మృతసముద్రపు గ్రంథపు చుట్టలు అపూర్వమైన నిధి
మృత సముద్రమునకు వాయవ్యదిక్కున వాడి ఖుమ్‌రాన్ అడుగున, కొన్ని ప్రాచీన శిధిలాలు ఉన్నాయి. అవి రోమన్ దుర్గముయొక్క పాడుబడిన శిధిలాలని ఎంతోకాలము అనుకున్నారు, కావున వాటికి భూగర్భ పరిశోధకులు పెద్ద ధ్యానమివ్వలేదు. అయితే, 1947లో మృతసముద్రపు యెషయా గ్రంథము కనుగొనబడుట ఆ స్థలమునుగూర్చి పునరాలోచించుటకు ప్రోత్సాహమునిచ్చినది.
వెంటనే అక్కడున్న కట్టడములు యూదుల మతసమాజమునకు చెందినవని విద్వాంసులు గుర్తించారు. వారికి వెంటనే కలిగిన ఆలోచనయేమంటే, ఈ ప్రజలు దగ్గరలోగల కొండగుహలలో గ్రంథపు చుట్టలు దాచిపెట్టారని. అయితే ఆ తర్వాత జరిపిన పరిశోధనలు దానిపై సందేహమును కల్గించినట్లు కన్పించుచున్నది.
దొరికిన అసాధారణమైన సొత్తు
బెడూవిన్‌లు తాము అప్పటికే కనుగొనిన చేతివ్రాత ప్రతుల విలువ తెలిసినవారై ఉన్నారు. కావున, 1952లో ఒక వృద్ధుడు తన యౌవ్వనమందు, గాయపడిన ఒక కౌజుపిట్టను తరుముచుండగా అది వెళ్లి ఒక బండ సందులోపడి మాయమైపోవుటను, అక్కడే తాను కొన్ని కుండముక్కలను, ఒక పాత దీపమును చూచిన విషయమును గుర్తుతెచ్చుకొనెను, కాగా తాజా అన్వేషణ మొదలయ్యెను.
ఏటవాలుగావున్న ఆ కొండపగుళ్లలో గుట్టలమధ్యవున్న ఆ గుహ ముఖద్వారమును ఆ వృద్ధుడు ఇంకను గుర్తుపట్టగల్గెను. అది మానవ-నిర్మిత గుహగా గుర్తింపబడినది, కాగా ఇప్పుడు అది గుహ 4 గా సూచింపబడినది. అక్కడ ఆ బెడూవిన్ అప్పటికున్న నేల ఉపరితలమునకు కొన్ని అడుగుల క్రింద [దరిదాపు ఒక మీటరు] చేతివ్రాత ప్రతుల ముక్కలను కనుగొనెను. ఆ ముక్కలలో ఏవియు కుండలలో భద్రపరచబడలేదు, కావున అవి బాగాపాడైపోయి, నల్లగా మరియు పెళుసుగా తయారయినవి. ఆ తర్వాత, దాదాపు 400 చేతివ్రాత ప్రతులుగా కూర్చబడిన, 40,000 ముక్కలు వెలికితీయబడెను. ఒక్క ఎస్తేరు తప్ప హెబ్రీలేఖనముల పుస్తకములన్నియు, వంద బైబిలు చేతివ్రాత ప్రతులలో చూపించబడెను. గుహ 4 నుండి వెలికితీసిన దానిలోని ఎక్కువ సమాచారము ఇంకా ప్రచురింపబడలేదు.
మరి విశేషమైన చేతివ్రాత ప్రతులలో ఒకటి సమూయేలు గ్రంథము, ఇది ఒక చుట్టలో నకలు వ్రాయబడెను. బహుశ 57 కాలమ్‌లలోని నలభైయేడింటిలో దాని హెబ్రీ గ్రంథము భద్రపరబడెను, ఇది గ్రీకు సెప్టాజింట్ తర్జుమా అనువాదకులు ఉపయోగించిన దానికి బహు పోలికను కలిగియున్నది. సా.శ.పూ. మొదటి శతాబ్దమునాటి లేవీయకాండము, సంఖ్యాకాండముల సెప్టాజింట్ గ్రీకు ముక్కలుకూడ కలవు. లేవీయకాండము యొక్క చేతివ్రాత ప్రతులు గ్రీకు Ky’ri·os, “ప్రభువు” నకు బదులు, దేవుని హెబ్రీ దైవనామమైన יהוה కొరకు IAO ను ఉపయోగించుచున్నవి.a
సెప్టాజింటు నందు అధ్యాయము 32, వచనము 43లో కనుగొనబడు మరియు “దేవుని దూతలందరు ఆయనకు వందనము చేయుదురు గాక” అని హెబ్రీయులు 1:6 (NW) నందు ఎత్తిచూపబడిన భాగము, ఈ హెబ్రీ ప్రతియొక్క ద్వితీయోపదేశకాండపు ముక్కలో కన్పించును. గ్రీకు తర్జుమాకు స్పష్టముగా ఆధారిత గ్రంథమున్నదని ఇది వెల్లడిచేయుచున్నది. హెబ్రీ చేతివ్రాత ప్రతులలో ఈ వాక్యము కనుగొనబడుట ఇదే మొదటిసారి. ఆ విధముగా విద్వాంసులు, తరచు క్రైస్తవ గ్రీకు లేఖనములలో ఎత్తిచూపబడిన సెప్టాజింట్ గ్రంథము విషయమై ఒక క్రొత్త అవగాహనను పొందిరి.
సా.శ.పూ. మూడవ శతాబ్దపు మూడవ భాగమునకు చెందిన నిర్గమకాండపు గ్రంథపుచుట్ట, అదే శతాబ్దమునకు చెందిన సమూయేలు గ్రంథపుచుట్ట మరియు సా.శ.పూ 225 మరియు 175 మధ్య కాలమునాటి యిర్మీయా గ్రంథపుచుట్ట లభ్యమైనవి. రచనా విధానములో మరియు వ్యక్తిగత లేఖలలో హెబ్రీ, అరమిక్ అక్షరములలో మార్పులను కనుగొనుటకు సా.శ.పూ మూడవ శతాబ్దమునుండి మొదటి శతాబ్దపు మధ్య కాలమునాటి విస్తారమైన సమాచారము లభించినది. ఇది చేతివ్రాత ప్రతులకు తేదీలు వేయుటలో గొప్పవిలువను కలిగియున్నది.
ఆశ్చర్యపరచిన గుహ 11
చివరకు, ఖుమ్రాన్ చుట్టూవున్న ప్రాంతమంతయు ఇటు బెడూవిన్‌లచే అటు భూగర్భపరిశోధకులచే పూర్తిగా అన్వేషింపబడెను. అయినను, 1956లో ఒక రోజు కొంతమంది బెడూవిన్‌లు గుహ 1 ఉత్తరభాగమందలి కొండగుహల పగుళ్లలోనుండి గబ్బిలాలు బయటకు వచ్చుటను గమనించారు. వారు పైకిఎక్కి అక్కడ మరొక గుహను కనుగొన్నారు, అయితే దాని ముఖద్వారము మూయబడియుండెను. దానిని బయలుపరచుటకు పడివున్న రెండు టన్నుల రాళ్లను తొలగించవలసియుండెను. దానిలో లభ్యమైనవి ఎంతో ఆశ్చర్యము కల్గించెను—పూర్తిగావున్న రెండు చేతివ్రాత ప్రతులు ఇంకా ఐదు పెద్ద ఇతరభాగములు లభించెను.
లభ్యమైన అన్నింటికంటే ప్రసిద్ధమైనది ఏదనగా కీర్తనల అందమైన గ్రంథపుచుట్ట. దాని చర్మపు మందము మేక చర్మముకాక బహుశ దూడ చర్మమైయుండవచ్చునని సూచించుచున్నది. ఐదు పొరలు, నాలుగు వేర్వేరు పత్రములు, మరియు నాలుగు ముక్కలు మొత్తము కలిపి అది 4 మీటర్లకంటే ఎక్కువ నిడివిని కలిగియున్నది. ఈ గ్రంథపుచుట్ట పైభాగము బహుగా భద్రపరబడినను, దాని క్రిందిభాగము చాలావరకు పాడైపోయినది. అది సా.శ. మొదటి శతాబ్ద మొదటి అర్థభాగమునకు చెందినది, దీనియందు 41 కీర్తనల భాగములున్నవి. సందర్భమందలి చతురస్రాకార హెబ్రీ అక్షరముల మధ్యను ప్రముఖముగా కన్పించునట్లు, టెట్రాగ్రమేటన్ దానియందు ప్రాచీన వాడుక-హెబ్రీ అక్షరములతో 105 సార్లు వ్రాయబడెను.
లేవీయకాండము యొక్క మరొక చేతివ్రాత ప్రతి, పూర్తిగా ప్రాచీన హెబ్రీ అక్షరములతోనే వ్రాయబడెను, అయితే ఇట్లెందుకో ఇంకా సరియైనరీతిలో వివరింపబడలేదు. ఈ విధమైన వ్రాతతో ఉనికిలోవున్న వ్రాత ప్రతులన్నింటిలోకెల్లా ఇది ఎక్కువ నిడివిగలది, ఈ వ్రాత సా.శ.పూ. ఏడవ శతాబ్దములో యూదులు బబులోను చెరకు వెళ్లినప్పుడు వాడుకలో ఉండెను.
యోబు గ్రంథపు అరమిక్ భావవివరణయగు, టార్‌గూమ్ (Targum) నకలుకూడా వెలుగునకు వచ్చినది. వ్రాయబడిన తొలి టార్‌గూమ్‌లలో ఇదికూడ ఒకటి. వివిధ గుహలలో ఇతర బైబిలు పుస్తకములపై అనేక వ్యాఖ్యానములుకూడ కనుగొనబడెను. ఈ గ్రంథపుచుట్టలన్నియు ఇంత భద్రముగా ఈ గుహలలో దాచిపెట్టుట ఎట్లు జరిగెను?
ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా, కొన్ని ఖుమ్రాన్ సమాజమువారు దాచిపెట్టి యుండవచ్చును. అయితే నిదర్శనాధారముగా, సా.శ. 68లో అనగా చివరిసారిగా యెరూషలేము నాశనమగుటకు రెండు సంవత్సరముల ముందు రోమాసైన్యము యూదయ మీదికి వచ్చుచుండగా యూదులు పారిపోవుచు వీటిలో అనేకము దాచిపెట్టియున్నట్లు కన్పించుచున్నది. అత్యంత విలువైన చేతివ్రాత ప్రతుల కొరకు, ఖుమ్రాన్‌కు దగ్గరలోని గుహలేకాకుండా, యెరికోకు చుట్టు అనేకమైళ్ల ఉత్తరమున, మరియు మసాడకు దక్షిణమున సమీపముగా ఉన్న గుహలతో యూదా అరణ్యము భద్రపరచుటకు సహజమైన రక్షిత స్థలమైయున్నది. అవి భద్రపరబడినందుకు మనమెంత కృతజ్ఞలమై యున్నాము! యెహోవా ప్రేరేపిత వాక్యము మారలేదనుటకు అవి మరింత రుజువును ఇనుమడింపజేయుచున్నవి. నిజముగా, “మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”—యెషయా 40:8. (w91 4/15)
[అధస్సూచీలు]
a రెఫరెన్సు బైబిలు, అప్పెండిక్స్ 1C (5) మరియు లేవీయకాండము 3:12 కొరకైన పాదవచనము చూడండి, అక్కడ ఈ చేతివ్రాతప్రతి 4Q LXX Lev/b అని గుర్తింపబడినది.
[32వ పేజీలోని బాక్సు]
త్వరలో ఇంకా ఎక్కువ వచ్చునా?
దశాబ్దముల పూర్వము కనుగొనబడినను, మృతసముద్రపు గ్రంథపు చుట్టలయొక్క ముక్కలు ఎక్కువ భాగము ప్రచురింపబడలేదు. 1990 డిశంబరు 23, ది న్యూయార్కు టైమ్స్ ఇట్లు ప్రకటించినది: “తమ తోటిపనివారిని నిరాకరించుచు ఒక వర్గానికిచెందిన విద్వాంసుల గుంపు, వాటి ఛాయాగ్రహణ సంబంధమైన పోలికలను సహితము దాచిపెట్టారు, మరియు వారు తమ స్వాధీనమందున్న సమాచారములో ఎక్కువ భాగమును ప్రచురించుటకు నిరాకరించుచున్నారు.” అయితే ఆ వార్తాపత్రిక, ఇటీవలనే సంపాదక వర్గములోని సిబ్బంది మార్పిడి చేయబడినదని, “గ్రంథపుచుట్టల చుట్టు అలుముకొనియున్న వర్గభావమును” చేధించుటకు ఇదొక మెట్టని, “. . . , చరిత్రలో ఒక అసాధారణ యుగమును గూర్చి లోకము మరింత తెలిసికొనునని” నివేదించినది.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.