సువార్తను ప్రపంచవ్యాప్తముగా ప్రకటించుట
దేవుని రాజ్యము పాలించుచున్నది! వార్తలలో ఇది అత్యుత్తమమైనది. కనుకనే భూవ్యాప్తముగా 37,00,000 కంటె ఎక్కువగానున్న యెహోవాసాక్షులు యోహాను దర్శనములో దూత చెప్పిన “సువార్తను” మరియు యేసుప్రవచించిన “సువార్తను” ఉత్సాహముతో ప్రకటించుచున్నారు. (మత్తయి 24:14; ప్రకటన 14:6) అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా “వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతములవరకు బయలు వెళ్లెను.” (రోమీయులు 10:18) వాస్తవముగా ప్రతిజనము, ప్రతివంశము, ప్రతి భాష మాట్లాడువారును, ప్రతిప్రజలోనున్న వ్యక్తులు “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అను పిలుపునకు సంతోషముగా స్పందించినారు.—ప్రకటన 14:7.
జీవిత భీమా ఇకలేదు
దురదృష్టకరమైన సంఘటనలపై ఆధారపడి జీవించుచున్న ఇంగ్లాండునివాసి అటువంటి వారిలో ఒకడు. కెన్ అనునతడు ఒక భీమా అమ్మకముదారుడు. మరియు అతడు ఒక యెహోవాసాక్షుల గృహమును దర్శించినప్పుడు వారు అతనినిట్లడిగిరి: “జీవితభీమా అవసరములేని లోకములో జీవించుటకు మీరు యిష్టపడుచున్నారా?” వారి అర్థమేమిటి? బైబిలు ప్రకారము దేవుని రాజ్యములో ఇప్పుడు జీవితమును అస్థిరముచేయు అనేక విషయములు అనగా రోగము, మరణము ఇక ఎన్నటికిని ఉండవు.
అది సాధ్యమగునా? అవును, దేవుడు తానే స్వయముగా వాగ్ధానము చేశాడు. ఉదాహరణకు బైబిలిట్లుచెప్పుచున్నది: “దేవుడు తానే. . .వారికి [మానవజాతి] తోడైయుండును. ఆయన వారికన్నుల ప్రతిబాష్పబిందువును తుడిచివేయును. మరణము యిక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను, ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:3, 4) ఇంతగొప్ప మార్పును తెచ్చునదేమి? దేవునిరాజ్యము. దేవుని వాక్య ప్రకారము ఇది త్వరలోనే “ముందు చెప్పిన (ఆధునిక రాజకీయ) రాజ్యములను పగులగొట్టి నిర్మూలముచేయును. కానీ అది యుగములవరకు నిలుచును.”—దానియేలు 2:44.
తమ భౌగోళిక ప్రకటన కార్యక్రమములో యెహోవాసాక్షులచే ఇటువంటి లేఖనములు కోట్లకొలది మానవులదృష్టికి తేబడినవి. ఇవి కేవలము ఒక మంచి ఊహకాదని కెన్ వలె అనేకమంది గ్రహించిరి. నిదర్శనములు ముగింపునకు వచ్చుచున్నవి. ఈ దైవిక వాగ్ధానములు నమ్మదగినవి మరియు త్వరలో నెరవేరనైయున్నవి.
మారిన విలువలు
దూత యొక్క సంతోషకరమైన వర్తమానమును యెహోవాసాక్షులు ప్రతిధ్వనించుచుండగా దానిని విను ప్రజలు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుటలో కేవలము బైబిలు వాగ్ధానములను నమ్ముటకంటె ఎక్కువచేరియున్నదని తెలిసికొందురు. అదివారి పూర్తి దృక్పథమును మార్చివేసి అనేక జీవన నిస్పృహలనుండి వారికి నెమ్మది కలుగజేసినది.
ఇది నిజమని రఫాయేలు అతని భార్య కనుగొనిరి. వారు అర్జెంటీనాలో నివసించుచున్నారు. మరియు 40సం.ల క్రితము వారు వివాహము చేసికొన్నప్పుడు వారు భద్రమైన భవిష్యత్తుకొరకు కష్టించి పనిచేయవలెననే గురిని తమ జీవితములో మొదటిదిగా పెట్టుకొనిరి. ఏమైనను, 21సం.ల తర్వాత వారి కష్టమునకు ఫలితముగా లభించినదేమనగా తరచుగా బాగుచేయునవసరతగల ఒక చిన్నయిల్లు. వారు మొదట వివాహము చేసికొన్నప్పటికంటె ఎక్కువ భద్రతను కలిగియున్నట్లుగా వారికనిపించలేదు.
యెహోవాసాక్షులద్వారా సువార్తను వారువిన్నప్పుడు మేలైన సంపాదన మరియు మేలైన భద్రత గురించి వారు నేర్చుకొన్నారు. యేసు తనకొండమీది ప్రసంగములో దీనినిగూర్చి ఇట్లు చెప్పును: “భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును. దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నమువేసి దొంగిలరు.”—మత్తయి 6:19, 20.
