వల, చేపలు మీకు ఏ భావము నిచ్చుచున్నవి?
“పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.”—మత్తయి 13:11.
1, 2. యేసు చెప్పిన ఉపమానములందు మనమెందుకు శ్రద్ధ కలిగియుండ వలెను?
ఒక రహస్యమును తెలిసికొనుటకు లేక ఒక చిక్కుముడిని విప్పుటకు నీవు ఆనందింతువా? అలా చేయుటవల్ల దేవుని సంకల్పమందు నీ పాత్రయేమిటో స్పష్టముగా చూచుటకు నీకు సహాయము చేసినట్లయిన అప్పుడేమి? సంతోషదాయకమైన విషయమేమంటె, యేసుచెప్పిన ఒక ఉపమానము ద్వారా నీవు అటువంటి ఆధిక్యతతోకూడిన పరిజ్ఞానమును సంపాదించుకొన గలవు. దానిని వినిన అనేకులను అది కలవరపరచినది, అప్పటినుండి అది అసంఖ్యాకులైన ఇతరులను విభ్రాంతిపరచినది, గాని నీవు దానిని అర్థము చేసికొనగలవు.
2 యేసు ఉపమానములు ఉపయోగించుటను గూర్చి ఆయన మత్తయి 13వ అధ్యాయములో చెప్పినదానిని గమనించుము. ఆయన శిష్యులు ఇట్లడిగిరి: “నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావు?” (మత్తయి 13:10) అవును, అనేకమంది ప్రజలు అర్థము చేసికొనని ఉపమానములను యేసు ఎందుకు ఉపయోగించెను? యేసు 11 నుండి 13 వచనములలో దానికిట్లు సమాధానమిచ్చెను: “పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. . . . వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.”
3. యేసు చెప్పిన ఉపమానములను అర్థము చేసికొనుట మనకెట్లు ప్రయోజనములు తేగలవు?
3 ఆ పిమ్మట యేసు, ఆత్మీయముగా చెవిటివారును, గ్రుడ్డివారునైయున్న ప్రజలను వర్ణించిన యెషయా 6:9, 10 అన్వయించెను. అయితే మనము వారివలెనుండ నవసరము లేదు. మనమాయన ఉపమానములను అర్థము చేసికొని వాటి ప్రకారము ప్రవర్తించినట్లయిన, మనము—యిప్పుడును, అనంత భవిష్యత్తులోను సంతోషముగా ఉండగలము. యేసు మనకు ఈ స్నేహపూర్వక అభయము నిచ్చుచున్నాడు: “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.” (మత్తయి 13:16) ఆ హామి యేసు ఉపమానములన్నింటికి వర్తించును, అయితే మనము మత్తయి 13:47-50లో వ్రాయబడిన వలనుగూర్చిన ఉపమానముపై క్లుప్తముగా మన దృష్టి నిలుపుదాం.
లోతైన భావముగల ఉపమానము
4. మత్తయి 13:47-50లో వ్రాయబడిన రీతిగా, ఉపమానముద్వారా యేసు ఏమి వివరించెను?
4 “పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును.”
5. చేపలుపట్టు ఉపమాన భావమును గూర్చి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమగును?
5 బహుశ మీరు వలతో చేపలు పట్టుటను కనీసము సినిమాలో లేక దూరదర్శినిలో చూచియుండవచ్చును, కావున యేసుచెప్పిన ఉపమానమును ఊహించుట కష్టమేమి కాదు. అయితే దాని వివరములు మరియు భావము విషయమేమి? ఉదాహరణకు, ఈ ఉపమానము “పరలోక రాజ్యమును” గూర్చినదై యున్నదని యేసు చెప్పెను. అయినను, “నానా విధములైన” మనుష్యులు అనగా మంచివారు మరియు పనికిరాని, లేక దుష్టులైన వారు ఆ రాజ్యములో ఉందురని నిశ్చయముగా ఆయన భావము కాదు. అంతేకాకుండ, ఎవరు ఆ చేపలుపట్టు పనిచేయుదురు? చేపలుపట్టు ఈ పని మరియు వేరుచేయుట యేసు కాలములో జరిగెనా, లేక “యుగసమాప్తి” కాలమగు మన కాలము కొరకే అవి పరిమితము చేయబడెనా? ఈ ఉపమానము నీకు వర్తించునా? ఏడ్చుచూ పండ్లుకొరుక్కొను వారిలో ఉండకుండ నీవెట్లు తప్పించుకొనగలవు?
6. (ఎ) చేపలుపట్టు వలను గూర్చిన ఉపమానమును అర్థము చేసికొనుటకు మనమెందుకు మిక్కిలి శ్రద్ధ కలిగియుండవలెను? (బి) దానిని అర్థము చేసికొనుటకు కీలకమైనదేది?
6 అటువంటి ప్రశ్నలు ఈ ఉపమానము సామాన్యమైనదేమి కాదని చూపించుచున్నవి. “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి” అని మరచిపోకుము. మన చెవులు వినకుండునట్లును, దాని భావము విషయములో మన కన్నులు మూసికొనిపోకుండునట్లు దాని అర్థమును మనము శోధించగలమేమో చూద్దాము. నిజానికి, దాని భావమును విడమర్చి చూచుటకు కావలసిన ఆవశ్యకమైన కీలకమును మనమిప్పటికే కలిగియున్నాము. తమ వృత్తిని విడిచి “మనుష్యులను పట్టు జాలరులుగా” ఆత్మీయ పనిని చేపట్టుటకు గలిలయలోని జాలరులను యేసు ఆహ్వానించుటనుగూర్చి ముందరి శీర్షిక తెలియజేసింది. (మార్కు 1:17) ఆయన వారికిట్లు చెప్పెను: ‘ఇప్పటినుండి మీరు మనుష్యులను సజీవముగా పట్టువారై యుందురు.’—లూకా 5:10.
7. చేపలను గూర్చి మాట్లాడి యేసు దేనిని ఉదహరించెను?
7 దానితో పొందికగా, ఈ ఉపమానములోని చేపలు మనుష్యులను సూచించుచున్నారు. కావున, నీతిమంతులలోనుండి దుష్టులను వేరుచేయుటనుగూర్చి 49వ వచనము మాట్లాడినప్పుడు, అది మంచివైన లేక చెడ్డవైన సముద్ర జీవరాసులను కాదుగాని, నీతిమంతులైన లేక దుష్టులైన ప్రజలను సూచించుచున్నది. అదేప్రకారముగా, ఏడ్చుచు పండ్లుకొరుకుటను గూర్చి చెప్పుచున్న 50వ వచనము సముద్ర జంతువులను సూచించుచున్నదని మనము తలంచకూడదు. దాని ఫలితము చూపించునట్లుగా, ఈ ఉపమానము మానవులను సమకూర్చి, ఆ తర్వాత వేరుచేయుటనుగూర్చి చెప్పుచున్నది. దాని ఫలితమునుబట్టి ఇదెంతో గంభీరమైన విషయము.
8. (ఎ) పనికిరాని చేపలకు కలుగు దానినిగూర్చి మనమేమి నేర్చుకొనగలము? (బి) పనికిరాని చేపలను గూర్చి చెప్పబడినదాని దృష్ట్యా, రాజ్యమునుగూర్చి మనమే ముగింపునకు రాగలము?
8 పనికిరానివి అనగా చెడ్డవైన చేపలు అగ్నిగుండములో పడవేయబడునని గమనించుము. అక్కడ వారికి ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. మరొకచోట యేసు రాజ్యము వెలుపల అటువంటి ఏడ్పును, పండ్లు కొరుకుటను ఉండునని దావితో సంబంధం కలిపెను. (మత్తయి 8:12; 13:41, 42) మత్తయి 5:22 మరియు 18:9 (NW) నందు, నిత్యనాశనమును సూచించు “అగ్నితోకూడిన గెహెన్నాను” సహితము ఆయన ప్రస్తావించెను. కావున ఈ ఉపమాన భావమును గ్రహించి, దానికనుగుణ్యముగా ప్రవర్తించుట ఆవశ్యకమని అది సూచించుట లేదా? దేవుని రాజ్యములో దుష్టులు ఉండరు, ఉండబోరని మనందరికి తెలుసు. కాబట్టి, “పరలోక రాజ్యము, . . . చేపలనుపట్టిన వలను పొలియున్నదని” యేసు చెప్పినప్పుడు, దేవుని రాజ్యానికి సంబంధించి వివిధ చేపలను పట్టుటకు వల వేయబడుటను పోలిన కార్యమొకటి ఉన్నదని ఆయన భావము కావచ్చును.
9. చేపలుపట్టు వల ఉపమానములో దేవదూతలు ఎట్లు ఇమిడియున్నారు?
9 వలవేసి చేపలు పట్టినప్పుడు, వేరుచేయు పనికూడ ఉండును. దీనిలో ఎవరు ఇమిడియున్నారని యేసు చెప్పెను? ఈ వేరుపరచు-జాలర్లు దేవదూతలని మత్తయి 13:49 సూచించుచున్నది. కావున పరలోక రాజ్యము కొరకు మంచివారు, పనికివచ్చేవారని కొందరిని, ఆ పిలుపుకు పనికిరాని వారని మరికొందరిని నిరూపించుచు—భూమిపై మనుష్యులను గుర్తించుటకు ఉపయోగించు ఉపకరణముపై దేవదూతల పర్యవేక్షణ ఉండునని యేసు చెప్పుచున్నాడు.
చేపలుపట్టుట—ఎప్పుడు?
10. ఏ కారణమునుబట్టి చేపలుపట్టు పని చాలాకాలము వరకు విస్తరింపజేయబడెనని మనము నిర్ణయించగలము?
10 ఇది ఎప్పుడు అన్వయించునో కనుగొనుటకు దాని సందర్భము మనకు సహాయము చేయును. దీనికిముందు యేసు లోకమును సూచించిన, ఒక పొలములో మంచి విత్తనములు విత్తుటను, ఆపైన గురుగులు విత్తబడుటను గూర్చిన ఒక ఉపమానమును చెప్పెను. మత్తయి 13:38లో యేసు, మంచి విత్తనములు “రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులను” సూచించుచున్నవని వివరించెను. యుగసమాప్తియందు కోత జరుగు పర్యంతము, అనేక శతాబ్దములు ఇవి కలిసి పెరుగును. ఆ పిమ్మట గురుగులు వేరుచేయబడి కాల్చివేయబడును. దీనికి సమాంతరముగా ఉన్న చేపలుపట్టు వలను గూర్చిన ఉపమానములో వలతో చేపలుపట్టు పని ఎంతోకాలమునకు విస్తరింపజేయబడుట మనము చూచెదము.—మత్తయి 13:36-43.
11. మొదటి శతాబ్దములో అంతర్జాతీయముగా చేపలుపట్టు పని ఎట్లు ఆరంభించబడెను?
11 యేసు ఉపమానము ప్రకారం, చేపలు విచక్షణారహితముగా పట్టబడును, అనగా ఆ వలలో మంచివి మరియు పనికిరాని చేపలును చిక్కుకొనును. అపొస్తలులు జీవించియున్న కాలములో, చేపలుపట్టు పనిని నడిపించుచుండిన దేవదూతలు, అభిషక్త క్రైస్తవులుగా తయారగు వారిని “పట్టుటకు” దేవుని క్రైస్తవ సంస్థను ఉపయోగించిరి. సా.శ. 33 పెంతెకొస్తుకు ముందు, మనుష్యులను పట్టు యేసు పని ఫలితముగా 120 మంది శిష్యులు సమకూర్చబడెనని బహుశ మీరనవచ్చు. (అపొ. కార్యములు 1:15) అయితే ఒకసారి అభిషక్త క్రైస్తవుల సంఘము స్థిరపరచబడిన తర్వాత, వలవేయు పని ఆరంభమాయెను, గనుక వేలకువేలు మంచివైన చేపలు పట్టబడెను. సా.శ. 33 నుండి, అన్యులును క్రైస్తవత్వమువైపు ఆకర్షింపబడి క్రీస్తు అభిషక్త సంఘములో సభ్యులగుటతో, చేపలుపట్టు పని అంతర్జాతీయ జలములలోనికి విస్తరించెను.—అపొ. కార్యములు 10:1, 2, 23-48.
12. అపొస్తలుల మరణము తర్వాత ఏమి అభివృద్ధియైనది?
12 అపొస్తలులు గతించిన తర్వాతి శతాబ్దములలో, దైవిక సత్యమును కనుగొని దానిని హత్తుకొనియుండుటకు కొంతమంది క్రైస్తవులు కృషిచేశారు. వీరిలో కనీసము కొందరైనను దేవుని అంగీకారమును కలిగియుండిరి, మరియు ఆయన వారిని తన పరిశుద్ధాత్మతో అభిషేకించెను. అయినను, అపొస్తలుల మరణము అడ్డగించు ప్రభావమును తీసివేసి, మతభ్రష్టత్వము విస్తారముగా వృద్ధియగుటకు అనుమతించెను. (2 థెస్సలొనీకయులు 2:7, 8) దేవుని సంఘమని అనర్హముగా చెప్పుకొనిన ఒక సంస్థ వృద్ధియాయెను. అది యేసుతోపాటు పరిపాలించుటకు దేవుని ఆత్మచే అభిషేకించబడిన పరిశుద్ధ జనాంగమని అసత్యముగా చెప్పుకొనెను.
13. చేపలుపట్టు పనిలో క్రైస్తవమత సామ్రాజ్యము పాత్రను కలిగియుండెనని ఎందుకు చెప్పగలము?
13 వలనుగూర్చిన ఉపమానములో అపనమ్మకస్థులైన నామకార్థపు క్రైస్తవులకు ఏమైనా భాగముండెనని నీవు తలంచుదువా? అవును, వారికి భాగముండెనని జవాబిచ్చుటకు కారణము కలదు. ఆ సూచనార్థక వలలో క్రైస్తవమత సామ్రాజ్యమును చేరియున్నది. నిజమే, చాలాకాలంగా కాథోలిక్ చర్చి బైబిలును సామాన్య ప్రజలకు దూరముగా ఉంచుటకు ప్రయత్నించినది. అయినప్పటికిని, అనేక శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్య సభ్యులు దేవుని వాక్యమును అనువదించుటలో, నకలువ్రాయుటలో, పంచిపెట్టుటలో కీలకపాత్ర వహించిరి. ఆ తర్వాతి కాలములలో చర్చీలు, మారుమూల ప్రాంతముల భాషలలోనికి బైబిలును తర్జుమాచేసిన బైబిలు సొసైటీలను రూపొందించినవి లేక వాటికి మద్దతునిచ్చినవి. వారు వైద్యపరమైన మిషనరీలను, బోధకులను పంపించగా, వారనేకమందిని ఆహారవస్తువుల ఆశజూపి క్రైస్తవులుగా తయారుచేసిరి. ఈ విధముగా సమకూర్చబడిన విస్తారమైన చేపలకు, దేవుని గుర్తింపు లేకుండెను. అయితే అది కనీసము క్రైస్తవులుకాని లక్షలాదిమందికి బైబిలంటే ఏమిటో, కలుషితము నిండియున్ననూ క్రైస్తవత్వమంటే ఏమిటో తెలియునట్లు చేసినది.
14. క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు నిర్వహించిన కొద్దిపాటి పాత్ర మంచి చేపలుపట్టు పనికి ఎట్లు దోహదపడెను?
14 ఈ కాలమంతటిలో, దేవుని వాక్యమునకు హత్తుకొని చెదరిపోయిన విశ్వాసులు తమకు సాధ్యమైనంతమేరకు ప్రయాసపడిరి. ఏ సమయములోనైనను వారు భూమిపై దేవుని నిజమైన అభిషక్త సంఘముగా ఏర్పడిరి. వారుకూడ చేపలను లేక మనుష్యులను పట్టుచుండిరని, వారిలో అనేకులను దేవుడు మంచివారిగా దృష్టించి వారిని తన ఆత్మతో అభిషేకించునని మనము నిశ్చయత కలిగియుండగలము. (రోమీయులు 8:14-17) క్రైస్తవులమని చెప్పుకొనిన ఈ మంచివారు, వస్తు ఆశతో క్రైస్తవులుగా తయారైన లేక క్రైస్తవమత సామ్రాజ్యపు బైబిలు సొసైటీలచే తమ భాషలలోనికి అనువదించబడిన లేఖనములలో పరిమిత బైబిలు జ్ఞానమును సంపాదించిన అనేకులకు బైబిలు సత్యమును అందజేయగల్గిరి. అవును, దేవుని దృష్టిలో క్రైస్తవమత సామ్రాజ్యం సమకూర్చిన వారిలో అధికులు అనర్హులైనను, మంచి వారిని సమకూర్చుపని కొనసాగుచునే యున్నది.
15. సూటిగా, ఉపమానములోని చేపలుపట్టు వల దేనిని సూచించెను?
15 కావున దేవుని సంఘమని చెప్పుకొనుచు, చేపలను సమకూర్చుచున్న భూసంబంధమైన ఉపకరణమునే ఆ వల సూచించుచున్నది. దీనిలో క్రైస్తవమత సామ్రాజ్యం మరియు అభిషక్త క్రైస్తవ సంఘం చేరియున్నది, అయితే మత్తయి 13:49 ప్రకారము దేవదూతల అదృశ్య నడిపింపుక్రింద అభిషక్త క్రైస్తవ సంఘం మంచి చేపలను సమకూర్చు పనిలో కొనసాగినది.
మన కాలము ప్రత్యేకమైయున్నది
16, 17. చేపలుపట్టు వలనుగూర్చి యేసుచెప్పిన ఉపమాన నెరవేర్పునందు మనము నివసించు కాలము ఎందుకంత ప్రాముఖ్యమై యున్నది?
16 మనమిప్పుడు కాలాన్నిగూర్చి పరిశీలిద్దాం. అనేక శతాబ్దాలుగా ఉపకరణముగావున్న వల మంచి చేపలను ఆలాగే అనేకమైన పనికిరాని లేక చెడ్డవైన చేపలను సమకూర్చెను. ఆ పిమ్మట నిర్ణయాత్మకమైన వేరుపరచు పనిలో దేవదూతలు ఇమిడియుండు సమయము ఆసన్నమాయెను. అది ఎప్పుడు? 49వ వచనము, ఆ పని “యుగసమాప్తియందు జరుగును” అని స్పష్టముగా చెప్పుచున్నది. మేకలు గొర్రెలనుగూర్చిన ఉపమానములో యేసుచెప్పిన దానితో ఇది చక్కగా సరిపోవుచున్నది: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును.”—మత్తయి 25:31, 32.
17 కావున, మత్తయి 13:47-50 ప్రకారము, దేవదూతల నడిపింపుక్రింద ఒక నిర్ణయాత్మకమైన వేరుపరచు పని, 1914లో ఆరంభమైన “యుగసమాప్తి” నుండి పురోగమించుచున్నది. అభిషక్తుల శేషము తాత్కాలిక ఆత్మీయ దాసత్వము లేక చెరనుండి విడుదలై, చేపలుపట్టు పనిని నెరవేర్చుటకు మరింత సమర్థవంతమైన ఉపకరణముగా తయారైన 1919 తర్వాత, ఇది ప్రత్యేకముగా స్పష్టమాయెను.
18. మంచి చేపలు ఎట్లు గంపలలోనికి సమకూర్చబడుచున్నవి?
18 వేరుపరచబడిన ఈ మంచి చేపలకు ఏమి సంభవించనై యుండెను? వేరుపరచు-జాలరులు అయిన దేవదూతలు “మంచివాటిని [చేపలను] గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు” అని 48వ వచనము చెప్పుచున్నది. మంచి చేపలు చేర్చబడు గంపలు రక్షిత పాత్రలై యున్నవి. ఇది మన కాలములో నెరవేరినదా? నిశ్చయముగా అట్లు నెరవేరినది. సూచనార్థకమైన మంచి చేపలు సజీవముగా పట్టబడుచుండగా, వారు నిజమైన క్రైస్తవుల సంఘములలోనికి సమకూర్చబడుచున్నారు. గంపలను పోలిన సంఘములు, వారిని పరిరక్షించి దైవసేవ కొరకు వారిని భద్రపరచుటకు సహాయము చేసెనని మీరు అంగీకరించరా? ఒకడు ఇంకను ఇట్లు తలంచవచ్చును, ‘ఇదంతయు బాగానేవుంది గాని, దానితో నా ప్రస్తుత జీవితానికి భవిష్యత్తుకు సంబంధమేమిటి?’
19, 20. (ఎ) ఈ ఉపమాన భావమును గ్రహించుట యీనాడు ఎందుకు ఆవశ్యకమై యున్నది? (బి) 1919 నుండి ఏ ప్రాముఖ్యమైన చేపలుపట్టు పని జరుగుచున్నది?
19 ఇక్కడ ఉదహరింపబడిన నెరవేర్పు అపొస్తలుల కాలము మరియు 1914కు మధ్యగల శతాబ్దములకు మాత్రమే పరిమితము కాదు. ఆ కాలములో ఉపకరణముగాయున్న వల నిజమైన మరియు అబద్ధ క్రైస్తవులగు ఈ రెండు గుంపులను సమకూర్చుటై యున్నది. అవును, అది మంచి చేపలను, పనికిరాని చేపలను సమకూర్చెను. అంతేకాకుండ, దేవదూతలు వేరుచేసే పని దాదాపు 1919తో ముగించబడలేదు. కొన్ని విషయాల్లో వలను గూర్చిన ఈ ఉపమానము మన కాలమునకు కూడ వర్తించును. మనము, మన సమీప భవిష్యత్తు దీనిలో ఇమిడియున్నవి. “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి” అను మాటలను మనము వివేచనతో గ్రహించవలెనంటె, మనమెందుకు, ఎలా అందులో ఇమిడియున్నామో తెలిసికొనుట తప్పనిసరియై యున్నది.—మత్తయి 13:16.
20 దేవదూతల సహకారముతో 1919 తర్వాత అభిషక్త శేషము ప్రకటించు పనిలో పనిరద్దీ కలిగియుండుట బహుశ మీకు తెలిసే యుండవచ్చును. చేపలను దరికిలాగి, వాటినుండి మంచి చేపలను పనికిరాని చేపలను వేరుచేయుటకు, ఈ దేవదూతలు సూచనార్థక వలను ఉపయోగించుచునే యున్నారు. ఆ సూచనార్థక వలచే 1,44,000 మందిలోని చివరివారు సమకూర్చబడుచుండగా, దేవుని ఆత్మతో అభిషేకించబడుటకు మంచిచేపల వేట కొనసాగెనని ఆ కాలమునుండివున్న గణాంకవివరాలు చూపుచున్నవి. (ప్రకటన 7:1-4) అయితే 1930వ దశాబ్దపు మధ్యకాలములో పరిశుద్ధాత్మచే అభిషేకించబడుటకు మంచి చేపలను సమకూర్చు పని దాదాపు ముగించబడెను. కాబట్టి అభిషక్త శేషపు సంఘము వలను విసిరివేసినట్లుగా పారవేసి, ఊరకనే కూర్చుని తమ పరలోక బహుమతి కొరకు వేచియుండెనా? ఎంతమాత్రము కాదు.
చేపలు పట్టుటలో మీ వంతు
21. మనకాలములో మరింకే చేపలుపట్టు పని జరిగియున్నది? (లూకా 23:43)
21 వలను గూర్చిన యేసు ఉపమానము పరలోక రాజ్యములో స్థానము అనుగ్రహింపబడు మంచి చేపలపై దృష్టిని కేంద్రీకరించినది. అయినను, ఆ ఉపమానములో చెప్పబడిన విషయాలకు తోడుగా, ముందరి శీర్షికలో ఉదహరింపబడినట్లు బహు విస్తారమైన స్థాయిలో సూచనార్థకమైన మరొక చేపలవేట జరుగుచున్నది. ఈ చేపలవేట యేసు ఉపమానములో ప్రస్తావించబడిన మంచివైన అభిషక్తులైన చేపలకొరకు కాదుగాని, సజీవముగా పట్టబడి, పరదైసు భూమిలో జీవించు అద్భుతకరమైన నిరీక్షణ పొందు సూచనార్థక చేపలకొరకై యున్నది.—ప్రకటన 7:9, 10; మత్తయి 25:31-46 పోల్చుము.
22. మనమే సంతోషకరమైన ఫలితమును అనుభవించగలము, దానికి ప్రత్యామ్నాయమేమిటి?
22 నీవు ఆ నిరీక్షణ కలిగియున్నట్లయిన, ఇప్పటి వరకు ప్రాణమును రక్షించు చేపలవేటను యెహోవా అనుమతించినందుకు నీవు సంతోషించగలవు. అద్భుతకరమైన ఉత్తరాపేక్షను నీవు సంపాదించుకొనుటను ఇది సాధ్యపరచినది. ఉత్తరాపేక్షనా? అవును, అది సరియైన మాటే ఎందుకనగా, ఈ చేపలు పట్టు ప్రయత్నము జరిగింపబడుటను నిర్దేశించు వానియెడల ఎడతెగక మనము చూపు విశ్వాస్యతనుబట్టి దాని ఫలితము ఉండును. (జెఫన్యా 2:3) ఆ ఉపమానము నుండి వలలో చిక్కుకొనిన ప్రతిచేప ఆదరింపబడదను విషయమును గుర్తుతెచ్చుకొనుము. మంచివాటినుండి పనికిరాని వాటిని, లేక చెడ్డ చేపలను వేరుచేయుదురని యేసు చెప్పెను. దేనికొరకు? మత్తయి 13:50లో పనికిరాని లేక చెడ్డవైన చేపలకు సంభవించు గంభీరమైన పరిణామమును యేసు వర్ణించెను. అవి అగ్నిగుండములో పడవేయబడును, అనగా అవి నిత్యనాశనము ననుభవించును.—ప్రకటన 21:8.
23. చేపలుపట్టు పనిని యీనాడు ఏది అంత ప్రాముఖ్యము చేయుచున్నది?
23 మంచివైన అభిషక్తులైన చేపలకు, ఆలాగే భూమిపై నిరంతరము జీవించు సూచనార్థక చేపలకు మహిమగల భవిష్యత్తు కలదు. కాబట్టి, మంచి కారణముతోనే దేవదూతలు ప్రస్తుతము భూవ్యాప్తముగా విజయవంతమగు చేపలు పట్టుపని జరుగునట్లు చూస్తున్నారు. ఎంత విస్తారముగా సూచనార్థక చేపలు పట్టబడుచున్నవి! యేసు చెప్పినట్లు తమ వలలువేసి అపొస్తలులు విస్తారముగా అక్షరార్థమైన చేపలను పట్టినట్లే, ఒక విధముగా ఈ చేపలవేట అద్భుతకరముగా సాగుచున్నదని మీరు చెప్పుట సరియే.
24. ఆత్మీయముగా చేపలుపట్టు పని విషయమై మనమేమి చేయుటకు కోరుకొనవలెను?
24 ఆత్మీయముగా చేపలుపట్టు యీ ప్రాణరక్షణ పనిలో సాధ్యమైనంత మేరకు నీవు చురుకుగా భాగము వహించుచున్నావా? ఈ సమయము వరకు యిందులో వ్యక్తిగతముగా మన భాగమెంతైననూ, ప్రస్తుతము భూవ్యాప్తముగా నెరవేర్చబడుచున్న యీ మహాగొప్ప చేపలవేటను, ప్రాణరక్షణ పనిని చూచుటద్వారా మనలో ప్రతిఒక్కరము ప్రయోజనము పొందగలము. అలాచేయుట ముందున్న దినములలో చేపలుపట్టుటకు మరింత గొప్ప ఆసక్తితో మనం వలలువేయుటకు అది మనలను పురికొల్పవలెను.—మత్తయి 13:23 పోల్చుము; 1 థెస్సలొనీకయులు 4:1. (w92 6/15)
ఈ అంశములను నీవు గుర్తుతెచ్చుకొనగలవా?
◻ చేపలుపట్టు వలనుగూర్చి యేసు చెప్పిన ఉపమానములోని రెండు రకాల చేపలు దేనిని సూచించుచున్నవి?
◻ చేపలుపట్టు పనిలో క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఏ విధముగా ఇమిడియుండెను?
◻ మనకాలములో జరిగింపబడుచున్న చేపలుపట్టు పని ఎందుకంత ప్రాముఖ్యమై యున్నది?
◻ ఉపమానములోని చేపలుపట్టు వల మనలో ప్రతిఒక్కరము ఏ స్వయం-విశ్లేషణకు నడిపించవలెను?
[20వ పేజీలోని చిత్రాలు]
గలిలయ సముద్రములో అనేక శతాబ్దములు చేపలుపట్టు పని కొనసాగెను
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.