రాజ్యప్రచారకుల నివేదిక
యెహోవా తన నమ్మకమైన సేవకులను పోషించును
“దాసుడు తన యజమానికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకముచేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు,” అని యేసు చెప్పెను. (యోహాను 15:20) అయితే యెహోవా యొక్క నమ్మకమైన సేవకులు ఆయన వారిని పోషిస్తాడను అభయమును ఇవ్వబడియున్నారు. (కీర్తన 18:2; నహూము 1:7) ఒక ఆఫ్రికా దేశములో ప్రశాంతముగా జరుగుచున్న యెహోవాసాక్షుల పని తీవ్రముగా అడ్డగించబడి దెబ్బలు, నిర్బంధములు ఎదురవుతున్న పరిస్థితిలో, యెహోవా తన సేవకులను పోషించినట్లు క్రింది నివేదిక తెలుపుచున్నది:
ఈ నివేదిక తెల్పు ప్రకారము: “ఒక ప్రాంతీయకాపరి మరియు నలుగురు స్థానిక సహోదరులు ఏ హేతువు చూపబడకుండ నిర్బంధించబడి, సాధారణంగా విచ్ఛలవిడిగా తిరుగు కుక్కలను పెట్టి ఉంచే ఒక చిన్న గదిలో ఉంచబడ్డారు.” ఆ విధముగా “వారు, కేవలము లోపల ధరించు అంగవస్త్రములతో 123 దినములు అచ్చట ఉంచబడి, చివరకు మరుగుదొడ్డికి కూడా బయటకు వెళ్లటానికి అనుమతించబడలేదు.” ఈ అమానుష పరిస్థితులను ఒక పార్లమెంటు సభ్యుడు విని ఈ విషయములను వ్యతిరేగించగా చివరకు 123 దినముల తర్వాత ఆ సహోదరులు విడిపించబడిరి. ఈ నమ్మకమైన సేవకులను యెహోవా తన ఆత్మద్వారా పోషించెను.
ఇదే దేశమునుండి వచ్చిన మరొక అనుభవము మన ప్రకటన పనియొక్క ప్రయోజనాత్మక ప్రభావములను చూపుచున్నది. ఆ నివేదిక తెల్పునదేమనగా: “ఒక గ్రామములోని ప్రజలు దౌర్జన్యము మరియు తిరుగుబాటుకు పేరుగాంచియుండిరి. ఏమైనను యెహోవాసాక్షులు ప్రకటించిన తరువాత అచ్చటి అనేకులు స్థానిక అధికారులను గౌరవించటం మొదలుపెట్టి, వారములో సామాజికంగా కలసిచేయు రహదారి పనిలో భాగము వహించిరి.” ఒక స్థానిక అధికారి ఈ ప్రజల దృక్పథములోని మార్పుకు కారణమును తెలుసుకొనగోరినప్పుడు “ఇది యెహోవాసాక్షుల ‘పాస్టరు’ బోధ వలన కలిగిన ఫలితము” అని ఆయనకు చెప్పబడింది. ఆ సాక్షి ఇలా చెప్పుచున్నాడు: “ఒక రోజు ఈ అధికారి నన్ను తన ఇంటికి ఆహ్వానించి ఈ మంచి పనిని చేయుటలో కొనసాగమని ప్రోత్సహించాడు. అంతేగాక నాకుటుంబముతో కలసి తినుటకై ఒక పెద్ద కోడిని బహుమతిగా ఇచ్చాడు.” ఇంకొక సందర్భములో స్థానిక మేయరు సహోదరుని దర్శించుటకు వచ్చినపుడు సహోదరుడు ఆయనను లోపలికి ఆహ్వానించి ఆయనకు సాక్ష్యమిచ్చెను. ఆ మేయరు కొన్ని పత్రికలను అడిగి తీసుకొని, ఇలా అన్నాడు “మీరేదైన హాని చేస్తారని నేననుకొనుటలేదు. ఏమైన కావలసివస్తే అడుగుతుండండి. మిమ్ములను నిర్బంధించుటకు మాకేమియు ఉత్తర్వులు లేవు. ప్రభుత్వము బహుశ త్వరలోనే మీసమస్యలను పరిశీలిస్తుందనుకుంటున్నాను.”
ఒక స్పెషల్ పయినీరు ఇలా వ్రాస్తున్నాడు: “ఒక రాజకీయ పార్టి సెక్రెటరీ కొన్ని ఆరోపణలను చేసినప్పుడు నిర్బంధించి, పశువుల మూత్రము, పేడతో నిండిన ఒక గదిలో నన్ను ఉంచవలెనని స్థానిక ముఖ్యాధికారి ఆజ్ఞాపించాడు. ఆ చీకటిలో 5 రోజులు ఉంచబడ్డాను. దానిలోనికి వెళ్లునపుడు త్రోవలో యెహోవాకు ప్రార్థన చేసుకొని కీర్తన 50:15 ను జ్ఞాపకమునకు తెచ్చుకున్నాను. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది నామీద జాలిచూపి నేను కొంత మంచిగాలిని పీల్చుకొనునట్లు తలుపులు పూర్తిగా మూసివేయలేదు. 5 దినములు ఈ జైలులో ఉన్న తరువాత నన్ను పరీక్షచేయుటకై ఏవిధమైన భద్రతా సిబ్బంది వెంటలేకుండా ఒక మేకను తీసుకెళ్లి స్థానిక ముఖ్యాధికారికి ఇవ్వమని పంపారు. ఆ సమయమందు నేను పారిపోలేదు. అందుచేత ప్రతిరోజు సాయంకాలము 3.00 నుండి 7.00 గంటల వరకు నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను సహోదరులను కలుసుకొని, అందరము కలిసి ప్రకటించగలిగితిమి. ఈ కష్టసమయములో నేను వ్యాధిగ్రస్థుడనైనను, నా శత్రువులు నేను చనిపోవుదునని ఎదురుచూసినను యెహోవా నన్ను విడిచిపెట్టలేదు. ఈ అనుభవము నన్ను యెహోవాకు దగ్గరగునట్లు చేసింది. హింస ఎప్పటికిని నన్ను యెహోవా ప్రజలనుండి వేరు చేయలేదని నిశ్చయత కలిగియున్నాను.”—రోమీయులు 8:35-39 తో పోల్చుము.
కష్టకాలములందు దేవుడు తమ్మును ఎట్లు పోషిస్తాడో యెహోవాసాక్షులు గుణగ్రహిస్తారు. తాము అత్యంత ప్రాముఖ్యమైన ఈ ప్రాణమును రక్షించు పనిని కొనసాగించుచుండగా తమయెడల దయచూపువారిని కూడా వారు మెచ్చుకుంటారు. యెహోవా అటువంటి దయను ఎన్నటికిని మరువడు.—మత్తయి 25:40. (w89 3/1)