దేవుని కనికరమును మీరు అనుకరించుదురా?
“మీరు ప్రియులైన పిల్లలవలె దేవునినిపోలి నడుచుకొనుడి.”—ఎఫెసీయులు 5:1.
1. ఇతరులను అనుకరించుట మనందరికి ఎందుకు శ్రద్ధకల్గించు విషయమై యుండవలెను?
మంచి కొరకు లేక చెడుకొరకు, అనేకమంది ప్రజలు ఇతరులను అనుకరింతురు. మనమెవరి చుట్టు ఉన్నామో, ఎవరినైతే మన మనుకరింతుమో వారు మనపై ఎక్కువ ప్రభావము చూపగలరు. సామెతల ప్రేరేపిత రచయిత ఇలా హెచ్చరించెను: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగల వాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” కావున మంచి కారణముతో దేవుని వాక్యము ఇలా చెప్పుచున్నది: “చెడుకార్యమును కాక మంచి కార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి.”—3 యోహాను 11.
2. మనమెవరిని అనుకరించవలెను, ఏ విధములుగా?
2 మనమనుకరించగల స్త్రీపురుషుల అద్భుతమైన బైబిలు మాదిరులు మనకు కలవు. (1 కొరింథీయులు 4:16; 11:1; ఫిలిప్పీయులు 3:17) అయినను, మన మనుకరించవలసిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడు. ఎఫెసీయులు 4:31–5:2 నందు, మనము విసర్జించవలసిన లక్షణములను, అభ్యాసములను వ్రాసిన తర్వాత, అపొస్తలుడైన పౌలు, “దయగలిగి కరుణాహృదయులై . . . ఒకరినొకరు క్షమించుడి” అని ఉద్భోదించెను. ఇది కీలకమైన ఈ ఉపదేశమునకు నడిపెను: “కావున, మీరు ప్రియులైన పిల్లలవలె దేవునినిపోలి నడుచుకొనుడి. . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.”
3, 4. దేవుడు తననుగూర్చి ఏ వర్ణనను దయచేసెను, మరియు న్యాయవంతుడైన దేవునిగా ఆయనకు మనమెందుకు శ్రద్ధనివ్వవలెను?
3 మన మనుకరించవలసిన దేవుని విధానములు మరియు లక్షణములేమై యున్నవి? తానుగా మోషేకు ఆయన వివరించిచెప్పిన దానినుండి చూడగల్గునట్లు, ఆయన వ్యక్తిత్వమునకు మరియు పనులకు అనేక ఆకృతులు కలవు: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన క్పపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక . . . తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును.”—నిర్గమకాండము 34:6, 7.
4 యెహోవా “నీతిని న్యాయమును ప్రేమించువాడు” గనుక, మనము తప్పకుండా ఆయనను తెలిసికొని ఆయన వ్యక్తిత్వపు ఈ ముఖరూపమును అనుకరించవలెను. (కీర్తన 33:5; 37:28) ఆయన సృష్టికర్త, ఆలాగే ఆయన మానవుల సర్వోన్నత న్యాయాధిపతి, శాసనకర్త, కావున ఆయన అందరియెడల న్యాయమును వ్యక్తపర్చుచున్నాడు. (యెషయా 33:22) తన ప్రజలైన ఇశ్రాయేలీయులు మధ్య మరియు ఆ తర్వాత క్రైస్తవ సంఘములో న్యాయమును ఆయన కోరిన విధము, మరియు అది అమలుచేయబడునట్లు చూచుటలో ఇది స్పష్టముగా సూచింపబడినది.
దైవిక న్యాయము నెరవేర్చబడెను
5, 6. ఇశ్రాయేలీయులతో దేవుని వ్యవహారములందు న్యాయము ఎట్లు వ్యక్తపర్చబడెను?
5 ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకొనినప్పుడు, ‘ఖచ్ఛితముగా విని నిజముగా తన నిబంధన ననుసరించి నడుచుకొందురా అని’ దేవుడు వారినడిగెను. సీనాయి పర్వతమునొద్ద కూడి వారు, “యెహోవా చెప్పినదంతయు చేసెదమని” జవాబిచ్చిరి. (నిర్గమకాండము 19:3-8) ఎంత గంభీరమైన బాధ్యత! దేవదూతలద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు దాదాపు 600 నియమములను ఇచ్చెను, కాగా వారు ఆయన సమర్పిత ప్రజలుగా వాటిని పాటించు బాధ్యతను కలిగియుండిరి. ఎవరైనా అలా చేయనట్లయిన అప్పుడేమి? దేవుని ధర్మశాస్త్రమందు ప్రావీణ్యతగల వ్యక్తి ఇట్లు వివరించెను: “దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందెను.”—హెబ్రీయులు 2:2.
6 అవును, విధేయత చూపని ఇశ్రాయేలీయుడు లోపముగల మానవ న్యాయమునుబట్టి కాదుగాని, మన సృష్టికర్తయొక్క న్యాయమునుబట్టి “న్యాయమైన ప్రతిఫలము పొందెను.” నియమ ఉల్లంఘనకు దేవుడు వివిధ శిక్షలను నిర్ణయించెను. అన్నింటికంటే కఠినమైన శిక్ష ఏదనగా ‘కొట్టివేయబడుట,’ లేక మరణదండన. అది ఘోరమైన ఉల్లంఘనలు అనగా విగ్రహారాధన, వ్యభిచారము, రక్తసంబంధుల మధ్య లైంగికత్వము, జంతుసంయోగము, సలింగసంయోగము, శిశుబలి, హత్య, మరియు రక్తమును దుర్వినియోగము చేయుటవంటి వాటికి అమలుచేయబడెను. (లేవీయకాండము 17:14; 18:6-17, 21-29) అంతేకాకుండా, ఏ ఇశ్రాయేలీయుడైనను ఉద్దేశ్యపూర్వకముగా, పశ్చాత్తాపము చూపకుండా ఏ దైవిక నియమమునైనను ఉల్లంఘించినట్లయిన అతడు “కొట్టివేయ” బడగలడు. (నిర్గమకాండము 4:15, 18; 15:30, 31 సంఖ్యాకాండము 4:15, 18; 15:30,31) ఈ దైవిక న్యాయము నెరవేర్చబడినప్పుడు, అది ఆ తప్పిదస్థుని వంశస్థులపై బహుగా ప్రభావము చూపెడిది.
7. దేవుని ప్రాచీన ప్రజలమధ్య న్యాయమును అమలుపర్చుటయొక్క పరిణామములు కొన్ని ఏమైయున్నవి?
7 అటువంటి శిక్షలు దైవనియమ ఉల్లంఘనయొక్క గంభీరతను నొక్కితెల్పెడివి. ఉదాహరణకు, ఒకని కుమారుడు త్రాగుబోతుగా, తిండిబోతుగా తయారయినట్లయిన, అతని పరిపక్వతగల న్యాయాధిపతులయొద్దకు తీసికెళ్లెడివారు. అతడు ఉద్దేశ్యపూర్వకముగా చేయుచు, పశ్చాత్తాపముచూపని వాడని వారు కనుగొన్నట్లయిన, న్యాయమును అమలుచేయుటలో వాని తలిదండ్రులును భాగము వహించవలెను. (ద్వితీయోపదేశకాండము 21:18-21) మనలో తలిదండ్రులుగా ఉన్నవారు అలాచేయుట అంత సులభము కాదనుటను ఊహించగలరు. అయినను సత్యారాధికుల మధ్య దుష్టత్వము ప్రబలకుండుటకు అది అవసరమైయుండెనని దేవుడు ఎరిగియుండెను. (యెహెజ్కేలు 33:17-19) “ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు” అని చెప్పబడగలవాని ద్వారా ఇది ఏర్పాటుచేయబడెను.—ద్వితీయోపదేశకాండము 32:4.
8. క్రైస్తవ సంఘముతో దేవుడు వ్యవహరించిన వాటియందు న్యాయము ఎట్లు గుర్తింపబడినది?
8 అనేక శతాబ్దముల తర్వాత దేవుడు ఇశ్రాయేలు జనాంగమును తృణీకరించి క్రైస్తవ సంఘమును ఎన్నుకొనెను. అయితే యెహోవా మారలేదు. ఆయనింకను న్యాయమునకు కట్టుబడియున్నాడు మరియు “దహించు అగ్ని” అని వర్ణింపబడగల వాడైయున్నాడు. (హెబ్రీయులు 12:29; లూకా 18:7, 8) కావున, తప్పిదస్థులను వెలివేయుటద్వారా సంఘమంతటిలో దైవభయమును నింపు ఏర్పాటును ఆయనింకను కలిగియున్నాడు. సమర్పించుకున్న క్రైస్తవులు పశ్చాత్తాపము చూపని తప్పిదస్థులుగా తయారైనట్లయిన వారిని వెలివేయవలసి యుండును.
9. వెలివేయుట అనగానేమి, అది ఏమి నెరవేర్చును?
9 వెలివేయుటలో ఏమి ఇమిడియున్నది? మొదటి శతాబ్దములో ఒక సమస్యతో వ్యవహరింపబడిన విధానములో మనమొక దృశ్యపాఠమును చూచెదము. కొరింథులో ఒక క్రైస్తవుడు తన తండ్రి భార్యతో వ్యభిచరించి పశ్చాత్తాపము చూపలేదు, కావున పౌలు అతనిని సంఘమునుండి వెలివేయవలెనని నిర్దేశించెను. దేవుని ప్రజల పరిశుద్ధతను కాపాడుటకు దీనిని చేయవలసి యుండెను, ఏలయనగా “పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును.” అతని వెలివేయుటద్వారా, అతని దుష్టత్వమునుబట్టి దేవుడు మరియు ఆయన ప్రజలు అగౌరపరచబడుటనుండి కాపాడబడుదురు. వెలివేయబడుటయను తీవ్రమైన క్రమశిక్షణ దిగ్భ్రాంతితో అతడు తనతప్పు తెలిసికొనుటకు, ఆలాగే అది అతనిలో, సంఘములో దేవునికి భయపడవలసిన విలువను నింపుటకు పనిచేయును.—1 కొరింథీయులు 5:1-13; ద్వితీయోపదేశకాండము 17:2, 12, 13 పోల్చుము.
10. ఎవరైనా వెలివేయబడినట్లయిన దేవుని సేవకులు ఎట్లు ప్రతిస్పందించవలెను?
10 దైవిక ఆజ్ఞ ఏమనగా దుష్టుడైన ఒకడు వెలివేయబడినట్లయిన, క్రైస్తవులు “అట్టివానితో సాంగత్యము చేయకూడదు, [అతనితో] భుజింపనుకూడదు.”a ఆ విధముగా అతడు దైవిక నియమమును గౌరవించి దానిప్రకారము నడుచుకొనుటకు కోరుకొను యథార్థపరుల సామాజిక వ్యవహారములతోసహా, వారి సహవాసమునుండి కొట్టివేయబడును. వారిలో కొందరు స్వంత కుటుంబమునకు బయటి బంధువులై ఉండవచ్చును, అనగా వారు ఒకే గృహములో ఉండు వారుకాదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము దుష్టుడైన తమ కుమారుని మరణశిక్షయందు భాగము వహించుట హెబ్రీ తలిదండ్రులకు సులభముగా లేనట్లే, ఆ బంధువులకును ఈ దైవిక ఆదేశమును పాటించుట కష్టముగా ఉండవచ్చును. అయినను, దేవుని ఆజ్ఞ స్పష్టముగా ఉన్నది; కావున వెలివేయుట న్యాయమైన చర్యయని మనము నిశ్చయత కలిగియుండగలము.—1 కొరింథీయులు 5:1, 6-8, 11; తీతు 3:10, 11; 2 యోహాను 9-11; ది వాచ్‌టవర్, సెప్టెంబరు 15, 1981, పుటలు 26-31; ఏప్రిల్ 15, 1988, పుటలు 28-31 చూడుము.
11. వెలివేయుట సంబంధముగా దేవుని వ్యక్తిత్వపు వివిధ ఆకృతులు ఎట్లు వ్యక్తము కాగలవు?
11 మన దేవుడు కేవలము న్యాయవంతుడే కాదు; ఆయన “కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును” అని గుర్తుంచుకొనుము. (సంఖ్యాకాండము 14:18) వెలివేయబడిన వ్యక్తి పశ్చాత్తాపపడి, దైవిక క్షమాపణను వెదకవచ్చునని ఆయన వాక్యము స్పష్టము చేయుచున్నది. ఆ పిమ్మట ఏమి? అతని బహిష్కరణకు నడిపిన తప్పిదము విషయమైన పశ్చాత్తాపమునకు తగిన రుజువును అతడు చూపుచున్నాడాయని ప్రార్థనాపూర్వకముగా, జాగ్రత్తగా తీర్మానించుటకు అనుభవముగల పైవిచారణకర్తలు అతనితో సమావేశము కావచ్చును. (అపొ. కార్యములు 26:20 పోల్చుము.) అట్లయిన, కొరింథులోని ఆ మనుష్యుని సంబంధముగా జరిగిన దానిని 2 కొరింథీయులు 2:6-11 సూచించినట్లుగా, అతనిని సంఘములో మరలా చేర్చుకొనవచ్చును. అయినను, బహిష్కరింపబడిన కొందరు సంవత్సరాలుగా దేవుని సంఘమునుండి దూరముగా ఉన్నారు, కావున వారు తిరిగివచ్చు లాగున వారికి సహాయపడుటకు ఏదైనా చేయవచ్చునా?
కనికరముతో సమతూకము చేయబడిన న్యాయము
12, 13. దేవుని మనము అనుకరించుటలో ఆయన న్యాయమును ప్రతిబింబించుటకంటే ఎక్కువ ఎందుకు ఇమిడియుండవలెను?
12 ముందు ప్రస్తావించబడినది ప్రాథమికముగా నిర్గమకాండము 34:6, 7 లోని దేవుని లక్షణములలోని ఒక దానితోనే వ్యవహరించినది. అయితే ఆ వచనములు, దేవుని న్యాయముకంటే మరియెక్కువను వివరించినవి, మరియు ఆయనను అనుకరించువారు కేవలము న్యాయమును మాత్రమే అమలుచేయుటపై దృష్టి నిలుపరు. సొలొమోను నిర్మించిన ఆలయపు నమూనాను మీరు తయారుచేస్తున్నట్లయిన, దాని స్తంభములలో కేవలము ఒకదానిని మాత్రమే మీరు పరిశీలింతురా? (1 రాజులు 7:15-22) లేదు, ఏలయనగా అది మీకు ఆలయముయొక్క పాత్ర మరియు సహజత్వముల సమతూకమైన చిత్రము నివ్వజాలదు. అదేప్రకారము, మనము దేవుని అనుకరించవలె నన్నట్లయిన, “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము, . . . వేయి వేలమందికి కృపనుచూపుచు, దోషమును . . . క్షమించుట” వంటి ఆయన ఇతర లక్షణములను, విధానములను కూడ మనము అనుకరించవలెను.
13 ఇశ్రాయేలీయులతో ఆయన వ్యవహరించిన విధమునుండి మనము చూచునట్లు, కనికరము, క్షమించుట ఆయన ప్రాముఖ్యమైన లక్షణములై యున్నవి. మరలా మరలాచేసిన తప్పిదము విషయమై న్యాయవంతుడగు దేవుడు వారిని శిక్షించకుండా వదలలేదు, అయినను ఆయన వారియెడల విస్తారమైన కనికరమును, క్షమాపణను ప్రదర్శించెను. “ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు.” (కీర్తన 103:7-9; 106:43-46) అవును, వందలాది సంవత్సరాల ఆయన వ్యవహారముల పూర్వాన్వయ దృష్టి ఆ మాటలు సత్యమని నిరూపించుచున్నవి.—కీర్తన 86:15; 145;8, 9; మీకా 7:18, 19.
14. దేవుని కనికరమును తాను అనుకరించెనని యేసు ఎట్లుచూపెను?
14 యేసుక్రీస్తు “దేవుని మహిమయొక్క తేజస్సును, (ప్రతిబింబమును NW) ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” యున్నందున, క్షమించుటకు ఆయన అదేవిధమైన కనికరమును, ఇష్టతను ప్రదర్శించునని మనము అపేక్షించవలెను. (హెబ్రీయులు 1:3) ఇతరుల యెడల ఆయనచేసిన క్రియలు చూపునట్లుగా, ఆయనట్లు చేసెను. (మత్తయి 20:30-34) తన మాటలద్వారా కూడ ఆయన కనికరమును నొక్కితెల్పెను. వాటిని మనము లూకా 15వ అధ్యాయములో చదువుదుము. అక్కడున్న మూడు ఉపమానములు యేసు యెహోవాను అనుకరించెనని రుజువు చేయుచున్నవి, మరియు అవి మనకొరకు ప్రాముఖ్యమైన పాఠములను అందజేయుచున్నవి.
తప్పిపోయిన దానియెడల శ్రద్ధ
15, 16. లూకా 15 లోని ఉపమానములను చెప్పుటకు యేసును ఏది పురికొల్పెను?
15 మనమనుకరించుటకు ఒక సామరస్య చిత్రము నిచ్చుచు, ఆ ఉపమానములు పాపులయెడల దేవుని కనికరముతో కూడిన శ్రద్ధను నిరూపించుచున్నవి. ఆ ఉపమానముల రంగమును పరిశీలించుము: “ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన [యేసు] దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులును శాస్త్రులును అది చూచి—ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.”—లూకా 15:1, 2.
16 అందు చేరియున్న ప్రజలందరు యూదులై యుండిరి. పరిసయ్యులు, శాస్త్రులు చిన్న విషయములలో సహితము మోషే ధర్మశాస్త్రమునకు, అనగా ధర్మప్రాధాన్యమైన నీతికి హత్తుకొనియున్నామను గర్వముతో ఉండిరి. అయితే దేవుడు అటువంటి స్వయం-ప్రకటిత నీతిని అంగీకరించలేదు. (లూకా 16:15) నిజానికి, చెప్పబడిన సుంకరులు రోము కొరకు సుంకము వసూలుచేసెడి యూదులై యుండిరి. ఎక్కువమంది తోటి యూదులనుండి అధికమొత్తము వసూలు చేయుచున్నందున, సుంకరులు నీచముగా చూడబడు వారిగా యుండిరి. (లూకా 19:2, 8) లైంగిక దుర్నీతిపరులు, వ్యభిచారిణులు సహితము చేరియున్న “పాపులతో” వారు లెక్కించబడిరి. (లూకా 5:27-32; మత్తయి 21:32) అయితే ఫిర్యాదుచేయు మతనాయకులను యేసు ఇట్లడిగెను:
17. లూకా 15లో యేసు చెప్పిన మొదటి ఉపమానము ఏమి?
17 “మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి —మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొర్రె దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.” గొర్రెలు, గొర్రెల కాపరులు అక్కడ సర్వసాధారణ దృశ్యము గనుక, మత నాయకులు ఆ అలంకారిక దృష్టాంతమును అర్థము చేసికొనగలరు. శ్రద్ధగల ఆ గొర్రెలకాపరి పరిచితమైన పచ్చిక బయలులో మిగిలిన 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకవెళ్లెను. కనుగొను వరకు అతడు పట్టుదలతో దానిని వెదకి, దొరికినప్పుడు ఆ బెదిరిన గొర్రెను ప్రేమతో మోసికొని వచ్చి తిరిగి మందకు చేర్చెను.—లూకా 15:4-7.
18. లూకా 15లో యేసు చెప్పిన రెండవ ఉపమానము నొక్కితెల్పినట్లు, ఆనందమును ఏది ఎక్కువచేసెను?
18 యేసు రెండవ ఉపమానమును ఇట్లు చెప్పెను: “ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి —నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను.” (లూకా 15:8-10) ఒక వెండినాణెపు విలువ దాదాపు ఒక శ్రామికుని రోజు బత్తెమునకు సమానము. ఆ స్త్రీయొక్క నాణెము ఆమెకు సంక్రమించిన ధనములోనిదై యుండవచ్చును లేదా చేయబడిన ఆభరణములోని ఒక భాగమై యుండవచ్చును. అది పోయినప్పుడు, ఆమె తీవ్రముగా వెదకి దానిని కనుగొనెను, కాగా ఆ పిమ్మట ఆమెయు, ఆమె చెలికత్తెలును సంతోషించిరి. దేవునిగూర్చి ఇది మనకేమి తెల్పును?
పరలోక సంతోషము—దేనిని గూర్చి?
19, 20. లూకా 15 లోని మొదటి రెండు ఉపమానములు ప్రాథమికముగా ఎవరిని గూర్చినవై యున్నవి, అవి దేనిని కేంద్ర అంశముగా చేసినవి?
19 యేసును విమర్శించిన దానికి ప్రత్యుత్తరముగా ఈ రెండు ఉపమానములు చెప్పబడెను. కొన్నినెలల పూర్వము, తన గొర్రెల కొరకు ప్రాణమునర్పించు “మంచి కాపరిగా” ఈయన తననుతాను గుర్తింపజేసికొనెను. (యోహాను 10:11-15) అయినప్పటికిని, ఆ ఉపమానములు ప్రాథమికముగా యేసునుగూర్చి కాదు. శాస్త్రులు, పరిసయ్యులు నేర్చుకొనవలసిన పాఠములు దేవుని దృక్పధము, విధానములపై కేంద్రీకరించబడెను. అందుకే, మారుమనస్సు పొందు పాపి విషయమై పరలోకములో సంతోషము కలుగునని యేసు చెప్పెను. యెహోవాను సేవించుచున్నామని ఆ మతవాదులు చెప్పుకొనిరి, అయినను వారు ఆయనను అనుకరించుటలేదు. మరోవైపున, యేసుయొక్క కనికరముతో కూడిన చర్యలు, ఆయన తండ్రి చిత్తమును సూచించెను.—లూకా 18:10-14; యోహాను 8:28, 29; 12:47-50; 14:7-11.
20 నూటికి ఒక్కటి సంతోషమునకు ఆధారమైనట్లయిన, పది నాణెములలో ఒకటి మరింత సంతోషమునకు ఆధారమగును. నేడుకూడా, పోయిన నాణెము దొరికినప్పుడు స్త్రీలు పొందు అమితానందమును మనము గమనించవచ్చును! ఇక్కడ కూడ, ఆ పాఠము పరలోకముపైనే కేంద్రీకరించబడెను, దీనియందు “మారుమనస్సు పొందు పాపి విషయమై” యెహోవాతో “దేవదూతలును” సంతోషింతురు. “మారుమనస్సు పొందు” అను ఆ మొదటి మాటను గమనించండి. ఈ ఉపమానములు నిజానికి మారుమనస్సు పొందు పాపులనుగూర్చి చెప్పబడెను. ఆలాగే వారు మారుమనస్సు పొందుట సంబంధముగా కలిగిన సంతోషమును ఆ రెండు నొక్కితెల్పుటను మీరు చూడగలరు.
21. లూకా 15లో యేసు చెప్పిన ఉపమానములనుండి మనమే పాఠము నేర్చుకొనవలెను?
21 ధర్మశాస్త్రమునకు పైపైన కట్టుబడియుండి స్వయంతృప్తితో, తప్పుదోవ పట్టింపబడిన ఆ మతనాయకులు దేవుడు “కనికరము, దయగల [వాడని], . . . దోషమును అపరాధమును పాపమును క్షమించును” అను విషయమును అలక్ష్యము చేసిరి. (నిర్గమకాండము 34:6, 7) దేవుని ఈ విధానములను, వ్యక్తిత్వమును వారు అనుకరించివుంటే, మారుమనుస్సు పొందిన పాపులయెడల యేసు చూపిన కనికరమును వారు ప్రశంసించి యుండేవారే. మరి మన విషయమేమి? ఆ పాఠమును మనము హృదయమునకు తీసికొని దానిని అన్వయించుచున్నామా? సరే, యేసుచెప్పిన మూడవ ఉపమానమును గమనించుము.
కార్యమందు మారుమనస్సు మరియు కనికరము
22. క్లుప్తముగా, లూకా 15లో మూడవ ఉపమానముగా యేసు ఏమిచెప్పెను?
22 ఇది తరచు తప్పిపోయిన కుమారుని ఉపమానమని పిలువబడినది. అయినను, దానిని చదువునప్పుడు కొందరు దానిని తండ్రి ప్రేమయొక్క ఉపమానముగా ఎందుకు తలంతురో మీరు చూడవచ్చును. ఒక కుటుంబములోని చిన్న కుమారుడు తండ్రియొద్దనుండి ఆస్తిలో తనకు రావలసిన భాగము తీసికొనుటనుగూర్చి అది చెప్పుచున్నది. (ద్వితీయోపదేశకాండము 21:17 పోల్చుము.) ఈ కుమారుడు దూరదేశము వెళ్లి, అచ్చట తన యావదాస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసికొని, చివరకు పందులుకాయు పనికి కుదిరి, ఆకలి తీర్చుకొనుటకు పందుల మేతను సహితము తిను స్థితికి దిగజారును. ఆఖరికి అతడు తన తప్పు తెలిసికొని, తన తండ్రి ఇంట కూలివానిగానైనను పనిచేయుటకు తిరిగి ఇంటికి వెళ్లుటకు తీర్మానించుకొనును. అతడు ఇంటిని సమీపించుచుండగా, అతనిని ఆహ్వానించుటలో అతని తండ్రి క్రియాత్మక చర్యగైకొని, ఒక విందుకూడా ఏర్పాటుచేయును. ఇంటియొద్ద ఉండి పనిచేయు అతని అన్న, ఇలా కనికరము చూపుటను కోపగించుకొనును. అయితే కుమారుడు చనిపోయి ఇప్పుడు తిరిగి బ్రదికినందున వారు సంతోషించవలెనని తండ్రి చెప్పును.—లూకా 15:11-32.
23. తప్పిపోయిన కుమారుని ఉపమానమునుండి మనమేమి నేర్చుకొనవలెను?
23 చిన్నకుమారుని పోలిన పాపులకు భిన్నముగా, తాము పెద్దకుమారునికి పోల్చబడితిమని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు భావించియుండవచ్చును. అయితే ఉపమానములోని కీలకమైన అంశమును వారు గ్రహించారా, మరి మనము? అది మన కనికరముగల పరలోకపు తండ్రి అసమాన్యమైన లక్షణమును, ఒక పాపియొక్క హృదయపూర్వక మారుమనస్సు, మార్పుదల ఆధారముగా క్షమించు ఆయన ఇష్టతను నొక్కితెల్పుచున్నది. మారుమనస్సు పొందిన పాపుల విడుదల విషయమై సంతోషముతో ప్రత్యుత్తరమిచ్చుటకు ఆయన బోధవినువారిని అది కదిలించియుండును. దేవుడు విషయములను ఆ విధముగా దృష్టించి, చర్యగైకొనును, కావున ఆయనను అనుకరించు వారును అదే విధముగా చేయవలెను.—యెషయా 1:16, 17; 55:6, 7.
24, 25. దేవుని ఏ విధానములను అనుకరించుటకు మనము వెదుకవలెను?
24 నిజముగా, న్యాయము దేవుని విధానములన్నింటిని గుర్తించుచున్నది, కావున యెహోవాను అనుకరించుటకు కోరుకొను వారందరు న్యాయమును విలువైనదిగా ఎంచి దానిని అనుసరింతురు. అయినను, మన దేవుడు కేవలము ఆచరణయోగ్యముకాని లేక కఠినమైన న్యాయము అను ఉద్దేశ్యముతోనే నడిపింపబడు వాడుకాడు. ఆయన కనికరము, ప్రేమ బహుగొప్పవి. నిజమైన మారుమనస్సు ఆధారముగా క్షమించుటకు ఇష్టపడుటద్వారా ఆయన దీనిని చూపించుచున్నాడు. కాబట్టి, మన క్షమించుటను పౌలు దేవుని అనుకరించుటతో ముడిపెట్టుట సరియే: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునినిపోలి నడుచుకొనుడి. . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.”—ఎఫెసీయులు 4:32–5:2.
25 యెహోవా న్యాయమును ఆలాగే ఆయన కనికరమును, క్షమించు ఇష్టతను అనుకరించుటకు నిజమైన క్రైస్తవులు దీర్ఘకాలముగా ప్రయత్నించియున్నారు. మనమాయనను ఎంత ఎక్కువ తెలిసికొందుమో, ఈ విషయములందు ఆయనను అనుకరించుట మనకు అంత సులభముగా ఉండవలెను. అయితే, పాపవిధానమును వెంటాడినందున న్యాయముగా కఠినశిక్షను పొందిన వ్యక్తియెడల దీనిని మనమెట్లు అన్వయించవచ్చును? మనము చూద్దాము. (w91 4/15)
[అధస్సూచీలు]
a “బహిష్కరణ అనగా సాధారణముగా, ఒకప్పుడు మంచి ప్రవర్తన కలిగియున్న వారి సభ్యత్వ ఆధిక్యతలను, ఒక గుంపువారు ఉద్దేశ్యపూర్వకముగా నిరాకరించుటయని భావమైయున్నది. . . . క్రైస్తవ యుగములో ప్రవేశమునకు వచ్చిన బహిష్కరణ ఒకనిని వేరుచేయు ప్రక్రియను సూచిస్తుంది, దీనిద్వారా మత సమాజము ఆ నేరస్థులను మతాచారములు, సంఘ ఆరాధన, మరియు అన్నివిధములైన సామాజిక సంబంధ వ్యవహారములనుండి నిరాకరిస్తుంది.”—ది ఇంటర్నేషనల్ స్టాండార్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా.
మీరేమి నేర్చుకొనిరి?
◻ ఇశ్రాయేలీయుల సమాజములోను, క్రైస్తవ సంఘములోను దేవుని న్యాయము ఎట్లు వ్యక్తపర్చబడెను?
◻ ఆయన న్యాయమునకు తోడుగా, మనమెందుకు దేవుని కనికరమును అనుకరించవలెను?
◻ లూకా 15 లోని మూడు ఉపమానములు చెప్పుటకు ఏది కారణమాయెను, అవి మనకే పాఠములను నేర్పించవలెను?
[12వ పేజీలోని చిత్రాలు]
సీనాయి పర్వతము ముందు ఎర్-రాహా మైదానము (ఎడమవైపు వెనుకభాగము)
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
Garo Nalbandian
[14వ పేజీలోని చిత్రసౌజన్యం]
Garo Nalbandian