కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 2/1 పేజీలు 16-21
  • నేడు దేవుని కనికరమును అనుకరించుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేడు దేవుని కనికరమును అనుకరించుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షమించుట, ఒక క్రైస్తవ బాధ్యత
  • యెహోవాయొద్దకు తిరిగివచ్చుట
  • కనికరముతోకూడిన ఇతర సహాయము
  • మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి
    మన రాజ్య పరిచర్య—2002
  • బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మనం ప్రేమించేవాళ్లు ఎవరైనా యెహోవాకు దూరమైతే . . .
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 2/1 పేజీలు 16-21

నేడు దేవుని కనికరమును అనుకరించుము

“యెహోవా కనికరము బహుగొప్పది గనుక, దయచేసి మనము ఆయన చేతిలోనే పడుదుము గాక.”—2 సమూయేలు 24:14 NW.

1. దేవుని కనికరమును గూర్చి దావీదు ఎలా భావించెను, ఎందుకు?

మానవులకంటే యెహోవా ఎంతో కనికరము గలవాడని రాజైన దావీదు అనుభవపూర్వకముగా ఎరిగియుండెను. దేవుని విధానములు, లేక మార్గములు శ్రేష్ఠమైనవను దృఢనమ్మకముతో, దావీదు ఆయన విధానములను నేర్చుకొని ఆయన సత్యమందు నడుచుకొనుటకు ఇచ్ఛయించెను. (1 దినవృత్తాంతములు 21:13; కీర్తన 25:4, 5) దావీదు వలెనే నీవునూ భావింతువా?

2. గంభీరమైన పాపముతో వ్యవహరించుటను గూర్చి మత్తయి 18:15-17లో యేసు ఏ సలహానిచ్చెను?

2 మనయెడల ఎవరైనా తప్పిదముచేసిన మనమేమి చేయవలెనను విషయములతో సహా, బైబిలు దేవుని ఆలోచన విషయమై మనకు లోతైన అవగాహనను అందించుచున్నది. ఆ తర్వాత క్రైస్తవ విచారణకర్తలుగా ఉండు, తన అపొస్తలులతో యేసు ఇట్లు చెప్పెను: “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.” ఇక్కడ చేరియున్న తప్పిదము కేవలము వ్యక్తిగతమైన తేలికైనది కాదుగానీ, మోసము లేక అబద్ధమువంటి గంభీరమైన తప్పిదమైయుండెను. ఈ చర్య ఒకవేళ సమస్యను పరిష్కరించక పోయినట్లయిన, సాక్షులు అందుబాటులో ఉంటే తప్పిదము జరిగినదని నిరూపించుటకు తప్పిదము చేయబడిన వ్యక్తి వారిని తనతోకూడ తీసుకువెళ్లవలెను అని యేసుచెప్పెను. ఇదేనా చేపట్టవలసిన చివరి చర్య? కాదు. “అతడు [ఆ పాపి] వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల, అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.”—మత్తయి 18:15-17.

3. మారుమనస్సు పొందని తప్పిదస్థుని “అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము” అని చెప్పుటలో యేసు భావమేమి?

3 యూదులుగా అపొస్తలులు, పాపిని “అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము” అనగా దాని భావమేమిటో అర్థము చేసికొందురు. యూదులు అన్యుల సహవాసమును విసర్జించిరి మరియు రోమా సుంకరులుగా పనిజేసిన యూదులను వారు ఈసడించుకొనిరి.a (యోహాను 4:9; అపొ. కార్యములు 10:28) కావున, ఒక పాపిని సంఘము తృణీకరించినట్లయిన, అతనితో సహవసించుటను మానుకొనవలెనని యేసు శిష్యులకు సలహానిచ్చుచున్నాడు. అయితే అది, ఆయాసమయములలో యేసు సుంకరులతో సహవసించుటతో ఎట్లు పొందికను కలిగియున్నది?

4. మత్తయి 18:17 లోని యేసు మాటల దృష్ట్యా, కొంతమంది సుంకరులతో, పాపులతో ఆయనెందుకు వ్యవహారములను కలిగియుండెను?

4 లూకా 15:1 ఇట్లు చెప్పుచున్నది: “సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండిరి.” ప్రతి సుంకరి లేక పాపి ఆయన దగ్గరకు రాలేదు, అయితే “సమస్తమైన” అనగా అనేకులని భావము. (లూకా 4:40 పోల్చుము.) వారెవరు? ఎవరనగా, వారు తమ పాపములు క్షమించబడవలెనను శ్రద్ధగలవారై యుండిరి. అలాంటి కొందరు మారుమనస్సు వర్తమానముచే ఆకర్షింపబడి బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్లిరి. (లూకా 3:12; 7:29) కావున ఇతరులు యేసునొద్దకు వచ్చినప్పుడు, ఆయన వారికి ప్రకటించుట మత్తయి 18:17లో ఆయన చెప్పిన సూత్రమును ఉల్లంఘించలేదు. “సుంకరులును పాపులును అనేకులు [యేసు బోధవిని] . . . ఆయనను వెంబడించువారైరి” అనుటను గమనించుము. (మార్కు 2:15) వీరు సహాయమును నిరాకరించుచు, చెడు జీవితమును కొనసాగించుటకు ఇష్టపడువారు కారు. బదులుగా, వారు యేసు వర్తమానమును వినిరి మరియు వారి హృదయములు స్పర్శింపబడెను. మార్పులు చేసికొనుటకు బహుశ ప్రయత్నించుచు, వారింకా పాపము చేయుచున్నను, వారికి ప్రకటించుటద్వారా “మంచి కాపరి” తన కనికరముగల తండ్రిని అనుకరించుచుండెను.—యోహాను 10:14.

క్షమించుట, ఒక క్రైస్తవ బాధ్యత

5. క్షమించు విషయములో దేవుని ప్రాథమిక స్థానమేమి?

5 క్షమించుటకు మన తండ్రి ఇష్టతయొక్క ఈ ఉత్తేజకరమైన అభయములు మనకు కలవు: “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” “మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది (సహాయకుడు NW) తండ్రియొద్ద మనకున్నాడు.” (1 యోహాను 1:9; 2:1) వెలివేయబడిన వ్యక్తికి క్షమాపణ సాధ్యమా?

6. వెలివేయబడిన వ్యక్తి ఎట్లు క్షమించబడగలడు, తిరిగిచేర్చుకొనబడ గలడు?

6 అవును. పాపము విషయమై పశ్చాత్తాపము చూపని కారణముగా ఒకని వెలివేయు సమయములో, సంఘమునకు ప్రాతినిధ్యము వహించిన పెద్దలు అతడు పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణను పొందు సాధ్యత కలదని అతనికి వివరింతురు. అతను రాజ్యమందిరములో కూటములకు హాజరై, పశ్చాత్తాపపడుటకు తనకు సహాయముచేయు బోధను అక్కడ వినవచ్చును. (1 కొరింథీయులు 14:23-25 పోల్చుము.) తగిన సమయమున అతను పశ్చాత్తాపపడి పరిశుభ్రమైన సంఘములో తిరిగి చేర్చుకొనబడుటకు అభ్యర్థించవచ్చును. అప్పుడు పెద్దలు ఆయనను కలిసికొనునప్పుడు, అతను మారుమనస్సు పొందాడా, తన పాపభరిత విధానమును విడిచిపెట్టాడాయని నిర్ణయించుటకు ప్రయత్నింతురు. (మత్తయి 18:18) విషయమదే అయినట్లయిన, 2 కొరింథీయులు 2:5-8లో ఉంచబడిన మాదిరి కనుగుణ్యముగా, అతడు తిరిగి చేర్చుకొనబడవచ్చును. అతడు వెలివేయబడి అనేక సంవత్సరములైన సందర్భములో, అతను అభివృద్ధియగుటకు కలిసికట్టుగా ప్రయత్నించుట అవసరమైయుండును. అతను ఆత్మీయముగా బలమైన క్రైస్తవునిగా తయారగుటకుగాను తన బైబిలు జ్ఞానమందు, మెప్పుదలయందు పెరుగుటకు ఆ పిమ్మట ఆయనకు కొంతమేరకు సహాయము అవసరమైకూడ ఉండవచ్చును.

యెహోవాయొద్దకు తిరిగివచ్చుట

7, 8. చెరలోనున్న తన ప్రజల సంబంధముగా దేవుడు ఎటువంటి మాదిరియుంచెను?

7 అయితే వెలివేయబడిన వ్యక్తిని సమీపించుటకు పెద్దలు తాముగా ఏ చొరవనైనా తీసికొనవచ్చునా? తీసికొనవచ్చును. కేవలము శిక్షను విధించకుండుట మాత్రమే గాక, తరచు క్రియాత్మక చర్యలద్వారా కూడ కనికరము చూపవచ్చునని బైబిలు తెలియపర్చుచున్నది. మనకు యెహోవా మాదిరి కలదు. తన అవిశ్వాసులైన ప్రజలను చెరలోనికి పంపుటకు ముందు, వారు తిరిగివచ్చుటకు తగిన ఉత్తరాపేక్షను ఆయన ప్రవచనార్థకముగా తెలియపర్చెను: “యాకోబూ, ఇశ్రాయేలు; వీటిని జ్ఞాపకము చేసికొనుము, నీవు నా సేవకుడవు. . . . మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. [తుడిచివేతును NW] నేను నిన్ను విమోచించియున్నాను, [విమోచింతును NW] నాయొద్దకు మళ్లుకొనుము.”—యెషయా 44:21, 22.

8 ఆ పిమ్మట, వారు చెరలోయుండగా క్రియాత్మకముగా స్పందించుచు, యెహోవా అవసరమైన ఇతర చర్యలు గైకొనెను. ‘ఆయనను వెదకి, కనుగొనుటకు’ ఇశ్రాయేలీయులను ఆహ్వానించుటకు, ఆయన ప్రవక్తలను, తన ప్రతినిధులను పంపెను. (యిర్మీయా 29:1, 10-14) యెహెజ్కేలు 34:16 నందు, ఆయన తనను గొర్రెలకాపరికి ఇశ్రాయేలు జనాంగమును తప్పిపోయిన గొర్రెకు పోల్చెను: “తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను.” యిర్మీయా 31:10లో కూడ యెహోవా రూపకల్పనగా ఇశ్రాయేలీయుల కాపరిగా తనను చూపెను. గొర్రె తిరిగివచ్చునని వేచియుండు కాపరిగా ఆయన తనను వర్ణించుకోలేదు, బదులుగా, తప్పిపోయిన వాటికొరకు వెదకు కాపరిగా ఆయన తనను చూపించుకొనెను. ప్రజలు సాధారణముగా పశ్చాత్తాపము చూపక చెరకొనిపోబడినను, వారు తిరిగివచ్చుటకు దేవుడు చొరవతీసికొను ప్రయత్నములు చేయుటను గమనించుము. మలాకీ 3:6 ప్రకారము, క్రైస్తవ ఏర్పాటునందలి తన వ్యవహారమందును దేవుడు మార్పుచెందడు.

9. క్రైస్తవ సంఘములో దేవుని మాదిరి ఎట్లు అనుసరించబడెను?

9 కావున వెలివేయబడి బహుశ ఇప్పుడు పశ్చాత్తాపముచూపు వారియెడల చొరవతీసికొను కారణము కలదనుటను ఇది సూచించుట లేదా? దుష్టుడైన ఆ మనుష్యుని కొరింథు సంఘమునుండి తొలగించవలెనని అపొస్తలుడైన పౌలు నిర్దేశించెనని గుర్తుంచుకొనుము. ఆ పిమ్మట అతడు మరల సంఘములో చేర్చుకొనుటకు నడిపింపబడునట్లు, పశ్చాత్తాపము చూపినందున ఆ మనుష్యునియెడల తమ ప్రేమను స్థిరపర్చవలెనని ఆయన సంఘమును వేడుకొనెను.—1 కొరింథీయులు 5:9-13; 2 కొరింథీయులు 2:5-11.

10. (ఎ) వెలివేయబడిన కొందరిని కలిసికొనుటకు చేయు ఏ ప్రయత్నములైనను ఎటువంటి దృక్పధముచే ప్రోత్సహించబడవలెను? (బి) అలా కలిసికొనుటకు క్రైస్తవ బంధువులు ఎందుకు చొరవతీసికొనువారై యుండరు?

10 ముందు ఎత్తిచూపబడిన సర్వసంగ్రహ నిఘంటువు చెప్పినదేమనగా: ‘వెలివేయుటకు ముఖ్యమైన హేతువేమనగా ఆ గుంపుయొక్క ప్రమాణములను కాపాడుటకే: “పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును” (1 కొరిం. 5:6) ఈ విధానము అనేక బైబిలు మరియు ఇతరవ్రాతల (ఎక్స్‌ట్రాకానొనికల్‌) వాక్యములందు స్పష్టమైయున్నది, అయితే వెలివేయబడిన తర్వాతకూడ, ఆ వ్యక్తిమీద శ్రద్ధచూపుటకు 2 కొరిం. 2:7-10లో పౌలుచేసిన విన్నపము ఆధారమైయుండెను.’ (ఇటాలిక్కులు మావి.) కావున, న్యాయసమ్మతముగా ఇటువంటి శ్రద్ధను నేడు మందకాపరులు చూపవలెను. (అపొ. కార్యములు 20:28; 1 పేతురు 5:2) వెలివేయబడిన వ్యక్తి తిరిగివచ్చునని పూర్వ స్నేహితులు మరియు బంధువులు నిరీక్షించవచ్చును; అయినను 1 కొరింథీయులు 5:11 నందలి ఆజ్ఞను గౌరవించి, వారు వెలివేయబడిన వ్యక్తితో సహవసించరు.b అటువంటి వ్యక్తి తిరిగివచ్చుటకు ఇష్టపడుచున్నాడో లేదో చూచుటకు చొరవతీసికొను విషయమును వారు నియమించబడిన కాపరులకే వదిలివేతురు.

11, 12. వెలివేయబడిన ఎటువంటి వారిని పెద్దలు సహితము కలిసికొనుటకు యిష్టపడరు, అయితే ఎటువంటి వారిని వారు సందర్శింతురు?

11 ‘శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు’ మతభ్రష్టుల వంటి, కొందరి విషయములో సహితము పెద్దలు చొరవతీసికొనుట సరియైనదై యుండదు. వీరు ‘అబద్ధబోధకులైయుండి నాశనకరమగు భిన్నాభిప్రాయములు తెచ్చుటకు మరియు కల్పనావాక్యములతో సంఘమును మోసగించుటకు ప్రయత్నించువారై’ యున్నారు. (అపొ. కార్యములు 20:30; 2 పేతురు 2:1, 3) తగవులాడు లేక చురుకుగా తప్పిదమును ప్రోత్సహించు వెలివేయబడిన వారిని వెదకుటకు కూడ బైబిలు ఎలాంటి ఆధారమునిచ్చుటలేదు.—2 థెస్సలొనీకయులు 2:3; 1 తిమోతి 4:1; 2 యోహాను 9-11; యూదా 4, 11.

12 అయితే, వెలివేయబడిన అనేకులు ఆ విధముగా లేరు. ఒకడు ఏ గంభీరమైన తప్పిదమునుబట్టి వెలివేయబడెనో దానిని అతడు మానుకొనియుండవచ్చును. వేరొకరు పొగాకు నుపయోగించు చుండవచ్చును, లేక అతడు గతములో బహుగా త్రాగువాడై యుండవచ్చును, అయితే ఇప్పుడతడు తప్పుచేయుటకు ఇతరులను నడిపించ ప్రయత్నించుట లేదు. చెరలోనున్న ఇశ్రాయేలీయులు దేవునివైపు మళ్లకమునుపే, తిరిగి రావలెనని ప్రాధేయపడుటకు ఆయన ప్రతినిధులను పంపెను. వెలివేయబడిన మనుష్యుని పరీక్షించుటకు పౌలు లేక కొరింథులోని పెద్దలు ఎవరు చొరవ తీసికొనిరో బైబిలు చెప్పుట లేదు. ఆ మనుష్యుడు పశ్చాత్తాపపడి, తన దుర్నీతిని విడిచిపెట్టినప్పుడు, అతని తిరిగి చేర్చుకొమ్మని పౌలు సంఘమును నిర్దేశించెను.

13, 14. (ఎ) కనికరముతో చొరవ తీసికొనుటకు వెలివేయబడిన కొందరు ప్రతిస్పందించగలరని ఏది సూచించుచున్నది? (బి) కలిసికొను ఏర్పాటును పెద్దల సభ ఎట్లు ఏర్పాటు చేయగలదు?

13 ఇటీవలి కాలమందు వెలివేయబడిన వ్యక్తిని ఒక పెద్ద కలియుట తటస్థించిన సందర్భములు కలవు.c యోగ్యమైనచోట తిరిగి చేర్చుకొనబడుటకు తీసికొనవలసిన చర్యలను ఆ కాపరి క్లుప్తముగా వివరించెను. ఈ విధముగా కొంతమంది వ్యక్తులు పశ్చాతాపముచూపి తిరిగి చేర్చుకొనబడిరి. అటువంటి సంతోషదాయకమైన ఫలితములు కనికరముతో కాపరులు సమీపించినప్పుడు ప్రతిస్పందించు వెలివేయబడినవారు లేక సహవాసము మానుకొనినవారు ఉందురని సూచించుచున్నవి. అయితే పెద్దలు ఈ పనిని ఎట్లు నిర్వహించగలరు? అటువంటి వారు తమ ప్రాంతమందు నివసించుచున్నారాయని, పెద్దలు బహుశ సంవత్సరమున కొకసారి పరిశీలించవలెను.d వెలివేయబడి సంవత్సరమునకుపైగా అయిన వారిమీద పెద్దలు దృష్టి కేంద్రీకరింతురు. పరిస్థితులనుబట్టి, అది సరియైనట్లయిన, వారు అటువంటి వ్యక్తిని సందర్శించుటకు ఇద్దరు పెద్దలను (వీలుంటే ఆ పరిస్థితితో పరిచయమున్న వారిని) నియమించుదురు. తప్పులుబట్టువారిని, ప్రమాదకరమైన దృక్పధముగల వారిని, లేక తమకు సహాయము అవసరము లేదని తెలియజెప్పిన వారిని సందర్శించ నవసరము లేదు.—రోమీయులు 16:17, 18; 1 తిమోతి 1:20; 2 తిమోతి 2:16-18.

14 కొద్దిసేపు మాట్లాడుటకు వెళ్లుటనుగూర్చి ఆ ఇద్దరు కాపరులు టెలిఫోనుచేసి అడుగవచ్చును, లేక తగిన సమయములో అతని ఇంటియొద్ద ఆగవచ్చును. వెళ్లిన సమయములో, నిర్దయగా లేక పూర్తిగా మెత్తబడిన వారిగా కాదుగాని కనికరముతో కూడిన తమ శ్రద్ధను వారు అప్యాయముగా ప్రదర్శించవలెను. గతమందు జరిగిన దానిని మరలా చర్చించుటకు బదులు, వారు యెషయా 1:18; 55:6, 7 మరియు యాకోబు 5:20 వంటి బైబిలు వచనములను చర్చించవచ్చును. దేవుని మందకు తిరిగివచ్చు ఆసక్తి ఆ వ్యక్తికి ఉన్నట్లయిన, బైబిలు మరియు వాచ్‌టవర్‌ సొసైటి ప్రచురణలను, రాజ్యమందిరములోని కూటములకు హాజరగుటవంటి ఏ చర్యలను గైకొనవలెనో వారు దయతో అతనికి వివరించవచ్చును.

15. వెలివేయబడిన వ్యక్తిని కలిసికొను పెద్దలు ఏ విషయమును మదిలో యుంచుకొనవలెను?

15 పశ్చాత్తాపమునకు తగిన సూచన ఉన్నదా, మరొకసారి సందర్శించుట మంచిదాయని తీర్మానించుటకు ఈ పెద్దలకు జ్ఞానవివేచనములు అవసరము. వెలివేయబడిన కొందరిని ‘మారుమనస్సు పొందునట్లు మరలా నూతనపరచుట’ అసాధ్యమని వారు మనస్సు నందుంచుకొనవలెను. (హెబ్రీయులు 6:4-6; 2 పేతురు 2:20-22) సందర్శించి వచ్చిన తర్వాత, వారిద్దరు సంఘ సేవాకూటమికి క్లుప్తముగా విషయమును వివరించుదురు. తిరిగి వారు, తమ తర్వాతి సంఘ పెద్దల సమావేశములో పెద్దలందరికి ఈ విషయమును తెలియజేయుదురు. కనికరముతోకూడిన పెద్దల చొరవ దేవుని దృక్కోణమును ప్రతిబింబించును: “మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.”—మలాకీ 3:7.

కనికరముతోకూడిన ఇతర సహాయము

16, 17. వెలివేయబడిన వ్యక్తియొక్క క్రైస్తవ బంధువులను మనమెట్లు దృష్టించవలెను?

16 పైవిచారణకర్తలుగా ఉండక, వెలివేయబడిన వ్యక్తులయెడల అటువంటి చొరవ తీసికొనని మనలాంటి వారి విషయమేమి? ఈ ఏర్పాటును మరియు యెహోవాను అనుకరించుటకు పొందికగా మనమేమి చేయగలము?

17 ఒకడు వెలివేయబడి లేక సహవాసము మానుకొనినంత కాలము, మనము ఈ ఆదేశమును అనుసరించవలయును: “సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదు.” (1 కొరింథీయులు 5:11) అయితే, ఈ బైబిలు నిర్దేశకము వెలివేయబడిన వ్యక్తితో నివసించు క్రైస్తవ కుటుంబ సభ్యులను గూర్చిన మన దృక్కోణముపై ప్రభావము చూపకూడదు. ప్రాచీన యూదులు సుంకరుల విషయమై ఎంత గట్టిగా ప్రతిస్పందించిరంటే, వారు సుంకరి కుటుంబమును సహితము ద్వేషించిరి. యేసు దానిని ధృవీకరించలేదు. ఆయన చెప్పినదేమంటే సహాయము నిరాకరించు పాపిని “అన్యునిగాను సుంకరిగాను” చూడవలెనని; అంతేగాని క్రైస్తవ కుటుంబ సభ్యులను అలా చూడవలెనని ఆయన చెప్పలేదు.—మత్తయి 18:17.

18, 19. వెలివేయబడిన వ్యక్తియొక్క నమ్మకమైన బంధువులయెడల మన క్రైస్తవత్వమును ప్రదర్శించుటకుగల కొన్ని మార్గములేమైయున్నవి?

18 నమ్మకమైన క్రైస్తవ కుటుంబ సభ్యులకు మనము ప్రత్యేకముగా మద్దతునిచ్చువారమై యుండవలెను. వెలివేయబడి, వారి ఆత్మీయ పనులను వాస్తవముగా నిరాశపరచు వ్యక్తితో ఇంటిలో కలిసి నివసించుచున్నందున వారిప్పటికే బాధను, అడ్డంకులను ఎదుర్కొనుచుండవచ్చును. క్రైస్తవులు వారి ఇంటిని సందర్శించుటను అతడు ఇష్టపడకపోవచ్చును; లేక యథార్థపరులైన కుటుంబ సభ్యులను చూచివెళ్లుటకు వారు వచ్చినట్లయిన, సందర్శకులనుండి దూరముగావుండు మర్యాదను అతడు పాటించక పోవచ్చును. క్రైస్తవ కూటములకు, సమావేశములకు వెళ్లవలెనను కుటుంబ ప్రయత్నములకు సహితము అతడు అవరోధము కల్గించవచ్చును. (మత్తయి 23:13 పోల్చుము.) ఆ విధముగా అననుకూలతను కలిగియున్న క్రైస్తవులయెడల మనము నిజముగా కనికరము చూపవలెను.—2 కొరింథీయులు 1:3, 4.

19 అనురాగముతో కూడిన కనికరము చూపించుటకు మనము ‘ఓదార్పుకరముగా మాట్లాడవలెను’ మరియు అట్టి గృహమందలి అటువంటి యథార్థపరులతో మనము ప్రోత్సాహకరమైన రీతిలో సంభాషించవలెను. (1 థెస్సలొనీకయులు 5:14) కూటములకు ముందు ఆ తర్వాత, ప్రాంతీయసేవలో ఉన్నప్పుడు, లేక కలిసివున్న ఇతర సమయములలో సహితము వారిని బలపరచు చక్కని అవకాశములు ఉండును. వెలివేయుటను మనము ప్రస్తావించ నవసరములేదు అయితే మనమనేక క్షేమాభివృద్ధికరమైన సంగతులను చర్చించవచ్చును. (సామెతలు 25:11; కొలొస్సయులు 1:2-4) కుటుంబమందలి క్రైస్తవులను కాయు పనిని పెద్దలు చేసినను, వెలివేయబడిన వ్యక్తితో ఎలాంటి వ్యవహారములు లేకుండా మనముకూడ వారిని సందర్శించవచ్చును. మనము సందర్శించినప్పుడు లేక టెలిఫోను చేసినప్పుడు వెలివేయబడిన వ్యక్తి పలికినట్లయిన, మనము కేవలము కలిసికొన ఉద్దేశించిన బంధువు ఉన్నాడాయని అడుగవచ్చును. సహవాసము కొరకు మనింటికి రమ్మని పిలిచినప్పుడు కొన్నిసార్లు ఆ క్రైస్తవ కుటుంబ సభ్యులు అంగీకరించవచ్చును. విషయమేమంటే: వారు—పిన్నలైనను వృద్ధులైనను—మన తోటి సేవకులును, దేవుని సంఘమందలి ప్రియమైన సభ్యులునై యున్నారు, వారిని ఒంటరివారిగా చేయకూడదు.—కీర్తన 10:14.

20, 21. ఒకడు తిరిగిచేర్చు కొనబడినప్పుడు మనమెట్లు భావించవలెను, ప్రవర్తించవలెను?

20 వెలివేయబడిన వ్యక్తిని మరలా చేర్చుకొనినప్పుడు కనికరముచూపు మరొక రంగము తెరువబడును. ‘ఒక పాపి మారుమనస్సు పొందినప్పుడు’ పరలోకములో సంతోషము కలుగునని యేసు ఉపమానములు నొక్కితెల్పెను. వెలివేయబడిన వ్యక్తినిగూర్చి పౌలు కొరింథీయులకు ఇలా వ్రాశాడు: “మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వానియెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 2:7, 8) ఒక వ్యక్తి మరలా చేర్చుకొనబడిన తర్వాతి దినములలో, వారములలో మనము ఆ సలహాను తెలివిగా, ప్రేమతో అన్వయించుదము.

21 తప్పిపోయిన కుమారునిగూర్చి యేసుచెప్పిన ఉపమానము మనము తప్పించుకొనవలసిన ప్రమాదమును గుర్తుచేయుచున్నది. తప్పిపోయిన సోదరుడు తిరిగివచ్చినందుకు అన్న ఆనందించకపోగా కోపగించుకొనెను. అదే విధముగా జరిగిన తప్పిదము విషయమై చెడు అభిప్రాయము కలిగియుండుట లేక ఒక వ్యక్తి తిరిగి చేర్చుకొనబడినందున అయిష్టపడుట చేయకూడదు. బదులుగా, మనగురి యెహోవా ప్రతిస్పందనను ఉదహరించిన, ఆ తండ్రివలె ఉండవలెను. చనిపోయాడనుకున్నంతగా తప్పిపోయిన కుమారుడు తిరిగి లభించినందున లేక బ్రతికినందున ఆ తండ్రి సంతోషించెను. (లూకా 15:25-32) అదేప్రకారము, తిరిగి చేర్చుకొనబడిన సహోదరునితో మనము ఏ నిర్భందములేకుండా మాట్లాడుదుము మరియు అతని ఇతరవిధంగా ప్రోత్సహింతుము. అవును, మన పరలోకపు తండ్రి క్షమించి కనికరము చూపునట్లుగానే, మనము కనికరము చూపుచున్నామని రుజువుపర్చవలెను.—మత్తయి 5:7.

22. యెహోవా దేవుని మనము అనుకరించుటలో ఏమి ఇమిడియున్నది?

22 మన దేవుని అనుకరించవలెనని మనము కోరుచున్నట్లయిన, ఆయన ఆజ్ఞలు మరియు ఆయన న్యాయమున కనుగుణ్యముగా మనము కనికరము చూపవలెననుటలో ప్రశ్నయే లేదు. ఆయనను కీర్తనల రచయిత ఇలా వర్ణించెను: “యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.” (కీర్తన 145:8, 9) క్రైస్తవులు అనుకరించుటకు ఎంతప్రేమగల మాదిరి! (w91 4/15)

[అధస్సూచీలు]

a “పాలస్తీనాలోని యూదాప్రజలు ప్రత్యేకముగా అనేక కారణములతో సుంకరులను నీచముగా చూసెడివారు: (1) ఇశ్రాయేలు దేశమును ఆక్రమించుకొనిన పరాయి అధికారము కొరకు వారు డబ్బు వసూలుచేసెడివారు, అలా ఈ దురాక్రమణకు వారు పరోక్షముగా మద్దతునిచ్చుచుండిరి; (2) వారు అన్యాయము చేయుటకు వెనుకాడని వారిగా పేరుగాంచి, తమ స్వంత ప్రజల ధనముతో బహు ధనవంతులైరి; (3) వారి పని ఎప్పుడు అన్యులతో కలిసిచేయునట్లుండెను, కాగా అది వారిని సంప్రదాయకముగా అపవిత్రులను చేసెను. సుంకరులను తృణీకరించుట క్రొ[త్త] ని[బంధన] మరియు యూదామత గురువుల వ్రాతలలో కన్పించును . . . ఈ చివరి వ్రాతల ప్రకారము, సుంకరి కుటుంబము సహితము ద్వేషింపబడవలెను.”—ది ఇంటర్నేషనల్‌ స్టాండార్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా.

b ఒక క్రైస్తవ కుటుంబమందు వెలివేయబడిన రక్తసంబంధి ఉన్నట్లయిన, ఆ వ్యక్తి ఇంకను కుటుంబ అనుదిన వ్యవహారములు మరియు కార్యక్రమములందు, ఎప్పటివలెనే భాగమైయుండును. దీనిలో కుటుంబముగా ఆత్మీయ విషయములను పరిశీలించునప్పుడు హాజరై యుండుటయు చేరియుండగలదు.—1988 నవంబరు 15, ది వాచ్‌టవర్‌ పుటలు 19-20 చూడుము.

c యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము 1991, పుటలు 53-4 చూడుము.

d ప్రాంతీయ సేవలో లేక మరొకరీతిలో, ఏ సాక్షియైనను ఆ ప్రాంతమందు వెలివేయబడిన వ్యక్తి నివసించుచున్నాడని తెలిసికొనినట్లయిన, అతడు ఆ విషయమును పెద్దలకు తెలియపర్చవలెను.

ఈ అంశములను మీరు గుర్తుపెట్టుకొన్నారా?

◻ సుంకరులను, పాపులను యూదులెట్లు చూసిరి, అయితే అటువంటి కొందరితో యేసు ఎందుకు వ్యవహారములను కలిగియుండెను?

◻ తప్పిపోయిన అనేకులయెడల కనికరముతో చొరవతీసికొనుటకు ఏ లేఖనాధారము కలదు?

◻ పెద్దల సభ అటువంటి చొరవనెట్లు తీసికొనగలదు, ఎవరియెడల?

◻ తిరిగి చేర్చుకొనబడిన వారియెడల, వెలివేయబడిన వారి కుటుంబముల యెడల మనమెట్లు కనికరము చూపవలెను?

[21వ పేజీలోని బాక్సు]

దేవుని పరిశుభ్రమైన, సంతోషకరమైన సంఘములో ఒకప్పుడు భాగమైయుండి, ఇప్పుడు వెలివేయబడిన లేక సహవాసము మానుకొనిన వానిగావుంటే అతడు అదే స్థితిలో ఉండనవసరము లేదు. బదులుగా, అతడు మారుమనస్సు పొంది సంఘములోని పెద్దలతో మాట్లాడుటకు చొరవతీసికొనవచ్చును. తిరిగివచ్చుటకు మార్గము తెరువబడియున్నది.

[20వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి