ఒక విధవరాలిగా నేను నిజమైన ఓదార్పును కనుగొన్నాను
లిల్లీ ఆర్థర్ చెప్పినది
యెహోవాసాక్షుల ఒక యౌవన పరిచారకుడు భారత దేశంలో ఉతకమండ్లోని ఒక భాగములో ఇంటింటిని దర్శిస్తున్నాడు. ఆచారరీత్య స్త్రీలు అటువంటి అపరిచయస్తుడికి తలుపుతీయరు. కొన్నిగంటలతర్వాత అలసిపోయి, కొద్దిగా నిరుత్సాహపడి ఆయన ఇంటికి వెళ్లడానికి తిరిగాడు. కాని ఆగి ఏదో ప్రేరేపించబడినట్టుగా భావించి తరువాతి తలుపును తట్టాడు. అతనికి తలుపు తెరచిన ఆ స్త్రీ వివరించినట్లుగా అప్పుడు ఏమి జరిగిందో గమనించండి.
రెండు నెలల నా బిడ్డను చేతిలో పట్టుకొని, 22 నెలల నా కుమారుడు నా ప్రక్కన ఉండగా నేను వెంటనే తలుపు తెరిచి ఒక అపరిచయస్తుడు నిలిచియుండుట చూచాను. ఆ మునుపటి రాత్రే నేను అధికంగా దుఃఖించితిని. ఓదార్పును వెతుకుతూ నేను ఇలా ప్రార్థన చేశాను: “పరలోకపు తండ్రీ దయచేసి నీ వాక్యము ద్వారా నన్ను ఓదార్చుము.” ఇప్పుడు నా ఆశ్చర్యమునకు ఆ అపరిచయస్తుడు ఇలా వివరించాడు, “నేను దేవుని వాక్యమునుండి ఓదార్పు మరియు నిరీక్షణా సందేశమును మీకొరకు తెస్తున్నాను.” అతడు దేవుడు పంపిన ప్రవక్త అయి ఉండాలి అని నేను అనుకొన్నాను. అయితే ఏ పరిస్థితి నన్ను సహాయము కొరకు ప్రార్థన చేయుటకు నడిపినది?
బైబిలు సత్యములను నేర్చుకొనుట
నేను దక్షిణ భారతదేశంలో, సుందరమైన నీలగిరి పర్వతములలోని గుడలూరు గ్రామంలో 1922లో జన్మించాను. నేను మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. తరువాత ప్రొటెస్టెంట్ ఫాదిరి అయిన నా తండ్రి తిరిగి వివాహము చేసుకొన్నాడు. మేము మాట్లాడగలిగినప్పటినుండి మాతండ్రి, నా సహోదరులకు మరియు సహోదరీయులకు మరియు నాకు ప్రార్థన నేర్పించాడు. నాలుగు సంవత్సరముల వయస్సులో నా తండ్రి బల్లయొద్ద కూర్చొని ప్రతిరోజు బైబిలు చదువునపుడు నేను కూడా క్రింద కూర్చొని నా బైబిలు చదివేదాన్ని.
ఎదిగిన తరువాత నేను ఒక టీచరునయ్యాను. నాకు 21 సంవత్సరములు వచ్చిన తరువాత నా తండ్రి నా వివాహమును ఏర్పాటు చేశాడు. నా భర్త నేను, ఒక కుమారుడు సుందర్ మరియు కుమార్తె, రత్నతో ఆశీర్వాదించబడ్డాము. అయితే రత్న పుట్టే సమయముకల్లా నా భర్త తీవ్రంగా అస్వస్థత చెంది అటుతరువాత వెంటనే చనిపోయాడు. 24 సంవత్సరముల వయస్సులో, ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతతో నేను హఠాత్తుగా విధవరాలు నయ్యాను.
