగొంటిమి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/1 పేజీలు 5-8

మెస్సీయ—నిజమైన నిరీక్షణేనా?

అతడు తననుతాను మోషే అని పిలుచుకున్నాడు. అతని అసలు పేరు చరిత్రలో మరుగునపడింది. సా.శ. ఐదవ శతాబ్దమందు అతను క్రేతు ద్వీపమంతా పర్యటిస్తూ, వారు ఎదురుచూస్తున్న మెస్సీయ తానేనని అక్కడున్న యూదులను ఒప్పించాడు. వారనుభవిస్తున్న అణచివేత, చెర, బందిలగుట త్వరలోనే తొలగిపోతుందని వారితో చెప్పాడు. వారు దానిని నమ్మారు. వారు ఎదురుచూచిన విడుదల దినము వచ్చినప్పుడు, ఆ యూదులు ఈ “మోషే” చెప్పినమాట విని మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఎత్తుగావున్న కొండమీదకు వెళ్లారు. అక్కడనుండి వారందరు సముద్రంలో దూకితే, ఆ సముద్రం రెండుపాయలై పోతుందని చెప్పాడు. అతని మాటవిని, అనేకమంది ఆ సముద్రంలో దూకారు, కానీ అతడు చెప్పినట్లు ఆ సముద్రం పాయలు కాలేదు. పైగా అలా దూకిన వారిలో చాలామంది మునిగిపోగా, మిగిలిన కొంతమందిని నావికులు, జాలర్లు రక్షించారు. ఈ హడావిడిలో, మోషే ఎవరికీ కనబడకుండ అక్కడనుండి మెల్లిగా జారుకున్నాడు. అలా ఆ మెస్సీయ కథ ముగిసింది.

మెస్సీయ అంటే ఎవరు? “రక్షకుడు,” “విమోచకుడు,” “నాయకుడు” అనే పదాలు మదికిలోకి రావచ్చు. అణచివేతనుండి విడుదలకు నడిపిస్తాననే వాగ్దానంతో, తన అనుచరులలో నిరీక్షణను, భక్తిని ప్రేరేపించే వ్యక్తే మెస్సీయ అని అనేకమంది ప్రజలనుకుంటారు. మానవ చరిత్రే ఎక్కువగా అణచివేత చరిత్ర కలది గనుక, గడచిన శతాబ్దాలలో అటువంటి మెస్సీయలు చాలామంది బయల్దేరారనుటలో ఆశ్చర్యం లేదు. (ప్రసంగి 8:9 పోల్చండి.) అయితే క్రేతులోని స్వయం-ప్రకటిత మోషే వలెనే, ఈ మెస్సీయలు చాలావరకు విడుదలకు బదులు తమ అనుచరులను నిరాశ, వినాశాలకు నడిపారు.

“ఈయనే రాజైన మెస్సీయ!” అని సా.శ. 132వ సంవత్సరంలో ప్రఖ్యాత రబ్బీయగు అకివా బెన్‌ జోజెఫ్‌, సైమెన్‌ బార్‌కోక్‌బాను అభినందించాడు. బార్‌కోక్‌బా ఒక శక్తివంతమైన సైన్యానికి నాయకత్వం వహించిన బలాఢ్యుడు. ఎట్టకేలకు, రోమీయుల ప్రపంచ ఆధిపత్యపు దీర్ఘకాల అణచివేతనుండి తమను విడిపించగల మనుష్యుడొచ్చాడని అనేకమంది యూదులు అనుకున్నారు. కానీ బార్‌కోక్‌బా ఓడిపోయాడు; ఆ ఓటమిలో లక్షలాదిమంది అతని దేశవాసులు తమ ప్రాణాలు కోల్పోయారు.

