యేసుయొక్క జీవితము పరిచర్య
క్షమించుటను గూర్చి ఒక పాఠము
యేసు తన శిష్యులతో ఇంకను కపెర్నహూము గృహమునందే ఉన్నట్లు స్పష్టమగుచున్నది. ఆయన సహోదరుల మధ్య విభేధములను ఎట్లు చక్కబెట్టుకొనవలెనో చర్చించుచుండెను, కావున పేతురు ఆయనను ఇట్లడిగెను: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను?” యూదా మత బోధకులు మూడుసార్లవరకు క్షమించుటను అనుమతించిరి, పేతురు బహుశ దానిని దృష్టిలోపెట్టుకొని తాను సూచించబోవునది ఎంతో ఔదార్యమనిపించుకొనునని “ఏడు మారులమట్టుకా?” అని అడిగెను.
అయితే అటువంటి నియమమును కలిగియుండు పూర్తితలంపు తప్పై ఉన్నది. యేసు పేతురును సరిదిద్దెను: “ఏడుమారుల మట్టుకే కాదు, డెబ్బది ఏళ్లమారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను.” ఆవిధంగా పేతురు తన సహోదరుని క్షమించుటకు ఎటువంటి సంఖ్యయు హద్దుగా పెట్టరాదని ఆయన చూపించుచున్నాడు.
క్షమించుట విషయములో తమ బాధ్యతయేమిటో తన శిష్యులపై ముద్రవేయుటకు, యేసు వారికి ఒక దృష్టాంతము చెప్పెను. అది తన సేవకులతో లెక్క చూచుకొనగోరిన ఒక రాజునుగూర్చినదై యున్నది. అతనికి పదివేల తలాంతులు (దాదాపు 5,00,00,000 డాలర్లు) అచ్చియున్న యొక దాసుడు ఆయనయొద్దకు తేబడెను. దానిని తిరిగి చెల్లించు మార్గమేమియు అతని దగ్గరలేదు. కావున రాజు వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పుతీర్చవలెనని ఆజ్ఞాపించెను.
కాబట్టి ఆ దాసుడు యజమాని కాళ్షపైబడి, “నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని” యాచించెను.
దానితో ఆ యజమాని కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పుమొత్తమును క్షమించెనని, యేసు వివరించెను. యేసు ఇంకను తెల్పినదేమనగా, అయితే అట్లు చేసి ఎంతో సమయము గడవకముందే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులతో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని “నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను.”
ఆ తోడిదాసుని దగ్గర డబ్బులేదు. కావున అతడు తాను అచ్చియున్న దాసుని కాళ్షపైబడి, “నాయెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వేడుకొనెను.” కాని అతని యజమానివలె ఈ దాసుడు కనికరించలేదు, పైగా అతడు అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.
సరే, జరిగినదానిని చూసిన ఇతర దాసులు దీనినంతటిని తమ యజమానికి తెలియచేసిరి. ఆయన కోపముతో ఆ దాసుని పిలిపించి, “చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెనుగదా” అని వానితో చెప్పి, కోపముతో కనికరము చూపని ఆ దాసుని తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు చెరసాల అధికారులకు అప్పగించెనని యేసు తెలియజేసెను.
ఆ పిమ్మట యేసు తేల్చి చెప్పినదేమనగా, “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.”
క్షమించుట విషయములో ఎంత శ్రేష్ఠమైన పాఠము! మన విషయములో దేవుడు క్షమించిన పాపమును తీసుకొనినట్లయిన, క్రైస్తవ సహోదరుడు మనకు వ్యతిరేకముగా చేసిన ఎటువంటి తప్పిదమైనను నిజముగా చిన్నదైయున్నది. అంతేకాకుండ, యెహోవా దేవుడు మనలను వేలకొలదిసార్లు క్షమించియున్నాడు. తరచుగా, ఆయనకు వ్యతిరేకముగా మనము చేసిన పాపములు మనకు గుర్తుకూడావుండవు. కాబట్టి, న్యాయబద్ధమైన ఫిర్యాదుకు మనకు కారణమున్నను, కొన్నిసార్లయినను మనము మన సహోదరుని క్షమించలేమా? గుర్తుతెచ్చుకొనుము, కొండమీద ప్రసంగములో యేసు బోధించినట్లు, దేవుడు ‘ఋణస్థులను మనము క్షమించియున్న ప్రకారము మన ఋణములను క్షమించును.’ మత్తయి 18:21-35; 6:12; కొలొస్సయులు 3:13.
◆ తన సహోదరుని క్షమించుటనుగూర్చి ప్రశ్నించుటకు పేతురును ఏది పురికొల్పెను, ఎవరినైనను ఏడుసార్లు క్షమించు తన సూచన ఔదార్యముతో కూడినదని అతడెందుకు తలంచెను?
◆ కరుణకొరకు తన దాసుడు చేసిన వినతికి రాజుయిచ్చిన ప్రత్యుత్తరము, ఆ దాసుడు తోటి దాసుడు చేసిన వినతికి యిచ్చిన ప్రత్యుత్తరమునకు ఎట్లు భిన్నమై యున్నది?
◆ యేసుచెప్పిన దృష్టాంతమునుండి మనమేమి నేర్చుకొందుము? (w88 3/1)