“మేలుచేయుటలో విసుకవద్దు”
రెండవ థెస్సలొనీకయుల నుండి ఉన్నతాంశములు
మాసిదోనియ పట్టణమైన థెస్సలొనీకలోని క్రైస్తవులయెడల అపొస్తలుడైన పౌలుకుగల శ్రద్ధ ఆయన సా.శ. 51లో వారికి తన రెండవ పత్రికను వ్రాయునట్లు కదిలించెను. సంఘమందలి కొందరు తప్పుగా యేసుక్రీస్తు ప్రత్యక్షత వెంటనే రానైయున్నదని చెప్పుచుండిరి. పౌలు వ్రాసియున్నాడని తప్పుగా చెప్పబడిన పత్రిక ఒకటి “యెహోవా దినము” అప్పుడే వచ్చియున్నట్లుగా సూచించినదని భావము చెప్పబడి యుండవచ్చును.—2 థెస్సలొనీకయులు 2:1, 2.
కాబట్టి థెస్సలొనీకయులలోని కొందరి తలంపులు సవరింపబడవలసి యుండెను. తన రెండవ పత్రికలో పౌలు, వారి వృద్ధియగుచున్న విశ్వాసము, పెరుగుచున్న ప్రేమ, నమ్మకముగా సహించుటనుబట్టి మెచ్చుకొనెను. అయితే యేసు ప్రత్యక్షమగుటకు ముందు మతభ్రష్టత్వము వచ్చుననికూడ ఆయన చూపించెను. అందువలన కష్టకాలములు ముందుండెను, కాగా అపొస్తలుని లేఖ, “మేలుచేయుటలో విసుకవద్దు” అను ఉపదేశమును లక్ష్యపెట్టుటకు వారికి సహాయము చేయును. (2 థెస్సలొనీకయులు 3:13) అదేవిధముగా పౌలు మాటలు మనకును సహాయము చేయగలవు.
క్రీస్తు బయల్పరచబడుట మరియు ప్రత్యక్షత
పౌలు మొదట శ్రమనుండి విశ్రాంతి కలుగుటనుగూర్చి మాట్లాడెను. (1:1-12) యిది “ప్రభువైన యేసు తన ప్రభావము కనుపరచు దూతలతోకూడ . . . ప్రత్యక్షమైనప్పుడు” వచ్చును. అప్పుడు సువార్తకు లోబడనొల్లనివారిమీదకు నిత్యనాశనము తీసుకురాబడును. మనము హింసకుల చేతులలో శ్రమనొందునప్పుడు దీనిని గుర్తుతెచ్చుకొనుట ఓదార్పుకరముగా ఉండును.
తర్వాత, పౌలు క్రీస్తు ప్రత్యక్షతకు ముందు “ధర్మ విరోధి” బయల్పరచబడునని సూచించెను. (2:1-17) “యెహోవా దినము” అప్పటికే వారిమీదికి వచ్చియున్నదని చెప్పు ఎటువంటి మాటవలనైనను థెస్సలొనీకయులు ఉద్రేకపడకుండవలెను. మొదట, మతభ్రష్టత్వము సంభవించి ఆ పిమ్మట ధర్మవిరోధి బయల్పరచబడును. దానితర్వాత, యేసు తన ప్రత్యక్షత కనుపరచబడు కాలమున వానిని బొత్తిగా లేకుండ చేయును. అదేసమయమున, దేవుడు మరియు క్రీస్తు థెస్సలొనీకయుల హృదయములకు ఓదార్పునిచ్చి, “ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపరచవలెనని” ప్రార్థించెను.
అక్రమముగా నడుచువారితో వ్యవహరించుట
పౌలు యింకను చెప్పిన మాటలలో అక్రమముగా నడుచుకొను వ్యక్తులతో వ్యవహరించుట విషయమై ఉపదేశములు కలవు. (3:1-18) థెస్సలొనీకయులను ప్రభువు బలపరచి దుష్టుడగు అపవాదియైన సాతానునుండి కాపాడునను నమ్మకమును ఆయన వ్యక్తపరచెను. అయితే వారి స్వంత ఆత్మీయ ప్రయోజనము కొరకు వారు చర్యలు గైకొనవలెను. వారు అక్రమముగా నడుచుకొనువారినుండి, తమకు సంబంధించని విషయములలో తలదూర్చువారినుండి, పనిచేయుటకు నిరాకరించువారినుండి తప్పుకొనవలెను. “ఎవడైనను పనిచేయనెల్లని యెడల, వాడు భోజనము చేయకూడదని” పౌలు చెప్పెను. సహోదరులుగా భావించి బుద్ధి చెప్పవలసినను, అలాంటివారిని గుర్తుపెట్టుకొని వారితో సాంగత్యము చేయకూడదు. నమ్మకమైన థెస్సలొనీక క్రైస్తవులు మేలు చేయుటలో విసుగక యుండవలెను, మరియు పౌలు ప్రభువైన యేసుక్రీస్తు కృప వారికందరికి తోడైయుండవలెనని కోరుకొనెను.
క్రీస్తు తన దూతలతో వచ్చి సువార్తకు లోబడనివారికి ప్రత్యపకారము చేసినప్పుడు, తమకు శ్రమనుండి విశ్రాంతి లభించునని పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక యెహోవా సాక్షులకు అభయమిచ్చుచున్నది. “ధర్మ విరోధి” (క్రీస్తుమత సామ్రాజ్య మతనాయకుల తరగతి) మరియు సమస్త అబద్ధమతము త్వరలోనే లేకుండ చేయబడునని తెలుసుకొనుటకూడ విశ్వాసమును బలపరచునదై యున్నది. అదేసమయములో, మేలు చేయుటలో విసుకవద్దు అని పౌలు చెప్పిన ఉపదేశమును మనము లక్ష్యపెట్టుదుము గాక. (w91 1/15)
[32వ పేజీలోని బాక్సు/చిత్రం]
యెహోవా వాక్యము శీఘ్రముగా వ్యాపించుచున్నది: “మీలో జరుగుచున్న ప్రకారము యెహోవా వాక్యము శీఘ్రముగా వ్యాపించి [లేక, “పరుగెత్తి”] మహిమ పరచబడు నిమిత్తము . . . మాకొరకు ప్రార్థించుడి” అని పౌలు వ్రాసెను. (2 థెస్సలొనీకయులు 3:1; కింగ్‌డం ఇంటర్లీనియర్) పందెమందు వేగముగా కదిలి పరుగెత్తువారిని అపొస్తలుడు ప్రస్తావించెనని కొందరు విద్వాంసులు సూచించిరి. అది ఖచ్ఛితము కాకపోయినను, తను తన తోటిపనివారు ఎలాంటి అడ్డంకు లేకుండ సత్యవాక్యమును అత్యవసరముగా ప్రకటింపగలందులకు పౌలు థెస్సలొనీక క్రైస్తవులు తమకొరకు ప్రార్థించవలెనని వేడుకొనెను. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చుచున్నందుననే, ఈ అంత్యదినములలో అత్యవసరముగా సువార్త ప్రకటింపబడుచుండగా ఆయన వాక్యము “శీఘ్రముగా వ్యాపించుచున్నది.” దానిని అంగీకరించిన థెస్సలొనీకయుల మధ్య జరిగినట్లుగానే, విశ్వాసులు దానిని “రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియని” గొప్పగా ఎంచుటద్వారా కూడ యెహోవా వాక్యము “మహిమ పరచబడుచున్నది.” (రోమీయులు 1:16; 1 థెస్సలొనీకయులు 2:13) దేవుడు రాజ్య ప్రచారకులను ఆశీర్వదించుచున్నందుకు మరియు తన ఆరాధికులను వేగముగా వృద్ధిచేయుచున్నందుకు మనమెంతగా సంతోషించుచున్నాము!—యెషయా 60:22.