పన్నెండవ శతాబ్దంలో, మరొక మెస్సీయ బయల్దేరాడు, ఈసారి అది యెమెన్‌లో జరిగింది. మెస్సీయగా అతనికున్న అర్హతను నిరూపణకు సూచనేమిటని ఆ దేశపు ఖలీఫా, లేక పాలకుడు అతన్ని అడగ్గా, అందుకు ఈ మెస్సీయ ఖలీఫా తన తల నరికే ఏర్పాటుచేస్తే, ఆ వెంటనే తనకు కలుగు పునరుత్థానమే దానికి సూచనని ప్రతిపాదించాడు. అందుకు ఖలీఫా సరేనన్నాడు—అంతే యెమెన్‌ మెస్సీయ పని ముగిసింది. అదే శతాబ్దంలో, డేవిడ్‌ ఆల్‌రోయ్‌ అనే వ్యక్తి తనతోపాటు దేవదూతల రెక్కలపై పవిత్ర దేశానికి తిరిగి వెళ్లుటకు సిద్ధపడాల్సిందిగా మధ్య ప్రాచ్యమందలి యూదులకు చెప్పాడు. ఆయనే మెస్సీయ అని అనేకులు నమ్మారు. బాగ్దాద్‌లోని యూదులు ఇళ్ల పైకప్పుల మీదకు చేరి, క్రింద ఇళ్లలో దొంగలుపడి సమస్తం దోచుకుపోతున్నా లక్ష్యపెట్టకుండా అక్కడే ఓపిగ్గా వేచియుండిరి.

స్ముర్నలో 17వ శతాబ్దంలో సబ్బాతి ట్సాబీ అనే వ్యక్తి బయల్దేరాడు. తానే మెస్సీయనని అతడు యూరపు అంతటా యూదులకు ప్రకటించాడు. క్రైస్తవులు కూడ అతని మాటలు నమ్మారు. అడ్డు అదుపు లేకుండా పాపము చేయుటకు వారిని అనుమతిస్తూ, తన అనుచరులకు విడుదల ప్రసాదిస్తానని ట్సాబీ చెప్పుకున్నాడు. అతని సన్నిహిత అనుచరులు లైంగిక క్రియలు, నగ్నసంచారం, జారత్వం, రక్తసంబంధుల మధ్య వ్యభిచారాల్ని జరిగించి ఆ తర్వాత కొరడాలతో కొట్టుకొని, నగ్నంగా మంచులో దొర్లి, శీతల భూమిలో కంఠం వరకు తమను పూడ్చిపెట్టుకొని తమ్మునుతామే శిక్షించుకొనేవారు. ట్సాబీ టర్కీకి వెళ్లినప్పుడు, అతన్ని బంధించి తాను మహమ్మదీయుడిగా మారడమో లేదా మరణించడమో ఏదోకటి నిర్ణయించుకొమ్మని చెప్పారు. అతను మహమ్మదీయుడిగా మారిపోయాడు. అతని భక్తజనం చెల్లాచెదురయ్యారు. అయినను, ఆ తర్వాత రెండు శతాబ్దముల వరకు ట్సాబీని కొంతమంది మెస్సీయ అనే పిలిచారు.

క్రైస్తవమత సామ్రాజ్యం కూడ తనవంతు మెస్సీయలను బయల్దేరజేసింది. పన్నెండవ శతాబ్దంలో, టాన్‌షెల్మ్‌ స్వామిభక్తిగల సైన్యాన్ని తయారుచేసి, ఆంట్‌రెప్‌ పట్టణాన్ని హస్తగతం చేసికొన్నాడు. ఈ మెస్సీయ తానొక దేవుడనని చెప్పుకున్నాడు; అంతేకాదు తాను స్నానంచేసిన నీళ్లను తన అనుచరులు త్రాగేందుకు పవిత్రజలంగా అమ్మాడు! జర్మనీలో 16వ శతాబ్దంలో థామస్‌ మూన్‌ట్జెర్‌ అనే మరో “క్రైస్తవ” మెస్సీయ బయల్దేరాడు. అతను ఇదే హార్‌మెగిద్దోను యుద్ధమని చెబుతూ, స్థానిక ప్రజాధికారులకు వ్యతిరేకంగా తన అనుచరులతో ఉద్యమం నడిపాడు. శత్రువుల ఫిరంగు గుండ్లను తన చొక్కా తొడుగులతో పట్టుకుంటానని వాగ్దానం చేశాడు. దానికి భిన్నంగా, అతని ప్రజలందరు ఊచకోతకు గురికాగా, మూన్‌ట్జెర్‌ను శిరచ్ఛేధం చేశారు. అలా శతాబ్దాలుగడిచే కొలది క్రైస్తవమత సామ్రాజ్యంలో అనేకమంది అటువంటి మెస్సీయలు వెలిశారు.

ఇతర మతాల్లోకూడ, వారివారి మెస్సీయలు లేకపోలేదు. ఇస్లాం మతం ధర్మయుగానికి నడిపే మెహదిని, లేక సరియైన నడిపింపునిచ్చే వానిని సూచిస్తుంది. హిందు మతంలో, కొంతమంది తాము వివిధ దేవతల అవతారాలమని లేదా అవతరించామని చెప్పుకొనిరి. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వ్రాసినట్లు, “మెస్సీయా తలంపేలేని మతంవంటి బౌద్ధమతం సహితం, భవిష్యత్తులో బుద్ధ మైత్రేయ స్వర్గంనుండి దిగివచ్చి, భక్తులను మోక్షానికి తీసుకు వెళ్తాడనే నమ్మకాన్ని మహాయాన వర్గాల్లో కల్గించింది.”

20వ శతాబ్దపు మెస్సీయలు

మన శతాబ్దమందు, నిజమైన మెస్సీయ కొరకైన అవసరత క్రితమెన్నటికంటె మరింత అత్యవసరమయ్యింది; కాబట్టి అనేకమంది తామే ఆ మెస్సీయలమని చెప్పుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఆఫ్రికాలోని కాంగోలో 1920, 30 మరియు 40వ దశాబ్దాలలో సైమన్‌ కిమ్‌బాంగు, అతని వారసుడైన ఆండ్రా “జీసస్‌” మాట్స్‌వా మెస్సీయలుగా ప్రస్తుతించబడిరి. వారు చనిపోయారు, కానీ వారు తిరిగివచ్చి ఆఫ్రికాలో వెయ్యేండ్ల పరిపాలన నారంభిస్తారని ఇంకను వారి అనుచరులు ఎదురుచూస్తున్నారు.

న్యూగినియా, మలనేషియాలలో “కార్గొ కల్ట్స్‌” బయల్దేరడాన్ని కూడా ఈ శతాబ్దం చూసింది. మెస్సీయను పోలిన తెల్లనివారు ఓడ లేదా విమానం నడుపుకుంటూ వచ్చి తమను ధనవంతుల్నిజేసి, సంతోషభరితమైన యుగాన్ని ప్రారంభిస్తారని, అప్పుడు మృతులు సహితం లేస్తారని దాని సభ్యులు అపేక్షిస్తారు.

పారిశ్రామిక దేశాలలో సహితం వారివారి మెస్సీయలు లేకపోలేదు. తన భక్తుల ఐక్యకుటుంబముద్వారా లోకాన్ని పునీతంచేయాలనే ధ్యేయంగల వాడినని, తానే యేసుక్రీస్తు వారసుడనని స్వయంగా చెప్పుకున్న సున్‌ మ్యూన్‌ మున్‌వంటి కొంతమంది మతనాయకులు కలరు. రాజకీయ నాయకులు సహితం మెస్సీయ పాత్రవహించుటకు ప్రయత్నించారు, ఈ శతాబ్దమందలి పరమ కిరాతకానికి ప్రతీకగా ఉన్న అడాల్ఫ్‌ హిట్లర్‌ వెయ్యేండ్ల పరిపాలనను గూర్చి ప్రగల్భాలు పలికాడు.

అదేప్రకారం రాజకీయ తత్వాలు, సంస్థలు మెస్సీయ పాత్ర వహించినవి. ఉదాహరణకు, మార్క్సిస్టు, లెనినిస్టు రాజకీయ సిద్ధాంతానికి మెస్సీయ కళలేవున్నట్లు ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా వ్రాసింది. ప్రపంచ శాంతికి ఏకైక నిరీక్షణ అని బహుగా ప్రస్తుతించబడిన ఐక్యరాజ్య సమితి, అనేకుల మనస్సులలో మెస్సీయకు ప్రత్యామ్నాయముగా తయారైనట్లు కన్పిస్తున్నది.

నిజమైన నిరీక్షణేనా?

చరిత్రలో మెస్సీయకు సంబంధించిన ఈ సంఘటనలన్నీ ఎక్కువగా మోసపూరిత నిరీక్షణలని, చెదిరిన పీడకలలతోకూడిన చరిత్రేనని ఈ క్లుప్త సమీక్ష తేటతెల్లం చేస్తున్నది. కాబట్టి నేడు అనేకమంది మెస్సీయను గూర్చిన నిరీక్షణ కేవలం కట్టుకథేనని నమ్మడంలో ఆశ్చర్యం లేదు.

మెస్సీయను గూర్చిన నిరీక్షణను పూర్తిగా కొట్టిపారవేయక ముందు, అది ఎక్కడనుండి వచ్చిందనే విషయాన్ని మనం మొదట నేర్చుకోవాలి. నిజానికి, “మెస్సీయ” అనేది బైబిలు పదం. అది మాషియాక్‌, లేక “అభిషక్తుడు” అనే హెబ్రీ పదం. బైబిలు కాలాలలో, రాజులు, యాజకులు కొన్నిసార్లు వారివారి స్థానాల నలంకరించుటకు అభిషేకాచరణ ద్వారా నియమించబడేవారు, ఆ సమయంలో వారి తలలపై సుగంధ తైలం పోయబడేది. కాబట్టి వారికి మాషియాక్‌ అనే పదం యుక్తరీతిలో అన్వయింపబడింది. ఎలాంటి అభిషేకాచరణ లేకుండా ఒక ప్రత్యేక స్థానం కొరకు అభిషేకించబడిన, లేక నియమించబడిన మనుష్యులు కూడా ఉండిరి. హెబ్రీయులు 11:24-26లో మోషే “క్రీస్తని,” లేక “అభిషక్తుడని” పిలువబడ్డాడు, ఎందుకంటె ఆయన దేవుని ప్రవక్తగా, ప్రతినిధిగా ఎన్నుకొనబడ్డాడు.

“అభిషక్తుడని” మెస్సీయకు ఇవ్వబడిన ఈ నిర్వచనము, మనము చర్చించిన అబద్ధ మెస్సీయలు బైబిలు మెస్సీయలు వేరైయున్నారని తెల్పుతుంది. బైబిలు మెస్సీయలు స్వయం నియమితులు కారు; లేక అతిగా గౌరవించే భక్తజన సమూహముచే ఎనుకొన్నబడిన వారు కారు. బదులుగా, వారి నియామకం పైనుండి, అనగా యెహోవా దేవునిచే కలిగింది.

బైబిలు అనేకమంది మెస్సీయలను గూర్చి మాట్లాడుచున్ననూ, ఒకవ్యక్తిని గూర్చి అది ప్రముఖంగా ప్రస్తావిస్తున్నది. (కీర్తన 45:7) ఈ మెస్సీయ బైబిలు ప్రవచనముల కేంద్ర బిందువుగా, బైబిలుయొక్క అత్యంత స్ఫూర్తిదాయక వాగ్దానముల నెరవేర్పుకు కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. మరియు మనమీనాడు ఎదుర్కొను సమస్యలను ఈ మెస్సీయ నిజముగా తీర్చగలడు.

మానవజాతి రక్షకుడు

బైబిలు మెస్సీయ, మానవజాతి సమస్యల మూలకారణాలతో వ్యవహరించును. తిరుగుబాటుదారుడైన ఆత్మీయ ప్రాణియగు సాతాను దుష్ప్రేరణతో మన మొదటి తలిదండ్రులగు ఆదాము హవ్వలు సృష్టికర్తకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు, నిజానికి పాలనాహక్కు చివరకు తమదేనని వారు భావించారు. ఏది తప్పో, ఏది ఒప్పో తామే నిర్ణయించుకోవాలని వారు కోరుకున్నారు. అలా వారు యెహోవా ప్రేమపూర్వక, రక్షిత ప్రభుత్వాధికారం నుండి తప్పుకొని, మానవజాతిని కలవరం, స్వయం-పాలనా దుఃఖములో, అసంపూర్ణతలో, మరణములో పడవేసిరి.—రోమీయులు 5:12.

కాబట్టి, మానవజాతియంతటికి నిరీక్షణా వెలుగురేఖను ప్రసాదించుటకు మానవ చరిత్రలోని ఆ అంధకార ఘడియను యెహోవా ఎంచుకొనుట ఎంత ప్రేమపూర్వకమైనది! మానవ తిరుగుబాటుదారులపై శిక్ష విధించుచు, వారి సంతానానికొక విమోచకుడు ఉండునని దేవుడు ప్రవచించెను. “సంతానమని” పిలువబడిన ఈ రక్షకుడు, ఏదెనులో సాతానుచేసిన భయంకరమైన పనిని నిర్మూలించేందుకు వచ్చును; ఆ సంతానం “సర్పమగు” సాతాను తల చితకద్రొక్కి, అతన్ని ఉనికిలో లేకుండాచేయును.—ఆదికాండము 3:14, 15.

అనాదిగా యూదులు, ఈ ప్రవచనము మెస్సీయకు సంబంధించినదని విశ్వసించారు. అనేక టార్‌గూమ్స్‌, అనగా మొదటి శతాబ్దములో సాధారణముగా యూదులు ఉపయోగించిన పరిశుద్ధలేఖనముల వాక్యభాగాలు, ఈ ప్రవచనము “రాజైన మెస్సీయ దినములలో” నెరవేరునని వివరించాయి.

కాబట్టి, ప్రారంభంనుండే విశ్వాసులైన మనుష్యులు రానైయున్న ఈ సంతానము లేక రక్షకుని వాగ్దాన విషయమై ఎంతో ఉత్కంఠతో ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. రానైయున్న సంతానము ఆయన వంశక్రమములోనే వచ్చునని, ఆ సంతానము మూలముగా ఆయన సంతానం మాత్రమే కాకుండ, “భూలోకములోని జనములన్నియు ఆశీర్వదించబడునని” యెహోవా అబ్రాహాముతో చెప్పినప్పుడు ఆయన భావములెట్లుండెనో ఊహించుము.—ఆదికాండము 22:17, 18.

ఆ మెస్సీయ మరియు ప్రభుత్వము

ఆ తర్వాత, ప్రవచనములు ఈ నిరీక్షణను ఒక మంచి ప్రభుత్వపు ఉత్తరాపేక్షతో ముడిపెట్టినవి. ఆదికాండము 49:10లో అబ్రాహాము మునిమనుమడైన యూదాకు ఇలాచెప్పబడింది: “షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు; ప్రజలు అతనికి విధేయులై యుందురు.” కావున ఈ “షిలోషు”—యూదులపై మాత్రమే కాదు “ప్రజలపై” కూడ పరిపాలన చేయవలెననుట స్పష్టం. (దానియేలు 7:13, 14 పోల్చండి.) షిలోహు మెస్సీయేనని ప్రాచీనకాల యూదులు గుర్తించిరి; నిజానికి కొన్ని టార్‌గూమ్‌లలో “షిలోహు” స్థానంలో “మెస్సీయ” లేదా “రాజైన మెస్సీయ” అని వ్రాయబడింది.

ప్రేరేపిత ప్రవచన వెలుగురేఖలు ప్రకాశవంతమగు కొలది, మెస్సీయ పరిపాలనను గూర్చి మరెంతో వెల్లడిచేయబడింది. (సామెతలు 4:18) రెండవ సమూయేలు 7:12-16లో యూదా సంతతివాడైన రాజగు దావీదుకు, ఆ సంతానము అతని వంశక్రమములో వచ్చునని తెల్పబడెను. అంతేకాకుండా, ఈ సంతానము అసాధారణమైన రాజైయుండును. ఆయన సింహాసనము, లేదా పరిపాలన నిరంతరము నిలుచును! యెషయా 9:6, 7 ఈ అంశాన్ని బలపరుస్తున్నది: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముమీద రాజ్యభారముండును. [“ప్రభుత్వము,” కింగ్‌జేమ్సు వర్షన్‌] . . . ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు, అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.”

