“ధర్మవిరోధిని” బయలుపరచుట
“నాప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి”—ప్రకటన 18:4.
1, 2. (ఎ)ఈ ధర్మవిరోధి ఎట్లు గుర్తింపబడును? (బి) దేవుని సేవించుచున్నామని చెప్పుకొనుచు రక్తాపరాధులైన వారిని దేవుడు ఎట్లు దృష్టించును? (మత్తయి 7:21-23)
“ధర్మవిరోధి” వచ్చుటనుగూర్చి దేవునివాక్యము ముందే తెలియజేసినది. ఈ “ధర్మవిరోధి” దేవుని ఆజ్ఞలను నెరవేర్చు మరియు పరలోకములోనున్న యేసుక్రీస్తుచే ‘సంహరింపబడి మరియు నాశనము చేయబడునని’ కూడ ముందే తెలియజేయబడినది. (2 థెస్సలొనీకయులకు 2:3-8) పోయిన ఆర్టికల్‌లో స్పష్టపరచినట్లు క్రైస్తవ సామ్రాజ్యముయొక్క మతాధికారులే ఆ ధర్మవిరోధి. దేవుని వాక్యము యొక్క సత్యమును వారు ఎప్పుడో విడిచిపెట్టి త్రిత్వము, నరకాగ్ని మరియు అమర్త్యమైన ఆత్మవంటి అన్యమత బోధలను చేరదీసిరి. మరియు అదనముగా దేవుని చట్టమునకు వ్యతిరేకమైన క్రియలను చేసిరి. అట్టివారిని గూర్చి పౌలు తీతునకు హెచ్చరిక చేసెను: “దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కాని అసహ్యలును అవిధేయులును ప్రతిసత్కార్యము విషయము భ్రష్టులునై యుండి తమక్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.”—తీతు 1:16.
2 యేసు ఇట్లనెను: “అబద్ధప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి . వారు గొఱ్ఱెచర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు. కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలములవలన మీరువారిని తెలిసికొందురు.” అబద్ధప్రవక్తలు “పనికిరాని ఫలము” ను ఫలింపజేతురు. (మత్తయి 7:15-17) వారి చెడుఫలములు వారు చిందించిన అమితమైన రక్తముచే రుజువగుచున్నది. అనేక శతాబ్దములుగా వారు అనేక లక్షలమంది రక్తమును చిందించిన క్రూసేడ్‌లను, ఇంక్విజేషన్స్‌లను మరియు యుద్ధములను ప్రోత్సహించిరి. ఒకే మతమునకు చెందినవారై ఒకరినొకరు చంపుకొను యుద్ధములలో ఇరువైపుల వారికొరకు ప్రార్థనలు చేసి వారిని దీవించిరి. దీనికి వ్యతిరేకముగా అపొస్తలుడైన పౌలు యిట్లు చెప్పగలిగెను: “ఎవరి రక్తము (నాశనము) విషయమైనను నేను దోషినికాను.” (అపొస్తలులకార్యములు 20:26) మతాధికారులు అట్టివారు కారు. దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: “మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను. మీచేతులు రక్తముతో నిండియున్నవి.”—యెషయా 1:15.
3. ప్రత్యేక అర్థమును కలిగిన లోక సంఘటనలు ఏవి త్వరగా సమీపించుచున్నవి?
3 ఈ ధర్మవిరోధికి విరోధముగా తీర్పును దేవుడు విధించు సమయము శీఘ్రముగా సమీపించుచున్నది. యేసు ముందే తెలిపిన విధముగా త్వరలో “లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమకలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:21) ఎన్నడు కలుగని అట్టి శ్రమలతో కూడిన కాలము, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు మహాబబులోను నాశనముతో ఆరంభమగును, దీనియందు క్రైస్తవసామ్రాజ్య మతములును చేరియుండును. రాజకీయ శక్తులు “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:16) సాతాను లోకములో మిగిలి ఉన్న భాగము “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” హార్‌మెగిద్దోనులో నాశనమగుటతో ఆ మహాశ్రమలు అంతమగును.—ప్రకటన 16:14, 16; 19:11-21.
ఇతరులను ప్రేమించు కర్తవ్యము
4. దేవుని “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించువారు మనస్సునందుంచుకొనవలసినదేది?
4 లోకమును కదలించు ఇట్టి సంఘటనలు త్వరలో సంభవింపనైయుండగా “తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించు” వారిపై ఎట్టి బాధ్యతలుండును? (యోహాను 4:23) మొదటిగా వారు యేసు చెప్పిన దీనిని మనస్సునందుంచు కొనవలెను: “నేను నాతండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. . .నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తనప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటిని చేసినయెడల మీరు నా స్నేహితులైయుందురు.”—యోహాను 15:10-14; 1 యోహాను 5:3.
5, 6. (ఎ) వారిని గుర్తించేదిగానున్న దేనిని చేయమని యేసు తన శిష్యులను ఆజ్ఞాపించెను? (బి) ఏ విధముగా ఇది క్రొత్త ఆజ్ఞ అయినది?
5 అట్లు నిజమైన క్రైస్తవులు ఇతరప్రజలను, విశేషముగా అన్ని దేశములలోని తమ క్రైస్తవ సహోదర సహోదరీలను ప్రేమించు కర్తవ్యమును కలిగియున్నారు. (అపొస్తలులకార్యములు 10:34; గలతీయులకు 6:10; 1 యోహాను 4:20, 21) నిజానికి తోటిక్రైస్తవులు “మిక్కుటమైన ప్రేమను” కలిగియుండవలెను. (1 పేతురు 4:8) ప్రపంచవ్యాప్తముగానున్న అటువంటి ప్రేమయే నిజమైన ఆరాధికులుగా గుర్తు పట్టించును, ఎందుకనగా యేసు ఇట్లనెను: “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”—యోహాను 13:34, 35.
6 ఆ ఆజ్ఞలో క్రొత్తదనమేమిటి? మోషే ధర్మశాస్త్రము క్రిందనున్న యూదులు, “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించు” అను ఆజ్ఞక్రిందలేరా? (లేవీయకాండము 19:18) నిజమే, కాని అదనముగా ఉన్నదానిని సూచించుచు ఇట్లనెను: “నేను మిమ్మును ప్రేమించినట్టే.” ఇతరుల కొరకు తన ప్రాణమును పెట్టుట ఆయన ప్రేమలో చేరియున్నది, ఆయన శిష్యులు కూడ అట్లు చేయ ఇష్టపడవలెను. (యోహాను 15:13) అది ప్రేమయొక్క ఉన్నతస్థాయి; అట్టి త్యాగము మోషే ధర్మశాస్త్రము కోరుటలేదు.
7. ఈ శతాబ్దములో ఏ మతము ప్రేమయొక్క చట్టమునకు లోబడినది?
7 మన శతాబ్దములో ఈ ప్రేమచట్టమునకు ఏమతము లోబడినది? నిశ్చయముగా క్రైస్తవ సామ్రాజ్యముయొక్క మతములు కానేరవు, ఎందుకనగా రెండు ప్రపంచ యుద్ధములలోను మరియు ఇతర కలహములలోను వారు లక్షలకొలదిగా ఒకరి నొకరు సంహరించుకొనిరి. భూవ్యాప్తముగా ఈ ప్రేమ చట్టమునకు విధేయులైనవారు యెహోవాసాక్షులు. తన అనుచరులు “ఈ లోకసంబంధులు కారు” అని యేసు చెప్పినట్లే వారు యుద్ధములలో ఖచ్చితమైన తటస్థస్థానమును వహించిరి. (యోహాను 17:16) అట్లు వారు పౌలువలె ఇట్లు చెప్పగలరు: “ఎవరి రక్తము (నాశనము) విషయమైనను నేను దోషినికాను.” ఉదాహరణకు వాషింగ్‌టన్, డి, సి, వద్ద నవంబర్ 27, 1921న యెహోవా సేవకులు తీసికొనిన ఒక తీర్మానములోని ప్రారంభ భాగమును గమనించుము:
“మన ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన అపొస్తలుల యొక్క బోధలను అనుసరించుటకు యథార్థముగా కృషిచేయుచున్న క్రైస్తవులుగా, స్థిరముగా చెప్పునదేమంటే: యుద్ధము, అనాదిగా వస్తున్న అనాగరిక చర్య, మంచి నీతిసూత్రములను పాడుచేయునది. మరియు క్రైస్తవ ప్రజలకు చెడుపేరు తెచ్చునది; యేసుక్రీస్తు ప్రభువుచే బోధింపబడిన సూత్రములు, పవిత్రులని పరిగణింపబడు క్రైస్తవులు ఏవిధమైన యుద్ధము, రక్తము చిందించుట లేక దౌర్జన్యము నందు పాల్గొనకుండ చేయును.”
8. రెండవ ప్రపంచయుద్ధ కాలములో యెహోవాసాక్షులను గూర్చి చరిత్రరికార్డు ఏమి చెప్పుచున్నది?
8 రెండవ ప్రపంచ యుద్ధసమయములో ఈ దృష్టి ఎట్లు వర్తించును? మానవ చరిత్రలోనే అతినీచమైన ఆ యుద్ధమునందు షుమారు 5 కోట్లమంది చంపబడిరి. కాని వారిలో ఏ ఒక్కరు ఏ ఒక్క యెహోవాసాక్షిచేత చంపబడలేదు. ఉదాహరణకు, జర్మని క్రైస్తవమతాధికారులలో అత్యధికమంది చురుకుగా లేక సాధారణముగా నాజీ విధానమును బలపరచిరి. దీనికి వ్యతిరేకముగా, నాజి పరిపాలన క్రింది యెహోవాసాక్షులు తటస్థస్థానమును దృఢముగాచేపట్టి హిట్లర్‌ను పొగడుటకు లేక అతని సైనిక బలములో భాగము వహించుటకు నిరాకరించిరి. కనుక వారు ఇతర దేశములలోని తమ ఏ ఆత్మీయ సహోదరుని, లేక ఏ ఇతరవ్యక్తిని చంపలేదు. అన్ని దేశములలోని యెహోవాసాక్షులు కూడ తటస్థ స్థానమును వహించిరి.
9. నాజి పరిపాలన క్రింద జర్మని మరియు ఆస్ట్రియాలోని యెహోవా సాక్షులకు ఏమిసంభవించినది?
9 ప్రేమయొక్క చట్టమునకు విధేయులగుటలో తమ స్నేహితుల కొరకు అనేకమంది యెహోవాసాక్షులు తమ ప్రాణములను త్యాగముచేసిరి. “కర్చన్‌కాంప్ ఇన్ డోయిచ్‌లాన్‌డ్” (జర్మనీలోని చర్చీల కలహము) అను ఫ్రెడ్‌రిచ్ జిఫెల్‌చే వ్రాయబడిన ఒక పుస్తకము యొక్క రివ్యూ యెహోవాసాక్షులను గూర్చి ఇట్లు చెప్పినది: “మత సంబంధమైన ఈ చిన్నగ్రూప్‌లోని తొంబది ఏడు శాతము, నేషనల్ సోషలిస్టిక్ [నాజి] హింసకు గురియైరి. వారిలో మూడవ భాగము, మరణ శిక్షద్వారా గాని లేక కౄరమైన క్రియలు, ఆకలి, వ్యాధి, లేక బానిస చాకిరి ద్వారాగాని చంపబడిరి. ఇట్టి తీవ్రమైన సంఘటనలు ఇంతకు ముందెన్నడును లేవు; ఇదంతయు నేషనల్ సోషలిస్టిక్ సిద్ధాంతములో ఏకీభవించనట్టి రాజీపడని విశ్వాసమునకు ఫలితము.” ఆస్ట్రియాలో యెహోవాసాక్షులలో 25 శాతము, మరణశిక్షద్వారా, మరణించేవరకు కొట్టబడుటద్వారా లేక నాజీ కాంప్‌లో సంభవించిన వ్యాధి లేక బాగా అలసిపోవుటద్వారా మరణించిరి.
10. ప్రేమచట్టమునకు లోబడినందున మరణించినవారు ఏ నమ్మకమును కలిగియున్నారు?
10 ఆ ప్రేమచట్టమునకు విధేయులై మరణించినవారు, “[వారు] తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు” అను నమ్మకమును కలిగినవారు. (హెబ్రీయులు 6:10) “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని వారికి తెలుసు. (1 యోహాను 2:17) నిత్యజీవ నిరీక్షణలో తప్పక పునరుత్థానము పొందెదరని నిశ్చయమైన నిరీక్షణను కలిగియున్నారు.—యెహాను 5:28, 29; అపొస్తలులకార్యములు 24:15.
11. ఏ విషయములో యెహోవాసాక్షులు సాటిలేని వారు, మరియు వారిలో ఏ ప్రవచనము నెరవేరుచున్నది?
11 ఒక హైకోర్టులో పేతురు మరియు ఇతర అపొస్తలులు పలికిన చట్టమునకు విధేయులగుటలో యెహోవాసాక్షులు సాటిలేనివారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొస్తలులకార్యములు 5:29) యెహోవాసాక్షులు ఇట్లు చేయుదురు గనుక, “దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ” వారి వెంట నున్నది. (అపొస్తలులకార్యములు 5:32) యెషయా 2:2-4లోని ప్రవచనమును నెరవేర్చగలుగునట్లు చేయుశక్తి అదియే. మనకాలములోనే సత్యారాధన మరల స్థాపింపబడుననియు అన్ని దేశములనుండి మరియు మతములనుండి ప్రజలు ప్రవాహము వలెవత్తురని ఆ ప్రవచనము తెల్పుచున్నది. ఒక ఫలితము ఇది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేయును.” యెహోవా సేవకులు శాంతికరమైన ఒక నూతనలోకములోని జీవముకొరకు సిద్ధపడుచున్నారు గనుక వారు యుద్ధమును మరి ఎన్నడును నేర్చుకొనరు. వారు ప్రేమచట్టమును నేర్చుకొందురు.—యోహాను 13:34, 35.
12. ప్రేమయొక్క చట్టమునకు విధేయులగువారు ఇతరులకు ఏమిచేయవలెను?
12 ‘నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను’ అనునది క్రైస్తవ ప్రేమలో చేరియున్నది. గనుక దేవుని సేవకులు తాము తెలిసికొనిన దాని యెడల స్వార్థము కలిగియుండలేరు. (మత్తయి 22:39) దేవునిసేవించి ఆయన నూతనలోకములో జీవించవలెనని కోరువారు ఇంకను అనేకమంది ఉన్నారు. ఇంకను సమయముండగనే వారు, ఈ ప్రేమయొక్క చట్టమును మరియు సార్వభౌమాధిపతియైన యెహోవా దేవునికి సంబంధించిన అనేక ఇతర సత్యములను నేర్చుకొనవలెను. యెహోవా మాత్రమే మన ఆరాధనకు అర్హుడనియు మరియు ఆ ఆరాధన ఎట్లు అర్పించవలెననియు వారు తెలిసికొనునట్లు బోధింపబడవలెను. (మత్తయి 4:10; ప్రకటన 4:11) ఇంతకు ముందేవాటిని నేర్చుకొనినవారు, ఇతరులుకూడ యెహోవా అనుగ్రహము పొందునట్లు వారికి ఆ సత్యములను తెల్ప బద్ధులైయున్నారు.—యెహెజ్కేలు 33:7-9, 14-16.
ధర్మవిరోధిని బయలుపెట్టుట
13. లోకవ్యాప్తమైన మన సాక్ష్యములో భాగముగా దేనిని తెలియజేయవలెను మరియు ఎందుకు?
13 “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు చెప్పెను. (మత్తయి 24:14) ప్రపంచ వ్యాప్తమైన ఈ సాక్ష్యములో భాగముగా, అబద్ధమతమునకు, మరి ముఖ్యముగా క్రైస్తవ మతాధికారులకు వ్యతిరేకముగా వచ్చు దేవుని తీర్పును గూర్చి తెలియజేయు బాధ్యత దేవుని సేవకులు కలిగియున్నారు. క్రైస్తవులమని చెప్పుకొనుటను బట్టివారు దేవుని దృష్టిలో అతిగా దోషపూరితులైయున్నారు. దేవుని సేవింపగోరువారు వారి ప్రభావమునుండి స్వేచ్ఛను పొంది, జీవముకొరకు తగినచర్యలు గైకొనునట్లు వారు బయలుపరచబడవలెను. యేసు ఇట్లు చెప్పెను: “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”—యోహాను 8:32.
14. అబద్ధమతమునకు సంబంధించి ఏ స్పష్టమైన వార్తను ప్రకటించవలెను?
14 అట్లు యెహోవాసాక్షులు అబద్ధమతమునకు సంబంధించిన ఈ ప్రేరేపింపబడిన వార్తను తప్పక తెలియజేయవలెను: “నా ప్రజలారా మీరు దానిపాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశము నంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొని యున్నాడు. . .ఒక్క దినముననే దాని తెగుళ్లు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును. దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన యెహోవా బలిష్టుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.”—ప్రకటన 18:4-8.
15. యెహోవా కాలపట్టికలో 1914 సంవత్సరము ఎట్టి పాత్రను వహించినది, మరియు మొదటి ప్రపంచ యుద్ధమనంతరము ఏ ఫలితమొచ్చినది?
15 ఈ విధానము యొక్క “అంత్యదినములు” కఠినమైన సంవత్సరమైన 1914లో ఆరంభమయినవని బైబిల్ ప్రవచనములు చూపుచున్నవి. (2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24:3-13) ఆ సంవత్సరమునుండి మనము “అంత్యకాల” మందున్నాము. (దానియేలు 12:4) మొదటి ప్రపంచ యుద్ధము తరువాత వెంటనే, యెహోవా యొక్క కాలపట్టికకు అనుగుణ్యముగా, ఆయన సేవకులు, మత్తయి 24:14 నందు ప్రవచింపబడినట్లు, దేవుని రాజ్యమునుగూర్చిన ప్రకటనను ఉధృతముగా విస్తరింపజేయుటకు ఆరంభించిరి. మరియు వారు అబద్ధమతమును, మరిముఖ్యముగా భ్రష్టత్వముచెంది క్రైస్తవ సామ్రాజ్యము యొక్క ధర్మవిరోధముగానున్న మతాధికారుల తరగతిని కూడ బలముగా బయలుపెట్టుటకు మొదలిడిరి.
16. ఈ ధర్మవిరోధిని బయలుపెట్టుట ఎట్లు డెబ్బయి సంవత్సరములకుపైగా శక్తిని కూడబెట్టుకొనినది?
16 ఇప్పటికి 70 సంవత్సరములకు మించి, ఎప్పటికంటె బలముగా ఈ ధర్మవిరోధియొక్క మోసకరమైన క్రియలయెడల మెలకువగా నుండునట్లు దేవుని సేవకులు ప్రజలకు చురుకుదనము కలిగించుచుండిరి. మొదటి ప్రపంచ యుద్ధమనంతరము ఈ పనిని కొన్నివేల సాక్షులు మాత్రమే చేయుచుండిరి. కాని ఇప్పుడు భూవ్యాప్తముగా 60,000కు మించిన సంఘములలో క్రమబద్దముగానుంటున్న 35 లక్షలకు మించిన చురుకైన పరిచారకులయొక్క “బలమైన జనముగా” వారు మారిరి. (యెషయా 60:22) బాగా విస్తృతపరస్తున్న పరిమాణములో మానవజాతికి దేవుని రాజ్యమొక్కటే నిజమైన నిరీక్షణ నిచ్చునదని ఉత్సాహముగా ప్రకటించుచు, దేవుని సేవకులు, అదేసమయములో క్రైస్తవసామ్రాజ్య మతాధికారులు నిజానికి ఏమైయున్నారో—మోసగించు ఒక ధర్మవిరోధిగా బయలుపరచుచున్నారు.
అంత శక్తివంతముగా ఎందుకు?
17. ఈ ధర్మవిరోధిని యెహోవాసాక్షులు ఎందుకు శక్తివంతముగా బయటపెట్టెను?
17 ఈ సంవత్సరమన్నింటిలో యెహోవాసేవకులు ఈ ధర్మవిరోధిని ఎందుకు శక్తివంతముగా బయలుపెట్టుచున్నారు? ఎందుకనగా రక్షణమార్గములో ఇప్పటికేనున్న లక్షలాది యెహోవా యొక్క గొఱ్ఱెల గొప్పసమూహము, ఈ సాతాను లోకమునుండి మరియు దాని అబద్ధమతమునుండి కాపాడబడవలెను. (యోహాను 10:16; ప్రకటన 7:9-14) అంతేకాకుండా, ఈ మతాధికారులు బయలుపడితే తప్ప దేవుని మందలో ఇంకను చేరని యథార్థహృదయులు తప్పుడు మార్గమును విసర్జించుటెట్ల తెలుసుకొనలేరు. తనకాలమునాటి వేషధారులైన మతనాయకులనుగూర్చి యేసు ప్రజలకు తెలియజేసినవిధముగా వారు తెలియజేయబడవలెను: “వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డి వానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలోపడుదురు.”—మత్తయి 15:14; మరియు 2 కొరింథీయులు 4:4; 11:13-15కూడ చూడుము.
18. సత్యము నన్వేషించువారు తెలిసికొనవలసినదేది?
18 ఈ మతాధికారులు సాతాను లోకములోని భాగము.(యోహాను 8:44) కాని అది దేవుడు అతి సమీపములో ఉనికిలోలేకుండ నాశనముచేయు లోకము. (2 పేతురు 3:11-13; 1 యోహాను 2:15-17) కనుక దేవుని వాక్యము ఇట్లు హెచ్చరించుచున్నది: “యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) ఈ మతాధికారులు ఆ హెచ్చరికను పట్టించుకొనక రాజకీయ వ్యవహారములలో జోక్యము చేసికొనుచున్నారు. రాజకీయవేత్తల ప్రయత్నములద్వారా మంచి లోకము వచ్చునని తమ అనుచరులకు చెప్పుచున్నారు. అది తప్పుడు నిరీక్షణ ఎందుకనగా సాతాను క్రిందనున్న ఈ లోకము గతించనైయున్నది. గనుక మంచి పరిస్థితులకై ఈలోకమువైపు చూచువారు మోసపోతున్నారు. ఈ లోకము ఎటుపోతుంది, దీని స్థానములో ఏది వచ్చును అనువాటిని గూర్చిన సత్యము ప్రజలకు తెల్పబడవలెను—సామెతలు 14:12; 19:21; మత్తయి 6:9, 10; ప్రకటన 21:4, 5.
19. ఇటీవల కాలములో కొంతమంది మతాధికారుల లౌకికత్వము ఒక సాధనముద్వారా ఎట్లు బయలుపడెను?
19 కొద్ది మతాధికారుల లౌకికత్వము, ఇటీవల కాలములోని సాధనములద్వారా కూడా బయలుపడినది. ఉదాహరణకు లైసెన్స్ పొందిన మరియు సుఖవిధానము యొక్క టి.వి. మతాధికారుల జీవిత విధానము. ఒక ఆధునిక పాటల రచయిత ఒక పాటను ఈ శీర్షిక క్రింద రచించెను: “టెలివిజన్ ప్రదర్శనలో యేసు [10,000 డాలర్ల విలువగల] రోలక్స్ [గడియారము] ధరించునా?” ఆ పాటలోని రచన ఇట్లు నడచును: “యేసు మరలా ఈ భూమిమీదికి వస్తే ఆయన రాజకీయ వేత్త అగునా, ఆయన యొక్క రెండవ గృహమును [అతిసుఖప్రదమైన] ఫామ్ స్ప్రింగ్స్‌నందు కలిగియుండునా మరియు తన విలువను మరుగుచేయ ప్రయత్నించునా?” దీనికి అదనముగా అనేక మతాధికారులు సలింగసంయోగమును సమర్థించిరి లేక చేయుచుండిరి. యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటికి కూడ పిల్లలయెడల ప్రీస్ట్‌లు చేసిన లైంగిక అవినీతి క్రియలచే సంభవించిన నష్టమునకు పరిహారముగా కేథలిక్ చర్చి కొన్ని లక్షలడాలర్లు చెల్లించుచున్నది.—రోమా 1:24-27; 1 కొరింథీయులు 6:9, 10.
20. ఈ ధర్మవిరోధిని యెహోవాసాక్షులు ఎందుకు బయలు పెట్టుచునే యుండవలెను?
20 అట్టి చర్యలను దేవుని సేవకులు పట్టించుకొనకుండ పోరు. ఇతరుల ప్రయోజనము నిమిత్తము అవి బయలుపడవలెను. దేవుని చట్టమునకు అవిధేయులగునట్లు చేయువారినుండి వేరే గొఱ్ఱెలలో భాగమైన గొప్పసమూహము కాపాడబడవలెను. మరియు, “జరుగుచున్న హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించువారిని” వెదకి గొప్పకాపరియైన యెహోవా దేవుని మరియు “మంచి కాపరియైన” యేసుక్రీస్తు యొక్క రక్షణ కరమైన నడిపింపు క్రిందకు సమకూర్చనవసరమున్నది.—యెహేజ్కేలు 9:4; యోహాను 10:11; సామెతలు 18:10.
21. యెహోవాసాక్షులు దేనిని ప్రకటించుటకు కొనసాగుతునేయుందురు?
21 కనుక, సాతాను లోకమంతటిపై దానిలో చేరియున్న ధర్మవిరోధి మరియు క్రైస్తవసామ్రాజ్యముయొక్క మతాధికారులపై దేవునియొక్క పగనుగూర్చి ఆయన ప్రజలు ప్రకటించుటలో వెనుకాడరు. వారు ప్రకటన 14:7లోని దూత సమాచారమును బలముగా ప్రకటించుదురు: “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పుతీర్చు గడియవచ్చెను.” మరియు వారు దీనిలో, ప్రకటన 18:4లోని అబద్ధమతమును గూర్చిన అతి ప్రాముఖ్యమైన హెచ్చరికను కూడ చేర్చెదరు: “నాప్రజలారా మీరు దాని పాపములలోపాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.” (w90 2⁄1)
పునరీక్షణ కొరకైన ప్రశ్నలు:
◻ ఈ ధర్మవిరోధికి సంభవించు గతి ఏమి మరియు ఎందుకు?
◻ ఇతరులయెడల యెహోవాసాక్షులు ఏ బాధ్యతను కలిగియున్నారు?
◻ అందరి మనుష్యుల రక్తాపరాధమునుండి యెహోవాసాక్షులెట్లు దూరముగాయున్నారు?
◻ మహాబబులోనుకు సంబంధించి మనమేమి చేయవలెను?
◻ ఈ ధర్మవిరోధికి వ్యతిరేకముగా మనము శక్తివంతమైన వార్తను ఎందుకు ప్రకటించుచునేయుందుము?
[25వ పేజీలోని చిత్రాలు]
అపొస్తలులు ఉన్నతమైన న్యాయసభయెదుట: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెనుగదా” అని చెప్పిరి
[26వ పేజీలోని చిత్రాలు]
యథార్థపరులైన ప్రజలు లోకము మరియు దాని మతములు ఎక్కడికి నడుచుచున్నది తెలుసుకొనవలసియున్నారు