విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగియుండుము
మొదటి తిమోతి నుండి ఉన్నతాంశములు
దాదాపు సా.శ. 56 నందు అపొస్తలుడైన పౌలు వారి మధ్య నుండియే “తమ వంకర మాటలతో శిష్యులను ఈడ్చుకొనిపోవు క్రూరమైన తోడేళ్లు” బయలుదేరునని ఎఫెసు సంఘములోని పెద్దలను హెచ్చరించెను. (అపొస్తలుల కార్యములు 20:29, 30) అయితే కొద్ది సంవత్సరములలోనే మత భ్రష్టత్వపు బోధ తీవ్రస్థితికి చేరినది. అందువలన సంఘ పవిత్రతను కాపాడి తోటివిశ్వాసులు విశ్వాసమందు నిలిచియుండునట్లు ప్రోత్సహించుటకై ఆత్మీయ యుద్ధము చేయవలెనని తిమోతిని పౌలు బలముగా కోరెను. అదియే దాదాపు సా.శ. 61-64 మధ్య మాసిదోనియనుండి పౌలు తిమోతికి తన మొదటి పత్రికను వ్రాయుటకు ఒక ముఖ్యకారణము.
పెద్దయొక్క విధులు, దేవునిచే స్త్రీలకు నియమించబడిన స్థానము, పెద్దలు మరియు పరిచారకులయొక్క అర్హతలు మరియు ఇతర విషయములను గూర్చి తిమోతి ఉపదేశించబడెను. అట్టి ఉపదేశము ఈనాడును ప్రయోజనకరమైయున్నది.
విశ్వాసమునకు సంబంధించిన హెచ్చరిక
విశ్వాసము మరియు మంచి మనస్సాక్షిని చేపట్టియుండుటకు సంబంధముగా పౌలు తన ఉపదేశమును ప్రారంభించెను.(1 తిమోతి 1:1-20) తిమోతిని ఎఫెసులో నిలిచియుండి భిన్నమైన బోధను బోధించకుండునట్లు కొందరిని ఆజ్ఞాపించుమని ఆయన ప్రోత్సహించెను. తాను యేసు అనుచరులను హింసించినప్పుడు తెలియక అవిశ్వాసము వలన ప్రవర్తించియుంటినని ఒప్పుకొనుచు పౌలు తన కప్పగింపబడిన పరిచర్యయెడల కృతజ్ఞతను కలిగియున్నాడు. “విశ్వాసము విషయమై ఓడబద్దలై పోయినవారివలె కాక,” “విశ్వాసము మంచి మనస్సాక్షిని కలిగియుండి” ఆత్మీయ యుద్ధమందు పోరాడుచు వెళ్లవలెనని తిమోతికి ఆయన తెలియజేసెను.
ఆరాధనపై హెచ్చరిక
అటుతరువాత, “విశ్వాస సత్యవిషయములలో అన్యజనులకు బోధకునిగా” నియమింపబడినవానివలె పౌలు ఉపదేశమిచ్చెను. (2:1-15) క్రైస్తవులు నెమ్మది కలిగి బ్రతుకు నిమిత్తము అధికారులకొరకు ప్రార్థనలు చేయబడవలసియున్నవి. మనుష్యులందరు రక్షణపొందుట దేవుని చిత్తము. ఇందు ప్రాముఖ్యమైన బోధ ఏమనగా “క్రీస్తు అందరికొరకు తన్నుతానే విమోచన క్రయధనముగా సమర్పించుకొనుట.” స్త్రీ తనమట్టుకు తాను అణకువను ధరించుకొనినదైయుండి, పురుషుని మీద అధికారము చేయకూడదని పౌలు చూపెను.
సంఘము చక్కగా వ్యవస్థీకరించబడినదై ఉండవలెను. (3:1-16) అందుచేత అధ్యక్షులు (ఓవర్సీర్స్) మరియు పరిచారక సేవకులు కలిగియుండవలసిన అర్హతలను పౌలు పొందుపరచెను. అపొస్తలుడు వ్రాసిన విషయములద్వారా “సత్యమునకు స్తంభమును ఆధారమునై” యున్న సంఘములో తనమట్టుకుతాను ఎట్లు ప్రవర్తించవలెనో తిమోతి తెలుసుకొనును.
అబద్ధబోధనుండి తన్నుతాను కాపాడుకొనుటకు తిమోతికి పౌలు వ్యక్తిగత ఉపదేశమిచ్చెను. (4:1-16) తరువాతి కాలములలో కొందరు విశ్వాసమునుండి తొలగిపోవుదురు. అయితే తన్నుగూర్చియు, తన బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుటద్వారా తిమోతి ‘తనను మరియు తన బోధవినువారిని రక్షించుకొనును.’
తిమోతి ఇతరులతో వ్యవహరించు విధానమందును అనగా యౌవనులతోను మరియు వృద్ధులతోను వ్యవహరించు విధమందును హెచ్చరికను పొందెను. (5:1-25) ఉదాహరణకు మంచిపేరు పొందియున్న వృద్ధులైన విధవరాండ్రకు తగిన ఏర్పాటులు చేయబడవలసియున్నవి. యౌవనులైన విధవరాండ్రు వ్యర్థమైన ముచ్చట్లలో నిమగ్నమైయుండుటకంటె వివాహము చేసికొని పిల్లలను కనవలెను. శ్రేష్టమైన రీతిలో అధ్యక్షత వహించు పెద్దలు రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా యెంచబడవలెను.
సంతుష్టి సహితమైన దైవభక్తి
దైవభక్తిని గూర్చిన ఉపదేశముతో పౌలు పత్రికను ముగించెను. (6:1-21) “సంతుష్టి సహితమైన దైవభక్తి” గొప్ప లాభసాధనమైయున్నది గాని ధనవంతులగుటకు నిశ్చయించుకొనుట నాశనమునకు నష్టమునకు దారితీయును. పౌలు తిమోతిని విశ్వాససంబంధమైన మంచి పోరాటమును పోరాడి ‘నిత్యజీవమును గట్టిగా పట్టుకొనవలెనని’ బలవంతపెట్టెను. ధనవంతులైన వారు ఆ వాస్తవమైన జీవమును పొందుటకు “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక. . .దేవుని యందు నమ్మిక యుంచవలెను”. (w91 1/15)
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
శిశు ప్రసూతి ద్వారా రక్షించబడుట: “అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండినయెడల శిశు ప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును” అని చెప్పినపుడు పౌలు నిత్యజీవమునకు నడుపు రక్షణను గూర్చి చర్చించుటలేదు. కాని ఆయన, దైవసంబంధమైన స్త్రీయొక్క యుక్తమైన పాత్రను గూర్చి మాటలాడుచున్నాడు. (1 తిమోతి 2:11-15) శిశుప్రసూతి, పిల్లలనుగూర్చి శ్రద్ధతీసుకొనుట, గృహసంబంధమగు కార్యనిర్వహణయనునవి పరులజోలికి పోవుచు, వ్యర్థమైన ముచ్చటలాడుట నుండి ఒక స్త్రీని “రక్షించును.” (1 తిమోతి 5:11-15) ఆమె గృహసంబంధమగు పనులు తనయొక్క యెహోవా సేవను ఆ కోణమందలి కొరతను సంపూర్ణము చేయునదైయుండును. అవును క్రైస్తవులందరు తమ ప్రవర్తనను జాగ్రత్తపరచుకొని, తమ సమయమును జ్ఞానయుక్తముగా ఉపయోగించుకొనవలెను.—ఎఫెసీయులు 5:15, 16.