అటువంటి ప్రభుత్వాన్ని మీరూహించగలరా? శాంతిని స్థిరపరచు న్యాయవంతుడును, నీతిపరుడైన పరిపాలకుడు నిత్యము పరిపాలించును. చరిత్రలో ఆయాకాలాలలో బయల్దేరి ఎంతో దుఃఖానికి కారణమైన దొంగ మెస్సీయలకు ఈయనెంతో భిన్నంగావున్నాడు! కపటమైన, స్వనియమిత నాయకుడై ఉండుటకు బదులు, బైబిలు మెస్సీయ ప్రపంచ పరిస్థితులను మార్చుటకు అవసరమైన శక్తి, అధికారంగల పరిపాలకుడై యున్నాడు.

మన ఈ కష్టభరిత కాలాలలో ఈ ఉత్తరాపేక్ష లోతైన భావముగలదై యున్నది. మానవజాతికి అటువంటి నిరీక్షణ కొరకు ఇంతకు ముందెన్నడు ఇంతగొప్ప అవసరం లేకుండెను. ప్రతివారు సులభంగా అబద్ధ నిరీక్షణలలో ఉండిపోయే అవకాశం కలదు గనుక, మనలో ప్రతి ఒక్కరం ఈ ప్రశ్నను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి: అనేకులు నమ్ముతున్నట్లు నజరేయుడగు యేసు, ప్రవచింపబడిన మెస్సీయేనా? తర్వాతి శీర్షిక ఈ విషయాన్ని పరిశీలించును.

[6వ పేజీలోని బాక్సు]

బ్రూక్లిన్‌లో ఒక మెస్సీయా?

ఇటీవల ఇజ్రాయేల్‌ దేశంలో విద్యుత్‌లైట్లతో “మెస్సీయ రాకడకు సిద్ధంకండి” అనే ప్రకటనా బోర్డులు, పోస్టర్లు వెలిశాయి. దీనిని 4,00,000 డాలర్లు ఖర్చుతో, తీవ్రసిద్ధాంత యూదుల హెసిడిక్‌ తెగయగు, లూబావిచర్స్‌ భారీగా ప్రచారం చేశారు. 2,50,000 సభ్యుల ఆ గుంపులో, న్యూయార్క్‌, బ్రూక్లిన్‌ నందలి తమ ప్రఖ్యాత రబ్బీయగు మెనాషెమ్‌ మెండెల్‌ షనీర్‌సన్‌ మెస్సీయ అనే నమ్మకం బలంగా వుంది. ఎందుకు? ఎందుకంటె, మెస్సీయ ఈ తరంలోనే వస్తాడని షనీర్‌సన్‌ బోధించాడు. మరియు, మెస్సీయావచ్చు పర్యంతం ఆ 90 సంవత్సరాల రబ్బీ చనిపోడని లూబావిచర్స్‌ అధికారులు వాదిస్తారని న్యూస్‌వీక్‌ పత్రిక వ్రాసింది. ప్రతి తరంలో మెస్సీయగా అర్హుడగు వ్యక్తి కనీసం ఒక్కరైనా పుడతారని ఆ తెగ శతాబ్దాలుగా బోధిస్తుంది. అతని అనుచరులకు షనీర్‌సన్‌ అటువంటి వ్యక్తే, మరియు అతను తన వారసుడగు వ్యక్తిని నియమించలేదు. అయినను, అనేకమంది యూదులు అతన్ని మెస్సీయగా అంగీకరించలేదని న్యూస్‌వీక్‌ చెబుతున్నది. న్యూస్‌డే అనే వార్తాపత్రిక చెప్పిన ప్రకారం, 96 సంవత్సరాల ప్రత్యర్థి రబ్బీయగు ఎలియాజర్‌ షక్‌, అతన్ని “దొంగ మెస్సీయ” అని పిలిచాడు.

[7వ పేజీలోని చిత్రం]

క్రేతులోని మోషే, మెస్సీయ అనే నమ్మకం మూలంగా అనేకమంది ప్రజలు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి