నిజ క్రైస్తవులందరు సువార్తికులై యుండాలి
“సువార్తికుని [లేదా, మిషనరీ NW] పనిచేయుము.”—2 తిమోతి 4:5, అథస్సూచి NW.
1. మొదటి శతాబ్దపు సువార్తికులు ఏ సువార్త ప్రకటించారు?
సువార్తికునిగా ఉండుట అంటే నేడు దాని భావమేమి? నీవును వారిలో ఒకడివా? సువార్తికుడను మాట గ్రీకు పదమైన యువాజ్జెలిస్ట్‌స్, నుండి వస్తున్నది. దానికి “సువార్త ప్రకటించువాడని అర్థం.” సా.శ. 33లో క్రైస్తవ సంఘం స్థాపించబడిన నాటినుండి, క్రైస్తవ సువార్త దేవుని రక్షణ విధానమును నొక్కితెల్పుచు, మానవజాతిపై తన పరిపాలనను కొనసాగించుటకు భవిష్యత్తులో యేసుక్రీస్తు తిరిగి వచ్చునని ప్రకటించినది.—మత్తయి 25:31, 32; 2 తిమోతి 4:1; హెబ్రీయులు 10:12, 13.
2. (ఎ) మన కాలమందు సువార్త సారమెట్లు బలపడింది? (బి) నేడు నిజ క్రైస్తవులందరిపై ఏ బాధ్యత ఉన్నది?
2 తన రాకడ, తన అదృశ్య ప్రత్యక్షతను గూర్చి యేసు యిచ్చిన సూచన నెరవేరుచున్నదను రుజువు 1914 నుండి అంతకంతకు బలపడుచున్నది. (మత్తయి 24:3-13, 33) సువార్తలో, “దేవునిరాజ్యము సమీపమై యున్నదను” అర్థం యిమిడి యుందని మరలా చెప్పవచ్చును. (లూకా 21:7, 31; మార్కు 1:14, 15) నిజమే, మత్తయి 24:14లో వ్రాయబడియున్న యేసు ప్రవచనము పెద్దయెత్తున నెరవేరు కాలము సమీపించినది, అదేమనగా: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” కాబట్టి, ఇప్పుడు జరిగించబడుచున్న సువార్తపనిలో స్థాపింపబడిన దేవుని రాజ్యమును గూర్చి ఆసక్తితో ప్రకటించుట, విధేయతగల మానవజాతికి అది త్వరలో తీసుకువచ్చే ఆశీర్వాదములు చేరియున్నవి. క్రైస్తవులందరు ఈ పనితోపాటు “శిష్యులనుగా చేయుడి” అను ఆజ్ఞ క్రింద ఉన్నారు.—మత్తయి 28:19, 20; ప్రకటన 22:17.
3. (ఎ) “సువార్తికుడను” మాటకు ఇంకా ఏ అదనపు అర్థమున్నది? (ఇన్‌సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్, సంపుటి 1, పుట 770, కాలమ్ 2, పేరా 2 చూడుము.) (బి) ఇది ఏ ప్రశ్నల నుత్పన్నం చేస్తున్నది?
3 అందరికి సువార్తను ప్రకటించుటకు తోడు, సువార్త ప్రకటించబడని ప్రాంతాలలో సువార్తను ప్రకటించుటకు తమ స్వస్థలాలను విడిచిపెట్టు వారి విషయములో బైబిలు ఒక ప్రత్యేక భావముతో గౌరవిస్తూ “సువార్తికుడు” అను మాటను ఉపయోగిస్తున్నది. మొదటి శతాబ్దములో, ఫిలిప్పు, పౌలు, బర్నబా, సీల, తిమోతివంటి అనేకమంది మిషనరీ సువార్తికులుండిరి. (అపొ. కార్యములు 21:8; ఎఫెసీయులు 4:11) మరి 1914 నుండి మన ప్రత్యేకకాలం సంగతేమి? ఈనాడు యెహోవా ప్రజలు స్థానికముగాను, ఆలాగే మిషనరీలగు సువార్తికులుగా సేవచేయుటకై తాము అందుబాటులో ఉన్నారా?
పందొమ్మది వందల పంతొమ్మిది నుండి అభివృద్ధి
4, 5. సువార్త సేవకు 1914 గడచిన వెంటనే ఏమి సంభవించనై యుండెను?
4 మొదటి ప్రపంచ యుద్ధం 1918లో అంతమైనప్పుడు, దేవుని సేవకులు మతభ్రష్టులనుండి, క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులనుండి వారి రాజకీయ సహచరులనుండి విపరీతమైన వ్యతిరేకత ననుభవించారు. అబద్ధ ఆరోపణలపై అమెరికాలోని వాచ్‌టవర్ సొసైటి అధికారిక ప్రముఖులకు 20 సంవత్సరాలు చెరసాల శిక్ష వేయబడినప్పుడు, వాస్తవానికి నిజ క్రైస్తవ సువార్తపని 1918 జూన్‌లో దాదాపుగా స్తంభించిపోయింది. సువార్త ప్రకటించు పనిని ఆపుజేయుటలో దేవుని శత్రువులు కృతార్థులయ్యారా?
5 అనుకొనని రీతిగా 1919 మార్చిలో సొసైటి అధికారులు విడుదల చేయబడి, వారి చెరసాల శిక్షకు కారణమైన అబద్ధ ఆరోపణల విషయములో నిర్దోషులని తీర్చబడ్డారు. వారికి లభించిన నూతన స్వాతంత్య్రముతో ఈ అభిషక్త క్రైస్తవులు, దేవుని రాజ్యములో తోడివారసులుగా పరలోక బహుమతికి తాము సమకూర్చబడుటకు ముందు చేయవలసిన పని ఇంకను ఎంతో విస్తారముగా ఉన్నదని గ్రహించారు.—రోమీయులు 8:19; 2 తిమోతి 2:12; 4:18.
6. సువార్త సేవ 1919 మరియు 1939 మధ్య ఎట్లు అభివృద్ధిచెందెను?
6 అప్పుడు 1919లో సువార్తను ప్రకటించుచున్నట్లు రిపోర్టు చేసినవారు కేవలము 4,000ల కంటె తక్కువగా ఉండిరి. ఆ తర్వాతి రెండు దశాబ్దములలో, మిషనరీలైన సువార్తికులుగా సేవచేయుటకు అనేకమంది పురుషులు సమర్పించుకొనగా వారిలో కొంతమంది ఆఫ్రికా, ఆసియా, యూరపులోని దేశాలకు పంపబడ్డారు. ఇరవై సంవత్సరాల సువార్త ప్రకటన తర్వాత అనగా 1939 నాటికి, యెహోవాసాక్షుల సంఖ్య 73,000 పైగా పెరిగింది. క్రైస్తవ సంఘపు తొలి సంవత్సరాలలో సంభవించిన విధంగానే తీవ్రహింస మధ్య ఈ అసాధారణ అభివృద్ధి సాధించబడింది.—అపొ. కార్యములు 6:7; 8:4, 14-17; 11:19-21.
7. క్రైస్తవ సువార్త సేవ విషయమై సా.శ. 47 మరియు 1939 సంవత్సరములలో ఎటువంటి సమాంతర పరిస్థితి నెలకొనియుండెను?
7 అయినను, అప్పటికి యెహోవాసాక్షులలో అధికులు ఇంగ్లీషు మాట్లాడు ప్రొటస్టెంటు దేశాలకు మాత్రమే పరిమితమై యుండిరి. నిజానికి, 73,000 మంది రాజ్య ప్రచారకులలో 75 శాతం మంది ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజీలాండ్, అమెరికాలనుండి వచ్చినవారే. సా.శ. 47లో ఉన్న మాదిరిగానే, భూమిమీది పనిచేయని ప్రాంతాలపై శ్రద్ధనిల్పుటకు సువార్తికులను ప్రోత్సాహించుటకు ఏదో ఒకటి చేయవలసియుండెను.
8. గిలియడ్ పాఠశాల 1992 నాటికి ఏమి సాధించెను?
8 మరింత గొప్ప విస్తరణకు సిద్ధపడులాగున యెహోవా సేవకులను ప్రేరేపించుటకు ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మను యుద్ధకాల నిషేధములు, హింసలు ఆపుజేయలేక పోయినవి. రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుచున్న 1943లో, మరింత విస్తారంగా సువార్తను వ్యాప్తిచేయవలెనను ఉద్దేశముతో దేవుని సంస్థ వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌ను నెలకొల్పంది. మార్చి 1992 నాటికి ఈ పాఠశాల 171 దేశాలకు 6,517 మంది మిషనరీలను పంపించింది. దీనికి తోడుగా, విదేశాలలో వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయాల నిర్వహణకు అనేకమందికి శిక్షణ ఇవ్వబడింది. పందొమ్మది వందల తొంభై రెండు నాటికి 97 బ్రాంచి కమిటీల సమన్వయకర్తలలో, 75 మంది గిలియడ్‌నందు శిక్షణ పొందిరి.
9. సువార్త సేవ, శిష్యులనుచేయు పని అభివృద్ధి చెందుటకు ఏ శిక్షణా కార్యక్రమములు పాత్ర వహించినవి?
9 గిలియడ్ పాఠశాలకు తోడుగా, యెహోవా ప్రజలు తమ సువార్త పనిని విస్తరించుటకు, వృద్ధిచేసికొనుటకు ఇతర శిక్షణా కార్యక్రమాలు వారిని సంసిద్ధులను చేసాయి. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాలలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్వహించబడుచున్నది. వారములో జరుగు సేవాకూటముతో కలుపుకొని ఈ ఏర్పాటు, బహిరంగ పరిచర్యలో సమర్థవంతముగా ఉండుటకు లక్షలాదిమందికి శిక్షణనిచ్చింది. పెరుగుతున్న సంఘాలయెడల మరింత శ్రేష్టమైన శ్రద్ధచూపునట్లు పెద్దలకు, పరిచారకులకు విలువైన శిక్షణనిచ్చు రాజ్య పరిచర్య పాఠశాలకూడ కలదు. ప్రకటించు పనిలో మరింత సమర్థులగుటకు అనేకమంది పూర్తికాల సువార్తికులకు పయినీర్ సేవా పాఠశాల సహాయపడింది. అవివాహితులైన పెద్దలు, పరిచారకులు ఆధునిక దిన తిమోతిలవలె తయారగునట్లు సహాయపడుటకు, ఇటీవలనే వివిధ దేశాలలో మినిస్టీరియల్ ట్రెయినింగ్ పాఠశాల నిర్వహించబడింది.
10. దేవుని సంస్థ అందించిన శ్రేష్టమైన శిక్షణయంతటి ఫలితమేమైయున్నది? (బాక్సులోని సమాచారాన్ని కూడ చేర్చిచెప్పండి.)
10 ఈ శిక్షణయంతటి ఫలితమేమై యున్నది? యెహోవాసాక్షులు 1991లో 212 దేశాలలో చురుకుగా రాజ్య ప్రకటన చేయు 40 లక్షలకు పైగావున్న శిఖరాగ్ర సంఖ్యకు చేరుకొన్నారు. అయితే, 1939లో ఉన్న పరిస్థితివలె కాకుండా, వీరిలో 70 కంటె ఎక్కువ శాతంమంది ఇంగ్లీషు ప్రధాన భాషకాని, కాథోలిక్, ఆర్థొడాక్స్, క్రైస్తవేతర లేక ఇతర దేశాలనుండి వచ్చినవారై యున్నారు.—“పందొమ్మిది వందల ముప్పయితొమ్మిది నుండి విస్తరణ” అను బాక్సు చూడుము.
ఎందుకు విజయవంతులైరి
11. పరిచారకునిగా తన విజయానికి కారణమెవరని అపొస్తలుడైన పౌలు చెప్పెను?
11 ఈ విస్తరణనుబట్టి, యెహోవాసాక్షులు ఘనతను పొందనపేక్షించరు. బదులుగా, అపొస్తలుడైన పౌలువలెనే వారు తమ పనిని దృష్టిస్తారు. ఆయన కొరింథీయులకు వ్రాసిన పత్రికలో ఇలా వివరించాడు: “అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.”—1 కొరింథీయులు 3:5-7, 9.
12. (ఎ) విజయవంతమైన క్రైస్తవ సువార్త సేవలో దేవునివాక్యము ఏ పాత్ర వహించెను? (బి) క్రైస్తవ సంఘ శిరస్సుగా ఎవరు నియమించబడ్డారు, ఆయన శిరస్సత్వానికి లోబడుచున్నామని చూపుటకు ఒక ప్రాముఖ్యమైన మార్గమేమిటి?
12 యెహోవాసాక్షులకు కలిగిన ఆశ్చర్యకరమైన అభివృద్ధి కేవలము దేవుని ఆశీర్వాదఫలమే అనుటలో సందేహము లేదు. ఇది దేవుని పని. ఈ వాస్తవాన్ని గ్రహించినవారై, వారు దేవునివాక్యాన్ని క్రమంగా పఠించుటకు కృషిచేస్తారు. సువార్త పనిలో వారు బోధించు వాటన్నింటిని బైబిలు ఆధారంగానే బోధిస్తారు. (1 కొరింథీయులు 4:6; 2 తిమోతి 3:16) సువార్త పనిలో వారి విజయానికి కీలకమైన మరొక కారణమేమంటే, క్రైస్తవ సంఘముపై శిరస్సుగా దేవుడు నియమించిన వారితో సహకరించుట ద్వారా దీనిని చూపించారు. వీరును, యెరూషలేము సంఘములోని ఇతర పెద్దలును కలిసి, మొదటి శతాబ్దపు పరిపాలక సభగా రూపొందారు. వివాదములను పరిష్కరించుటకు, సువార్త పనిని నిర్దేశించుటకు పరలోకమునుండి ప్రభువైన యేసుక్రీస్తు పరిణతిచెందిన ఈ క్రైస్తవ గుంపును ఉపయోగించాడు. ఈ దైవిక ఏర్పాటుకు పౌలు ఆసక్తిపూర్వకముగా సహకరించిన ఫలితముగా ఆయన సందర్శించిన సంఘములలో అభివృద్ధి జరిగింది. (అపొ. కార్యములు 16:4, 5; గలతీయులు 2:9) అదేప్రకారము ఈనాడు, దేవుని వాక్యమునకు గట్టిగా హత్తుకొని, పరిపాలక సభనుండి వచ్చు నడిపింపుకు ఆసక్తిపూర్వకముగా సహకరించుట ద్వారా, క్రైస్తవ సువార్తికులు తమ పరిచర్యయందు విజయాన్ని సాధించగలరు.—తీతు 1:9; హెబ్రీయులు 13:17.
ఇతరులు మనకంటె యోగ్యులని పరిగణించుట
13, 14. (ఎ) ఫిలిప్పీయులు 2:1-4లో వ్రాయబడినట్లుగా, అపొస్తలుడైన పౌలు ఏ సలహానిచ్చాడు? (బి) సువార్త సేవలో భాగం వహిస్తుండగా ఈ సలహాను జ్ఞాపకముంచుకొనుటకు ఎందుకు ప్రాముఖ్యం?
13 సత్యాన్వేషకుల యెడల అపొస్తలుడైన పౌలు నిజమైన ప్రేమను కనబరచాడే తప్ప, తాను వారికంటె యోగ్యుడని లేదా జాతి వివక్ష చూపలేదు. కాబట్టే, ఆయన ‘తమకంటె ఇతరులు యోగ్యులుగా యెంచుడని’ తోటి విశ్వాసులకు సలహానివ్వగల్గాడు.—ఫిలిప్పీయులు 2:1-4.
14 అదేప్రకారముగా, ఈనాడు నిజ క్రైస్తవ సువార్తికులు, వివిధ జాతులు, జీవిత చరిత్రగల ప్రజలతో వ్యవహరించునప్పుడు తాము వారికంటె ఉన్నతులమను స్వభావాన్ని కలిగియుండరు. అమెరికా నుండి ఆఫ్రికాలో మిషనరీగా పనిచేయుటకు నియమించబడిన ఒక యెహోవాసాక్షి ఇట్లన్నారు: “మేము ఉన్నతులం కాదనే విషయం మాత్రం నాకు తెలుసు. బహుశ మా దగ్గర ఎక్కువ డబ్బు, చదువు ఉండవచ్చు, కానీ వారు [స్థానికులు] మాకంటె ఉన్నతమైన లక్షణాలను కలిగియున్నారు.”
15. విదేశాలలో పనిచేయుటకు నియమించబడిన వారు శిష్యులు కానైయున్న వారియెడల ఎట్లు నిజమైన గౌరవం చూపగలరు?
15 నిజమే, మనమెవరితో సువార్త పంచుకొందుమో వారి యెడల నిజమైన గౌరవమును ప్రదర్శిస్తే, వారు బైబిలు వర్తమానాన్ని సులభంగా అంగీకరించునట్లు మనం చేయగలం. సహాయము చేయుటకు తాను నియమించబడిన ప్రజలమధ్య నివసించుటకు తానెంతో సంతోషిస్తున్నానని మిషనరీ సువార్తుకుడు చూపినప్పుడుకూడా అది సహాయకరంగా ఉండును. గడచిన 38 సంవత్సరాలు ఆఫ్రికాలో గడిపిన ఒక విజయవంతమైన మిషనరీ ఇలా వివరిస్తున్నది: “ఇది నా యిల్లని, నేను నియమించబడిన సంఘమందున్న వారు నా సహోదర సహోదరీలను గాఢమైన భావము నాకున్నది. సెలవుపై నేను కెనడా తిరిగి వెళ్లినప్పుడు, నిజంగా నేను ఇంట్లో ఉన్నట్లు భావించలేదు. కెనడాలో గడిపిన చివరివారంలో నేను త్వరగా నా పనికి తిరిగి వెళ్లాలనిపించింది. నేనక్కడ ఉండలేకపోయాను. నాకెప్పుడూ అలానే అన్పిస్తుంది. తిరిగి రావడం నాకెంతో సంతోషమని నా బైబిలు విద్యార్థులకు, సహోదర సహోదరీలకు చెప్పినప్పుడు నేను వారితోనే ఉండాలని కోరడాన్ని వారు ప్రశంసిస్తారు.”—1 థెస్సలొనీకయులు 2:8.
16, 17. (ఎ) తమ పరిచర్యలో మరింత సమర్థవంతముగా ఉండుటకుగాను అనేకమంది మిషనరీలు, స్థానిక సువార్తికులు ఏ సవాలు నంగీకరించారు? (బి) స్థానిక భాషలో మాట్లాడినందున ఒక మిషనరీ ఎటువంటి అనుభవాన్ని పొందింది?
16 తమ ప్రాంతమందలి ఒక ప్రదేశములో ఇతర భాషా ప్రజలు ఎక్కువమంది నివసిస్తున్నారని తెలిసినప్పుడు, కొందరు ఆ భాష నేర్చుకొనుటకు ప్రయత్నించారు. దీనిద్వారా వారు తమకంటె ఇతరులను యోగ్యులుగా పరిగణిస్తున్నారని చూపిస్తున్నారు. “దక్షిణాఫ్రికాలో కొన్నిసార్లు ఆఫ్రికా ప్రజలకు, యూరపు దేశాల ప్రజలకు మధ్య అపనమ్మక భావమేర్పడుతుంది. అయితే మేము స్థానికభాషలో మాట్లాడుట ఈ భావాన్ని వెంటనే తొలగించివేస్తుందని” ఒక మిషనరీ అభిప్రాయపడ్డారు. మనము సువార్తనందించే ప్రజల భాషలో మాట్లాడుటవల్ల అది వారి హృదయాలను చేరుటకు గొప్ప సహాయముగా ఉండగలదు. దీనికి కృషితోపాటు వినయముతో కూడిన పట్టుదల అవసరము. ఆసియా దేశములో సేవచేస్తున్న ఒక మిషనరీ ఇలా వివరిస్తున్నది: “అదేపనిగా తప్పులు మాట్లాడుట, అలా తప్పు మాట్లాడినప్పుడల్లా మిమ్మునుచూసి నవ్వుట ఒక పరీక్షగా ఉండవచ్చు.” అయితే, దేవుని యెడల పొరుగువారి యెడల ఉన్న ప్రేమ, పట్టుదలతో కృషిచేయుటకు ఈ మిషనరీకి సహాయపడింది.—మార్కు 12:30, 31.
17 విదేశీయుడొకరు తమ భాషలో సువార్తను తమతో పంచుకొనుటకు కృషిచేసినప్పుడు ఆ ప్రజలు అనుకూలముగా స్పందిస్తారని అర్థమౌవుతుంది. కొన్నిసార్లు అది ఊహించని ఆశీర్వాదములను కలుగజేయును. ఆఫ్రికా దేశమగు లెసొతొలో ఒక మిషనరీ, బట్టలకు రంగులు అద్దే అంగడిలో పనిచేయు మరొక స్త్రీతో సెసొతొ భాషలో మాట్లాడసాగింది. ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన వేరొక ఆఫ్రికా దేశపు మంత్రి ఈ సంభాషణ విన్నాడు. దగ్గరకువచ్చి ఆయన ఆమెను స్నేహపూర్వకముగా మెచ్చుకొనగా, ఆమె ఆ మంత్రితో ఆయన స్వభాషలో మాట్లాడుట కారంభించింది. “మీకు స్వాహిలి భాషకూడ వచ్చు కాబట్టి, మాదేశానికి వచ్చి, మా ప్రజల మధ్యకూడ మీరెందుకు సేవచేయకూడదు?” అని ఆయన అడిగాడు. అందుకు యుక్తిగా ఆ మిషనరీ, “అలా అయితే బాగానే ఉంటుందండి. కానీ నేనొక యెహోవాసాక్షిని. ప్రస్తుతం మీ దేశంలో మా పనిని చట్టం అనుమతించుటలేదని” జవాబుచెప్పింది. దానికాయన మాట్లాడుతూ, “మేమంతా మీ పనిని వ్యతిరేకిస్తున్నామని దయచేసి మీరనుకోవద్దు. మాలో చాలామంది యెహోవాసాక్షులంటే ఇష్టపడతారు. బహుశ ఏదోఒకరోజు మీరు స్వేచ్ఛగా మా ప్రజలమధ్య బోధించగలుగుతారని” అన్నాడు. కొంతకాలం తర్వాత, ఆ దేశములో యెహోవాసాక్షులకు స్వేచ్ఛ ఇవ్వబడిందని తెలిసికొని ఆ మిషనరీ ఎంతో ఉప్పొంగిపోయింది.
హక్కుల త్యాగానికి ఇష్టపడుట
18, 19. (ఎ) ఏ ప్రాముఖ్యమైన పద్ధతిలో పౌలు తన యాజమానియైన యేసుక్రీస్తును అనుకరించుటకు కృషిసల్పాడు? (బి) మనము సువార్త పంచుకొనువారిని అభ్యంతర పరచకుండు ప్రాముఖ్యతను చూపుటకు (పేరాలోనిదిగాని లేదా మీ స్వంతగా) ఒక అనుభవాన్ని వివరించండి.
18 “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు, ఆయన ఇతరులను అభ్యంతరపెట్టకుండు అవసరమును గూర్చి చర్చిస్తుండెను. ఆయనిట్లన్నాడు: “మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేనుకూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.”—1 కొరింథీయులు 10:31-33; 11:1.
19 పౌలువలెనే, తాము ప్రకటించు వారి విషయమై త్యాగాలు చేయుటకు ఇష్టపడు సువార్తికులు, ఆశీర్వదించబడుదురు. ఉదాహరణకు, ఒక ఆఫ్రికా దేశములో, తమ వివాహ వార్షిక దినాన్ని జరుపుకొనుటకు సాయంకాల భోజనానికి ఒక మిషనరీ దంపతులు స్థానికంగావున్న ఒక హోటలుకు వెళ్లారు. బైబిలులో పరిమితముగా ఆల్కహాలు పుచ్చుకొనుట నిషేధింపబడలేదు గనుక, వారు భోజనంతోపాటు ద్రాక్షారసం కొరకు ఆర్డరు ఇద్దామని మొదట అనుకున్నారు. (కీర్తన 104:15) అయితే ఇది స్థానిక ప్రజలకు అభ్యంతరం కలిగిస్తుందేమోనని వారు అలా చేయకూడదని తీర్మానించుకున్నారు. ఆ భర్త ఇలా గుర్తుతెచ్చుకొంటున్నాడు: “కొన్నిరోజుల తర్వాత, ఆ హోటల్ వంటశాలధికారిని మేము కలిసి, ఆయనతో బైబిలు పఠనం ప్రారంభించాము. అలా కొంత కాలం గడిచిన తర్వాత ఆయన మాతో ఇలా చెప్పాడు: ‘మీరొకసారి సాయంకాల భోజనానికి హోటల్‌కు వచ్చారు గుర్తుందా? వంటగది తలుపు వెనుకనుండి మేమంతా మీ ఇద్దరిని గమనించాము. త్రాగడం తప్పు అని చర్చి మిషనరీలు మాకు చెప్పేవారు. అయితే, వారు హోటల్‌కు వచ్చినప్పుడు మాత్రం, ఇష్టమొచ్చినట్లు ద్రాక్షారసం కొరకు వారు ఆర్డరు చేసేవారు. కాబట్టి త్రాగడానికి మీరు ఒకవేళ ఆర్డరిచ్చినట్లయిన, మాకు ప్రకటించడానికి వచ్చినప్పుడు మీరు చెప్పే విషయాలు వినకూడదని మేము తీర్మానించుకున్నాము.” నేడు, ఆ వంటశాలాధికారి, ఆ హోటల్లో పనిచేసే మరికొందరు బాప్తిస్మము పుచ్చుకొన్న సాక్షులయ్యారు.
చేయుటకు ఇంకా చాలావున్నది
20. ఆసక్తిగల సువార్తికులుగా మనము సహించుట ఎందుకు ఆవశ్యకం, అనేకమంది ఎటువంటి ఆనందదాయకమైన ఆధిక్యత ననుభవిస్తున్నారు?
20 ఈ దుష్టవిధానం యొక్క అంతం వేగముగా సమీపిస్తుండగా, ఇంకనూ అనేకులు సువార్త వినుటకు కోరుచున్నారు, కాగా ప్రతి క్రైస్తవుడు క్రితమెన్నటికంటెను నమ్మకమైన సువార్తికునిగా సేవచేయుట మరింత అత్యవసరము. (మత్తయి 24:13) ఫిలిప్పు, పౌలు, బర్నబా, సీల, తిమోతి వలెనే ఒక ప్రత్యేక భావమందు సువార్తికునిగా తయారగుట ద్వారా, ఈ పనిలో నీ భాగమును నీవు విస్తరింపజేయగలవా? పయినీర్లుగా తయారగుట ద్వారా, అవసరమెక్కువున్న ప్రాంతాలలో సేవచేయుటకు సంసిద్ధత చూపుటద్వారా అనేకులు అలా చేస్తున్నారు.
21. యెహోవా ప్రజలకు ఏ విధముగా “కార్యానుకూలమైన మంచి సమయము . . . ప్రాప్తించియున్నది”?
21 ఇంతకుముందు, యెహోవాసాక్షుల సేవ నిషేధింపబడిన ఆఫ్రికా, ఆసియా, తూర్పు యూరపు దేశాలలో సువార్త ప్రకటనకు ఇటీవల అనేక ప్రాంతాలు తెరువబడ్డాయి. పౌలు విషయంలో జరిగినట్లే, యెహోవా ప్రజలకు “కార్యానుకూలమైన మంచి సమయము . . . ప్రాప్తించియున్నది.” (1 కొరింథీయులు 16:9) ఉదాహరణకు, ఇటీవలనే ఆఫ్రికా దేశమగు మొజాంబిక్‌కు వచ్చిన మిషనరీలైన సువార్తికులు బైబిలు పఠనము కావాలని కోరుచున్న ప్రజలందరికి పఠనములు నిర్వహించలేక పోతున్నారు. ఆ దేశములో 1991 ఫిబ్రవరి 11న యెహోవాసాక్షుల సేవ చట్టబద్ధం చేయబడినందుకు మనమెంతగా ఆనందించగలం!
22. మన స్థానిక ప్రాంతములో బహుగా సేవ జరిగినను, జరుగకపోయినను మనమందరము ఏమి చేయుటకు తీర్మానించుకొనవలెను?
22 ఎల్లవేళల ఆరాధనా స్వేచ్ఛ కలిగియున్న దేశాలలో కూడ మన సహోదరులు ఎడతెగని అభివృద్ధి ననుభవిస్తున్నారు. అవును మనమెక్కడ జీవించినను, చేయుటకు మనకక్కడ “ప్రభువు కార్యము” ఎంతో విస్తారముగా ఉన్నది. (1 కొరింథీయులు 15:58) అందుచేత, మనలో ప్రతి ఒక్కరు ‘సువార్తికుని పనిచేస్తూ, పరిచర్యను సంపూర్ణముగా జరిగిస్తూ’ మిగిలియున్న సమయాన్ని మనం జ్ఞానయుక్తంగా ఉపయోగించుటలో కొనసాగుదాం.—2 తిమోతి 4:5; ఎఫెసీయులు 5:15, 16.
మీరు వివరించగలరా?
◻ సువార్తికుడనగానేమి?
◻ సువార్త సారాంశము 1914 నుండి ఎట్లు బలపర్చబడింది?
◻ సువార్త పని 1919 నుండి ఎట్లు అభివృద్ధియైనది?
◻ సువార్త సేవా విజయానికి ఏ కీలక కారకములు దోహదపడినవి?
[12వ పేజీలోని బాక్సు]
“పందొమ్మిది వందల ముప్ఫయితొమ్మిది నుండి విస్తరణ”
గిలియడ్ శిక్షణ పొందినవారు పంపబడిన మూడు ఖండముల ఉదాహరణలను పరిశీలించండి. పశ్చిమాఫ్రికా నుండి రాజ్య ప్రచారకులుగా రిపోర్టు చేసినవారు 1939లో కేవలము 636 మంది మాత్రమే ఉండిరి. ఈ సంఖ్య 1991 నాటికి పశ్చిమాఫ్రికాలోని 12 దేశాలలో 2,00,000 లకుపైగా పెరిగిపోయింది. దక్షిణ అమెరికా దేశాలలో ఆశ్చర్యకరమైన పెరుగుదలకు కూడ మిషనరీలు దోహదపడిరి. వాటిలో బ్రెజిల్ ఒకటి, ఇక్కడ 1939లో 114 మంది రాజ్య ప్రచారకులుండగా, అది 1992 ఏప్రిల్ నాటికి 3,35,039గా అభివృద్ధియైనది. ఆసియా దేశాలకు మిషనరీలు రావడంతో అక్కడకూడ అటువంటి అభివృద్ధే జరిగింది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో జపాన్‌లోనున్న కొద్దిమంది యెహోవాసాక్షులు తీవ్రహింసకు గురికాగా, అక్కడ వారి సేవ దాదాపు స్తంభించిపోయింది. ఆ పిమ్మట, 1949లో సేవను పునర్‌వ్యవస్థీకరించుటకై 13 మంది మిషనరీలు అక్కడకు వచ్చిరి. ఆ సేవా సంవత్సరములో, జపాన్ అంతటిలో కేవలము పదిమందికంటే తక్కువమంది మాత్రమే తమ ప్రాంతీయ సేవా రిపోర్టిచ్చారు. అయితే 1992 ఏప్రిల్‌లో వారి ప్రచారకుల సంఖ్య మొత్తం 1,67,370కు పెరిగిపోయింది.
[14వ పేజీలోని బాక్సు]
క్రైస్తవమత సామ్రాజ్యం మరియు భాషా సమస్య
క్రైస్తవమత సామ్రాజ్యమందలి కొందరు మిషనరీలు విదేశీ భాష నేర్చుకొనుటకు చిత్తశుద్ధితో కృషిచేశారు, అయితే చాలామంది తమ యూరపు దేశాల భాషనే స్థానికులు మాట్లాడవలెనని ఆశించారు. జాఫ్రే మూర్‌హౌస్ తన పుస్తకమగు ది మిషనరీస్‌లో ఇలా వివరిస్తున్నాడు:
“సమస్యేమంటే, స్థానిక భాష నేర్చుకోవడం కేవలం ఒక లేఖనాన్ని తర్జుమా చేయడంకంటే ఎక్కువేమీకాదని తరచు పరిగణించారు. అనర్గళంగా మాట్లాడు స్థానిక భాష మాత్రమే ఇద్దరు మానవుల మధ్యలో లోతైన అవగాహనను పెంచును గనుక, మిషనరీ తప్పకుండా స్థానికులతో వారి స్వభాషలోనే మాట్లాడాలను విషయాన్ని వారుగాని, వారిని నియమించు సంస్థలుగాని పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి మిషనరీ స్థానిక భాషలో అతిస్వల్ప జ్ఞానమే కల్గివుండేవారు. . . . ఇంగ్లీషు సందర్శకుల పద్ధతులకే ఆఫ్రికా దేశవాసి లొంగివుండాలనే భావంతో, అభివృద్ధికి అవకాశమేలేని పిడ్జిన్ ఇంగ్లీషులో వారితో మాట్లాడం మినహా ఎక్కువేమీ ఉండేది కాదు. దాని నీచమైన రూపంలో, ఇది మరొక రకంగా జాత్యహంకారమును ప్రదర్శించింది.”
లండన్ నందలి ది స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ 1922లో భాషా సమస్యపై ఒక నివేదికను ప్రచురించింది. “ప్రాంతీయ భాషలో మిషనరీలు సాధించిన ప్రావీణ్యతా స్థాయి సగటు . . . విచారకరమై, చివరకు ప్రమాదభరితమైన అథోస్థాయిలో ఉన్నదని మా అభిప్రాయం” అని ఆ నివేదిక తెల్పింది.
తమ మిషనరీ సేవలో విజయం సాధించుటకు దోహదపడే, స్థానిక భాషను నేర్చుకొనుట తప్పనిసరియని వాచ్‌టవర్ సొసైటి మిషనరీలు ఎల్లవేళల గుర్తిస్తారు.