ఉపదేశములను మీరు అనుసరించెదరా?
ఒక ప్రేమగల తండ్రి తమ పిల్లలు జీవితములో విజయవంతులై పెద్దవారైనప్పుడు సంతోషముతో ఉండునట్లు వారికి బోధిస్తాడు. అలాగే తమ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించు పిల్లలు వారి ఉపదేశమును అంగీకరింతురు ఎందుకనగా అది వారి శ్రేయస్సు నిమిత్తమేయని వారికి తెలియును. అదే విధంగా మన ప్రేమగల పరలోకపు తండ్రియైన యెహోవా తన సేవకులు తమ జీవితములలో విజయవంతులై ఆనందము పొందునట్లు వారికి తగిన నడిపింపునిస్తున్నాడు. కావున దేవుడు తన వాక్యముద్వారా మరియు తన భూ సంస్థద్వారా ఇచ్చు ఉపదేశములను అనుసరించుట ప్రాముఖ్యము.
కుటుంబము లోపల
మనకు అనేక రంగములలో ఉపదేశములు ఇవ్వబడియున్నవి. అందులో ఒకటి కుటుంబ వలయము. దేవుడు మొదటి దంపతులకు వివాహముచేసి వారిని పిల్లలను కలిగియుండమని చెప్పినట్లు బైబిలు చెప్పుచున్నది. (ఆదికాండము 1:27, 28; 2:22-24) సృష్టికర్త కుటుంబములోయున్న సభ్యులందరికి వారివారి విధులనుగూర్చి ఉపదేశములనిచ్చాడు. ఉదాహరణకు, కుటుంబమంతటికి భర్త మరియు తండ్రి శిరస్సైయున్నాడు. అనగా ఆయన వారికి ఉపదేశము, ఆహారము, వస్త్రము, నివాసస్థలము, రక్షణ, క్రమశిక్షణ యిచ్చు బాధ్యతగలిగియున్నాడు. ఇంకను ఆయన ప్రాముఖ్యమైన కుటుంబ నిర్ణయములు చేయును. భర్తగా ఆయన తన భార్యయెడల శ్రద్ధచూపి ఆమె బలహీన ఘటమని ఆమెకు గౌరవమియ్యవలెను. (ఎఫెసీయులు 5:22, 23; 1 తిమోతి 5:8; 1 పేతురు 3:7) భార్యయైతే భర్తకు లోబడియుండి, ఆయనకు ప్రగాఢ గౌరవము చూపుతూ, సహాయకారిణిగా మరియు తగిన ఉపకారిగా ఉండవలెను. ఇంకను లేఖనములు తమ తల్లిదండ్రులకు పిల్లలు విధేయులైయుండవలెనని సూచించుచున్నవి.—ఆదికాండము 2:18; ఎఫెసీయులు 6:1-3; 1 పేతురు 3:1, 2.
ఈ ఉపదేశములను లక్ష్యపెట్టకపోయినట్లయిన ఏమి సంభవిస్తుంది? భర్తలు తమ భార్యలయెడల తగిన శ్రద్ధచూపకపోయినను, భార్యలు భర్తయొక్క శిరసత్వమునకు ఎక్కువ గౌరవము చూపకపోయినను ఒకరితోఒకరు పొందికలేని వారగుట, వివాదములు సంభవించును. వాస్తవమునకు అటువంటివి అనేక వివాహములు విడిపోవుటకు కారణమైనవి. పిల్లలయొక్క అవిధేయత మరియు తిరుగుబాటుతనము తమ తల్లిదండ్రులకు బహుదుఃఖమును కలుగజేసినవి. అయితే, పిల్లలను తగిన క్రమశిక్షణ ప్రకారము పెంచక, తద్వారా వారికి కోపము కలుగజేయుచున్నందుకై తరచు తల్లిదండ్రులు నిందింపబడవలసియున్నారు.—ఎఫెసీయులు 6:4.
సాంఘిక సేవాకర్తలు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు కుటుంబ సమస్యలపై వ్యవహరించవలసిన తీరుపై అనేక రకముల సలహాలనిచ్చినను, కుటుంబమునకు సృష్టికర్తయైనవాడు బైబిలులో దయచేసిన ఉపదేశములకంటె ఏ ఉపదేశము ప్రభావకరమైనది కాదు. వీటిని అనుసరించుట నిజమైన సంతోషము మరియు సంతృప్తికి నడుపును.—కీర్తన 19:7-9.
సంఘములో
క్రైస్తవ సంఘమునకు శిరస్సయిన యేసుక్రీస్తు “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునిద్వారా” అనగా భూమిమీదనున్న దేవుని సంస్థకు నియమించబడిన మార్గముద్వారా యిచ్చు ఉపదేశములను మనము అనుసరించవలెను. (మత్తయి 24:45-47; ఎఫెసీయులు 5:23) సంఘములో ఐక్యత మరియు సమాధానము ఉండుటకు ఇవ్వబడిన నడిపింపు ప్రకారము దాని సభ్యులంత పనిచేయవలెను. ఉదాహరణకు, సంఘములో బోధించుటయందు నాయకత్వమును తీసుకొని ఇతరులకు సహాయముచేయువారు యెహోవా సంస్థనుండి వారు పొందు నడిపింపులన్నిటిని హత్తుకొనియుండవలసిన అవసరమున్నది. ఇది వారి పని ఫలవంతముగా జరుగుటకు దోహదపడును. ఈ ఉపదేశములలో ప్రకటన పనిలో ఎట్లు పాల్గొనవలెననునది, సంఘములోని సమస్యలతో వ్యవహరించు విధానము, ప్రోత్సాహము, హెచ్చరిక ఇవ్వవలసిన విధానము, బాధనొందువారికి ఓదార్పునివ్వవలసి విధానము మొదలగునవి ఉండును. ఇంకను క్రైస్తవ సంఘముతో సహవసించువారందరికొరకు నిర్మాణాత్మకమైన మరియు బోధనాత్మకమైన కూటములను ఎలా సిద్ధపరచవలెనను దానినిగూర్చి సూచనలు కూడ ఉండును.—అపొస్తలులకార్యములు 20:20; రోమీయులు 12:6-8; గలతీయులు 6:1; 1 థెస్సలొనీకయులు 3:1-3.
ఈ విషయములో సంఘ పెద్దలు, లేక విచారణకర్తలు ప్రత్యేకముగా మంచి మాదిరిని చూపవలెను. పెద్దలు నమ్మకముగాను మరియు జాగ్రత్తగాను అనుసరించవలసిన ఉపదేశములను పరిపాలక సభ పంపుచుండును. వీరు వాటిని చేపట్టి స్థానిక పరిస్థితులకు అన్వయింపజేయవలెను. క్రైస్తవ సంఘమును నడిపించునది యేసుక్రీస్తు అని మనము మనస్సునందుంచుకొనవలెను. ఆయన ప్రపంచవ్యాప్తముగానున్న సంఘములన్నిటియొక్క అవసరతలను పరిపూర్ణముగా గ్రహించి వాటికి కావలసిన ప్రోత్సాహమును మరియు సహాయమును ఇచ్చును. కావున పెద్దలు దేవుని దైవపరిపాలనా సంస్థనుండి వారు పొందు ఏ నడిపింపు మార్గములనైనను అన్వయింపజేయుటకు వెనుకాడకూడదు. ఇది ప్రతి సంఘములోని వారి కందరికి మంచి మాదిరినుంచి తమలోతాము ఐక్యమగుటకును భూమియంతటనున్న ఇతర క్రైస్తవ సహోదరత్వముతోను ఐక్యమగుటకు వారికి సహాయపడును.—అపొస్తలులకార్యములు 15:1-31; హెబ్రీయులు 13:7; ప్రకటన 5:6.
ఆనందకరమైన ఫలితములు
ఒక నిర్మాణకుడు పెద్ద భవనమును నిర్మించునప్పుడు, ఆ భవనము దీర్ఘకాలము నిలుచునట్లు శిల్పకారుని ఆలోచనలను జాగ్రత్తగా అనుసరించును. జలప్రళయమునకు ముందటి బలత్కారముతోనిండిన దినములలో నోవహుకు ఓడను నిర్మించు పని అప్పగింపబడెను. ఆయన దానిని ఎలా నిర్మించవలెనో, ఏ మానవులను మరియు జంతువులను జలప్రళయమునుండి రక్షింపబడునట్లు దానిలోకి తీసుకురావలెనో చెప్పబడింది. దానికి నోవహు ఎలా ప్రత్త్యుత్తరమిచ్చాడు? బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది: “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.” (ఆదికాండము 6:5, 13-22; 7:23) ఈనాడు, నోవహు దినములకు సరిగ్గాపోలియున్న దినములలోనే మనము జీవిస్తున్నాము. ఈ కారణమునుబట్టి దుష్టులైన ప్రజలందరిని దేవుడు తుడిచివేయును. మనము రక్షింపబడువారిలో ఉండాలంటే మనము ఏ చర్యలు తీసుకొనవలెనో బైబిలు మనకు చెప్పుచున్నది.—మత్తయి 24:37-39; 2 పేతురు 3:5-7, 11.
కావున యెహోవా వ్రాయబడిన తన వాక్యముద్వారాను, మరియు తన భూసంస్థద్వారాను ఇచ్చు ఉపదేశములను మెప్పుదలతో స్వీకరించి ఆచరణలో పెట్టుదము. ఇది విజయమును ఆనందమును కలుగజేసి, మన జీవితములను కూడ రక్షించును. (w90 10/1)