వస్తుసంపద విషయమై అభ్యాసయోగ్యముకాని వాటిని బైబిలు మనకు బోధించుటలేదు. కాని, ఆ విషయముపై మనము ఆశపెట్టుకొనకూడదని అది మనలను బలవంతపరచుచున్నది. (ప్రసంగి 7:12) దీనికి బదులుగా మనము బైబిలు చదువుటద్వారా, దేవునిచిత్తము నెరుగుటద్వారా, మరియు ఆ చిత్తమును చేయుట మనజీవితములో మొదటిదిగా చేసికొనుటద్వారా మనము ఆత్మీయసంపదకొరకు పనిచేయవలెను. (మత్తయి 6:33) రఫాయేలు మరియు అతని భార్య ఈ ఆత్మీయసంపదను కూడబెట్టుట ప్రారంభించిరి. మరియు ఇప్పుడు వారు ఆర్థిక పరిస్థితులను బట్టికాదుగాని దేవునితో గల తమ సంబంధము విషయములో తాము ధనికులమై యున్నామని నిశ్చయముగా భావించుచున్నారు. (ప్రకటన 3:17, 18) దేవుని రాజ్యమును గూర్చిన వర్తమానము వారికి నిజముగా శుభవార్తయైయుండెను.
సరిచేయబడిన ఒక వివాహము
మంచిని సాధించుటలో సువార్తకు నిజమైన శక్తియున్నది. ఉదాహరణకు ఇంగ్లాండులో నివసిస్తున్న జాన్‌కు బైబిలునందు ఆసక్తి లేదుగాని అతని భార్యకును, పిల్లలకును ఆసక్తిగలదు. కావునవారు యెహోవాసాక్షుల కూటములకు వెళ్లుచుండగా జాన్ తనస్నేహితులతో పాటు త్రాగుటకు వెళ్లుచుండెడివాడు. తత్ఫలితముగా, అతడు త్రాగుబోతుతనము, పొగత్రాగుట, తదుపరి లైంగిక దుర్నీతియందు చిక్కుకొనెను. చివరగా, అతడు వేరొక స్త్రీతో జీవించుటకై తన భార్యను వదలివేశాడు.
విడాకుల కార్యక్రమము ప్రారంభమాయెను. సువార్తపఠనమువలన క్రైస్తవ నడవడిని నేర్చుకొనిన తన భార్య తననింక గౌరవించుటచూచి జాన్ బహు ఆశ్చర్యపడెను. అలా ఎందుకు జరిగెనో జాన్‌కు అర్థము కాలేదు. విడాకుల తుది ఘట్టమునకు మూడు వారములముందు జాన్ భార్య యొక్క క్రైస్తవ నడవడి పనిచేసినది. తన ప్రవర్తనకు అతడు నిజమైన పరితాపము పొందెను. దానితో విడాకుల కార్యక్రమము ఆగిపోయెను. జాన్ ఇప్పుడు స్వయంగా సువార్తను దృష్టించి బైబిలును యెహోవాసాక్షులతో పఠించెను. ఇప్పుడు తాను కూడా ఒకక్రైస్తవుడై తన భార్యతోసహా యితరులకు దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచున్నాడు.
కుటుంబవిలువలు పడిపోవుచున్న నేటిదినములలో, అనేకమందికి బైబిలు ఆధారిత సువార్త సహాయము అవసరమైయున్నది. పెరూ దేశములో ఒక యెహోవాసాక్షి విమానములో ప్రయాణించుచు ఒక సైన్యాధికారి ప్రక్కన కూర్చుండెను. వారి మధ్య సంభాషణ ప్రారంభమాయెను మరియు ఆ సైన్యాధికారి తన కుటుంబ సమస్యలను గూర్చి చెప్పుచు అతని భార్య మత్తుమందులకు అలవాటు పడి ఒక యౌవనస్థునికొరకు తనను వీడుటకు సిద్ధముగా యున్నదని వాపోయెను. సాక్షి చాలాయుక్తిగా బైబిలు కుటుంబసమస్యలకు ఒకమంచి ఆధారపడదగిన సలహానిచ్చుచున్నదని, అది తన కుటుంబసమస్యను తానే వ్యక్తిగతముగా పరిష్కరించుకొనుటకు సహాయముచేయునని చెప్పెను.—ఎఫెసీయులు 5:21–6:4.
ఆ సైన్యాధికారి సాక్షియొక్క ఆదరణకరమైన మాటలకు కృతజ్ఞత తెలిపి తానును సువార్త జ్ఞానమును మరియెక్కువ తెలిసికొనుటకై వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలకు చందాకట్టెను. సాక్షివిమానమును వదలి వచ్చుచున్నప్పుడు, ఒక యౌవన జంట త్వరగా అతనియొద్దకు వచ్చి అతనితో మాటలాడగోరెను. వారు “మేము మీ ముందే కూర్చొనియున్నాము మరియు మీరు ఆ పెద్దమనిషితో మాటలాడిన సంభాషణంతా విన్నాము. మేము కూడా ఆ పత్రికలకు చందాకడతాము” అని అనిరి. జీవితములను ఉన్నతపరచు సువార్తను వారుకూడా నేర్చుకొనుటకు యిష్టపడిరి.
మారిన జీవితము
ఇంకా, బైబిలు ఆధారిత సువార్త ప్రజల జీవితములను మార్చుచున్నది. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు “దేవుని వాక్యము సజీవమై బలముగలది.” (హెబ్రీయులు 4:12) గ్రీసునందుగల మాసిదోనియాలోనున్న ఒక యవనస్థుని విషయములో ఇది నిజమైయున్నది. బైబిలు ప్రకారము దేవుని నామము యెహోవా అని నేర్చుకొన్నప్పుడు అతడు తడబడెను. కావున, సాధ్యమైనంత తొందరగా తనను యెహోవాసాక్షులతో కలుపమని తన స్నేహితుని కోరెను. రెండు చర్చలు సాక్షులతో ఏర్పాటుచేయబడెను. కాగా ఒక్కొక్కటి దాదాపు 4 గంటలపాటు సాగెను. క్రమముగా బైబిలు పఠనముచేయుటకు ఆ యవనస్థుడు యిష్టపడెను. మరియు వారి మొదటిపఠనము వేకువ జామున రెండుగంటలవరకు జరిగెను!
ఆ మొదటి పఠనమునుండే ఆ యౌవనస్థుడు త్వరగా తనజీవితమును బైబిలుస్థాయి కనుగుణ్యముగా మార్చుకొనెను. ఆరాధనకొరకు అతడు యెహోవాసాక్షుల మీటింగులకు హాజరై సృష్టికర్తను బహుగా ప్రేమించుటకు ప్రారంభించెను. మరియు యెహోవా అతనిని ఆశీర్వదించెను. బైబిలు పఠనము ప్రారంభమైన మొదటి వారములోనే అతడు తన పొడుగైన జుట్టును కత్తిరించుకొనెను. రెండవ వారములో అతడు ఉద్రేకపరచు స్నేహితులకొరకు హోటల్లకు, నాట్యశాలలకు వెళ్లుటకు మానివేసెను. మూడవవారములో తన చివరి సిగరెట్టును వదలివేసెను. రెండునెలలు పఠించినతరువాత రాజ్యసువార్తను యితరులకు ప్రకటించుటకొరకు సాక్షులతో కలిసికొనుట మొదలుపెట్టెను. అవును, యెహోవాసాక్షులు సువార్తను తన భూభాగముపైకి తీసుకొనివచ్చినందుకై అతడు సంతోషించెను.
చెఱసాలలో సువార్త
జైలు కటకటాలు సహితము సువార్తను అడ్డుకొనలేవు. స్పెయిన్ దేశములో జోసె అనుపేరుగల యౌవనస్థుడు సాయుధ దోపిడి మరియు ఇతర నేరక్రియలకై చాలాకాలముగా జైలులో శిక్షననుభవించుచుండెను. ఏమైనను, యెహోవాసాక్షులు అతనికి సువార్తను చెప్పినప్పుడు ఆ బైబిలు వర్తమానము అతని పూర్తి దృక్పథమును మార్చివేసినది. యెహోవా అతనిని “బలపరచెను”—ఫిలిప్పీయులు 4:13.
తన పూర్వ ప్రవర్తన విషయమై జైలులో గడుపు తన శేషజీవితమును మరి శ్రేష్ఠముగా ఈ విధానములో గడుపుదునని జోసె చెప్పుచున్నాడు. అయితే అతనిప్పుడు బాప్తిస్మము పొందిన క్రైస్తవుడైయున్నాడు. అతని భార్య అతనికి పూర్తి మద్దతునిచ్చుచు తన చిన్నకుమారునికి క్రైస్తవ పెంపకమునిచ్చుటకు ప్రయత్నించుచున్నది. ఈ సమయములో జైలు గోడల బయట జీవించువారు వెళ్లి సువార్త ప్రకటించుట సాధ్యముగాని పనిని అనగా తోటి ఖైదీలకు సువార్తను ప్రకటించుటను జోసె చేయుచున్నాడు. ఇప్పుడు అతని గదిలోనున్న తోటి ఖైదీకూడా బాప్తిస్మముపొందిన క్రెస్తవుడైయున్నాడు.
యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన ఫలితములను చూపుటకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజముగా, అదృశ్యుడైన దేవదూత ప్రకటించు సువార్త, “భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడువారికిని, ప్రతి ప్రజకును” యెహోవాసాక్షుల ద్వారా మారుమ్రోగుచున్నది.
అది వార్తలలో అత్యుత్తమమైనది మరియు మానవజాతికున్న ఏకైక నిరీక్షణ. మీరు దీనిని వినవలెనని మేము కోరుచున్నాము. ఇంగ్లాండులో నున్న కెన్ మరియు జాన్‌వలె, అర్జెంటీనాలోనున్న రఫాయేలు మరియు అతని భార్యవలె, మనము దేవదూతలతోకలసి అందరిని యిట్లు తొందరపెట్టుదాము, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు ఘడియ వచ్చెను. గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారముచేయుడి.”—ప్రకటన 14:7 (w90 1/1)