మృతసముద్రపు గ్రంథపు చుట్టలు దొరికిన బహువిలువైన సొత్తు
యెరూషలేముకు ఆగ్నేయ దిక్కుగా దాదాపు 24 కి.మీ. దూరములో, వాడి ఎన్-నార్, నిర్జనమైన ఒక ఎండిన వాగు, తూర్పుదిశగా మృతసముద్రము వరకు కలదు. దాని ఒడ్డునానుకొనియున్న మైదానము వెనుకగా కొండగుట్టల రేఖ కన్పించును. ఈ మైదానములో, అధికవేడిగల పగలు, దానికి పూర్తి భిన్నముగా అతి చల్లగావుండు శరత్కాలపు రాత్రులు, తామిరే బెడూవిన్ (అరబ్బులలో ఒక జాతివారు) తమ మేకల, గొర్రెల మందలను కాచుకొందురు.
పందొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరములో తమ మందలను కాయుచు, యౌవనుడైన ఒక బెడూవిన్ కూలిపోవుచున్న ఒక కొండగుహ చిన్న పగులులోనికి ఒక రాయి విసిరాడు. ఆ వెంటనే వచ్చిన పెద్దచప్పుడు విని అతడు దిగ్భ్రాంతి చెందాడు. ఆ చప్పుడు ఒక మట్టికుండ పగులుటద్వారా వచ్చెను. అతడు భయముతో పరుగెత్తికొనిపోయెను, అయితే రెండు దినముల తర్వాత అతడు తిరిగివచ్చి, మరి పెద్దగా చీలియున్న పగులుద్వారా లోనికి ప్రవేశించుటకు, 100 మీటర్ల ఎత్తునకు ఆ కొండగుహ పైకి ఎగబ్రాకాడు. అతని కళ్లు చీకటికి అలవాటుపడుచుండగా, గుహలో గోడకు ఆనించి వరుసగా పది పెద్ద మట్టికుండలను, నేలపై రాళ్లమధ్యను చిందరవందరగా పడియున్న పగిలిన కుండపెంకులనేకము అతడు చూసాడు.
చాలా కుండలు ఖాళీగా వున్నాయి, అయితే ఒక దానిలో మాత్రము మూడు గ్రంథపు చుట్టలు, వాటిలో రెండు గుడ్డతో మూయబడి ఉన్నాయి. అతడు ఆ చేతివ్రాత ప్రతులను బెడూవిన్ పాళెమునకు తిరిగి తీసికొనివచ్చి, వాటిని ఒక సంచిలోపెట్టి గుడారపు కొయ్యకు తగిలించి ఒక నెల అక్కడే వుంచాడు. చివరకు, కొంతమంది బెడూవిన్లు ఆ గ్రంథపు చుట్టలను ఎంత ఖరీదుకు అమ్మవచ్చునో చూచుటకు బేత్లెహేముకు తీసుకువెళ్లారు. కాని ఆ గ్రంథపు చుట్టలు ఏ మాత్రము విలువైనవి కావని చెప్పి బెడూవిన్లు ఒక మతపీఠంనుండి అమర్యాదకరమైన రీతిలో తోలివేయబడ్డారు. మరొక వ్యాపారి ఆ చేతివ్రాత ప్రతులకు ఎలాంటి భూగర్భశాస్త్ర విలువలేదని చెప్పాడు, పైగా అతడు అవి యూదుల సమాజమందిరములో నుండి దొంగిలించబడ్డాయేమోనని అనుమానించాడు. అతడెంత పొరపాడుపడెను! చివరకు, ఒక సిరియావాడైన చెప్పులు కుట్టేవాడు దళారిగా వ్యవహరించుటతో వాటి విలువ తెలిసివచ్చెను. వెంటనే, మిగతా చేతివ్రాత ప్రతులు కూడా వెల కట్టబడెను.
ఈ ప్రాచీన వ్రాతలు కొన్ని క్రీస్తు కాలమందలి యూదామత గుంపుల పని విధానమును గూర్చి పూర్తిగా లోతైన క్రొత్త అవగాహనకు మార్గమును తెరచినవి. అయితే యెషయా ప్రవచనముయొక్క బైబిలు చేతివ్రాత ప్రతి లోకమును ఉత్తేజపరచెను. ఎందుకు?
ఉన్నతమైన బహుమానము
క్రొత్తగా కనుగొనబడిన ఈ యెషయా గ్రంథపుచుట్ట మొదట 7.5 మీ. పొడవుగా ఉండెను. అది దాదాపు చర్మపు కాగితమంత నాణ్యముగా, జాగ్రత్తగా చేయబడిన జంతు చర్మముతో తయారుచేయబడినది. అందు 17 పొరలు కలవు. అది జాగ్రత్తగా గీసిన వరుసగీతలతో 54 కాలమ్‌లలో సగటున అడ్డం 30 లైన్లు కూర్చబడెను. ఈ వరుస గీతలపై నిపుణుడైన లేఖికుడు పేరాల ప్రకారము గ్రంథములోని అక్షరములను వ్రాసాడు.—ఫొటో చూడుము.
ఆ గ్రంథపుచుట్ట కర్రలచుట్టు చుట్టబడలేదు, మరియు అనేకమంది దానిని చదువుటకు ఉపయోగించబడినందున మధ్యభాగములో బాగా మురికిగా ఉండెను. విరివిగా ఉపయోగించుట మూలంగా అది బాగాపాడైపోయింది, రుజువుగా దానికి ఎంతో నైపుణ్యముతో మరమత్తులు చేయడం ఇతరత్రా దానిని గట్టిపరచడం జరిగింది. దానిని జాగ్రత్తగా కుండలో బిగించిపెట్టుట ద్వారా అది చక్కగా భద్రపరచబడెను. అది బైబిలు విద్వాంసికి ఆలాగే మనందరికి అది ఎంత విలువైనదై యున్నది?
యెషయా ప్రవక్తయొక్క ఈ చేతివ్రాత ప్రతి ఇప్పుడు లభ్యమందున్న దాని ఏ యితర ప్రతికంటెను ఒక వెయ్యి సంవత్సరములు పురాతనమైయున్నది, అయినను దానిలోని విషయములు ఏమంత భిన్నముగా లేవు. 1950లో ప్రచురింపబడిన ఈ గ్రంథమునకు సంపాదకుడైన ప్రొఫెసర్ మిల్లర్ బరోస్ ఇట్లనెను: “అక్షరక్రమము, వ్యాకరణములలో ప్రాముఖ్యమైన తేడాలతో మరియు ఎంతో కొంత అనురక్తి, ప్రాముఖ్యతగల అనేక మార్పులతోకూడిన వాక్యములతో ఈ చేతివ్రాత ప్రతియందలి యెషయా గ్రంథము, అటుపిమ్మట ఎమ్.టి. లో [మాసొరిటిక్ హెబ్రీ టెక్స్ట్]a వీలైనంత వరకు పూర్తిగా చేర్చబడినది. మరియు హెబ్రీలో దేవుని పరిశుద్ధ నామమగు యెహోవా יהוה, అను టెట్రగ్రమేటన్ను సరిగ్గా ఉపయోగించుటకూడ గమనార్హమై యున్నది.
ఇతర వెలగల చేతివ్రాత ప్రతులు
ఇదే గుహలో దొరికిన మరొక చేతివ్రాత ప్రతిలో కూడ దైవిక నామము కన్పించును, అది ఇప్పుడు గుహ 1 (Cave) అని తెలియజేయబడుచున్నది. హబక్కూకు పుస్తకముపై చేసిన ఒక వ్యాఖ్యాన గ్రంథమందు, బాగుగా పరిచయమున్న చతురస్రాకారపు హెబ్రీ అక్షరములకు భిన్నముగావుండు పాతపద్ధతిలో వ్రాయబడిన ప్రాచీన హెబ్రీ అక్షరములలో నాలుగుసార్లు టెట్రగ్రమేటన్ కన్పించును.—రెఫరెన్సు బైబిలు, హబక్కూకు 1:9 కొరకు వ్రాయబడిన పాదవచనము చూడుము.
బైబిలు పుస్తకమగు దానియేలుకు సంబంధించిన చర్మపు ముక్కలతోసహా, ఆ గుహలో యెషయా గ్రంథపు మరొక చుట్ట భాగములు కూడా లభ్యమయినవి. వెయ్యి సంవత్సరముల తర్వాతి చేతివ్రాత ప్రతులలో కనుగొనబడు రీతిగానే, వీటిలో ఒకటి దానియేలు 2:4 నందు హెబ్రీనుండి అరమిక్కు మారుటను భద్రపరచినది.
బహుగా భద్రపరచబడిన గ్రంథపుచుట్టలోని చిన్నభాగములు, యెరూషలేములో ష్రైన్ ఆఫ్ ది బుక్ అని తెలియబడిన వస్తుప్రదర్శన శాలలో ఇప్పుడు ప్రదర్శింపబడుచున్నవి. ఈ వస్తుప్రదర్శన శాల నేలమాళిగలో కలదు, కాబట్టి నీవు అక్కడికి వెళ్లినప్పుడు నీవు ఒక గుహలో ప్రవేశించునట్లుగా అన్పించును. వస్తుప్రదర్శనశాల యొక్క పైభాగము మృతసముద్రపు యెషయా గ్రంథపుచుట్ట కనుగొనబడిన మట్టికుండ మూతను పోలియుండును. అయితే, అక్కడ నీవు కేవలము యెషయా చేతివ్రాత ప్రతి ప్రతిరూపమును మాత్రమే చూచెదవు. అత్యంత విలువైన అసలు ప్రతి సురక్షితముగా దగ్గరలోని భద్రపరచు గదిలో ఉంచబడినది. (w91 4/15)
[అధస్సూచీలు]
a దానియందలి మరి ప్రాముఖ్యమైన కొన్ని వాక్యాలు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్—విత్ రెఫరెన్సెస్‌లో యెషయా 11:1; 12:2; 14:4; 15:2; 18:2; 30:19; 37:20, 28; 40:6; 48:19; 51:19; 56:5; 60:21 నందు వ్రాయబడినవి. ఈ గ్రంథపుచుట్ట పాదవచనములో 1QIs/a. గా గుర్తింపబడినది.
[29వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
Courtesy of The British Museum
[30వ పేజీలోని చిత్రసౌజన్యం]
Israel Antiquities Authority; The Shrine of the Book, Israel Museum; D. Samuel and Jeanne H. Gottesman Center for Biblical Manuscripts