అటుతరువాత, తన వాక్యమునుండి నన్ను ఓదార్చవలెనని నేను దేవున్ని వేడుకొన్నాను. మరియు ఆ తరువాత దినమే యెహోవాసాక్షులయొక్క ఆ పరిచారకుడు వచ్చాడు. అతనిని నేను లోనికి ఆహ్వానించి “లెట్గాడ్బి ట్రూ” అను పుస్తకాన్ని స్వీకరించాను. ఆ రాత్రి నేను దాన్ని చదువుతుండగా యెహోవా అనే నామాన్ని చూస్తూ వచ్చాను. అది నాకు పూర్తిగా క్రొత్తదైయుండెను. తరువాత ఆ పరిచారకుడు తిరిగివచ్చి బైబిలులోనుండి అది దేవుని నామమని చూపించాడు.
త్వరలో త్రిత్వము మరియు నరకబాధ వంటి బోధలు బైబిలుపై ఆధారపడి లేవని నేను నేర్చుకొన్నాను. దేవుని రాజ్యములో భూమిపరదైసుగా మారుతుందని మరియు మరణించిన ప్రియమైన వారందరు పునరుత్థానము ద్వారా తిరిగి వస్తారని నేర్చుకొన్నపుడు నేను ఓదార్పును మరియు నిరీక్షణను పొందాను. అతి ప్రాముఖ్యముగా నా ప్రార్థన విని నా సహాయమునకు వచ్చిన సత్యదేవుడైన యెహోవాను ఎరిగి ప్రేమించనారంభించాను.
క్రొత్తగా కనుగొన్న జ్ఞానమును పంచుకొనుట
ఆ బైబిలు వచనములలో దేవుని నామమును నేను ఎట్లు చూడలేక పోయాను అని నేను ఆలోచించనారంభించాను. మరియు నా స్వంత బైబిలు పఠనములో పరదైసు భూమిపై నిత్యజీవము అను ఆ స్పష్టమైన నిరీక్షణను ఎందుకు చూడలేకపోయాను? ప్రొటెస్టెంట్ మిషనరీలు నడిపించు బడిలో నేను పనిచేయుచుంటిని, కావున నేను ఆ బడి మేనేజరుకు ఆ బైబిలు వచనములను చూపించాను. (నిర్గమకాండము 6:3; కీర్తన 37:29; కీర్తన 83:18; యెషయా 11:6-9; ప్రకటన 21:3, 4) ఏదోవిధంగా మనము ఈ లేఖనములను గుర్తించలేక పోయాము అని ప్రస్తావించాను కాని నాకు ఆశ్చర్యకరంగా ఆమె సంతోషించినట్లు కనిపించలేదు.
తరువాత ఈ బైబిలు వచనాలు చూపుతూ వేరే పట్టణములో ఉన్న ప్రధానోపాధ్యాయినికి వ్రాశాను. ఆమెతో మాట్లాడటానికి ఒక అవకాశాన్ని అడిగాను. ఆమె తండ్రి ఇంగ్లాండులో పేరుగాంచిన ఫాదిరి, నాతో విషయాన్ని చర్చిస్తాడని నాకు ప్రత్యుత్తరమిచ్చింది. ఆ ప్రధానోపాధ్యాయిని సహోదరుడు ఒక ప్రముఖ బిషపు అయి ఉండెను.
నేను అన్ని విషయములను మరియు లేఖనములను తయారుచేసికొని “లెట్గాడ్ బి ట్రూ” అను పుస్తకమును మరియు నా పిల్లలను తీసుకొని ప్రక్కనున్న పట్టణానికి వెళ్లాను. యెహోవా ఎవరు అనేది త్రిత్వము లేదని మరియు నేను నేర్చుకొన్న ఇతర విషయములను నేను ఆసక్తితో వివరించాను. వారు కొద్దిసేపు విన్నారు కాని ఒక మాట కూడా పలుకలేదు. తరువాత ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఫాదిరి: “నేను నీకొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పాడు.” ఆ వెంటనే ప్రార్థనచేసి నన్ను పంపివేశాడు.
వీధి సాక్ష్యము
ఒక రోజు యెహోవాసాక్షుల పరిచారకుడు, వాచ్‌టవర్ మరియు అవేక్ పత్రికలతో వీధిలో సాక్ష్యమిచ్చుటకు నన్ను ఆహ్వానించాడు. అది నేనెప్పుడు చేయలేని విషయమని అతనికి చెప్పాను. చూడండీ, భారతదేశంలో వీధిలో నిలబడియుండు లేక ఇంటింటికి వెళ్లు స్త్రీని గూర్చి ప్రజలు చాలా చెడుగా తలంచుతారు. అది ఒక స్త్రీకి మరియు ఆమె కుటుంబమునకు కూడా అపకీర్తి తెస్తుంది. నేను నా తండ్రిని ఎక్కువగా ప్రేమించి గౌరవించాను. కావున నాతండ్రిపై నింద తెచ్చుటకు నేను యిష్టపడలేదు.
అయితే, ఆ పరిచారకుడు బైబిలునుండి ఒక వచనమును నాకు చూపించాడు అది ఇట్లనుచున్నది: “నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువానితో నేను ధైర్యముగా మాట్లాడుదును.” (సామెతలు 27:11 కింగ్ జేమ్సు వర్హన్) ఆయన ఇలా అన్నాడు: “నీవు ఆయనవైపు మరియు ఆయన రాజ్యమువైపు ఉన్నావని బహిరంగముగా చూపించుటద్వారా నీవు యెహోవా హృదయాన్ని సంతోషపరచగలవు.” అన్నిటికంటె ఎక్కువగా యెహోవా హృదయాన్ని సంతోషపరచాలని ఆశించి, నేను పత్రికల సంచి తీసుకొని ఆయనతో సహా, వీధిసాక్ష్యము పనిలోనికి వెళ్లాను. నేను అది ఎలా చేశానో ఇప్పుడు ఊహించలేను. అది 1946 లో నన్ను కలిసిన నాలుగునెలల తర్వాత జరిగినది.
భయములను అధికమించుటకు పురికొల్పబడుట
1947లో, భారతదేశపు తూర్పు సముద్రతీరమున, మద్రాసు పట్టణపు శివార్లలో టీచరు ఉద్యోగము స్వీకరించి పిల్లలతో సహా అక్కడికి వెళ్లాను. ఎనిమిది మంది యెహోవాసాక్షుల చిన్న గుంపు పట్టణంలో క్రమముగా కూడుకొనే వారు. ఆ కూటములకు హాజరగుటకు మేము 25 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చేది. భారతదేశంలో ఆ సమయములో సాధారణంగా స్త్రీలు ఒంటరిగా ప్రయాణంచేసేవారు కాదు. వారిని తీసుకు వెళ్లటానికి పురుషులపై ఆధారపడేవారు. బస్సులోనికి ఏలా ఎక్కాలో ఎలా టిక్కెట్టు తీసుకోవాలో అటువంటి విషయాలు నాకు తెలియదు. నేను యెహోవాను సేవించాలని భావించాను, కాని ఎలా? నేను ప్రార్థించాను, “యెహోవా దేవా మిమ్మును సేవించకుండా నేను జీవించలేను. కాని భారత స్త్రీగా నేను ఇంటింటికి వెళ్లటం అసాధ్యము.”
ఈ పోరాటమునుండి తప్పించుటకు యెహోవా నన్ను చనిపోనిస్తాడని ఆశించాను. అయితే, బైబిలునుండి కొంచెము చదువవలెనని నిర్ణయించాను. నేను యిర్మీయా పుస్తకమును తెరచుట తటస్థించింది, అక్కడ ఇట్లు చెప్పబడింది: “నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారియొద్దకు నీవు పోవలెను. నీ కాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. వారికి భయపడకుము. నిన్ను నడిపించుటకు నేను తోడైయున్నాను.”—యిర్మీయా 1:7, 8.
యెహోవా వాస్తవముగా నాతో మాట్లాడుతున్నాడని నేను భావించాను. అప్పుడు నేను ధైర్యము తెచ్చుకొని వెంటనే కుట్టు మిషను దగ్గరకు పోయి పత్రికలను పెట్టుటకు ఒక సంచిని కుట్టాను. మనఃపూర్వకమైన ప్రార్థన చేసినతరువాత ఒక్కదానినే ఇంటింటికి వెళ్లి నావద్దనున్న సాహిత్యమంతా ఇతరులకు అందించి ఆ దినమే ఒక బైబిలు పఠనముకూడా మొదలుపెట్టాను. నా జీవితంలో యెహోవాకు మొదటి స్థానం ఇవ్వాలని ధృడ నిశ్చయానికి వచ్చాను. మరియు నా పూర్తి విశ్వాసమును పూర్తి నమ్మకమును ఆయనయందుంచాను. మాటలద్వారా నింద పొందినప్పటికి బహిరంగ ప్రచార కార్యక్రమము నా జీవితంలో క్రమమైన భాగమైంది. వ్యతిరేకత వచ్చినప్పటికి నేను చేసిన పని కొందరిపై బలమైన ప్రభావమును కలుగ జేసింది.”
ఎన్నో సంవత్సరముల తర్వాత నేను నా కూతురుతో కలసి మద్రాసులో ఇంటింటి సేవచేయుచున్నప్పుడు దీని దృష్టాంతము చూశాను. ఒక హిందూ పెద్ద మనిషి, హైకోర్టు న్యాయాధిపతి నావయస్సును తప్పు అంచనా వేసి ఇట్లన్నాడు. “నీవు పుట్టక మునుపే ఈ పత్రికలనుగూర్చి నాకు తెలుసు. 30 సంవత్సరముల క్రితము ఒక స్త్రీ మౌంట్ రోడ్డువద్ద నిలువబడి క్రమంగా ఈ పత్రికలను అందించేది.” అతడు సంవత్సరపు చందాను కోరాడు.
మరియొక ఇంట్లో ఒక హిందూ బ్రాహ్మణుడు-రిటైరయిన ఉద్యోగస్థుడు మమ్ములను లోపలికి ఆహ్వానించి ఇలా అన్నాడు: “ఎన్నో సంవత్సరాల క్రితము ఒక స్త్రీ మౌంట్ రోడ్ వద్ద ది వాచ్‌టవర్ అందిస్తూ ఉండేది. ఆమె యెడల ఉన్న గౌరవాన్నిబట్టి మీరిచ్చే దాన్ని స్వీకరిస్తాను. ఆ రెండు సార్లు వాళ్లు ప్రస్తావించిన స్త్రీని నేనెయని నాకు తెలుసు అని చిరునవ్వుతో అనుకున్నాను.
బలపరచబడి ఆశీర్వాదింపబడుట
అక్టోబరు 1947లో నేను యెహోవాకు నా సమర్పణకు గుర్తుగా నీటి బాప్తిస్మము పొందాను. ఆ సమయములో రాష్ట్రమంతటిలో నేనొక్క దానినే తమిళము మాట్లాడే స్త్రీ సాక్షిని. కాని ఈనాడు వందలకొలది తమిళ స్త్రీలు నమ్మదగిన, చురుకైన యెహోవాసాక్షులుగా ఉన్నారు.
నేను బాప్తిస్మము పొందిన తరువాత అన్ని వైపుల నుండి వ్యతిరేకత వచ్చింది. నా సహోదరుడు వ్రాశాడు.“ నీవు మర్యాద మరియు యోగ్యత యొక్క హద్దులను దాటి పోయావు.” నేను పనిచేయు బడిలోనుండి మరియు ప్రజలనుండి వ్యతిరేకత వచ్చినది.కాని యెడతెగని మనఃపూర్వకమైన ప్రార్థనద్వారా నేను యెహోవాను యింకా గట్టిగా హత్తుకపోయాను. నాకు మధ్యరాత్రి మెళకువ వచ్చినపుడు నేను వెంటనే కిరోసిన్ నూనె దీపము వెలిగించి పఠించేదాన్ని.
నేను బలపరచబడ్డాను కాబట్టి, ఇతరులను ఓదార్చి సహాయపడు స్థానములోనికి వచ్చాను. ఒక వృద్ధ హిందూ స్త్రీతో నేను పఠించినపుడు ఆమె యెహోవా కొరకు దృఢంగా నిలబడింది. ఆమె చనిపోయినప్పుడు ఆ ఇంట్లోయున్న ఇంకొక స్త్రీ ఇట్లు అన్నది: “చనిపోయేంత వరకు ఆమె ఆరాధించాలని నిర్ణయించిన దేవునికి ఆమె చూపిన యథార్థత మమ్ములను సంతోషపరచినది.”
నేను పఠించిన మరియొక స్త్రీ ఎప్పుడూ నవ్వేది కాదు. ఆమె ముఖము ఎప్పుడూ చింత మరియు దుఃఖమును ప్రతిబింబించేది. అయితే ఆమెకు యెహోవానుగూర్చి నేర్పించిన తరువాత ఆమెను ప్రార్థన చేయుటకు ప్రోత్సహించాను. ఎందుకనగా ఆయన మన సమస్యలను ఎరుగును. మరియు మనలనుగూర్చి చింతించును. తరువాత వారములో ఆమె ముఖము ప్రకాశవంతముగా కన్పించినది. ఆమె నవ్వడాన్ని నేను చూడడం అదే మొదటిసారి. అప్పుడు ఆమె “నేను యెహోవాకు ప్రార్థన చేయుచుంటిని, మరియు నాకిప్పుడు మనస్సులో హృదయంలో సమాధానముంది” అని వివరించింది. ఆమె తన జీవితమును యెహోవాకు సమర్పించుకొంది. మరియు ఎన్నో సమస్యలు వచ్చినప్పటికి విశ్వాసములో ఉంది.
బాధ్యతలను సమతూకముచేయుట
పోషించుటకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నందువలన, యెహోవాను పయినీరుగా పూర్తికాలము సేవించాలన్న నా ఆశ పూర్తికాదని నేను గుర్తించాను. అయితే బైబిలు సాహిత్యమును తమిళ భాషలో అనువాదము చేయుటకొరకు ఎవరో ఒకరి అవసరత ఏర్పడినప్పుడు ఒక సేవా మార్గము తెరువబడింది. యెహోవా సహాయముతో ఆపనిని చేయగలిగాను. అదే సమయము ఉద్యోగముచేస్తూ, పిల్లలను పరమార్శించి ఇంటిపని చేసికొని, అన్ని కూటములకు హాజరై క్షేత్రసేవలో పాల్గొనేదాన్ని. చివరకి పిల్లలు పెద్దవారైన తరువాత నేను ఒక స్పెషల్ పయినీరు అయ్యాను. ఆ ఆధిక్యతను గత 33 సంవత్సరములనుండి ఆనందిస్తున్నాను.
సుందర్ మరియు రత్న చిన్న వయస్సులో ఉన్నపుడే వారిలో యెహోవాకొరకు ప్రేమను మరియు జీవితములోని ప్రతి దశలోను ఆయన ఆసక్తులను మొదట ఉంచవలెనన్న ఆశను వారిలో నాటుటకు ప్రయత్నించితిని. వారు మేలుకొనినప్పుడు వారు మాట్లాడవలసిన వ్యక్తి యెహోవాయని పడుకొనకమునుపు ఆఖరిగా మాట్లాడవలసింది ఆయనతోనేయని వారు ఎరిగియుండిరి. బడిపని పూర్తిచేయుటకు క్రైస్తవ కూటములకు మరియు ఇంటింటి సేవకు తయారవటం మానివేయకూడదని కూడ వారికి తెలిసియుండెను. వారు తమ బడిపనిలో చేయగలిగినదంతా చేయమని నేను ప్రోత్సహించినను, వారు దాన్నే తమ జీవితములో అతిప్రాముఖ్యమైనదిగా భావిస్తారేమోయనే భయముతో వారు తరగతిలో మొదట రావలెనని వత్తిడిచేయలేదు.
వారు బాప్తిస్మము పొందిన తరువాత, బడి సెలవులలో పయినీరు పని చేసే వారు. నావలె సిగ్గు, మరియు భయపడకుండ, ధైర్యముగా ఉండవలెనని రత్నను నేను ప్రోత్సహించాను. తన ఉన్నత పాఠశాలను మరియు వర్తక తర్పీదును ముగించిన తరువాత ఆమె పయినీరు పనిచేయుట మొదలుపెట్టింది. తరువాత ఆమె స్పెషల్ పయినీరు అయ్యింది. అటుతరువాత ఆమె ఒక ప్రయాణకాపరిని, రిచర్డ్ గాబ్రియేలును వివాహముచేసుకుంది. ఆయన ఇప్పుడు భారతదేశపు వాచ్‌టవర్ సొసైటియొక్క బ్రాంచి కమిటి కోఆర్డినేటర్‌గా సేవచేయుచున్నాడు. వారు మరియు వారి కూతురు అబిగయేలు భారతదేశపు బ్రాంచిలో పూర్తికాల సేవ చేయుచున్నారు. మరియు వారి చిన్న కుమారుడు ఆండ్రు సువార్త ప్రచారకుడైయున్నాడు.
అయితే, 18 సంవత్సరముల వయస్సులో సుందర్ యెహోవాసాక్షులతో సాంగత్యమును మానివేసి నా హృదయాన్ని బద్దలు చేశాడు. ఆ తరువాత సంవత్సరములు నాకు ఎంతో దుఃఖకరమైనవైయుండెను. నేను సుందర్‌ను పెంచటంలో ఏవిధంగానైన క్షమించమని అతడు తిరిగి వచ్చునట్లు అతనికి బుద్ధిని దయచేయమని విడువక ప్రార్థించాను. కాని సమయము గడిచినకొలది నేను పూర్తిగా ఆశ విడిచాను. 13 సంవత్సరముల తర్వాత ఒక రోజు అతడు వచ్చి నాతో ఇట్లన్నాడు: “అమ్మా నీవేమి చింతించకు, నేను సరవుతానులే.”
అది అయిన వెంటనే ఆత్మీయ పరిపక్వత పొందుటకు విశేష ప్రయత్నము చేశాడు. యెహోవాసాక్షుల సంఘమును నిర్వహించు బాధ్యతలను అప్పగించబడునంతగా అతను అభివృద్ధిచెందాడు. తరువాత అతడు మంచి జీతమునిచ్చు ఉద్యోగమును విడిచి పయినీరు అయ్యాడు. ఇప్పుడు అతడు అతని భార్య ఎస్తేరు దక్షిణభారతదేశంలో బెంగుళూరులో కలిసి ఈ పనిచేస్తున్నారు.
జీవితమంతయు ఓదార్పు
గడిచిన సంవత్సరములలో నేను కష్టాలు మరియు బాధలు అనుభవించుటకు యెహోవా అనుమతించినందుకు నేను తరచుగా ఆయనకు వందనములు చెల్లిస్తాను. అటువంటి అనుభవములు లేనట్లయిన యెహోవా దేవుని మంచితనము, ఆయన కనికరము మరియు ఆయనయొక్క సున్నిత పరమార్శ మరియు అనురాగమును రుచిచూచు ఆధిక్యతను పొందలేక పోయేదాన్ని. (యాకోబు 5:11) బైబిలులో “తండ్రిలేని వారికి విధవరాండ్రకును” యెహోవా చూపు పరమార్శ మరియు చింతను గూర్చి చదువుట హృదయమును ఉప్పొంగచేయును. (ద్వితీయోపదేశకాండము 24:19-21) అయితే ఆయన యొక్క పరమార్శ మరియు చింతను వాస్తవముగా అనుభవించుట వలన కలుగు ఆనందము మరియు ఓదార్పు ఇంకా ఉత్తమమైనది.
నా “స్వబుద్ధిని ఆధారము చేసికొనక నా ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమును ఒప్పుకొనుటకు, మరియు యెహోవాయందు నమ్మకము మరియు నిరీక్షణ యుంచుటకు నేను నేర్చుకొన్నాను. (కీర్తన 43:5; సామెతలు 3:5, 6) ఒక యౌవన విధవరాలుగా ఆయన వాక్యమునుండి ఓదార్పు కొరకు దేవున్ని ప్రార్థించాను. ఇప్పుడు 69 సంవత్సరాల వయస్సులో బైబిలును అర్థము చేసికొని దాని సలహాలను అనుసరించుట ద్వారా కొలతవేయనంత ఓదార్పు పొందానని నేను చెప్పగలను. (w91 2/1)
[26వ పేజీలోని చిత్రం]
లిల్లీ ఆర్థర్ తన కుటుంబ సభ్యులతో