ప్రకాశమానమైన యెహోవా రథము కదలుచున్నది
“నేను వినుచుండగా—తిరుగుడని చక్రములకు ఆజ్ఞయియ్యబడెను.”—యెహెజ్కేలు 10:13.
1. యెహోవా ఎటువంటి ప్రయాణ సౌకర్యమును కలిగియున్నాడు?
అత్యాధునికమైన జెట్ విమానములుగల ఈ దినములలో ప్రపంచనాయకులు ప్రయాణ సౌకర్యములో అత్యున్నతమైన దశను అనుభవిస్తున్నామని తలంచవచ్చును. అయితే 2,600 సంవత్సరముల క్రితము యెహోవా దేవుడు, తాను వీటన్నిటికంటే ఉన్నతమైన ప్రయాణ సౌకర్యమును కలిగియున్నానని బయలుపరచెను. దాని పోలికను ఏ ఇంజనీరు ఎప్పుడైనను చూడలేదు. అది ఎంతో గొప్పదై భీతిగొల్పునట్టి రథమైయున్నది! విశ్వమునకు సృష్టికర్తయైన వాడు అటువంటి రథములాంటి వాహనములో ప్రయాణముచేయుట ఆశ్చర్యకరముగా తోచుచున్నదా? లేదు, ప్రకాశమానమైన యెహోవా వాహనము మానవునిచే కనుగొనబడిన దేనికంటెను ఎంతోగొప్ప వ్యత్యాసమును కలిగియున్నది.
2. యెహెజ్కేలు 1వ అధ్యాయము, ప్రకాశమానమైన యెహోవారథమును ఎట్లు వర్ణించుచున్నది, మరియు మొదట ఎవరివైపు ప్రవక్త మన అవధానమును మరల్చుచున్నాడు?
2 యెహెజ్కేలు ప్రవచనపు 1వ అధ్యాయములో, యెహోవా తేజోమయమైన ఒక బ్రహ్మాండమగు రథముపై ప్రయాణించుచున్నట్లు వర్ణించబడియున్నాడు. భీతిని కలుగజేయునట్టి ఈ నాలుగు చక్రముల వాహనము దానంతట అదే కదలునదై ఆశ్చర్యకరమగు వాటిని చేయగలదు. పురాతన బబులోనులోని ఒక నది దగ్గర యున్నప్పుడు సా.శ.పూ. 613లో దర్శనమందు యెహెజ్కేలు ఈ పరలోక రథమును చూచెను. ప్రవక్త మొదట ప్రకాశమానమైన యెహోవా రథముపై పరిచర్యచేయుచున్నవారివైపు మన అవధానమును మరల్చుచున్నాడు. దీనిని చదువుకొలది యెహెజ్కేలు చూసినదానిని మనస్సునందు చిత్రీకరించుకొనుటకు ప్రయత్నిద్దాము.
నాలుగు జీవులు
3. నాలుగు కెరూబులలో ప్రతిజీవి కలిగియున్న నాలుగు ముఖముల ద్వారా ఏమి సూచించబడియున్నది?
3 యెహెజ్కేలు ఇట్లు తెలుపుచున్నాడు: “నేను చూడగా ఉత్తరదిక్కునుండి తుపాను వచ్చుచుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతి దానిచుట్టు ఆవరించియుండెను;. . .దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగలయొకటి కనబడెను.” (యెహెజ్కేలు 1:4, 5) వీటిలో ప్రతిజీవికి, లేక కెరూబులకు నాలుగు రెక్కలు, నాలుగు ముఖములుండెను. వాటికి సింహపు ముఖముండెను. అది యెహోవా న్యాయమును సూచిస్తుంది; ఒకటి ఎద్దు ముఖము, ఇది దేవునిశక్తిని సూచిస్తుంది; పక్షిరాజు ముఖము ఆయన జ్ఞానమును సూచిస్తుంది; వాటికి మానవ ముఖము కూడ ఉన్నది, ఇది యెహోవా ప్రేమను సూచిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 12:13; యెషయా 40:26; యెహెజ్కేలు 1:10; 1 యోహాను 4:8.
4. కెరూబులు నాలుగు ముఖములను ఎందుకు కలిగియుండెను, మరియు కెరూబుల వేగము దేనివలెనుండెను?
4 ప్రతి కెరూబుకు నాలుగు వైపులలో ఏ ప్రక్కకు చూచుటకైనను ఒక ముఖమున్నది. కావున, కెరూబులు తక్షణమే తమ దిశను మార్చుకొని కావలసిన వైపునకు చూచు ముఖమును అనుసరించును. అయితే ఆ కెరూబుల వేగము దేనికి పోలియున్నది? అవి మెరుపు వేగముతో కదలగలవు! (యెహెజ్కేలు 1:14) మానవుడు నిర్మించిన ఏ వాహనము అంతటి వేగమును ఎన్నడును సాధించియుండలేదు.
5. రథముయొక్క చక్రములను మరియు వాటి కైవారములను యెహెజ్కేలు ఎట్లు వర్ణించెను?
5 తక్షణమే, రథముయొక్క చక్రములు దృష్టిలోకి వచ్చెను. అవి ఎంత అసాధారణముగా యున్నవి! 16 మరియు 18 వచనములు ఇట్లు చెప్పుచున్నవి: “వాటిరూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండియుండెను.” ప్రతి కెరూబు ప్రక్కన ఒక చక్రముగా నాలుగు చక్రములు వాటివాటి సంబంధముగా నాలుగు స్థానములలో ఉండెను. చక్రములు తళతళలాడు పసుపు లేక ఆకు పచ్చని పారదర్శకమైన రాతివలె మెరయు చుండెను. మహిమగల ఆ దర్శనమునకు ఇది కాంతిని మరియు అందమును జతచేయుచున్నది. చక్రపు కైవారములు “చుట్టు కండ్లతో నిండి” యున్నందున అవి గ్రుడ్డిగా ఏదో ఒక మార్గమున వెళ్లుటలేదు. చక్రములు ఎంతో ఎత్తుగా ఉన్నందున, అవి కేవలము తమ వలయములో ఒక్కసారి తిరుగుటతో ఎంతోదూరమును పయనించును. కావున అవియు, నాలుగు కెరూబులవలెనె మెరుపు వేగముతో కదలగలవు.
చక్రములలో చక్రములు
6. (ఎ) రథము ఎట్లు చక్రములలో చక్రములను కలిగియున్నది? (బి) చక్రములు తమ కదలిక దిశను దేనికి అనుగుణంగా కలిగియున్నవి?
6 మరొకటి కూడ అసాధారణమైనది ఉన్నది. ప్రతిచక్రము లోపల మరియొక చక్రమున్నది. అనగా రెండు సమాన వృత్తములుకలిగిన చక్రములు ఒకదానికి మరొక చక్రము అడ్డముగా బిగించబడియున్నది. అందునుబట్టియే చక్రములు “నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను” అని చెప్పబడగలదు. (17 వచనము) తక్షణమే చక్రములును తమ దిశను మార్చుకొనగలవు. ఎందుకనగా ప్రతి దిశవైపు చక్రము సూటిగా అమర్చబడియున్నది. నాలుగు కెరూబుల కదలిక దిశకు అనుగుణంగా చక్రములు కదలుచున్నవి. శక్తివంతమైన విమానము గాలి ఆధారముతో పైకెత్తబడి నీటిపైన రాచుకుంటూ పోవునట్లు నాలుగు చక్రములపైన అదృశ్య ఆధారముతో దేవుని రథపీఠము ప్రయాణించగలదు.
7. చక్రములలోగల శక్తికి మూలమేమి?
7 నాలుగు కెరూబుల కదలికకు అనుగుణంగా నడచునట్లు ఈ చక్రములు తమ శక్తిని ఎక్కడనుండి పొందియున్నవి? సర్వశక్తిగల దేవుని పరిశుద్ధాత్మనుండియే. 20 వచనము ఇట్లు చెప్పుచున్నది: “ఆత్మయెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. . .జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను.” కెరూబులలోయున్న అదృశ్య చురుకైన శక్తియే చక్రములలోను ఉండెను.
8. చక్రములకు ఏ పేరు పెట్టబడెను, మరియు ఎందుకు?
8 ఈ చక్రములు “తిరుగెడి పనిగలవిగా” వర్ణించబడినవి. (యెహెజ్కేలు 10:13 NW) నిశ్చయముగా ఇది, ప్రతి చక్రము చేయు పనినిబట్టి చెప్పబడియున్నది. అది చుట్టూ వేగముగా తిరుగును. ప్రకాశమానమైన రథముయొక్క ఈ పనిని సూచించుట ప్రకాశమానమైన ఆ రథము కదలు వేగమునకు అవధానము మరల్చుటైయున్నది. దాని చక్రములు ఎంతో వేగముతో తిరిగినను, వాటి నిండ ఉన్న కండ్లనుబట్టి అవి ఎప్పుడు వాటి మార్గమును చూచుచుండును.
9. వేగముగా కదలు రథ నాలుగుచక్రములపైన ఉన్నదానిని యెహెజ్కేలు ఎట్లు వర్ణించెను?
9 అయితే భయంకరమైన ఎత్తుకలిగి, వేగముగా కదిలెడి చక్రములపైన ఏమున్నదో ఇప్పుడు చూచెదము. యెహెజ్కేలు 1 అధ్యాయము, 22 వచనము (NW) ఇట్లు చెప్పుచున్నది: “మరియు జీవుల తలలపైన ఆకాశమండలమువంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను.” విశాలత స్థిర పదార్ధమున్నట్లుగా, “స్ఫటికమువలె” పారదర్శకముగా నుండెను. వేలకొలది రత్నములపై సూర్యుడు ప్రకాశించునప్పుడు మెరయునట్లు అది మెరయుచుండెను. నిజముగా అది భయబ్రాంతిని కలుగజేయునదియే!
రథముపై స్వారీచేయు మహిమగలవాడు
10. (ఎ) సింహాసనము మరియు దానిమీద ఆసీనుడైనవాడు ఎట్లు వర్ణించబడెను? (బి) రథమును స్వారీచేయువాడు మహిమతో ఆవరించుకొనియున్నాడను వాస్తవముచే ఏది సూచించబడియున్నది?
10 రథముపై స్వారీచేయువాడు యెహెజ్కేలుతో మాట్లాడుటకు వీలుగా, రథము ఆగును. ఆ ఆకాశవిశాలతపై నీలకాంతమయమైన సింహాసనమువంటి దొకటి అగుపడును. ఆ సింహాసనముపై నరస్వరూపియగువంటి వాడొకడు ఆసీనుడైయుండెను. ఈ నరస్వరూపము యెహెజ్కేలుకు దైవికప్రత్యక్షతను బాగుగా అర్థముచేసికొనుటకు సహాయపడగలదైయుండెను. ఆ నరరూపము మహిమతో ఆవరించబడియుండి, విద్యుత్‌స్వర్ణము ప్రకాశించునట్లు, కలపబడిన వెండిబంగారములవలె ప్రకాశించుచుండెను. ఈ మానవరూపము నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపముగా ఉండెను. ఆవిధముగా ఆస్వరూపమంతయు మహిమతో నిండికొనియుండెను. ఇది, యెహోవా వర్ణించలేనంత మహిమగలవాడైయున్నాడని సూచిస్తున్నది. అంతేగాక రథముపై ఆసీనుడైన వాని వెనుక మనోహరమైన ఇంద్ర ధనస్సు ఉండెను. తుఫాను వెలసిన తరువాత ఇంద్ర ధనస్సు ఎంతటి ప్రశాంతతను వ్యక్తముచేయును! యెహోవా అటువంటి ప్రశాంతమైన స్వభావమునుగలవాడై తన లక్ష్యణములైన జ్ఞానము, న్యాయము, శక్తి, ప్రేమలను పరిపూర్ణ సమతూకములో ఉంచును.
11. యెహోవా రథము మరియు ఆయన సింహాసనపు దర్శనమునుబట్టి యెహెజ్కేలు ఎట్లు ప్రభావితము చెందెను?
11 యెహోవా రథము మరియు సింహాసనము కాంతి మరియు అందమైన రంగులతో ఆవరించియున్నది. ఇది శకునమునకు మరియు చీకటికి అధిపతియైన సాతానుకు ఎంతటి భిన్నముగా ఉన్నది! దీనంతటివలన యెహెజ్కేలు ఎట్లు ప్రభావితము చెందెను? ఆయన ఇలా అనుచున్నాడు, “నేను చూచి సాగిలపడగా” “నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.”—యెహేజ్కేలు 1:28.
రథము దేనిని వివరించినది
12. ప్రకాశమానమైన యెహోవా రథముచే ఏమి సూచించబడియున్నది?
12 అద్భుతమైన రథము దేనికి చిత్రీకరణగా ఉన్నది? యెహోవా దేవునియొక్క తేజోమయమైన పరలోక సంస్థకు అది చిత్రీకరణగా ఉన్నది. అదృశ్యమండలమందలి ఆయనయొక్క సమస్త పరిశుద్ధ ఆత్మీయ ప్రాణులతో—అనగా సెరాపులు, కెరూబులు, దూతలతో అది ఏర్పడినది. యెహోవా మహోన్నతుడగు దేవుడైయున్నందున ఆయన ఆత్మీయప్రాణులన్నియు ఆయనకు లోబడియుండును. ఆయన వాటిపై పూర్తి ఆధిపత్యమొహించి తన సంకల్పమునకు తగినట్లు వాటిని ఉపయోగించుకొనుచున్నాడను భావములో ఆయన వాటిపై స్వారీచేయుచున్నాడు.—కీర్తన 103:20.
13. (ఎ) యెహోవా తన సంస్థను నడుపుచున్నాడని ఎందుకు చెప్పవచ్చును? (బి) కదలుచున్న యెహోవా నాలుగు చక్రముల దర్శనము మీపై ఎట్లు ప్రభావము చూపును?
13 యెహోవా ఈ సంస్థను ఒక రథముపై స్వారీచేయుచున్నట్లు నడుపుచు, తన ఆత్మయెక్కడికి దానిని నడుపునట్లుజేయునో అచ్చటికే అది కదలునట్లు చేయును. అది ఎటువంటి అదుపు లేక జ్ఞానయుక్తమైన పర్యావేక్షణలేకుండా దాని యిష్టానుసారముగా వెళ్లుటలేదు. ఈ సంస్థను దేవుడు దానికిష్టమొచ్చిన దిశను వెళ్లునట్లు అనుమతించుటలేదు. బదులుగా అది ఆయన నడిపింపులను అనుసరించుచున్నది. అందరు కలసి, దేవుని ఉద్దేశ్యముల పూర్తి నెరవేర్పుకై ఐక్యముగా కదలుచున్నారు. కావున ప్రకాశమానమై, కదలుతూవున్న ఈ నాలుగుచక్రముల యెహోవారథమువలన ఎంతటి అద్భుతమైన పరలోక సంస్థ బయలుపరచబడినది! ఇందుకు అనుగుణ్యముగా యెహోవా సంస్థ పరిపూర్ణమైన సమతూకములో నాలుగు మూలలుగలదానిగా సూచించబడియున్నది.
కావలివానిగా నియమించబడెను
14. ప్రవక్తయైన యెహెజ్కేలుకు ఎవరు చిత్రీకరణగాయున్నారు?
14 అయితే ప్రవక్తయైన యెహెజ్కేలుకు ఎవరు చిత్రీకరణగా ఉన్నారు? చారిత్రక వాస్తవముల ప్రకారము ప్రకాశమానమైన ఈ రథముతో ఆత్మాభిషేకమునొందిన యెహోవాసాక్షుల సమూహము సహవసించియున్నది. ఆవిధంగా యెహెజ్కేలు 1919 నుండి యెహోవాసాక్షుల అభిషక్త శేషమును సూచించుచున్నాడు. ఆత్మీయముగా, దేవుని పరలోక సంస్థ ఆ సంవత్సరమే అభిషక్త శేషముతో, వారు యెహోవాకు ప్రపంచమంతట సాక్షులుగా ఉండులాగున పునరుజ్జీవింపజేయుటకు వారితో సంబంధమేర్పరచుకొనినది. (ప్రకటన 11:1-12 ను పోల్చుము.) ఆ సమయములో, నేడును జరుగుచున్నట్లు రథములాంటి ఆ సంస్థ, కదలికలో యుండెను. వాస్తవమునకు అభివృద్ధికి సంబంధించిన దానిచక్రములు క్రితమెన్నటికంటెను వేగముగా తిరుగుచున్నవి. యెహోవా దానిపై వేగముగా ముందుకు సాగుచున్నాడు!
15. ప్రకాశమానమైన రథముపై స్వారీచేయువాని స్వరము ఏమి చెప్పుచున్నది, మరియు యెహెజ్కేలుకు ఏ పని ఆజ్ఞాపింపబడెను?
15 ప్రకాశమానమైన ఆ రథము తనముందుకు వచ్చి ఎందుకు ఆగినదో యెహెజ్కేలు తెలుసుకొనగోరెను. దానిపై ఆసీనుడైనవానినుండి ఒక స్వరము తనయొద్దకు వచ్చుచున్నట్లు ఆయన గమనించెను. భీతిని కలుగజేయు ఈ దృశ్యములో నిమగ్నమైనవాడై ఆయన సాగిలపడెను. అంతట ప్రకాశమానమైన రథమును నడుపువాడు చెప్పుదానిని వినుము: “నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను.” (యెహెజ్కేలు 2:1) యెహోవా ఆ తరువాత, తిరుగుబాటుచేయు ఇశ్రాయేలు గృహమునకు యెహెజ్కేలును కావలివానిగా నియమించెను. చివరకు ఆయన, దైవనామముపేరట మాట్లాడుటకును ఆజ్ఞాపింపబడెను. యెహెజ్కేలు అను పేరుకు “దేవుడు బలపరచును” అని భావము. కావున యెహెజ్కేలు తరగతిని దేవుడే బలపరచి, క్రీస్తుమతసామ్రాజ్యమునకు కావలివానిగా నియమించుచు వారిని పంపియున్నాడు.
16, 17. (ఎ) ప్రకాశమానమైన రథ దర్శనము యెహెజ్కేలుకు ఎట్లు ప్రయోజనకరముగా ఉండెను? (బి) మన దినములలో, ప్రకాశమానమైన రథ దర్శనపు గ్రహింపు యెహెజ్కేలు తరగతిపై మరియు గొప్పసమూహముపై ఎట్లు ప్రభావము చూపియున్నది?
16 ప్రకాశమానమైన రథ దర్శనము యెహెజ్కేలును నెమ్మదిపరచి దిగ్భ్రాంతుని చేసినది, అయితే అది ఆయనను యెరూషలేముపైకి వచ్చునాశనమును హెచ్చరించు కావలివానిగా కూడ సిద్ధపరచెను. అదే సంగతి ఈనాటి కావలివాని తరగతి విషయములోను వాస్తవమైయున్నది. కదలుచున్న ప్రకాశమానమైన యెహోవా రథపు దర్శనమును గూర్చిన వారి గ్రహింపు అభిషక్త శేషముపై ఎంతో ప్రభావమును కలిగియుండెను. విండికేషన్ మొదటి పుస్తకములో బయలుపరచబడగా, 1931లో యెహెజ్కేలు దర్శనమునుగూర్చి వారు ఎక్కువగా తెలుసుకొనిరి. అప్పుడు వారు ఎంతటి గొప్పమెప్పుతో నింపబడిరనగా వాచ్‌టవర్ అక్టోబరు 15, 1931వ సంచికనుండి ఆగస్టు 1, 1950వ సంచిక వరకు వాచ్‌టవర్ కవరుపేజీ కుడిభాగపు పైమూలన ప్రకాశమాన రథ యెహెజ్కేలు దర్శనపు చిత్రకారుని ఊహపటమును ముద్రించిరి. ఆవిధముగా యెహెజ్కేలు తరగతి వారికాజ్ఞాపింపబడిన పనివిషయమై చర్యగైకొనిరి. మరియు వారు దైవిక హెచ్చరికను ప్రకటించుచు కావలివానిగాను పనిచేయుచున్నారు. ప్రకాశమానమైన రథముపై ఆసీనుడైయున్న యెహోవా నుండి క్రీస్తుమత సామ్రాజ్యమునకు అగ్నిమయ నాశన సమయము క్రితమైన్నటి కంటెను అతి సమీపముగా ఉన్నది!
17 ఈనాడు గొర్రెలాంటి ప్రజలైన “గొప్ప సమూహము,” అభిషక్త శేషముతో సహవసించుచున్నది. (ప్రకటన 7:9) వారు యేకముగా కలసి క్రీస్తుమతసామ్రాజ్యము మరియు ఈ పాపిష్టి విధానముపైకి వచ్చునాశనమును హెచ్చరించుచున్నారు. ఆ హెచ్చరిక పని వేగముగా జరుగుచున్నది, మరియు ప్రకటన 14:6, 7 లో సూచించబడినట్లు దేవదూతలు దానిని బలపరచుచున్నవి.
ప్రకాశమానమైన రథముతో కదలివెళ్లుట
18. దేవదూతల ఎడతెగని మద్దతుకావాలంటే ఏమి చేయవలెను, మరియు వేటికి మనము జాగరూకతతో యుండవలెను?
18 దైవిక తీర్పులను ప్రకటించు తమ పనిని నెరవేర్చుటలో యెహోవా భూ సేవకులకు సహాయముచేస్తూనే, విధేయతగల దేవదూతలు, దేవుని పరలోక సంస్థలో భాగంగా కలసి నడచును. మనమును దేవుని సేవకులగు ఈ బలమైన దూతల ఎడతెగని రక్షణ మరియు నడిపింపును కోరినట్లయిన మనమును సూచనాత్మకమైన చక్రపుపనికి అనుగుణ్యముగా కదలివెళ్లవలెను. అంతేగాక ఆయనయొక్క ప్రకాశమానమైన రథమునకు సమాంతరముగా కదలివెళ్లు యెహోవాయొక్క దృశ్యసంస్థలో భాగంగా దేవుని ఆత్మయొక్క నడిపింపులకు చురుకుగా ప్రతిస్పందించవలెను. (పిలిప్పీయులు 2:13ను పోల్చుము.) మనము యెహోవాసాక్షులమైయున్నట్లయిన ప్రకాశమానమైన రథము నడచు మార్గములోనే మనమును వెళ్లవలెను. మనము దానికి విరుద్ధ తలంపుతో పనిచేయకూడదు. మనము వెళ్లవలసిన దిశ ఇవ్వబడినప్పుడు దానిని మనము అనుసరించవలెను. ఆవిధముగా సంఘము విభాగించబడదు.—1 కొరింథీయులు 1:10.
19. (ఎ) ప్రకాశమానమైన రథ చక్రములు వాటిచుట్టు కన్నులను కలిగియున్నట్లే, యెహోవాప్రజలు ఏవిషయములో మెలకువగాయుండవలెను? (బి) ఈ క్లిష్టమైన సమయములలో మనము గైకొనువిధానమేమైయుండవలెను?
19 దేవుని రథ చక్రముల చుట్టువున్న కన్నులు జాగరూకతను సూచించుచున్నవి. కావున పరలోక సంస్థ మెలుకువతోయున్నట్లే మనమును యెహోవా భూ సంస్థను బలపరచుటకు మెలకువగాయుండవలెను. సంఘస్థాయిలో అట్టి మద్దతును, స్థానిక సంఘపెద్దలతో సహకరించుటద్వారా చూపగలము. (హెబ్రీయులు 13:17) ఈ క్లిష్టమైన సమయములలో, క్రైస్తవులు, యెహోవా సంస్థకు చాలా సన్నిహితముగా హత్తుకొనియుండవలసియున్నారు. సంఘటనలపై మన స్వంత వ్యాఖ్యానములను చేయుటకు మనము యిష్టపడము. అలా చేసినయెడల మనము యెహోవాయొక్క ప్రకాశమానమైన రథముతో కదలివెళ్లువారము కాము. ఎల్లప్పుడు మనకై మనము ఇట్లడుగుకొనుచుందము, ‘ప్రకాశమానమైన రథము ఏ మార్గమున వెళ్లుచున్నది?’ దేవుని దృశ్యసంస్థకంటె ముందుగా మనము వెళ్లినట్లయిన, దేవుని అదృశ్య సంస్థకంటెను మనము ముందుగా వెళ్లుచుందుము.
20. ఫిలిప్పీయులు 3:13-16 నందు అపొస్తలుడైన పౌలు ఏ శ్రేష్టమైన సలహా ఇచ్చుచున్నాడు?
20 ఈ విషయములో పౌలు ఇట్లు వ్రాసెను: “సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటిచేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియ దేవుడు మీకు బయలు పరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.”—ఫిలిప్పీయులు 3:13-16.
21. ఏ క్రమవృత్తమును అనుసరించుటద్వారా దేవుని సంస్థతోపాటు ఆత్మీయాభివృద్ధి సాధించుట సాధ్యము?
21 ఇచ్చట “క్రమము”గా అనునది మనకై మనము బయటపడలేని ఒక చెడు వృత్తములో తిరుగుట కాదు. యెహోవాసేవకులు ఆత్మీయాభివృద్ధిని కలుగజేసుకొను ఒక శ్రేష్టమైన క్రమవృత్తమును కలిగియున్నారు. అది వ్యక్తిగత బైబిలు పఠనము, సంఘకూటములకు హాజరగుట, క్రమముగా రాజ్యసువార్తను ప్రకటించుట మరియు దేవుని పరలోకసంస్థయొక్క లక్షణములను ప్రతిబింబించుట అను వృత్తములో తిరుగుటయైయున్నది.. అటువంటి క్రమ వృత్తములు యెహోవా ప్రకాశమానమైన రథములాంటి సంస్థ నడిపింపులను అనుసరించుటకు వారికి సహాయపడును. ఈ పద్దతిని గట్టిగా వెంబడించుటద్వారా, పరలోకమందు అమర్త్యమైన జీవమునుపొందుట లేక భూ పరదైసులో నిత్యజీవముపొందుటయను మనగురిని సంపాదింతుము.
22. (ఎ) అభిషక్త శేషము మరియు గొప్పసమూహము ఐక్యముగా వ్యవస్థీకరించబడుటకు ఏమి చేయవలెను? (బి) యెహోవా దృష్టినుండి ఏది తప్పించబడదు?
22 యోహాను 10:16 సూచించునట్లు, “వేరెగొర్రెలు” మరియు యెహెజ్కేలు తరగతి ఐక్యముగా వ్యవస్థీకరించబడియున్నారు. ఆవిధముగా యెహోవా సంస్థలో యున్నవారందురు, దేవుని ప్రకాశమానమైన రథముతో పాటు యేకముగా వెళ్లవలెనంటే యెహెజ్కేలు 1వ అధ్యాయమందలి దర్శనముయొక్క పూర్తిభావమును మరియు దాని గుర్తింపును గ్రహించవలసియున్నారు. అందలి దర్శనము, దేవుని దృశ్య మరియు అదృశ్య సంస్థకు అనుగుణ్యముగా మనము కదలివెళ్లవలెనను దానిని గుణగ్రహించుటకు సహాయపడును. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నద” నియు మనము మనస్సునందుంచుకొనవలెను. (2 దినవృత్తాంతములు 16:9) యే ఒక్కసంగతియు యెహోవా దృష్టినుండి తప్పించుకొనదు. ప్రత్యేకముగా తనకైతాను విశ్వసార్వభౌమాధిపతిగా ప్రదర్శించుకొను సంకల్పమునుగూర్చిన ఏ ఒక్క సంగతియు అలా తప్పించుకొనదు.
23. కదలుచున్న యెహోవా రథముతోపాటు మనమును ఏమి చేయవలెను?
23 ప్రకాశమానమైన యెహోవా రథము ఈనాడు నిశ్చయముగా కదలి వెళ్లుచున్నది. ఆ రథముపై స్వారీ చేయువానికనుగుణ్యముగా ప్రతిది—అనగా విశ్వముయొక్క సార్వభౌమునిగా ఆయన సత్యవాదిత్వమును బలపరచునదంతయు త్వరలో మహిమకు తేబడును. ఆయన సెరాపులు, కెరూబులు, దూతలు మనగొప్ప ప్రపంచవ్యాప్త ప్రకటనపనిని బలపరచుచున్నవి. కావున యెహోవా పరలోకసంస్థతో పాటు ముందుకు కదలివెళ్లుదము. అయితే అంతటివేగముగా కదలివెళ్లు ప్రకాశమానమైన రథముతో ఎట్లు కలసి వెళ్లగలము? ఈ పత్రికయొక్క తదుపరి సంచిక దానిని చర్చించును. (w91 3/15)
మీరెట్లు సమాధానమిస్తారు?
◻ యెహెజ్కేలుచే చూడబడిన నాలుగు జీవులవలన ఏ లక్ష్యణములు సూచించబడుచున్నవి?
◻ ప్రకాశమానమైన యెహోవా రథము దేనిని సూచించుచున్నది?
◻ దేవుని ప్రవక్తయైన యెహెజ్కేలుకు ఎవరు చిత్రీకరణగాయున్నారు?
◻ ప్రకాశమానమైన యెహోవా రథమునుగూర్చిన గ్రహింపు యెహెజ్కేలు తరగతిపై మరియు గొప్పసమూహముపై ఎట్లు ప్రభావము చూపియున్నది?