అరాచకత్వ లోకములో నేరము
ఆధునిక కాలములో నేరము అసాధారణ సంఘటనేమీ కాదు. తన సహోదరుడైన హేబెలును కయీను హతమార్చినప్పుడు వేలాది సంవత్సరముల క్రితమే మొదటి హత్య జరిగెను. ప్రాచీన హెబ్రీ లేఖనములలో అత్యాచారము, అస్వాభావిక లైంగికత్వము ప్రస్తావించబడెను. (ఆదికాండము 3:8; 19:4, 5; 34:1-4) మంచి సమరయుని వృత్తాంతము చూపునట్లు, మన సామాన్య శకము మొదటి శతాబ్దములో ప్రజలను కొట్టి దోచుకొనుట జరిగేది. (లూకా 10:29-37) అయితే ఈనాడు భేదమున్నది.
న్యూయార్కు, లండను, కలకత్తా, లేక బొగొటా ఇలా ప్రపంచములోని అనేక పెద్దనగరాలలో ప్రజల భావమేమనగా, నేరము మరింత ప్రబలముగా, మరింత భయానకముగా ఉన్నది. “అరాచక సంస్కృతి” అను వార్తాశీర్షికలో ఇండియాటుడే నివేదిక ఇట్లనుచున్నది: “దేశంలో హింసాకాండ, క్రమశిక్షణా రాహిత్యం, పెచ్చరిల్లి అరాచకం ఒక మతంగా ఎదిగిపోయి, దేశసమైక్యతకు ఆధారమైన నైతిక, సాంఘిక విలువలకు చేటు కలగనుండడం ఎంతగానో ఆందోళన కలిగిస్తున్నది.” నేరమునకు వ్యతిరేకముగా పోరాడుటలో, పోలీసులు సహితము కొన్నిసార్లు చట్టాలను ఉల్లంఘించుటకు, తమకైతాము నేరసంబంధ పద్ధతులు అవలంభించుటకు శోధింపబడుచున్నారు. ఇండియానుండి ఇంతకుముందు వచ్చిన నివేదిక చెప్పినదేమనగా: “పోలీసు నిర్బంధంలో జరిగే మరణాలు గురించిన వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి.” అది ఇతర దేశాలలోను నిజమైయున్నది.
నేరమునకు గురియగుట వలన కలుగు కష్టాలు మరింత హీనమగుచున్నట్లు కన్పించుచున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములనుండి వచ్చు ఒక నివేదిక చెప్పునదేమనగా: “1988లో అమెరికా గృహములలో ప్రతి నాల్గింటిలో ఒకటి హింసాయుత నేరమునకు లేక దొంగతనమునకు లోనయినవి.” అంతేకాకుండా, ఇప్పుడు ప్రజలు తక్కువ వయస్సులోనే హింసాయుత నేరములకు పాల్పడుచున్నారు. ఒక లాటీను-అమెరికా పత్రిక విజన్ చెప్పునదేమనగా, “ప్రతి పదిమంది సికారియోస్ [కిరాయి హంతకులు] లలో తొమ్మిదిమంది పిన్నవయస్కులే. జన్యు సంబంధ భావములో [వారు] ‘పిల్లలు’ మరియు న్యాయరీత్యా కాపాడబడువారు.” అంతేకాకుండా, చిన్నపిల్లలు హింసాయుత నేరములకు పాల్పడుట ప్రపంచవ్యాప్త ధోరణియై యున్నది.
దాదాపు 2,000 సంవత్సరముల క్రితము బైబిలు ఇలా ప్రవచించినది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, . . . అపవిత్రులు, అనురాగరహితులు, . . . అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులునై యుందురు. . . . దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.”—2 తిమోతి 3:1-4, 13.
ఆ అపాయకర అంత్యదినములలో మనము జీవించుచున్నామను నిదర్శనాధారము 1914 నుండి అంతకంతకు ఎక్కువగుచున్నది. రెండు ప్రపంచ యుద్ధములను, ఇతర పెద్ద పోరాటములను అనుభవించిన ఈ ప్రపంచము, అనేక విధములుగా పరిపాలింప శక్యము కానిదై అరాచకముతో నిండియున్నది. నేరము ప్రబలమైయున్నది. అనేక నగర ప్రాంతములలో నేరస్థులు అధికారమును తామే తీసికొని చట్టముననుసరించు అనేకమంది జీవన-విధానములనే మార్చివేసిరి. ఒక ప్రముఖ యు.ఎస్. సెనేటర్ (పాలకసభ సభ్యుడు) చెప్పినట్లుగా: “మనమిప్పుడు క్రితమెన్నడు భయపడని, అనేక సంగతుల విషయమై కలతచెందవలసి వస్తుంది. చెరసాలలో బంధింపబడవలసిన వారిని విడిచిపెట్టి, మనమే ఖైదీలుగా తయారవుతామేమో అన్నంతగా కొన్నిసార్లు మనము భయపడుచున్నాము.”
దాని ఫలితముగా, 20 లేక 30 సంవత్సరముల క్రితము అవసరములేని జాగ్రత్తలను ఈనాడు ప్రజలు తీసికొనుచున్నారు. తలుపులు రెండు లేక మూడు తాళాలు కలిగివుంటున్నాయి మరియు ఉక్కుతో వాటిని మరియెక్కువ బలపర్చడం జరుగుతూవుంది. దొంగలకు ఏమి ఇవ్వనందున కొట్టబడుటను తప్పించుకొను ఆశతో అనేక స్థలములలో దోపిడిదొంగలను సంతృప్తిపరచుటకు ప్రజలు తమతో సరిపడునంత డబ్బు తీసికొనివెళ్లుచున్నారు. చీకటిపడిన తర్వాత అనేక వీధులు నిర్మానుష్యమగుచున్నవి, వాటిలో అప్పుడప్పుడు కేవలము విషయమును పట్టించుకోని వారు, మొండిగా సాహసించు వారు, మరియు పరిస్థితులు బలవంతపెట్టు వారు మాత్రమే కన్పింతురు—వీరు నగరారణ్యములో సంచరించు దోచుకొను వారికి సులభమైన లక్ష్యముగా వుందురు.
అరాచకత్వము నిండియున్న ఈ అస్తవ్యస్థ లోకములో నేరమునకు బలికాకుండా మనమెట్లు తప్పించు కొనగలము? దానిని మనమెట్లు ఎదుర్కొనగలము? (w91 1/5)