కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 4/1 పేజీలు 9-14
  • “మేము మెస్సీయను కనుగొంటిమి”!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మేము మెస్సీయను కనుగొంటిమి”!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు వంశావళి
  • మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు
  • ఆయన ఆగమనం ప్రవచింపబడెను
  • పైనుండి గుర్తింపబడెను
  • యూదులెందుకు యేసును అంగీకరించలేదు?
  • ఎందుకు మెస్సీయ మరణించాల్సి వచ్చింది
  • “మేము మెస్సీయను కనుగొంటిమి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మెస్సీయ— దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యేసుక్రీస్తు—దేవుని గూర్చిన జ్ఞానానికి కీలకము
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • వారు మెస్సీయ కోసం ఎదురుచూశారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 4/1 పేజీలు 9-14

“మేము మెస్సీయను కనుగొంటిమి”!

“[అంద్రెయ] మొదట తన సహోదరుడైన సీమోనును చూచి—మేము మెస్సీయను (దానికి క్రీస్తని అర్థము) కనుగొంటిమని అతనితో చెప్పెను.”—యోహాను 1:41.

1. నజరేయుడగు యేసును గూర్చి బాప్తిస్మమిచ్చు యోహాను ఏ సాక్ష్యమిచ్చాడు, అంద్రెయ ఆయనను గూర్చి ఏ నిర్ణయానికొచ్చాడు?

నజరేతు నివాసియైన యూదుడగు యేసును అంద్రెయ చాలాసేపు పరికించి చూశాడు. ఒక రాజువంటి, జ్ఞానివంటి లేదా రబ్బీవంటి రూపం ఆయనకు లేదు. ఆయనకు రాజవస్త్రాలు, నెరసిన వెంట్రుకలు, మృదువైన చేతులు లేవు, సున్నితమైన శరీరం లేదు. యౌవనునిగా, అంటే దాదాపు 30 సంవత్సరాల వయస్సుతో యేసు కాయలుకాసిన చేతులతో, కాయకష్టం చేసేవాడి శరీరంతో ఉన్నాడు. కాబట్టి ఆయన వడ్రంగివాడని గుర్తించుటలో బహుశ అంద్రెయ ఆశ్చర్యపడి యుండకపోవచ్చును. అయినప్పటికిని, బాప్తిస్మమిచ్చు యోహాను ఈ మనుష్యుని గూర్చి ఇలా చెప్పాడు: “ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల!” అంతకుముందు రోజు యోహాను, “ఈయనే దేవుని కుమారుడు” అని మరింత ఆశ్చర్యం కల్గించే విషయాన్ని చెప్పాడు. ఇది నిజం కాగలదా? ఆ రోజు అంద్రెయ, యేసు బోధను కొద్దిసేపు విన్నాడు. యేసు ఏమి బోధించాడో మనకు తెలియదు గాని, ఆయన పలికిన మాటలు మాత్రం అంద్రెయ జీవితాన్నే మార్చివేస్తాయని మనకు తెలుసు. ఆ వెంటనే అంద్రెయ తన సహోదరుడైన సీమోనుయొద్దకు పరుగున వెళ్లి, “మేము మెస్సీయను కనుగొంటిమని”! సంభ్రమాశ్చర్యంతో చెప్పాడు.—యోహాను 1:34-41.

2. యేసు, వాగ్దానం చేయబడిన మెస్సీయేనా అనే ఆధారాన్ని పరిశీలించుట ఎందుకు ప్రాముఖ్యము?

2 అంద్రెయ, సీమోను (యేసు ఈయనకు పేతురని మారుపేరు పెట్టాడు) ఆ తర్వాత యేసుయొక్క అపొస్తలులయ్యారు. తాను రెండు సంవత్సరాలకు పైగా ఆయనకు శిష్యునిగావున్న తర్వాత పేతురు యేసుతో, “నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువని [మెస్సీయ] చెప్పెను.” (మత్తయి 16:16) విశ్వాసపాత్రులైన అపొస్తలులు, శిష్యులు చివరకు ఆ విశ్వాస విషయమై మరణించుటకైనను ఇష్టపడిరని నిరూపించుకున్నారు. ఈనాడు, సహృదయులైన లక్షలాది మందికూడ అంతే భక్తిని కలిగియున్నారు. అయితే దానికి ఆధారమేమిటి? విశ్వాసానికి, ఆత్రపడి నమ్మడానికి మధ్యగల భేదాన్ని చూపించేదే ఆ యాధారం. (హెబ్రీయులు 11:1 చూడుము.) కాబట్టి, యేసు నిజముగా మెస్సీయేనని నిరూపించు మూడు సాధారణ ఆధారాలను మనం పరిశీలిద్దాము.

యేసు వంశావళి

3. మత్తయి, లూకా సువార్తలు యేసు వంశావళిని గూర్చి ఏ వివరాలిస్తున్నవి?

3 మెస్సీయగా యేసుకున్న అర్హతను బలపరచుటకు క్రైస్తవ గ్రీకు లేఖనములు అందించే వంశావళిక్రమమే ఆధారం. రాజైన దావీదు వంశక్రమమందు మెస్సీయ వచ్చునని బైబిలు ప్రవచించింది. (కీర్తన 132:11, 12; యెషయా 11:1, 10) మత్తయి సువార్త ఇలా ఆరంభిస్తున్నది: “అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.” యేసును పెంచిన తండ్రియగు యోసేపు మూలముగా ఆయన వంశక్రమపు జాడ తీయుటద్వారా, ధైర్యంగా చెప్పగల ఈ విషయాన్ని మత్తయి బలపరుస్తున్నాడు. (మత్తయి 1:1-16) లూకా సువార్త, ఆయన తల్లియగు మరియ మొదలుకొని, దావీదు, అబ్రాహాము నుండి ఆదాము వరకు యేసు వంశావళి జాడను తెలియజేసింది. (లూకా 3:23-38)a ఆ విధముగా సువార్త రచయితలు, యేసు చట్టపరంగాను వారసత్వంగాను దావీదు వారసుడనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

4, 5. (ఎ) యేసు సమకాలికులు ఆయన దావీదు వంశస్థుడను విషయాన్ని సవాలు చేశారా, ఇదెందుకు ప్రాముఖ్యమైనది? (బి) యేసు వంశక్రమమును బైబిలేతర గ్రంథాలు ఎట్లు బలపరుస్తున్నవి?

4 మెస్సీయగా యేసుకున్న అర్హతను సందేహించే ఎటువంటి వ్యతిరేకియైనను యేసు దావీదు కుమారుడని చెప్పుమాటను నిరాకరించలేడు. ఎందుకు? దానికి రెండు కారణాలు కలవు. ఒకటేమనగా, సా.శ. 70లో యెరూషలేము నాశనం చేయబడడానికి ముందు దశాబ్దాల తరబడి ఆ పట్టణంలో ఆ మాట బహుళ వ్యాప్తమయింది. (మత్తయి 21:9; అపొ. కార్యములు 4:27; 5:27, 28 పోల్చండి.) ఒకవేళ అలా చెప్పడం అబద్ధమైనట్లయిన, యేసు వ్యతిరేకులలో—ఆయనకు చాలామంది వ్యతిరేకులుండిరి గనుక—ఎవరో ఒకరు వంశావళి రికార్డులుండే ప్రజా గ్రంథాలయమందలి వంశావళిని పరిశీలించుట ద్వారా, యేసును ఒక మోసగాడని నిరూపించేవారే.b అయితే యేసు దావీదు వంశస్థుడేనా అని ఎవరూ సవాలుచేసిన దాఖలాలు చరిత్రలో లేవు. స్పష్టముగా, ఆ విషయం ప్రతిఘటింపజాలనిదై యుండెను. నిస్సందేహముగా మత్తయి, లూకా తాము వ్రాసిన వృత్తాంతాలను అట్టి ప్రజా గ్రంథాలయ రికార్డులనుండి ఆ పేర్లను నేరుగా కాపీ చేశారు.

5 రెండవ సంగతేమంటే, బైబిలేతర గ్రంథాలుకూడ యేసు వంశావళిని గూర్చిన అంగీకారాన్ని ధృవీకరిస్తున్నవి. ఉదాహరణకు, నాల్గవ శతాబ్దపు రబ్బీ ఒకరు యేసు తల్లియైన మరియ ‘వడ్రంగివారితో వ్యభిచరిస్తున్నదని’ మరియమీద అవమానకరమైన అభియోగముచేసెనని టాల్‌ముడ్‌లో వ్రాయబడింది; అయితే అదే వాక్యం “ఆమె రాజుల మరియు పరిపాలకుల వంశస్థురాలని” అంగీకరించింది. దీనికంటే ముందున్న ఉదాహరణగా, రెండవ శతాబ్దపు చరిత్రకారుడైన హెజెసిపెస్‌ను తీసికోవచ్చు. దావీదు వంశస్థులను సమూలంగా హతమార్చాలని రోమా కైసరు డొమిషియన్‌ కోరినప్పుడు, తొలి శతాబ్దమందలి క్రైస్తవుల శత్రువులు కొందరు యేసు సహోదరుడైన యూదా మనుమలు “దావీదు కుటింబీకులని” వారికి వ్యతిరేకముగా మాట్లాడినట్లు ఆయన వివరిస్తున్నాడు. యూదా దావీదు వంశస్థుడైతే, యేసు కాడా? నిశ్చయంగా యేసు దావీదు వంశస్థుడే!—గలతీయులు 1:19; యూదా 1.

మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు

6. మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు హెబ్రీలేఖనములలో ఎంత విస్తారంగా ఉన్నాయి?

6 యేసు మెస్సీయే అనుటకు నెరవేరిన ప్రవచనాలే మరొక ఆధారం. మెస్సీయకు అన్వయించు ప్రవచనాలు హెబ్రీలేఖనములలో విస్తారంగా వున్నాయి. ప్రాచీనకాల రబ్బీలు, మెస్సీయకు సంబంధించినవని దృష్టించిన హెబ్రీలేఖనములలోని 456 వాక్యభాగాలను లెక్కించి ఆల్‌ఫ్రెడ్‌ ఎడర్‌షిమ్‌ తన గ్రంథమగు ది లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ జీసస్‌ ది మెస్సాయ, నందు వ్రాశాడు. అయితే, రబ్బీలు మెస్సీయను గూర్చి అనేక తప్పుడు అభిప్రాయాలను కలిగియుండిరి; వారు సూచించిన వాక్యభాగాలలో అనేకం అసలు మెస్సీయకు సంబంధించినవే కావు. అయినను, యేసును మెస్సీయగా గుర్తించు ప్రవచనాలు అనేకం కలవు.—ప్రకటన 19:10 పోల్చుము.

7. ఈ భూమిపై సంచరించిన కాలంలో యేసు నెరవేర్చిన కొన్ని ప్రవచనాలు ఏమైయున్నవి?

7 వాటిలో కొన్ని ఏమంటే, ఆయన జన్మించిన పట్టణము (మీకా 5:2; లూకా 2:4-11); ఆయన జన్మించిన తర్వాత జరిగిన ఘోర శిశుహత్యాకాండ (యిర్మీయా 31:15; మత్తయి 2:16-18); ఆయన ఐగుప్తునుండి పిలువబడుట (హోషేయా 11:1; మత్తయి 2:15); ఆయన నంతమొందించుటకు జనాంగముల పాలకులందరు ఏకమగుట (కీర్తన 2:1, 2; అపొ. కార్యములు 4:25-28); ఆయన 30 వెండి నాణెములకు అప్పగింపబడుట (జెకర్యా 11:12; మత్తయి 26:15); చివరకు ఆయన మరణ విధానము.—కీర్తన 22:16, NW అథస్సూచి; యోహాను 19:18, 23; 20:25, 27.c

ఆయన ఆగమనం ప్రవచింపబడెను

8. (ఎ) మెస్సీయవచ్చే కాలాన్ని ఏ ప్రవచనం సూచిస్తున్నది? (బి) ఈ ప్రవచనాన్ని అర్థం చేసికొనుటకు ఏ రెండు వాస్తవాలు తెలియాలి?

8 కేవలం ఒక ప్రవచనం మీద దృష్టి నిల్పుదాం. దానియేలు 9:25 నందు మెస్సీయ ఎప్పుడువస్తాడో యూదులకు చెప్పబడింది. అక్కడిలా వుంది: “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు [మెస్సీయ] వచ్చువరకు ఏడు వారములు . . . అరువది రెండు వారములు పట్టును.” మొదటిసారి చూసినప్పుడు ఈ ప్రవచనమొక మర్మముగా కన్పించవచ్చును. అయితే విశాల భావమందు, అది మనల్ని కేవలం రెండు అంశాలను మాత్రమే, అనగా దాని ఆరంభకాలమును, దాని కాలనిడివిని మాత్రమే గమనించుడని అడుగుచున్నది. దీనిని దృష్టాంతపరచుటకు, “పట్టణపు ఉద్యానవనంలో ఉన్న బావికి తూర్పున 50 కొలకర్రల” దూరంలో నిధి పాతిపెట్టబడి ఉందని సూచించే మ్యాప్‌ నీ దగ్గరున్నను—ప్రత్యేకంగా ఆ బావి ఎక్కడవుందో లేదా ఆ ‘కొలకర్ర’ పొడవెంతో నీకు తెలియనప్పుడు—అందలి సూచనలు నీకు గజిబిజిగా ఉంటాయి. ఆ నిధిని కనుగొనుటకు వీలుగా ఆ రెండు విషయాలను తెలిసికొనుటకు నీవు ప్రయత్నించవా? దాని ఆరంభ కాలాన్ని కనుగొని, ఆ కాలాన్ని మనం కొలవడం మినహాయిస్తే, దానియేలు ప్రవచనముకూడ అటువంటిదే.

9, 10. (ఎ) ఆ 69 వారాలను కొలిచే ఆరంభ కాలమేమై యున్నది? (బి) ఆ 69 వారాల కాలనిడివి ఎంత, అది మనకెలా తెలియును?

9 మొదట మనకు దాని ఆరంభ కాలం అంటే ‘యెరూషలేమును తిరిగి కట్టించవలెనను ఆజ్ఞ’ ఏ తేదీన ఇవ్వబడిందో కావాలి. తర్వాత, అప్పటినుండి, ఈ 69 వారాల (7+62) ఎప్పుడు ముగించబడ్డాయో మనకు కావాలి. కనుగొనడానికి ఈ రెంటిలో ఏ విషయం కూడ కష్టమైంది కాదు. చివరకు యెరూషలేమును పునర్నిర్మింపజేసే ప్రాకారాన్ని తిరిగికట్టవలెనను ఆజ్ఞ, “అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదియవ సంవత్సరములో” బయలువెళ్లినట్లు నెహెమ్యా క్షుణ్ణంగా మనకు చెప్పుచున్నాడు. (నెహెమ్యా 2:1, 5, 7, 8) మన ఆరంభ కాలం సా.శ.పూ. 455 అని అది చూపిస్తున్నది.d

10 ఇప్పుడు ఈ 69 వారాల విషయానికొస్తే, అవి అక్షరార్థమైన వారాలేనా? కాదు, ఎందుకంటే సా.శ.పూ. 455 తర్వాత కేవలము ఒక్క సంవత్సరంలోనే మెస్సీయ రాలేదు. ఇవి “సంవత్సరాలకు” సంబంధించిన వారాలని చాలామంది బైబిలు విద్వాంసులు, అనేక అనువాదాలు (ఈ వచనానికున్న అథస్సూచినందు యూదులు టానాక్స్‌ తో సహా) అంగీకరిస్తున్నాయి. ‘వారపు సంవత్సరాలు’ లేక ఏడు సంవత్సరాల కాలచక్రమను ఈ గ్రహింపు ప్రాచీన యూదులకు సుపరిచితమే. ప్రతి ఏడవ దినమున విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లే, వారు ప్రతి ఏడవ సంవత్సరాన విశ్రాంతి సంవత్సరమును ఆచరించేవారు. (నిర్గమకాండము 20:8-11; 23:10, 11) కావున 69 వారాలు, 69 సార్లు ఏడేసి సంవత్సరాలుగా, లేదా 483 సంవత్సరాలుగా లెక్కించబడును. మనం చేయవలసిందల్లా దీనిని లెక్కించుటే. ఈ 483 సంవత్సరాలను, సా.శ.పూ. 455 నుండి లెక్కిస్తే మనం సరిగ్గా సా.శ. 29కి వస్తాము—అదే సంవత్సరంలో యేసు బాప్తిస్మము తీసుకొని మాషియాక్‌, లేదా మెస్సీయ అయ్యాడు!—ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి 2, పుట 899లో “Seventy Weeks,” చూడుము.

11. దానియేలు ప్రవచన భావాన్ని చెప్పడానికి ఇది కేవలం ఒక ఆధునిక పద్ధతి మాత్రమేనని చెప్పేవారికి మనమెలా జవాబివ్వవచ్చును?

11 చరిత్రకు సరిపోయేట్లుగా ఆ ప్రవచన భావాన్ని చెప్పడానికి ఇది కేవలం ఆధునిక విధానమని కొందరు అభ్యంతరం చెప్పవచ్చు. అట్లయిన, యేసు దినములలోని ప్రజలు మెస్సీయ వచ్చునని ఎందుకు ఎదురుచూస్తూ ఉండిరి? క్రైస్తవ చరిత్రకారుడైన లూకా, రోమా చరిత్రకారులైన టాసిటస్‌, స్యూటోనియస్‌లు, యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌, మరియు యూదా తత్వజ్ఞానియగు ఫిలొ అనువారు ఆ కాలానికి దగ్గరలో జీవించిన వారే, వీరంతా ఈ విధంగా ఎదురుచూడడాన్ని గూర్చి సాక్ష్యమిచ్చారు. (లూకా 3:15) ఆ కాలమందలి రోమాప్రభుత్వపు అణచివేతను బట్టి యూదులు మెస్సీయను కోరి, ఆయన కొరకు ఎదురుచూశారని ఈనాడు కొంతమంది విద్వాంసులు వాదిస్తారు. అయితే అంతకుముందు శతాబ్దాల క్రితం గ్రీసుదేశం యూదులను క్రూరాతిక్రూరంగా హింసించినప్పుడు వారు ఎదురుచూడడం మాని ఇప్పుడెందుకు మెస్సీయ కొరకు ఎదురుచూశారు? యూదయనుండి శక్తివంతమైన పరిపాలకులువచ్చి “విశ్వసామ్రాజ్యాన్ని సాధిస్తారని” యూదులు ఎదురు చూడడానికి “మర్మముతోకూడిన ప్రవచనాలే” కారణమని టాసిటస్‌ ఎందుకు చెప్పాడు? రోమాప్రభుత్వం తెచ్చిన హింసవలన కాదుగాని, దానియేలు గ్రంథము నుండి పాక్షికంగా వచ్చిన “అప్పటి జనసమ్మతమైన కాలవృత్తాంతమును” బట్టి “సా.శ. మొదటి శతాబ్దపు తొలి అర్ధభాగంలోనే మెస్సీయ వస్తాడని ఎదురుచూడడం జరిగిందని” తన పుస్తకమగు ఎ హిస్టరీ ఆఫ్‌ మెస్సియానిక్‌ స్పెక్యులేషన్‌ ఇన్‌ ఇశ్రాయేల్‌ నందు ఎబె హిలెల్‌ సిల్వర్‌ పేర్కొన్నాడు.

పైనుండి గుర్తింపబడెను

12. యేసు మెస్సీయేనని యెహోవా ఎలాంటి గుర్తింపునిచ్చెను?

12 యేసు మెస్సీయ అనడానికి మూడవ ఆధారమేమనగా దేవుడే స్వయంగా ఇచ్చిన సాక్ష్యం. లూకా 3:21, 22 ప్రకారం, యేసు బాప్తిస్మం పొందిన తరువాత సమస్త విశ్వంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన యెహోవా దేవుని పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించబడెను. మరియు తన స్వంత స్వరముతో యెహోవా తన కుమారుడగు యేసును తాను ఆమోదించానని అంగీకరించాడు. మరి రెండు సందర్భాలలో, ఒకసారి యేసు యొక్క ముగ్గురు అపొస్తలుల ఎదుట, ఇంకొకసారి జనసమూహము ఎదుట తన ఆమోదమును సూచించుచు యెహోవా పరలోకము నుండి నేరుగా యేసుతో మాట్లాడెను. (మత్తయి 17:1-5; యోహాను 12:28, 29) అంతేకాకుండా, క్రీస్తుగా, లేక మెస్సీయగా యేసుకున్న హోదాను స్థిరపరచుటకు దేవదూతలు పైనుండి పంపబడ్డారు.—లూకా 2:10, 11.

13, 14. యేసును తాను మెస్సీయగా ఆమోదించానని యెహోవా ఎలా చూపాడు?

13 గొప్పకార్యములు నెరవేర్చుటకు తన అభిషక్తుని శక్తివంతుని చేయుటద్వారా యెహోవా తన ఆమోదమును చూపించాడు. ఉదాహరణకు, చరిత్రను ముందుగానే వివరించిన ప్రవచనాలను—వాటిలో కొన్ని మనకాలంలో నెరవేరే వాటిని—యేసు చెప్పాడు.e ఆయన ఆకలిగొన్న జనసమూహములకు ఆహారమిచ్చుట, రోగులను స్వస్థపరచుటవంటి అద్భుతాలను చేశాడు. ఆయన మరణించిన వారిని సహితం పునరుత్థానం చేశాడు. అసలు వాస్తవమే లేకుండా ఆయన అనుచరులు ఈ శక్తివంతమైన కార్యాలను గూర్చి కేవలం కట్టుకథలల్లారా? కొన్నిసార్లు వేలాదిమంది ఉన్నప్పుడు, ప్రత్యక్ష సాక్షులయెదుట యేసు అనేక అద్భుత క్రియలు చేశాడు. యేసు వీటిని చేయలేదని ఆయన శత్రువులు సహితం అనలేరు. (మార్కు 6:2; యోహాను 11:47) దీనికితోడు, ఒకవేళ యేసు అనుచరులు అటువంటి వృత్తాంతాలు కల్పించే వారే అయితే, వారి స్వంత తప్పిదాల విషయం వచ్చేసరికి వారెందుకు వాటిని అరమరిక లేకుండా ఒప్పుకుంటారు? నిజానికి, వ్యక్తిగతంగా వారే పుట్టించిన కట్టుకథలపై ఆధారపడిన విశ్వాసం కొరకు చనిపోవడానికి వారు ఇష్టపడతారా? లేదు. యేసుచేసిన అద్భుతాలు చరిత్రలోని వాస్తవాలే.

14 యేసు మెస్సీయేనని దేవుడిచ్చిన సాక్ష్యము ఇంకా ముందుకు సాగింది. యేసే మెస్సీయయనే ఆధారమును గూర్చి, చరిత్రలోకెల్ల అత్యధిక భాషలలో అనువదించబడి అందించబడు గ్రంథమందు భాగమగునట్లు వ్రాయబడుటకు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యపరచాడు.

యూదులెందుకు యేసును అంగీకరించలేదు?

15. (ఎ) యేసును మెస్సీయగా గుర్తించు ఆధారాలు ఎంత విస్తారంగా ఉన్నాయి? (బి) యూదులకున్న ఎట్టి అపేక్షలు వారిలో అనేకమంది యేసును మెస్సీయగా తృణీకరించుటకు నడిపినవి?

15 కాబట్టి, యేసును మెస్సీయగా గుర్తించు వందలాది వాస్తవాలలో, ఈ మూడు విధముల ఆధారము కూడ యిమిడియున్నది. అది చాలదా? డ్రెవరు లైసెన్సుకు లేదా ఒక క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేయగా, దానికి మూడు గుర్తింపు విషయాలు చాలవు—నీవు వందల సంఖ్యలో వాటిని తేవాలి అని చెప్పారనుకోండి, అదెంత అసమంజసం! కాబట్టి, బైబిలునందు యేసు యుక్తరీతిలో గుర్తింపబడ్డాడు. అయితే యేసు మెస్సీయేనను ఈ సాక్ష్యాధారమంతటిని ఆయన స్వంత ప్రజలే ఎందుకు నిరాకరించారు? ఎందుకంటే నిజమైన విశ్వాసానికి సాక్ష్యాధారం ప్రాముఖ్యమైనను, విశ్వాసానికి అది హామినివ్వదు. విచారకరమైన విషయమేమంటే, సాక్ష్యాధారమెంత ప్రబలంగా ఉన్నను, అనేకమంది ప్రజలు తాము నమ్మాలని ఇష్టపడినదానినే నమ్ముతారు? మెస్సీయ విషయానికొస్తే అనేకమంది యూదులు తమకు కావలసిన దాని విషయంలో నిర్దిష్టమైన తలంపులను కలిగియుండిరి. రోమాప్రభుత్వ అణచివేతను అంతంచేసి, సొలొమోను కాలములోవలె సుఖసంపదలను ఇశ్రాయేలుకు పునరుద్ధరించే, రాజకీయ మెస్సీయ తమకు కావాలని వారు కోరారు. కాబట్టి, రాజకీయాలలో లేదా ధనసంపత్తినందు ఏమాత్రం ఆసక్తి చూపని ఈ నజరేయుడైన, దీనుడగు వడ్రంగిని వారెట్లు అంగీకరించగలరు? మరిముఖ్యంగా ఎంతో బాధననుభవించి, ఆ తర్వాత హింసాకొయ్యపై అవమానకరముగా మరణించిన తర్వాతకూడ ఆయనెట్లు మెస్సీయ కాగలడు?

16. మెస్సీయ విషయంలో తమ స్వంత అభిప్రాయాలను యేసు అనుచరులు ఎందుకు సవరించుకోవాల్సి వచ్చింది?

16 యేసు మరణించినప్పుడు ఆయన స్వంత శిష్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిరి. ఆయన మహిమతో పునరుత్థానుడైన తర్వాత, ‘వెంటనే ఇశ్రాయేలుకు రాజ్యము స్థాపించునని’ వారు నిరీక్షించారు. (అపొ. కార్యములు 1:6) అయితే ఈ వ్యక్తిగత నిరీక్షణ నిజం కానందున వారు యేసును మెస్సీయగా తృణీకరించలేదు. లభ్యమైన కొండంత సాక్ష్యాన్నిబట్టి వారు ఆయనయందు విశ్వాసముంచారు, దానితో వారి అవగాహన క్రమేణి వృద్ధికాగా, మర్మములన్నియు తొలగిపోయినవి. నరునిగా ఆయన ఈ భూమిమీదనున్న కొద్దికాలములోనే ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రవచనాలన్నింటిని మెస్సీయ నెరవేర్చలేడని వారు తెలిసికొన్నారు. ఎందుకనగా, ఆయన దీనుడై గాడిద పిల్లనెక్కి వచ్చుటను గూర్చి ఒక ప్రవచనం చెప్తే, మరొక ప్రవచనం ఆయన మహిమతో మేఘారూఢుడై వచ్చుటనుగూర్చి చెప్పింది. ఆ రెండు ఎలా నిజం కాగలవు? కాబట్టి ఆయన రెండవసారి రావాల్సివుంటుంది.—దానియేలు 7:13; జెకర్యా 9:9.

ఎందుకు మెస్సీయ మరణించాల్సి వచ్చింది

17. మెస్సీయ మరణించవలసి యుండునని, ఆయనెందుకు మరణించునని దానియేలు ప్రవచనం ఎట్లు స్పష్టం చేసింది?

17 అంతేకాకుండ, మెస్సీయ మరణించాల్సి యుండెనని మెస్సీయకు సంబంధించిన ప్రవచనములు స్పష్టం చేశాయి. ఉదాహరణకు, మెస్సీయ ఎప్పుడు వచ్చునో ప్రవచించిన ఆ ప్రవచనమే తర్వాతి వచనములో ఇలా చెప్పింది: “[ఏడు వారముల తర్వాత వచ్చిన] ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషక్తుడు [మెస్సీయ] నిర్మూలము చేయబడును.” (దానియేలు 9:26) “నిర్మూలము చేయబడును” అనడానికి ఇక్కడ ఉపయోగింపబడిన కారాత్‌ అను హెబ్రీపదమే మోషే ధర్మశాస్త్రము క్రింద మరణశిక్షకు కూడ ఉపయోగింపబడింది. నిస్సందేహముగా మెస్సీయ మరణించవలసి యుండెను. ఎందుకు? దానికి 24వ వచనము, “పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయల్పరచుటకు” అని జవాబిస్తున్నది. దోషాన్ని కేవలము బలి, మరణము మాత్రమే పరిహరించునని యూదులకు బాగుగా తెలుసు.—లేవీయకాండము 17:11; హెబ్రీయులు 9:22 పోల్చండి.

18. (ఎ) మెస్సీయ బాధననుభవించి, మరణించునని యెషయా 53వ అధ్యాయం ఎలా చూపిస్తుంది? (బి) పరస్పర విరుద్ధంగా కన్పించు ఏ విషయాన్ని ఈ ప్రవచనం ఉత్పన్నం చేస్తుంది?

18 ఇతరుల పాపాలను రూపుమాపుటకు బాధననుభవించి, మరణించుటకై యెహోవా ప్రత్యేక ప్రతినిధిగావుండబోవు మెస్సీయను గూర్చి యెషయా 53వ అధ్యాయం మాట్లాడుతుంది. అందలి 5వ వచనం చెప్పునదేమనగా, “మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను; మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను.” ఈ మెస్సీయ “అపరాధ పరిహారార్థ బలిగా” మరణించవలెనని మనకు చెప్పుచున్న ఆ ప్రవచనమే, ఆయన “దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగునని” బయల్పరుస్తున్నది. (10వ వచనం) అది పరస్పర విరుద్ధంగా లేదా? మెస్సీయ మరణించి, ఎట్లు “దీర్ఘాయుష్మంతుడు” కాగలడు? ఆయన బలిగా అర్పింపబడి, ఆ తర్వాత ఆయనెలా ‘యెహోవా ఉద్దేశము సఫలము’ చేయగలడు? నిజానికి, తనను గూర్చిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రవచనాలను, అనగా ఆయన రాజుగా యుగయుగములు పరిపాలించి యావత్‌ ప్రపంచానికి సంతోష సమాధానములను తీసుకువచ్చు ప్రవచనాలను నెరవేర్చకుండా ఆయనెట్లు మరణించగలడు, మరణించి ఆ స్థితిలోనే ఎలా ఉండగలడు?—యెషయా 9:6, 7.

19. మెస్సీయను గూర్చి పరస్పర విరుద్ధంగా కన్పించు ప్రవచనాలను యేసు పునరుత్థానం ఎలా సమన్వయపరచును?

19 పరస్పర విరుద్ధమన్నట్లు కన్పించే ఈ విషయం, అత్యంత ఆశ్చర్యకరమైన ఒకేఒక అద్భుతంతో పరిష్కరించబడింది. యేసు పునరుత్థానం చేయబడెను. ఈ మహిమాన్విత నిజత్వానికి వందలాదిమంది సహృదయులైన యూదులు ప్రత్యక్ష సాక్షులయ్యారు. (1 కొరింథీయులు 15:6) అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “ఈయనయైతే [యేసుక్రీస్తు] పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.” (హెబ్రీయులు 10:10, 12, 13) అవును, యేసు పరలోకానికి పునరుత్థానుడై, కొంత కాలము “కనిపెట్టిన” తర్వాతే, ఆయన రాజుగా సింహాసనాసీనుడై తన తండ్రియైన యెహోవాకు శత్రువులైన వారిపై చర్యగైకొనును. పరలోక రాజు పాత్రలో, మెస్సీయగు యేసు ఇప్పుడు జీవించు ప్రతివ్యక్తి జీవితం మీద ప్రభావం చూపుతాడు. ఏ విధముగా? దీనిని మా తర్వాతి శీర్షిక పరిశీలించును.

[అధస్సూచీలు]

a “యోసేపు హేలీకి [కుమారుడు]” అని లూకా 3:23 చెప్పినప్పుడు, హేలీ మరియ తండ్రి గనుక, ఇక్కడ “కుమారుడు” అనగా నిజానికి “అల్లుడు,” (son–in–law) అని అర్థం.—ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి 1, పుటలు 913-17.

b యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ తన స్వంత వంశావళినిగూర్చి తెలియజేస్తూ, సా.శ. 70కి ముందు అటువంటి రికార్డులు అందుబాటులో ఉండేవని స్పష్టము చేస్తున్నాడు. ఈ రికార్డులు యెరూషలేము పట్టణంతోపాటు నాశనం చేయబడ్డాయి. అందుకే ఆ తర్వాత మెస్సీయనని చెప్పుకున్నవారి వాదనలకు రుజువుల్లేవు.

c ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి 2, పుట 387 చూడుము.

d అర్తహషస్త రాజు ఏలుబడి సా.శ.పూ. 474లో ఆరంభమయ్యెనని సూచించు బలమైన రుజువు ప్రాచీన గ్రీకు, బబులోను, పారసీకుల గ్రంథాలలో కలదు. ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి 2, పుటలు 614-16, 900 చూడండి.

e అటువంటి ప్రవచనాలలో ఒకదానియందు, ఆయన తన కాలము నుండియే అబద్ధ మెస్సీయలు బయల్దేరతారని ఆయన ప్రవచించాడు. (మత్తయి 24:23-26) దీని ముందరి శీర్షికను చూడండి.

నీవెట్లు జవాబిత్తువు?

◻ యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయేనా అను ఆధారాన్ని ఎందుకు పరీక్షించాలి?

◻ యేసు వంశక్రమము, ఎట్లు మెస్సీయగా ఆయన అర్హతను బలపరుస్తున్నది?

◻ యేసు మెస్సీయేనని నిరూపించుటకు బైబిలు ప్రవచనాలు ఎట్లు సహాయం చేస్తాయి?

◻ మెస్సీయగా యేసు గుర్తింపును యెహోవా తానే ఏయేవిధాలుగా ధృవీకరించాడు?

◻ అనేకమంది యూదులు యేసును మెస్సీయగా ఎందుకు తృణీకరించారు, ఈ కారణాలు ఎందుకు ఆధారం లేనివి?

[12వ పేజీలోని చిత్రం]

యేసు చేసిన అనేక అద్భుతాలలో ప్రతిఒక్కటి ఆయన మెస్సీయేనను అదనపు సాక్ష్యానిచ్చినవి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి