భూగోళపు నీటిలో మనుష్యులను పట్టుట
“నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయకారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.”—1 కొరింథీయులు 9:16.
1, 2. (ఎ) మొదటి కొరింథీయులు 9:16 నందు చెప్పబడిన సవాలుకు ఎవరు నిజముగా సరితూగిరి, మీరెందుకు అట్లు సమాధానమిత్తురు? (బి) యెహోవాసాక్షులు ఏ బాధ్యతను అంగీకరించిరి?
ఈ ఇరవైయవ శతాబ్దములో పైన చెప్పబడిన పౌలు మాటల సవాలుకు నిజముగా ఎవరు సరితూగారు? “ఆత్మవిషయమై దీనులైన” స్త్రీపురుషులను వెదకుటకు లక్షలసంఖ్యలో ఎవరు ప్రపంచములోనికి బయలు వెళ్లియున్నారు? (మత్తయి 5:3) ఎవరు చెరసాలశిక్షను, మరణమును భరించారు మరియు మత్తయి 24:14 నందలి క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చినందున అనేక దేశాలలో ఎవరు బాధననుభవించారు?
2 వారు యెహోవాసాక్షులేనని చరిత్ర జవాబిచ్చుచున్నది. పోయిన సంవత్సరములోనే 200కంటె ఎక్కువ భాషలలో 211 దేశాలలో, ఆయాప్రాంతాలలో ‘సువార్తను’ ప్రకటించుటకు 40 లక్షలకుపైగా సాక్షులు ఇంటింటికి వెళ్లారు. వీరు కేవలము ఎన్నికచేయబడి శిక్షణపొందిన మిషనరీల గుంపుకాదు. ఇంటింటను, సరియైన ప్రతి సందర్భమందును ప్రకటించి, బోధించు బాధ్యత తమకు కలదని యెహోవాసాక్షులందరు భావింతురు. ఇతరులతో తమ నమ్మకాలను పంచుకోవాల్సిన అవసరత కలదని వారెందుకు భావిస్తారు? ఎందుకనగా జ్ఞానము, బాధ్యతను తెచ్చునని వారు గుర్తింతురు.—యెహెజ్కేలు 33:8, 9; రోమీయులు 10:14, 15; 1 కొరింథీయులు 9:16, 17.
మనుష్యులకొరకు వెదకుట, ఒక భౌగోళిక సవాలు
3. చేపలుపట్టు పని ఎంత విస్తారముగా ఉండవలెను?
3 ఈ విస్తారమైన చేపలవేట, ఏదోఒక నదికి, సరస్సుకు లేక ఒకానొక సముద్రానికి మాత్రమే అది పరిమితము కాదు. యేసు ఆజ్ఞాపించినట్లుగా, దానిని ‘సకల జనములలోను’ నెరవేర్చవలసి యున్నది. (మార్కు 13:10) తనతండ్రి యొద్దకు ఎక్కిపోవుటకు ముందు యేసు తన శిష్యులకిట్లు చెప్పెను: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతోకూడ ఉన్నాను.”—మత్తయి 28:19, 20.
4. (ఎ) యేసుయొక్క తొలి యూదులైన శిష్యులను ఏది ఆశ్చర్యపరచి యుండవచ్చును? (బి) యెహోవాసాక్షులు తమ ప్రకటించు పని పరిమాణమును ఎట్లు దృష్టింతురు?
4 యేసుయొక్క యూదులైన అనుచరులకు అది ఒక కలవరపరచు ఆజ్ఞయైయుండెను. వారిప్పుడు “అపవిత్రమైన” సమస్త జనాంగములలోని అన్యులయొద్దకు వెళ్లి వారికి బోధించవలెనని యేసు తన యూదులైన శిష్యులకు చెప్పుచుండెను. తమకు అప్పగింపబడిన ఆ పని భావమును గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించుటకు వారు కొన్ని సవరణలు చేసికొనవలసి యుండిరి. (అపొ. కార్యములు 10:9-35) దానికిక ప్రత్యామ్నాయమే లేదు; యేసు ఒక ఉపమానములో “పొలము లోకము” అని వారికి చెప్పెను. కావున, యీనాడు చేపలవేటకు యావత్ ప్రపంచమందు తమకు హక్కు కలదని యెహోవాసాక్షులు భావింతురు. దేవుడు వారికిచ్చిన ఆజ్ఞ ప్రకారము వారికి సముద్రజలాల “20 కిలోమీటర్ల పరిధి” లేక “దేశాధికారపరిధిలోని సముద్రభాగం” అను పరిమితులు ఉండవు. మత స్వాతంత్ర్యము లేనిచోట కొన్నిసార్లు వివేచన అవసరము. అయినప్పటికిని, వారు అత్యవసరతా భావముతో చేపలుపట్టు పనిని కొనసాగింతురు. ఎందుకంత అత్యవసరం? ఎందుకనగా ప్రపంచ సంఘటనలు, బైబిలు ప్రవచనముల నెరవేర్పు మనము భౌగోళికముగా చేపలుపట్టు పని చివరి భాగమందున్నామని సూచించుచున్నవి.—మత్తయి 13:38; లూకా 21:28-33.
భౌగోళికపు చేపలుపట్టే పనిలో పురోగభివృద్ధి
5. భూవ్యాప్తముగా చేపలుపట్టు పనికి ఎటువంటి ప్రజలు ప్రత్యుత్తరమిచ్చు చున్నారు?
5 అభిషక్త రాజ్య వారసులలో అనేకులు 1935 కు ముందే జనాంగములనుండి “పట్టబడిరి,” కావున వారి పూర్తిసంఖ్య మౌలికముగా సంపూర్తి చేయబడెను. అందువలన, ప్రత్యేకముగా 1935 నుండి యెహోవాసాక్షులు “భూమిని స్వతంత్రించుకొను” “దీనులు”గా వర్ణింపబడగల వినయస్థులను వెదకుచున్నారు. (కీర్తన 37:11, 29) వీరు జరుగుచున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న” ప్రజలై యున్నారు. సాతానుయొక్క దిగజారిన, అవినీతి విధానముపై “మహాశ్రమలు” విరుచుకుపడక ముందే, కడవరి నాశనములో సాతాను ఆరాధికులు “అగ్నిగుండములో” పడవేయబడుటకు ముందే వీరు దేవునిరాజ్య పరిపాలన పక్షముగా ముందుకుసాగుదురు.—యెహెజ్కేలు 9:4; మత్తయి 13:47-50; 24:21.
6, 7. (ఎ) ప్రకటించు పని విషయమై 1943లో ఏ చర్యలు గైకొనబడెను? (బి) వాటి ఫలితములేమై యుండెను?
6 ఇప్పటివరకు భౌగోళిక చేపలుపట్టు పని విజయవంతముగా జరిగినదా? వాస్తవాలనే మాట్లాడనివ్వండి. యింకను రెండవ ప్రపంచ యుద్ధము జరుగుచుండగా, 1943లో న్యూయార్క్, బ్రూక్లిన్ నందుగల యెహోవాసాక్షుల కేంద్రకార్యాలయములోని నమ్మకస్థులైన అభిషక్త సహోదరులు, భౌగోళికముగా విస్తారమైన చేపలపట్టు పని చేయవలసియున్నదని ముందే పసిగట్టారు. అందుకొరకు, ఏ చర్యలు గైకొనిరి?a—ప్రకటన 12:16-17.
7 వాచ్‌టవర్ సొసైటి 1943లో గిలియడ్ (హెబ్రీ, “సాక్షి కుప్ప”; ఆదికాండము 31:47, 48) అని పిలువబడు మిషనరీ పాఠశాల నొకదానిని నెలకొల్పెను. దానితో భూవ్యాప్తముగా సూచనార్థక జాలరులుగా పంపించుటకు వీలగునట్లు ప్రతి ఆరునెలలకు వందమంది మిషనరీలకు శిక్షణనిచ్చుటకు ఆరంభించబడెను. ఆ కాలములో 54 దేశాలలో మనుష్యులను పట్టుటకు చురుకుగా పనిచేయు సాక్షులు 1,26,329 మంది మాత్రమే ఉండిరి. కేవలము పది సంవత్సరాలలోనే ఆ సంఖ్యావివరాలు గణనీయముగా పెరిగి, 143 దేశాలలో 5,19,982 మంది సాక్షులుగా తయారయినవి! నిశ్చయముగా గిలియడ్ పాఠశాల, విభిన్న సంస్కృతులున్న దేశాలకు వెళ్లుటకు, చేపలుపట్టు క్రొత్త జలాలకు తగినట్లు పనిచేయుటకు ఇష్టపడిన, ధైర్యవంతులైన స్త్రీపురుష జాలరులను తయారుచేసినది. తత్ఫలితముగా, వేలాదిమంది సహృదయులైన ప్రజలు ప్రతిస్పందించిరి. ఆ మిషనరీలు, స్థానిక సాక్షులు కలిసి పనిచేసి, ప్రస్తుతము కలుగుచున్న అద్భుతమైన అభివృద్ధికి పునాదివేసిరి.
8, 9. (ఎ) విశిష్టమైన మిషనరీ సేవయొక్క ఏ ఉదాహరణలను చూపించవచ్చును? (బి) వారి ప్రాంతములలో మిషనరీలు ఎట్లు విశిష్టమైన పురోగతిని చూశారు? (యెహోవాసాక్షుల 1992 వార్షిక పుస్తకమును కూడా చూడుము.)
8 గిలియడ్‌యొక్క ఆ తొలి తరగతుల చిరకాలానుభవంగల అనేకమంది విశ్వాసులు, వయస్సులో వారిప్పుడు 70, 80 సంవత్సరాలకు పైగా ఉన్ననూ, తమకు నియమించబడిన విదేశాలలో వారింకను సేవచేయుచున్నారు. ఇలాంటి వారనేకులలో ఉదాహరణగా, 82 సంవత్సరాల వయస్సుగల ఎరిక్ బ్రిటెన్‌ను ఆయన భార్య క్రిస్టీనాను గూర్చి చెప్పుకొనవచ్చును. 1950లో గిలియడ్‌యొక్క 15వ తరగతినుండి పట్టభద్రులైన వీరు బ్రెజిల్‌లో ఇంకను సేవచేయుచున్నారు. బ్రెజిల్‌లో సేవచేయుటకు వారు వెళ్లినప్పుడు, ఆ దేశములో 3,000 కంటె తక్కువమంది సాక్షులు ఉండిరి. ప్రస్తుతము అక్కడ 3,00,000 మంది ఉన్నారు! చేపలుపట్టు పని ఫలవంతముగా ఉన్నందున బ్రెజిల్‌లో నిశ్చయముగా, ‘ఎన్నికలేనివాడు బలమైన జనముగా’ తయారయ్యెను.—యెషయా 60:22.
9 మరి ఆఫ్రికాలోవున్న మిషనరీలను గూర్చి మనమేమి చెప్పగలము? వారిలో అనేకులు ఎంతో భిన్న సంస్కృతిని అలవర్చుకొని ఆఫ్రికా ప్రజలయెడల తమ ప్రేమను పెంపొందించుకొనిరి. అలాంటి వారిలో సహోదరులైన జాన్, ఎరిక్ కూక్ అను వారిని, వారి భార్యలైన కాథిలిన్, మర్టిల్‌లను ఒక మాదిరిగా చెప్పుకొనవచ్చును. వీరు ప్రస్తుతము దక్షిణాఫ్రికాలో సేవచేయుచున్నారు. జాన్, ఎరిక్‌లు 1947లో ఎనిమిదవ గిలియడ్ పాఠశాలనుండి పట్టభద్రులైరి. ఒకరు కాకపోతే మరొకరు చొప్పున ఈ సహోదరులు, అంగోలా, జింబాబ్వే, మొజాంబిక్, దక్షిణాఫ్రికాలలో సేవచేశారు. కొంతమంది మిషనరీలు ఆఫ్రికాలోని జబ్బుల కారణముగా, ఇటీవల లైబీరియా అంతర్యుద్ధములో మరణించిన అలెన్ బాటీ, ఆర్థర్ లాసన్‌వంటి మరికొందరు యుద్ధములు, హింస కారణముగా చనిపోయారు. అయినను, ఆఫ్రికా జలములు ఎంతో ఫలవంతమైనవని నిరూపించబడినవి. ఆ సువిశాల ఖండమంతటిలో ప్రస్తుతము 4,00,000లకు పైగా సాక్షులు ఉన్నారు.
ప్రతివారికి వంతు కలదు
10. ఎందుకు, ఏ విధముగా పయినీర్లు మెచ్చుకోదగిన సేవ చేయుచున్నారు?
10 ఏమైనను, విదేశీ మిషనరీల సంఖ్య కొన్నివేలు మాత్రమే ఉండగా, స్థానిక సాక్షులు మరియు పయినీర్లుb లక్షలసంఖ్యలో తయారగుటను గుర్తించవలెను. ప్రపంచవ్యాప్తముగా జరుగుచున్న ప్రకటించు పనిలో అధికభాగం వీరిదే. 1991లో సగటున 5,50,000 మందికి పైగా పయినీర్లు మరియు ప్రయాణ పరిచారకులు ఉండిరి. ప్రతినెల ప్రకటించు పనిలో సగటున 60 నుండి 140 గంటల మధ్య గడుపుచు, చేపలుపట్టు గొప్పపనిలో భాగము వహించుటకు ప్రత్యేక ప్రయత్నము చేయుచున్న యీ నమ్మకమైన సాక్షులనుగూర్చి మనము తలంచునప్పుడు, ఈ సంఖ్య ఎంతగా మనలను ఆకట్టుకొనుచున్నది. అనేకమంది ఎంతో వ్యక్తిగత త్యాగముతోను, స్వంత ఖర్చుతోను దీనిని చేయుచున్నారు. అట్లెందుకు? ఎందుకనగా వారు తమ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రేమించుచున్నారు మరియు వారు తమ పొరుగువారిని తమవలెనే ప్రేమించుచున్నారు.—మత్తయి 22:37-39.
11. తన ప్రజలమధ్య యెహోవా ఆత్మ పనిచేయుచున్నదనుటకు నిశ్చయమైన ఏ రుజువు కలదు?
11 పూర్తికాల సేవలో లేకపోయిననూ, తమ పరిస్థితుల కనుగుణ్యముగా యెహోవా సేవలో నూటికి నూరుపాళ్లు తమను వినియోగించుకొనుచున్న మిగతా ముప్పైఅయిదు లక్షలమందిని గూర్చి మనమేమి చెప్పగలము? వారిలో కొందరు భార్యలుగా, పిల్లలుగల తల్లులుగా వున్ననూ, భూవ్యాప్తముగా జరుగుచున్న చేపలుపట్టు పనికి తమ విలువైన సమయమును వెచ్చించుచున్నారు. అనేకమంది భర్తలుగా లేక తండ్రులుగా పూర్తికాల ఉద్యోగముగలవారై ఉన్నారు; అయిననూ వారు క్రొత్తవారికి సత్యమును బోధించుటకు వారాంతములందు, సాయంత్రం వేళల్లో కొంత సమయాన్ని కేటాయించుచున్నారు. ఇకపోతే అవివాహితులుగా వున్న స్త్రీపురుషులు, యౌవనులు ఒక గొప్పసమూహముగా ఉన్నారు. వీరు ప్రకటించుటలో భాగము వహించుచు వారి ప్రవర్తనద్వారా సత్యమును సిఫారసు చేయుచున్నారు. ప్రతినెల దేవునిరాజ్య పరిపాలనను గూర్చి ప్రకటించు జీతభత్యాలులేని నలభైలక్షలకు పైగాగల స్వచ్ఛందసేవకులు ఏ మతగుంపులో కలరు? నిశ్చయముగా ఇది యెహోవా ఆత్మ పనిచేయుచున్నదని నిరూపించుచున్నది.—కీర్తన 68:11; అపొ. కార్యములు 2:16-18; జెకర్యా 4:6 పోల్చుము.
పురోభివృద్ధికి దోహదపడు కారకములు
12. ఎందుకు, ఎటువంటి సంఖ్యలో ప్రజలు సత్యమునకు ప్రతిస్పందించుచున్నారు?
12 ఈ విస్తారమైన ప్రకటించు పని ప్రతిసంవత్సరము గుర్తింపదగిన ఫలితములను తీసుకువచ్చుచున్నది. 1991లో పూర్తిగా నీటిలో ముంచబడుటద్వారా 3,00,00లకు పైగా క్రొత్త సాక్షులు బాప్తిస్మము పొందారు. అనగా ప్రతిదానిలో 100 మంది సాక్షులుగలిగి 3,000లకు పైగావున్న సంఘాలతో ఇది సమానము. ఇదంతయు ఎట్లు సాధించబడినది? మనము యేసుచెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకుందాము: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు, . . . వారందరును దేవునిచేత (యెహోవా NW) బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.” కావున భూవ్యాప్తముగా జరిగింపబడుచున్న చేపలుపట్టు పనికి ఒకడు కేవలము మానవ ప్రయత్నము వలన ప్రతిస్పందించడు. యెహోవాయే యోగ్యులైన వారి హృదయస్థితిని అర్థము చేసికొని వారిని తనవైపు ఆకర్షించును.—యోహాను 6:44, 45; మత్తయి 10:11-13; అపొ. కార్యములు 13:48.
13, 14. అనేకమంది సాక్షులు ఏ చక్కని దృక్పధమును ప్రదర్శించారు?
13 అయితే, ప్రజలను తనవైపు ఆకర్షించుటకు యెహోవా, మానవ జాలరులను ప్రతినిధులుగా ఉపయోగించుకొనుచున్నాడు. కావున, ప్రజలయెడల, వారు చేపలుపట్టు ప్రాంతముయెడల వారి దృక్పధము చాలా ప్రాముఖ్యము. పౌలు గలతీయులకు వ్రాసిన మాటలను అనేకమంది తమ హృదయాల్లోనికి తీసికొనుటను చూస్తే ఎంత ప్రోత్సాహకరముగా ఉన్నది! ఆయనిట్లు వ్రాసెను: “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:9.
14 ఒకవైపు లోక సంఘటనలను నిశితముగా పరిశీలిస్తునే, అనేకమంది నమ్మకమైన సాక్షులు దశాబ్దములుగా ప్రకటిస్తూనేవున్నారు. వారు నింగికెగసి నేలకూలిన నాజీపాలనను, ఫాసిస్టుపాలనను, ఇతర నిరంకుశ పరిపాలనలను చవిచూశారు. కొందరు 1914 నుండి జరిగిన అనేక యుద్ధములను చూశారు. ప్రపంచ నాయకులు నానాజాతి సమితిమీద, ఐక్యరాజ్య సమితిమీద తమ ఆశలు పెట్టుకోవడాన్ని వారు గమనించారు. అనేక దేశాలలో యెహోవా పని నిషేధింపబడి ఆ తర్వాత చట్టబద్ధము చేయడాన్ని వారు చూశారు. దీనియందంతటిలో, మనుష్యులను పట్టు జాలరులుగా పనిచేయుటతోసహా, యెహోవాసాక్షులు శ్రేష్ఠమైన దానిని చేయుటకు మానుకొనలేదు. యథార్థత విషయంలో ఎంత విశిష్ఠమైన రికార్డు!—మత్తయి 24:13.
15. (ఎ) ప్రపంచవ్యాప్తముగా మన ప్రాంతములోని అవసరాలకు తగినట్లు మార్చుకొనుటకు మనమే సహాయమును కలిగియుంటిమి? (బి) నీకు అప్పగింపబడిన పనిలో ప్రచురణలు ఎట్లు సహాయము చేసినవి?
15 ప్రపంచవ్యాప్తముగా ఈ అభివృద్ధికి దోహదపడిన ఇతర కారకములును కలవు. ఒకటేమనగా ఆ ప్రాంతముయొక్క అవసరతలకు తగినట్లు మనుష్యులను పట్టు జాలరుల సర్దుబాటుజేసుకొను స్వభావము చూపుటయే. విభిన్న సంస్కృతుల, మతముల, భాషల ప్రజలు తరలివచ్చిన కారణముగా, ఈ వివిధ దృక్పధాల విషయములో యెహోవాసాక్షులు తమ అవగాహనను విశాలపరచుకొనిరి. ప్రపంచవ్యాప్త సంఘము బైబిళ్లను, 200 భాషలకు పైగా బైబిలు సాహిత్యములను తయారుచేయుటద్వారా ఇందుకు బహుగా సహాయము చేసినది. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్, జెక్, స్లోవక్ భాషలతోసహా పూర్తిగా లేక పాక్షికముగా ఇప్పుడు 13 భాషలలో ఉన్నది. భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము! అను బ్రొషూర్ 7 కోట్ల 20 లక్షల ప్రతులు ముద్రింపబడి, ఇప్పుడు అల్బేనియన్ మొదలుకొని సింహళము వరకు 198 భాషలలో లభ్యమగుచున్నది. ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ అను పుస్తకము ఇప్పటికే 69 భాషలలో లభ్యమగుచున్నది. 29 భాషలలో ప్రచురింపబడిన మ్యాన్‌కైండ్స్ సెర్చ్ ఫర్ గాడ్, అను పుస్తకము ప్రపంచములోని పెద్ద మతవిధానముల పుట్టుపూర్వోత్తరాలను గూర్చి, నమ్మకాలను గూర్చి లోతైన అవగాహనను అందజేయుచు, భౌగోళికముగా చేపలుపట్టు పనిలో ఒక ఉన్నతమైన సహాయముగా నిరూపించుకొనుచున్నది.
16. ఇతర దేశాలలోని అవసరతలకు కొందరెట్లు ప్రతిస్పందించిరి?
16 భౌగోళికముగా చేపలుపట్టు పనిని ఇంకాయేది పురోగమింపజేసినది? ‘మాసిదోనియ పిలుపునకు’ ప్రత్యుత్తరమిచ్చుటకు వేలాదిమంది సుముఖత చూపించారు. ఆసియా మైనరునుండి యూరపులోని మాసిదోనియకు వెళ్లడానికి పౌలు ఇష్టపడినట్లుగానే, రాజ్యప్రచారకులు, ఆలాగే పెద్దలు మరియు పరిచారకుల అవసరత మరివిశేషముగా ఉన్న దేశాలకు, ప్రాంతాలకు అనేకమంది సాక్షులు దేవుని పిలుపు ననుసరించి కదలివెళ్లారు. వీరు, స్థానిక జలాలలో సమృద్ధిగా చేపలు పట్టగల అక్షరార్థమైన జాలర్లను పోలి దోనెలు తక్కుగాయుండి చేపలు సమృద్ధిగావున్న జలాలలోని కదలి వెళ్లుచున్నారు.—అపొ. కార్యములు 16:9-12; లూకా 5:4-10.
17. ‘మాసిదోనియ పిలుపునకు’ ప్రత్యుత్తరమిచ్చిన వారి ఏ ఉదాహరణలను మనము కలిగియున్నాము?
17 ఇటీవల జరిగిన గిలియడ్ మిషనరీ పాఠశాల తరగతులలో వివిధ యూరపుదేశాల విద్యార్థులును చేరియుండిరి. వీరు ఇంగ్లీషు నేర్చుకొని ఆ పిమ్మట ఇతర దేశాలలోను, వివిధ సంస్కృతులున్న ప్రాంతాలలోను సేవచేయుటకు తాముగా ముందుకు వచ్చిరి. అదేవిధముగా, మినిస్టీరియల్ ట్రెయినింగ్ పాఠశాలద్వారా అనేకమంది అవివాహిత సహోదరులకు రెండునెలల విస్తృతస్థాయి శిక్షణనిచ్చి, ఆయాసంఘాలను, ప్రాంతాలను బలపరచుటకు ఇతర దేశాలకు పంపించుట జరిగినది. తూర్పు యూరపులో, పూర్వపు సోవియట్ రిపబ్లిక్ దేశాలలో చేపలుపట్టు పనికి అనువైన ఉన్నతప్రాంతాలు అనేకము ఇప్పుడు తెరువబడుచున్నవి.—రోమీయులు 15:20, 21 పోల్చుము.
18. (ఎ) పయినీర్లు సాధారణముగా ఎందుకు సమర్థవంతమైన ప్రచారకులై యున్నారు? (బి) సంఘములోని ఇతరులకు వారెట్లు సహాయపడగలరు?
18 ప్రపంచవ్యాప్తముగా చేపలుపట్టు పనిలో మరొక సహాయము ఏదనగా, క్రమ పయినీర్లు హాజరగు పయినీర్ సర్వీస్ పాఠశాల. కేవలము పయినీర్ల కొరకే తయారుచేయబడిన షైనింగ్ యాజ్ ఇల్లూమినేటర్స్ ఇన్‌ది వరల్డ్, అను పుస్తకమును రెండువారాలపాటు విస్తృతముగా పఠనముచేయుట ద్వారా, వారు తమ పరిచర్య నైపుణ్యమును పెంపొందించుకొందురు. “పర్‌స్యూయింగ్ ది వే ఆఫ్ లవ్,” “ఫాలో జీసస్ యాజ్ ఎ మోడల్,” “డెవలపింగ్ ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్” వంటి అంశాలను వారు పరిశీలించుదురు. చేపలుపట్టు ఈ గొప్పపనిలో అనేకమంది ఇతరులకు శిక్షణనివ్వగల, అర్హులైన ఈ ఇంటింటిసేవా జాలర్ల జట్లను కలిగియుండుటకు సంఘములన్నీ ఎంత కృతజ్ఞతతో ఉండును!—మత్తయి 5:14-16; ఫిలిప్పీయులు 2:15; 2 తిమోతి 2:1, 2.
మనము అభివృద్ధి చెందగలమా?
19. అపొస్తలుడైన పౌలు వలెనే, మన పరిచర్యలో మనమెట్లు అభివృద్ధి సాధించగలము?
19 పౌలు వలెనే, మనము అనుకూల వైఖరిని, ముందుచూపును కలిగియుండుటకు కోరుకొందుము. (ఫిలిప్పీయులు 3:13, 14) ప్రతివిధమైన ప్రజలకు, పరిస్థితులకు తగినట్లు ఆయన తననుతాను మార్చుకున్నాడు. అందరికి ఆమోదయోగ్యమైన దానిని ఎట్లు కనుగొనవలెనో, స్థానిక ప్రజల స్వభావములపై, సంస్కృతులపై ఆధారపడి ఎట్లు తర్కించవలెనో ఆయనకు తెలుసు. రాజ్యవర్తమానమునకు గృహస్థుని ప్రతిస్పందనను కనిపెట్టి, ఆ వ్యక్తి అవసరతలకు అనుగుణ్యముగా మన ప్రసంగమును మలచుటలో చురుకుగా ఉండుటద్వారా మనము బైబిలు పఠనములు ప్రారంభించగలము. మనము కలిగియున్న వివిధ బైబిలుపఠన సహాయక సాహిత్యములతో, ఆ వ్యక్తి దృక్కోణానికి సరిపోవు దానిని మనము అందించగలము. ఫలవంతముగా చేపలుపట్టు పనిలో పరిస్థితులకు తగినట్లు మార్చుకొను మన స్వభావము, చురుకుదనము కూడ ప్రాముఖ్యమైన కారకములై యున్నవి.—అపొ. కార్యములు 17:1-4, 22-28, 34; 1 కొరింథీయులు 9:19-23.
20. (ఎ) చేపలుపట్టు మన పని ఇప్పుడు ఎందుకంత ప్రాముఖ్యమై యున్నది? (బి) ఇప్పుడు మన వ్యక్తిగత బాధ్యత ఏమైయున్నది?
20 భౌగోళికముగా చేపలుపట్టు ఈ ఉన్నతమైన పని ఎందుకింత ప్రాముఖ్యమై యున్నది? ఎందుకనగా జరిగిన, జరుగుచున్న సంఘటనలలో బైబిలు ప్రవచనముల నెరవేర్పునుబట్టి, సాతాను లోకవిధానము నాశనకరమైన ముగింపునకు వచ్చుచున్నదనుట స్పష్టమగుచున్నది. కావున, యెహోవాసాక్షులమైన మనము ఏమి చేయుచుండవలెను? ఈ పత్రికలోని మూడు పఠన శీర్షికలు, భౌగోళిక జలాలలో మన భాగమందు మనము చేపలుపట్టు పనిలో శ్రమించువారిగాను, ఆసక్తిగలవారిగాను ఉండు మన బాధ్యతను నొక్కితెల్పినవి. చేపలుపట్టు పనిలో మన కార్యదీక్షను యెహోవా మరచిపోడని బైబిలునుండి మనకు గట్టి అభయము కలదు. పౌలు ఇట్లనెను: “మీరుచేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. . . . మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.”—హెబ్రీయులు 6:10-12. (w92 6/15)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొ. వారు ప్రచురించిన రెవలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లెమాక్స్ ఎట్ హ్యాండ్! పుటలు. 185, 186 కూడ చూడుము.
b “పయినీర్ పబ్లిషర్ . . . యెహోవాసాక్షులు పూర్తికాల పనివాడు.”—వెబ్‌స్టర్స్ థర్డ్ న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ.
నీవు గుర్తుతెచ్చుకొందువా?
◻ యెహోవాసాక్షులు ఎందుకు చేపలుపట్టు తమ పనికి యావత్ ప్రపంచమునే ఒక ప్రాంతముగా దృష్టింతురు?
◻ చేపలుపట్టు పనికి గిలియడ్ మిషనరీ పాఠశాల ఏ ఆశీర్వాదమై యుండెను?
◻ యెహోవాసాక్షుల విజయానికి దోహదపడిన కారకములు కొన్ని ఏమైయున్నవి?
◻ మన క్రైస్తవ పరిచర్యలో వ్యక్తిగతముగా మనమెట్లు అభివృద్ధి సాధించగలము?
[26వ పేజీలోని చిత్రం]
అంతర్జాతీయ చేపలుపట్టు పనియొక్క ఫలితాలు
సంవత్సరము — దేశాలు — సాక్షులు
1939 — 61 — 71,509
1943 — 54 — 1,26,329
1953 — 143 — 5,19,982
1973 — 208 — 17,58,429
1983 — 205 — 26,52,323
1991 — 211 — 42,78,820
[27వ పేజీలోని చిత్రాలు]
గలిలయ జాలర్లమధ్య సాక్ష్యపుపని ఇంకనూ జరిగింపబడుచున్నది