కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 10/1 పేజీలు 23-28
  • మీ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ లోకము ఎంత వ్యాధిగ్రస్తమైనది?
  • ఈ వ్యాధిగ్రస్త లోకములోని ఆత్మీయ ప్రమాదములు
  • ఆత్మీయ రోగమునకు బయటి మూలములు
  • విశ్వాసమందు ఆరోగ్యముగా ఉండుట
  • ఆత్మీయ ఆరోగ్యము నిత్యజీవమునకు నడుపును
  • యెహోవా చేత పరిశీలించబడుట—ఎందుకు ప్రయోజనకరమైనది?
    మన రాజ్య పరిచర్య—1995
  • ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • అందరికీ మంచి ఆరోగ్యం—త్వరలోనే!
    తేజరిల్లు!—2001
  • అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం
    తేజరిల్లు!—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 10/1 పేజీలు 23-28

మీ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుము

“క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము”—2 తిమోతి 1:13.

1. మంచి భౌతిక ఆరోగ్యము ఎందుకు కాపాడుకొనవలసిన ఒక విలువగల భాగ్యమైయున్నది?

మంచి భౌతిక ఆరోగ్యము ఎంతో ప్రశస్తమైన ఒక భాగ్యము. మంచి ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనము అనేక విషయములను చేయగలిగి జీవితమును ఎక్కువగా అనుభవించగలము. కాని మనము దీర్ఘంగా వ్యాధిగ్రస్తులమై లేక అంగవైకల్యముతోనున్న యెడల జీవితమెంతో కష్టదాయకమగును. అయితే, మంచి ఆరోగ్యము కాపాడుకొనవలసినదైయున్నది. అనేకులు తమ ఆరోగ్యమును నిర్లక్ష్యము చేయుట లేక వ్యాధి కలుగజేసే పనులను చేయుట జరుగుతుంది. ఎవరైతే తమపై శ్రద్ధవహిస్తారో అట్టివారు చాలావరకు తమ జీవితకాలమంతయు కొంత మంచి ఆరోగ్యమును, బలమును కలిగియుందురు.

2. (ఎ) భౌతిక ఆరోగ్యముకంటె ఆత్మీయ ఆరోగ్యము ఎందుకు ఎక్కువ విలువైనది? (బి) విశ్వాసమందు ఆరోగ్యముగా ఉండుటకు ఏమి అవసరము?

2 ఆత్మీయ ఆరోగ్యము భౌతిక ఆరోగ్యముకంటె ఎంతో ప్రాముఖ్యమైనది. మంచి భౌతిక ఆరోగ్యము దేవుని వరమైన నిత్యజీవమును సంపాదించలేదు. కాని, ఖచ్చితమైన జ్ఞానముపై ఆధారపడిన విశ్వాసము నుండియు స్వచ్ఛమైన ఆరాధన నుండియు లభించు మంచి ఆత్మీయ ఆరోగ్యము అట్లు చేయగలదు. (యోహాను 17:3; హెబ్రీయులు 11:6; యాకోబు 1:27) అందుకే అపొస్తలుడైన పౌలు ఇట్లనెను: “ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలెను,” (తీతు 2:2) విశ్వాసమందు ఆరోగ్యముగా ఉండదలచినవారు శ్రద్ధతో కృషిచేస్తూ, ఎడతెగని మెలుకువను కలిగియుండవలెను. ఏలయనగా మంచి ఆత్మీయ ఆరోగ్యమును పాడుచేయునవి మనలోనుండి లేక బయటనుండి రావచ్చును. వ్యాధిగ్రస్తమైన ఈలోకములో మన విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనవలెనన్న ఈ అపాయములను మనము ఎరిగియుండవలెను.

ఈ లోకము ఎంత వ్యాధిగ్రస్తమైనది?

3, 4. ఈ లోకములో మరియు ప్రజల క్రియలలో నైతిక వ్యాధి ఎట్లు ప్రతిబింబించుచున్నది?

3 ప్రస్తుత లోకము నైతికముగా ఎంతో వ్యాధిగ్రస్తమైయున్నదనుటలో ఏసందేహములేదు. ఈ లోకపు ప్రతి “అవయవములలో” మరణకరమైన వ్యాధిని మనము చూచుచున్నాము. దాని మతములలో, రాజకీయ విధానములలో, వ్యాపారసంస్థలలో, వినోదములో అది ఉన్నది. అనేకులకు దేవునియెడల మరియు మానవజాతి సంక్షేమముకొరకు ఆయనిచ్చిన చట్టములయెడల గౌరవములేదు. చరిత్రచూపునట్లు నైతిక కుళ్లు వివిధరీతులలో భౌతిక వ్యాధులను పెంచుతూ, కష్టములకు దారితీయుచున్నది. చులకన భావముతో వ్యాధిగ్రస్తమైన ఈ నైతికస్థితిని బాగుచేయుటకు ఎక్కువమంది యిష్టపడరు, ఎందుకనగా దానిని కలుగజేయువాటినే వారు ప్రేమించుచున్నారు.

4 ఈ లోకము ఎంత వ్యాధిగ్రస్తముగా యున్నది! క్షణికమైన ఉల్లాసమును పొందుటకు లేక వాస్తవములనుండి తప్పించుకొనుటకు మత్తుపానీయములు మత్తుమందులను అలవరచుకొని తమజీవితములను నాశనము చేసికొనియున్నారు. ప్రతిచోటా బలత్కారము నిండినది, జీవితము చౌకగా తయారైనది. జైల్లు నేరస్థులతో నిండిపోయినవి. అనేక దేశములలో సగమునకుపైగా వివాహములు విడాకులద్వారా అంతమవుచున్నవి. పిల్లలు తల్లిదండ్రుల నడిపింపును కోల్పోవుచు, నేరస్తులుగా పెరుగుచున్నారు. లైంగిక అవినీతి విచ్ఛలవిడిగా ఉన్నందున ఎయిడ్స్‌ లేక ఇతర లైంగిక సంబంధమైన వ్యాధులు వేగముగా పెరుగుచున్నవి.

5. పురాతన యూదాలోని పరిస్థితిలను యెషయా ఎట్లు వర్ణించుచున్నాడు?

5 తిరుగుబాటుచేసిన యూదా జనాంగముతో చెప్పునట్లు యెషయాను ప్రేరేపించిన మాటలనే ఈనాటి వ్యాధిగ్రస్త లోకముతో దేవుడు చెప్పుచున్నాడు. అవేమనగా: “పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు”.—యెషయా 1:4-6.

6. పురాతన యూదాలోను మరియు మనదినములలోను మేలు చేయ నేర్చుకొనుడి అను యెహోవా విన్నపమునకు ఏ ప్రతిస్పందనయున్నది?

6 పశ్చాత్తాపము నొంది “మేలు చేయ నేర్చుకొనుడి” అను యెహోవా విన్నపమును సామాన్యముగా యూదాలో ఎవరు లక్ష్యపెట్టలేదు. చివరకు అది యెరూషలేము నాశనమునకు నడిపినది. యూదులు బబులోనుకు చెరగా కొనిపోబడిరి. ఆ వ్యాధిగ్రస్తమైన జనాంగములోనుండి కేవలము కొద్దిమంది నమ్మకస్థులైన వారు దీవించబడి, కాపాడబడ్డారు. అలాగే నేడును, తలనుండి పాదము వరకు వ్యాధిగ్రస్తమైయున్న లోకములో కేవలము కొద్దిమంది మాత్రమే మేలుచేయ నేర్చుకొనుచున్నారు. నమ్మకస్థులైన ఇట్టి యెహోవా సేవకులు తమ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుటకు శ్రద్ధగా కృషిచేయుచు, వాగ్ధానముచేయబడిన నూతనలోకములో పరిపూర్ణమైన భౌతిక ఆరోగ్యమును మరియు నిత్యజీవమును పొందు నిరీక్షణను కలిగియున్నారు.—2 పేతురు 3:13; ప్రకటన 21:1-4.

ఈ వ్యాధిగ్రస్త లోకములోని ఆత్మీయ ప్రమాదములు

7. (ఎ) ఏ ప్రమాదములు మన విశ్వాసమునకు ఆత్మీయ ఆరోగ్యమునకు హానికలిగించును? (బి) ఆత్మీయ ఆరోగ్యమును ప్రమాదములో పడవేయగల మూడు శక్తులను ఎదిరించుటనుగూర్చి లేఖనములు ఏమిచెప్పుచున్నవి?

7 ఈ లోకపు నైతిక వ్యాధి సులభముగా ఇతరులకు సోకునదైయున్నందున విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుట ఒక సవాలైయున్నది. అంతేగాక క్రైస్తవులు తాము స్వతంత్రించుకొనియున్న అసంపూర్ణతతోను పోరాడవలెను. (రోమీయులు 7:21-25) దానితోపాటు “ఈ లోకాధికారియైన” సాతాను శరీరబలహీనతను ఎరిగి, శోధించుటలో నేర్పరియైయున్నాడు. (యోహాను 14:30; 1 యోహాను 5:19) కావున విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును పాడుచేయగల ముఖ్యమైన ఈ మూడు ప్రమాదములు అనగా—శరీరము, లోకము, అపవాది ఎంతో బలమైనవి. అయితే మనము లోకములో జీవిస్తున్నను “లోకసంబంధులము” కాకుండ ఉండు సాధ్యత కలదు. ‘మనము దేవుని ఆత్మద్వారా నడచుకొనుచు శరీరేచ్ఛను నెరవేర్చకుండ’ ఉండవచ్చును. దైవిక సహాయముతో “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిగలవారమగుదుము.” (యోహాను 17:15, 16; గలతీయులు 5:16; ఎఫెసీయులు 6:11; 2 కొరింథీయులు 2:11) అయితే మన విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును ప్రమాదములోకి నడుపగల ఈ మూడు ముఖ్య శక్తులను ఇప్పుడు పరిశీలించుదము.

8. ఆత్మీయ ఆరోగ్యమునకు వ్యతిరేకముగా పనిచేయునట్టి మనలోపలి శక్తులను యేసు ఎట్లు వివరించియున్నాడు?

8 మన అసంపూర్ణ మానవనైజములోనే పాపమునకు నడుపగల మరియు ఆత్మీయముగా మనలను వ్యాధిగ్రస్తులనుగా చేయగల శక్తులున్నవి. (యాకోబు 1:14, 15) ప్రత్యేకముగా సూచనార్ధక హృదయములోనే ఇది వాస్తవమైయున్నది. యేసు ఇట్లనెను: “లోపటనుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియు లోపటనుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచును.”—మార్కు 7:21-23.

9. (ఎ) ఏ కోరికలు సూచనార్ధక హృదయములో పాతుకుపోయి ఉన్నవి? (బి) సామెతలు 4:20-23 ప్రకారము మనము హృదయమునెట్లు కాపాడుకొనగలము?

9 అయితే హృదయము చెడుకోరికలకు మూలమైనను, దైవసంబంధమైన వ్యక్తులలో అది యెహోవాయెడల భయముతోకూడిన గౌరవమునకు, సరియైనదానిని ప్రేమించుటకు పీఠమైయున్నది కూడ. (మత్తయి 22:37; ఎఫెసీయులు 4:20-24) మనవిషయములో నివసిస్తున్నది మంచా లేక చెడా అనేది మనము హృదయములోనికి తీసుకొనే దానిపై ఆధారపడినది. దేవుని వాక్య ఉపదేశమిలా ఉన్నది: “నా కుమారుడా, నామాటలను ఆలకింపుము నా వాక్యములకునీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము. నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”—సామెతలు 4:20-23.

10. మన శరీర బలహీనతలు మన భావోద్రేకములు మరియు వాంఛలపై ఎట్లు ప్రభావము చూపును?

10 మన శరీర బలహీనతలు మన భావోద్రేకములపై మరియు కోరికలపై ప్రభావము చూపును. మనలో అప్పుడప్పుడు నిరుత్సాహము, అసహనము, మనసునొచ్చుకొనుటవలన బాధపడని వారము ఎవరమున్నాము? ఈ శరీర స్వభావములను వెంటనే సరిదిద్దుకొనుచున్నయెడల ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనవచ్చును. అయితే గర్వము, అత్యాశ చాలా త్వరగా హృదయములో చోటుచేసుకొనగలవు. లోభత్వము మరియు అదుపు దాటిన సుఖములకొరకైన వాంఛ, అల్లరితో కూడిన ఆటపాటలు మనలను స్వాధీనపరచుకొనగలవు. లైంగిక వాంఛ దేవుడు మనలను నిర్మించినతీరునుబట్టి సహజమైనను, అది చాలా యుక్తిగా మనలను ప్రక్కకు నడిపించగలదు. అటువంటి ఆత్మీయ వ్యాధి మనలో వృద్ధికాకుండు నిమిత్తమై ప్రతి దిన జీవితములో మనము ఆత్మఫలములను సాధకముచేసికొనుచు, “చెడును ద్వేషించి” “మంచిని హత్తుకొనునట్లు” మనలను మనము తర్ఫీదు చేసికొనవలెను.—రోమీయులు 12:9; గలతీయులు 5:22, 23.

ఆత్మీయ రోగమునకు బయటి మూలములు

11. (ఎ) లోకసంబంధమైన ఏ స్వభావములు, చర్యలు అంటురోగము వంటివి? (బి) యేసు ప్రకారము ఏ విషయమందు మన హృదయములకు శ్రద్ధనివ్వవలెను?

11 బయటమూలముల నుండియు ఆత్మీయ రోగము సోకగలదు. ఆత్మీయముగా మృతులైనవారినుండి అది మనకు అంటగలదు. (ఎఫెసీయులు 2:1-3) మనము వారితో అతి సన్నిహితముగా మెలగినట్లయిన వారి స్వభావములు, వారి జీవితవిధానములను మనము చేపట్టగలము. ఈ లోకప్రజల జీవితంలో లౌకికంగా ముందుకు వెళ్లుట, ధనమును ప్రేమించుట, వస్తుసంబంధముగా శ్రేష్టమైన వాటిని పొందుట, సరదాగా సమయము గడుపుట పెద్దవిషయములుగా ఉన్నవి. అట్టివాటియెడల పెరుగు కోరిక అంటు రోగము వంటిది. అది కొంచెము సోకినను మనలను ఆత్మీయముగా మందులను చేయగలదు. యేసు ఇట్లు హెచ్చరించెను: “మీ హృదయములు ఒక వేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.”—లూకా 21:34, 35.

12. తప్పిదమైన అభిప్రాయములు మరియు బోధలు ఆత్మీయ ఆరోగ్యమునకు ఎట్లు ప్రమాదకరము కాగలవు?

12 ఈ లోకపు చెడు అభిప్రాయములు దాని బోధలు మనకు రోగమును కలుగజేయగలవు. పౌలు ఇట్లు హెచ్చరించెను: “ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపుకు తిరుగు కాలము వచ్చును.” (2 తిమోతి 4:3, 4) అబద్ధ బోధలు కొరుకుపుండు వంటివి. (2 తిమోతి 2:16, 17) అది లోపల ప్రవేశించినపుడు నీ మాంసములోని ఆ భాగము మృతమగును. ఎందుకనగా ప్రాణమునకు మూలమైన రక్తము శరీరములోని ఆ భాగమునకు వెళ్లకుండ ఆగిపోతుంది.

13. ఆత్మీయరోగము కొరుకుపుండువలె ప్రవేశించిన ఏమి చేయవలెను?

13 కొరుకుపుండు ఎంత త్వరగా వ్యాపించును! మరణమును తప్పించుటకు వైద్యుడు ఆశరీర భాగమును పూర్తిగా తీసివేయవలసివచ్చును. కావున సందేహములు, ఫిర్యాదులు, లేక మత భ్రష్టత్వము నిన్ను ఆత్మీయముగా చెరుపుచున్నట్లయిన, వెంటనే వాటిని నరికివేయుము! (మత్తయి 5:29, 30 పోల్చుము.) సంఘ పెద్దలనుండి సహాయము పొందుము. పౌలు వర్ణించిన వారివలె “హితవాక్యములను అంగీకరించ నందున” “తర్కములనుగూర్చియు, వాగ్వాదములను గూర్చియు మానసిక రోగముగలవానివలె” తయారుకాకుము.—1 తిమోతి 6:3, 4 NW.

14. సంఘముయొక్క ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుటకు పెద్దలు ఏమి చేయవలసిన అవసరతను కనుగొనవచ్చును?

14 సంఘముయొక్క ఆత్మీయ ఆరోగ్యమును కాపాడవలెనంటే, పెద్దలు “హితబోధ విషయమై హెచ్చరించుచు, ఎదురాడువారిని గద్దించ” వలసియున్నారు. (తీతు 1:9, 13, 16; 2:1) బహుశా అటువంటివారిని ఆత్మీయముగా ఆరోగ్యకరమైన స్థితికి తిరిగితేవచ్చును. (2 తిమోతి 2:23-26) అయితేవారు పశ్చాత్తాపమునొందక అబద్ధబోధను వ్యాప్తి చేస్తున్నట్లయిన ఏమిచేయవలెను? వారితో ఏ సంబంధములు లేకుండా వారిని విసర్జించవలెను. వారు వెలివేయబడుదురు. వారి ఆత్మీయ రోగము మనకు అంటకుండా మనము వారికి వేరుగా ఉందుము.—రోమీయులు 16:17, 18; 1 కొరింథీయులు 5:9-13; తీతు 3:9-11.

15. దేవుని ప్రజల ఆత్మీయ ఆరోగ్యమును పాడుచేయుటకు ముఖ్యమైన ఏ రెండు పద్ధతులను అపవాది ఉపయోగించియున్నాడు?

15 మనవిశ్వాసమునకు ఆత్మీయ ఆరోగ్యమునకు ప్రమాదకరమైన మూడవ విషయమేమనగా అపవాది. (ఎఫెసీయులు 6:11, 12) మన దినములవరకు కూడా హింస, దొమ్మిమూకల చర్య, దెబ్బలు, చెరసాలలో వేయించుట, మరణ భయములచేత యెహోవా ప్రజల విశ్వాసమును బలహీనపరచుటకు అతడు ప్రయత్నించుచున్నాడు. (ప్రకటన 2:10) ఈ పన్నాగములద్వారా దేవుని సేవకుల యథార్థతను భంగము చేయుటలో అంతగా విజయము పొందకపోవుటవలన, ఏలాగైన కొందరిని పడవేయవలెనని తాను దేవునిగాయున్న ఈలోకపు ఆకర్షణలను అతడు ఉపయోగించును.—2 కొరింథీయులు 4:4; 11:3, 14.

16. అపవాది మనవిశ్వాసము మరియు ఆత్మీయ ఆరోగ్యముపై వేయుముట్టడులకు తాళుకొనగలుగుటకు మనకు ఏ రక్షణాధారమున్నది?

16 అపవాది ముట్టడులను మనమెట్లు ఎదిరించగలము? దేవుడిచ్చు ఆత్మీయ కవచమును ధరించుటద్వారా అట్లు చేయగలము. సాతాను మనపై గురిపెట్టు ‘సమస్త అగ్ని బాణములను ఆర్పివేయుటకు శక్తిగలవారమగునట్లు విశ్వాసమను డాలును మనము కలిగియుండవలెను.’ అంతేగాక యేసు మాటల కనుగుణ్యముగా “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుమ”నియు ప్రార్థించవలెను. (ఎఫెసీయులు 6:11-18; మత్తయి 6:13) మనము ఆలాగున ప్రార్థించి, మన ప్రార్థనలకు తగినట్లు ప్రవర్తించిన సాతాను అగ్నిబాణములను ఆర్పివేయుటకు మన పరలోకపు తండ్రి సహాయముకొరకు ఎదురుచూడవచ్చును.

విశ్వాసమందు ఆరోగ్యముగా ఉండుట

17. ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుటకు “తగినవేళ ఆత్మీయ ఆహారమును తీసుకొనుట” క్రైస్తవ చర్యలందు క్రమముగా పాల్గొనుట ఎంత ప్రాముఖ్యము?

17 భౌతిక ఆరోగ్యమును కాపాడుకొనుటలో ముందుగనే వ్యాధిరాకుండా తగుజాగ్రత్త వహించుట ముఖ్యవిషయమైయున్నది. పోషకాహారము, సరైన వ్యాయామము, శరీరము మరియు మనస్సుయెడల సామాన్య జాగ్రత్త ముఖ్యము. ఆరోగ్యవంతమైన శరీరములో వ్యాధి నిరోదక శక్తి బలంగా ఉంటుంది. అలాగే ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుటకు దేవుడు నిర్ణయించు ఆహారమును తీసికొంటూ “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతి ద్వారా “తగిన వేళ” వచ్చు ఆత్మీయ పోషణను గుణగ్రహించవలసియున్నాము. ఈ లోకపు ఆత్మీయ చిరుతిండిని విసర్జించి, బైబిలును, క్రైస్తవ ప్రచురణలను పఠిస్తూ దేవుని ప్రజలతో క్రమంగా కూడుకొనవలెను. (మత్తయి 24:45-47; హెబ్రీయులు 10:24, 25) పరిచర్యయందు, ఇతర క్రైస్తవ చర్యలందు “ప్రభువు కార్యాభివృద్ధియందు చేయుటకు ఎంతో పని గలవారమై” యుండుటద్వారా కలుగు వ్యాయామము మనకు అవసరమైయున్నది.—1 కొరింథీయులు 15:58.

18. “హితవాక్య ప్రమాణము” ఏమైయున్నది, మరియు ఎందుకు మనము దానిని హృదయమందును, మనస్సునందును కలిగియుండవలెను?

18 ఆత్మీయంగా ఆరోగ్యముగా ఉండుటకు దేవుని ఆత్మీయ ఏర్పాట్లను పూర్తిగా వినియోగించుకొనవలెను. పౌలు తిమోతికి చెప్పినవిధముగా: “క్రీస్తుయేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, నీవు నావలన వినిన హిత వాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము”. (2 తిమోతి 1:13, 14) ఒక భాషకు కొన్ని పదముల ప్రమాణముంటుంది. అలాగే బైబిలు సత్యమగు “స్వచ్ఛమైన భాష” ప్రాముఖ్యముగా రాజ్యముద్వారా యెహోవా సత్యవాదిత్వము రుజువగునను అంశముపై ఆధారపడిన ఒక విధానమును (ప్రమాణమును) కలిగియున్నది. (జెఫన్యా 3:9) మన విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనవలెనంటే ఇట్టి హితవాక్యముల ప్రమాణమును హృదయమందును, మనస్సునందును కలిగియుండవలెను. లేనియెడల అది మనకు సరైన భావము లేనిదైయుండును. ఇట్టి ఆత్మీయ వివేకము లేనివారైనందున కొరింథి సంఘములో కొందరు “బలహీనులును రోగులునై” యుండిరి.—1 కొరింథీయులు 11:29-32.

19. (ఎ) ఆత్మీయరోగము వృద్ధియైన ఏమి చేయవలెను? (బి) ఒక వ్యక్తి ఆత్మీయమగా రోగియైనట్లయిన పెద్దలు ఏమి చేయవచ్చును?

19 నీకు ఆత్మీయ రోగము సోకినట్లయిన ఏమి చేయవలెను? నిశ్చయముగా ప్రేమగల సహాయము అవసరము. అది అందుబాటులో ఉన్నది. యాకోబు ఇలా అనుచున్నాడు: “మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు యెహోవా నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.” (యాకోబు 5:14) అవును పెద్దలను పిలిపింపవలెను. వారు ఆత్మీయ వైద్యులుగా మీ ఆత్మీయ రోగమునకు గల కారణమును చూచుటకు సహాయపడగలరు. వారు మృదువుగా మరియు ప్రభావకరంగా స్వస్థపరచగల నూనెయగు దేవుని వాక్యమును ప్రయోగింతురు. నీవు పాపములుచేసియుంటే, పశ్చాత్తాపపడినయెడల యెహోవా నిశ్చయముగా క్షమించునను అభయమును కలిగియుండుము. (కీర్తన 103:8-14) పెద్దలు నీతోపాటు, నీ కొరకు ప్రార్థించినప్పుడు నీవు దేనిని కనిపెట్టవచ్చును? యాకోబు ఇలా సమాధానమిస్తున్నాడు: “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, యెహోవా అతనిని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.”—యాకోబు 5:15.

ఆత్మీయ ఆరోగ్యము నిత్యజీవమునకు నడుపును

20. (ఎ) ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనుటనుగూర్చి మొదటి శతాబ్దపు పరిపాలక సభ ఏ ఉపదేశము నిచ్చినది? (బి) నూతనలోకపు ఆశీర్వాదములకొరకు ఎదురుచూచుకొలది మనకు ఏమి సహాయము చేయును?

20 క్రైస్తవులకు అవశ్యకమైనవాటిని తెలియజేయుచూ మొదటి శతాబ్దపు యెహోవా ప్రజల పరిపాలక సభ తమ పత్రికను “మీకు క్షేమము కలుగునుగాక!” (మీకు మంచి ఆరోగ్యము) అను మాటలతో ముగించెను. వారు “విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.” (అపొ. కార్యములు 15:28, 29) అయితే మంచి ఆత్మీయ ఆరోగ్యముకొరకైన ఆ సూచన నేటికిని విలువగలదైయున్నది. నూతన లోక ఆశీర్వాదములకొరకు ఎదురుచూచు కొలది, రాజ్యసువార్తను ఆసక్తితో ప్రకటించుచూ, వ్యాధిగ్రస్తమైన ఈ లోకములో యెహోవా నామమును మహిమపరచు చున్నట్లయిన మన విశ్వాసమును, ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనగలము. ఈ విధముగా పనితొందరలో ఉన్నట్లయిన అతిసమీపములోనున్న ఆ నూతన లోకపు ఆశీర్వాదముల విషయములో ఓపికను కోల్పోకుండా ఉందుము. ఎందుకనగా, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.”—సామెతలు 13:12.

21. ఈ వ్యాధిగ్రస్త లోకములో విజయవంతముగా తమ విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొనువారికి ఏ ఆశీర్వాదములు భధ్రపరచబడియున్నవి?

21 యెహోవా తనను ప్రేమించువారికొరకు దాచియుంచిన గొప్ప ఆశీర్వాదములను పోగొట్టుకొనకుము. సమస్త లోకప్రభావములను తిరస్కరించుట, శరీరబలహీనతలతో పోరాడుట, అపవాదియొక్క అగ్నిబాణములను త్రిప్పికొట్టుట అంతయు వృధాగా మిగిలిపోదు. యెహోవా నూతనలోకములో నీ స్వంత కండ్లతో “అందులో నివసించు ఎవడును నాకు దేహములో బాగులేదు” అని పలకని సమయమును చూచెదవు. ఎందుకనగా “మన రోగములను భరించి, మన వ్యసనములను వహించిన” యేసుక్రీస్తు విమోచనబలి ఏర్పాటును దేవుడు చేసియున్నాడు. (మత్తయి 8:17; యెషయా 53:4) అప్పుడు సూచనార్థకమైన “జీవజలముల నది” నుండి త్రాగ గలిగి, “జనములను స్వస్థపరచు ఆకులు”గల “జీవవృక్షముల”నుండి భుజింతువు. (ప్రకటన 22:1, 2) ఈ వ్యాధి గ్రస్త లోకములో విశ్వాసమును ఆత్మీయ ఆరోగ్యమును కాపాడుకొన్నట్లయిన పరిపూర్ణత, సంతోషమునందు నిత్యజీవమును పొందుట నీకు బహుమానమైయుండును. (w89 10/1)

మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొందురా?

◻ మంచి భౌతిక ఆరోగ్యము కలిగియుండుటకంటె, విశ్వాసమందు ఆరోగ్యముగా ఉండుట ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యము?

◻ విశ్వాసమునకు ఆత్మీయ ఆరోగ్యమునకు హాని కలుగజేయు ముఖ్యమైన మూడు ప్రమాదములేమి?

◻ మంచి ఆత్మీయ ఆరోగ్యమునకు సూచనార్థ హృదయమునకు ఏ సంబంధమున్నది?

◻ ఒకరు ఆత్మీయముగా రోగియైన ఏమిచేయవలెను?

[24వ పేజీలోని చిత్రాలు]

వ్యాధిగ్రస్తమైన లోకములోను, బలమైన విశ్వాసము మరియు మంచి ఆత్మీయ ఆరోగ్యము కలిగియుండుట సాధ్యము

[26వ పేజీలోని చిత్రాలు]

మంచి ఆత్మీయ ఆరోగ్యము ఆసక్తితోచేయు క్రైస్తవ పని మరియు తగినవేళ క్రమముగా ఆత్మీయ ఆహారము తీసుకొనుటపై ఆధారపడియున్నది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి