సువార్తల వాషింగ్‌టన్ కోడెక్సె
డిశంబరు, 1906లో చార్షెస్. యల్. ఫ్రీర్ అను ఒక సంపన్న అమెరికా పారిశ్రామికవేత్త మరియు కళలను సేకరించువ్యక్తి, ఆలి అను ఒక అరబ్బీ వ్యాపారస్తుని నుండి, ఈజిప్టులోని గీజాలో కొన్ని పాత వ్రాతప్రతులను కొనెను. ఆలి అవి సోహాగ్ దగ్గర వైట్ మొనాస్టరీ నుండి వచ్చినవని చెప్పినను, చాలావరకు అవి నైలు డెల్టాప్రాంతమందలి గీజా మూడవ పిరమిడ్ దగ్గర వినెడ్రెస్సర్ మొనాస్టరి శిధిలాలలో దొరికినట్లు కన్పించుచున్నది.
ఫ్రీర్‌నకు మూడు వ్రాతప్రతులు మరియు “పైభాగము గట్టిగా తయారయై సులభముగా ఇరిగిపోతు జిగురుతో అంటబడినట్లు గట్టిగా అతుక్కుపోయి నల్లగా పాడుబడిన చర్మపుపుస్తకము ఇవ్వబడినది.” ఇది 6.5 ఇంచీల పొడవు, 4.5 ఇంచీల వెడల్పు, 1.5 ఇంచీల మందము ఉండి, వ్రాతప్రతులతో పాటు అమ్మబడినది. ఇది వాటితో పాటు కలసియున్నందున దీనికి ప్రత్యేకంగా ఏ వెల లేకుండా ఊరకనే ఇవ్వబడినది. ఈ విధముగా ముద్దగా ఉండి ముక్కలుముక్కలుగాయున్న ఆకులను విడదీసి వేరుచేయుట ఎంతోకష్టమైనది, ఎంతో సూక్ష్మముగా చేయవలసి పని కూడా. అయితే చివరకు వీటిలో 84 బయలుపరచబడినవి. ఇవన్నియు పౌలు పత్రికలు గల సామాన్య శకము అయిదు లేక ఆరవ శతాబ్దపు కోడెక్సెకు సంబంధించినవే.
మిగతా మూడు వ్రాతప్రతులలో ఒకటి ద్వితీయోపదేశకాండము మరియు యెహోషువా పుస్తకములు గలది. ఇంకొకటి గ్రీకు సెప్టుజెంట్ తర్జుమాయైన కీర్తనల గ్రంథము. మూడవది మరియు వీటన్నిటిలో ప్రాముఖ్యమైనదేమనగా నాలుగు సువార్తలుగల వ్రాతప్రతి.
ఈ చివరి వ్రాతప్రతిలో 187 శ్రేష్టమైన చర్మపు ఆకులు ఉన్నవి. వీటిలో ఎక్కువ భాగము గొర్రెచర్మపువై, ఏటవాలుగా వ్రాయబడిన గ్రీకు పెద్ద అక్షరములతో వ్రాయబడినవి. వ్రాతలో విరామ స్థానగుర్తులు అరుదుగా ఉన్నను, వాక్యవాక్యమునకు తరచు చిన్న యెడమలు ఉన్నవి. వ్రాతప్రతి అంచులు బాగా పాడైయున్నను, అందులోని వ్రాత మాత్రము చాలావరకు భద్రపరచబడియున్నది. తదుపరి అది వాషింగ్‌టన్ డి.సి. లోని ఫ్రీర్ గేలరీ ఆఫ్ ఆర్ట్ ఆఫ్‌ది స్మిత్‌సోనియన్ ఇనిస్టిట్యూషన్‌కు బహుమతిగా ఇవ్వబడినది. ఇది వాషింగ్‌టన్ కోడెక్సె ఆఫ్‌ది గాస్పెల్స్ అని పిలువబడుచున్నది. దీనిని “W” అను అక్షరముతో గుర్తింతురు.
ఈ చర్మపు పుస్తకము సా.శ. నాలుగవ శతాబ్దపు చివరి లేక అయిదవ శతాబ్దపు తొలిభాగమునాటిదిగా యెంచబడుచున్నది. అనగా ముఖ్యమైన మూడు వ్రాతప్రతులగు సైనాయ్‌టిక్, వాటికన్, అలెక్సాండ్రియన్‌ల కాలమునకు ఇది మరీదూరమైనదిగా లెక్కించబడుటలేదు. ఈ సువార్తలు (సంపూర్తిగా చివరి రెండు ఆకులు తప్ప) పాశ్చాత్త క్రమమని పిలువబడు మత్తయి, యోహాను, లూకా, మార్కు వరుసలో ఉన్నవి.
ఈ వ్రాతప్రతిని చదివినప్పుడు, ఇందు అసాధారణమైనరీతిలో అనేక పాఠాంతరములు మిళితమై, ఒక్కొక్కటి దీర్ఘముగాను, కొన్నిభాగముల వరకు వరుసగా కొనసాగినవి. ఇది భద్రపరచబడిన అనేక వ్రాతప్రతి ముక్కలనుండి కాపీచేయబడినట్లు కనపడుతుంది. అవన్నియు వేరువేరు పాఠాంతరములు గలవి. దీనిని గూర్చి ప్రొఫెసర్ హె. ఎ. సాండర్స్ బహుశా ఇది చక్రవర్తి డయోక్లీషియన్ కాలములో సా.శ. 303 సంవత్సరమున అకాస్మాత్తుగా క్రైస్తవులపైకి హింసనుతెచ్చి, లేఖన ప్రతులన్నిటిని బహిరంగముగా కాల్చివేయవలెనని ఆజ్ఞాపించినందున ఇలా జరిగియుండవచ్చునని దీనికి కారణమును సూచించుచున్నాడు. చారిత్రక వృత్తాంతములనుబట్టి ఆ సమయములో కొన్ని వ్రాతప్రతులు దాచబడినవి. కొన్ని దశాబ్దముల తరువాత ఎవరో తెలియబడని వ్యక్తి భద్రపరచబడిన ఈ వివిధ వ్రాతప్రతులనుండి వాషింగ్‌టన్ కోడెక్సెను ఉత్పత్తిచేయుటకు కాపీచేసినట్లు కనిపించుచున్నది. ఆ తదుపరి యోహాను పుస్తక మొదటి భాగమును (యోహాను 1:1 నుండి 5:11) కోల్పోగా కొంతకాలము తరువాత సా.శ. ఏడవ శతాబ్దములో అది తిరిగి వ్రాయబడవలసి వచ్చెను.
ఈ పాఠాంతరములో కొన్ని ఆసక్తికరమైన మరియు అసాధారణమైన బేధాలు ఉన్నవి. అంతేగాక బహుశా మార్జినల్ గుర్తింపుగా తయారైన మార్కు 16వ అధ్యాయముతోపాటు కొన్ని విడిచిపెట్టబడినవి. పురాతన లాటిన్ మరియు సిరియా పాఠాంతరములకు జతపరచబడియుండుటలో ఈ వ్రాతప్రతికి ప్రత్యేక విలువ ఉన్నది. చర్మపు ఆకులపై క్రొవ్వువత్తి చుక్కలు పడుటవలన కలిగిన మచ్చలనుబట్టి ఇది బాగా ఉపయోగించబడినదని అర్థమగుచున్నది.
హింస, వ్యతిరేకత కాల దుష్పరిణామాలు ఉన్నను, అనేక వ్రాతప్రతుల రూపములలో బైబిలు అద్భుతరీతిగా మనకొరకు భద్రపరచబడియున్నది. నిశ్చయముగా “యెహోవావాక్కులు నిరంతరము నిలుచును.”—1 పేతురు 1:25; యెషయా 40:8. (w90 5/1)
[25వ పేజీలోని బాక్సు]
“అవసరమైన” దేమి?
సువార్తలయొక్క ఈ W కోడెక్స్, తన సన్నిహిత స్నేహితుడగు లాజరుయొక్క సహోదరియైన మార్తతో యేసు చేసిన వ్యాఖ్యానమును అనువదించుటలో దోహదపడినది. యేసు ఆ కుటుంబమును దర్శించినపుడు, మార్త, యేసునకు మంచి భోజనమును సిద్ధముచేయుట ప్రాముఖ్యమని తలంచినది. అయితే ఆయన ఆమెకు దయగా తన పాదములయొద్ద కూర్చొని తాను చెప్పుదానిని వినుచున్న మరియ మాదిరిని అనుసరించమని సలహాయిచ్చెను. ఆయన: “అవసరమైనది ఒక్కటే గాని (అనేక ప్రాచీన ప్రతులలో, అవసరమైనవి కొన్నియే) మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమెయొద్ద నుండి తీసివేయబడదని” చెప్పెను.”—లూకా 10:41, 42.
ఈ మాటలు న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్‌కు ఆధారమైన వెస్ట్‌కాట్ మరియు హార్ట్ గ్రీకు ప్రతినుండి తర్జుమా చేయబడినవి. ఈ బైబిలు యొక్క 1984 రెఫరెన్స్ ఎడిషన్ పాదవచనము ఈ పాఠాంతరము సైనాయ్‌టిక్ (א) మరియు వాటికన్ (B) వ్రాతప్రతులలో ఉన్నట్లు చూపినది. ఈ రెండును ఒకేవిధమైన పద్ధతిలో వ్రాయబడినట్టి ప్రతులైయున్నవి. అయితే అలెక్సాండ్రైన్ (A) వ్రాతప్రతి ఈ విధముగా చదువబడుచున్నది: “గాని, అవసరమైనది ఒక్కటే. ఆమెయైతే. . .” పాదవచనము సూచించురీతిగా కోడెక్స్ W, అలాగే సా.శ. మూడవ శతాబ్దపు వ్రాతప్రతులైన చెస్టర్‌బెట్టి పాపిరస్ (P45), బాడ్‌మర్ పాపిరస్ (P75) ఈ తదుపరి తర్జుమాతో ఏకీభవించుచున్నవి. అయితే ఈ ఇతర వ్రాతప్రతులన్నియు వెస్ట్‌కాట్ మరియు హార్ట్ తమ పుస్తకమును ప్రచురించిన చాలా కాలము తదుపరి వెలుగులోనికి వచ్చినవి. కావున ఈ ప్రత్యాన్మయ పాఠాంతరములను పరిశీలించుటకు వారికి అవకాశము లేకపోయెను. అయితే మనము గ్రంథముయొక్క ఏవిధమైన పాఠాంతరమును నేడు గుర్తించుటకు ఇష్టపడినను యేసు స్పష్టముగా మనకు, మన జీవితములలో ఆత్మీయ విషయములను ముందు పెట్టవలెనని చెప్పుచున్నాడు. అది నిశ్చయముగా మనము అనుసరించదగిన సలహా.
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of Freer Gallery of Art, Smithsonian Institution